ముందు వీళ్ళు మారాలి

Posted by జీడిపప్పు

నిన్న ఆంధ్రభూమిలో సినిమా విభాగంలో ఒక వ్యాసం చూసాను. సగం వరకు బాగానే ఉంది కానీ ఆ తర్వాత చదువుతుంటే చిర్రెత్తుకొచ్చింది. మన సినిమా పరిశ్రమను కాపాడుకోవాలంటూ హాలీవుడ్ పైన పడి ఏడవడం మొదలుపెట్టాడు రచయిత. ఎవడబ్బా ఇంత బుర్ర లేకుండా వ్యాసాన్ని వ్రాసాడు అనుకొంటూ కింద పేరు చూసాను. "బాబ్జీ, దర్శకుడు" అని ఉంది.  చివరకు హాలీవుడ్ వైపు వేలెత్తి చూపిస్తున్న ఈ సో కాల్డ్ "దర్శకుడి"ని చూసి అప్పటివరకు ఉన్న చిరాకు కాస్తా మాయమయి జాలి వేసింది అతడి దీనస్థితి తలచుకొని.

ఈ మధ్య హాలీవుడ్ సినిమాలను మన నిర్మాతలు చవకగా డబ్బింగ్ చేసి తెలుగులో విడుదల చేస్తున్నారట.. ఇది తప్పంట. అమ్మ పెట్టదు, అడుక్కుతిననివ్వదు అన్నట్టుంది ఇది. ఇప్పటి దర్శకులకు మంచి సినిమాలు తీయడం రాదు కానీ మంచి సినిమాలు డబ్బింగ్ చేస్తే ప్రేక్షకులు చూడకూడదట. గంపెడాశతో నిర్మాత కోట్లు తీసుకొచ్చి దర్శకుడి చేతిలో పెడితే, ఆ దర్శకుడు ఒక చెత్త సినిమా తీసి నిర్మాతను నట్టేట ముంచినపుడు - ఆ నిర్మాత దయగల తల్లి షకీలాతో సినిమా తీసి/డబ్బింగ్ చేసి కాస్తో కూస్తో డబ్బు రాబట్టుకున్న సందర్భాలు కోకొల్లాలు.

దశాబ్దం నుండి ఎంత మంది దర్శకులు మంచి సినిమాలు తీస్తున్నారు? సినిమా తీయలంటే ఒక "వారసుడు" కావాలి. కుప్పిగంతులేసే కోతిగాడయినా, విలన్ గ్యాంగులో మూడో లైన్లో నిలుచుకొనే దానికి పనికిరాని వాడయినా సరే.. ఒక నిర్మాత కొడుకో, హీరో కొడుకో అయితే చాలు.. జనాలమీదకు వదలడమే. హీరో పరమ ఉల్ఫాగాడు.. వందమందిని ఒక్క చేత్తో చితక్కొడతాడు.  బజారుదానిలా ఎంతసేపూ హీరో పైన పడిపోయే ఒక పేద అమ్మాయిని (పేద అమ్మాయి ఎందుకంటే - ఒంటినిండా కట్టుకోవడానికి బట్టలు ఉండవు) హీరోయిన్ గా పెడతారు. దానికి (అవును.. "దానికి"!!) ఒక్క ముక్క తెలుగు రాదు,  కనీసం డైలాగులు కూడా నేర్చుకోదు అన్ని లక్షలు తీసుకొని. దానికి తెలిసిందల్లా వెగటు పుట్టించేలా విప్పడమే . ఇక సినిమాలో ఉండేవి:  తెలుగు రాని విలన్లు, ఈ విలన్ బతుకంతా హీరోను పొగడడానికే సరిపోతుంది. ఒక చెత్త కామెడీ ట్రాక్. మధ్యలో నాలుగు కుప్పిగంతులు తప్పనిసరి.  ఇలాంటి సినిమాలు కాకుంటే లపాకీ లవ్‌స్టోరీలు తీస్తారు.

