బాబోయ్ కూడలి.. వామ్మో మాలిక - 2

Posted by జీడిపప్పు

నెలక్రితం తెలుగు బ్లాగుల, బ్లాగు సమాహారాల స్థితిగతుల గురించి వ్రాసిన పోస్టుకు వచ్చిన స్పందన చూసిన తర్వాత చెత్త బ్లాగుల బాధితుడిని నేను ఒక్కడే కాదు, చాలామంది ఉన్నారు అని తెలుసుకున్నాను.  ఆసక్తికరమయిన విషయమేమిటంటే దాదాపు అందరు బ్లాగరులు కూడా ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్న కూడలి, మాలికలకు రావడానికి భయపడుతున్నామని, సోది వార్తలతో నిండిన వీటిజోలికి రావడమే మానుకున్నామని చెప్పారు. ఉన్నంతలో తమకు నచ్చిన బ్లాగులను అనుసరిస్తూ అవే చదువుకుంటుండడం వల్ల ఎన్నో కొత్త బ్లాగులను మిస్ అవుతున్నారు.

~ 2006 లో అనుకుంటా, కూడలికి వస్తే సుగంధ పరిమళాలు వెదజల్లే బ్లాగులు స్వాగతం పలికితే, మిగతా బ్లాగులు నందనవనంలోని పారిజాతాలను తలపించేవి. మరి ఇప్పుడో? అడుగు పెట్టగానే కుళ్ళు కంపు వస్తే కాస్త ముందుకెళ్ళి భరించలేని దుర్గంధం తో ముక్కుమూసుకొని పారిపోవలసి వస్తోంది. ఈ సందర్భంగా నిర్వాహకులయిన కూడలి చావాకిరణ్ గారు, మాలిక మలక్పేట్ రౌడీ గారు మొదలయిన వారికి ఒక చిన్న మాట - ఎటువంటి లాభాపేక్ష లేకుండా మీరు ఎన్నో వ్యవప్రయాసలకోర్చి ఒక వెబ్సైటు నిర్వహించడం చాలా అభినందనీయం. కేవలం మీకు బ్లాగుల పట్ల ఉన్న ఆసక్తి, మంచివిషయాలు నలుగురికి తెలియాలి అన్న మంచి ద్రుక్పథంతో మీరు చేస్తున్న ప్రయత్నం, మీరు పడుతున్న శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరులా వ్యర్థమేమో అనిపిస్తున్నది. సగటు బ్లాగరు మీ సైట్లను చూడాలంటేనే భయపడుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో గమనించి తగిన చర్యలు తీసుకోండి.

 'అసలు అగ్రిగేటర్లలో ఏ బ్లాగులు ఉంచాలో చెప్పడానికి నువ్వెవడివోయ్, అంతగా కావాలంటే నువ్వే ఒకటినడుపు' అన్నాడొక అనానిమస్సయ్య. అనూష్కనే ఉంటే ఇలియానా ఎందుకన్నట్టు వెబ్సైటు నడిపే ఓపిక, తీరిక, సత్తా ఉంటే ఈ టపాలే వేసేవాడిని కాదేమో!!  కాకపోతే నాక్కూడా 'నిజమే కదా, ఏ బ్లాగులు చదవదగ్గ బ్లాగులో ఎలా చెప్పడం' అనిపించి అప్పటికపుడు అగ్రిగేటర్లు చూస్తే నూటికి పట్టుమని పది కూడా కనిపించలేదు. కాస్త ఓపిక తెచ్చుకొని  ఒక IPL మ్యాచ్ చూస్తూ సుమారు ముప్పి, ఇంకో మ్యాచ్ చూస్తూ సుమారు డెబ్బి బ్లాగులు సేకరించగలిగాను.

బ్లాగులయితే సేకరించాను కానీ వాటిని ఎలా ఉపయోగించుకోవాలో అర్థం కాలేదు. మెయిల్ లో బ్లాగు రీడరు, ఫీడర్లు, ఫాలో అవడాలు పెద్దగా నచ్చలేదు. చివరికి దాదాపు అందరికీ తెలిసిన, అతి సులువయిన పద్దతిలో మరో బ్లాగు సృష్టించి అందులో అన్నీ పొందుపరచాను. బ్లాగు డిజైన్ కూడా ఫంక్షన్లకు గాడీ మేకప్‌తో వచ్చే బాలీవుడ్ హీరోయిన్ రేఖలా జిల్ జిల్ జిగా జిగా అని ఉండాలా, లేక సాగరసంగమంలో జయప్రదలా సింపుల్‌గా ఉండాలా అని ఆలోచించి చివరికి జయప్రద వైపే మొగ్గు చూపాను.

