ఇలాంటి పుస్తకాలే కొనాలి

Posted by జీడిపప్పు

రెండేళ్ళ క్రితం అనుకుంటాను, ఉన్నట్టుండి personality development వైపు గాలి మళ్ళి వెంటనే అందుకు అవసరమయిన వనరులు సేకరించడం మొదలుపెట్టాను. IT లో ఉండడం వల్ల అన్నిటికంటే ముఖ్యమయినది "పని చేసే విధానం" అని గ్రహించి ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, టైం మేనేజ్‌మెంట్, ప్రొఫెషనల్ బిహేవియర్ మొదలయిన విషయాలకు సంబంధించిన పుస్తకాలు దింపేసాను.

ఒక వారం రోజుల పాటు ఐదారు పుస్తకాలను బరబరా చదివేసి "హమ్మయ్యా, ఇక నుండి అన్నీ చాలా ఎఫిషియంట్ గా చేస్తాను. నాకు తిరుగు లేదు" అనుకున్నాను. ఓ రెండు మూడు వారాల తర్వాత నా పనితీరు, ఆఫీసు దినచర్యలను పరిశీలిస్తే ఏ మాత్రం మార్పు కనపడలేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. అప్పుడర్థమయింది ఈ పుస్తకాలు అన్నీ సోది చెప్పి డబ్బులు లాక్కోవడానికే కానీ పనికొచ్చేవి కాదు అని. అంతటితో అలాంటి పుస్తకాలు చదవడం మానేశాను.

చదవడం మానేసినా ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరు ఫలనా పుస్తకం చదివిన తర్వాత ఫలానా విషయంలో మార్పు కనిపించింది అన్నపుడల్లా మళ్ళీ అలాంటి పుస్తకాలు చదవాలనిపించేది. రెండో ప్రయత్నం లో ఎక్కువ పుస్తకాలు చదవకుండా Brian Tracy రాసిన Eat That Frog ఒక్కటే చదివాను. పుస్తకంలో చాలా చాలా మంచి విషయాలున్నాయి. ఓ రెండు వారాల తర్వాత చూసుకుంటే ఏమీ మార్పు లేదు, మళ్ళీ డాగ్ టెయిల్ కర్వీ!!

తర్వాత అర్థమయింది నేను చేస్తున్న తప్పిదమేమిటో. కొన్ని లక్షలమందిలో కాస్తో కూస్తో మార్పు తెచ్చిన ఈ పుస్తకాలు "నవలలు" కాదు ఏకబిగిన చదవడానికి. ప్రతి పుస్తకంలో కొన్ని పదుల/వందల సూచనలు, సలహాలు ఉంటాయి. రెండు గంటలు చదివితే ఆ మంచి లక్షణాలన్నీ మన దైనందిన జీవితంలో భాగమయిపోవు. కేవలం ఒక్క లక్షణాన్ని "అలవాటు"గా చేసుకొనేందుకే సగటున 40 రోజులు క్రమం తప్పకుండా సాధన చేయాలంట! నేనేమో రెండు గంటల్లో నూటపాతిక లక్షణాలను "అలవాటు చేసుకోవా"లనుకున్నాను.

ఇప్పటికయినా మించిపోయింది లేదని మళ్ళీ అదే పుస్తకంలో చెప్పిన ఒక సలహాను పాటించడం మొదలుపెట్టాను. ఒకరోజు పాటిస్తే మూడురోజుల పాటు మరచిపోయేవాడిని. రెండు-మూడు నెలలకు కాస్త గాడిలో పడ్డాను. సగటున 40 రోజుల్లో అలవాటు కావలసిన ఈ లక్షణం నాకు అలవాటు కావడానికి సుమారు ఆరు నెలలు పట్టింది! ఇప్పుడు ప్రతిరోజూ ఆఫీసుకు వచ్చిన తర్వాత చేసే మొట్టమొదటి పని "ఏ పనులు చేయాలి, ఏవి ముందు చేయాలి ఏవి తర్వాత చేయాలి, ఎలా చేయాలి" అని జాబితా వ్రాయడం. దీనివల్ల నిఝ్ఝంఘానే నా పనితీరు మొత్తం మారిపోయిందా అంటే well.. something is better than nothing!

