స్టుపిడ్ ఒబామా - జీనియస్ ఒబామా

Posted by జీడిపప్పు

ఉన్నఫళంగా నన్ను ఎవరయినా "అమెరికాలో నీకు తెలిసిన అత్యంత మంచి వ్యక్తిని చూపించు" అంటే వెంటనే ఒక పోలీసును చూపిస్తాను. నా దృష్టిలో ఒక సగటు అమెరికన్ కాప్ కంటే మంచివాళ్ళు ఉండరు. వీరు మాట్లాడినంత మర్యాదగా, గౌరవంగా, పద్దతిగా పెద్ద పెద్ద చదువులు చదువుకున్న మేధావులు కూడా ఉండరేమో. ఎలాంటి ప్రమాదంలో ఉన్నా, ఏ సమస్య ఎదురయినా కాప్ కనిపిస్తే చాలు..భయపడనవసరం లేదు. పౌరులను రక్షించడానికి తమప్రాణాలు అడ్డు వేయడానికి క్షణకాలం కూడ తటపటాయించని సగటు అమెరికన్ పోలీసుల గురించి చాటభారతంలా ఎంతయినా చెప్పవచ్చు.

గతవారం మస్సాచూస్సెట్స్ లో కేంబ్రిడ్జ్ దగ్గర ఒక ఇంటి తలుపులను ఇద్దరు గట్టిగా నెట్టడం చూసిన ఒకావిడ వెంటనే పోలీసులకు ఫోన్ చేసింది. సంగతేమిటంటే, ముఖద్వారంలో ఆ తలుపు సరిగా పనిచేయకపోవడంతో వెనకనుండి ఇంట్లోకి వచ్చి ఇంటి ఓనరు అయిన హెన్రీ గేట్స్ అనే హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసరు తన డ్రైవరుతో కలసి దాన్ని నెట్టడం మొదలుపెట్టాడు. ఆమె ఫోన్ చేసిన వెంటనే పోలీసులు వచ్చి ప్రొఫెసరును బయట రమ్మన్నపుడు ఈ తలతిక్క ప్రొఫెసరు "నేను ఎందుకురావాలి, నల్లవాడిని కాబట్టి రావాలా? I'll speak with your mama (mother) outside" అంటూ పోలీసులు అడిగినవి చూపించకుండా గొడవకు దిగాడు. విధిలేని పరిస్థితుల్లో పోలీసులు ప్రొఫెసరును అరెస్టు చేసి నాలుగ్గంటలు జైల్లో పెట్టి విడుదల చేసారు.

బయటకు వచ్చాక వీడు కల్లు తాగిన కోతిలా "ఇది నల్లజాతి వాళ్ళ పట్ల వివక్ష" అంటూ చిందులేసి నానా హంగామా చేసాడు. ఈ సువర్ణావకాశాన్ని మీడియా బాగా ఉపయోగించుకొని వీడితో ఇంటర్వ్యూలు మొదలుపెట్టింది. నల్లజాతీయులకు అవమానం జరుగుతున్నదా అంటూ లేనిపోని విద్వేషాలను రెచ్చకొట్టడం మొదలుపెట్టింది. అరెస్టు చేసిన ఆఫీసరు జేమ్స్ తనకు క్షమాపణ చెప్పాలని వీడు చానెళ్ళలో గొడవ చేయడం మొదలుపెట్టాడు. మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న ఆఫీసర్ జేమ్స్ "తన డ్యూటీ తాను చేసాను ఏ తప్పూ చేయలేదు కాబట్టి క్షమాపణ చెప్పను" అన్నాడు.

ఇక్కడి వరకు మామూలుగా సాగుతున్న ఈ వివాదం ఒబామా ప్రవేశంతో ఇంకా రాజుకుంది. అమెరికా చరిత్రలో అత్యంత కీలక నిర్ణయమయిన హెల్త్ కేర్ గురించి సుమారు 52 నిమిషాలు అద్భుతంగా మాట్లాడిన ఒబామా, చివరి ఒక్క నిమిషంలో ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు మన సీయంలా "చట్టం తనపని తాను చేసుకుపోతుంది" అనడానికి బదులు "ఆ ప్రొఫెసరు నా ఫ్రెండ్ కూడా. నాకు పూర్తి వివరాలు తెలియదు కానీ Cambridge police acted stupidly " అన్నాడు. (ఒబామాను ఆ మాట అనకుండా ఆపడానికి జాన్ స్టీవర్ట్ చేసిన ప్రయత్నం @ 4:30)

