చెత్త చట్టాలు, స్త్రీవాదులు

Posted by జీడిపప్పు

'చట్టానికి కళ్ళు లేవు తమ్ముడూ' అన్న పాట విన్నపుడు "ఓహో, చట్టానికి చూపులేదు కాబట్టి కేవలం విన్నవి మాత్రమే పరిగణనలోకి తీసుకుంటుందన్నమాట" అనుకుంటాము. కానీ కొన్ని కొన్ని చట్టాలను చూస్తే "చట్టానికి కళ్ళే కాదు మెదడు కూడా లేదు" అనిపిస్తుంది. ముఖ్యంగా మహిళల విషయంలో కొన్ని అతిచెత్త చట్టాలను అమలు చేస్తున్నారు. ఎవరయినా మహిళ తన పైన ఎవడో ఏదో చేసాడని చెప్తే చాలు, ముందూ వెనకా చూడక వాడి పైన కేసు బనాయించేస్తారు, ప్రాథమిక విచారణ కూడా జరపకుండా. దీనికి "మహిళా సంఘాల" మద్దతొకటి.

అనగనగా ఓ కాలేజీ అమ్మాయి ఓ అబ్బాయితో ప్రేమలో పడింది. ఓ రోజు ఇద్దరి మధ్యా గొడవలయి ఇద్దరూ విడిపోయారు. అప్పటివరకు చెట్టపట్టాలేసుకొని అందరి ముందూ "మేము లవ్‌బర్డ్స్" అని తిరిగిన ఈ జంట కలిసి తిరగకపోవడంతో స్నేహితులు ఆ కుర్రాడిని "ఆ అమ్మాయి ఎలా ఉంది" అన్నాడు. వాడు "మేమిద్దమూ విడిపోయాము" అన్నాడు.. అదీ ఫేస్‌బుక్‌లో. ఎంత ఘోరం ఎంత ఘోరం. Oh my heart melts. అది చూసి, IIM- Bangalore విద్యార్థిని అయిన, ఆ అమ్మాయి కనీస ఇంగిత జ్ఞానం లేకుండా తన పైన ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రుల గురించి ఆలోచించకుండా ఆత్మహత్య చేసుకుంది. నిన్న ఆ కుర్రాడి పైన "ఆత్మహత్యకు పురికొల్పినందుకు" కేసు బుక్ చేసారు!!

రోజుకొక బాయ్ ఫ్రెండ్ ను మార్చే అమ్మాయిలు, పూటకొక గర్ల్ ఫ్రెండ్ ను మార్చే అబ్బాయిలున్న ఈ రోజుల్లో ఒకడు తన గర్ల్ ఫ్రెండ్ ను డంప్ చేసాను అని చెప్పడం నేరం ఎందుకవుతుంది? ఫేస్ బుక్‌లో వీళ్ళు జంటలుగా ఉన్న ఫోటోలు పెట్టినపుడు లేని తప్పు అదే ఫేస్‌బుక్ లో "మేము విడిపోయాము" అని చెప్పడం ఎలా తప్పిదమో!

**** ********

ఒకప్పుడు సరోజినీ నాయుడు, దుర్గాబాయి దేశ్‌ముఖ్ లాంటివారు స్త్రీల అభ్యుదయానికి పాటుపడి అసలయిన స్త్రీవాదులు అనిపించుకున్నారు. కానీ కాలక్రమంలో ఈ స్త్రీవాదానికి ఉన్న విలువ దిగజారి మహిళా సంఘం అంటే పనీ పాటా లేక రోడ్లెక్కి నానా గొడవ చేసి, సంసారాలను నాశనం చేసేవారు అని ముద్ర పడింది. (ఈ సో కాల్డ్ స్త్రీవాదుల్లో ఎంతమంది తమ పిల్లలకు చక్కగా విద్యాబుద్దులు నేర్పించి ప్రయోజకులు చేసి "తల్లి అంటే ఇలా ఉండాలి, భార్య అంటే ఇలా ఉండాలి" అనిపించుకున్నారో!) వీళ్ళలో కొందరికి అర్థ నయాపైసా పని ఉండదు, చక్కగా కాపురం చేసుకొనే స్త్రీలను చూసి ఓర్వలేరు. ఎవరో దొరికితే ఒక ఇంటిముందు ధర్నా చేసి, గొడవ చేసి కాసేపు టీవీల్లో కనిపించి వీలయితే నాలుగు డబ్బులు గుంజి ఆ పూటకు పైశాచిక ఆనందం పొందుతుంటారు.

'ఓ టీనేజ్ అమ్మాయిని ఒకడు మోసం చేసాడు ' అని గొడవ మొదలెడతారు. మోసం అంటే ఎలాంటి మోసం? ఆ అమ్మాయిని కొన్నాళ్ళు ప్రేమించి ఆ తర్వాత మరో అమ్మాయిని ప్రేమించడం మోసమా? ఇలాంటి సిల్లీ విషయాలకు కూడా కొందరు గొడవ చేస్తారు... ఇవేమీ అంతగా పట్టించుకోవలసినవి కావు. అసలు సిసలయింది ఏమిటంటే - ఒకడు ఒక అమ్మాయిని గర్భవతిని చేసి తర్వాత పెళ్ళి చేసుకోను అంటాడు. చట్ట ప్రకారం ఇది మోసమే. మరి దీనికున్న పరిష్కారాలేవి? ఇద్దరినీ కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఏది తప్పో ఏదొ ఒప్పో వివరించాలి.

కానీ స్త్రీవాదులు ఆ అమ్మాయితో కేసు పెట్టించి ధర్నాలు చేయిస్తారు, పెళ్ళి చేసుకోమని. తన పైన కేసు పెట్టిన అమ్మాయితో బలవంతంగా పెళ్ళి చేసినా వాడు ఆ అమ్మాయిని సరిగ్గా చూసుకుంటాడా? పెళ్ళి అయిన తర్వాత వాడు ఈ అమ్మాయితో కాపురం చెయ్యకుంటే ఈ స్త్రీవాదులు వెళ్ళి రెండు లారీల జనాన్ని తోలుకొచ్చి కాపురం చేయిస్తారా? రేపు అత్తమామలు ఆ పిల్ల పట్ల ఎలా ప్రవర్తిస్తారు? ఇలా పెళ్ళి చేయిస్తే మున్ముందు ఆ అమ్మాయి జీవితంలో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? అన్న కనీస ఆలోచన లేకుండా తమ పైశాచిక ఆనందం కోసం చట్టాలను దుర్వినియోగం చేసి సంసారాలు నాశనం చేసే కొందరు చీడపురుగులు మన మధ్యనే ఉండడం శోచనీయం. వీరికి అవకాశమిచ్చే పనికిమాలిన చట్టాలుండడం మన దౌర్భాగ్యం.

అరచేతి గ్రంథాలయం 'కిండిల్' కబుర్లు - 2

Posted by జీడిపప్పు

భారతీయ సాహిత్యానికొస్తే - పాశ్చాత్యులకు ఉన్నట్టు మనకు చెప్పుకోదగ్గ "ఆల్ టైం క్లాసిక్స్" పెద్దగా లేవనుకుంటాను. మహాభారత, రామాయణాలు, ఒక యోగి ఆత్మ కథ తప్ప అమెజాన్‌లో మరే ప్రముఖ భారతీయ పుస్తకాలు కనిపించలేదు. Archive.org లో కొన్ని పుస్తకాలున్నాయి కానీ అవి కిండిల్ లో చదవబుల్‌గా లేవు. నాకు అత్యంత ప్రీతిపాత్రమయిన ప్రాచీన, మధ్యయుగ భారతదేశ చరిత్రకు సంబంధించిన పుస్తకాలను ఈ సైటులో చూడగానే మనసు ఆనందంతో ఉరకలేసింది. ముందూ వెనకా చూడక ఓ పది పుస్తకాలను (కిండిల్ కు సానుకూలమయిన mobi ఫార్మాట్‌లో) దింపి కిండిల్‌లో చదవడానికి ప్రయత్నిస్తే తలప్రాణం తోకకొచ్చింది.

విషయమేమిటంటే, పుస్తకాలను digitize చెయ్యడమంటే గుడ్డిగా స్కాన్ చేసి అప్‌లోడ్ చెయ్యడమే అనుకున్నారు మనవాళ్ళు. వచ్చిన చిక్కల్లా ప్రతి పేజీలో ఉన్న foot notes, references తోనే. స్కాన్ చేసిన పీడీయఫ్ ను ఏదో ఒకరకంగా mobi ఫార్మాట్‌లోకి మార్చినపుడు ఈ foot notes, references కూడా అసలు విషయంతో కలిసిపోతున్నాయి. మనము చదువుతున్నది ముఖ్యవిషయమో లేక దాని రెఫెరెన్సులో అర్థం కాక బుర్ర గోక్కోవాలి. (కొన్ని పుస్తకాలయితే మరీ దారుణంగా ఉన్నాయి. పావు పేజీ మేటర్‌కు రెండు పేజీల రెఫరన్సులు! ఓరి మీ కృతజ్ఞత కాకులెత్తుకెళ్ళ అనిపిస్తుంది).

ఈ సైటు కాదని DLI కు వెళ్ళి చూస్తే అక్కడ ఇంకా పెద్ద అవాంతరాలు ఎదురయ్యాయి. చాలా పుస్తకల్లో పెన్నుతో అక్కడడక్కడా హైలైట్ చేసారు. Archive.orgలో నాకు నచ్చిన ఒకట్రెండు పీడీయఫ్ లను PDF to Word ఉపయోగించి, రెండు మూడు గంటలు కష్టపడి శుద్దిచేసి కిండిలీకరించుకున్నాను. ఈ DIL లో ఆ భాగ్యము కూడా దక్కలేదు. పెన్నుమార్కులున్న పుస్తకాన్ని text గా మార్చడానికి అన్ని టూల్స్ ససేమిరా అంటున్నాయి. ఇవన్నీ చూసి ప్రస్తుతానికి భారతీయ ఇంగ్లీషు పుస్తకాల సంగతి పక్కన పెట్టాను.

