ఎమ్మెల్యే జయప్రకాష్ నారాయణ Status Report - Aug 09
Posted by జీడిపప్పు
ఇక Status Report సంగతికొస్తే - 31 రోజులున్న గత నెలలో శెలవు రోజులు పక్కన పెడితే రోజుకొక్క task చొప్పున చేసినా కనీసం 25 tasks ఉండాలి. తెలిసిన వివరాల ప్రకారం గత నెల స్టేటస్ రిపోర్ట్:
సంగ్రహం
ప్రజలనుండి స్వీకరించిన మొత్తం సమస్యలు: 0
పరిష్కరించిన సమస్యలు: 0
పురోగతిలో ఉన్న సమస్యలు: 0
మిగిలినవి: 0
వివరాలు
వైద్యరంగం
1) తనిఖీ చేసిన ఆస్పత్రులు: 0
2) పరిష్కరించిన సమస్యలు: 0
3) ఇతర అభివృద్ది కార్యక్రమాలు: 0
విద్యారంగం
1) తనిఖీ చేసిన పాఠశాలలు: 0
2) పరిష్కరించిన సమస్యలు: 0
3) ఇతర అభివృద్ది కార్యక్రమాలు: 0
ఇతరములు
1) పర్యటించిన మురికివాడలు: 0
2) పరిష్కరించిన మంచి నీటి సమస్యలు: 0
3) తనిఖీ చేసిన చౌక దుకాణాలు: 0
4) తనిఖీ చేసిన ప్రభుత్వ కార్యాలయాలు: 0
5) అవినీతి అధికారుల పైన తీసుకున్న చర్యలు: 0
6) అవినీతిని నిరోధించుటకు చేసిన ప్రయత్నాలు: 0
పత్రికలు చేయలేని పనిని బాధ్యతగల పౌరులుగా మనము చేసి ప్రతినెలా మొదటివారంలో గతనెల జేపీగారు చేసిన పనుల వివరాలను ఈ స్టేటస్ రిపోర్ట్ రూపంలో తెలుసుకుంటూ అందరికీ తెలియజేద్దాము.
శెలవు తీసుకున్న సింహం
Posted by జీడిపప్పు
టెడ్ కెన్నెడీ, జాన్ ఎఫ్. కెన్నెడీ, రాబర్ట్ కెన్నెడీ
JFK చెప్పిన America is a nation of immigrants అన్న మాటలను గుర్తించుకొని తన ఆఫీసులో తన పూర్వీకుల స్వస్థలం ఫోటో పెట్టుకున్న టెడ్ కెన్నెడీ ఇమ్మిగ్రేషన్ చట్టాలను సవరించి వలస వచ్చే వారికి సమాన సౌకర్యాలు కల్పించడంలో ప్రముఖ పాత్ర వహించాడు. తన పెద్ద అక్క రోజ్‌మేరీ మానసికంగా ఎదగక జీవితాంతం కుటుంబానికి దూరంగా ఉండవలసి రావడం చూసిన టెడ్ ఆ తర్వాత మూడో అక్క యునీస్ కెన్నెడీతో (ఈమె రెండువారాల క్రితం మరణించింది) కలసి మానసిక, శారీరక వికలాంగులకోసం ఎన్నో సంస్కరణలు చేసాడు. ప్రపంచ వికలాంగుల ఒలింపిక్స్ అందులో ప్రముఖమయినది. ఈ రోజు అమెరికాలో దాదాపు ప్రతికుటుంబంలో ఎవరో ఒకరు టెడ్ కెన్నెడీ కృషి వల్ల minimum wage, education reforms, health care రంగాల్లో లబ్ది పొందుతున్నారు.
