శెలవు తీసుకున్న సింహం

Posted by జీడిపప్పు

47 ఏళ్ళ పాటు సెనేటర్ గా దేశానికి ఎనలేని సేవలు అందించిన టెడ్ కెన్నెడీ మరణంతో అమెరికా రాజయకీయ రంగంలో ఒక సువర్ణాధ్యాయం ముగిసింది. జాన్ ఎఫ్ కెన్నెడీ, రాబర్ట్ కెన్నెడీ ల హత్య ల తర్వాత కెన్నెడీ కుటుంబ శకం ముగిసిపోయే తరుణంలో కుటుంబ బాధ్యతలను తీసుకున్న టెడ్ కెన్నెడీ కేవలం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తన అన్నలిద్దరి ఆశయాల సాధనకు కృషి చేసాడు.

 
టెడ్ కెన్నెడీ, జాన్ ఎఫ్. కెన్నెడీ, రాబర్ట్ కెన్నెడీ


JFK చెప్పిన America is a nation of immigrants అన్న మాటలను గుర్తించుకొని తన ఆఫీసులో తన పూర్వీకుల స్వస్థలం ఫోటో పెట్టుకున్న టెడ్ కెన్నెడీ ఇమ్మిగ్రేషన్ చట్టాలను సవరించి వలస వచ్చే వారికి సమాన సౌకర్యాలు కల్పించడంలో ప్రముఖ పాత్ర వహించాడు. తన పెద్ద అక్క రోజ్‌మేరీ మానసికంగా ఎదగక జీవితాంతం కుటుంబానికి దూరంగా ఉండవలసి రావడం చూసిన టెడ్ ఆ తర్వాత మూడో అక్క యునీస్ కెన్నెడీతో (ఈమె రెండువారాల క్రితం మరణించింది) కలసి మానసిక, శారీరక వికలాంగులకోసం ఎన్నో సంస్కరణలు చేసాడు. ప్రపంచ వికలాంగుల ఒలింపిక్స్ అందులో ప్రముఖమయినది. ఈ రోజు అమెరికాలో దాదాపు ప్రతికుటుంబంలో ఎవరో ఒకరు టెడ్ కెన్నెడీ కృషి వల్ల minimum wage, education reforms, health care రంగాల్లో లబ్ది పొందుతున్నారు.

జాన్ ఎఫ్ కెన్నెడీ మేధావితనాన్ని, రాబర్ట్ కెన్నెడీ ఆచరణను పుణికిపుచ్చుకున్న టెడ్ సభలో మాట్లాడే తీరువల్ల Lion of the senate అని పేరు తెచ్చుకున్నాడు. తన "జీవిత లక్ష్యం" గా టెడ్ కెన్నెడీ చెప్పుకొనే Universal health care అమలు కాకముందే 77 ఏళ్ళ వయసులో బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడలేక ఆగస్టు 25 న నిష్క్రమించి Arlington National Cemeteryలో తన అన్నలిద్దరి దగ్గర శాశ్వత విశ్రాంతి కోసం సిద్దమవుతున్నాడు.

టెడ్ కెన్నెడీ ఫోటో గ్యాలరీ

ఈమెయిల్ గోలలు

Posted by జీడిపప్పు

ఐటీ ఉద్యోగులకు ఉండవలసిన అత్యంత కీలక లక్షణాలలో ఒకటి ఈమెయిల్స్ వ్రాయడం. కొందరి మెయిల్స్ చదువుతుంటే "ఆహా ఎంత బాగా చెప్పారు" అనిపిస్తుంది, ఇంకొందరి మెయిల్స్ చదువుతుంటే "ఎవడ్రా బాబూ వీడు చావగొడుతున్నాడు" అనిపిస్తుంది. రెండో విషయంలో ఇప్పటివరకు నేను చూసిన/చెందిన/చూస్తున్న కొన్ని వర్గాలు:

అడుక్కునే వాళ్ళు: ఒక వ్యక్తిని ఉద్దేశించి రాసిన మెయిలులో ఒకటికంటే ఎక్కువ "ప్లీజ్"లు ఉంటే, ఆ రాసినవారు "అడుక్కునే" వారి జాబితాలోకి వస్తారు. ఈమెయిల్ రాస్తున్నది ఏదో దానమో ధర్మమో చేయమని కాదు, ఆఫీసు పని మీద. ఇది పట్టించుకోకుండా  కొందరు ఒకే మెయిల్‌లో "ప్లీజ్ ఈ పని చెయ్యి, ప్లీజ్ ఆ పని చెయ్యి, నీకు ఏమయినా డౌట్లుంటే చెప్పు ప్లీజ్" అని ప్లీజుతుంటారు. ఇది చూసినపుడు నాకు (మాదాల రంగారావు స్టోన్‌తో) "ఒరే అయ్యా, ఏమిటా అడుక్కోవడం? ఇది బస్టాండు కాదు, ఆఫీసు. కాస్త డిగ్నిఫైడ్ గా ఉండాలి" అని చెప్పాలనిపిస్తుంది.