ఇక తెలుగు పుస్తకాల విషయానికొస్తే - ముందుగా నెట్లో మనకు లభ్యమవుతున్న పుస్తకాలేవో చూసాను. ఉన్న పుస్తకాల్లో దాదాపు అన్నీ PDF ఫార్మాట్లో ఉన్నాయి. కిండిల్ స్క్రీన్ సైజు వల్ల పేజీ పూర్తిగా కనిపించదు. ఒకవేళ zoom చేస్తే సగం వాక్యం మాత్రమే కనిపిస్తుంది. మిగతా సగం కనిపించాలంటే horizontal scroll చెయ్యాలి. ఇలా వాక్య వాక్యానికి స్క్రోల్ చేసి చదవడమంటే అది విజయేంద్రవర్మ సినిమా చూడడానికి తెగించినట్టే.  పై పేరాలో చెప్పిన కారణాలవల్ల archive.org లోని తెలుగు పుస్తకాల జోలికి వెళ్ళనక్కరలేదు.

తెలుగువన్ లో కొన్ని నవలలున్నాయి కానీ అవి సరి అయిన ఫార్మాట్లో లేవు. కాస్తో కూస్తో చెప్పుకోదగ్గ, చదవదగ్గ పుస్తకాలు కౌముది గ్రంథాలయంలో ఉన్నాయి. నెట్లో ఉన్న పుస్తకాలలో ఉన్నత ప్రమాణాలున్న ఇ-పుస్తకాలు ఇవే అనుకుంటాను. pdf ను అలాగే కిండిల్ లో చదివితే పైన చెప్పిన సగంవాక్య సమస్య వస్తోంది ( కౌముది పుస్తకాలు iPad లొ చక్కగా చదువుకోవచ్చు). వీటిని mobi ఫార్మాట్‌కు మార్చాలని ప్రయత్నిస్తే అదేదో కొత్త భాష పుట్టుకొచ్చింది.  Calibre లో ప్రస్తుతానికి కొన్ని భాషల fonts మాత్రమే అందుబాటులో ఉన్నాయి. తెలుగు fonts కావాలంటే కొన్నాళ్ళు వేచి ఉండక తప్పదు.

నాకు తెలిసిన అన్ని ప్రయత్నాలు చేసాను కానీ కొండను తవ్వి ఎలుకను పట్టిన చందాన , ఆశించిన ఫలితం దక్కలేదు! ప్రస్తుతానికి తెలుగు పుస్తకాలు కిండిల్ లో చదివే అవకాశం దాదాపు లేదు. కాకపోతే "అన్నింటికీ ఆ అమెరికావాడే ఉన్నాడు" అని తరచూ అంటుండే నాకు నమ్మకముంది..
ఏదో ఒక రోజు కిండిల్‌లో కూడా మనకు అందుబాటులో ఉన్న అన్ని తెలుగు పుస్తకాలను తప్పక చదువుకోగలమని, అందుకు తగిన ఏర్పాట్లు ఎవరో ఒకరు చేస్తారని.కిండిల్ లో ఇంగ్లీషు పుస్తకాలు చదువుతున్నపుడు "తెలుగు కూడా చదవాలి.. ఏదయినా సరే" అని తొలుస్తుంటే ఆగలేక ఓ బ్లాగునుండి కొంత కాపీ చేసి వివిధ font sizeలతో పీడియఫ్‌లు చేసి కిండిల్ లో చదవడానికి ప్రయత్నించగా చివరకి 18 Font size సరిపోయింది.ఇదంతా చూసి "నెట్‌లో ఉన్న అతి కొద్ది చదవదగ్గ సాహిత్యం కిండిల్‌లో చదవాలంటే ఇంకా కొద్ది కాలం ఆగాలి.. మన బ్లాగుల్లో కూడా కొన్ని చక్కని బ్లాగులున్నాయి.. ప్రస్తుతానికి ఈ బ్లాగు బుక్కులను, ఇతరత్రా సైట్లలో మనకు నచ్చిన శీర్షికలను పీడీయఫ్‌లుగా కిండిల్‌కు తగునట్లు మార్చుకొని ఆస్వాదించాలి" అని సెటిలయ్యాను.

అరచేతి గ్రంథాలయం 'కిండిల్' కబుర్లు - 1

Posted by జీడిపప్పు

అరచేతి గ్రంథాలయం కిండిల్ విడుదలయిన కొన్నాళ్ళవరకు "భౌతికంగా పుస్తకాన్ని పట్టుకొని చదివినపుడు కలిగే అనుభూతే వేరు, ఇలా e-readerలో చదివితే ఆ అనుభూతి రాదు" అన్న పాఠకులే e-reader లో ఒకట్రెండు పుస్తకాలు చదివి "ఇదేదో బాగుందే!! వేలకొద్ది పుస్తకాలను అరచేతిలో అమర్చుకొని ఎప్పుడు ఎక్కడయినా చదుకోవడానికి వీలుగా ఉంది.. పైగా కళ్ళకు శ్రమ కూడా లేదు" అంటూ వీటివైపు మొగ్గు చూపించారు. కొందరు గొప్పరచయితలు కూడా (ముఖ్యంగా Stephen King) వీటి ఉపయోగాలను, భవిష్యత్తులో వీటి అవసరాన్ని వివరించడంతో పఠనారంగంలో సరికొత్త విప్లవం మొదలయింది.

కిండిల్ బాగా పాపులర్ అయిన కొన్నాళ్ళకు స్టీవ్ జాబ్స్ ఎవరూ ఊహించని విధంగా iPad ను విడుదల చేసి 'ఆహా ఏమి భాగ్యము, దీనికంటే మిన్న అయినది, సరిసాటి మరియొకటి లేదు" అనిపించాడు. అమెజాన్ కిండిల్ కేవలం పుస్తకాలను చదువుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది (music, చిన్న చిన్న games కూడా ఉన్నాయి) కానీ ఐపాడ్‌లో వినోదానికి సంబంధించి దాదాపు అన్ని సౌకర్యాలున్నాయి. అయినప్పటికీ సగటు పాఠకుడికి e-పుస్తకాల రుచిని చూపెట్టి, అందుబాటు ధరకే లభ్యమయ్యేలా చేసింది మాత్రం Amazon CEO Jeff Bezos. ప్రస్తుతం మార్కెట్‌లో ఎన్నో e-book readers ఉన్నా నా ఓటు మాత్రం కిండిల్ కే.

ఇక్కడ అమెజాన్ వారి marketing strategy ని అభినందించక తప్పదు. మమూలు పుస్తకం కంటే ఇ-పుస్తకం ధర కాస్త తక్కువగా నిర్ణయించి పాఠకుల దగ్గర అభిమానాన్ని చురగొన్నారు. పుస్తకాల ధర తక్కువ అన్నపుడు వచ్చిన స్పందన చూసి "కొన్ని పుస్తకాలు ఉచితం అని ప్రకటిస్తే ఎలా ఉంటుంది" అన్న ఆలోచనతో 1927 కంటే ముందు ప్రచురించబడిన కొన్నింటిని ఉచితంగా అందచేయడం మొదలు పెట్టారు. ఉచిత పుస్తకాలనంత మాత్రాన అవేవో ఊరు పేరు లేని అనామక రచయితలవి కావు. ప్రపంచ ప్రసిద్దులయిన Mark Twain, Jane Austen వంటివారి రచనలన్నిటినీ కిండిలీకరించి ఉచితంగా కిండిల్ లో చదువుకొనే అవకాశం కలిపించారు.

Gulliver's Travels, Adventures of Tom Sawyer, Alice in Wonderland, Jungle Book, Treasure Island, Sherlock Holmes లాంటి పుస్తకాలు ఉచితంగా ఊరిస్తూ ఉంటే ఊరుకోగలరా ఎవరయినా?  కొన్నాళ్ళు ఈ ఉచిత పుస్తకాలకే పరిమితమయినా తర్వాత అమెజాన్‌లో $1 నుండి మొదలయ్యే పుస్తకాలను కొనడానికి అలవాటవుతారు. కేవలం Amazon Free Books మాత్రమే కాకుండా Project Gutenberg, ManyBooks లాంటి చోట్ల కూడా ఎన్నో వేల పుస్తకాలున్నాయి. Calibre ఉపయోగించి మన దగ్గర ఉన్న  ఇంగ్లీషు pdf లను కిండిల్ కు అనుగుణంగా మార్చుకొని చదువుకోవడానికి కూడా వీలుంది. (ఇక నెట్‌లో వెతికితే కావలసిన పుస్తకం ఏదో ఒక ఫోరంలో mobi/epub ఫార్మాట్‌లో దొరుకుతుంది!)
నేను Kindle 3 కొన్న మొదట్లో అందరిలాగే "ఎంతయినా పుస్తకం పుస్తకమే" అనుకుంటూ అందుబాటులో ఉన్న ఏదో పుస్తకాన్ని కిండిల్‌లోకి ఎక్కించి కొన్ని పేజీలు చదివిన తర్వాత నచ్చక "తొందరపడి కొన్నానా" అనుకొంటూ "ఇన్ని మిలియన్లమంది కొంటున్నారంటే ఏదో ఉండి తీరాలి" అనుకున్నాను.  తర్వాత తెలిసింది నేను చేసిన తప్పేంటో. వెంటనే నాకు బాగా నచ్చిన Gulliver's Travels చదవడం మొదలుపెట్టాను. కొన్ని పేజీల వరకు కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొన్నా ఆ తర్వాత గాడిలోపడ్డాను. తద్వారా బోధపడిన సత్యం - "మనకు బాగా నచ్చిన పుస్తకాన్ని చదవడముతో కిండిల్ ఉపయోగాన్ని ప్రారంభించాలి". ఒక్కసారి కిండిల్ రుచి చూసాక అదే ఊపులో మరికొన్ని పుస్తకాలను చదివి నా పఠనాజీవితంలోకి కిండిల్ ను మనస్పూర్తిగా ఆహ్వానించాను. ఈ క్రమంలో పుస్తకాల వేటను కూడా ఉధృతం చేసాను. ఎమ్మెల్యే సీట్లమ్ముకున్న అల్లు అరవింద్ కలెక్షన్ బాక్సు ఎలా నిండిందో నా కిండిల్ పుస్తకాల కలెక్షన్ కూడా అలా పెరిగింది.

