కూడలి కష్టాలు - పరిష్కారం

Posted by జీడిపప్పు

కొద్దిరోజుల క్రితం కూడలిలో పోస్టులు చూసి చాలా చిరాకేసింది. ఒకరివి (అఫ్‌కోర్స్ అన్ని బ్లాగులూ కలిపి) తొమ్మిది, మరొకరివి ఐదు, ఇంకొకరివి ఆరు ఫోటోలు, ఇంకొకరివి మూడు పోస్టులు..ఇలా ఐదారుమంది తమ పోస్టులతో మొత్తం జాబితాలో సుమారు సగం ఆక్రమించేసారు. అది చూసి ఒక పోస్టు వ్రాసాను కానీ చివరిక్షణంలో నేనొక్కడినే ఇలా అనుకుంటున్నానేమో అనిపించి ఆ పోస్టు ప్రచురించలేదు. ఈ రోజు జ్యోతిగారి పోస్టు చూసిన తర్వాత ఆ పోస్టును యథాతథంగా ప్రచురిస్తున్నాను. మీకు కూడా ఇది సమస్యే అనిపిస్తే..మరెందుకాలశ్యం, ఓ పోస్టు వెయ్యండి. పరిష్కారానికి మార్గం ఏర్పడుతుందేమో!

అసలు పోస్టు :

నేను కూడలిని ఏడాదినుండి క్రమం తప్పకుండా చూస్తున్నాను. కూడలిని చూడడం అంటే ఈ పేజీ చూడడం. నాకు తెలిసి చాలామంది బ్లాగర్లు ఈ పేజీనే చూస్తారు అనుకుంటా. ఎందుకంటే, ఈ పేజీలో అయితే పోస్టుల మొదటి నాలుగు లైన్లు చూస్తూ కుడిపక్కన కామెంట్లను చూడవచ్చు.

కొద్దికాలం క్రితం వరకూ ఈ పద్దతి అనుసరించడం చాలా సులభంగా ఉండేది. చాలావరకు "చదవగలిన" పోస్టులే ఉండడంతో "చెత్త" పోస్టులను సులభంగా దాటుకుంటూ వెళ్ళిపోయేవాడిని. కానీ ఈ మధ్య అంతా రివర్స్ అయినట్టనిపిస్తున్నది. మంచి పోస్టులు తగ్గిపోయి, ఒకే బ్లాగులో రోజుకు నాలుగైదు పోస్టులు పడుతున్నాయి. రోజుకు రెండు-మూడు కంటే ఎక్కువ ఒకే బ్లాగుకు సంబంధించిన పోస్టులు కూడలిలో కనిపించాయంటే అన్నీ పరమ చెత్త పోస్టులే అని నా own స్వంత పర్సనల్ స్వాభిప్రాయం.

ఇలా రోజుకు మూడు నాలుగు పోస్టులవల్ల ఉపయోగాలు కూడా ఉన్నాయి. బ్లాగు లోకంలో చాలా పాపులర్ అవ్వవచ్చు, ఆ పోస్టులు వేసేవాడు ఎంత మేధావో అందరికీ తెలుస్తుంది, బ్లాగుకు హిట్లు పెరుగుతాయి, అలెక్సా ర్యాంకు పెరుగుతుంది. అందుకే నేను కూడా కొన్ని బ్లాగులు మొదలు పెట్టాలనుకుంటున్నాను.

ఒకటో బ్లాగు: నాకు కమ్యూనిస్టులంటే పరమ అసహ్యం. ఇవి ప్రపంచంలోనే అత్యంత ---- అన్నమాట. వీటిపైన నాకున్న కసి తీర్చుకోవడానికి తెల్లవారి ఆరున్నరకు "ఛీ కమ్యూనిస్టులు" అని రెండు లైన్లు, తొమ్మిదిన్నరకు 'థూ కమ్యూనిస్టులు" అని మూడు లైన్లు, రెండున్నరకు "ఛీ ఛీ కమ్యూనిస్టులు" అని రెండు లైన్లు, సాయంత్రం ఏడున్నరకు 'కమ్యూనిస్టులు ఛీ ఛీ" అని ఒక లైను పోస్టులు వేస్తాను అన్నమాట.

రెండో బ్లాగులో "అసలు మా మెగాజోకర్ గారు ఓడిపోలేదు", "మెగాజోకర్ గారూ, మీ వెంటే మేముంటాము", "వచ్చే ఎన్నికల్లో మీరే ముఖ్యమంత్రి మెగాజోకర్ గారూ", "మీరు చాలా మంచివారు మెగాజోకర్ గారు" "అసలు మెగాజోకర్ ఎవరు" లాంటి పోస్టులు వేస్తాను, మతి చలించినప్పుడల్లా లేదా మతి ఉన్నపుడల్లా. మూడో బ్లాగులో మా ఊరి ఎమ్మెల్యే భజన, మా ఊరి రోడ్ల గుంతల ఫోటోలు ఉంటాయి. నాలుగో బ్లాగు వార్తలకోసం. న్యూయార్క్ నగరంలో జరుగుతున్న విషయాలతో గంటకొకసారి అప్‌డేట్ అవుతుంటుంది.