ఫుల్‌స్టాపర్లు: ఒకప్పుడు మెసేజ్‌లో ఎన్ని తప్పులున్నా పెద్దగా పట్టించుకోకుండా చివరలో నా పేరు పక్కన మాత్రం ఠంచనుగా ఫుల్‌స్టాప్ పెట్టేవాడిని. అసలు బుర్ర ఉన్నోడెవడయినా పేరు పక్కన ఫుల్‌స్టాప్ పెడతాడా? ఒకసారంటే పర్లేదు కానీ కొన్ని వందల మెయిల్లలో ఎవరి పేరు చివరా ఫుల్‌స్టాప్ లేదని గమనించి అయినా ఆ తప్పు సరిదిద్దుకోవచ్చు కదా!

బొమ్మలోళ్ళు: ఒక ఎర్రర్ వచ్చినపుడు లేదా ఒక డౌట్ ఉన్నపుడు వీలయినంతవరకు ఆ వివరాలను మాటలరూపంలో చెప్పి అవసరమయిన చోట స్క్రీన్‌షాట్ తీసి ఈమెయిలుకు అటాచ్ చెయ్యాలి. కానీ కొందరు అలా కాదు. ప్రింట్ స్క్రీన్ ఒకటుంది కదా అని అవసరం లేని చోట కూడా ప్రతి చిన్న విషయానికి బొమ్మలు తీస్తారు. పోనీ ఆ బొమ్మలు jpeg లో ఉంటాయా అంటే అదీ కాదు, bmp ఫార్మాట్‌లో. ఒక్కోటి ఒక MB తింటుంది. jpeg లో సేవ్ చెయ్యవచ్చుగా? ఈ బొమ్మలను అటాచ్ చేసి దేశమంతా మెయిల్ కొడితే అవతలోడు ఆ బొమ్మలను అలాగే ఉంచి దానికి మళ్ళీ రిప్లై కొడతాడు. ఇహ చూస్కో నా సామి రంగా. మరుసటి రోజు ఆఫీసుకు వచ్చేసరికి ఆ మొదటి మెయిలుకు రిప్లైల మీద రిప్లైలు ఉంటాయి, ప్రతి రిప్లై లో ఆ భారీ అటాచ్‌మెంట్ తో సహా. ఆ దెబ్బకు ఇన్‌బాక్స్ సైజు పొర్లిపోయి చేతులెత్తేయడంతో పనికొచ్చే మెయిల్స్ కూడా రావు!

కృతఘ్నులు:
తమకు అవసరమయినపుడు కొందరు తెగ మెయిల్స్ కొడతారు, అది కూడా కాపీ టు సీయం - కాపీ టు పీయం అంటూ కంపెనీకంతా. పని పూర్తి అయిన తర్వాత మాత్రం కనీసం థేంక్యూ అని కూడా చెప్పరు. నిజమే, ఆ పని చేయడమే నా డ్యూటీ అందుకే నేను జీతం తీసుకుంటున్నాను కాబట్టి నాకు థేంక్యూ చెప్పనవసరం లేదు. అయితే కార్పొరేట్ ప్రపంచంలో అత్యంత ప్రభావిత పదాలలో "థేంక్యూ" "గుడ్‌జాబ్" కూడా ఉన్నాయని చాలామంది గ్రహించరు. ఈ విషయాన్ని గ్రహించినవారే తమ పనులను సులువుగా చేయించుకోగలుగుతారు.

చాటభారతగాళ్ళు: ఏదయినా ఒక విషయం చెప్పేటపుడు KISS ఫార్ములా అవలంబించాలి. అంటే కీప్ ఇట్ సింపుల్ అండ్ స్ట్రెయిట్ (దీనినే కొందరు కీపి ఇట్ సింపుల్, స్టుపిడ్ అంటారు). రెండు లైన్లలో చెప్పగలిగిన విషయాన్ని రెండు పేరాల్లో సాగదీస్తారు కొందరు. ఈ చాటభారతానికి ఇంకో చాభా "నువ్వు చెప్పిన పని చేసాను. అంతా బాగయింది. ఎక్కడా ఇబ్బంది లేదు.." అంటూ మొదటి మెయిల్లోని చాభాని ఉటంకిస్తూ రిప్లై ఇస్తాడు. ఆ చెప్పేదేదో రెండు ముక్కల్లో "ఆల్ సెట్" అనో "డన్" అనో చెప్పచ్చుగా. ఒక్కో చాటభారతంవల్ల సగటున ఒక వ్యక్తికి 2-3 నిమిషాల సమయం వృధా. ఆ లెక్కన మూడు టీములవాళ్ళకు కలిపి ఆ ఒక్క మెయిల్ వల్ల ఒక గంట సమయం వృధా అవుతుందన్నమాట!