మొదటిసారి ఇలాంటి పుస్తకాల పైన నమ్మకం కలిగిన తర్వాత కొన్ని విషయాలు బాగా అర్థమయ్యాయి. అవి: 1) ఈ పుస్తకాలు ఊహాజనితాలు కావు, కొందరు మేధావులు తమ జీవితకాల అనుభవాలను సరళమయిన రీతిలో అందరికీ అర్థమయ్యేలా, ఆచరింపగలిగేలా పుస్తకరూపంలో అందిస్తున్నారు. 2) ఇలాంటి పుస్తకాలనెపుడూ నవల చదివినట్టు ఏకబిగిన చదవకూడదు 3) ఒక్క పుస్తకంలోని సారాన్ని మొత్తం "అలవాటు" చేసుకోవడానికి జీవిత కాలం కూడా సరిపోకపోవచ్చు. 4) పొరపాటున కూడా "పెద్ద పుస్తకాలను" కొనకూడదు.

వీటన్నిటిలో అతి ముఖ్యమయినది నాలుగవది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే, పెద్ద పుస్తకం అంటే చాలా పేజీలుంటాయి.పేజీలు నింపడానికే అన్నట్టు విషయాన్ని సాగదీస్తూ చెప్తారు. చదవడానికి చాలా సమయం పట్టినా ఏమి చెబుతున్నారో అర్థం చేసుకోవడానికి మరింత సమయం పడుతుంది. అందుకే కాస్త రీసెర్చ్ చేసి చివరకు John C. Maxwell పుస్తకాలను కొనడం మొదలు పెట్టాను.

Maxwell పుస్తకాలనే ఎక్కువగా కొంటుండానికి అనేక కారణాలున్నాయి: ముఖ్యంగా పుస్తకాలు చాలా చిన్నవి. 100-150 పేజీలకు మించకుండా జేబులో పట్టే సైజులో లభిస్తాయి. చాలా మంచి క్వాలిటీ పేపరు, చూడగానే ఆకట్టుకొనే Hardcover అయినా పుస్తకాలు చాలా తేలికగా ఉంటాయి. పుస్తకాన్ని వీలయినన్ని చాప్టర్లుగా విడగొట్టి చెప్పాలనుకొన్న విషయాన్ని సూటిగా చెప్పడం. ధర పది డాలర్లు కావడం.

ఇప్పటివరకు అన్నీ చదవకపోయినా Maxwellవి ఆరు, ఇతర రచయితలవి మూడు పుస్తకాలు కొన్నాను. (అఫ్‌కోర్స్, రాబోవు పదేళ్ళకు 10-15 పుస్తకాలు సరిపోతాయన్ని సత్యాన్ని తెలుసుకున్నా కనుక ఇప్పుడే చదవకపోయినా కొనిపెడుతున్నాను.) చూడడానికి అన్నీ భలే ఉన్నాయి. అన్ని పుస్తకాలూ ఒకేసారి పట్టుకొని అరచేతిలో మినీ లైబ్రరీ చూసుకొని మురిపోతుంటా అప్పుడపుడు. Kindle కొనేవరకు అదో తుత్తి :)

21 comments:

 1. Shashank said...

  hmmm..personality development పుస్తకాలా? నాకు వీటి మీద పెద్దగ నమ్మకం ఉండదు. కాని యే పుస్తకమైన చదివి కొంచం మార్పు వస్తే అదే పది వేలు. నా జీవితం లో నాలో చాలా మార్పు(లు) తెచ్చిన "పుస్తకాలు" - ఒకటి భగవత్ గీత, ఇంకోటి zen and the art of motorcycle maintainence. ఇప్పుడు నేను చదువుతున్నది Autobiography of a Yogi. పూర్తిగా చదివాక చెప్త ఒక టపా లో.

 2. Anonymous said...

  మా అబ్బాయి కొని తెచ్చే పుస్తకాలు నెనూ చదవడానికి ప్రయత్నిస్తూంటాను. ఏమిటో చదివినంతసేపూ బాగానే ఉందనిపిస్తుంది. మనం కూడా రేపటినుండి ఈ పుస్తకంలో చెప్పినట్లుగానే చెయ్యాలనుకుంటాను. ఆ క్షణం వరకే ( ఏదో శ్మశాన వైరాగ్యం లాగ), మళ్ళీ మామూలే. అయినా మీరు చెప్పినట్లు ప్రయత్నిస్తాను, చిన్న చిన్న పుస్తకాలు చదివితే ఉపయోగం ఉంటుందేమో.

