తెలంగాణా ఇవ్వాలి, 2025 లో - Part 4 - బంద్‌లు

Posted by జీడిపప్పు

మన డిమాండ్లనన్నిటినీ ఒప్పుకొని వాటిని నెరవేర్చాలని ఇతరులను ఇబ్బందులకు గురిచేసి బంద్‌లు చేయడం మనకున్న ఒకానొక ముఖ్యమయిన హక్కు. ఈ తరహాలోనే తెలంగాణా స్వాతంత్ర్య సమరయోధులు కూడా తరచూ బంద్‌లుకు పిలుపునిస్తున్నారు. హైదరాబాదులో బంద్ ప్రకటించి జనజీవనానికి ఆటంకం కలిగించి తద్వారా కలిగే కష్టనష్టాల రూపంలో ప్రణబ్ ముఖర్జీకి తమ వాదాన్ని గట్టిగా వినిపించాలన్నది వీరి ఆలోచన.

బంద్ ముందే ఖరారు చేస్తే ఆ విషయం తెలిసిన ప్రయాణీకులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవడం, ఉద్యోగస్తులు కాస్త ఓవర్ టైం పని చేసి అనుకున్న సమయానికి పని పూర్తి చెయ్యడం లాంటి ముందస్తు చర్యలు చేపట్టడానికి అవకాశం ఉంటుంది. కానీ ఒక్కోసారి చెప్పా పెట్టకుండా బందులు చేసేస్తుంటారు, హరీష్ రావు ఢిల్లీలో ఎవరినో కొట్టాడని తెలంగాణాలో బంద్ చేయడం, కేసీఆర్ కు కిక్కు దిగిన వెంటనే "ఏల్లుండి హైదరాబాదుకు ఎవర్నీ రానివ్వము" అనడం లాంటివి. ముందు ఒక తేదీ ప్రకటించి ఆ తర్వాత "మాకు జీతాలు వచ్చాక ఆ పై వారం ఫలానా తేదీ చేస్తాము" అంటారు. కొన్నాళ్ళాగి "పండగ వస్తోంది, పండగ అయిన తర్వాత సమ్మె చేస్తాము.. అపుడే హైదరాబాద్ దిగ్భంధనము" అంటారు, ఒక ప్రణాళిక అంటూ ఏదీ లేకుండా.

ఇక్కడ గమనించదగ్గ విషయమేమిటంటే - బంద్‌లు వల్ల కలిగే ఇబ్బంది కంటే బంద్‌లు చేస్తున్న తీరువల్ల కలిగిన అనిశ్చితి ఎక్కువ ప్రభావాన్ని చూపుతోంది. జూలై నెలలో ఏడెనిమిది రోజు బందులనీ, సమ్మెలనీ అడ్డంకులు కలిగించారు. ఆ దెబ్బకు ఆగష్టులో సగటు మనిషి హైదరాబాదుకు వెళ్ళాలంటే పలుమార్లు ఆలోచించవలసి వచ్చింది. "వెళ్ళిన తర్వాత అక్కడ బందులంటూ బస్సులను, రైళ్ళను అడ్డుకుంటే మనగతేమి?" అన్న ప్రశ్నలు ఉదయించాయి. హైదరాబాదులోని విద్యార్థుల తల్లిదండ్రులు "ఈ నెల అయినా స్కూళ్ళు సక్రమంగా నడుస్తాయా" అని ఆందోళన చెందారు. ఈ అనిశ్చితే సీమాంధ్రకు ఎంతో ఉపకారం చేస్తున్నదని నా గట్టి నమ్మకం.

ఒక ఉదాహరణ తీసుకుందాము. ఈ విద్యాసంవత్సరంలో హైదరాబాదులో దాదాపు 20 రోజులు పాఠశాలలు మూతపడ్డాయి. ఇలా జరగడం వల్ల పిల్లల్లో చదువు పట్ల ఆసక్తి తగ్గుతుందని విద్యావేత్తలు చెబుతున్నారు. ఏడో తరగతి నుండే ఎంసెట్‌కు, పదోతరగతి నుండే ఐఐటీకీ తమ పిల్లలను సిద్దం చేసే పేరంట్స్ బాధ వర్ణనాతీతం. ఇక ఇంటర్ చదివే పిల్లలుండే వారి కష్టాలు చెప్పనక్కర్లేదు. ఉన్న 700 రోజుల్లో 20 రోజులు గాల్లో కలిసిపోతే సీమాంధ్ర ప్రాంతాల్లోని విద్యార్థులు 20 రోజులు ముందున్నట్టే కదా అని లెక్కలు వేసుకొని తమ పిల్లలను గుంటూరు, విజయవాడలాంటి బ్రాంచిలకు పంపిస్తున్నారు. అనధికార లెక్కల ప్రకారం గత రెండు నెలల్లో సుమారు 15 వేలమంది హైదరాబాద్ నుండి సీమాంధ్ర ప్రాంతానికి చెందిన స్కూళ్ళలో, కాలేజీల్లో ట్రాన్స్ఫర్ కోసం అప్లై చేసారట. అన్నట్టు గత ఆరు నెలల్లో వచ్చిన పోటీ పరీక్షా ఫలితాల్లో హైదరాబాదీలకంటే సీమాంధ్రులే టాప్ ర్యాంకుల్లో ఎక్కువ ఉన్నారని అంటున్నారు! ఇది చాలా మంచి పరిణామమనిపిస్తోంది.