ఇక ఈ కిండిల్‌లో నాకు నచ్చిన మరో అంశం - డిక్షనరీ. మనము చదువుతున్నపుడు మనకు అర్థం తెలియని పదం దగ్గరకు cursor తీసుకొస్తే వెంటనే రెండు లైనలో అర్థం కనపడుతుంది. మరిన్ని వివరాలు, ఉదాహరణ వాక్యాలు చూసుకోవచ్చు కూడా. అలాగే highlight చేసే సదుపాయం వల్ల పుస్తకం మొత్తం పైన ఉన్న మనకు కావలసిన క్లిష్టపదాలను ఒకేసారి చదువుకోవచ్చు. GRE లాంటి పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇక పుస్తకాలను లైబ్రరీలోలా అమర్చుకోవడం కూడా చాలా బాగుంది.

ధర - రెండున్నరేళ్ళ క్రితం నేను వ్రాసిన 'అరచేతిలో గ్రంథాలయం - రచయితలకు, పాఠకులకు ఒక వరం' టపాలో 'బహుశా మరో ఐదేళ్ళలో అన్ని భాషలలో, అన్ని దేశాలలో 100-150 డాలర్లకు ఈ పరికరం అందుబాటులోకి రావచ్చు.' అని ఊహించాను. నా అంచనాలకు భిన్నంగా  ప్రస్తుతమే కిండిల్ $139 లేదా $114 కే లభ్యమవుతోంది! ( Best Buyలో Thanksgiving Sale లో $99 కే దొరకవచ్చేమో! )  ఒక కిండిల్ వాడుకరిగా, దీని ఉపయోగాలు, సౌకర్యాలు కాస్తో కాస్తో తెలిసినవాడిగా "పఠనాసక్తి ఉన్నవారు మరో ఆలోచన లేకుండా ప్రస్తుత ధరకు కొనవచ్చు" అని చెప్పగలను. ముఖ్యంగా టీనేజర్లలో పఠనాసక్తి కలిగించడానికి ఇది చక్కని బహుమతి.

ఇవీ ప్రస్తుతానికి "కిండిల్ కబుర్లు - ఇంగ్లీషు పుస్తకాలు".  మరి మన భారతీయ సాహిత్యం, ముఖ్యంగా కిండిల్‌లో తెలుగు చదవడం ఎంతవరకు సాధ్యం లాంటి వివరాలు మరో టపాలో!
తెలంగాణా ఇవ్వాలి, 2025 లో - Part 5 - కేసీయారే దిక్కు

Posted by జీడిపప్పు

దేవుడు ప్రత్యక్షమయితే ఏమి కోరుకుంటావు అంటూ అపుడపుడు కొందరు అడుగుతుంటారు. ఓ ఇళయరాజా వీరాభిమాని అయితే "స్వామీ ఇక ఇళయరాజా మ్యూజిక్ కంపోజ్ చెయ్యకుండా విశ్రాంతి తీసుకొనేలా చూడు" అని, ఓ వంశీ అభిమాని "ఇక వంశీ సినిమాలు తీయకుండా కథలు వ్రాసుకునేలా చూడు" అని, బ్లాగు టెర్రరిస్ట్ అయితే "నేను రాసే విషపూరిత పోస్టులు చదివి కనీసం ఒక్కరయినా ప్రభావితమయ్యేలా చూడమని", నాబోటి టెకీ అయితే "ఓ ప్రభువా, Internet Explorer ఉపయోగించు నీ శిశువుల పాపములను హరించి Firefox ఉపయోగించు వరమును ప్రసాదింపుడి 36:28" అని, దాదాపు ప్రతి తెలుగు బ్లాగు పాఠకుడూ "ఈ మార్తాండ కాస్త అర్థవంతమయిన, విషయ సంబంధిత వ్యాఖ్యలు పోస్టేలా చూడ"మని కోరుకుంటారు. ఈ సివరాఖరిది నెరవేర్చడం నావల్ల కాదని దేవుడు మాయమయి కేసీఆర్ ముందు ప్రత్యక్షమయి "భక్తా ఏమి నీ కోరిక" అంటే, కేసీయార్ " నా బొందిలో ప్రాణం ఉన్నంతవరకు తెలంగాణా రాకుండా చూడు స్వామీ" అని సాష్టాంగపడతాడు.

టీడీపీ నుండి బయటకు వచ్చాక ఏమి చేయాలో తోచక ఏదో టైంపాస్ గా ఉంటుంది కదా అని తెలంగాణా ఉద్యమాన్ని మొదలు పెట్టిన కేసీయార్ ఇంతితై వటుడింతై అన్నట్టు "తెలంగాణా అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణా" అనే స్థాయికి ఎదిగాడు. మిగతాపార్టీల్లో ఎందరు అతిరథ మహారథులున్నా కేసీఆర్ చెప్పిందే ఈ ఉద్యమానికి వేదం. అటు గాంధీవారసులయిన నిజమయిన తెలంగాణా వాదులనుండి ఇటు దేశద్రోహ/దుశ్చర్యలకు పాల్పడే తెలబాన్లవరకు అందరూ కేసీఆర్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించవలసిందే. తెలంగాణా వచ్చిన తర్వాత కేసీఆర్ పరిస్థితి ఏమో కానీ రాష్ట్రం విడిపోయిన పాతికేళ్ళ తర్వాత సీమాంధ్రవాసులు మాత్రం " కేసీఆర్ ఆ ఉద్యమాన్ని నడిపించకపోతే ఈ రోజు మన ప్రాంతాలు ఇంత అభివృద్ది చెంది ఉండేవా" అని తప్పక స్మరించుకుంటారు అని నా అభిప్రాయం.

నాకు ఎందుకలా అనిపించిందంటే - ఇప్పటివరకు ఏ సీమాంధ్ర నాయకుడయినా మనస్పూర్తిగా తమ ప్రాంతాల అభివృద్దికి కృషి చేసాడా? సీమాంధ్రప్రాంతాల్లో జరిగిన అభివృద్ది "జరగవలసినది కాబట్టి దానంతట అదే జరిగింది" తప్ప నాయకుల కృషి వల్ల జరగలేదు. (It just happened, as it should happen) సీమాంధ్రలోని మానవ, సహజవనరులను సక్రమంగా ఉపయోగించుకొనేలా ఈ నాయకులు కృషి చేసి ఉంటే ఈ ప్రాంతాలు మరింత అభివృద్ది చెందేవి. ఎవరో అతి కొద్దిమంది తప్ప ప్రతి సీమాంధ్ర రాజకీయనాయకుడూ హైదరాబాదు చుట్టూ ఎక్కువ దృష్టిసారించారు. రాజకీయ నాయకుల వరకు ఎందుకులే, చేతిలో నాలుగు డబ్బులున్న సగటు సీమాంధ్ర పౌరుడు కూడా "హైదరాబాదులో స్తిరాస్థి కావాలి" అని పొలోమని హైదరాబాదు వెళ్ళేవాడు. ఇలాంటివారందరూ ఈ రోజు హైదరాబాదులో పెట్టుబడులు పెట్టాలంటే కాస్త తటపటాయిస్తుండడానికీ, ఎన్నడూ లేని విధంగా టీవీల్లో  సీమాంధ్రప్రాంతాల పట్టణాలకు సంబంధించిన "రియల్ ఎస్టేట్, విల్లాస్, అపార్ట్మెంట్ల" గురించి ప్రకటనలు రావడానికి ప్రధాన కారణం కేసీఆరే నడిపిస్తున్న ఈ ఉద్యమమే!

ఇక కేసీఆర్ ఈ ఉద్యమాన్ని సాగదీసే విధానం బహుముచ్చటగొల్పును. "అసలు ఎప్పటికీ తెలంగాణా ఇవ్వరు, ఈ ఉద్యమం పేరుతో మామూళ్ళు వసూలు చేసుకోవచ్చు, అధికార పార్టీతో చేతులు కలిపి ఉద్యమ బూచి చూపి పేరు, డబ్బు గడించవచ్చు" అన్న కేసీఆర్ ప్లానుకు బై ఎలక్షన్ల ఫలితాలను చూసి మిగతా పార్టీలు కూడా తెలంగాణా పాటకు శ్రుతి కలిపినపుడు సమస్య ఎదురయింది.. అప్పటివరకు అంతా తానై నడిపిస్తున్న కేసీఆర్‌కు మిగతా పార్టీలవాళ్ళు కూడా తమతో కలుస్తామని అనడంతో, ఎక్కడ పొలిటికల్ గా తన మైలేజీ తగ్గుతుందో, ఎక్కడ తాను సీమాంధ్రులనుండి వసూలు చేస్తున్న మామూళ్ళలో వాటా మిగతావారికి ఇవ్వవలసి వస్తుందో అన్న అనుమానం మొదలయింది.