బ్లాగు పేరు కోసం కొన్ని ప్రయతించినా అవి అందుబాటులో లేకపోవడంతో సింపుల్ గా ఉంటుదని నూరు తెలుగు బ్లాగులంటూ ఫిక్సయ్యాను, తెలుగులో చదవదగ్గ బ్లాగులు కనీసం ఓ వందయినా ఉండకపోతాయా అన్న ఆలోచనతో!  మొదటి రెండు రోజులూ కాస్త కొత్తగా ఉన్నప్పటికీ, ఈ రెండువారాల్లో బాగా అలవాటయింది. అగ్రిగేటర్లలో సగటున రోజుకు 50 పోస్టులున్నా అందులో చదవదగ్గవి మహా అయితే 5 ఉంటాయి. వార్తలు, చిట్కాలు, పాడి-పెంట పోస్టుల మధ్య అవి వెతుక్కోవడానికే కొన్ని నిమిషాలు పడుతుంది. ఇక వారానికొకసారి చూసేవారి సంగతి చెప్పనక్కర్లేదు. క్రితం రోజు వచ్చిన మంచి పోస్టు కూడా అగ్రిగేటర్లో కనపడదు.

ఈ 'బ్లాగుల బ్లాగు ' లో నాకు నచ్చిన మూడు విషయాలేమిటంటే - మొదటిది - వచ్చి వెళ్ళే బ్లాగులు ఉండవు. అన్నీ స్థిరంగా అక్కడే ఉంటాయి. కాకపోతే లేటెస్టు బ్లాగు ముందుగా కనపడుతుంది. రెండవది - మనమే బ్లాగులను వర్గాలుగా విభజించుకోవచ్చు, ఆణిముత్యాలు, రచయితలు, సినిమాలు etc. ఇక మూడోది - అందరికీ తెలిసిందే, మళ్ళీ చెప్పనక్కర్లేదు.

'ఈ బ్లాగుల బ్లాగు' ను కొన్నాళ్ళు అగ్రిగేటర్లతో పోల్చి చూస్తూ స్మోక్ టెస్ట్ చేసాక ఇదే బాగుంది అనిపించింది. బ్లాగరులారా, ఓ సారి http://100telugublogs.blogspot.com చూడండి. మీకు తెలిసిన ఇంకేవయినా చదవదగ్గ బ్లాగులు తెలిపితే ఈ జాబితాలో కలుపుతాను. తెలుగు బ్లాగులను ఆస్వాదించేవారికి, అగ్రిగేటర్ల నిర్వాహకులకూ ఇది ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నా.

తెలుగు బ్లాగుల పరిస్థితి - బాబోయ్ కూడలి.. వామ్మో మాలిక

Posted by జీడిపప్పు

ప్రతిమనిషికీ ఏదో ఒక బలహీనత ఉన్నట్టే వీలు దొరికినపుడల్లా తెలుగు బ్లాగుల సమాహారాలయిన కూడలి/మాలిక చూడడం నా బలహీనత అనుకుంటాను.  ఒకప్పుడు కూడలికి వస్తే ఎటు చూసినా ఆసక్తికరమయిన టపాలే స్వాగతం పలికేవి. అక్కడక్కడా పంటికింద రాయిలా కనిపించే కొన్ని 'వార్తల బ్లాగులను ' పెద్దగా పట్టించుకొనేవారు కాదు. కానీ ఇప్పుడు కూడలికి లేదా మాలికకు వస్తే 'తెలుగు బ్లాగులంటే ఇవా?' అని ముక్కు తీసి వేలు పైన వేసుకోవలసి వస్తోంది.  బ్లాగుల జాబితాలో సుమారు 70-80 శాతం కేవలం 'వార్తలు ' ఉండడం చూసి 'ఇదేమి ఖర్మ, బ్లాగులంటే ఇవేనా ' అనుకొని ఆ వార్తల మధ్య ఉన్న చదవగలిగే బ్లాగులను వెతుక్కోవాలంటే తలప్రాణం తోకకు వస్తోంది.  పోనీ నచ్చిన బ్లాగును add చేసుకుంటే సరిపోతుంది కదా అనుకుంటే, ముందుగా ఓ చక్కని బ్లాగు కనపడాలి కదా??!!!