చివరగా - నాలో నాకు నచ్చే చాలా లక్షణాల్లో ఒకటి "ఆఫీసులో ఇంకొకరిని ఇబ్బంది పెట్టకపోవడం". ఈ ఉద్యోగంలో ఎన్ని రోజులుంటామో తెలియదు. ఎవరెవరో వస్తుంటారు పోతుంటారు. అంతమాత్రానికి ఆఫీసులో ఉన్నవాళ్ళతో గొడవలకు దిగడం లేదా ఇబ్బంది పెట్టడం చాలా తెలివితక్కువతనం. ఒకరిని ఇబ్బంది పెట్టి సాధించేది ఏమీ ఉండదు. మంచిపేరు తెచ్చుకుంటే అది భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడుతుంది, అసలే మనము "గ్లోబల్ విలేజ్" లో ఉంటున్నామాయె. ఇవన్నీ తెలిసినా అవకాశం వస్తే ఒకడికి చుక్కలు చూపించాలనుకుంటున్నా. ఎందుకంటే, వాడు దేశమంతా కొట్టే మెయిల్స్ లో కూడా SMS లాగ్వేజ్ "u" "c" "ty" వాడుతుంటాడు. వీడికి ఎలాంటి గుణపాఠం నేర్పించాలంటే, జీవితంలో మళ్ళీ ఛాటింగులో కూడా SMS భాష వాడకూడదు. ఎప్పుడొస్తుందో ఎలా వస్తుందో ఆ అవకాశం!

మెడికల్ మాఫియా

Posted by జీడిపప్పు

ఇండియాలో అవినీతిని చూసి ఒకప్పుడు చాలా ఆగ్రహావేశాలకు లోనయ్యేవాడిని. ఆ తర్వాత నా పంథా మార్చుకొని "సగటు భారతీయుడి"గా ఆలోచించడం మొదలుపెట్టాక అవినీతిని గురించిన వార్తలు చూసినప్పటికీ ఏమీ అనిపించేది కాదు. తర్వాత అమెరికాలో ఎదురయిన కొన్ని అనుభవాల వల్ల "ఆహా ఏమి నా అదృష్టం! లంచం ఇవ్వకుండా అన్ని పనులు జరిగిపోతున్నాయి. అమెరికాలో అవినీతే లేదు." అనుకొనేవాడిని. (ఇంట్లో ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వడానికి వచ్చినవాడికి "మామూలు" ఇవ్వడానికి 5 డాలర్లు పక్కన పెట్టుకున్నాము. వాడి పని పూర్తి అయిన తర్వాత "నేను చెప్పిన టైం కంటే రెండు గంటలు లేటుగా వచ్చాను కాబట్టి ఇన్స్టలేషన్ ఫీజ్ కట్టనక్కర్లేదు" అంటూ బ్రతిమాలుకున్నా ఐదు డాలర్లు తీసుకోకుండా వెళ్ళిపోయాడు.)

కొంత కాలానికి అర్థమయినదేమిటంటే, అమెరికాలో కూడా అవినీతి ఉంది. కాకపోతే ఇండియాలో సగటు మనిషిముందు చెయ్యి చాపి "నాకేంటి? అహా నాకేంటని" అంటారు. అమెరికాలో అలా కాకుండా అంతా సైలెంటుగా భారీ ఎత్తున జరిగిపోతుంది. సామాన్య పౌరులు లంచం ఇవ్వవలసిన పరిస్థితి ఎప్పుడూ రాదు. మనవాళ్ళలా పాతికకో పరకకో కాకుండా అమెరికన్ అవినీతిపరులు కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలన్నట్టు వీలయినంతవరకు మేడాఫ్ తరహాలో బిలియన్లకు లేదా మిలియన్లకు గురిపెడతారు. ఇండియాలో పదిమంది అవినీతిపరులు ఉంటే అమెరికాలో ఒకరిద్దరు ఉంటారు అంతే. అయితే ఈ ఒకరిద్దరి అవినీతి స్థాయి, క్రూరత్వం ముందు ఆ పదిమంది దిగదుడుపే అనిపిస్తుంది నాకు. వీళ్ళు ఎంత తెలివిగా అవినీతి చేస్తారో, ఏ స్థాయిలో చేస్తారో తెలుసుకోవడానికొక ఉదాహరణ:

ఈ రోజు మెడికల్ మాఫియా అన్న హెడ్డింగ్ చూడగానే "ఎవడో డాక్టరు ఇన్సూరెన్స్ ఏజంటుతో కలసి మోసం చేస్తున్నాడు" అనుకొని చదువుతుంటే మతిపోయింది. ఒకామెకు చిన్న కారు యాక్సిడెంటువల్ల వెన్నునొప్పి రావడంతో తెలిసిన ఫ్రెండుకు చెప్పింది "లీగల్ గా వెళ్తే ఇన్సూరెన్స్ కవర్ చేయదు కాబట్టి ఏదయినా సలహా కావాల"ని. కాసేపటికి ఇంకో వ్యక్తి ఫోన్ చేసి ఏమీ భయపడనవసరం లేదు, అన్నీ మేము చూసుకుంటాము. కాకపోతే ఫలనా వ్యక్తి సాయం చేసాడని ఎవరికీ చెప్పకు" అని కారును గుద్దినవాడి వివరాలు తీసుకున్నాడు.

ఆరువారాలపాటు నగరంలోని పెద్ద పెద్ద డాక్టర్లు ఆమెకు వైద్యం చేసారు. పెద్ద లాయరు వచ్చి వివరాలు తెలుసుకున్నాడు. వీటన్నిటికీ ఆమె ఒక్క సెంటు కూడా చెల్లించలేదు! ఆమె వైద్యానికి అయిన బిల్లు అంటూ ఆమె కారును గుద్దినవాడికి $200,000 బిల్లు పంపించారు. అసలు కథ అప్పుడే మొదలయింది.

