ఈమెయిల్ గోలలు
Posted by జీడిపప్పు
అడుక్కునే వాళ్ళు: ఒక వ్యక్తిని ఉద్దేశించి రాసిన మెయిలులో ఒకటికంటే ఎక్కువ "ప్లీజ్"లు ఉంటే, ఆ రాసినవారు "అడుక్కునే" వారి జాబితాలోకి వస్తారు. ఈమెయిల్ రాస్తున్నది ఏదో దానమో ధర్మమో చేయమని కాదు, ఆఫీసు పని మీద. ఇది పట్టించుకోకుండా కొందరు ఒకే మెయిల్‌లో "ప్లీజ్ ఈ పని చెయ్యి, ప్లీజ్ ఆ పని చెయ్యి, నీకు ఏమయినా డౌట్లుంటే చెప్పు ప్లీజ్" అని ప్లీజుతుంటారు. ఇది చూసినపుడు నాకు (మాదాల రంగారావు స్టోన్‌తో) "ఒరే అయ్యా, ఏమిటా అడుక్కోవడం? ఇది బస్టాండు కాదు, ఆఫీసు. కాస్త డిగ్నిఫైడ్ గా ఉండాలి" అని చెప్పాలనిపిస్తుంది.
ఫుల్‌స్టాపర్లు: ఒకప్పుడు మెసేజ్‌లో ఎన్ని తప్పులున్నా పెద్దగా పట్టించుకోకుండా చివరలో నా పేరు పక్కన మాత్రం ఠంచనుగా ఫుల్‌స్టాప్ పెట్టేవాడిని. అసలు బుర్ర ఉన్నోడెవడయినా పేరు పక్కన ఫుల్‌స్టాప్ పెడతాడా? ఒకసారంటే పర్లేదు కానీ కొన్ని వందల మెయిల్లలో ఎవరి పేరు చివరా ఫుల్‌స్టాప్ లేదని గమనించి అయినా ఆ తప్పు సరిదిద్దుకోవచ్చు కదా!
బొమ్మలోళ్ళు: ఒక ఎర్రర్ వచ్చినపుడు లేదా ఒక డౌట్ ఉన్నపుడు వీలయినంతవరకు ఆ వివరాలను మాటలరూపంలో చెప్పి అవసరమయిన చోట స్క్రీన్‌షాట్ తీసి ఈమెయిలుకు అటాచ్ చెయ్యాలి. కానీ కొందరు అలా కాదు. ప్రింట్ స్క్రీన్ ఒకటుంది కదా అని అవసరం లేని చోట కూడా ప్రతి చిన్న విషయానికి బొమ్మలు తీస్తారు. పోనీ ఆ బొమ్మలు jpeg లో ఉంటాయా అంటే అదీ కాదు, bmp ఫార్మాట్‌లో. ఒక్కోటి ఒక MB తింటుంది. jpeg లో సేవ్ చెయ్యవచ్చుగా? ఈ బొమ్మలను అటాచ్ చేసి దేశమంతా మెయిల్ కొడితే అవతలోడు ఆ బొమ్మలను అలాగే ఉంచి దానికి మళ్ళీ రిప్లై కొడతాడు. ఇహ చూస్కో నా సామి రంగా. మరుసటి రోజు ఆఫీసుకు వచ్చేసరికి ఆ మొదటి మెయిలుకు రిప్లైల మీద రిప్లైలు ఉంటాయి, ప్రతి రిప్లై లో ఆ భారీ అటాచ్‌మెంట్ తో సహా. ఆ దెబ్బకు ఇన్‌బాక్స్ సైజు పొర్లిపోయి చేతులెత్తేయడంతో పనికొచ్చే మెయిల్స్ కూడా రావు!
కృతఘ్నులు: తమకు అవసరమయినపుడు కొందరు తెగ మెయిల్స్ కొడతారు, అది కూడా కాపీ టు సీయం - కాపీ టు పీయం అంటూ కంపెనీకంతా. పని పూర్తి అయిన తర్వాత మాత్రం కనీసం థేంక్యూ అని కూడా చెప్పరు. నిజమే, ఆ పని చేయడమే నా డ్యూటీ అందుకే నేను జీతం తీసుకుంటున్నాను కాబట్టి నాకు థేంక్యూ చెప్పనవసరం లేదు. అయితే కార్పొరేట్ ప్రపంచంలో అత్యంత ప్రభావిత పదాలలో "థేంక్యూ" "గుడ్‌జాబ్" కూడా ఉన్నాయని చాలామంది గ్రహించరు. ఈ విషయాన్ని గ్రహించినవారే తమ పనులను సులువుగా చేయించుకోగలుగుతారు.