ఇక నా పాత్ర ఉన్న, నేను ప్రత్యక్ష సాక్షి అయిన మరో ఉదాహరణ చెబుతాను. IT కంపెనీల్లో ప్రాజెక్టులను నడిపించడానికి రకరకాల విధానాలుంటాయి. మా ప్రాజెక్టు "ఎంత పనికి అంత డబ్బులు" ప్రాతిపదికన నడుస్తుంది. అంటే, ప్రతి రోజూ ఎవరెవరు ఏమి పని చేసారో, ఎంత పని చేసారో రోజువారీ మీటింగుల్లో చెప్పి వారానికొకసారి ఆ వివరాలు ఇస్తే అందుకు తగ్గట్టు డబ్బులొస్తాయి. సగటున ఒక ఉద్యోగి వల్ల కంపెనీకి రోజుకు 8x30x45 = ~11,000 రూపాయల ఆదాయమన్నమాట.

జూలై నెల బంద్‌లు పుణ్యమా అని కేవలం మా ప్రాజెక్టుకు మాత్రమే లక్షల్లో ఆదాయం పోయింది. ఒక బిల్డింగులోని ఒక ఫ్లోరులోని ఒక సెక్షన్లోని ఒక టీం వల్ల రోజుకు లక్ష రూపాయల నష్టం వస్తే హైదరాబాదు బ్రాంచిలో ఎన్ని లక్షల నష్టం వస్తుందో, హైటెక్‌సిటీ మొత్తానికి ఎన్ని కోట్ల నష్టం వస్తుందో ఊహించుకోండి!! ( ఒక్క రోజు ఎవరూ పని చెయ్యకుంటే హైదరాబాదులోని కంపెనీలకు, ఫ్యాక్టరీలకు సుమారు 500 కోట్ల నష్టం వస్తుందట. ఆఫ్‌కోర్స్, దీర్ఘకాలిక ప్రయోజనాల్లో ఇటువంటి తాత్కాలిక నష్టాలు తప్పవు కదా.)

ఈ బందుల గురించి ఇండియాలోని మేనేజర్లకు తెలుసు  కానీ అమెరికన్లకో లండనోళ్ళకో తెలియదు కదా? పని కాకపోవడంతో వాళ్ళు అసహనం వ్యక్తం చేసి అక్కడున్న వాళ్ళను తోమితే వాళ్ళు ఇక్కడున్న మేనేజర్లను "ఇన్ని లక్షలు నష్టమొస్తే ఎలా? మీ ఇష్టమొచ్చింది చేసుకోండి, మాకు మాత్రం billing & delivery ముఖ్యం. కావాలంటే ఇంకో సిటీలోని మన ఆఫీసునుండి పని చెయ్యండి" అంటూ చితక్కొడుతున్నారు. ఈ నెలాఖరుకల్లా టీం మొత్తం హైదరాబాదునుండి మారడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. "హైదరాబాదు టీం ఇన్వాల్వ్ అయిఉంటే అనుకున్న తేదీకి డెలివరీ చేస్తామన్న గ్యారెంటీ లేదు కాబట్టి కనీసం ఇంకో వారం buffer కావాలి" అని నేను చెప్తుంటా. ఇపుడిపుడే అన్ని కంపెనీలవారు ఈ విషయం పైన దృష్టి సారిస్తున్నారు.

దీనివల్ల సీమాంధ్రకు లాభమేమిటి అంటే.. వైజాగ్ విమానాశ్రయం నుండి అంతర్జాతీయ సర్వీసులు, మరిన్ని దేశీయ సర్వీసులు మొదలుకాబోతున్నాయన్న వార్త చూసారా? దీనికి ప్రధాన కారణం - పెట్టుబడులు పెరగడమే. ఇప్పటికే కొన్ని కంపెనీలు హైదరాబాదునుండి వైజాగ్ కు తమ కార్యకలాపాలను తరలిస్తున్నాయి. తొందర్లో తిరుపతి ఏయిర్‌పోర్ట్ కూడా ఆధునీకరించబోతున్నారు. సీమాంధ్ర సెజ్ లలోకి రావడానికి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న పరిశ్రమలవారు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికిపుడే కాకపోయినా మున్ముందు ఇవి మరింత అభివృద్ది చెందుతాయనడంలో సందేహం లేదు. అందుకు కావలసినది "సీమాంధ్రులు తమ ప్రాంతాల్లోనే పెట్టుబడులు పెట్టడం". అలా జరగడానికి, సీమాంధ్రుల దృష్టి హైదరాబాదు నుండి కొంతయినా మళ్ళించడానికి ఈ బంద్‌లు, అనిశ్చితి తమవంతు సహరాన్ని అందిస్తున్నాయనే చెప్పవచ్చు. అందుకే ఈ ఉద్యమం ఇంకో పదిహేనేళ్ళు కొనసాగాలని నా కోరిక.