వీళ్ళు తీసే చెత్త చూసి చూసి విసుగుపుట్టింది. ఎంత సేపూ "బాబు" కోసం సినిమా తీస్తున్నారు కానీ, అసలు "స్క్రిప్ట్" అంటే తెలుసా వీళ్ళకు? హాలీవుడ్ సినిమాల పైన పడి ఏడుస్తున్నారు కానీ హాలీవుడ్‌లో ఉన్న ఏకైక హీరోను ఏనాడయినా పట్టించుకున్నారా? అసలు హాలీవుడ్ సినిమాల ప్రమాణాలు మనకంటే బాగుండడానికి కారణమయిన ఆ హీరో పేరు "స్క్రిప్ట్" అని తెలుసా వీళ్ళకు?  రొటీన్ చెత్త మాని పక్కా స్క్రిప్ట్ రాసుకొని విభిన్నంగా సినిమా తీస్తే ప్రేక్షకులు ఎందుకు ఆదరించరు? ఈ మధ్య వచ్చిన అతి కొద్ది సినిమాలే అందుకు సాక్ష్యం.

ఇక ఈ వ్యాసంలో హైలైట్ - హాలీవుడ్ సినిమాల వల్ల మన సంస్కృతి దెబ్బ తింటున్నదట.
బాబూ చిట్టీ.. ఏమన్నావ్.. మన సంస్కృతి దెబ్బ తింటున్నదా?Image and video hosting by TinyPic


ఆంధ్రభూమిలో ఈ వ్యాసం పైన ఉన్న మరో వ్యాసం లోని వార్త -బొమ్మరిల్లు సినిమా కథ దొంగిలించినదట!! దర్శకుడేమో గొప్పగా నా కథ అని చెప్పుకున్నాడు. సినిమాకు ప్రాణమయిన కథను అందించినవాడి అనుమతి లేకుండా దొంగిలించి గొప్పలు చెప్పుకుంటున్నారు మన దర్శకులు. ఇక ట్యూన్లు, సీన్లు దొంగిలించడం గురించి చెప్పనక్కర్లేదు. బొమ్మరిల్లు కథ దొంగిలించినందుకు మూడొంతుల కలెక్షన్ ఆ కథ వ్రాసిన రచయితకు ఇవ్వాలని కోర్టు తీర్పునిచ్చింది. ఇకనుండి ఇలా మరిన్ని జరిగితే బాగుంటుంది.

సినిమా చూడకుండా ఉండలేని నేను అదృష్టవశాత్తూ గత కొద్ది ఏళ్ళుగా హాలీవుడ్ సినిమాల పట్ల ఆసక్తిని పెంచుకొని ఆనందంగా ఆస్వాదిస్తున్నాను. అపుడపుడు అనుకుంటాను.. "ఒకప్పుడు కె.నాభికేంద్రరావు కొడుకు సినిమాలు, ఆర్యన్ రాజేష్ సినిమాలు.. చివరకు బ్రహ్మానందం కొడుకు సినిమాలు కూడా ఎలా చూసాను?, ఎందుకు హాలీవుడ్ సినిమాల పట్ల ఆసక్తి లేదు అపుడు?" అని!

ఏది ఏమయినప్పటికీ హాలీవుడ్ సినిమాలు, ఇతర విదేశీ సినిమాలు సామాన్యుడికి అందుబాటులో వచ్చాయి అన్నది చాలా మంచి వార్త. కనీసం ఇకనుండయినా కొన్ని మంచి సినిమాలు చూసే అదృష్టం మన తెలుగు ప్రేక్షకులకు కలుగుతుంది.

21 comments:

  1. శరత్ కాలమ్ said...
    This comment has been removed by the author.
  2. శరత్ కాలమ్ said...

    Agreed

  3. మురళి said...

    ప్రతి అక్షరం లోనూ మీ ఆవేశం కనిపించింది..

  4. ఉమాశంకర్ said...

    కరెక్టుగా రాసారు. లాజికల్ బ్రెయిన్ని పక్కన బెట్టి ఒక రెండు గంటల పాటు తెలుగు సినిమా చూడాలంటే ఈ మధ్య చాలా కష్టమవుతోంది..