ఇంకా వివరంగా చెప్పాలంటే, సమాహారాల్లో ఉన్న బ్లాగుల్లో అధికభాగం 'అసెంబ్లీలో తూలిపడ్డ మంత్రి ', 'ఈ సినిమా ఆడియో రేపు విడుదల ',  'అదేదో దేశంలో రోడ్డు ప్రమాదం ',  'నెల్లూరులో ఫలానా రోడ్డు మరమ్మత్తులకు పది లక్షలు మంజూరు ', ' జాతీయ అంతర్జాతీయ చెత్త ',  'వాయిదాపడ్డ పరీక్షలు '.  'రామానాయుడు స్టూడియోలో ఈ సిన్మా షూటింగ్ ',  'శ్రీశైలంలో తగ్గిన విద్యుత్ ఉత్పత్తి '...ఇలాంటివాటికి తోడు న్యూస్ పేపర్లలో వచ్చే చెత్తాచెదారాన్ని కూడా 'బ్లాగు పోస్టు ' గా పోస్టు చేసి ఎంతో విలువయిన సమాహారాల space ను తినేస్తుంటే చూడడం కష్టంగానూ కాస్తంత బాధగానూ ఉంది.

అవి ఉంటే ఏంటి నీ బాధ అంటారా? కొన్నేళ్ళ క్రితం 'మా వూరు రోడ్డుకు గుంత పడింది ' ' ఓ హీరోకు జలుబు చేసింది ' అంటూ ఒక్కో బ్లాగులో రోజుకు ఐదారు పోస్టులు వేస్తుంటే అది చూసి తట్టుకోలేక ఓ పోస్టు వేశాను. సదరు మహానుభావులు కాస్త దయతలచారు.  తమ ఊర్లో పడ్డ గుంత గురించి, అసెంబ్లీలో మంత్రి తూలిపడ్డం గురించి వ్రాస్తే అవి బ్లాగుల కిందికి రావా అని ప్రశ్నిస్తే,  బ్లాగు అంటే 'అభిప్రాయాలకు వేదిక. తన అభిప్రాయాలను తెలపడానికి ఒక సాధనం ' అని నమ్మినవాడిగా అలాంటి 'వార్తలు ' బ్లాగులు కాదు అని చెప్తాను.

కూడలి/మాలిక వంటి సమాహారాలను ఈ ''వార్తా బ్లాగులు" నింపివేయడం 'అభిప్రాయాలు తెలిపే, ఆసక్తికరమయిన బ్లాగుల ' మనుగడకే ముప్పు అనిపిస్తుంది. దీనికి ఒక ఉదాహరణ: ప్రస్తుతం కూడలిలో అప్పుడుపుడు కాసేపు కనిపిస్తున్న యరమణగారి (డాక్టరుగారి) బ్లాగును మొదటిసారి నేను చూసినప్పటికే చాలాపోస్టులున్నాయి.  ఆణిముత్యాల్లాంటి పోస్టులు చదువుతుంటే "ఇంతకాలం ఈ బ్లాగు ఎలా మిసయ్యానబ్బా... కూడలి, మాలికలు తరచూ చూస్తుంటానే" అనుకుని చించగా చించగా అర్థమయిందేమిటంటే - ఒక మంచి బ్లాగు కూడలిలో ఎంతసేపు ఉంటుంది అన్నది ఈ 'వార్తా బ్లాగుల ' దయపైన ఆధారపడి ఉంటుంది.  ఇవి తలుచుకుంటే ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురు చూసే క్రిష్ణ ప్రియ గారి కబుర్లు కొద్ది గంటల్లో కూడలి/మాలిక నుండి అదృశ్యమయిపోతాయి. మనసులోమాట సుజాత గారు వ్రాసే చక్కని పుస్తకాల రివ్యూలు కొందమంది పుస్తకప్రియులకే కనిపిస్తాయి.  చదువరిగారి సమగ్ర విశ్లేషణలను ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాయి!!!! (ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. ఇప్పటికీ సజీవంగా ఉన్న మరి కొన్ని బ్లాగుల పరిస్థితి కూడా ఇంతే!)

ఇప్పటికయినా కూడలి/మాలిక/హారం నిర్వాహకులు కాస్త దయతలచాలి. ఒకప్పుడు చక్కని బ్లాగులతో కళకళలాడిన తెలుగు బ్లాగు సమాహారాలు ఇప్పుడు కేవలం 'వారా కూడళ్ళు ' గా మిగిలిపోతున్నాయి. పత్రికల్లో కూడా తెలుగు బ్లాగుల గురించి ఘనంగా వ్రాస్తున్నారు. ఒక సగటు పాఠకుడు 'ఈ బ్లాగుల సంగతి చూద్దాం ' అనుకొని కూడలికో మాలికకో వచ్చి చూస్తే 'చదివించగలిగే బ్లాగులు ' పట్టుమని పది కూడా కనపడక "ఓస్ ఓస్ ఈ మాత్రం కాపీ పేస్ట్ నేను చేయలేనా, నాలుగు ఫుత్వాలు పోస్టు చెయ్యలేనా" అనుకుంటాడు.