 3. నీహారిక said...
  This comment has been removed by the author.
 4. మాగంటి వంశీ మోహన్ said...

  పుస్తకాలు ఏలాగున యుండవలెననగా, జదవవలెననగా - పెద్దవి , చిన్నవి అని భేదము లేకుండగా, భాషాభేదము లేకుండగా...ఈలాగున పరిణామములు సంభవించవలెను....

  చదివినప్పుడు చిత్తము కణకణలాడకూడదు, ధారణ ఉపచరించవలెను. అపారత్వ గభీరత్వాలు అపౌరుషేయం అనిపింపచేయాలి, పరిభాష అల్పతమవ్వవలె. ప్రసాదం ప్రధానం కాకూడదు, ఆంతర్యపరిచయం కలిగించవలె, నిర్బంధించి నమస్కారం కోరుకోకూడదు...అలాగున యున్నయెడల, ఆలాగున మనము జదివిన యెడల ఆ పుస్తకము మస్తకమునకెక్కును...అందలి పదార్థము ఆంతరంగిక ఆహార్యమగును...

 5. పానీపూరి123 said...

  @Neeharika
  > ఈ మధ్య నా సాఫ్ట్‌వేర్ తమ్ముడు ఇంట్లో ఒకటే ఎగురుతున్నాడు.
  > ఒక paragraph copy చేసి email చేసాను.అపుడు దారిలోకి వచ్చాడు.

  aa paragraph ikkaDA paste cheyyamDi

 6. Sravya V said...

  ఒక వారం రోజుల పాటు ఐదారు పుస్తకాలను బరబరా చదివేసి "హమ్మయ్యా, ఇక నుండి అన్నీ చాలా ఎఫిషియంట్ గా చేస్తాను. నాకు తిరుగు లేదు" అనుకున్నాను. ఓ రెండు మూడు వారాల తర్వాత నా పనితీరు, ఆఫీసు దినచర్యలను పరిశీలిస్తే ఏ మాత్రం మార్పు కనపడలేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది >> ఇది నాక్కూడ ఉన్న జబ్బు :) మీ దారి లో ప్రయత్నించాలి , ఉపయోగం ఉంటుందేమో

 7. Amar said...

  మిత్రామా మీరు వీలు చూసుకొని ఒకసారి మీ జిల్లా , తాలుకా , మున్సిపల్ , మండల కేంద్రాల్లోని ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలలవద్ద రెపరెప లాడే ఎర్రజెండాల వెలుగుల నీడన ఉద్యమించే CITU, SFI, AIDWA, DYFI, KVPS, ANGANVADI, RAITU SANGAM నేతలు , కార్యకర్తలు కనిపిస్తారు.

 8. Raj said...

  నేను కూడా బోలెడన్ని పుస్తకాలు చదివినా ఇప్పటికీ సాధన చేసేది seven habits of highly effective peopleలోని మార్గాలనే. చాలా సార్లు బండి పట్టాలు తప్పినా మళ్ళీ పట్టాలు ఎక్కించడమే మార్గం.

 9. జీడిపప్పు said...

  @ శశాంక్ - మొదట్లో నాకూ నమ్మకం లేదు కానీ, ఇప్పుడు కుదిరింది :)

  @ హరేఫల గారు - మీ ఓపికకు జోహార్లు :)

  @ నీహారిక గారు - ఆ పుస్తకం చాలా ఫేమస్, ఎందరో రెకమండ్ చేసారు. తొందర్లో దాని సంగతి కూడా చూడాలి.

  @ వంశీ గారు - :)

  @ శ్రావ్య గారు - తప్పకుండా ప్రయత్నించండి. ఫలితం తప్పక ఉంటుంది. గుడ్ లక్

  @ అమర్ గారు - మరో చక్కని జోకును అందించారు. ధన్యవాదాలు

  @ రాజ్ గారు - మీ అనుభవాలు కూడా పంచుకోండి ఒక పోస్టు రూపంలో.

 10. నీహారిక said...
  This comment has been removed by the author.
 11. Unknown said...