ఇహ చూడాలి మీడియా మాయాజాలం! ఒబామా మాటలను మీడియా మాఫియా ఊదరగొట్టిన పుణ్యమా అని సామాన్య ప్రజలు మరుసటిరోజుకు "హెల్త్ కేరా? అంటే ఏంటి?" అనే స్థితికి వచ్చారు. నేను అప్పటివరకు పబ్లిక్ ప్లేసుల్లో ఇద్దరు అమెరికన్లు ఒక సామాజిక విషయం గురించి మాట్లాడుకోవడం వినలేదు కానీ మొదటిసారి ఒక స్టోర్లో ఇద్దరు ఈ విషయం గురించి మాట్లాడుతూ ఒబామా అలా అనకూడదు అన్నారు. అంతగా ప్రభావం చూపించింది ఒబామా స్టుపిడిటీ. చాలామంది విద్యావంతులయిన నల్లజాతీయులు కూడా ఒబామా తప్పు చేసాడన్నారు.

మరోవైపు దేశవ్యాప్తంగా పోలీసుల్లో అసంతృప్తి వ్యక్తమయింది. ఈ లోపు పోలీసులు అసలు జరిగినదేమిటో వివరించారు. పోలీసు తప్పు చేయలేదు అని గ్రహించిన ఒబామా ఆ పోలీసు ఆఫీసరుకు ఫోన్ చేసి మాట్లాడాడు. చిన్నవిషయం అనుకోకుండా పెద్దదయి వివాదంగా మారడానికి తాను ప్రధాన కారణమయ్యానని అంగీకరించి, ఈ వివాదాన్ని పక్కనపెట్టి దేశ సమస్యల గురించి ఆలోచిద్దాము అని చెప్పి ఎందుకు తనను "జీనియస్" అంటారో నిరూపించుకున్నాడు. ఆ పోలీసు ఆఫీసరును, ప్రొఫెసరును వైట్‌హౌసుకు రమ్మని ఆహ్వానించాడు. ప్రస్తుతానికి వివాదం సమసినట్లే.

పి.ఎస్: చాలమందికిలాగే నాక్కూడా ఈ ప్రొఫెసరు చేసినదానికి వాడిని నాల్రోజులు జైల్లో పెడితే బాగుంటుంది అనిపిస్తున్నది.

Who Moved My Cheese?

Posted by జీడిపప్పు

మార్పు అన్నది ఎంత సర్వసాధారణమో ఆ మార్పుకు అనుగుణంగా మన జీవన, ఆలోచనా విధానాలను మార్చుకోవడం అంత కష్టం. ముఖ్యంగా సుఖమయమయిన జీవనశైలికి అలవాటుపడినపుడు ఆ comfort zone నుండి బయటికి రావడానికి చాలామంది ఇష్టపడరు. దీనికి కారణం - ఒకవేళ బయటకు వస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కొనవలసి వస్తుందో అన్న భయాందోళనలు.

ఇది ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే, మొన్న ఈ పుస్తకాన్ని చదివాను. ఒకసారి గతాన్ని తరచి చూస్తే, దీని గురించి విన్నప్పటినుండి చదవడం వరకు నా ఆలోచనావిధానాల్లో కొన్ని "మార్పులు" ఉన్నాయి. ఐదేళ్ళ క్రితమే ఒక మిత్రుడు తప్పక చదవమని సూచించినపుడు "అబ్బే ఇలాంటి పుస్తకాల వల్ల ఉపయోగం ఉండదు" అని ఆ పుస్తకం సంగతి మరచిపోయాను. కొద్దికాలానికి ఇలాంటి పుస్తకాలపట్ల నా అభిప్రాయాన్ని "మార్చుకున్నాను". పుస్తకాల షాపుకు వెళ్ళినపుడల్లా ఈ పుస్తకం కనిపిస్తుంటే ఊరుకోలేక పేజీలు తిరగేసాను. ఏదో కథలా ఉండడంతో వద్దనుకొని కొనలేదు. ( ఏ మాటకామాటే చెప్పుకోవాలి, నాకు చీజ్ అంటే అస్సలు పడదు, టాం అండ్ జెర్రీ షోలో తప్ప!)