ఇలా సగటున రోజుకు 15-20 చెత్త పోస్టులతో కూడలి పేజీని సగం నింపడంవల్ల మంచి పోస్టులను చదవాలనే వారికి చికాకు కలిగించవచ్చు. ఇహపోతే - స్వేచ్ఛ పేరుతో నన్నేమీ చేయలేరు. రోజుకు నాలుగు కాదు, నలభై చెత్త పోస్టులు వేసుకున్నా ఎవరికీ అడిగే హక్కులేదు. ఒకే బ్లాగులో 10 పోస్టులు వెయ్యకూడదని రూల్ పెడితే ఐదు బ్లాగులు సృష్టించి ఒక్కోదాంట్లో రెండేసి పోస్టులు వేస్తాను. ఇష్టముంటే చదవచ్చు లేదా చదవకపోవచ్చు. మరీ అంత ఇబ్బంది అయితే "మంచి పోస్టులున్న" బ్లాగులు ఫేవరెట్స్ లో కలుపుకోవాలి.

ఇంత సేపు ఈ చెత్తను ఓపిగ్గా చదివినందుకు మీకో ఉచిత సలహా:: కూడలి నిర్వాహకులకు " అయ్యా, దయచేసి ఈ multiple టపాల బ్లాగులకోసం ఇంకో Tab సృష్టించి అవన్నీ అక్కడ పెట్టండి. ఈ చెత్తను మెయిన్ పేజీలో చూడలేక, ఆ చెత్తలో మంచి పోస్టులను వెతుక్కోలేక ఛస్తున్నాము" అని అర్జీ పెడుతూ ఒక పోస్టు వెయ్యండి. మీ అదృష్టం బాగుంటే ఈ multiple పోస్టుల బాధ తగ్గవచ్చు.

వీవెన్ గారు :)

అమెరికాలో తెలుగు ఉద్యమం

Posted by జీడిపప్పు

ఈ మధ్య బ్లాగుల్లో LTTE సంస్థ గురించి, తమిళ-తెలుగు భాషల గురించి పోస్టులు, చర్చలూ జరుగుతున్నాయి. కొందరు శ్రీలంకలో తమిళులు చేసినదాన్ని సమర్థిస్తూ, కీర్తిస్తూ చక్కని పోస్టులు వేసారు. కానీ అందరికంటే అసంబద్ధమైన పోస్టు "బ్లాగాడిస్తా రవి" గారు వేసారు. నాకు రవిగారి పోస్టు నచ్చకపోవడానికి కారణం - ముందు వెనుకా ఆలోచించకుండా "భాష" అన్న పదం వినపడగానే పూనకం వచ్చి ఊగిపోయి "అవును అందరూ భాష కోసం ఉద్యమాలు జరపాలి" అనకపోవడం. రవిగారి పోస్టులో ఇంకా నచ్చనిదేమిటంటే - అన్నికోణాల్లో ఆలోచించి ఉన్నవి ఉన్నట్లు చెప్పడం.

శ్రీలంకలో తమిళులు తమ భాషకోసం జరుపుతున్న పోరాటాన్ని, వారికి తమ భాష పట్ల ఉన్న అభిమానాన్ని చూసి ప్రవాసాంధ్రుడిగా నాకు నిఝ్ఝంగానే తెలుగువాడిని అయినందుకు సిగ్గు వేసింది. నాకు తెలిసి ప్రతి తెలుగువాడూ శ్రీలంక తమిళులనుండి నేర్చుకోవలసింది ఎంతో ఉంది, ముఖ్యంగా ప్రవాసాంధ్రులు.  అమెరికాలో ఉన్న భారతీయుల్లో ఎక్కువమంది తెలుగువారే. న్యూజెర్సీ, బే ఏరియా మొదలయిన ప్రాంతాల్లో తెలుగువారి జనాభా చాలా ఎక్కువ. ప్రతి ఇద్దరు భారతీయుల్లో ఒకరు తెలుగువారే అంటే అతిశయోక్తి కాదేమో. అయినా సరే అమెరికాలో తెలుగు నిరాదరణకు గురి అవుతున్నది. అందుకుగల కారణాలు, పరిణామాలు, పరిష్కారము చూద్దాము.