  ఈ బ్లాగు వల్ల మంచి పుస్తకం(Eat that frog) తెల్సినట్టైంది .మరిన్ని మంచి పుస్తకాలు చదివితే ఇక్కడ తప్పకుండా రాస్తే మేము కూడా చదువుతాము :)

 12. సుజాత వేల్పూరి said...

  మా వారి పుణ్యమా అని మా ఇంట్లో leadership అనే సబ్జెక్టు మీద పుస్తకాలు గుట్టలుగా ఉంటాయి. ఈ మధ్య తను cyber law లో పీజీ చేయడం మొదలు పెట్టాక, ఆ లా యూనివర్సిటీ వాళ్ల cyber crimes పుస్తకం కూడా నాకు నచ్చినవాటిలో చేరింది. నీహారిక కోట్ చేసిన పుస్తకం స్టీఫెన్ కోవే ది "seven habits of highly effective people" పుస్తకం నాకు చాలా నచ్చిన పుస్తకం! మీరు చెప్పినట్లు వీటిని ఒకేసారి చదవకూడదు. అసలు చదవలేం కూడా! అలాగే patti holmes రాసిన "what do followers expect of leaders" కూడా బాగానే ఉంది కానీ ఎన్నాళ్ళబట్టో చదువుతున్నా పూర్తి కావడం లేదు,గట్టిగా 120 పేజీలు కూడా లేవు! పెద్ద పుస్తకాలు మాత్రం చచ్చినా కొనకూడదు. ఇది మాత్రం నిజం!

 13. Bhãskar Rãmarãju said...

  నేను ఇంతవరకూ లీడర్షిప్ మీద ఒక్క బొక్కుకూడా సదవలా.
  ఐతే ఈట్ అ.క.అ ఐటీ జెనాలకి కొంచం జాగ్రత్తతో గమనిస్తే వారి *విధి* *విధానాల* నుండి చాలా నేర్చుకోవచ్చు.
  ఉదా -
  ఆడిటింగ్ - మనం చేసే ఈట్ ఆడిట్స్ ని మన *మేతావితనం* పైన, మన పనులపైన అప్లై చేస్తే మనల్ని మనం మెరుగుపర్చుకోవచ్చు. ఇది మేనేజ్మెంట్ వైపుకి అడుగులు వేయిస్తుంది
  ఐ.యస్.ఒ సెర్టిఫికేషన్ - దీనికి ముందుగా పైన చెప్పిన ఆడిటింగ్ వారితో కల్సి ఓ పాత్ ప్రిపేర్ చేస్కుని ఇంప్లిమెంట్ చేస్తాం. అది మన పరసనాలిటీకీ అన్వయించుకోవచ్చూ అని నా అభిప్రాయం
  అంతెందుకు, ఛేంజ్ మేనేజిమెంటు ఛేంజ్ కంట్రోలు - ఇవి కూడా మనకి అన్వయించుకోవచ్చు.
  లెసస్న్ లెర్న్డ్ ఇన్ లైఫ్ మేక్స్ యువర్ పాత్ స్మూత్.

 14. Bhãskar Rãmarãju said...

  ఓ సవరణ
  పుస్తకాలు చదవటం అనేది ఎప్పటికీ వృధాగా పోదు. నేను ఇంతవరకూ లీడర్షిప్ మీద ఒక్క బొక్కుకూడా సదవలా అంటే దానివల్ల నేను కొన్ని కొన్ని మిస్ అవుతున్నాను అనేది కూడా నిజం. మంచి మంచి పుస్తకాలు చదివితీరాలి.

 15. MIRCHY VARMA OKA MANCHI PILLODU said...

  auvunu andi manchi manchi pusthakalu chadivithe chala vishayalu telusthayi andi

 16. durgeswara said...

  mee mail pampagalaraa maatlaadaali

 17. సుజాత వేల్పూరి said...

  భాస్కర్ రామ రాజు గారు,
  నిజానికి పక్కా హోం మేకర్ గా ఉండటానికి పూర్తిగా అలవాటు పడ్డ నాకు లీడర్ షిప్ మీద పుస్తకాల వల్ల పెద్దగా నేర్చుకోవాల్సింది ఏమీ లేకపోయినా, టైము బాగా ఎక్కువున్నపుడు ఎలా ఉంటాయో చూద్దామని చదివినవే! మా వారు మాత్రం ఎప్పుడూ పుస్తకాలు చదువుతూనే ఉంటారు! కోవే గారి ట్రైనింగ్ ప్రోగ్రాములకు వెళ్తూనే ఉంటారు, ఇప్పటికీ!