  5. Anonymous said...

    LOL .. Dude you are too good!

  6. Anil Dasari said...

    >> "ఒకప్పుడు కె.నాభికేంద్రరావు కొడుకు సినిమాలు కూడా ఎలా చూసాను?"

    మీరన్నది అంతా బాగుంది, ఒక్క పై వాక్యం తప్ప. పాపం ఈ అబ్బాయి (సూర్య ప్రకాష్) నటించింది ఒకే ఒక సినిమా. తన తత్వానికి సరిపడకనో ఏమో ఆ తర్వాత మానేశాడు. 'తన తత్వానికి సరిపడక' అని ఎందుకన్నానంటే, ఆ తర్వాత అతను 'మార్నింగ్ రాగా' (తెలుగులో 'రాగం') అనే సినిమా ఒకటి స్వయంగా నిర్మించి అందులో నటించాడు. గత దశాబ్దంలో వచ్చిన అతి కొద్ది మంచి సినిమాల్లో ఇదీ ఒకటని నేను ఘంటాపధంగా చెప్పగలను. మీరు చూడకపోతే తప్పకుండా చూడండి. గంటన్నర మాత్రమే ఉంటుంది. రెండే రెండు పాటలు, రెండూ రస గుళికలే. క్లైమాక్స్ లో షబానా ఆజ్మీ నటన అద్భుతం. ఈ సినిమా చూశాక రాఘవేంద్రరావు కొడుకేనా ఈ అబ్బాయి అనిపించింది.

    ఇక టపాలోని మిగతా విషయమ్మీద నా రెండు ముక్కలు. కుక్కమూతి పిందెల్లాంటి నట వారసుల మధ్యలో కాస్త నాట్యం మాత్రమే ఒచ్చిన ఓ మహానుభావుడిని తెరవేలుపుని చేసి తరించిన తెలుగుజాతి మనది. వాళ్లిచ్చింది తీసుకోవటమే కానీ మాకిది కావాలని అడిగే హక్కూ, అవకాశమూ ఎక్కడున్నాయి కనక?

  7. ఉమాశంకర్ said...

    సందట్లో సడేమియాలా <ఇది చదవండి, ఈ సమస్యకి ఇదీ ఒక కారణమే..

  8. asha said...

    నిజమే. మార్నింగ్ రాగా చూశాక సూర్యప్రకాశ్ మొదటిసినిమా ఎలా తీశాడా అనిపించింది.
    బ్రహ్మానందం కొడుకు తారకరత్న కంటే బెటరే కదండి. పైగా ఒక్క సినిమాతోనే వదిలేశాడు.
    ఇంతవరకూ సినిమాలతోనే ఆపేస్తారనుకున్నానండి. ఇప్పుడు రాజకీయాల్లోకి కూడా వచ్చేస్తున్నారు. ఇది ఇంకా దుర్భరమైన పరిస్థితి.

  9. సుజాత వేల్పూరి said...

    "identical thoughts" అనేవి సినిమా వాళ్లకు రావడం చాలా కామన్ అటండీ...ఆ తీర్పు వచ్చిన రోజు ఒక టీవీ ఛానెల్ వాడు ఒక దర్శకుడిని, రచయితను కూచోబెట్టి ప్రశ్నలడిగితే చెప్పారు. దాన్ని కాపీ అనకూడదట!

    అబ్రకబ్ర గారు చెప్పినట్టు తీసింది చూడ్డం తప్ప మనకేమన్నా ఛాయిస్ ఉందా?అసలు సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ ఈ వారసత్వం బలవంతంగా అంటగట్టడం ఏమిటో? దాన్ని మనం అందంతో కూడా సంబంధం లేకుండా(ఉదా:అల్లు అర్జున్)ఒప్పేసుకోడం ఏమిటో?

