బాపు - బాలయ్య - బ్లాగు టెర్రరిస్టు
Posted by జీడిపప్పు
రామాయణం ఆధారంగా ఓ సినిమా తీస్తున్నారన్న వార్త చూసిన వెంటనే గుండె గుభేల్ మంది. దర్శకుడు బాపు, సంగీతం ఇళయరాజా అని తెలిశాక రెండుసార్లు గుభేల్ మంది. ఇక రాముడిగా బాలయ్య బాబు అని చూసినపుడు ఎందుకో గుండె గుభేల్మనలేదుగానీ విరక్తిపూరిత నిరాశా నిస్పృహ సమ్మేళనమయిన నవ్వు వచ్చింది. సీతగా నయనతార.. హతవిధీ అనుకున్నాను. సినిమా వివరాలు తెలిసినవెంటనే ఇలాంటి భావాలు కలగడం వెనుక పలు కారణాలున్నాయి.
తెలుగులో నేను ఎక్కువ అభిమానించే దర్శకుల్లో బాపు ఒకరు.ఎన్నో గొప్ప సినిమాలు తీసిన బాపు మిస్టర్ పెళ్ళాం తర్వాత తీసిన సినిమాలు చూస్తే "ఈయన ఎందుకు సినిమాలు తీస్తున్నారు? తెలుగువారు ఉన్నంత కాలం నిలిచిపోయే ఆణిముత్యాలను అందించిన చేత్తోనే నాసిరకం సినిమాలు తీసి జనాలను భయపెట్టవలసిన అవసరం ఏముంది? ఇంతటితో సినిమాలు తీయడం ఆపి హాయిగా విశ్రాంతి తీసుకుంటే బాగుంటుంది కదా. అలా చేస్తే బాపు అంటే ఆ ఆణిముత్యాలే గుర్తుకొచ్చి అందరి మనసుల్లో గౌరవంగా కలకాలం ఉండిపోతాడు" అనుకున్నాను. (దీనికితోడు అపురూప సౌందర్యరాశి జయప్రద సీతగా నటించిన "సీతా కళ్యాణము" సినిమా కొన్నాళ్ళ క్రితం ఓ అరగంట చూసిన చేదు అనుభవం కూడా ఉంది.)
లయరాజా ఇళయరాజా గురించి కూడా సేం యాజ్ అబవ్. రెహ్‌మాన్ కంటే ఇళయరాజానే గొప్ప మ్యుజీషియన్ అని ఒకప్పుడు నొక్కి వక్కాణించే నేను ఈ మధ్య ఇళయరాజా అందించిన సంగీతం విని "ప్రభువా, ఇళయరాజా యందు దయ ఉంచుడి, మమ్ము కరుణించుడి 36:28' అని ప్రార్థించాను.
ఇక బాలయ్య బాబు విషయానికొస్తే - గత పదేళ్ళలో బాలయ్య చేసినన్ని చిత్రవిచిత్ర మైన ఫీట్లు ఎవరూ చేసి ఉండరేమో. ఈ ఫీట్లే కాక ఆ మధ్య పాండురంగడనబడు ప్రచండ ఘోర పౌరాణిక చిత్రరాజమును జనులబైకి వదలగా యా చిత్రహింస తాళలేక జనులు మతిస్థిమితంగోల్పోయి పలు దిక్కుల పిచ్చివాండ్రవలె పరుగులు తీసిరి. ఇదియొక్కటే కాక పాండురంగడు అనిన ఒక బఫూనుడుయన్న యభిప్రాయమునకొచ్చిరి. అట్టి బాలయ్య ఇపుడు రామావతారములో దర్శనమీయనున్నాడని చూచిన వెంటనే 'యుగాలనుండి రాముని గొలుచు తెలుగువారి దృష్టిలో రాముని యెడల భక్తి తగ్గి పోవునేమో" యని నా మనసు పరిపరివిధముల తపించినది.
ఇలా బాపు, ఇళయరాజా, బాలయ్య కలిసి ఓ చెత్త సినిమా తీస్తారేమో.. ముఖ్యంగా తొడకొట్టి రైలు ఆపడం, వేలు చూపెట్టి కుర్చీ లేపడం, విజయేంద్రవర్మ స్టంట్లులాంటివి, ఓ మాంఛి రొమాంటిక్ పాట పెట్టి "ఓస్ రాముడు ఇలాంటివాడా? మేమేదో గొప్పవాడనుకున్నామే" అని ప్రేక్షకులు అనుకొనేలా చేస్తారేమో అని భయపడ్డాను. అవన్నీ చూసి బ్లాగు టెర్రరిస్టు "చూసారా మీ రాముడిని మీ హిందువులే ఎలా చూపించారో, నిజం కాకపోతే ఎందుకు అలా చూపిస్తారు" అంటూ తన పైశాచిక ఆనందంకోసం రాముడు పైన చెత్త పోస్టులు వేస్తాడేమో అనుకున్నా.
బ్లాగు టెర్రరిస్టు రాముడిని అవహేళన చేస్తూ పోస్టులేసినా, తమ సంసారం చంకనాకిపోయిందని మిగతావారు కూడా అలాగే ఉండాలని కొందరు విషప్రచారాలతో విషవృక్షాలు నాటాలని ప్రయత్నించినా ఏమీ నష్టం లేదు.. దానికి కౌంటర్లు పడతాయి.. నాల్రోజులకు అందరూ మరచిపోతారు..కానీ ఎన్ని యుగాలయినా రాముడు ఉంటాడు!! కాకపోతే చెప్పులో రాయిలా వీటికి అవకాశం లేకుంటే బాగుంటుంది కదా!
పైన చెప్పిన నా ఆలోచనలను, ఆందోళనను పటాపంచలు చేస్తూ బాపు-బాలయ్య-రాజా మరో ఆణిముత్యాన్ని ఇవ్వడం మన అదృష్టంగానే భావించాలి. ముఖ్యంగా నయనతార సీతగా న భూతో న భవిష్యతి అన్నట్టు నటించడం చూసి బాపు కు హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేము. ఇంతటితో బాపు, ఇళయరాజా సినీరంగం నుండి విరమించి హాయిగా విశ్రాంతి తీసుకుంటారని ఆశిద్దాము. బాలయ్య బాబు ఇక నుండి ఏదయినా సినిమా ఒప్పుకోబోయే ముందు ఓ ఐదు నిమిషాలు ఆలోచించి సరి అయిన నిర్ణయం తీసుకోవాలని కోరుకుందాము.
ఇక అతి ముఖ్యమయినది, పరమ నాస్తికులు కూడా గుడికి వెళ్ళి ఓ ఫదిరవై కొబ్బరికాయలు కొట్టి మరీ దేవుడిని ప్రార్థించవలసినది ఒకటుంది. అదే - దర్శకేంద్రుడు కె.నాభికేంద్రరావు ఈ సినిమా చూసి ఉత్తేజపూరితుడయి మరో పౌరాణికాన్ని తీయడానికి ఉపక్రమించకూడదు.