టీఆరెస్ ఒక్కటే ఉద్యమిస్తున్న కాలంలో కేసీఆర్ అపుడపుడు తెరపైకి వచ్చి నాలుగు పిట్టకథలు చెప్పి రెచ్చకొట్టే ప్రసంగాలు చేసి రెండ్రోజులు కోలాహలం చేసి "తాంబూలాలు ఇచ్చేసాను, తన్నుకు చావండి" అంటూ వెళ్ళిపోయాడు. తర్వాతి రోజుల్లో ఉద్యమకారులు, ఉన్మాదులు, తెలబాన్లు కాస్త హల్‌చల్ చేసేవారు. ఆ సమయంలో కేసీఆర్ కమీషన్ల లెక్కలు, తన కొడుకు సీమాంధ్ర వ్యాపారవేత్తలతో కలిసి చేస్తున్న వ్యవహారాలు చూసుకొనేవారు. ఉద్యమం కాస్త చల్లబడుతోందన్న సంకేతాలు వస్తే వెంటనే కాస్త పెట్రోలో డీజిలో పోసి మళ్ళీ మంటలు రేపేవాడు. ఏదో మొక్కుబడిగా  మొదలుపెట్టిన ఉద్యమం కాస్తా ఉధృత రూపం దాల్చడము, మిగతా పార్టీలవాళ్ళు కూడా అందులో చేరి "మేమూ ఉద్యమంలో చేరాము, మేమూ రాజీనామా చేసాము" అనడంతో ఖంగుతిన్న కేసీఆర్ ఇలా అయితే తొందరగా తెలంగాణా వచ్చే ప్రమాదముందని గ్రహించి, మిగతా పార్టీలవారిని దూరంచేసేందుకు అన్ని ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ అన్ని తెలంగాణా పార్టీలు ఒకే తాటివైపు రాకుండా ఉండడానికి తన సర్వ శక్తులు కేంద్రీకరిస్తున్నాడు. అన్ని పార్టీలు ఒకే తాటిపైకి వస్తే తెలంగాణా రావడం ఎంతసేపు? అలా వస్తే తర్వాత తన ప్రాభవమేముంటుంది?


కొన్నేళ్ళకు తెలంగాణా వచ్చినా క్రెడిట్ మొత్తం కేసీఆర్‌కు కొన్నాళ్ళే ఉంటుంది. తెలంగాణా వచ్చిన తర్వాత కాంగ్రెస్, టీడీపీలు అక్కడా పోటీ చేసి మొదటిసారి కాకపోయినా రెండోసారి ఎన్నికలనుండి తమ సత్తా చూపుతాయి. అప్పుడు కేసీఆర్ గుంపులో గోవిందుడుగా మిగిలినా ఆశ్చర్యంలేదు. కాబట్టి తెలంగాణా వస్తే ఆ తర్వాత కేసీఆర్ భవిష్యత్తు, ముఖ్యంగా తనయుడు కేటీఆర్ రాజకీయ భవిష్యత్తుకు పెద్దగా ఎదుగుదల ఉండకపోవచ్చు.

ఇందులో భాగంగానే టీవీల్లో ఎన్నో వినోదాత్మక దృశ్యాలను చూసాము. ఉన్మాదియాలో విద్యార్థులు నిరాహారదీక్ష చేస్తుంటే టీఆరెస్ నాయకులు వెళ్తే ఏ గొడవా లేదు కానీ అప్పట్లో టీడీపీలో ఉన్న నాగం జనార్ధన రెడ్డి వెళ్తే చెప్పులతో కొట్టి తరుముకున్నారు.  ట్యాంక్‌బండ్ పైన మార్చ్ సమయంలోనూ కేశవరావు పైన దాడి చేసారు.  మొన్నటికి మొన్న టీడీపీ నాయకుడయిన ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంటి పైన దాడి చేసి ఆస్తి నష్టం చేసారు. ఎక్కడ ఏ దీక్షను పరామర్శించడానికి వెళ్ళినా ఆ వెళ్ళినవారు Non-TRS నాయకులయితే చాలు, వారి పైన దాడులకు దిగుతారు "మేము కూడా తెలంగాణా కోసం పోరాటం చేస్తున్నాము మొర్రో, మమ్మల్నీ మీలో కలుపుకోండి" అని కాళ్ళా వేళ్ళా బ్రతిమాలుకున్నా వినిపించుకోకుండా! ఇది కేవలం శ్రీమాన్ కేసీఆర్ గారు తెలంగాణా నాయకులను ఏకతాటిపైన తీసుకురాకుండా చేసే ప్రయత్నం తప్ప ఇంకేమయినా ఉందా?

తెలంగాణా వస్తే తన ఆటలు ఎక్కువకాలం సాగవని తెలంగాణాలోని పార్టీలు ఏకం కాకుండా కృషి చేస్తూ, ఉద్యమాన్ని వీలయినంతగా సాగదీస్తూ అదేసమయంలో సీమాంధ్రులకు తమ ప్రాంతం గురించి ఆలోచించే అవకాశం ఇచ్చినందుకు, తమ ప్రాంతాలను కూడా అభివృద్దిపరచుకొనే సువర్ణావకాశం కల్పించినందుకు భావి సీమాంధ్రులు కేసీఆర్‌కు తప్పక ధన్యవాదాలు తెలుపుకుంటారు.. కేసీఆర్ ఈ ఉద్యమాన్ని ఇలాగే ఇంకొన్నేళ్ళు నడిపిస్తే!తెలంగాణా ఇవ్వాలి, 2025 లో - Part 4 - బంద్‌లు

Posted by జీడిపప్పు

మన డిమాండ్లనన్నిటినీ ఒప్పుకొని వాటిని నెరవేర్చాలని ఇతరులను ఇబ్బందులకు గురిచేసి బంద్‌లు చేయడం మనకున్న ఒకానొక ముఖ్యమయిన హక్కు. ఈ తరహాలోనే తెలంగాణా స్వాతంత్ర్య సమరయోధులు కూడా తరచూ బంద్‌లుకు పిలుపునిస్తున్నారు. హైదరాబాదులో బంద్ ప్రకటించి జనజీవనానికి ఆటంకం కలిగించి తద్వారా కలిగే కష్టనష్టాల రూపంలో ప్రణబ్ ముఖర్జీకి తమ వాదాన్ని గట్టిగా వినిపించాలన్నది వీరి ఆలోచన.

బంద్ ముందే ఖరారు చేస్తే ఆ విషయం తెలిసిన ప్రయాణీకులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవడం, ఉద్యోగస్తులు కాస్త ఓవర్ టైం పని చేసి అనుకున్న సమయానికి పని పూర్తి చెయ్యడం లాంటి ముందస్తు చర్యలు చేపట్టడానికి అవకాశం ఉంటుంది. కానీ ఒక్కోసారి చెప్పా పెట్టకుండా బందులు చేసేస్తుంటారు, హరీష్ రావు ఢిల్లీలో ఎవరినో కొట్టాడని తెలంగాణాలో బంద్ చేయడం, కేసీఆర్ కు కిక్కు దిగిన వెంటనే "ఏల్లుండి హైదరాబాదుకు ఎవర్నీ రానివ్వము" అనడం లాంటివి. ముందు ఒక తేదీ ప్రకటించి ఆ తర్వాత "మాకు జీతాలు వచ్చాక ఆ పై వారం ఫలానా తేదీ చేస్తాము" అంటారు. కొన్నాళ్ళాగి "పండగ వస్తోంది, పండగ అయిన తర్వాత సమ్మె చేస్తాము.. అపుడే హైదరాబాద్ దిగ్భంధనము" అంటారు, ఒక ప్రణాళిక అంటూ ఏదీ లేకుండా.

ఇక్కడ గమనించదగ్గ విషయమేమిటంటే - బంద్‌లు వల్ల కలిగే ఇబ్బంది కంటే బంద్‌లు చేస్తున్న తీరువల్ల కలిగిన అనిశ్చితి ఎక్కువ ప్రభావాన్ని చూపుతోంది. జూలై నెలలో ఏడెనిమిది రోజు బందులనీ, సమ్మెలనీ అడ్డంకులు కలిగించారు. ఆ దెబ్బకు ఆగష్టులో సగటు మనిషి హైదరాబాదుకు వెళ్ళాలంటే పలుమార్లు ఆలోచించవలసి వచ్చింది. "వెళ్ళిన తర్వాత అక్కడ బందులంటూ బస్సులను, రైళ్ళను అడ్డుకుంటే మనగతేమి?" అన్న ప్రశ్నలు ఉదయించాయి. హైదరాబాదులోని విద్యార్థుల తల్లిదండ్రులు "ఈ నెల అయినా స్కూళ్ళు సక్రమంగా నడుస్తాయా" అని ఆందోళన చెందారు. ఈ అనిశ్చితే సీమాంధ్రకు ఎంతో ఉపకారం చేస్తున్నదని నా గట్టి నమ్మకం.