    అబ్రకదబ్ర,
    మార్నింగ్ రాగాలో కూడా ప్రకాష్ కి పెద్దగా డైలాగులుండవు కదండీ! నటించే స్కోపు కూడా ఏమీ లేదు. సుధా రఘునాథన్, బాంబే జయశ్రీ పాడిన పాటలే ఆ సినిమాకు ప్రాణం. కాకపోతే "నీతో"(ఇదేనా ప్రకాష్ ఏకైక సినిమా పేరు?)తో ఏ పోలికా లేని సినిమా!

  10. సూర్యుడు said...

    Fine but I have a question:

    You are Ok to watch Holywood movies dubbed into Telugu but not Ok to watch other language Indian actors in Telugu with dubbed voices, doesn't sound logical to me. Don't tell me that all those Holywood actors are far better than our own stuff ;)

  11. Anil Dasari said...

    @సుజాత:

    రాగంలో సూర్యప్రకాష్ నటన కన్నా నిర్మాతగా అతని పరిణితి, కధని, దానికి తగ్గ నటీనటుల్ని ఎన్నుకున్న విధానం, తానే నిర్మాతయ్యుండీ తన పాత్ర హీరోయిజాన్ని ఇబ్బడిముబ్బడిగా ప్రదర్శించేలా రూపొందించుకోకపోవటం, మసాలా బాణీలకే పేరుపడ్డ మణిశర్మలోని మరో కోణాన్ని ప్రేక్షకులకి పరిచయం చెయ్యటం (ఈ సినిమాకి ముందు దాకా నాకు మణి శర్మ సంగీత జ్ఞానమ్మీద మంచి అభిప్రాయముండేది కాదు) .. ఇత్యాదివి నాకు నచ్చిన విషయాలు. అచ్చు ఆ సినిమాలో అతని పాత్రలాగానే నిజజీవితంలో కూడా తండ్రి చూపిన బాటలో కాకుండా సొంత దారిలో వెళ్లే లక్షణాలున్నవాడిలా కనిపించాడు. భవిష్యత్తులో ఇతనో మంచి నిర్మాత/దర్శకుడు అయ్యే అవకాశాలున్నాయనిపించింది.

  12. Kathi Mahesh Kumar said...

    @అబ్రకదబ్ర: సూర్యప్రకాష్ మార్నింగ్ రాగా కు ముందు "నీతో..." అనే ఒక చెత్త సినిమాతో హీరోగా అరంగేట్రం చేసాడు. ఆ సినిమా రెండ్రోజులు కూడా ఆడలేదు. ఆ తరువాత కొంచెం బుద్దొచ్చి, తను (తెలుగు సినిమా)నటనకు పెద్దగా పనికిరాడని, నిర్మాతగా అవతారమెత్తి, నటిస్తూ మార్నింగ్ రాగా నిర్మించాడు. ఈ మధ్యనే సురేష్ బాబు కొడుకు నిర్మాణ సార్ధ్యంలో తోలుబొమ్మలాటపై ఒక డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించాడు.

    @జీడిపప్పు: హాలీవుడ్ సినిమాల్ని డబ్ చేసి వదలడం వలన, అత్యధికంగా నష్టపోతున్నది చిన్న నిర్మాతలు. కోటి అరకోటికి హక్కులు కొనేసి మరో పాతిక ముప్పై లక్షల పెట్టుబడి పెడితే ఈ హాలీవుడ్ సినిమాలద్వారా రెండింతలు లాభం సంపాదించొచ్చి. బి,సి సెంటర్ల ప్రేక్షకులు అదే ఖర్చుతో మంచి క్వాలిటీ కలిగిన సినిమాలు చూడ్డానికి ప్రిఫర్ చెయ్యడం వలన ఈ సినిమాలకు నీరాజనాలు పలుకుతున్నారు. నా మిత్రులు కొందరు "ఆంగ్ బాక్" అనే ధాయ్ సినిమాని నలభై లక్షలకి కొని "ఎంటర్ ది న్యూ డ్రాగన్" అనే పేరుతో తెలుగులో డబ్ చేసి కొన్ని కోట్లు సంపాదించారు.