ఆమె కారును గుద్దినది సాధారణ వ్యక్తి కాదు, ఒక ఫెడరల్ ప్రాసిక్యూటర్! ఒక చిన్న యాక్సిడెంటుకు అంతమంది డాక్టర్లు, అన్ని బిల్లులా అని అనుమానమొచ్చి FBI సహాయంతో తీగలాగాడు. సంగతేమిటంతే ట్రీట్‌మెంట్ ఇచ్చే డాక్టర్లు, వాదించే లాయర్లు, అవుననే పోలీసాఫీసర్లు, తీర్పునిచ్చే జడ్జీలు, డబ్బులు ఇచ్చే ఏజంట్లూ అందరూ ముఠాగా ఏర్పడి వందల మిలియన్ల డాలర్లను దాదాపు ఎవరూ కనిపెట్టలేని సహజమార్గాల్లో దోచుకుంటున్నారు! అసలు విషయం బయటపడ్డ తర్వాత చట్టంలోని లొసుగులవల్ల, పేరుకుపోయిన అవినీతివల్ల కొందరు తప్పించుకొని హాయిగా రాజభోగాలు అనుభవిస్తున్నారు.

బయటపడని ఇలాంటి మాఫియా కథలు దాదాపు ప్రతిరంగంలో ఉంటాయి. కాకపోతే మిగతా అన్ని రంగాల్లో జరిగే అవినీతి కంటే వైద్యరంగంలో జరిగే అవినీతి ఎన్నో రెట్లు ఎక్కువ. అమెరికాలో ఏడాదికి సగటున 80 బిలియన్ డాలర్ల అవినీతి ఒక్క వైద్యరంగంలోనే జరుగుతుందట! మందుల కంపెనీలు, ఆస్పత్రులు చేసే ఘోరాలకయితే అంతే ఉండదు. అనవసరమయిన బిల్లులు వేసి సగటు కుటుంబాన్ని నిమిషాల్లో బజారుపాలు చేయడానికి దాదాపు అన్ని కంపెనీలు తహతహలాడుతుంటాయి. బాధాకరమయిన విషయం ఏమిటంటే ఇప్పుడిపుడే కార్పొరేట్ వైద్యం విజృంభిస్తున్న ఇండియాలో కూడా ఈ "మెడికల్ మాఫియా" తన ఉనికిని చాటుకుంటున్నది. భవిష్యత్తులో ఇదొక పెద్ద భూతమవడం ఖాయం!

బెగ్గర్ ఖాన్‌కు అమెరికాలో అవమానం!!

Posted by జీడిపప్పు

గతవారం అమెరికాకు వచ్చిన షారుఖ్ ఖాన్‌ను న్యూజెర్సీ ఎయిర్‌పోర్ట్ లో "నిర్బంధించారు" అని, ఇది యావత్ భారతజాతికి అవమానం, అమెరికా అహంకారానికి నిదర్శనమని అటు టీవీల్లో, ఇటు పేపర్లలో కుప్పలుతెప్పలుగా వార్తలు వచ్చాయి. షారూఖ్ ఖాన్ కూడా తీవ్ర మనస్తాపం చెందానని చెప్పి బాధపడి వెనువెంటనే ఇండియాకు తిరిగి వచ్చేయకుండా అక్కడే అమెరికాలో తన రాబోవు సినిమాకు నాలుగు డాలర్లు రాబట్టుకోవడానికి కష్టపడుతున్నాడు.

నిజంగా అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు భారతీయుల పట్ల వివక్ష చూపిస్తున్నారా అంటే ముమ్మాటికీ కాదు అన్నదే సమాధానం. తానా నుండి తందానా సభలవరకు ప్రతిఏడాది ఎందరో తెలుగు సెలెబ్రిటీలు వస్తున్నారు. షారూఖ్ ఖాన్ కంటే ఎంతో గొప్పవాళ్ళు ఎందరో ఎన్నోసార్లు అమెరికాకు వచ్చాడు. వీళ్ళెవరూ ఎన్నడూ "మమ్మల్ని అవమానించారు" అని గగ్గోలు పెట్టలేదు ఎందుకు? మరి వీరు భారతీయులు కారా? వీరెవరిలో కనపడని భారతీయత వీడొక్కడిలోనే కనపడిందా ఇమ్మిగ్రేషన్ అధికారులకు?

అసలు జరిగినదేమిటో చూద్దాం. ఇమ్మిగ్రేషన్ అధికారులు డాక్యుమెంట్లు స్కాన్ చేసినపుడు "ఖాన్" అన్న పేరు హైలైట్ అయింది. అందులో తప్పేముంది? సెక్యూరిటీ కారణాలవల్ల రాసిన ప్రోగ్రాం ప్రకారం అలా హైలైట్ అయిన వారిని పక్కకు తీసుకెళ్ళి నిశితంగా పరిశీలించాలి. రూల్స్ ప్రకారం వీడిని పక్కకు పిలుచుకెళ్ళి అన్ని వివరాలు అడిగారు. ఎంతయినా కాస్త "హైలైట్" అయిన పేరు కాబట్టి ఒకరికి ముగ్గురు అధికారులు ఒక గంటసేపు అన్నీ నిర్దారించుకొని పంపించారు. ఇందులో ఎక్కడా అవమానమో లేదా అహంకారమో లేదే. కేవలం వాళ్ళ డ్యూటీ చేసారు, అదీ వాళ్ళకున్న రూల్స్ ప్రకారం.