శ్రీలంకలో తమిళులు Vs అమెరికాలో తెలుగులు
శ్రీలంకకు వెళ్ళిన తమిళులు తాము సింహళం నేర్చుకోము, తమకోసం అన్నీ తమిళంలోనే ఉండాలి అన్నారు. మనము ఏమి చేసాము? అమెరికాకు వచ్చాకో, వచ్చే ముందో ఇంగ్లీషు నేర్చుకొన్నాము. కొద్ది కాలానికి అమెరికన్ యాస కూడా అలవాటు చేసుకున్నాము.
వీళ్ళు మేమంతా తమిళులము కాబట్టి మేమంతా ఒకే చోట ఉంటాము, మీతో కలవము అన్నారు. మనమేమో ఎక్కడుంటే ఏముంది, హాయిగా ఉంటే చాలు అని తెల్లవాళ్ళ మధ్య నివశిస్తున్నాము.
వీళ్ళు సింహళీయుల చట్టాలను పట్టించుకోలేదు, వాటిని అతిక్రమించి ఎదురుతిరిగారు. మనమేమో అమెరికావాడు చెప్పినట్టు కుడి వైపునే కారు నడిపాము, రోడ్డు పైన చెత్త వెయ్యలేదు, క్యూలో ఉన్నపుడు తొక్కిసలాటలు జరపలేదు.
వీళ్ళు తమ పిల్లలకు "సింహళ బాష నేర్చుకోకూడదు" అని చెప్పారు. మనమేమో "మనం ఈ దేశానికి వచ్చినపుడు ఈ దేశస్థుల్లా ఉండాలి" అంటూ పిల్లలకు ఇంగ్లీషు నేర్పిస్తున్నాము.
వీళ్ళు తమ పిల్లలకు "మనం ఉంటున్న శ్రీలంక మన దేశం కాదు, మనము మన భాషను, సంస్కృతినే ఆచరించాలి" అని భోధించారు. మనమేమో "మనము ఇక్కడకు వలస వచ్చాము. భాషకంటే మనకు కూడూ, గుడ్డ పెడుతున్న దేశం పట్ల గౌరవం ముఖ్యం. ఈ దేశాన్ని గౌరవించాలి, వీరి సంస్కృతి కూడా అలవాటు చేసుకోవాలి" అంటూ తెలుగువారింట్లో కూడా క్రిస్మస్ రోజున అందరూ హాయిగా, సంతోషంగా బహుమతులతో గడిపే దీనస్థితికి వచ్చాము.

పరిణామాలు
తెలుగువారు ఇలా అమెరికా పద్దతులను గౌరవిస్తూ, ఆచరిస్తూ అమెరికన్లతో కలసిపోయి హాయిగా జీవిస్తున్నారు. మొదటితరం తెలుగు పిల్లలకు తెలుగు చదవడం, వ్రాయడం, మాట్లాడడం సరిగా రాదు. తెలుగు సంతతివారు అమెరికన్లతో పోటీ పడి చదువుతున్నారు. ఎన్నో కాంపిటీషన్లలో నెగ్గుతున్నారు. కంపెనీల్లో ఉన్నత పదవులను చేపడుతున్నారు. కేవలం మన తెలుగు పండగలయిన ఉగాది, సంక్రాంతి వంటివి మాత్రమే కాక అమెరికన్ల పండగలయిన థ్యాంక్స్ గివింగ్, క్రిస్మస్ పండగలను కూడా జీవితంలో ఒక భాగం చేసుకుంటున్నారు. తమ భాషకంటే తమకు బ్రతుకుతెరువునిస్తున్న దేశ పద్దతులకు గౌరవమిస్తూ ఆ దేశ ప్రజల్లా బ్రతుకుతున్నారు. ఈ విపరీత ధోరణి ఇలా కొనసాగితే మరో రెండు తరాల తర్వాతి తెలుగువారు 'వాట్ ఈజ్ టెల్గు? హూ ఈజ్ ఉగాడి?' అంటారు.

తక్షణ కర్తవ్యం
ఎందుకు? ఎందుకు ఇలా జరుగుతోంది? ఇన్ని లక్షల మంది తెలుగువాళ్ళు అమెరికాలో ఉన్నా "భారతీయులు" గా గుర్తింపు పొందుతున్నారే కానీ "భారతీయ తెలుగువారి"గా ఎప్పుడు గుర్తింపబడతారు? కొన్ని తరాల తర్వాత అమెరికాలో తెలుగువారి పరిస్థితి ఏమి?
ఇలాంటి ప్రశ్నలకున్న ఏకైక జవాబు -  అమెరికాలోని తెలుగువారు ఉద్యమించడం.

"తెలుగు" అన్న మాట వినిపిస్తే కల్లు తాగిన కోతిలా చిందులు తొక్కే మతిలేనివాడిని నాయకుడిగా ఎన్నుకోవాలి. ఈ తెలుగోన్మాది తెలుగువారిలో భాషాభిమానాన్ని రెచ్చకొట్టేవాడయి ఉండాలి.
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఎన్నో భారతీయ భాషలున్నా తమిళులకు జరుగుతున్న అన్యాయాలే వినిపిస్తాయి కానీ తెలుగువారికి జరుగుతున్న అన్యాయాలు వెలుగులోకి రావడం లేదు. ఇకనుండి తెలుగువారికి కూడా అన్యాయం జరిగేలా ఈ తెలుగోన్మాది చర్యలు చేపట్టాలి.
అమెరికాలో తెలుగు వారి కోసం ప్రత్యేక రాష్ట్రం ఏర్పరచాలి. తెలుగు వారి పిల్లలకు బోధన తెలుగులోనే జరగాలి.
తెలుగు వారు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ట్రాఫిక్ సూచనల మొదలు అన్నీ తెలుగులో ఉండాలని ఆందోళనలు చేపట్టాలి.
ఇలా చేసినపుడే తెలుగు వారికి గుర్తింపు లభిస్తుంది.