ఒక ఉదాహరణ తీసుకుందాము. ఈ విద్యాసంవత్సరంలో హైదరాబాదులో దాదాపు 20 రోజులు పాఠశాలలు మూతపడ్డాయి. ఇలా జరగడం వల్ల పిల్లల్లో చదువు పట్ల ఆసక్తి తగ్గుతుందని విద్యావేత్తలు చెబుతున్నారు. ఏడో తరగతి నుండే ఎంసెట్‌కు, పదోతరగతి నుండే ఐఐటీకీ తమ పిల్లలను సిద్దం చేసే పేరంట్స్ బాధ వర్ణనాతీతం. ఇక ఇంటర్ చదివే పిల్లలుండే వారి కష్టాలు చెప్పనక్కర్లేదు. ఉన్న 700 రోజుల్లో 20 రోజులు గాల్లో కలిసిపోతే సీమాంధ్ర ప్రాంతాల్లోని విద్యార్థులు 20 రోజులు ముందున్నట్టే కదా అని లెక్కలు వేసుకొని తమ పిల్లలను గుంటూరు, విజయవాడలాంటి బ్రాంచిలకు పంపిస్తున్నారు. అనధికార లెక్కల ప్రకారం గత రెండు నెలల్లో సుమారు 15 వేలమంది హైదరాబాద్ నుండి సీమాంధ్ర ప్రాంతానికి చెందిన స్కూళ్ళలో, కాలేజీల్లో ట్రాన్స్ఫర్ కోసం అప్లై చేసారట. అన్నట్టు గత ఆరు నెలల్లో వచ్చిన పోటీ పరీక్షా ఫలితాల్లో హైదరాబాదీలకంటే సీమాంధ్రులే టాప్ ర్యాంకుల్లో ఎక్కువ ఉన్నారని అంటున్నారు! ఇది చాలా మంచి పరిణామమనిపిస్తోంది.

ఇక నా పాత్ర ఉన్న, నేను ప్రత్యక్ష సాక్షి అయిన మరో ఉదాహరణ చెబుతాను. IT కంపెనీల్లో ప్రాజెక్టులను నడిపించడానికి రకరకాల విధానాలుంటాయి. మా ప్రాజెక్టు "ఎంత పనికి అంత డబ్బులు" ప్రాతిపదికన నడుస్తుంది. అంటే, ప్రతి రోజూ ఎవరెవరు ఏమి పని చేసారో, ఎంత పని చేసారో రోజువారీ మీటింగుల్లో చెప్పి వారానికొకసారి ఆ వివరాలు ఇస్తే అందుకు తగ్గట్టు డబ్బులొస్తాయి. సగటున ఒక ఉద్యోగి వల్ల కంపెనీకి రోజుకు 8x30x45 = ~11,000 రూపాయల ఆదాయమన్నమాట.

జూలై నెల బంద్‌లు పుణ్యమా అని కేవలం మా ప్రాజెక్టుకు మాత్రమే లక్షల్లో ఆదాయం పోయింది. ఒక బిల్డింగులోని ఒక ఫ్లోరులోని ఒక సెక్షన్లోని ఒక టీం వల్ల రోజుకు లక్ష రూపాయల నష్టం వస్తే హైదరాబాదు బ్రాంచిలో ఎన్ని లక్షల నష్టం వస్తుందో, హైటెక్‌సిటీ మొత్తానికి ఎన్ని కోట్ల నష్టం వస్తుందో ఊహించుకోండి!! ( ఒక్క రోజు ఎవరూ పని చెయ్యకుంటే హైదరాబాదులోని కంపెనీలకు, ఫ్యాక్టరీలకు సుమారు 500 కోట్ల నష్టం వస్తుందట. ఆఫ్‌కోర్స్, దీర్ఘకాలిక ప్రయోజనాల్లో ఇటువంటి తాత్కాలిక నష్టాలు తప్పవు కదా.)

ఈ బందుల గురించి ఇండియాలోని మేనేజర్లకు తెలుసు  కానీ అమెరికన్లకో లండనోళ్ళకో తెలియదు కదా? పని కాకపోవడంతో వాళ్ళు అసహనం వ్యక్తం చేసి అక్కడున్న వాళ్ళను తోమితే వాళ్ళు ఇక్కడున్న మేనేజర్లను "ఇన్ని లక్షలు నష్టమొస్తే ఎలా? మీ ఇష్టమొచ్చింది చేసుకోండి, మాకు మాత్రం billing & delivery ముఖ్యం. కావాలంటే ఇంకో సిటీలోని మన ఆఫీసునుండి పని చెయ్యండి" అంటూ చితక్కొడుతున్నారు. ఈ నెలాఖరుకల్లా టీం మొత్తం హైదరాబాదునుండి మారడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. "హైదరాబాదు టీం ఇన్వాల్వ్ అయిఉంటే అనుకున్న తేదీకి డెలివరీ చేస్తామన్న గ్యారెంటీ లేదు కాబట్టి కనీసం ఇంకో వారం buffer కావాలి" అని నేను చెప్తుంటా. ఇపుడిపుడే అన్ని కంపెనీలవారు ఈ విషయం పైన దృష్టి సారిస్తున్నారు.

దీనివల్ల సీమాంధ్రకు లాభమేమిటి అంటే.. వైజాగ్ విమానాశ్రయం నుండి అంతర్జాతీయ సర్వీసులు, మరిన్ని దేశీయ సర్వీసులు మొదలుకాబోతున్నాయన్న వార్త చూసారా? దీనికి ప్రధాన కారణం - పెట్టుబడులు పెరగడమే. ఇప్పటికే కొన్ని కంపెనీలు హైదరాబాదునుండి వైజాగ్ కు తమ కార్యకలాపాలను తరలిస్తున్నాయి. తొందర్లో తిరుపతి ఏయిర్‌పోర్ట్ కూడా ఆధునీకరించబోతున్నారు. సీమాంధ్ర సెజ్ లలోకి రావడానికి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న పరిశ్రమలవారు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికిపుడే కాకపోయినా మున్ముందు ఇవి మరింత అభివృద్ది చెందుతాయనడంలో సందేహం లేదు. అందుకు కావలసినది "సీమాంధ్రులు తమ ప్రాంతాల్లోనే పెట్టుబడులు పెట్టడం". అలా జరగడానికి, సీమాంధ్రుల దృష్టి హైదరాబాదు నుండి కొంతయినా మళ్ళించడానికి ఈ బంద్‌లు, అనిశ్చితి తమవంతు సహరాన్ని అందిస్తున్నాయనే చెప్పవచ్చు. అందుకే ఈ ఉద్యమం ఇంకో పదిహేనేళ్ళు కొనసాగాలని నా కోరిక.

తెలంగాణా ఇవ్వాలి, 2025 లో - Part 3 - తెలబాన్లు

Posted by జీడిపప్పు


తెలంగాణా ఉద్యమం మొదలయిన కొన్నాళ్ళకు 'దుశ్చర్యలు, ఆగడాలు, దౌర్జన్యాలు, ఉన్మాద చర్యలు ' లాంటి మాటలు తరచుగా వినపడేవి. ఇవన్నీ అప్పటికే ప్రాచుర్యంలో ఉన్న మాటలు. ఈ మాటలకు భిన్నంగా 'తెలబాన్లు ' అనే ఒక కొత్త పదం పుట్టుకొచ్చి అందరి నోళ్ళలో నానుతోంది. ఈ పదం పుట్టు పూర్వోత్తరాలను తెలుసుకొనే క్రమంలో రెండో దశ తెలంగాణా ఉద్యమ ఆవిర్భావం గురించి ఒకసారి మననం చేసుకుందాము.

మద్రాసు రాష్ట్రం నుండి విడిపడిన కొన్నేళ్ళకు తెలంగాణా ప్రజల్లో అసంతృప్తి మొదలయింది కానీ అప్పటి కాంగ్రెసు నాయకులు దాన్ని ఉద్యమరూపం దాల్చనివ్వలేదు. తెలుగుదేశం నుండి బయటకు వచ్చాక కేసీఆర్ ఈ ఉద్యమాన్ని మళ్ళీ పునరుజ్జీవం చేసాడు. అప్పటినుండి తెలంగాణా వాసులు "ఎన్నాళ్ళీ కట్టు బానిసత్వం? ఎన్నేళ్ళీ నిరంకుశత్వ పాలన? ఈ వెట్టి చాకిరీ మనమెందుకు చేయాలి? ఈ బానిస బ్రతుకుల నుండి విమోచన కావాలి" అంటూ ప్రత్యేక రాష్ట్రంకోసం ఉద్యమించసాగారు.

ఈ ఉద్యమానికి రూపకర్త కీ.శే|| ప్రొ.జయశంకర్ గారు. తెలంగాణా సిద్దాంత కర్త, తెలంగాణా జాతిపిత అయిన కీ.శే|| ప్రొ.జయశంకర్ గారు ఉద్యమ పంథాను వివరిస్తూ "ఏనాటికయినా మనం తెలంగాణాను సాధించుకోవాలి. అందుకు ఎన్నో మార్గాలున్నాయి కానీ మనము గాంధీమార్గమే ఎంచుకోవాలి. ఎన్నడూ ఇతరులను నొప్పించకూడదు. అహింస ద్వారా తెలంగాణాను సాధించుకొని గాంధీమార్గాన్ని ప్రపంచానికి ఎలుగెత్తి చాటి చెప్పి తెలంగాణా ప్రజలే అసలు సిసలయిన గాంధీ వారసులు అని నిరూపించాలి" అన్నారు.

అమాయకులయిన తెలంగాణా ప్రజలు కీ.శే|| ప్రొ.జయశంకర్ గారుచెప్పినట్టే నడుచుకోవడం మొదలు పెట్టారు. "మా రాష్ట్రాన్ని మాకు ఇవ్వండి చాలు. అన్నదమ్ముల్లా విడిపోదాము" అంటూ ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్న తరుణంలో వీరి అమాయకత్వాన్ని అలుసుగా తీసుకొని కొన్ని దుష్టశక్తులు ఉద్యమంలో చాపకింద నీరులా ప్రవేశించాయి.  "సీమాంధ్రులను తరిమి కొట్టండి, నాలుకలు చీరేస్తాం, తలలు నరికేస్తాం" అంటూ అమాయకులయిన తెలంగాణా ప్రజలను రెచ్చకొట్టి పెడత్రోవ పట్టించాయి.