    సినిమా పరిశ్రమ బ్రతికిబట్ట కట్టాలంటే అత్యధిక సంఖ్యల్లో సినిమాల నిర్మాణం జరగాలి. పెద్ద హీరోలు ఎలాగూ ఏడాదికి ఒకటో అరో తప్ప ఎక్కువగా సినిమాలు చెయ్యరు గనక చిన్న సినిమాలు బ్రతకాలి. ఇది పరిశ్రమలోని వారి వాదన. కానీ ప్రేక్షకుడిగా "నాకు సినిమా నచ్చితే ఎక్కడిది అనే పట్టింపు లేకుండా చూస్తాను".నాకు నచ్చేట్టు తియ్యకపోతే మీ ఖర్మ అనుకుంటే సరి.

  13. జీడిపప్పు said...

    @సూర్యుడు గారు - నేను చూస్తున్నది ఒక "డబ్బింగ్" సినిమా అని తెలిస్తే డబ్బింగ్ ఎలా ఉన్నా ఏమీ అనిపించదు కానీ అచ్చమయిన తెలుగు సినిమా చూస్తూ "మీరు ఎలా ఉన్నారు" అన్న తెలుగు మాటలు వినపడుతున్నపుడు ఆ హీరోయిన్ "ak cgr ytzg " అంటు మూతి ముప్పై వంకర్లు తిప్పుతుంటే భరించడం కష్టమే.
    ఇక మీ ఏ context లో అన్నారో కానీ - Here is my opinion: I would say all those Hollywood actors are far far far better than our own stuff

    @ మహేష్ గారు - మరో మంచి పాయింట్ చెప్పారు. మన తెలుగు సినిమా పరిశ్రమలో నలుగురైదుగురు కలసి మాఫియాలా ఏర్పడి అన్నీ శాసించడం వల్ల చిన్న నిర్మాతకు దిక్కులేకుండా పోయింది అని చదివాను. ఇప్పుడు శాటిలైట్ హక్కుల కింద బాగానే అమ్ముకోవచ్చు, అందరూ DVDలు బాగా కొంటున్నారు. సినిమా బాగుంటే ఎగబడి చూడడానికి సగటు ప్రేక్షకుడు ఎలాగూ సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో తక్కువ బడ్జెట్‌తో తీయడం మంచి ప్రయత్నమే, కాకపోతే టీం అంతా అంకిత భావంతో "మంచి సినిమా" తీయాలి!!

  14. Anonymous said...

    మన నిర్మాతలు, దర్శకులకు సినిమా సరిగ్గా తియ్యడం చేతకాదుగానీ.. చెత్త తీసి మామీద వొదుల్తున్నారేంట్రా అని అడిగితే మాత్రం చేతకాని కబుర్లు చానా చెబుతారు..ప్రేక్షకులు అదే కోరుతున్నారు -లాంటివి.

    ఇతర సినిమాల నుండి అడ్డంగా నిలువుగా ఐమూలగా కాపీలు కొట్టి, రీళ్ళు చుట్టి, మన మొహాన కొట్టడం తప్పుకాదు వీళ్ళకి. మనం దొంగ సీడీలు చూట్టం మాత్రం తప్పు -పైరసీయో అని ఏడుస్తూంటారు. "ఇలా అయితే ఇహ మేం సినిమాలు తియ్యలేం" అని బెదిరింపొకటి. ఈ రకం బెదిరింపులు విన్నాక, దొంగ సీడీలు ఎందుకు చూడాలి అనేదానికి చక్కటి కారణం దొరికింది నాకు. :)

    తెలుగు రానిది ఆడనటులు, విలన్‌లే కాదు, ఆ మొహాల కోసం డబ్బింగు చెప్పి సచ్చేవాళ్ళకు కూడా తెలుగు రాదు. తెలుగును అదేదో భాష లాగా మాట్టాడతారు. ఇలాంటి రకాలను పెట్టి సినిమాలు తీసే I సత్రకాయలే డబ్బింగు సినిమాలు రానియ్యకూడదని ఒక తీర్మానం చేసారు గతంలో. ఈ సచ్చు సన్నాసుల మీద నే రాసిన టపాలు కొన్ని చూడగలరు -ముఖ్యంగా తెలుగు సినిమా ఆడించేందుకు చిట్కాలు.