జాన్ ఎఫ్ కెన్నెడీ మేధావితనాన్ని, రాబర్ట్ కెన్నెడీ ఆచరణను పుణికిపుచ్చుకున్న టెడ్ సభలో మాట్లాడే తీరువల్ల Lion of the senate అని పేరు తెచ్చుకున్నాడు. తన "జీవిత లక్ష్యం" గా టెడ్ కెన్నెడీ చెప్పుకొనే Universal health care అమలు కాకముందే 77 ఏళ్ళ వయసులో బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడలేక ఆగస్టు 25 న నిష్క్రమించి Arlington National Cemeteryలో తన అన్నలిద్దరి దగ్గర శాశ్వత విశ్రాంతి కోసం సిద్దమవుతున్నాడు.
టెడ్ కెన్నెడీ ఫోటో గ్యాలరీ
ఈమెయిల్ గోలలు
Posted by జీడిపప్పు
అడుక్కునే వాళ్ళు: ఒక వ్యక్తిని ఉద్దేశించి రాసిన మెయిలులో ఒకటికంటే ఎక్కువ "ప్లీజ్"లు ఉంటే, ఆ రాసినవారు "అడుక్కునే" వారి జాబితాలోకి వస్తారు. ఈమెయిల్ రాస్తున్నది ఏదో దానమో ధర్మమో చేయమని కాదు, ఆఫీసు పని మీద. ఇది పట్టించుకోకుండా కొందరు ఒకే మెయిల్‌లో "ప్లీజ్ ఈ పని చెయ్యి, ప్లీజ్ ఆ పని చెయ్యి, నీకు ఏమయినా డౌట్లుంటే చెప్పు ప్లీజ్" అని ప్లీజుతుంటారు. ఇది చూసినపుడు నాకు (మాదాల రంగారావు స్టోన్‌తో) "ఒరే అయ్యా, ఏమిటా అడుక్కోవడం? ఇది బస్టాండు కాదు, ఆఫీసు. కాస్త డిగ్నిఫైడ్ గా ఉండాలి" అని చెప్పాలనిపిస్తుంది.
ఫుల్‌స్టాపర్లు: ఒకప్పుడు మెసేజ్‌లో ఎన్ని తప్పులున్నా పెద్దగా పట్టించుకోకుండా చివరలో నా పేరు పక్కన మాత్రం ఠంచనుగా ఫుల్‌స్టాప్ పెట్టేవాడిని. అసలు బుర్ర ఉన్నోడెవడయినా పేరు పక్కన ఫుల్‌స్టాప్ పెడతాడా? ఒకసారంటే పర్లేదు కానీ కొన్ని వందల మెయిల్లలో ఎవరి పేరు చివరా ఫుల్‌స్టాప్ లేదని గమనించి అయినా ఆ తప్పు సరిదిద్దుకోవచ్చు కదా!
బొమ్మలోళ్ళు: ఒక ఎర్రర్ వచ్చినపుడు లేదా ఒక డౌట్ ఉన్నపుడు వీలయినంతవరకు ఆ వివరాలను మాటలరూపంలో చెప్పి అవసరమయిన చోట స్క్రీన్‌షాట్ తీసి ఈమెయిలుకు అటాచ్ చెయ్యాలి. కానీ కొందరు అలా కాదు. ప్రింట్ స్క్రీన్ ఒకటుంది కదా అని అవసరం లేని చోట కూడా ప్రతి చిన్న విషయానికి బొమ్మలు తీస్తారు. పోనీ ఆ బొమ్మలు jpeg లో ఉంటాయా అంటే అదీ కాదు, bmp ఫార్మాట్‌లో. ఒక్కోటి ఒక MB తింటుంది. jpeg లో సేవ్ చెయ్యవచ్చుగా? ఈ బొమ్మలను అటాచ్ చేసి దేశమంతా మెయిల్ కొడితే అవతలోడు ఆ బొమ్మలను అలాగే ఉంచి దానికి మళ్ళీ రిప్లై కొడతాడు. ఇహ చూస్కో నా సామి రంగా. మరుసటి రోజు ఆఫీసుకు వచ్చేసరికి ఆ మొదటి మెయిలుకు రిప్లైల మీద రిప్లైలు ఉంటాయి, ప్రతి రిప్లై లో ఆ భారీ అటాచ్‌మెంట్ తో సహా. ఆ దెబ్బకు ఇన్‌బాక్స్ సైజు పొర్లిపోయి చేతులెత్తేయడంతో పనికొచ్చే మెయిల్స్ కూడా రావు!