కొద్ది రోజుల క్రితం ఓ మిత్రుడితో మాట్లాడుతుంటే ఈ పుస్తకం ప్రస్తావన వచ్చింది. అన్వేషి లాంటివాడే ప్రస్తావించాడంటే తప్పక చదవవలసిందే అనుకొని ఈ పుస్తకం పట్ల నా అభిప్రాయాన్ని "మార్చు"కొని పుస్తకం చదివాను. ఈ పుస్తకం ఎలా ఉంది అంటే - స్వర్గం/నరకం నిర్ణయించే జంక్షన్లో నన్ను నిలబెట్టి దేవభటులు "నువ్వు చేసిన నూరు మంచి పనులు చెప్పు" అంటే అందులో "ఫలానా పుస్తకం చదివాను, చదవమని నా బ్లాగులో రాసాను" అని నూరులో ఒకటిగా చెప్తాను. చాలాకుంచెం అతిశయోక్తి అలంకార ప్రయోగం గావింపబడిననూ ఇది సత్యం!

పుస్తకంలోని విషయం ఎంత విలక్షణంగా ఉందో పుస్తకం కూడా అంత విలక్షణంగా ఉంది. మొత్తం నూరుపేజీలు కూడా లేదు. అందులో మొదటి పాతిక, చివరి ~20 పేజీలు పక్కన పెడితే "అసలు కథ" 50 పేజీలు ఉంటుంది. మధ్య మధ్యలో పేజి మొత్తానికీ "చీజ్" పైన ఒకే ఒక్క వాక్యం ఉంటుంది. ఆ మిగిలిన పేజీల్లో అయినా పేజినిండా అక్షరాలున్నాయా అంటే అదీ లేదు. కొన్ని పేజీల్లో దాదాపు సగ భాగం ఖాళీ! ఆ మిగిలిన కొద్దిపాటి స్థలంలో అక్షరలక్షలను పొందుపరచిన విధానం చూస్తే రచయితకు జోహార్లు అర్పించవలసిందే. చదవడం పూర్తిచేసాక కాస్త అర్థమవుతుంది, దశాబ్దం క్రితం సుమారు ఐదేళ్ళపాటు రాజ్యమేలిన ఈ పుస్తకం ఎందుకు 26 భాషల్లో రెండు కోట్ల ప్రతులకు పైగా అమ్ముడుపోయిందో.

చివరగా - e-పుస్తకాన్ని చదివిన ఓ వారం పది ముప్పై రోజుల్లో "శాశ్వత మార్పు" వస్తుందా అంటే, ఖచ్చితంగా రాదు. ఎందుకంటే - అది "మార్పు" కాబట్టి. మరి అలాంటపుడు ఎందుకు చదవాలి అంటే - ఒక ఆలోచనా బీజం వేయడానికి. ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను - చివరి పేజీ చదివి పుస్తకాన్ని మూసేస్తున్న తరుణంలో బాస్ ఫోన్ చేసి "నిన్ను ఈ క్షణమే ఉద్యోగం నుండి తీసేస్తున్నా" అనో లేదా ఫ్రెండ్ ఫోన్ చేసి "మనం డబ్బు దాచుకున్న బ్యాంకు దివాలా తీసింది, మనం అంతా పోగుట్టుకున్నాము" అనో అంటే, ఏమాత్రం తొణక్కుండా "ఓస్ అంతేనా" అంటారు!

ఆటోప్రకాష్‌కు కవితాభిషేకం

Posted by జీడిపప్పు

నాకు కవితల పట్ల పెద్దగా ఆసక్తి లేకపోయినా బ్లాగుల్లో కనపడే కవితలను అపుడపుడు చూస్తాను. మొన్నొకరోజు కవితలను చూస్తుంటే వేదన, రోదన, ఖేదన, మోదన, బాదనా కవితలు కనిపించాయి... ఒక్క ముక్కలో చెప్పాలంటే చాలావరకు "ఏడుపు కవితలే" కనిపించాయి. సాధారణంగా ఏదయినా కథల పోటీ అని ప్రకటించగానే "ఆర్ద్రత" కలిగిన ఏడుపు కథలను రాయడం రచయితల ఆనవాయితీ. అలా కొంపతీసి బ్లాగుల్లో కూడా కవితల పోటీ ఏమయినా నడుస్తున్నదా లేక నా పైన "గో గ్రీన్" స్లోగన్ ప్రభావమా అనిపించింది.