తానేదో పెద్ద కింగ్ అని భ్రమపడే షారూఖ్ ఖాన్ ఇదే పబ్లిసిటీకి అదను అని చిల్లర స్టేట్మెంట్స్ ఇచ్చాడు. వీడు ఇండియాలో పెద్ద సూపర్‌స్టార్ కావచ్చు కానీ అమెరికాలో ఇమ్మిగ్రేషన్ అధికారి ముందు ఒక కోన్ కిస్కా గొట్టం గాడే. వీడేమయినా ఒక ప్రభుత్వాధికార హోదాలో ఒక ప్రత్యేక విమానంలో వచ్చాడా అంటే అదీ లేదు. నాలోంటోడు వచ్చే విమానంలో వచ్చి నాలాంటోడిముందు ఇమ్మిగ్రేషన్ లైన్లో నిలబడ్డాడు. నాకు తెలుసు వీడొక సో-కాల్డ్ ఇండియా ఐకాన్ అని, ఇమ్మిగ్రేషన్ అధికారికి ఎలా తెలుస్తుంది? తెలుసుకున్నా ఎందుకు నమ్మాలి వీడిని? ఎంతమంది బాలీవుడ్ హీరోలు క్రిమినల్ కేసుల్లో ఇరుక్కోలేదు?

సరే, నేనంటే ఏదో అమెరికా నీళ్ళు తాగుతున్నాననో లేక భవిష్యత్తులో అమెరికా సెనేటరో, గవర్నరో కావాలనో అమెరికాను సమర్థిస్తున్నా అనుకొని నా మాటలు పక్కన పెడదాము. బ్లాగుల్లో వ్రాసిన 1, 2, 3, 4 లాంటి ఆలోచింపదగ్గ చక్కని పోస్టులను కూడా పక్కన పెడదాము. మిడిమిడి జ్ఞానం తో అమెరికా అంటే ముందు వెనక ఆలోచించని మూర్ఖుడిలా నేను కూడా "అవునవును, న్యూజెర్సీలో భారతజాతి గౌరవానికి అవమానం జరిగింది" అన్నానే అనుకుందాము.

మరి అంతగా అవమానింపబడ్డ భారతజాతి గౌరవం వెంటనే "ఇది నాకు అవమానం. ఇక నేను మీ దేశానికి మళ్ళీ రాను. నా సినిమాలను మీ దేశంలో ఆడనివ్వను" అని వెంటనే ఇండియాకు వచ్చేసిందా లేక అవమానం జరిగిన అదే దేశంలో స్టేజీల పైన కుప్పిగంతులేస్తున్నదా డాలర్లకోసం? ఇంతకూ బెగ్గర్ ఖాన్‌కు తనకు జరిగిన అవమానం ముఖ్యమా లేక అభిమానుల అభిమానం ముఖ్యమా లేక రాబోవు సినిమాకు వాళ్ళు రాల్చే చిల్లర డాలర్లు ముఖ్యమా?

Snatch. - ఒక అద్భుత సినిమా

Posted by జీడిపప్పు

సినిమా అంటే తెలుగు సినిమా మాత్రమే, ఇంగ్లీషులో సినిమా అంటే రాంబో మాత్రమే అనుకొనే దుర్భర స్థితి నుండి అదృష్టవశాత్తూ బయటపడి కొన్నేళ్ళ క్రితం ఇంగ్లీషు సినిమాలు చూడడం మొదలుపెట్టాను (అదే సమయంలో "కొత్త తెలుగు సినిమాలు" చూడడం దాదాపు మానేశాను). మొదట్లో ఇంగ్లీషు సినిమాలకు కూడా సబ్‌టైటిల్స్ పెట్టుకొని చూసేవాడిని (సుత్తి వీరభద్రరావుగారికి ఈ సంగతి తెలిసి ఉంటే "ఇంగ్లీషు సినిమాను సబ్‌టైటిల్స్ పెట్టుకొని చూసే మొహం నువ్వునూ" అనేవారేమో!). కొద్ది కాలానికి ఆ అవసరం కూడా తీరిపోయింది.