చాటభారతగాళ్ళు: ఏదయినా ఒక విషయం చెప్పేటపుడు KISS ఫార్ములా అవలంబించాలి. అంటే కీప్ ఇట్ సింపుల్ అండ్ స్ట్రెయిట్ (దీనినే కొందరు కీపి ఇట్ సింపుల్, స్టుపిడ్ అంటారు). రెండు లైన్లలో చెప్పగలిగిన విషయాన్ని రెండు పేరాల్లో సాగదీస్తారు కొందరు. ఈ చాటభారతానికి ఇంకో చాభా "నువ్వు చెప్పిన పని చేసాను. అంతా బాగయింది. ఎక్కడా ఇబ్బంది లేదు.." అంటూ మొదటి మెయిల్లోని చాభాని ఉటంకిస్తూ రిప్లై ఇస్తాడు. ఆ చెప్పేదేదో రెండు ముక్కల్లో "ఆల్ సెట్" అనో "డన్" అనో చెప్పచ్చుగా. ఒక్కో చాటభారతంవల్ల సగటున ఒక వ్యక్తికి 2-3 నిమిషాల సమయం వృధా. ఆ లెక్కన మూడు టీములవాళ్ళకు కలిపి ఆ ఒక్క మెయిల్ వల్ల ఒక గంట సమయం వృధా అవుతుందన్నమాట!
చివరగా - నాలో నాకు నచ్చే చాలా లక్షణాల్లో ఒకటి "ఆఫీసులో ఇంకొకరిని ఇబ్బంది పెట్టకపోవడం". ఈ ఉద్యోగంలో ఎన్ని రోజులుంటామో తెలియదు. ఎవరెవరో వస్తుంటారు పోతుంటారు. అంతమాత్రానికి ఆఫీసులో ఉన్నవాళ్ళతో గొడవలకు దిగడం లేదా ఇబ్బంది పెట్టడం చాలా తెలివితక్కువతనం. ఒకరిని ఇబ్బంది పెట్టి సాధించేది ఏమీ ఉండదు. మంచిపేరు తెచ్చుకుంటే అది భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడుతుంది, అసలే మనము "గ్లోబల్ విలేజ్" లో ఉంటున్నామాయె. ఇవన్నీ తెలిసినా అవకాశం వస్తే ఒకడికి చుక్కలు చూపించాలనుకుంటున్నా. ఎందుకంటే, వాడు దేశమంతా కొట్టే మెయిల్స్ లో కూడా SMS లాగ్వేజ్ "u" "c" "ty" వాడుతుంటాడు. వీడికి ఎలాంటి గుణపాఠం నేర్పించాలంటే, జీవితంలో మళ్ళీ ఛాటింగులో కూడా SMS భాష వాడకూడదు. ఎప్పుడొస్తుందో ఎలా వస్తుందో ఆ అవకాశం!
Who Moved My Cheese?
Posted by జీడిపప్పు
ఇది ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే, మొన్న ఈ పుస్తకాన్ని చదివాను. ఒకసారి గతాన్ని తరచి చూస్తే, దీని గురించి విన్నప్పటినుండి చదవడం వరకు నా ఆలోచనావిధానాల్లో కొన్ని "మార్పులు" ఉన్నాయి. ఐదేళ్ళ క్రితమే ఒక మిత్రుడు తప్పక చదవమని సూచించినపుడు "అబ్బే ఇలాంటి పుస్తకాల వల్ల ఉపయోగం ఉండదు" అని ఆ పుస్తకం సంగతి మరచిపోయాను. కొద్దికాలానికి ఇలాంటి పుస్తకాలపట్ల నా అభిప్రాయాన్ని "మార్చుకున్నాను". పుస్తకాల షాపుకు వెళ్ళినపుడల్లా ఈ పుస్తకం కనిపిస్తుంటే ఊరుకోలేక పేజీలు తిరగేసాను. ఏదో కథలా ఉండడంతో వద్దనుకొని కొనలేదు. ( ఏ మాటకామాటే చెప్పుకోవాలి, నాకు చీజ్ అంటే అస్సలు పడదు, టాం అండ్ జెర్రీ షోలో తప్ప!)