anyhow, ఈ వారం సాక్షి సండే స్పెషల్‌లో ఒక మహోన్నత వ్యక్తి గురించి చూసాను. వివరాలు: ఇక్కడ మరియు ఇక్కడ.  అసలు ఇలాంటి విషయం కవితావస్తువుగా పనికొస్తుందా రాదా అన్న సందేహమొచ్చి కొన్ని బ్లాగుల్లో "ఈ వార్త పైన కవిత వ్రాయ"మని కొందరిని కోరాను. వారు అందించిన ఆణిముత్యాలు:

ఆటో ప్రకాష్ 9948029294
ఈ ప్రపంచం దృష్టెపుడూ
పసిపాపలపైనే.
ప్రేమించటానికో లేక
వ్యాపారించటానికో.

అయితే ఇతని చూపు
పండు భారానికి వంగిన కొమ్మపై ఉంటుంది.
అందుకేనేమో
నిండుగర్భిణిని పాపాయిగా మార్చి
పొత్తిళ్లలో పొదువుకోగలడు.
మూలాలపై మమకారమే తప్ప
వ్యాపారముండదిక్కడ.

నెలలు నిండిన స్త్రీని చూస్తే
మగవాడికి భయమో, జలదరింపో!
బహుసా స్త్రీ ముందు తన
అస్థిత్వమేమిటో గుర్తొస్తుందేమో.
ఇతనికి మాత్రం
తన శైశవపు పెదవులనుండి
శబ్దిస్తూ విడిపోయిన తన తల్లి
చన్మొన జ్ఞప్తి కొస్తుందేమో.

కాన్పు కు సిద్దమయిన స్త్రీ నడుస్తూంటే
మృత్యువు, ప్రాణమూ
కలిసి తిరుగుతున్నట్లుంటుంది.

సృష్టిగాలులకు ప్రాణదీపం
రెపరెపలాడే ఆ రాత్రివేళ
మనిషికీ మనిషికీ మధ్య
నమ్మకపు పరిమళం ప్రవహిస్తుంది.
ఇతని మనిషితనం ముందు
మృత్యుదేవత తలదించుకొని
మౌనంగా నిష్క్రమిస్తుంది.

పుడమిలోతుల్లోంచి
మరో ఉదయం బయటపడింది.
దానిని తవ్వితీసిన తల్లి
పొడికనులు ఇతనిని తడిగా చూసిన
చూపుల భాషలోనే కదా
ఈ లోకపు కీర్తనలన్నీ వ్రాయబడ్డాయీ!

అంచులవరకూ నిండిన తృప్తితో
ఇతనూ వెనుతిరుగుతాడు
ఎప్పటిలానే!
- బొల్లోజు బాబా

ఆటో నడిపే దేముడు...
అమ్మ తనాన్ని అమ్మేవాళ్ళూ..
ఆ పిలుపుని పిండమప్పుడే నలిపేవాళ్ళూ..
అద్దెకడుపుల వేలంపాటలూ..
ఏడడుగులేసిన ఏడోరోజే చూరు అంచులకు చేర్చే వాళ్ళూ..
ఆకలి కేకల్లో ఆరాటమార్చుకునే వాళ్ళూ..

కకృతి కోరల కరాళ నృత్యం..
కాగితం చుట్టగా.. ముంగిట్లోకి..

మధ్య పేజీలో మరో ఉదయం..

కలికాలపు ప్రవాహంలో...
అడ్డుగా .. ఓ గడ్డి పరక.

తన బ్రతుకే ఎదురీత..
ఎన్ని కడుపుల భారాన్నో మోస్తూ
ఓ కాలుతున్న కడుపు..

ప్రతి క్షణమూ ప్రసవ వేదనే..
చెక్కిళ్ళపై ఆగని పురిటి స్నానాలే..

ఏడుకొండల మీడ హుండీలు నింపుతూ
ఏ గర్భ గుడిలోనో మనమెదికేవాడు
మూడు చక్రాల గుడిలో
నిండు గర్భాలు మోస్తూ
మన మధ్యనే తిరుగుతున్నాడు..