  "ఛేంజ్ మేనేజిమెంటు ఛేంజ్ కంట్రోలు - ఇవి కూడా మనకి అన్వయించుకోవచ్చు" .బాగా చెప్పారు. ఈ పుస్తకాలు చదివినపుడు కూడా ఇదే అనిపిస్తుంది.

  "లెసస్న్ లెర్న్డ్ ఇన్ లైఫ్ మేక్స్ యువర్ పాత్ స్మూత్" .దీన్ని మించింది లేదు.

 18. మీ శ్రేయోభిలాషి said...

  మంచి డిస్కషన్! నన్ను చాలా ప్రభావితం చేసిన పుస్థకం WHO MOVED MY CHEESE

 19. Bolloju Baba said...

  జీడిపప్పుగారికి
  మీరు అడిగిన అంశంపై నా కవితా స్పందన ఇది. మీకు మెయిల్ చేద్దామంటే ఐడి లేదు. కనుక ఇలా కామెంటు రూపంలో .....

  దీనిలో ప్రకాష్, గర్భిణులను ఉచితంగా, ఏవేళైనా ఆసుపత్రికి ఆటోలో తీసుకెళ్లటం అన్న అంశానికే పరిమితమయ్యాను. ఆ చర్యలో ఉండే మానవతా పరిమళాలను చెప్పటానికి ప్రయత్నించాను. మీరిచ్చిన వార్తను వ్రాసినవారెవరో కానీ అద్బుతంగా వ్రాసారు. ఆ వార్తే ఒక కవితలా ఉంది ఎక్కడో చదివాను. there is vast difference between prose and poetry. but there is very little difference between good prose and good poetry -- అని. ఆమాట గుర్తుకొచ్చింది.

  మీరిచ్చిన లింకులు ఇక్కడి చదువరులకోసం మరోసారి

  http://mail.google.com/mail/?ui=2&view=bsp&ver=1qygpcgurkovy

  http://mail.google.com/mail/?ui=2&view=bsp&ver=1qygpcgurkovy  ఆటో ప్రకాష్ 9948029294

  ఈ ప్రపంచం దృష్టెపుడూ
  పసిపాపలపైనే.
  ప్రేమించటానికో లేక
  వ్యాపారించటానికో.

  అయితే ఇతని చూపు
  పండు భారానికి వంగిన కొమ్మపై ఉంటుంది.
  అందుకేనేమో
  నిండుగర్భిణిని పాపాయిగా మార్చి
  పొత్తిళ్లలో పొదువుకోగలడు.
  మూలాలపై మమకారమే తప్ప
  వ్యాపారముండదిక్కడ.

  నెలలు నిండిన స్త్రీని చూస్తే
  మగవాడికి భయమో, జలదరింపో!
  బహుసా స్త్రీ ముందు తన
  అస్థిత్వమేమిటో గుర్తొస్తుందేమో.
  ఇతనికి మాత్రం
  తన శైశవపు పెదవులనుండి
  శబ్దిస్తూ విడిపోయిన తన తల్లి
  చన్మొన జ్ఞప్తి కొస్తుందేమో.

  కాన్పు కు సిద్దమయిన స్త్రీ నడుస్తూంటే
  మృత్యువు, ప్రాణమూ
  కలిసి తిరుగుతున్నట్లుంటుంది.

  సృష్టిగాలులకు ప్రాణదీపం
  రెపరెపలాడే ఆ రాత్రివేళ
  మనిషికీ మనిషికీ మధ్య
  నమ్మకపు పరిమళం ప్రవహిస్తుంది.
  ఇతని మనిషితనం ముందు
  మృత్యుదేవత తలదించుకొని
  మౌనంగా నిష్క్రమిస్తుంది.

  పుడమిలోతుల్లోంచి
  మరో ఉదయం బయటపడింది.
  దానిని తవ్వితీసిన తల్లి
  పొడికనులు ఇతనిని తడిగా చూసిన
  చూపుల భాషలోనే కదా
  ఈ లోకపు కీర్తనలన్నీ వ్రాయబడ్డాయీ!