శ్రీలంకలోని తమిళులు చేసినది చూసి ఇకనయినా ప్రవాసాంధ్రులు కళ్ళు తెరుస్తారని, తెలుగు ఉద్యమాలు, తెలుగు ఆందోళనలు చేపడుతారనీ, అమెరికాలో తెలుగు వాడి ఆత్మ గౌరవాన్ని చాటి చెబుతారని ఆశిద్దాం.

శభాష్ శ్రీలంక

Posted by జీడిపప్పు

మొత్తానికి ప్రభాకరన్ చచ్చాడు. అన్నెం పున్నెం ఎరుగని బాలలను సైతం మానవ బాంబులుగా తయారు చేసి, వారిలో జాతి విద్వేషాన్ని విషంలా ఎక్కించిన ఈ మానవ మృగాన్ని చంపిన శ్రీలంక సేనకు జేజేలు కొట్టాలి. వీడిని ఎదుర్కొని ఎన్నో దశాబ్దాలుగా సాగుతున్న మారణకాండను అదుపులోకి తెచ్చిన శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే ధైర్యానికి జోహార్లు అర్పించాలి. ఈ సందర్భంగా -  విషయాన్ని చక్కగా విశ్లేషించే ఎంబీయస్ ప్రసాద్ గారు ఈ తీవ్రవాద సంస్థ గురించి వ్రాసిన వ్యాసాలనుండి సంగ్రహించిన కొన్ని అంశాలు:

Image and video hosting by TinyPic
Image and video hosting by TinyPic
Image and video hosting by TinyPic
Image and video hosting by TinyPic
Image and video hosting by TinyPicImage and video hosting by TinyPic
Image and video hosting by TinyPicImage and video hosting by TinyPic
Image and video hosting by TinyPicImage and video hosting by TinyPic

తెలుగోడు ఎవరు?

Posted by జీడిపప్పు

మొన్నొకపోస్టులో "ఇది మా గురువుగారు తెలుగోడు గారినుండి కాపీ కొట్టాను" అన్నాను. అది చూసిన అబ్రకదబ్ర గారు "తెలుగోడు ఎవరు" అన్నారు. "'అంకుసం" సంఘం స్థాపించి, నాలాంటివారికి ఆదర్శనీయుడు అని నేను చెప్పాను. ఇంకా కొంతమందికి "తెలుగోడు ఎవరు" అన్న అనుమానం వచ్చి ఉంటుంది. అందరి అనుమానం తీర్చడానికే అన్నట్టు మరో "అంకుసం" సభ్యుడు, నాకు జూ||గురువు అయిన తూ.గో.జి కుర్రోడు a.k.a రింగు "తెలుగోడు ఎవరు" అన్న సమస్యకు తనదైన శైలిలో వేసిన వివరణాత్మక కామెంటునే పోస్టుగా అందిస్తున్నాను.

తెలుగోడు ఎవరు?
వహ్! ఏమి కొస్చెన్? అసల ఈ కొస్చన్ లో ఎంత మాధుర్యం వుంది..అలానే తీపి కూడా వుంది. కొంచెం తీపి, కొంచెం పులుపు, కొంచెం చేదు, కొంచెం కారం, కొంచెం వగరు , కొంచెం ఉప్పు...ఇలా ఎన్నైనా రుచులు చెప్పుకోవచ్చు. అసల ఈ రుచీ వుంది చూడండీ, ఈ రుచీ అనే పదాన్ని వాడుకునీ రుచీ పచ్చళ్ళు తయారుచేసారు ప్రియ పచ్చళ్ళ కు పోటీ గా. ఈ ప్రియ పచ్చళ్ళు ఎవరిది అనుకున్నారు? మన రామోజీ రావు ది.

ఈ రామోజీ రావు కి ఒక్క పచ్చళ్ళ బిజినస్సే కాదు ఇంకా ఈనాడు పత్రిక బిజినస్సు, ఆ మధ్యనే గొంతు లోతు మునిగి మళ్ళీ తేలి ప్రస్తుతం వెన్టిలేటరు మీద బ్రతుకు కొనసాఆఆఆ...గిస్తున్న మార్గదర్శి చీటీ పాట బిజినస్సు, ఫిల్మ్ సిటీ బిజినస్సు, కోడలు పిల్ల చూసుకునే డల్ఫిన్ హొటళ్ళ బిజినస్సు, మీ టీవి ఈటీవి బిజినస్సు ఇలా చాలా వున్నాయి. ఈటీవి అంటే ఏమనుకున్నారు? ఈనాడు టెలివిజన్. ఇందులో ’హార్లిక్స్ హృదయాంజలి’ అనీ హార్లిక్స్ వారు స్పాన్సర్ చేసే ప్రోగ్రాం వచ్చేది.