చెమరిన కళ్ళతో..
తన కాళ్ళకిదే కవితాభిషేకం.!
- ఆత్రేయ కొండూరు

మానవత్వపు ప్రతీక
ఈ ఆటో -
అమ్మతనానికి ఒక అడుగు ముందుంటుంది
మాతృత్వాన్ని వరంగా ఇస్తుంది
ఈ ఆటో పుణ్యమా అని
ఎందరో అమ్మలు పుట్టారు

తొమ్మిదినెలలు స్వప్నించిన మధురక్షణం
మరణమా? మనుగడా? అని ప్రశ్నిస్తే
ఇతని ఫోను మోగుతుంది
అంతే -
పుట్టుకకు మరణానికి మధ్య
తన ఆటో అడ్డం పెట్టేస్తాడు

తండ్రిలా చేరదీసి
అన్నలా ఆదరించి
అమ్మగా బతకమని ఆశీర్వదిస్తాడు

ఆశకు మూడు చక్రాలు తొడిగి
ఆశయమనే ఇంధనం కలిపాడేమో
ఈ నగరారణ్యంలో
ఎన్నో పసి నవ్వుల పువ్వుల పూయించాడు

ఇప్పుడు ప్రసవ వేదనంటే
జీవితానికి మరణానికి మధ్య ప్రశ్న కాదు
జీవం పోసే మంచితనానికి
మానవత్వపు ప్రతీక..!
- సత్యప్రసాద్ అరిపిరాల

పుడమి తల్లి గర్భాన్ని ఛేదించుకుని
ఉద్భవించబోతున్న బాలభానులకు
మూడు గుర్రాల రథానికి
సారథ్యం వహించే అనూరునివా ?
మానవత్వ పరిమళంతో ’ప్రకాశి‘స్తున్న
ఓ మానవతావాదీ ! నీకు నమో నమః
- చిలమకూరు విజయమోహన్ 

ఆ సూర్యప్రకాశమే నీలో.. ఆటో ప్రకాష్
చంటి పిల్లల ఏడుపులే తమ
వ్యాపారానికి పెట్టుబడిగా పెట్టేవాళ్ళు
కేర్ కేర్ అనే భాషకు
విలువకట్టి విపణి వీధిలో
కన్న కడుపలు వేలంవేసే వాళ్ళు

ఆక్రందనలతో తల్లడిల్లుతున్న
కాబోయే తల్లుల నిస్సహాయాన్ని
ఆసరా చేసుకుని చార్జీలు పెంచే
ఆటో వాళ్ళూ, ఇందరి మధ్యలో
వన్నెతగ్గని మానవత్వం
మూర్తివంతమైంది నీలో, ఇదెలా?

క్రౌంచ పక్షుల శోకం
నాడు వాల్మీకి హృదయాన్ని
తట్టి లేపినట్లు,
సతి వేదన నేడు నీలో
మంచితనపు చిగురు తొడిగింది
మానవత్వపు చాయలింకా మాసిపోలేదంది

తన కిరణాల కాంతిలో జగతిని
వెలిగించే ఆ సూప్రకాశమే నీలో
మళ్లీ కొత్తరూపు సంతరించుకుని
మరెందరి తల్లులకో కంటి
వెలుగు నిలుపుతోంది, "ఆటో ప్రకాష్"మై.

తగిలిన గోరంత దెబ్బకే
కొండంత ప్రతీకారంతో
ఎందరి బ్రతుకులనో కాలరాచే
అసురగణాల నడుమ
నిజంగా నువ్వు పాడింది సరికొత్త
జీవనగీతమే, అది ఎందరెందరికో
ఆచరణీయమైన పాఠమే

మనసుంటే మార్గముందని
మరో సారి చేసి చూపించిన
నేస్తమా, ఏ అక్షరాల మాల కూర్చి
నిన్ను నుతించను? అందుకే
శిరసు వంచి చేస్తున్నా వందనం
శ్రుతి

పేకాటో ప్రకాశ్ లెందరో! ”ఆటో ప్రకాశ్ “ మాత్రం ఒక్కడే!!
దాన కర్ణుడిలాగ కానవసరము లేదు!
నీ నిర్లక్ష్యపు చిల్లర ఖర్చులతొ క్షుదార్తి కడుపు నింపగ వచ్చు!!
శిభి చక్రవర్తిలా దేహమర్పించగనేల?
చిన్నారుల ముదుసలుల దారి కావలి దరి చేర్చగ వచ్చు!!
బలి చక్రవర్తిలా స్వీయ త్యాగంబేల?
వ్యసనాల మానేసి బీద విద్యార్థికి చేయూత గావచ్చు!!
బిల్గేట్స్ అంబానీలవొలె కోటికి పడగెత్త నవసరము లేదు!
చేతనైనంతలో సేవ చేయగ “వైజాగ్ ఆటోప్రకాశ్” లా అవతరించవచ్చు!!
మనసుండే చోటుకై మార్గమే ఉండదా?!
మానవత్వము తోటె ప్రతి బ్రతుకు పండదా!!!
- Rakhee


