తెలుగు బ్లాగుల పరిస్థితి - బాబోయ్ కూడలి.. వామ్మో మాలిక

Posted by జీడిపప్పు

ప్రతిమనిషికీ ఏదో ఒక బలహీనత ఉన్నట్టే వీలు దొరికినపుడల్లా తెలుగు బ్లాగుల సమాహారాలయిన కూడలి/మాలిక చూడడం నా బలహీనత అనుకుంటాను.  ఒకప్పుడు కూడలికి వస్తే ఎటు చూసినా ఆసక్తికరమయిన టపాలే స్వాగతం పలికేవి. అక్కడక్కడా పంటికింద రాయిలా కనిపించే కొన్ని 'వార్తల బ్లాగులను ' పెద్దగా పట్టించుకొనేవారు కాదు. కానీ ఇప్పుడు కూడలికి లేదా మాలికకు వస్తే 'తెలుగు బ్లాగులంటే ఇవా?' అని ముక్కు తీసి వేలు పైన వేసుకోవలసి వస్తోంది.  బ్లాగుల జాబితాలో సుమారు 70-80 శాతం కేవలం 'వార్తలు ' ఉండడం చూసి 'ఇదేమి ఖర్మ, బ్లాగులంటే ఇవేనా ' అనుకొని ఆ వార్తల మధ్య ఉన్న చదవగలిగే బ్లాగులను వెతుక్కోవాలంటే తలప్రాణం తోకకు వస్తోంది.  పోనీ నచ్చిన బ్లాగును add చేసుకుంటే సరిపోతుంది కదా అనుకుంటే, ముందుగా ఓ చక్కని బ్లాగు కనపడాలి కదా??!!!

ఇంకా వివరంగా చెప్పాలంటే, సమాహారాల్లో ఉన్న బ్లాగుల్లో అధికభాగం 'అసెంబ్లీలో తూలిపడ్డ మంత్రి ', 'ఈ సినిమా ఆడియో రేపు విడుదల ',  'అదేదో దేశంలో రోడ్డు ప్రమాదం ',  'నెల్లూరులో ఫలానా రోడ్డు మరమ్మత్తులకు పది లక్షలు మంజూరు ', ' జాతీయ అంతర్జాతీయ చెత్త ',  'వాయిదాపడ్డ పరీక్షలు '.  'రామానాయుడు స్టూడియోలో ఈ సిన్మా షూటింగ్ ',  'శ్రీశైలంలో తగ్గిన విద్యుత్ ఉత్పత్తి '...ఇలాంటివాటికి తోడు న్యూస్ పేపర్లలో వచ్చే చెత్తాచెదారాన్ని కూడా 'బ్లాగు పోస్టు ' గా పోస్టు చేసి ఎంతో విలువయిన సమాహారాల space ను తినేస్తుంటే చూడడం కష్టంగానూ కాస్తంత బాధగానూ ఉంది.

అవి ఉంటే ఏంటి నీ బాధ అంటారా? కొన్నేళ్ళ క్రితం 'మా వూరు రోడ్డుకు గుంత పడింది ' ' ఓ హీరోకు జలుబు చేసింది ' అంటూ ఒక్కో బ్లాగులో రోజుకు ఐదారు పోస్టులు వేస్తుంటే అది చూసి తట్టుకోలేక ఓ పోస్టు వేశాను. సదరు మహానుభావులు కాస్త దయతలచారు.  తమ ఊర్లో పడ్డ గుంత గురించి, అసెంబ్లీలో మంత్రి తూలిపడ్డం గురించి వ్రాస్తే అవి బ్లాగుల కిందికి రావా అని ప్రశ్నిస్తే,  బ్లాగు అంటే 'అభిప్రాయాలకు వేదిక. తన అభిప్రాయాలను తెలపడానికి ఒక సాధనం ' అని నమ్మినవాడిగా అలాంటి 'వార్తలు ' బ్లాగులు కాదు అని చెప్తాను.