ఒకసారి ఒక అసలు సిసలయిన "ఇంగ్లీషు" సినిమా చూడమని ఒక మిత్రుడు సలహా ఇవ్వడంతో చూడడం మొదలుపెట్టాను. సంభాషణలన్నీ ఇంగ్లీషులోనే సాగుతున్నప్పటికీ సరిగా అర్థం కాలేదు. "ఓహో ఇది బ్రిటీష్ ఇంగ్లీష్" అనుకొని కాస్త చెవులు రిక్కించి విన్నా లాభం లేకపోయింది. తప్పదని సబ్‌టైటిల్స్ తో చూడడం మొదలుపెట్టాను. వాటిపుణ్యమా అని సంభాషణలు అర్థమవుతున్నా ఆ కర్ణ కఠోరమయిన accent భరించలేకపోయాను. చూడకుండా వదిలేయడానికి ఈ సినిమా IMDB లో మంచి ర్యాంకులో ఉంది! మూడు సార్లు ఒక్కోసారి 10-15 నిమిషాలపాటు ప్రయత్నించి ఆ accent చిత్రహింస భరించలేక చేతులెత్తేసాను. ఆ సినిమా పేరే - Lock, Stock and Two Smoking Barrels.

తర్వాత ఇంకోసారి ఇంకో సినిమా రేటింగ్ చూసి దర్శకుడి పేరు చూసి ఉలిక్కిపడ్డాను. ఆ దర్శకుడు మరెవరో కాదు, పైన చెప్పిన సినిమా తీసిన దర్శకుడే. ఈ సినిమా కూడా అలాగే ఉంటుందేమో, అయినా సరే Top 155 ర్యాంకులో ఉంది కదా, ఒకసారి ప్రయత్నించాలి అనుకొని ఈసారి ముందుజాగ్రత్తగా సబ్‌టైటిల్స్ తో చూడడం మొదలుపెట్టాను. ఆ తర్వాతి వారం రోజుల్లో సబ్‌టైటిల్స్ లేకుండా ఆ సినిమాను నాలుగు సార్లు చూసాను. ఆ సినిమా పేరు Snatch., నేను చూసిన అత్యుత్తమ వినోదాత్మక చిత్రాల్లో ఒకటి.

సినిమా అన్న పదానికి వినోదం అర్థమయితే, సాధారణ కథ, చిత్రమయిన పాత్రలు, అంతకంటే విచిత్రమయిన మాటలు, అడుగడుగునా ప్రమాదాలు, ప్రమాదాల్లో కడుపుబ్బా నవ్వించే హాస్యం, చక్కటి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఉన్న Snatch. వినోదం అన్నమాటకు వివరణ అని చెప్పవచ్చు.

సినిమా కథ మూడంటే మూడు ముక్కల్లో  - "వజ్రం కోసం వేట". ఏ సినిమాకయినా ప్రధానపాత్రలు, సైడ్ పాత్రలు అని ఉంటాయి. కానీ ఇందులో దాదాపు అన్నీ ప్రధాన పాత్రలే. అందరూ హీరోలే, అందరూ విలన్లే, అందరూ కామెడీ చేసేవారే. ఈ సినిమా (మళ్ళీ మళ్ళీ) చూస్తున్న కొద్దీ క్యారక్టర్లు విపరీతంగా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా Turkish, Bullet Tooth Tony, Mickey, Brick Top.

డైలాగుల విషయానికొస్తే - ప్రతి సినిమాలో గుర్తించుకోదగ్గ కొన్ని పంచ్ డైలాగులుంటే, ఇందులో మొదటి నుండి చివరివరకూ డైలాగుల పంచ్‌లే పంచ్‌లు. "as greedy as a pig" అన్నమాటలకు పందుల గురించి Brick Top ఇచ్చే వివరణ, హోటల్లో Bullet Tooth Tony తన దగ్గరికి వచ్చిన Sol త్రయాన్ని భయపెట్టే మాటలు masterpiece డైలాగులు. తన అసిస్టెంటుకు Turkish ఇచ్చే జవాబులు, బ్రిటీషర్ల పైన Avi చూపే కోపం, Sol త్రయం కామెడీ కొద్ది రోజులపాటు గుర్తుండిపోతాయి.

కుందేలును కుక్కలు తరుముకోనే సన్నివేశంలో, Brick Top తన క్రూరత్వాన్ని చూపించుకొనే సన్నివేశాల్లో వాడిన మ్యూజిక్ చాలా బాగా సరిపోయింది. అక్కడక్కడా కాస్త భారతీయసంగీతం తాకుతుంది. Massive Attack's  Angelను ఉపయోగించుకున్నట్టే Teardrop పాటను కూడా ఏదో ఒక సన్నివేశంలో వాడుకొని ఉండవచ్చు. నిజానికి Angel కంటే Teardrop పాటే బాగుంది.

సినిమా మొత్తం మీద దాదాపు స్త్రీ పాత్ర లేకపోవడం, దాదాపు 26 మర్డర్లు జరిగినా ఒక్క మర్డరు కూడా స్క్రీన్ పైన కనిపించకపోవడం, బ్రిటీషర్లకే అర్థం కాని ఇంగ్లీషును Brad Pitt ద్వారా చెప్పించడం, 163 సార్లు $%* పదం వాడడం, టైటిల్ చివర ఫుల్‌స్టాప్ ఉండడం మొదలయినవి ఈ సినిమాలోని మరికొన్ని హైలైట్స్. చాలా సాధారణమయిన కథ ఉన్న ఈ సినిమా ఎందుకు ఆల్ టైం గ్రేట్ జాబితాలో ఉందో వీక్షించి తెలుసుకోకుంటే ఒక మంచి సినిమా మిస్ అవుతున్నట్టే!