అటో ఇటో ఎటో అటు సీటు చోదకుడి పక్కనైన చాలు
ఎక్కి ఇరుక్కుని గమ్యం చేరగలం
ఆటో ఉన్నది ముగ్గురికే అనే రధకుడు మూడు తరాల వెనక సంగతి
రోడ్డు పక్క పురిళ్ళు, బెడ్డులివ్వని ఆస్పత్రులు
అయితేనేం ఆటోలో చోటు చూపి
అవసరమైతే అన్నవలె తోడుండి
వచ్చే కిరాయిని పరాయి చేసి
కలికితురాయిగా నిలిచి
సైకత తీరమున అడుగు వేయనున్న పసిపాపల ఆటలకై
తన ఆటోనే ప్రసవ స్థలము చేసి..
అది ఆటో కాదు కదిలే దేవాలయముగా మార్చి
ఆ దేవాలయమున పూజారియై నిలిచి
ప్రకాశమొందుచున్నావా ప్రకాశా
 -  మిరియాల శ్రీ సత్య భ్రమరార్జున ఫణి ప్రదీప్

ఇలాంటి పుస్తకాలే కొనాలి

Posted by జీడిపప్పు

రెండేళ్ళ క్రితం అనుకుంటాను, ఉన్నట్టుండి personality development వైపు గాలి మళ్ళి వెంటనే అందుకు అవసరమయిన వనరులు సేకరించడం మొదలుపెట్టాను. IT లో ఉండడం వల్ల అన్నిటికంటే ముఖ్యమయినది "పని చేసే విధానం" అని గ్రహించి ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, టైం మేనేజ్‌మెంట్, ప్రొఫెషనల్ బిహేవియర్ మొదలయిన విషయాలకు సంబంధించిన పుస్తకాలు దింపేసాను.

ఒక వారం రోజుల పాటు ఐదారు పుస్తకాలను బరబరా చదివేసి "హమ్మయ్యా, ఇక నుండి అన్నీ చాలా ఎఫిషియంట్ గా చేస్తాను. నాకు తిరుగు లేదు" అనుకున్నాను. ఓ రెండు మూడు వారాల తర్వాత నా పనితీరు, ఆఫీసు దినచర్యలను పరిశీలిస్తే ఏ మాత్రం మార్పు కనపడలేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. అప్పుడర్థమయింది ఈ పుస్తకాలు అన్నీ సోది చెప్పి డబ్బులు లాక్కోవడానికే కానీ పనికొచ్చేవి కాదు అని. అంతటితో అలాంటి పుస్తకాలు చదవడం మానేశాను.

చదవడం మానేసినా ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరు ఫలనా పుస్తకం చదివిన తర్వాత ఫలానా విషయంలో మార్పు కనిపించింది అన్నపుడల్లా మళ్ళీ అలాంటి పుస్తకాలు చదవాలనిపించేది. రెండో ప్రయత్నం లో ఎక్కువ పుస్తకాలు చదవకుండా Brian Tracy రాసిన Eat That Frog ఒక్కటే చదివాను. పుస్తకంలో చాలా చాలా మంచి విషయాలున్నాయి. ఓ రెండు వారాల తర్వాత చూసుకుంటే ఏమీ మార్పు లేదు, మళ్ళీ డాగ్ టెయిల్ కర్వీ!!

తర్వాత అర్థమయింది నేను చేస్తున్న తప్పిదమేమిటో. కొన్ని లక్షలమందిలో కాస్తో కూస్తో మార్పు తెచ్చిన ఈ పుస్తకాలు "నవలలు" కాదు ఏకబిగిన చదవడానికి. ప్రతి పుస్తకంలో కొన్ని పదుల/వందల సూచనలు, సలహాలు ఉంటాయి. రెండు గంటలు చదివితే ఆ మంచి లక్షణాలన్నీ మన దైనందిన జీవితంలో భాగమయిపోవు. కేవలం ఒక్క లక్షణాన్ని "అలవాటు"గా చేసుకొనేందుకే సగటున 40 రోజులు క్రమం తప్పకుండా సాధన చేయాలంట! నేనేమో రెండు గంటల్లో నూటపాతిక లక్షణాలను "అలవాటు చేసుకోవా"లనుకున్నాను.