కూడలి/మాలిక వంటి సమాహారాలను ఈ ''వార్తా బ్లాగులు" నింపివేయడం 'అభిప్రాయాలు తెలిపే, ఆసక్తికరమయిన బ్లాగుల ' మనుగడకే ముప్పు అనిపిస్తుంది. దీనికి ఒక ఉదాహరణ: ప్రస్తుతం కూడలిలో అప్పుడుపుడు కాసేపు కనిపిస్తున్న యరమణగారి (డాక్టరుగారి) బ్లాగును మొదటిసారి నేను చూసినప్పటికే చాలాపోస్టులున్నాయి.  ఆణిముత్యాల్లాంటి పోస్టులు చదువుతుంటే "ఇంతకాలం ఈ బ్లాగు ఎలా మిసయ్యానబ్బా... కూడలి, మాలికలు తరచూ చూస్తుంటానే" అనుకుని చించగా చించగా అర్థమయిందేమిటంటే - ఒక మంచి బ్లాగు కూడలిలో ఎంతసేపు ఉంటుంది అన్నది ఈ 'వార్తా బ్లాగుల ' దయపైన ఆధారపడి ఉంటుంది.  ఇవి తలుచుకుంటే ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురు చూసే క్రిష్ణ ప్రియ గారి కబుర్లు కొద్ది గంటల్లో కూడలి/మాలిక నుండి అదృశ్యమయిపోతాయి. మనసులోమాట సుజాత గారు వ్రాసే చక్కని పుస్తకాల రివ్యూలు కొందమంది పుస్తకప్రియులకే కనిపిస్తాయి.  చదువరిగారి సమగ్ర విశ్లేషణలను ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాయి!!!! (ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. ఇప్పటికీ సజీవంగా ఉన్న మరి కొన్ని బ్లాగుల పరిస్థితి కూడా ఇంతే!)

ఇప్పటికయినా కూడలి/మాలిక/హారం నిర్వాహకులు కాస్త దయతలచాలి. ఒకప్పుడు చక్కని బ్లాగులతో కళకళలాడిన తెలుగు బ్లాగు సమాహారాలు ఇప్పుడు కేవలం 'వారా కూడళ్ళు ' గా మిగిలిపోతున్నాయి. పత్రికల్లో కూడా తెలుగు బ్లాగుల గురించి ఘనంగా వ్రాస్తున్నారు. ఒక సగటు పాఠకుడు 'ఈ బ్లాగుల సంగతి చూద్దాం ' అనుకొని కూడలికో మాలికకో వచ్చి చూస్తే 'చదివించగలిగే బ్లాగులు ' పట్టుమని పది కూడా కనపడక "ఓస్ ఓస్ ఈ మాత్రం కాపీ పేస్ట్ నేను చేయలేనా, నాలుగు ఫుత్వాలు పోస్టు చెయ్యలేనా" అనుకుంటాడు.

ఇప్పటికే కొందరు బ్లాగరులు తమకు నచ్చిన బ్లాగులను add చేసుకొని అవి చదువుకుంటున్నారు తప్ప కూడలి/మాలిక/హారం కు రావాలంటే బెంబేలెత్తిపోతున్నారు. (మొన్న రమణగారి బ్లాగులో నా కామెంటుకు డాక్టరుగారు 'ఈ మధ్య కూడలి చూడడం మానుకున్నాను ' అని ఇచ్చిన ప్రత్యుత్తరమే ఈ పోస్టుకు ప్రేరణ)  అంతమాత్రాన నేను ఈ వార్తాబ్లాగులను తొలగించమని చెప్పడం లేదు. కొందరికి అవి ఎంతో విలువయిన సమాచారాన్ని అందిస్తుండవచ్చు. అందుకే ఇవన్నీ 'వార్తల సెక్షన్లో మాత్రమె ' కనపడేలా చేసి 'అభిప్రాయాలు, ఆలోచనలను ' తెలిపే బ్లాగులను మీ వెబ్‌సైట్ ప్రధాన పేజీలో పెడితే తెలుగు బ్లాగులకు మరింత ఉపకారం చేసినవారవుతారు. కాస్తంత సమయాన్ని వెచ్చించి బ్లాగులను వర్గాలుగా విభజించమని విన్నపం.

పాఠకులారా, నేను మోతాదును మించి స్పందించానేమో, బహుశా నాకు మాత్రమే ఈ "వార్తల బ్లాగులు" ఎక్కువ కనిపిస్తున్నాయేమో తెలియడం లేదు.  నా అభిప్రాయాలతో మీరు ఏకీభవిస్తే (ద్వికీభవించినా పర్లేదు!) మీ అభిప్రాయాలను కూడా పంచుకోండి.