తైలం తమాషా చూద్దాం!

Posted by జీడిపప్పు

"చక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకు బంధువౌతానని అంది మనీ మనీ
అమ్మ చుట్టమూ కాదు అయ్య చుట్టమూ కాదు అయినా అన్నీ అంది మనీ మనీ"

మనీ సినిమాకోసం సిరివెన్నెల కలమునుండి జాలువారిన ఆణిముత్యాలివి. స్థిరంగా ఒకచోట ఉండకుండా చేతులు మారుతూ కష్టాలు తీరుస్తూ కన్నీళ్ళు తుడిచే చుట్టము కాని చుట్టమయిన ఈ డబ్బు చేసే తమాషా గురించి మొన్న చదివిన ఒక పిట్ట కథ కాస్త మార్పులు చేస్తే ఇలా ఉంటుంది:

అది ఒక చిన్న ఊరు. ఆ ఊరికి దగ్గరలో ఉన్న పర్యాటకస్థలానికి వచ్చేవారి పైన ఆధారపడి ఆ ఊళ్ళో అందరూ జీవిస్తున్నారు. కొద్దిరోజులుగా భారీ వర్షాలు పడుతున్నందువల్ల పర్యాటకులు అటువైపు రాకపోవడంతో అందరి ఆదాయం తగ్గిపోయింది. ఒకరోజు ఒక వ్యాపారి ఆ ఊరిగుండా ప్రయాణిస్తుంటే ఉన్నట్టుండి భోరున వర్షం కురవడంతో తన స్కూటరును ఆ ఊళ్ళో ఉన్న ఒక చిన్న హోటల్/లాడ్జ్ ముందు ఆపి లోపలికి వెళ్ళి కూర్చున్నాడు.

హోటల్ యజమాని కాఫీ ఇచ్చి మాట్లాడడం మొదలుపెట్టి ఆ వ్యాపారి పొరుగూరికి వెళ్ళి తన పని పూర్తి అయిన తర్వాత ఆ రాత్రికి తిరిగి అదే దారిన వెళ్తాడు అని తెలుసుకొని "సార్, మీరు రాత్రి తిరిగివచ్చేటపుడు వర్షం పడితే ఇక్కడే బసచేయండి. భోజనము, రూము రెండూ కలిపి వందరూపాయలే. ఒకవేళ వర్షం పడకపోతే మీ వంద మీకు ఇచ్చేస్తాను, మీరు వెళ్ళిపోవచ్చు" అన్నాడు. అంతలో వర్షం ఆగిపోవడంతొ ఆ వ్యాపారి సరేనని వందరూపాయలు ఇచ్చి తన స్కూటరు తీసుకొని అక్కడినుండి బయలుదేరాడు.

హోటల్ యజమాని అప్పటికే తనకు చికెన్ సరఫరా చేసేవాడికి నూరు రూపాయలు బాకీ ఉన్నాడు. వెంటనే ఆ వందరూపాయలు తీసుకొని వెళ్ళి చికెన్ సరఫరా చేసేవాడికి ఇచ్చి "ఒకవేళ రాత్రికి వర్షం పడకపోతే వ్యాపారికి డబ్బు ఎలా తీర్చాలి? పోనీలే ప్రస్తుతానికి అప్పు తీర్చాను. రాత్రి సంగతి అప్పుడు చూద్దాం" అనుకుంటూ హోటల్‌కు వచ్చాడు. చికెన్ సరఫరా చేసేవాడు కోళ్ళఫారం యజమానికి ఉన్న అప్పులో భాగంగా ఆ నూరు రూపాయలు ఇచ్చాడు. కోళ్ళఫారం యజమాని ఆ నూరురూపాయలను తీసుకొని దగ్గరలో ఉన్న వేశ్య ఇంటికి వెళ్ళాడు. కాసేపటికి ఆ వేశ్య హోటల్‌లో రూమును వాడుకున్నందుకుగానూ హోటల్ యజమానికి బాకీ ఉన్న నూరురూపాయలు తీర్చివేసింది.

అంతలో వ్యాపారి వెనుతిరిగి వచ్చి వర్షం పడడం లేదు కాబట్టి తాను తన ఊరికి వెళ్ళిపోతానని, తాను ఇచ్చిన నూరు రూపాయలు ఇవ్వమన్నాడు. వేశ్య తనకు ఇచ్చిన వందరూపాయలను ఆ హోటల్ యజమాని వ్యాపారికి ఇచ్చాడు. అందరూ తమ అప్పుల భారం తగ్గినందుకు సంతోషించి రేపటికోసం ఆశగా ఎదురుచూడసాగారు.

ఇదంతా చూస్తున్న ధనలక్ష్మి చిద్విలాసంగా నవ్వుకుంది!