అలాగే ’కాల్గేట్ పాడుతా తీయగా’ అనే ఇంకో ప్రోగ్రాం కూడా వచ్చేది. దాన్నీ మన ఎస్.పీ.బీ. కన్డక్ట్ చేసేవాడు. అసల ఎస్.పీ.బీ ఎంత మంది యంగ్ ట్యాలంట్ ని ఎంకరేజ్ చేసాడో ఈ ప్రోగ్రాం లో...మన ఏడుపు గొంతు ఆర్.పీ.పట్నాయక్ ఫేవరెట్ గాయిని ఉష ఈ ప్రోగ్రామ్ నుండే వెలుగు లోకి వచ్చింది. వెలుగు...ఈ వెలుగు వుంది చూసారూ...వెలుగు కోసం సూరీడు ఒక్కడే...సూరీడు అంటే ’అరిస్తే చరుస్తా పెన్సిల్ ఇస్తే చప్పరిస్తా’ మోహన్ బాబు పుత్రరత్నం మంచు విస్స్ను చేసిన సినిమ ’సూర్యం’ కాదు :), ఆకాశం లో వుండే సూరీడు అనమాట.

వెలుగు కోసం సూరీడు ఒక్కడే వున్డాల్సిన అవసరం లేదు...ఇంట్లో కర్మ కాలీ కరంటు వుంటే, స్విఛ్ వేస్తే బల్బ్ వెలుగునిస్తుంది. కర్మ కాలకపోయి కరంటు పోతే అగ్గిపుల్ల కాల్చాలి. అది కూడా వెలుగునిస్తుంది. ఆ అగ్గిపుల్ల తో ఓ కొవ్వత్తి ని అంటిస్తే అది కూడా వెలుగునిస్తుంది. కొవ్వత్తి ని హస్టల్స్ లో రాత్రి పూట కరంటు పోయినప్పుడు కొంత మంది చదువుకోడానికి వాడేవారు. మిగిలిన మరికొంత మంది అమ్మాయిల హాస్టల్ పోడానికి వాడుకునేవారు.

ఈ హాస్టల్స్ లో వెలుగు చూడని చాలా ఆశలు..చాల గొడవలు , రౌడీయిజంలు వుంటాయి. రౌడీయిజం అంటే మామూలు చేతులతో కొట్టుకోడం కాదు...కత్తులు కటారులతో ఖడ్గాలతో కాట్రాజు మాదిరి కొట్టేసుకోడం లాంటివి అనమాట. ఖడ్గం అంటే గుర్తొచ్చింది, ఖడ్గం సినిమా లో ఎక్కడ చూసినా మూడు రంగులు చూపిస్తాడు మన కిస్స్న వంశి. అసల ఈ మూడు రంగుల జాతీయ జండాని ఎవరు మొదట డిజైన్ చేసారనుకుంటున్నారూ?

...మన తెలుగోడు.


తెలుగోడు ఎవరు?

ఓపన్ లెటర్ టు చిరంజీవి గారు

Posted by జీడిపప్పు

కొన్ని వెబ్‌సైట్లలో "ఓపన్ లెటర్ టు xyz" అని రాస్తుంటారు. ఎందుకో తెలియదు కానీ, ఆ హెడ్డింగ్ చూడగానే నాకు కిసుక్కున నవ్వొస్తుంది. ఆ నటుడు ఈ లెటర్ చదివేస్తాడని, తాము చెప్పినవన్నీ ఆచరిస్తాడని ఫీల్ అవుతారనిపిస్తుంది అది రాసిన వాళ్ళు. అలా ఎప్పుడూ జరగదు. ఎవడో ముక్కూ మొహం తెలియనివాడు రాసిన ఆ లెటర్ చదవడానికి అంత పెద్ద స్టార్ తన పనులు పక్కన పెట్టి ఆ వెబ్‌సైటుకు రాడు. కానీ నేను రాసిన ఈ వ్యాసాన్ని చిరంజీవి గారు తప్పక చదువుతారు, నేను చెప్పినవన్నీ తప్పక ఆచరిస్తాన్న నమ్మకం నాకుంది. అందుకు కారణాలనేకం, అనంతం.

ఏంటి చిరంజీవి గారూ ఇంత పని చేసారు? మీకిది భావ్యమా? ఇలాంటి ఫలితాలనా మీ అభిమానులకు ఇచ్చేది? మనం పార్టీ పెట్టింది ఎందుకు? మన పార్టీ స్లోగన్ "అధికారమే లక్ష్యం, డబ్బే మార్గం" అని పెట్టుకున్నాము. ముందు అధికారం కావాలి, ఆ తర్వాత డబ్బు కావాలి అని ఎలా మర్చిపోయారు? అధికారం ఉంటే డబ్బు వస్తుంది, డబ్బు వస్తే అధికారం రాదు అని చిలక్కు చెప్పినట్టు చెప్పాను, మీరేమో "నాకు చిలకభాష రాదు, నువ్వు చెప్పింది అర్థం కాలేదు" (ఇది మా గురువుగారు తెలుగోడు గారినుండి కాపీ కొట్టాను) అన్నారు.