కొద్ది రోజుల క్రితం ఓ మిత్రుడితో మాట్లాడుతుంటే ఈ పుస్తకం ప్రస్తావన వచ్చింది. అన్వేషి లాంటివాడే ప్రస్తావించాడంటే తప్పక చదవవలసిందే అనుకొని ఈ పుస్తకం పట్ల నా అభిప్రాయాన్ని "మార్చు"కొని పుస్తకం చదివాను. ఈ పుస్తకం ఎలా ఉంది అంటే - స్వర్గం/నరకం నిర్ణయించే జంక్షన్లో నన్ను నిలబెట్టి దేవభటులు "నువ్వు చేసిన నూరు మంచి పనులు చెప్పు" అంటే అందులో "ఫలానా పుస్తకం చదివాను, చదవమని నా బ్లాగులో రాసాను" అని నూరులో ఒకటిగా చెప్తాను. చాలాకుంచెం అతిశయోక్తి అలంకార ప్రయోగం గావింపబడిననూ ఇది సత్యం!
పుస్తకంలోని విషయం ఎంత విలక్షణంగా ఉందో పుస్తకం కూడా అంత విలక్షణంగా ఉంది. మొత్తం నూరుపేజీలు కూడా లేదు. అందులో మొదటి పాతిక, చివరి ~20 పేజీలు పక్కన పెడితే "అసలు కథ" 50 పేజీలు ఉంటుంది. మధ్య మధ్యలో పేజి మొత్తానికీ "చీజ్" పైన ఒకే ఒక్క వాక్యం ఉంటుంది. ఆ మిగిలిన పేజీల్లో అయినా పేజినిండా అక్షరాలున్నాయా అంటే అదీ లేదు. కొన్ని పేజీల్లో దాదాపు సగ భాగం ఖాళీ! ఆ మిగిలిన కొద్దిపాటి స్థలంలో అక్షరలక్షలను పొందుపరచిన విధానం చూస్తే రచయితకు జోహార్లు అర్పించవలసిందే. చదవడం పూర్తిచేసాక కాస్త అర్థమవుతుంది, దశాబ్దం క్రితం సుమారు ఐదేళ్ళపాటు రాజ్యమేలిన ఈ పుస్తకం ఎందుకు 26 భాషల్లో రెండు కోట్ల ప్రతులకు పైగా అమ్ముడుపోయిందో.
చివరగా - e-పుస్తకాన్ని చదివిన ఓ వారం పది ముప్పై రోజుల్లో "శాశ్వత మార్పు" వస్తుందా అంటే, ఖచ్చితంగా రాదు. ఎందుకంటే - అది "మార్పు" కాబట్టి. మరి అలాంటపుడు ఎందుకు చదవాలి అంటే - ఒక ఆలోచనా బీజం వేయడానికి. ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను - చివరి పేజీ చదివి పుస్తకాన్ని మూసేస్తున్న తరుణంలో బాస్ ఫోన్ చేసి "నిన్ను ఈ క్షణమే ఉద్యోగం నుండి తీసేస్తున్నా" అనో లేదా ఫ్రెండ్ ఫోన్ చేసి "మనం డబ్బు దాచుకున్న బ్యాంకు దివాలా తీసింది, మనం అంతా పోగుట్టుకున్నాము" అనో అంటే, ఏమాత్రం తొణక్కుండా "ఓస్ అంతేనా" అంటారు!
ఇలాంటి పుస్తకాలే కొనాలి
Posted by జీడిపప్పు
ఒక వారం రోజుల పాటు ఐదారు పుస్తకాలను బరబరా చదివేసి "హమ్మయ్యా, ఇక నుండి అన్నీ చాలా ఎఫిషియంట్ గా చేస్తాను. నాకు తిరుగు లేదు" అనుకున్నాను. ఓ రెండు మూడు వారాల తర్వాత నా పనితీరు, ఆఫీసు దినచర్యలను పరిశీలిస్తే ఏ మాత్రం మార్పు కనపడలేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. అప్పుడర్థమయింది ఈ పుస్తకాలు అన్నీ సోది చెప్పి డబ్బులు లాక్కోవడానికే కానీ పనికొచ్చేవి కాదు అని. అంతటితో అలాంటి పుస్తకాలు చదవడం మానేశాను.