ఇప్పటికయినా మించిపోయింది లేదని మళ్ళీ అదే పుస్తకంలో చెప్పిన ఒక సలహాను పాటించడం మొదలుపెట్టాను. ఒకరోజు పాటిస్తే మూడురోజుల పాటు మరచిపోయేవాడిని. రెండు-మూడు నెలలకు కాస్త గాడిలో పడ్డాను. సగటున 40 రోజుల్లో అలవాటు కావలసిన ఈ లక్షణం నాకు అలవాటు కావడానికి సుమారు ఆరు నెలలు పట్టింది! ఇప్పుడు ప్రతిరోజూ ఆఫీసుకు వచ్చిన తర్వాత చేసే మొట్టమొదటి పని "ఏ పనులు చేయాలి, ఏవి ముందు చేయాలి ఏవి తర్వాత చేయాలి, ఎలా చేయాలి" అని జాబితా వ్రాయడం. దీనివల్ల నిఝ్ఝంఘానే నా పనితీరు మొత్తం మారిపోయిందా అంటే well.. something is better than nothing!

మొదటిసారి ఇలాంటి పుస్తకాల పైన నమ్మకం కలిగిన తర్వాత కొన్ని విషయాలు బాగా అర్థమయ్యాయి. అవి: 1) ఈ పుస్తకాలు ఊహాజనితాలు కావు, కొందరు మేధావులు తమ జీవితకాల అనుభవాలను సరళమయిన రీతిలో అందరికీ అర్థమయ్యేలా, ఆచరింపగలిగేలా పుస్తకరూపంలో అందిస్తున్నారు. 2) ఇలాంటి పుస్తకాలనెపుడూ నవల చదివినట్టు ఏకబిగిన చదవకూడదు 3) ఒక్క పుస్తకంలోని సారాన్ని మొత్తం "అలవాటు" చేసుకోవడానికి జీవిత కాలం కూడా సరిపోకపోవచ్చు. 4) పొరపాటున కూడా "పెద్ద పుస్తకాలను" కొనకూడదు.

వీటన్నిటిలో అతి ముఖ్యమయినది నాలుగవది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే, పెద్ద పుస్తకం అంటే చాలా పేజీలుంటాయి.పేజీలు నింపడానికే అన్నట్టు విషయాన్ని సాగదీస్తూ చెప్తారు. చదవడానికి చాలా సమయం పట్టినా ఏమి చెబుతున్నారో అర్థం చేసుకోవడానికి మరింత సమయం పడుతుంది. అందుకే కాస్త రీసెర్చ్ చేసి చివరకు John C. Maxwell పుస్తకాలను కొనడం మొదలు పెట్టాను.

Maxwell పుస్తకాలనే ఎక్కువగా కొంటుండానికి అనేక కారణాలున్నాయి: ముఖ్యంగా పుస్తకాలు చాలా చిన్నవి. 100-150 పేజీలకు మించకుండా జేబులో పట్టే సైజులో లభిస్తాయి. చాలా మంచి క్వాలిటీ పేపరు, చూడగానే ఆకట్టుకొనే Hardcover అయినా పుస్తకాలు చాలా తేలికగా ఉంటాయి. పుస్తకాన్ని వీలయినన్ని చాప్టర్లుగా విడగొట్టి చెప్పాలనుకొన్న విషయాన్ని సూటిగా చెప్పడం. ధర పది డాలర్లు కావడం.

ఇప్పటివరకు అన్నీ చదవకపోయినా Maxwellవి ఆరు, ఇతర రచయితలవి మూడు పుస్తకాలు కొన్నాను. (అఫ్‌కోర్స్, రాబోవు పదేళ్ళకు 10-15 పుస్తకాలు సరిపోతాయన్ని సత్యాన్ని తెలుసుకున్నా కనుక ఇప్పుడే చదవకపోయినా కొనిపెడుతున్నాను.) చూడడానికి అన్నీ భలే ఉన్నాయి. అన్ని పుస్తకాలూ ఒకేసారి పట్టుకొని అరచేతిలో మినీ లైబ్రరీ చూసుకొని మురిపోతుంటా అప్పుడపుడు. Kindle కొనేవరకు అదో తుత్తి :)