అప్పటికీ మెజారిటీ తెలంగాణా వాసులు "ఇలా తోటివారి పైనే దాడులకు దిగడం మంచిది కాదు" అంటున్నా, అతి కొద్దిశాతం ఉన్న ఈ ముష్కురులు వారి మాటలను ఖాతరు చెయ్యక దాడులకు దిగారు. "ఆంధ్రా మెస్" అని బోర్డు పెట్టుకొని జీవనం సాగిస్తున్న వారిపైన దాడులు చేసి మెస్ అంతా ధ్వంసం చేయడం, సీమాంధ్రులు అని తెలిస్తే వారి కార్ల అద్దాలు పగలకొట్టడం, ఇక అతి నీచాతినీచంగా పరీక్ష పేపర్లు దిద్దను వచ్చిన గురువులను తరిమి  కొట్టడం లాంటి చర్యలకు పాల్పడ్డారు.

అప్పటివరకు ఇలాంటి దేశద్రోహ చర్యలు చేస్తున్నవారిని "అల్లరి మూకలు, గూండాలు, ఉన్మాదులు" అని పిలిచేవాళ్ళు కానీ ఆ పదాలేవీ వీరి చేష్టలకు సరిపోలేదు. పదివేలమందితో పదిలక్షలమంది మార్చ్ నిర్వహించిన రోజున ట్యాంక్‌బండ్ పైన విగ్రహాలను కూల్చినపుడు వీరికి "తెలబాన్లు" అన్న పేరు పెట్టారు.  ఆఫ్ఘనిస్తాన్లో బుద్ద విగ్రహాలను నాశనం చేసి తాలిబాన్లు ఏ విధంగా (అన్)పాపులర్ అయ్యారో, ఈ కొద్దిమంది ముష్కురులు కూడా విగ్రహాలను ధ్వంసం చేసి తెలబాన్లుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆఫ్‌కోర్స్, ఆ వీడియో క్లిప్పింగులు అన్నీ కేంద్రానికి పంపించి "ఇదీ వీళ్ళు చేస్తున్నది, మున్ముందు చేయబోయేది" అంటూ నివేదిక ఇచ్చింది ఇంటెలిజెన్స్.

తెలబాన్ల ప్రస్తావన వచ్చినపుడల్లా వినిపించే మరో పదం "ఉస్మానియా". ఈ ఉద్యమానికి ముఖ్యకేంద్రంగా నిలిచిన ఉస్మానియాలో కూడా కొందరు ముష్కురులు ప్రవేశించి బస్సులను తగులబెట్టడం, షో రూముల పైన రాళ్ళు రువ్వి అద్దాలు పగలకొట్టడం లాంటి చర్యలతో 'ఉన్మాదియా' అన్న చెడ్డపేరు తెచ్చారు.   ప్రస్తుత స్పీకర్ నాదెండ్ల మనోహర్ అపుడెపుడో అమెరికా అధికారితో "ఈ ఉస్మానియా విద్యార్థుల్లో మెరిట్ స్టూడెంట్స్ ఎవరూ ఉద్యమంలో పాల్గొనడం లేదు, అంతా 30 ఏళ్ళకు పైబడినవారే" అన్నాడట. వీడియోల్లో చూస్తే ఎంతవరకు నమ్మశక్యమో తెలుస్తుంది.

ఉద్యమంలో పాల్గొనందుకు JNTU విద్యార్థుల పైన ఈ ఉస్మానియా విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. "ఈ JNTU లో ఉంటున్న తెలంగాణాలో పుట్టినవారు కూడా ఉద్యమంలో పాల్గొనడం లేదు. ఎప్పుడూ మెరిట్లో పాసవ్వాలి, ఎక్కువ మార్కులు తెచ్చుకొని ఏ అమెరికాకో వెళ్ళాలి లేదా ఐటీ కంపెనీల్లో చేరి ఏసీ రూముల్లో నిద్రపోవాలి, ఇల్లు కారు కొనాలి అనుకుంటున్నారే తప్ప తెలంగాణాకు జరుగుతున్న అన్యాయం గురించి ఏనాడయినా పట్టించుకున్నారా? మేము మా చదువులను పక్కనబెట్టి భవిష్యత్తును ఫణంగా పెట్టి చేస్తున్న పోరాటంలో ఎందుకు పాల్గొనడం లేదు? వీరంతా తెలంగాణా ద్రోహులే" అన్నారు. ఇది ఆలోచింపదగ్గ విషయమే.

మళ్ళీ తెలబాన్ల విషయానికొస్తే - కీ.శే|| ప్రొ.జయశంకర్ గారు చెప్పినట్టు అహింసామార్గంలో పోరాటం చేసి ఉంటే ఏమి జరిగి ఉండేదో కానీ, తెలబాన్ల ప్రవేశముతో సీన్ మారిపోయింది.  సీమాంధ్రుల ఆస్తుల పైన దాడులు చేయడం, మామూళ్ళకు పాల్పడడం, ఇష్టమొచ్చినపుడు బందులు చెయ్యడం, రోజువారీ జీవితానికి ఆటంకం కలిగించడంతో హైదరాబాదులో వ్యాపారం చేసేవాళ్ళకు, హైదరాబాదుకు వెళ్ళాలనుకొనే వారికి అనిశ్చితి, ఆందోళన కలగడం మొదలయింది. తను సీమంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి అని తెలబాన్లకు తెలిస్తే బెదిరింపులకు దిగరని, మామూళ్ళు అడగరని ఏ సీమాంధ్ర వ్యాపారికి కూడా నమ్మకం లేదు.

నేను ఈ తెలబాన్ల దుశ్చర్యలను పూర్తిగా ఖండిస్తాను కానీ గమనించదగ్గ విషయం ఏమిటంటే,  లోపాయకారంగా వీరి దుశ్చర్యలవల్ల ఈ రోజు హైదరాబాదులో పెట్టుబడులు పెట్టాలంటే కొందరు జంకుతూ మరో మార్గం చూసుకోవడం మొదలుపెట్టారు.  పెట్టుబడుల సంగతి పక్కనపెడితే, హైదరాబాదుకు బస్సులోనో రైల్లోనో వెళ్ళాలన్నా "ఎప్పుడు బంద్ అంటారో, ఎప్పుడు తిరిగివస్తామో" అని ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మొదలుపెట్టారు. (ఈ బందుల గురించి మరో టపాలో!) ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాము.  "ఏ నాటికయినా తెలబాన్ల నుండి తలనొప్పి తప్పదు" అనుకున్నాడేమో, ప్రముఖ నిర్మాత రామానాయుడుగారు వైజాగ్‌లో ఒక సినీ స్టూడియో నిర్మించారు. ఆ స్టూడియో ఎంత సౌకర్యంగా ఉందో హాస్యనటుడు ఏవీయస్ గారు తన బ్లాగులో వివరించారు.

హైదరాబాదులో ఏ సినిమా షూటింగ్ జరుగుతున్నా (ఒక్క నితిన్ సినిమా తప్ప) అక్కడ వెంటనే తెలబాన్లు ప్రత్యక్షమవుతారు. సినిమా రిలీజ్ ముందు నానా గొడవచేసి డబ్బులు గుంజడం,  మహేష్‌బాబు కారు పైన దాడి చేయడం, గీతా ఆర్ట్స్ ఆఫీసు పైన రాళ్ళు రువ్వడం, కొన్ని లక్షల విలువయిన సెట్టు తగలపెట్టడం లాంటి ఉన్మాద చేష్టలను చూసి కోట్లలో ఖర్చుపెట్టే నిర్మాతలు ఇపుడిపుడే మరోదిక్కు వైపు చూడడం మొదలుపెట్టారు. వైజాగ్‌లో ఈ స్టూడియో వల్ల కొన్ని వందల కుటుంబాలకు ఉపాధి లభిస్తోంది. ఇది కేవలం ప్రారంభమే కాబట్టి మున్ముందు రామానాయుడుగారిని ఆదర్శంగా తీసుకొని మరింతమంది తమ పెట్టుబడులను సీమాంధ్రకు మళ్ళించే అవకాశాలు ఎక్కువే ఉన్నాయి.

ఈ ఉద్యమం ఇలాగే ఇంకో పది-పదిహేనేళ్ళు కొనసాగితే సీమాంధ్ర వ్యాపారవేత్తలు ఎటువంటి నష్టాలకు గురి కాకుండా హైదరాబాదులో పెట్టుబడులు తగ్గిస్తూ తమప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టి అభివృద్ది చేస్తారేమో అనిపిస్తుంది. తెలంగాణా వాదులు కోరుకుంటున్నదీ ఇదే కదా మరి!! (సశేషం)

తెలంగాణా ఇవ్వాలి, 2025 లో - Part 2 - మేలుకొలుపు

Posted by జీడిపప్పు

ప్రతి మనిషిలోనూ కొన్ని మంచి లక్షణాలున్నట్టే నాలోనూ కొన్ని మంచి లక్షణాలున్నాయి. అందులో ఒకానొకటి Knowledge Sharing. నా కెరీర్ ప్రారంభంలో ఒక పుణ్యాత్ముడు దగ్గరుండి మరీ నాకు పని నేర్పించి అత్యవసర సమయాల్లో ఆపద్భాంధవుడిలా ఆదుకొని "మనము నేర్చుకున్నది ఇంకొకరికి చెబితే మనకే చాలా మంచింది. ముఖ్యంగా అంత ట్యాలెంట్ లేనివాళ్ళకు వీలయినంత సహాయం చేయ్యాలి" అన్న సత్యాలను తెలియజెప్పాడు. నేను నేర్చుకున్నది ఎంతో కొంత అయినా వీలయినంత వరకు దాన్ని ఇతరులతో పంచుకోవడం ఇప్పటికీ పాటిస్తున్నాను.