ఇప్పటికే కొందరు బ్లాగరులు తమకు నచ్చిన బ్లాగులను add చేసుకొని అవి చదువుకుంటున్నారు తప్ప కూడలి/మాలిక/హారం కు రావాలంటే బెంబేలెత్తిపోతున్నారు. (మొన్న రమణగారి బ్లాగులో నా కామెంటుకు డాక్టరుగారు 'ఈ మధ్య కూడలి చూడడం మానుకున్నాను ' అని ఇచ్చిన ప్రత్యుత్తరమే ఈ పోస్టుకు ప్రేరణ)  అంతమాత్రాన నేను ఈ వార్తాబ్లాగులను తొలగించమని చెప్పడం లేదు. కొందరికి అవి ఎంతో విలువయిన సమాచారాన్ని అందిస్తుండవచ్చు. అందుకే ఇవన్నీ 'వార్తల సెక్షన్లో మాత్రమె ' కనపడేలా చేసి 'అభిప్రాయాలు, ఆలోచనలను ' తెలిపే బ్లాగులను మీ వెబ్‌సైట్ ప్రధాన పేజీలో పెడితే తెలుగు బ్లాగులకు మరింత ఉపకారం చేసినవారవుతారు. కాస్తంత సమయాన్ని వెచ్చించి బ్లాగులను వర్గాలుగా విభజించమని విన్నపం.

పాఠకులారా, నేను మోతాదును మించి స్పందించానేమో, బహుశా నాకు మాత్రమే ఈ "వార్తల బ్లాగులు" ఎక్కువ కనిపిస్తున్నాయేమో తెలియడం లేదు.  నా అభిప్రాయాలతో మీరు ఏకీభవిస్తే (ద్వికీభవించినా పర్లేదు!) మీ అభిప్రాయాలను కూడా పంచుకోండి.

బాపు - బాలయ్య - బ్లాగు టెర్రరిస్టు

Posted by జీడిపప్పు


రామాయణం ఆధారంగా ఓ సినిమా తీస్తున్నారన్న వార్త చూసిన వెంటనే గుండె గుభేల్ మంది. దర్శకుడు బాపు, సంగీతం ఇళయరాజా అని తెలిశాక రెండుసార్లు గుభేల్ మంది. ఇక రాముడిగా బాలయ్య బాబు అని చూసినపుడు ఎందుకో గుండె గుభేల్మనలేదుగానీ విరక్తిపూరిత నిరాశా నిస్పృహ సమ్మేళనమయిన నవ్వు వచ్చింది. సీతగా నయనతార.. హతవిధీ అనుకున్నాను. సినిమా వివరాలు తెలిసినవెంటనే ఇలాంటి భావాలు కలగడం వెనుక పలు కారణాలున్నాయి.

తెలుగులో నేను ఎక్కువ అభిమానించే దర్శకుల్లో బాపు ఒకరు.ఎన్నో గొప్ప సినిమాలు తీసిన బాపు మిస్టర్ పెళ్ళాం తర్వాత తీసిన సినిమాలు చూస్తే "ఈయన ఎందుకు సినిమాలు తీస్తున్నారు? తెలుగువారు ఉన్నంత కాలం నిలిచిపోయే ఆణిముత్యాలను అందించిన చేత్తోనే నాసిరకం సినిమాలు తీసి జనాలను భయపెట్టవలసిన అవసరం ఏముంది? ఇంతటితో సినిమాలు తీయడం ఆపి హాయిగా విశ్రాంతి తీసుకుంటే బాగుంటుంది కదా. అలా చేస్తే బాపు అంటే ఆ ఆణిముత్యాలే గుర్తుకొచ్చి అందరి మనసుల్లో గౌరవంగా కలకాలం ఉండిపోతాడు" అనుకున్నాను. (దీనికితోడు అపురూప సౌందర్యరాశి జయప్రద సీతగా నటించిన "సీతా కళ్యాణము" సినిమా కొన్నాళ్ళ క్రితం ఓ అరగంట చూసిన చేదు అనుభవం కూడా ఉంది.) 