చదవడం మానేసినా ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరు ఫలనా పుస్తకం చదివిన తర్వాత ఫలానా విషయంలో మార్పు కనిపించింది అన్నపుడల్లా మళ్ళీ అలాంటి పుస్తకాలు చదవాలనిపించేది. రెండో ప్రయత్నం లో ఎక్కువ పుస్తకాలు చదవకుండా Brian Tracy రాసిన Eat That Frog ఒక్కటే చదివాను. పుస్తకంలో చాలా చాలా మంచి విషయాలున్నాయి. ఓ రెండు వారాల తర్వాత చూసుకుంటే ఏమీ మార్పు లేదు, మళ్ళీ డాగ్ టెయిల్ కర్వీ!!
తర్వాత అర్థమయింది నేను చేస్తున్న తప్పిదమేమిటో. కొన్ని లక్షలమందిలో కాస్తో కూస్తో మార్పు తెచ్చిన ఈ పుస్తకాలు "నవలలు" కాదు ఏకబిగిన చదవడానికి. ప్రతి పుస్తకంలో కొన్ని పదుల/వందల సూచనలు, సలహాలు ఉంటాయి. రెండు గంటలు చదివితే ఆ మంచి లక్షణాలన్నీ మన దైనందిన జీవితంలో భాగమయిపోవు. కేవలం ఒక్క లక్షణాన్ని "అలవాటు"గా చేసుకొనేందుకే సగటున 40 రోజులు క్రమం తప్పకుండా సాధన చేయాలంట! నేనేమో రెండు గంటల్లో నూటపాతిక లక్షణాలను "అలవాటు చేసుకోవా"లనుకున్నాను.
ఇప్పటికయినా మించిపోయింది లేదని మళ్ళీ అదే పుస్తకంలో చెప్పిన ఒక సలహాను పాటించడం మొదలుపెట్టాను. ఒకరోజు పాటిస్తే మూడురోజుల పాటు మరచిపోయేవాడిని. రెండు-మూడు నెలలకు కాస్త గాడిలో పడ్డాను. సగటున 40 రోజుల్లో అలవాటు కావలసిన ఈ లక్షణం నాకు అలవాటు కావడానికి సుమారు ఆరు నెలలు పట్టింది! ఇప్పుడు ప్రతిరోజూ ఆఫీసుకు వచ్చిన తర్వాత చేసే మొట్టమొదటి పని "ఏ పనులు చేయాలి, ఏవి ముందు చేయాలి ఏవి తర్వాత చేయాలి, ఎలా చేయాలి" అని జాబితా వ్రాయడం. దీనివల్ల నిఝ్ఝంఘానే నా పనితీరు మొత్తం మారిపోయిందా అంటే well.. something is better than nothing!
మొదటిసారి ఇలాంటి పుస్తకాల పైన నమ్మకం కలిగిన తర్వాత కొన్ని విషయాలు బాగా అర్థమయ్యాయి. అవి: 1) ఈ పుస్తకాలు ఊహాజనితాలు కావు, కొందరు మేధావులు తమ జీవితకాల అనుభవాలను సరళమయిన రీతిలో అందరికీ అర్థమయ్యేలా, ఆచరింపగలిగేలా పుస్తకరూపంలో అందిస్తున్నారు. 2) ఇలాంటి పుస్తకాలనెపుడూ నవల చదివినట్టు ఏకబిగిన చదవకూడదు 3) ఒక్క పుస్తకంలోని సారాన్ని మొత్తం "అలవాటు" చేసుకోవడానికి జీవిత కాలం కూడా సరిపోకపోవచ్చు. 4) పొరపాటున కూడా "పెద్ద పుస్తకాలను" కొనకూడదు.
వీటన్నిటిలో అతి ముఖ్యమయినది నాలుగవది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే, పెద్ద పుస్తకం అంటే చాలా పేజీలుంటాయి.పేజీలు నింపడానికే అన్నట్టు విషయాన్ని సాగదీస్తూ చెప్తారు. చదవడానికి చాలా సమయం పట్టినా ఏమి చెబుతున్నారో అర్థం చేసుకోవడానికి మరింత సమయం పడుతుంది. అందుకే కాస్త రీసెర్చ్ చేసి చివరకు John C. Maxwell పుస్తకాలను కొనడం మొదలు పెట్టాను.