ఇక విషయానికొస్తే - ఒకానొక ఉద్యోగంలో నాకంటే సీనియర్ అయిన వాడికంటే నేను కాస్త ముందుండే వాడిని. ఏదో గుడ్డిగా పనిచేయడం తప్ప వీడికి ఎక్కువ ట్యాలెంట్ లేదు. ఎవరినయినా టీం నుండి తీసేయాలి అనుకుంటే అందులో మొదటిపేరు వీడిదే ఉంటుంది. మా మేనేజరు మంచివాడు కాబట్టి, టీంలో అందరూ దేశీలే కాబట్టి ఎలాగో నెట్టుకొచ్చేవాడు. కేవలం టెక్నికల్ హెల్ప్ మాత్రమే కాకుండా చాలాసార్లు 'ఎలా మాట్లాడాలి, ఎలా ఈమెయిల్ వ్రాయాలి ' అని నాకు తెలిసినంతలో సహాయం చేసేవాడిని. కొన్నాళ్ళకు నేను ఇంకో ప్రాజెక్టులోకి వెళ్ళినా అపుడపుడు కలుస్తూ మాట్లాడుకొనేవాళ్ళము.

అప్పటివరకు వీడికి నేనంటే కాస్త అభిమానముతో పాటు గౌరవము కూడా ఉండేవి అనుకుంటా. కానీ ఉన్నట్టుండి ఏమయిందో ఏమో కానీ నాతో పాటు మరో ఇద్దరితో సరిగా మాట్లాడేవాడు కాదు. ఒకరోజు లంచ్ చేస్తూ మాట్లాడుకుంటుంటే "మీ వల్లే మా తెలంగాణా ఇలా అయిపోతోంది" అన్నాడు. తెలంగాణాకు మాకు ఏమి సంబంధమో అర్థం కాలేదు. అదేంటని అడిగితే "మీ సీమాంధ్రవాళ్ళు పెట్టుబడులు పెట్టి హైదరాబాద్ చుట్టూ రియల్ఎస్టేట్ రేట్లు పెంచేసారు. మామూలుగా అయితే 20 లక్షలకు మంచి అపార్ట్మెంట్ వచ్చేది. ఇప్పుడు నేను ఒక అపార్ట్మెంట్ కొనాలనుకుంటుంటే 30 లక్షలకు తక్కువలో లేవు. కూకట్‌పల్లి తర్వాత అంతా మీరే కదా, తెలంగాణా వచ్చేస్తే 20 లక్షలకే అపార్ట్మెంట్ వస్తుంది" అన్నాడు. వాడు చెప్పిన మాట నూటికి నూరుపాళ్ళు నిజమే అనిపించి ఏమి చెప్పాలో తెలియక నవ్వి ఊరుకున్నా.

వీడు చెప్పినదానిలో అంతా నిజమే అనిపిస్తుంది. దీనికి చక్కని ఉదాహరణ నేనే. 2002 లో అనుకుంటా - తెలిసిన వాళ్ళు హైదరాబాదులో అపార్ట్మెంట్ కొన్నారు. అది విని నేను కూడా వీలయినంత తొందరగా హైదరాబాదులో అపార్ట్మెంట్ కొనాలి అనుకున్నాను. నాలాగే సీమాంధ్రలోని ఎందరో "హైదరాబాదులో ఒక అపార్ట్మెంట్ కొనాలి" అనుకొనేవారు. ఇహ ఎన్నారైల సంగతయితే చెప్పనక్కర్లేదు!! ప్రతి Pot luck లో, ప్రతి గెట్-టుగెదర్ లో ఈ "రియల్" మాటలే ప్రధాన చర్చలుగా ఉండేవి. తత్ఫలితమే హైదరాబాదు శివార్లలో స్థల, ఇళ్ళ రేట్లు ఆకాశాన్నంటడం మొదలుపెట్టాయి.

సీమాంధ్రులు మరెక్కడా స్థలాలు లేవన్నట్టు హైదరాబాదులో ఇబ్బడి ముబ్బడిగా పెట్టుబడులు పెట్టి రేట్లను అలా పెంచకుండా ఉండి ఉంటే ఈ రోజు సగటు తెలంగాణా మధ్య తరగతి వ్యక్తికి అన్నీ అందుబాటులో ఉండేవి. కానీ అలా జరగలేదు, పరిస్థితి చేజారిపోయింది. ఇక జరుగవలసినది ఏమయినా ఉందా అంటే - తెలంగాణా రావడం. ఎప్పుడయితే తెలంగాణా వస్తుందో, అప్పుడు సీమాంధ్రులు హైదరాబాదు నుండి తమ దృష్టి మరల్చి తమ ప్రాంతాలకు చెందిన రాజధానుల్లో లేదా ప్రముఖ పట్టణాలలో పెట్టుబడులు పెడతారు, తద్వారా హైదరాబాదులో మళ్ళీ రియల్ ఎస్టేట్ బూం తగ్గి, చౌకగా అపార్ట్మెంట్లు వస్తాయి.

నా మిత్రుడి భావన కూడా సరిగ్గా ఇదే. కాకపోతే వాడు సగటు ఆక్రోశ తెలంగాణా వాసి వలే "మీరు వీళ్ళిపోతే మాకు అన్నీ చీప్" అన్నాడు. వీడన్న మరో మాట - "మీరొచ్చి మా ఉద్యోగాలు లాక్కుంటున్నారు".  ఇది విని ఎలా స్పందించాలో అర్థం కాలేదు. ఇదే మాట హైదరాబాదు రోడ్లపైన తిరిగే నిరుద్యోగి అన్నా పర్లేదు కానీ పొట్ట చేతబట్టుకొని అమెరికాకు వచ్చి ఎన్నొ కష్టాలు పడి ఉద్యోగం సంపాదించి ఎలాగో దాన్ని నిలబెట్టుకొని, అవసరమయితే అమెరికన్ల ఉద్యోగాలు ఊడిపోయేలా జాగ్రత్తపడి, అమెరికాలో బ్రతికే వీడు అనడమే వింతగా తోచింది. వీడేమో అమెరికాకొచ్చి సంపాదించవచ్చు కానీ సీమాంధ్రులు హైదరాబాదులో మాత్రం ఉద్యోగం చెయ్యకూడదు. హన్నన్నా!!

అప్పటివరకు సాటి తెలుగువాడిగా వీడి పట్ల ఉన్న భావాలు కాస్తా తుడిచిపెట్టుకుపోయాయి. నేనేమయినా తెలంగాణా రాకుండా అడ్డుకుంటున్నానా? అసలు నేనేటి నా సత్తా ఏమిటి? బ్రతుకుదెరువుకోసం అమెరికాకు వచ్చిన వాళ్ళను పట్టుకొని "మీ వల్లే" అంటే ఏమన్నా ఉపయోగం, అర్థం ఉందా? వాడి అపార్ట్మెంట్ ఏడుపు వాడికి ఉండొచ్చుగాక, అందుకు మమ్మల్ని నిదించడం ఏంటో, అదీ అమెరికాలో!! అందునా ఒకప్పుడు నా దగ్గ్గర నేర్చుకొని నావల్ల వీడికి నష్టం జరుగుతున్నట్టు మాట్లాడుతుటే ఆ సమయంలో "నీతిలేని #$%^&^"  అనుకున్నా కానీ ఇప్పుడయితే అలాంటి పరుషపదజాలం వాడకుండా సింపుల్ గా "మెగాస్టార్ చిరంజీవిలా దిగజారిపోయావురా" అనేవాడిని.

రాష్ట్రాన్ని విభజించకూడదు అన్న ఆలోచన పక్కనబెట్టి వాడు చెప్పిదాని గురించి ఆలోచిస్తే ఒక కొత్త లాజిక్ కనిపించింది. తెలంగాణా అంత అభివృద్ది చెందడానికి సీమాంధ్రుల పెట్టుబడులు కూడా ప్రధాన ఒకకారణం కదా. ఒకవేళ ప్రత్యేక తెలంగాణా ఏర్పడితే ఆ పెట్టుబడులేవో తమ ఊళ్ళలోనో చుట్టుపక్కలో పెడతారు, అపుడు సీమాంధ్రప్రాంతాలు కూడా ఇంకా అభివృద్ది చెందుతాయి. ఇదొక్కటే కాకుండా వాడు చెప్పినట్టు తెలంగాణా వస్తే ఇప్పుడు 30 లక్షలున్న అపార్ట్మెంట్ 20 లక్షలకే వస్తుందన్నమాట. అంటే హైదరాబాదులో 20 లక్షలకే ఒక ఇల్లు కొనుక్కోవచ్చు!

ఇదే మాట వాడితో అన్నాను "అంటే, తెలంగాణా వచ్చేస్తే అక్కడ రేట్లు తగ్గుతాయి కదా, నువ్వు తొందరగా ఇల్లు కొనుక్కోవచ్చు కదా" అని. అవునన్నాడు. "అలా అయితే నేను కూడా ఒకటి కొంటాను, జై తెలంగాణా" అన్నాను. దిమ్మ తిరగడం వాడివంతయింది! అదేంటి అన్నాడు - "అంతే కదా మరి, తెలంగాణా వస్తే రేట్లు తగ్గుతాయి అన్నావు కదా నువ్వే. ఏదయినా కొనడానికి అదే రైట్ టైం. ఆ టైంలో కొంటే చీప్‌గా వస్తాయని నువ్వే అన్నావుగా.. అప్పుడు నేనేటి, చాలామంది సీమాంధ్రులు కొంటారు" అన్నాను. ఇప్పటికీ వాడితో అంటుంటా "తెలంగాణా వచ్చిన వెంటనే రేట్లు తగ్గుతాయి, అపుడు కొంటే లాంగ్ టర్మ్ లో చాలా ప్రాఫిట్" అని.