లయరాజా ఇళయరాజా గురించి కూడా సేం యాజ్ అబవ్. రెహ్‌మాన్ కంటే ఇళయరాజానే గొప్ప మ్యుజీషియన్ అని ఒకప్పుడు నొక్కి వక్కాణించే నేను ఈ మధ్య ఇళయరాజా అందించిన సంగీతం విని "ప్రభువా, ఇళయరాజా యందు దయ ఉంచుడి, మమ్ము కరుణించుడి 36:28' అని ప్రార్థించాను.

ఇక బాలయ్య బాబు విషయానికొస్తే - గత పదేళ్ళలో బాలయ్య చేసినన్ని చిత్రవిచిత్ర మైన ఫీట్లు ఎవరూ చేసి ఉండరేమో. ఈ ఫీట్లే కాక ఆ మధ్య పాండురంగడనబడు ప్రచండ ఘోర పౌరాణిక చిత్రరాజమును జనులబైకి వదలగా యా చిత్రహింస తాళలేక జనులు మతిస్థిమితంగోల్పోయి పలు దిక్కుల పిచ్చివాండ్రవలె పరుగులు తీసిరి. ఇదియొక్కటే కాక పాండురంగడు అనిన ఒక బఫూనుడుయన్న యభిప్రాయమునకొచ్చిరి. అట్టి బాలయ్య ఇపుడు రామావతారములో దర్శనమీయనున్నాడని చూచిన వెంటనే 'యుగాలనుండి రాముని గొలుచు తెలుగువారి దృష్టిలో రాముని యెడల భక్తి తగ్గి పోవునేమో" యని నా మనసు పరిపరివిధముల తపించినది.

ఇలా బాపు, ఇళయరాజా, బాలయ్య కలిసి ఓ చెత్త సినిమా తీస్తారేమో.. ముఖ్యంగా తొడకొట్టి రైలు ఆపడం, వేలు చూపెట్టి కుర్చీ లేపడం, విజయేంద్రవర్మ స్టంట్లులాంటివి, ఓ మాంఛి రొమాంటిక్ పాట పెట్టి "ఓస్ రాముడు ఇలాంటివాడా? మేమేదో గొప్పవాడనుకున్నామే" అని ప్రేక్షకులు అనుకొనేలా చేస్తారేమో అని భయపడ్డాను. అవన్నీ చూసి బ్లాగు టెర్రరిస్టు "చూసారా మీ రాముడిని మీ హిందువులే ఎలా చూపించారో, నిజం కాకపోతే ఎందుకు అలా చూపిస్తారు" అంటూ తన పైశాచిక ఆనందంకోసం రాముడు పైన చెత్త పోస్టులు వేస్తాడేమో అనుకున్నా.

బ్లాగు టెర్రరిస్టు రాముడిని అవహేళన చేస్తూ పోస్టులేసినా, తమ సంసారం చంకనాకిపోయిందని మిగతావారు కూడా అలాగే ఉండాలని కొందరు విషప్రచారాలతో విషవృక్షాలు నాటాలని ప్రయత్నించినా ఏమీ నష్టం లేదు.. దానికి కౌంటర్లు పడతాయి.. నాల్రోజులకు అందరూ మరచిపోతారు..కానీ ఎన్ని యుగాలయినా రాముడు ఉంటాడు!!  కాకపోతే చెప్పులో రాయిలా వీటికి అవకాశం లేకుంటే బాగుంటుంది కదా!

పైన చెప్పిన నా ఆలోచనలను, ఆందోళనను పటాపంచలు చేస్తూ బాపు-బాలయ్య-రాజా మరో ఆణిముత్యాన్ని ఇవ్వడం మన అదృష్టంగానే భావించాలి. ముఖ్యంగా నయనతార సీతగా న భూతో న భవిష్యతి అన్నట్టు నటించడం చూసి బాపు కు హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేము. ఇంతటితో బాపు, ఇళయరాజా సినీరంగం నుండి విరమించి హాయిగా విశ్రాంతి తీసుకుంటారని ఆశిద్దాము. బాలయ్య బాబు ఇక నుండి ఏదయినా సినిమా ఒప్పుకోబోయే ముందు ఓ ఐదు నిమిషాలు ఆలోచించి సరి అయిన నిర్ణయం తీసుకోవాలని కోరుకుందాము.

ఇక అతి ముఖ్యమయినది, పరమ నాస్తికులు కూడా గుడికి వెళ్ళి ఓ ఫదిరవై కొబ్బరికాయలు కొట్టి మరీ దేవుడిని ప్రార్థించవలసినది ఒకటుంది. అదే - దర్శకేంద్రుడు కె.నాభికేంద్రరావు ఈ సినిమా చూసి ఉత్తేజపూరితుడయి మరో పౌరాణికాన్ని తీయడానికి ఉపక్రమించకూడదు.