4 comments:

 1. Sravya V said...

  హ హ మీరు సీరియస్ గా రాసిన సరే నాకు నవ్వొస్తుంది , " హరీష్ రావు ఢిల్లీలో ఎవరినో కొట్టాడని తెలంగాణాలో బంద్ చేయడం, కేసీఆర్ కు కిక్కు దిగిన వెంటనే "ఏల్లుండి హైదరాబాదుకు ఎవర్నీ రానివ్వము" ఇలాంటి కొన్ని చణుకులు చూసి :))
  సీమాంధ్ర సెజ్ లలోకి రావడానికి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న పరిశ్రమలవారు ఆసక్తి చూపుతున్నారు.
  -------------------------------------
  లాంగ్ రన్ లో ఇదేమి అంత మంచి పరిణామం కాదు , దీని వాళ్ళ పచ్చ గా పండే పొలాలు పారిశ్రామిక వాడలు అవుతాయి . పంటలు పండించే విస్తీరణం తగ్గిపోతుంది . ofcourse అది జరిగి తీరాల్సినప్పుడు ఎవరము ఏమి చేయలేము అనుకోండి .

  btw మరీ continuous గా ఈ సిరిస్ రాస్తున్న మధ్య మధ్య లో మామూలు పోస్ట్లు వేయొచ్చు గా మా లాంటి అభిమానుల కోసం :)))

 2. Anonymous said...

  మీకోరిక మాత్రమేనా? ముక్కోడి ఫేమిలీ అందరి కోరికా అదే! ఆయన కొడుకు, కూతురు అమెరికాలో ఆడ్-జాబ్స్ చేసుకునేకన్నా హైద్రాబాద్ లో వసూళ్ళు చేసుకోవడం బెటర్ కదా, ఇక ఎండకాలం ప్రొఫెసర్ సరే సరి ... ఏదో ఇలా జీవితం తేరగా సాగిపోవాలనే కోరిక వాళ్ళకు మాత్రం లేదా ఏంటి? హరీష్ రావు అట్రాసిటీ అస్త్రం దెబ్బకు నోరెత్తడం ఆపేసి, నెత్తిన గులాబి కండువా వేసుకుని తిరుగుతున్నాడట!

  మీరు మీ IT పరిశ్రమ కర్నూలుకో, గుంటూరుకో తరలించేయమని మీ బాసుల చెవిలో పోరండి. హైటెక్ సిటేఎ బిల్డింగ్, చార్మినార్ కూడా తరలిస్తే ఎలా వుంటుంది అని ఆలోచిస్తున్నా... కాని ఒక్కటి వాళ్ళడిగినట్టు 'నిజాం కాలంలో ఎంత అభివృద్ధి వుండిందో ఆ లెవెలుకు తీసుకొచ్చి కాని విడిపోకూడదని నా అభిప్రాయం. పాపం .. లిఫ్ట్‌లో పైకి తెచ్చిన వాళ్ళం, కిందికి పోతామంటే కాదనడం ధర్మం కాదు. వీలైతే రజాకారులను కూడా పాకీలాండ్ నుంచి తెప్పిచి అప్పటి పరిస్థితులు కల్పిద్దాం, ఈ చిన్ని సాయం చేయలేమా, జీడిపప్పుగారూ?!

 3. Anonymous said...

  తెలంగాణ అంశముపై మీ వ్యాస పరంపర మరియు విశ్లేషణ చక్కగా సాగుతోంది. సీమాంధ్ర ప్రజల అలోచనా ధోరణికూడా క్రమంగా ఇలాగే మారుతుందని ఆశిస్తున్నాను.

 4. జీడిపప్పు said...

  @శ్రావ్య గారు - సెజ్‌లు ఎక్కువయితే వ్యవసాయోత్పత్తి తగ్గడము నిజమే కానీ... తప్పదు కదా! ఇక సీరియస్ పోస్టులంటారా, ఇంకో ఎపిసోడ్ తర్వాత ఈ సిరీస్‌కు కాస్త విరామం ప్రకటించి వేరే విషయాల పైన వ్రాద్దామనుకుంటున్నా.

  @snkr గారు - చార్మినార్‌ను తరలించవలసిన అవసరం లేదనుకుంటా.. ఒకవేళ తరలించాలన్నా అంత పెద్ద క్రేన్లు లేవనుకుంటా మాష్టారూ!

  @ అచంగ గారు - Thank you!!

Post a Comment