  15. Anonymous said...

    బాగుంది మీ టపా. మన సినిమాల మీద విరక్తి వచ్చి చూడడం మానేసి 3 సంవత్సరాలు అయ్యింది.

  16. Kottapali said...

    కొకు నవలిక ప్రేమించిన మనిషిలో నాయకుడు గోపాలం ఒక మద్రాసు స్టుడియోలో సినిమా షూటింగ్ చూస్తుంటాడు. అతని పక్కన నించున్న మనిషి "ఆ నటి అలా కాకుండా ఇలా చేస్తే బావుంటుంది కదా" అంటాడు. గోపాలం అతన్ని ఎగాదిగా చూసి "చెయ్యదు" అంటాడు. "దర్శకుడు చెబితే చేస్తుంది" అంటాడతను. దాంకి గోపాలం "చెప్పడు" అంటాడు.

    అదలా ఉండగా, మీరంతా దేన్ని గురించి గొడవపడుతున్నారో నాకేమాత్రం అర్ధం కావట్లా. ప్రపంచమంతా యమా సీరియస్సైపోయిన నేపథ్యంలో కాసేపు మతిలేకుండా, అక్కడ తెరమీద నడిచేది హాస్యమైన, ఫైటైనా, డ్యూయెట్టైనా, ఎమోషనల్ సీనైనా, హాయిగా కడుపుబ నవ్వుకోడానికి నాకు మిగిలిన ఒకేఒక సాధనం తెలుగు సినిమా ఒకటే.

  17. కన్నగాడు said...

    "సినిమా చూడకుండా ఉండలేని నేను అదృష్టవశాత్తూ గత కొద్ది ఏళ్ళుగా హాలీవుడ్ సినిమాల పట్ల ఆసక్తిని పెంచుకొని ఆనందంగా ఆస్వాదిస్తున్నాను"


    అక్కడ(హాలీవుడ్) లో కూడా తలా తోకా లేని సినిమాలు తీసి జనాల మీదకి వదిలి అవార్డులు రివార్డులని హొయలు పోతారని ఒక స్నేహితుడంటే చదివా, వీలైతే మీరు కూడా చదవండి. కింద లింకులో :)
    http://jeedipappu.blogspot.com/2009/02/vs-1.html

  18. Anil Dasari said...

    కన్నగాడు,

    అదును చూసి కొట్టావు ;-)

  19. జీడిపప్పు said...

    కన్నగాడు, Good catch.

    పైన ఆల్రెడీ చెప్పాను - I would say all those Hollywood actors are far far far better than our own stuff

    మళ్ళీ ఇంతకంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా, హాలీవుడ్ సినిమాల గురించి మీకు తెలిసి ఉంటే :)

  20. Shashank said...

    @బుడుగు... ఆ మధ్యలో ఒక మహత్తరమైన చిత్రం ఒచ్చింది.. (అపహాసం కాదు నిజంగానే నాకు చాలా నచ్చింది) - confessions of a film maker అని.. "ఆవకాయి బిర్యాని" దర్శకునిదే అది చూడు వీళైతే. రచ్చ మూవీ. అందులో తెలుగు సినీ పరిశ్రమ ని అమ్మనా బూతులు తిడతాడు.. యే ఒక్కటి కూడా సబబు కాదు అని అనిపించదు. ఒక డవిలాగు - "రక్తం లో acting ఉంటే మరి **** లో ఏముందీ" అని అంటాడు. ఈ "నటవారసులని" "నాభికేంద్రుండ్ని" studios వాళ్ళని యే ఒక్కరినీ ఒదలడు.

  21. జీడిపప్పు said...

    Shashank అన్నా, ఆ సినిమా ఇంతవరకు చూడలేదు. చూస్తాను వీలయితే.

Post a Comment