Maxwell పుస్తకాలనే ఎక్కువగా కొంటుండానికి అనేక కారణాలున్నాయి: ముఖ్యంగా పుస్తకాలు చాలా చిన్నవి. 100-150 పేజీలకు మించకుండా జేబులో పట్టే సైజులో లభిస్తాయి. చాలా మంచి క్వాలిటీ పేపరు, చూడగానే ఆకట్టుకొనే Hardcover అయినా పుస్తకాలు చాలా తేలికగా ఉంటాయి. పుస్తకాన్ని వీలయినన్ని చాప్టర్లుగా విడగొట్టి చెప్పాలనుకొన్న విషయాన్ని సూటిగా చెప్పడం. ధర పది డాలర్లు కావడం.
ఇప్పటివరకు అన్నీ చదవకపోయినా Maxwellవి ఆరు, ఇతర రచయితలవి మూడు పుస్తకాలు కొన్నాను. (అఫ్‌కోర్స్, రాబోవు పదేళ్ళకు 10-15 పుస్తకాలు సరిపోతాయన్ని సత్యాన్ని తెలుసుకున్నా కనుక ఇప్పుడే చదవకపోయినా కొనిపెడుతున్నాను.) చూడడానికి అన్నీ భలే ఉన్నాయి. అన్ని పుస్తకాలూ ఒకేసారి పట్టుకొని అరచేతిలో మినీ లైబ్రరీ చూసుకొని మురిపోతుంటా అప్పుడపుడు. Kindle కొనేవరకు అదో తుత్తి :)
10%-90% మరియు 20%-80% సూత్రాలు
Posted by జీడిపప్పు
ప్రణాళిక లేదా ప్లానింగ్ అంటే - భవిష్యత్తును వర్తమానంలోకి తీసుకురావడం.
మనిషికున్న అత్యంత విలువయిన శక్తులు - ఆలోచించడం మరియు నిర్ణయించడం. తెలివిగా ఆలోచించి పకడ్బందీ ప్రణాళికను వేసుకోగలిగినపుడు వాయిదాలను మాని విజయాన్ని తొందరగా సొంతం చేసుకోగలుగుతారు. మీరు ఆఫీసులో పని చేస్తున్నపుడు మీ మానసిక, శారీరక శ్రమలకు ఎన్నో రెట్లు ప్రతిఫలం రావాలి. ప్రణాళిక వెయ్యడానికి ఖర్చు పెట్టిన ప్రతినిమిషం సుమారు 10-12 నిమిషాల శారీరక, మానసిక సమయాన్ని ఆదా చేస్తుంది. అంటే రోజూ ఉదయం 10-12 నిమిషాలపాటు ఆ రోజు చేయవలసిన పనుల గురించి ప్రణాళిక వేసుకుంటే సుమారు రెండు గంటల సమయాన్ని ఆదా చేయవచ్చు.
చేయవలసిన పనుల జాబితాను తయారు చేసిన తర్వాతే మీ రోజువారీ పనులను మొదలుపెట్టండి. మధ్యలో ఏదయినా కొత్త పని వస్తే దానిని జాబితాలో చేర్చండి. ప్రతిరోజూ ఆఫీసు వదిలి వెళ్ళేముందు కొద్ది నిమిషాల పాటు ఆ జాబితాను చూడండి. ఈ రోజు చేయలేకపోయినవి, రేపు చేయవలసినవి కలిపి క్రొత్త జాబితా తయారు చేయండి. అలా చేయడం వల్ల అంతర్గతంగా మీ మనసులో ఆ పనుల గురించి ఆలోచనలు మొదలవుతాయి. ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే ఆ పని పూర్తి చేయడానికి మెరుగయిన మార్గాలు, చిట్కాలు మీకు తట్టడానికి అవకాశాలు ఎక్కువ అవుతాయి.