కృతఘ్నులు: తమకు అవసరమయినపుడు కొందరు తెగ మెయిల్స్ కొడతారు, అది కూడా కాపీ టు సీయం - కాపీ టు పీయం అంటూ కంపెనీకంతా. పని పూర్తి అయిన తర్వాత మాత్రం కనీసం థేంక్యూ అని కూడా చెప్పరు. నిజమే, ఆ పని చేయడమే నా డ్యూటీ అందుకే నేను జీతం తీసుకుంటున్నాను కాబట్టి నాకు థేంక్యూ చెప్పనవసరం లేదు. అయితే కార్పొరేట్ ప్రపంచంలో అత్యంత ప్రభావిత పదాలలో "థేంక్యూ" "గుడ్‌జాబ్" కూడా ఉన్నాయని చాలామంది గ్రహించరు. ఈ విషయాన్ని గ్రహించినవారే తమ పనులను సులువుగా చేయించుకోగలుగుతారు.
చాటభారతగాళ్ళు: ఏదయినా ఒక విషయం చెప్పేటపుడు KISS ఫార్ములా అవలంబించాలి. అంటే కీప్ ఇట్ సింపుల్ అండ్ స్ట్రెయిట్ (దీనినే కొందరు కీపి ఇట్ సింపుల్, స్టుపిడ్ అంటారు). రెండు లైన్లలో చెప్పగలిగిన విషయాన్ని రెండు పేరాల్లో సాగదీస్తారు కొందరు. ఈ చాటభారతానికి ఇంకో చాభా "నువ్వు చెప్పిన పని చేసాను. అంతా బాగయింది. ఎక్కడా ఇబ్బంది లేదు.." అంటూ మొదటి మెయిల్లోని చాభాని ఉటంకిస్తూ రిప్లై ఇస్తాడు. ఆ చెప్పేదేదో రెండు ముక్కల్లో "ఆల్ సెట్" అనో "డన్" అనో చెప్పచ్చుగా. ఒక్కో చాటభారతంవల్ల సగటున ఒక వ్యక్తికి 2-3 నిమిషాల సమయం వృధా. ఆ లెక్కన మూడు టీములవాళ్ళకు కలిపి ఆ ఒక్క మెయిల్ వల్ల ఒక గంట సమయం వృధా అవుతుందన్నమాట!
చివరగా - నాలో నాకు నచ్చే చాలా లక్షణాల్లో ఒకటి "ఆఫీసులో ఇంకొకరిని ఇబ్బంది పెట్టకపోవడం". ఈ ఉద్యోగంలో ఎన్ని రోజులుంటామో తెలియదు. ఎవరెవరో వస్తుంటారు పోతుంటారు. అంతమాత్రానికి ఆఫీసులో ఉన్నవాళ్ళతో గొడవలకు దిగడం లేదా ఇబ్బంది పెట్టడం చాలా తెలివితక్కువతనం. ఒకరిని ఇబ్బంది పెట్టి సాధించేది ఏమీ ఉండదు. మంచిపేరు తెచ్చుకుంటే అది భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడుతుంది, అసలే మనము "గ్లోబల్ విలేజ్" లో ఉంటున్నామాయె. ఇవన్నీ తెలిసినా అవకాశం వస్తే ఒకడికి చుక్కలు చూపించాలనుకుంటున్నా. ఎందుకంటే, వాడు దేశమంతా కొట్టే మెయిల్స్ లో కూడా SMS లాగ్వేజ్ "u" "c" "ty" వాడుతుంటాడు. వీడికి ఎలాంటి గుణపాఠం నేర్పించాలంటే, జీవితంలో మళ్ళీ ఛాటింగులో కూడా SMS భాష వాడకూడదు. ఎప్పుడొస్తుందో ఎలా వస్తుందో ఆ అవకాశం!