మనం పార్టీ పెట్టినపుడే అనుకున్నాము కదా -  సుమారు 50 సీట్లు తప్పక వస్తాయి, ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ రాదు కాబట్టి మనమే కింగ్ మేకర్ అవుతాము అని. మీరు సపోర్ట్ ఇచ్చినందుకు గాను కొన్ని వేల కోట్లు, మినిస్ట్రీలు ఇచ్చేవారు. నాలుగో ఐదో ఏంపీ సీట్లొస్తే కేంద్రంలో కూడా చక్రం తిప్పవచ్చు, అరవింద్ గారిని కేంద్ర మంత్రి చేయవచ్చు అనుకున్నాము కదా?

మీరు కూడా కేసీయార్, లాలూ ప్రసాద్ యాదవ్, రాంవిలాస్ పాశ్వాన్‌ల సరసన చేరి ఇటు రాష్ట్ర, అటు కేంద్రప్రభుత్వాల సుస్థిరతను నాశనం చేయగలిగే మరో రాజకీయనాయకుడు అవుతారు అనుకున్నాము కానీ మీరేమో తొందరపడి సీట్లన్నీ అమ్ముకొని ఎందుకూ పనికిరాని 18 సీట్లు గెల్చుకొని "చేతకాని చవట నాయకుడు" "మెగా జోకర్" "సీట్ల బ్రోకర్" అని పేరు తెచ్చుకున్నారు చిరంజీవి గారూ, పేరు తెచ్చుకున్నారు.

వేరే పార్టీలనుండి వలస వచ్చిన భిక్షగాళ్ళకు, రాత్రికి రాత్రి పార్టీలు మారిన వాళ్ళకు టికెట్లు ఇచ్చారు. మీరేమో "ప్రజలు పిలిస్తే వచ్చాను, నాకేమీ రావాలని లేదు" అన్నారు. ప్రజలేమో ఆ భిక్షగాళ్ళను పట్టించుకొలేదు, మేము పిలవకుండానే పిలిచామని చెప్తావా ఆయ్ అని మన పార్టీ అభ్యర్థులను, మిమ్మల్నొక చోట డొక్కలో తన్ని డిక్కీలో పడుకోబెట్టారు.

ఇన్నేళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఉన్నా ఒక్కరంటే ఒక్క సినీస్టార్ కూడా మీ వెంట రాలేదు. మీవెంట వచ్చిన పిల్ల స్టార్లను "కోతి మనిషిగా ఎదగకపోతే ఎలా ఉంటుందో" చూడడానికి వచ్చారు కానీ వాళ్ళను చూసి ఓట్లేయడానికి కాదు చిరంజీవిగారూ, కాదు. ఆ పిల్లకోతులను మళ్ళీ సినీజూకే పరిమితం చేయండి.

జరిగిందేదో జరిగిపోయింది.  వచ్చే ఎలక్షన్లలో అల్లు అరవింద్ గారిని దూరంగా పెట్టి సీట్ల అమ్మకాన్ని మీరే దగ్గరుండి చూసుకోండి. 100 సీట్ల కంటే ఎక్కువ అమ్మవద్దు లేదా నాన్నవద్దు. అలా అయితేనే మనం అనుకున్న 50-60 సీట్లు గ్యారంటీగా వస్తాయి, మీరు కింగ్ మేకర్ అయి వేలకోట్లకు మన ఎమ్మెల్యేలను అమ్మవచ్చు.

మనకు అందరికంటే ముఖ్యం కార్యకర్తలు. మనం చెప్పినట్లు కాళ్ళ దగ్గర పడి ఉండి నమ్మకంగా పనిచేసేలా వీళ్ళను తయారుచేసుకోవాలి, లేకుంటే మిమ్మల్ని పాలకొల్లులో తరిమి కొట్టినట్టు తరిమికొడతారు. కార్యకర్తలతో ఆప్యాయంగా మాట్లాడినట్టు నటించండి. మీరు వాళ్ళకు లక్షలివ్వనక్కర్లేదు, మీదగ్గరికి వచ్చినపుడు ఆప్యాయంగా "టిఫిన్ తిన్నారా" అని పలకరించి ఇడ్లీ, రవ్వ ఇడ్లీ, గారె, మషాలా గారె, ఉప్మా, కిచిడీ, పెసరట్టు, మినపట్టు, రవ్వట్టు, మషాలా అట్టు, బాత్తు, టమేటా బాత్తు, బోండా, బజ్జీ, మైసూరు బజ్జీ, మిరపకాయ బజ్జీ, అరిటికాయ బజ్జీ, తమలపాకు బజ్జీ, లడ్డు, బందరు లడ్డు, రవ్వ లడ్డు, మిఠాయి, పీచు మిఠాయి, బందరు మిఠాయి, బొంబాయి మిథాయి, కలకత్తా మిఠాయి, జాంగ్రీ, పాలకోవా,హల్వా, మైసూరు పాకు, అమలాపురం కాజా, భీమవరం బాజా, పెద్దాపురం కూజా .. ఇలా మీ ఇంట్లో ఏవుంటే అవి పెట్టండి. మీరు తెచ్చిపెట్టుకొనే ఎమోషన్‌తో వీళ్ళముందు బాగా నటిస్తే చాలు, పొంగిపోయి నమ్మకంగా కాళ్ళ దగ్గర పడి ఉంటారు. అదే మన ఓటుబ్యాంకుకు శ్రీరామరక్ష.