  అంచులవరకూ నిండిన తృప్తితో
  ఇతనూ వెనుతిరుగుతాడు
  ఎప్పటిలానే!

  కృష్ణుడు ఏకకాలంలో
  అన్నివేల గోపికలతో
  ఉన్నాడో, కల్పనో తెలియదు కానీ
  ఇతనికి అంతటి మహిమే
  ఉంటే ఎంత బాగుణ్ణు.

  బొల్లోజు బాబా

  ఇప్పుడు మరలా చూసుకొంటూంటే ఈ కవితను ఎప్పటిలానే! అన్న చోట ఆపివేసినా బాగుంటుందనిపిస్తుంది. ఆఖరు పారాగ్రాపు లేకపోయిన లోపం కనిపించటం లేదు. వ్యాపారించటం అనే మాట ఒక ప్రయోగం అంతే.

  మీ అభిప్రాయం(కవితపై), లోపాలేమైనా ఉంటే చెపుతారని ఆశిస్తాను.


  ఈ కవిత మీకు అంకితం.

  నాచే బలవంతంగా కూర్చోబెట్టి రాయించినందుకు. :-)

  బొల్లోజు బాబా

 20. ఆత్రేయ కొండూరు said...

  జీడిపప్పు గారు

  మంచి విషయాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు. అతనికి శిరస్సు వంచి పాదాభి వందనం చేస్తున్నాను. మీరు పంపిన లింకులకు నా చిరు స్పందన. కవిత అని అనలేమేమోగానీ.. వచ్చిన భావాలను వచ్చినట్లు యధా తధంగా కాగితం ఎక్కించాను. మీ అభిప్రాయం చెప్పగలరు...

  మీరిచ్చిన లింకులు ఇక్కడి చదువరులకోసం మరోసారి

  http://i28.tinypic.com/2jvbm1.jpg
  http://i26.tinypic.com/34ika6x.jpg  ఆటో నడిపే దేముడు...
  =================

  అమ్మ తనాన్ని అమ్మేవాళ్ళూ..
  ఆ పిలుపుని పిండమప్పుడే నలిపేవాళ్ళూ..
  అద్దెకడుపుల వేలంపాటలూ..
  ఏడడుగులేసిన ఏడోరోజే చూరు అంచులకు చేర్చే వాళ్ళూ..
  ఆకలి కేకల్లో ఆరాటమార్చుకునే వాళ్ళూ..

  కకృతి కోరల కరాళ నృత్యం..
  కాగితం చుట్టగా.. ముంగిట్లోకి..

  మధ్య పేజీలో మరో ఉదయం..

  కలికాలపు ప్రవాహంలో...
  అడ్డుగా .. ఓ గడ్డి పరక.

  తన బ్రతుకే ఎదురీత..
  ఎన్ని కడుపుల భారాన్నో మోస్తూ
  ఓ కాలుతున్న కడుపు..

  ప్రతి క్షణమూ ప్రసవ వేదనే..
  చెక్కిళ్ళపై ఆగని పురిటి స్నానాలే..

  ఏదుకొండల మీడ హుండీలు నింపుతూ
  ఏ గర్భ గుడిలోనో మనమెదికేవాడు
  మూడు చక్రాల గుడిలో
  నిండు గర్భాలు మోస్తూ
  మన మధ్యనే తిరుగుతున్నాడు..

  చెమరిన కళ్ళతో..
  తన కాళ్ళకిదే కవితాబిషేకం.!!

  ఇదే కవితను నా బ్లాగులోనూ ఉంచాను. బాబా గారు అన్నట్టు ఇది మీకే అంకితం. ఆ వార్త చదవగానే.. ఈ భావాలు .. కాగితంమీద ఆకాశ గంగలా ఉరికి చేరాయి. మరో సారి మీకు ధన్యవాదాలు.

 21. Anonymous said...

  నేను కూడా మీరు చేసిన తప్పును చేసినవాడనే....నా దగ్గర కూడా వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పుస్తకాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడే నా ఇంజనీరింగు ముగించుకొని, ఇంకొన్నాళ్లలో ఒక ప్రముఖ సాఫ్టువేరు కంపెనీలో చేరబోయో నాకు, మీ టపాలోని విషయం చాలా ఉపయోగకరమైనదిగా భావిస్తున్నాను.

Post a Comment