ఎమ్మెల్యే జయప్రకాష్ నారాయణ Status Report

Posted by జీడిపప్పు

కొందరు ఏడుపుగొట్టు రచయితలు తమ ఏడుపుగొట్టు కథల్లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం ఎంత కష్టమో, వారి జీవితాలు ఎన్ని కష్టాలమయమో చాలా చక్కగా ఛండాలీకరిస్తారు. అటు ఆఫీసులో, ఇటు దైనందిన జీవితంలో కష్టనష్టాలున్న సంగతేమో కానీ, ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా నాకు ఈ IT రంగంలో కొన్ని విషయాలు బాగా నచ్చుతాయి. అలాంటివాటిలో ఒకటి - task tracking and status reports.

ఎంత చిన్న పని అయినా ఆ పని ఎవరు ఎప్పుడు మొదలుపెట్టాలి, ఆ పని ఎంత శ్రమతో కూడుకున్నది, ఎప్పటిలోపు ముగించాలి మొదలయిన వివరాలతో దానికోసం ఒక task సృష్టించి వారానికోసారి టీం మెంబర్స్ అందరి status reports పరిశీలించి ఆ వారంలో ఏమి జరిగిందో అన్నీ తెలుసుకొని తన పైవారికి వివరాలను అందజేయడం టీం లీడర్ బాధ్యత. ఈ status report పుణ్యమా అని టీం మెంబర్స్ ఎవరూ పని చేయకుండా తప్పించుకోలేరు. బద్దకంతో తప్పులు చేస్తే task లోని వివరాలవల్ల పట్టుబడిపోతారు. మేనేజ్‌మెంటుకు కూడా నిర్వహణ చాలా సులభమవుతుంది.

పదిమంది ఉద్యోగులున్న చిన్న కంపెనీ కూడా ఈ స్టేటస్ రిపోర్ట్ల పైన ఎంతో సమయాన్ని వెచ్చిస్తున్నపుడు లక్షలమందికి ప్రతినిధులయిన రాజకీయనాయకులు నెల నెలా (వారానికి వద్దులే!) తాము చేసిన "ప్రజాసేవ" వివరాలను తెలుపుతూ ఎందుకు తమ స్టేటస్ రిపోర్ట్ విడుదల చెయ్యరు? ఇప్పటికే ప్రజలకు నాయకులపైన నమ్మకం పోయింది. కనీసం ప్రజలు నమ్ముతున్న జయప్రకాష్ నారాయణ గారిలాంటి వారు అయినా ఇకనుండి నెల నెలా తాము ఏమి చేసారో వివరాలు తెలిపితే ప్రజల్లో నాయకులపట్ల మళ్ళీ నమ్మకం కలుగుతుంది.

మూడు నెలల క్రితం కూకట్‌పల్లినుండి ఎమ్మెల్యేగా ఎన్నికయిన జేపీగారు ఒక్క ఎమ్మెల్యే తలుచుకుంటే ఒక ఊరి స్వరూపాన్ని ఎలా మార్చగలడో చూపించగల సత్తా ఉన్నవాడు. గత మూడు నెలలుగా తన నియోజకవర్గంలో ఏమి చేసాడో ఇప్పటివరకూ చాలామందికి తెలియదు. ఆయన ప్రజాసేవ చేయడం గురించి పత్రికల్లో రావడం లేదు. బహుశా ఇది మీడియా కుట్ర కావచ్చు. ఒక ఎమ్మెల్యే చేసిన, చేయవలసిన మరియు చేయదగిన పనులను క్రోడీకరిస్తే జేపీగారి స్టేటస్ రిపోర్ట్ ఇలా ఉంటుంది. (గత మూడు నెలల్లో జేపీగారు చేసిన ప్రజాసేవ వివరాలను కామెంట్ల రూపంలో తెలిపితే క్రింది వివరాలు update చేయబడుతాయి.)

సంగ్రహం
ప్రజలనుండి స్వీకరించిన మొత్తం సమస్యలు: 0
పరిష్కరించిన సమస్యలు: 0
పురోగతిలో ఉన్న సమస్యలు: 0
మిగిలినవి: 0

వివరాలు
వైద్యరంగం
1) తనిఖీ చేసిన ఆస్పత్రులు: 0
2) పరిష్కరించిన సమస్యలు: 0
3) ఇతర అభివృద్ది కార్యక్రమాలు: 0

విద్యారంగం
1) తనిఖీ చేసిన పాఠశాలలు: 0
2) పరిష్కరించిన సమస్యలు: 0
3) ఇతర అభివృద్ది కార్యక్రమాలు: 0

ఇతరములు
1) పర్యటించిన మురికివాడలు: 0
2) పరిష్కరించిన మంచి నీటి సమస్యలు: 0
3) తనిఖీ చేసిన చౌక దుకాణాలు: 0
4) తనిఖీ చేసిన ప్రభుత్వ కార్యాలయాలు: 0
5) అవినీతి అధికారుల పైన తీసుకున్న చర్యలు: 0
6) అవినీతిని నిరోధించుటకు చేసిన ప్రయత్నాలు: 0

పత్రికలు చేయలేని పనిని బాధ్యతగల పౌరులుగా మనము చేసి ఇకనుండి ప్రతినెలా మొదటివారంలో గతనెల జేపీగారు చేసిన పనుల వివరాలను ఈ స్టేటస్ రిపోర్ట్ రూపంలో తెలుసుకుంటూ అందరికీ తెలియజేద్దాము.