వ్యక్తిగత విజయానికి కీలక సూత్రం 10%-90% పాటించండి. సరి అయిన ప్రణాళిక కోసం ఖర్చు పెట్టే 10% సమయం ఆ పనిని అమలు చేయడానికి అవసరమయిన 90% శారీరక, మానసిక శ్రమను మరియు సమయాన్ని మిగల్చగలదు.
20% - 80% సూత్రం
ఒక పని పూర్తి చేయడానికి అవసరమయిన 10 సంబధిత చిన్న పనుల జాబితా తయారు చేస్తే, అందులో రెండు పనులు పూర్తి చేయడం వల్ల మొత్తం పనిలో 80 శాతం పూర్తి అవుతుంది అని తెలుసా? ఇది నమ్మలేని నిజం. అతి ముఖ్యమయిన పనులు తక్కువే అయినా, అవే ఫలితాన్ని శాసిస్తాయి. పది పనుల్లో కేవలం ఒక్క పని యొక్క ఫలితం మిగతా తొమ్మిది పనుల ఫలితాల మొత్తంతో సమామయ్యే అవకాశాలున్నాయి.
దురద్రుష్టవశాత్తు చాలా మంది ఆ "అతి ముఖ్యమయిన" ఒకటి-రెండు పనులను వాయిదా వేస్తూ స్వల్ప ఫలితాలనిచ్చే పనులను ముందుగా మొదలుపెడతారు. ఈ అతి ముఖ్యమయిన పనులు చాలా కష్టంగా ఉండవచ్చు. కానీ అవి పూర్తి చేయడం వల్ల మిగిలిన పనులు పూర్తి చేయడం సులభమవుతుంది. అందుకే అడుగున ఉన్న 80 శాతం పనుల కంటే అగ్రభాగాన ఉన్న 20 శాతం పనులను చేయడానికి ప్రయత్నించాలి.
ఏదయినా ఒక పని మొదలుపెట్టే ముందు "ఇది Top 20% లో ఉండవలసిందా లేక Bottom 80% లో ఉండతగినదా" అని ఒక్క నిమిషం ప్రశ్నించుకోండి. కష్టమయిన పని మొదట చేయడం అలవాటు లేకపోయినా కొద్ది రోజుల పాటు ప్రతి రోజూ కష్టమయిన పని మొదట చేయడం ప్రారంభించండి. ఊహించని ఫలితాలను మీరే చూస్తారు.
(ఇది Eat That Frog పుస్తకం నుండి రాసుకున్న నోట్సు)
పేపరు పైన ఆలోచించండి
Posted by జీడిపప్పు
ప్రతి రోజు ఉదయం ఒక బ్రతికి ఉన్న కప్పను తినవలసి వస్తే, ఆరోజు అంత కంటే కష్టమయిన పని మరొకటి ఉండదు అన్న భావన మీలో కలిగి మిగిలిన పనులు కష్టమయినవిగా అనిపించవు. అలాగే రెండు కప్పలను తినవలసి వస్తే అసహ్యంగా ఉన్నదాన్ని ముందు తినాలి. దీనినే మరో రకంగా చెప్పాలంటే - మీరు రెండు ముఖ్యమయిన పనులు చేయవలసి ఉంటే, పెద్దది మరియు కష్టమయినది ముందుగా ఎంచుకోండి. దీనిని ఒక సవాలుగా తీసుకోండి. సులభమయిన పని ముందుగా చేయడాలని కోరిక ఉన్నా, ఆపుకోండి. ప్రతి రోజూ మీరు చేయబోయే పనుల్లో ఏది ముఖ్యం, ఏది కష్టం అని నిర్ణయించుకోవడం పైన ఆ రోజు ఆధారపడి ఉంటుంది అని గుర్తించుకోండి.
సక్సెస్ అన్నది 95% మీ రోజువారీ అలవాట్లపైన ఆధారపడి ఉంటుంది. పనుల ప్రాముఖ్యతను నిర్ణయించడం, వాయిదా వేయకుండా ఎప్పటిపనులు అప్పుడు పూర్తి చేయడం అన్నది ప్రాక్టీస్ చేయడం వల్ల కొంత కాలానికి మీ ఆలోచనలో, విధానాల్లో భాగమయి మీ పనితీరును, జీవనశైలిని ప్రభావితం చేస్తాయి.