ప్రచారం మరో ముఖ్యమయిన అంశం. ఏదో మొక్కుబడిగా ఊరికొక సభ కాకుండా వాడవాడలా సభలు నిర్వహించండి. ఉదాహరణకు, బెజవాడలో  ప్రచారం చేయాలంటే... గవర్నరుపేట, లబ్బీ పేట, పున్నమ్మ తోట, భాస్కర్రావు పేట, సింగు నగరం, ప్రజాశక్తి నగరం, అయోధ్యా నగరం, ముత్యాలపాడు, గుణదల, గాంధీ నగరం, చిట్టి నగరం, మాచవరం, రోకళ్ళపాలెం, మారుతీ నగరం, మొగల్రాజపురం, భవానీపురం, సత్యన్నారాయనపురం, సీతారామపురం.. మొదలయిన అన్ని ప్రాంతాల్లో సభలు నిర్వహించాలన్నమాట.

అమెరికాలో సభలు నిర్వహించి "అమెరికా చిరంజీవి", సైబరాబాద్‌లో సభలు నిర్వహించి "'హైటెక్ చిరంజీవి", మురికివాడల్లో సభలు నిర్వహించి "మురికి చిరంజీవి", పెంటపాడులో సభలు నిర్వహించి "పెంట చిరంజీవి".. ఇలా రక రకాల ఫోజులతో ఫోటోలు తీయించుకొని మాకు పంపండి. మేము వెబ్‌సైట్లు పెట్టి మీ గొప్పదనాన్ని చాటుతూ డబ్బులు ఇవ్వమని అడుగుతాము. ఆ ఫోటోలు చూసి ముందు-వెనుక ఆలోచించకుండా గొర్రెల్లా డబ్బు ఇవ్వడానికి ఎంతోమంది సిద్ధంగా ఉన్నాము చిరంజీవి గారూ, సిద్ధంగా ఉన్నాము.

కనీసం ఇకనయినా మీరు కళ్ళు తెరిచి, చీమతలకాయంతయినా బుర్ర ఉపయోగించి అన్ని సీట్లు అమ్ముకోకుండా, వచ్చే ఎలక్షన్ల తర్వాతయినా మన పార్టీ ట్యాగ్‌లైన్ అయిన 'అధికారమే లక్ష్యం, డబ్బే మార్గం' సాధిస్తారన్న నమ్మకంతో...

ఓ అభిమాని.

భరతఖండంబు పద్యం - మతగజ్జి కుక్కలు

Posted by జీడిపప్పు

నిన్న మహేష్ గారి బ్లాగులో "భరతఖండంబు చక్కని పాడి ఆవు" పద్యం గురించి కొత్త విషయాలు తెలుసుకున్నాను. మహేష్ గారి మిగిలిన చెత్త పోస్టులలా కాకుండా ఈ పోస్టు ఆలోచింపచేస్తూ నిజాలను వెలుగులోకి తెచ్చేలా ఉంది. "రాముడికి సీత ఏమవుతుంది" లాంటి పోస్టులు వేసి "బ్లాగులోకపు కే ఏ పాల్" అని పేరు తెచ్చుకున్న మహేష్ గారు తన ట్యాలెంట్‌ను ఇలాంటి మంచి పోస్టులకు వినియోగిస్తే ఎంత బాగుంటుందో! ఆ రోజు తొందర్లో రావాలని మహేష్ గారి అభిమానిగా ఆశిస్తున్నా.

సరే, ఇక అసలు విషయానికొస్తే - ఈ పద్యం రాసింది చిలకమర్తివారు అని అందరూ అనుకుంటారు కానీ, నిజానికి ఇది ఆయన రాసింది కాదట, చెన్నాప్రగడ భానుమూర్తి అనే ఆయన రాసిందట. దాదాపు వందేళ్ళ తర్వాత అసలు సంగతి ఆధారాలతో సహా బయటపడింది. ఇది నిజంగా చాలా గొప్పవిషయం. చెన్నాప్రగడ భానుమూర్తికి దక్కవలసిన గుర్తింపు ఇప్పటికయినా దక్కింది. లేకుంటే ఆయన పేరు భావి తరాల వారికి తెలిసేది కాదు.