ప్రస్తుత పరిణామాలు చూస్తే - తెలంగాణా ఉద్యమం ఊపందుకోవడంతో సీమాంధ్రుల పెట్టుబడులు తగ్గుముఖం పట్టాయి. గత రెండేళ్ళలో సీమాంధ్రలోని పట్టణాల్లో చాలా చోట్ల కొత్త లేఅవుట్లు వెలుస్తున్నాయి. ఎప్పటికయినా హైదరాబాదులో ఇల్లు కావాలనుకొనేవారు "ఇప్పుడే హైదరాబాదులో ఎందుకులే, ముందు మనూళ్ళో కొందాము" అంటూ ఇక్కడే పెట్టుబడులు పెడుతున్నారు. ఎవరో రాజకీయనాయకుడు "రాష్ట్రం విడిపోతే మాకు లక్ష కోట్ల ప్యాకేజీ ఇవ్వాలి" అన్నాడు. లక్ష కోట్లు ఇవ్వడం కంటే లక్షమంది సీమాంధ్రులు తమ ప్రాంతాల్లోనే తమ పెట్టుబడులు పెట్టి అభివృద్దిలో పాలుపంచుకోవడం చాలా ముఖ్యం.

అందుకే ఈ ఉద్యమం ఇలాగే ఇంకో పది పదిహేనేళ్ళు సాగుతూ ఉండాలి. అప్పటికి హైదరాబాదులో పెట్టుబడులు తగ్గుతూ సీమాంధ్రలో పెరుగుతూ ఉంటాయి అని నా అభిప్రాయం మరియు ఆశ. తెలంగాణావాదులు కోరుకుంటున్నదీ ఇదే కదా మరి!!! (సశేషం)తెలంగాణా ఇవ్వాలి, 2025 లో - Part 1

Posted by జీడిపప్పు


ప్రత్యేక తెలంగాణా -  గత రెండేళ్ళనుండి దాదాపు అందరు తెలుగువాళ్ళ నోట నానుతున్న మాట ఇది.  రాష్ట్రంలో పాలనను అస్తవ్యస్తం చేసి ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ ను "అయోమయ ప్రదేశ్" స్థితికి  తీసుకొచ్చి, "అంధ ప్రదేశ్" వైపు పరుగులు తీయిస్తున్న ఈ సున్నిత అంశం గురించి బ్లాగుల్లో ఇప్పటికే పుంఖానుపుంఖాలుగా ఎన్నో వ్యాసాలొచ్చాయి. తెలంగాణా ఇస్తారా ఇవ్వరా? ఎందుకు తెలంగాణా ఇవ్వాలి? ఎందుకు ఇవ్వకూడదు, ఇస్తే లాభనష్టాలేంటి? అంటూ ఎవరికి తోచిన విశ్లేషణలు వారు విశ్లేషిస్తున్నారు.. నీటుగా, ఘాటుగా, నాటుగా.

ఈ బ్లాగుల్లోని పోస్టులు చదువుతున్నపుడు నా అభిప్రాయాలు కూడా చెప్పాలనిపించేది కానీ సమయం, ఓపిక లేక దాటవేయవలసి వచ్చింది.  నా అభిప్రాయాన్ని కూడా భద్రపరిస్తే ఓ పదేళ్ళ తర్వాత ఓ సాయంత్రం వేడి వేడి మిర్చి బజ్జీ తింటూ నా ప్రస్తుత ఆలోచనలను చూసి నెమరు వేసుకుంటే బాగుంటుందేమో అనిపించి వ్రాయడానికి ఉపక్రమించాను.

తెలంగాణా విషయంలో బ్లాగుల్లోని టపాల్లో లేదా వ్యాఖ్యల్లో దాదాపు ప్రతి ఒక్కరి అభిప్రాయమూ 1) తెలంగాణా ఇవ్వాలి అనో లేదా 2) సమైక్యాంధ్ర గా ఉండాలి అనో ఉంది.  నాది ఈ రెండింటి కలయిక మరియు సవరణ అయిన అభిప్రాయం. అది -   3) తెలంగాణాను కొన్నేళ్ళ తర్వాత (2025 అయితే బాగుంటుంది) ఇస్తూ, రాష్ట్రాన్ని రెండు భాగాలుగా కాకుండా మూడు భాగాలుగా విభజించాలి.. ముందు ముందు మళ్ళీ ఇలాంటి గొడవలు తలెత్తకుండా.

ఇక వివరాల్లోకి వద్దాము. ముందుగా, తెలంగాణా విభజనకు నేను పూర్తిగా సానుకూలం. ఇందుకు పలు కారణాలున్నాయి. అందులో ముఖ్యమయింది "జనాభా ప్రాతిపదికన రాష్ట్రాలను ఏర్పాటు చేయడం". 2-3 కోట్ల మంది జనాభాకు ఒక రాష్ట్రం ఉంటే పరిపాలన మరింత సులభతరం అవుతుంది. ఎనిమిది కోట్లమంది (తొందర్లో పదికోట్ల మంది) బాగోగులు చూడ్డానికి ఒకే మంత్రి, ఒకే శాఖ ఉంటే పరిపాలన అంత సులభం కాదన్నది నా అభిప్రాయం.

మరో కారణం -  హైదరాబాదుతో పోలిస్తే సీమాంధ్ర అంతగా అభివృద్ది చెందకపోవడం.
అందరూ పెట్టుబడులు హైదరాబాదు చుట్టూ పెట్టడంతో అదేమో రాకెట్ స్పీడులో డెవలప్ అయింది కానీ సీమాంధ్ర ప్రాంతాలు ఆస్థాయిలో అభివృద్దికి నోచుకోలేదు. "రాష్ట్రానికి 70% ఆదాయం హైదరాబాదు నుండే వస్తోంది కాబట్టి విడిపోతే మన ప్రాంతాలు అభివృద్ది చెందడమెలా" అంటారు సమైక్యవాదులు.  నిజమే, ప్రస్తుతానికి హైదరాబాదే మూలాధారం కానీ ఇలా ఎన్నేళ్ళు? గత 20 యేళ్ళలో హైదరబాదు నూటపాతిక మైళ్ళ వేగంతో దూసుకెళ్తుంటే సీమాంధ్ర మాత్రం మహా అయితే ఓ పాతిక మైళ్ళ వేగంతో అభివృద్ది చెందుతోంది.  ప్రతిదానికి చకోర పక్షుల్లా హైదరాబాదు వైపే చూస్తుంటే ఇంకో ఐదు దశాబ్దాలయినా సీమాంధ్ర ప్రాంతాలు ఇలాగే ఉండిపోతాయి.  అందుకే సీమాంధ్ర ప్రాంతానికి ఈ తెలంగాణా ఉద్యమం ఒక Blessing in disguise అనిపిస్తుంది.

ఇక జరుగుతున్న ఉద్యమానికొస్తే - తెలంగాణా కావాలని కోరడం వరకు పరవాలేదు కానీ కొందరు తెలంగాణావాదుల పద్దతే చిరాకు, కోపం, అసహ్యం కలిగిస్తున్నాయి.  తెలుగుదేశం నుండి బయటకొచ్చాక అప్పటి రాజకీయ నిరుద్యోగి అయిన కేసీఆర్ ప్రత్యేక తెలంగాణా ఉద్యమం మొదలుపెట్టినపుడు ఒక సగటు తెలుగువాడిగా "రాష్ట్రాన్ని విభజించడమా? కుదరదంటే కుదరదు.  తెలుగు వారందరూ ఎప్పటికీ సమైక్యంగానే ఉండాలి" అనుకొంటూ తెలంగాణాను వ్యతిరేకించేవాడిని.  వైయస్సార్ ఉన్నన్నాళ్ళూ కేసీఆర్ కు కొన్ని బిస్కట్లు పడేస్తూ నోరుమూయించాడు కానీ వైయస్సార్ మరణం తర్వాత కేసీఆర్ విజృంభణ ఎక్కువయింది.  కేసీఆర్ "తెలంగాణా జాగో ఆంధ్రావాలా భాగో" "నాలుకలు చీరేస్తాం" "సీమాంధ్రులను తరిమి కొట్టండి" "దోపిడీదారులు" అనడంతో అప్పటివరకు తెలంగాణా వాదాన్ని ఉద్యమంగా చూస్తున్న నాబోటివారు కాస్తా "ఇది కేవలం ఉద్యమమే కాదు, ఉన్మాదం కూడా" అనుకోనారంభించారు.

ఎప్పుడయితే తెలంగాణా వాదులు వ్యక్తిగత దాడులకు, ఆస్తుల విధ్వంసాలకు పాల్పడడం మొదలు పెట్టారో "ఈ ఉన్మాదులతో కలిసి ఉండడం అవసరమా" అనిపించడం మొదలయింది.  అప్పటివరకు తెలంగాణా ఇస్తే హైదరాబాద్ పోతుంది, మన ప్రాంత అభివృద్ది ఎలా అనుకొనే ఆలోచనలు కాస్త "ఒకవేళ హైదరాబాదు పోతే మన ప్రాంతాలు అభివృద్ది కాలేవా? హైదరాబాదులో సీమాంధ్ర పెట్టుబడిదార్లు ఎక్కువ అవుతున్నారు అనే కదా తెలంగాణావాదుల్లోని కొందరి ఆరోపణ. మరి ఆ సీమాంధ్ర పెట్టుబడి దారులు తమ పెట్టుబడులను తమ ప్రాంతాల్లో పెడితే సరిపోతుంది కదా" అనిపించేది.

ఇక తెలంగాణా ఇస్తే 2025 లో ఇవ్వాలి అని ఎందుకంటున్నానో, ప్రస్తుతం జరుతున్న పరిణామాలు ఇలాగే మరికొన్నేళ్ళు కొనసాగితే సీమాంధ్రకు ఏ విధంగా లబ్ది చేకూరుతుందని ఆశిస్తున్నానో రాబోవు టపాల్లో పంచుకుంటాను (సశేషం)