ఏదయినా పని మొదలుపెట్టే ముందు ఆ పని ఎందుకు చేస్తున్నారో, ఎలాంటి ఫలితం ఆశిస్తున్నారో ఆలొచించండి. స్పష్టత అన్నది చాలా ముఖ్యం. కొందరు కొన్ని పనులు తక్కువ సమయంలో నేర్పుగా ముగించడానికి ప్రధానకారణం వారికి తాము చేయబోతున్న దాని పట్ల, ఫలితం పట్ల స్పష్టత ఉండడం. వాయిదా వేయడానికిగల ప్రధాన కారణం కూడా "స్పష్టత లేకపోవడం". ఎపుడయితే స్పష్టత ఉండదో, అపుడు అంతా అయోమయంగా ఉండి పనిచేయడానికి ఉత్తేజం, ఆసక్తి ఉండవు. అందుకే "పేపరు పైన ఆలోచించండి".
కేవలం 3 శాతం మంది మాత్రమే తాము చేయాలనుకున్న పనులను, తమ లక్ష్యాలను రాసుకుంటారు. అదే వయసు, అవకాశాలు, సమయం ఉన్నవారి కంటే ఇలా తాము చేయవలసిన పనులను రాసుకొనేవాళ్ళు 5-10 రెట్లు తొందరగా పూర్తి చేస్తారు. అందుకే "పేపరు పైన వ్రాయడం" తెలివయినవారు పాటించే సులువయిన మార్గం.
సులభంగా పని పూర్తి చేయడానికి పాటించవలసినవి:
1. మీ అంతట మీరే లేదా మరొకరితో చర్చించి మీరు ఏమి చేయాలనుకుంటున్నారో, వాటి ప్రాధాన్యతలు ఏమిటో నిర్ణయించండి. ఎంతోమంది ఈ విషయం పక్కన పెట్టి చిన్న చిన్న, ప్రాధాన్యతలేని విషయాల పైన రోజుల తరబడి పని చేస్తూఉ తమ శక్తిని, తెలివితేటలను వృథా చేస్తుంటారు.
2. పేపరు పైన ఆలోచించండి. మీరు చేయాలనుకున్నవన్నీ పేపరు పైన వ్రాయండి. వ్రాయకుండా సాధించాలనుకొనేవి అలాగే కలలుగా మిగిలిపోగలవు. వ్రాయడం వల్ల ఎటువంటి అస్పష్టత ఉండదు, తప్పులు చేసే అవకాశాలు తక్కువ, సరి అయిన దిశలో వెళ్ళడం సులభమవుతుంది.
3. గడువు పెట్టుకోకుండా నిర్ణయించినవి ముందుకు కదలవు. అందుకే మీరు సాధించాలనుకున్న వాటిని ఒక గడువులోగా పూర్తి చేయాలని ఆ గడువును పేపరు పైన వ్రాయండి.
4. మీరు లక్ష్యాన్ని అందుకోవడానికి చేయవలసిన పనులు అన్నీ వ్రాయండి. అది ఎంత చిన్నదయినా సరే తప్పక వ్రాయాలి. ఎపుడయితే అలా రాస్తారో మీరు చేయవలసిన పనులన్నీ మీ కళ్ళ ముందు కదలాడుతాయి. చేయవలసిన పనులను పేపరు పైన చేతితో స్పృశించగలడం దాదాపు సగం విజయం సాధించడంతో సమానం.
5. ఏ పని ముందు ఏ పని చేయాలి, మొదట ఏ పని చేయాలి - చివర ఏ పని చేయాలి ఆలోచించి నంబర్లు వేసి ఆ పనులను ఒక క్రమంలో అమర్చండి.
6. మీ ప్రణాళికను వెంటనే అమలు పరచండి. అమలు పరచని అద్భుత ప్రణాళిక కంటే అమలు పరిచే మామూలు ప్రణాళికే వేల రెట్లు మేలు అని మరువకండి.
7. మీ లక్ష్యాన్ని సాధించడానికి ప్రతిరోజూ ఏదో ఒక అడ్డంకిని అధిగమించండి. ప్రతి రోజూ 2-3 నిమిషాలు క్రితం రోజు మీరు ఏమి సాధించారో, ఈ రోజు చేయవలసిన పనులేమిటో ఆలోచించండి.
(ఇది Eat That Frog పుస్తకం నుండి రాసుకున్న నోట్సు)