ఆసక్తికరమయిన విషయం ఏమిటంటే, ఈ సంగతి దాదాపు "నూరేళ్ళ" తర్వాత బయటపడింది. 1910 ప్రాంతంలో ఈ పద్యం పాడని ఆంధ్రులు లేరు. ప్రతి ఒక్కరూ ఈ పద్యం పాడుకొని తమలోని దేశాభిమానాన్ని పెంచుకొనేవారు. మరి అప్పుడే చెన్నాప్రగడ వారు ఎందుకు నిజాన్ని బయటపెట్టలేదు? ఆ సంగతి నలుగురికీ చెప్పి చిలకమర్తివారికి దక్కాల్సిన ఖ్యాతిని ఎందుకు దక్కించుకోలేదు? అన్న ప్రశ్నలు ఉదయించకమానవు. దీని వెనుక ఆసక్తికరమయిన నిజాలు ఉన్నాయి.

నిజానికి చెన్నాప్రగడ వారూ, చిలకమర్తివారూ ఇద్దరూ మంచి మిత్రులు. కానీ చిలకమర్తివారు తన రచనా సామర్థ్యంతో అనతికాలంలో గొప్ప పేరు తెచ్చుకొని ధనవంతుడయ్యాడు. ఒకసారి చెన్నాప్రగడ గారు 'భరతఖండంబు" పద్యం వ్రాసి అభిప్రాయం చెప్పమని చిలకమర్తివారికి చూపించారు. ఆ పద్యం విలువ తెలుసుకున్న చిలకమర్తివారు ఆ పద్యాన్ని జూదంలో పందెంగా పెట్టమని చెన్నాప్రగడ వారిని బలవంత పెట్టి మోసపూరితంగా ఆ పద్యాన్ని సొంతం చేసుకున్నారు.

మోసాన్ని మోసంతో జయించాలన్న చెన్నాప్రగడగారు ఆ పద్యాన్ని "భారత ధర్మ దర్శనం" అనే పుస్తకంలో ఇరికించి మొత్తం 875 పుస్తకాల ప్రతులను అచ్చువేయించారు. ఈ పుస్తకం జనాల్లోకి వెళ్ళి అందరూ ఆ పద్యం చిలకమర్తివారు వ్రాసింది కాదు అని తెలుసుకోవడం మొదలుపెట్టారు. ఇది సహించలేని చిలకమర్తివారు మెరికల్లాంటి గూండాల ద్వారా ఆ పుస్తకాలను బలవంతంగా స్వాధీనం చేసుకోవడం మొదలుపెట్టాడు. అచ్చయి ఉన్న పుస్తకాల్లో 874 పుస్తకాలను స్వాధీనం చేసుకొని అన్నీ తగులబెట్టాడు. ఒక్కటి మాత్రం ఎంత ప్రయత్నించినా దొరక లేదు. చిలకమర్తి వారి కుట్ర తెలుసుకున్న ఒకడు ఆ పుస్తకం తీసుకొని కుటుంబంతో సహా రంగం (బర్మా) పారిపోయాడు. చిలకమర్తివారు తన గూఢచారులతో ఎంత వెతికించినా ఆ చివరి పుస్తకాన్ని కనుక్కోలేకపొయారు.

తనకున్న అర్థబలం, అంగబలంతో చెన్నాప్రగడ గారికి ప్రాణహాని తలపెడతానని భయపెట్టడంతో ఆయన ఆ పద్యం తానే రాసానన్న సంగతి ఎప్పటికీ బయట పెట్టలేదు. అసలు సంగతి తెలిసిన కొందరు చెన్నాప్రగడ గారిని నిజం బయటపెట్టమన్నా ఆయన పెట్టకపోవడానికి కారణం ప్రాణభయమే. ఆ దొరకని ఒక్క పుస్తకం దొరకడం వల్ల నూరేళ్ళ తర్వాత అసలు నిజం బయటపడింది. ఇప్పటికయినా మన ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని ఈ పద్యం ద్వారా చిలకమర్తివారు సంపాదించిన కీర్తిని, ధనాన్ని రద్దు చేసి చెన్నాప్రగడ వారికి ఆ కీర్తి, ధనం దక్కేలా చేయాలి.

మహేష్ గారు ఈ గొప్ప నిజాన్ని పరిచయం చేయడంతో పాటు "ఈ వివాదానికి తోడు ఈ పద్యంలో మతప్రస్తావనా, కులప్రస్తావనా ఉండటంవల్ల మరోవివాదం రగలకుండా ఉంటే అంతే చాలు." అని కూడా అన్నారు. ఇది అక్షర సత్యం. చిలకమర్తివారి పైన చర్య తీసుకోవడం కంటే ఈ పద్యం వల్ల మతకల్లోలాలు, కుల ఘర్షణలు తలెత్తకుండా చూడాలి.

అందరూ మహేష్ గారిలా వివాదం రగలకూడదు అని కోరుకొనేవాళ్ళు కాదుగా! కొందరు మతగజ్జి రోగులు ఉంటారు. వీరివల్లే అసలు ముప్పు. నూరేళ్ళుగా ఎన్నడూ ఎవరికీ కనిపించని కుల, మత విషయాలు ఈ గజ్జి కుక్కలకు కనిపిస్తాయి. ఈ కుక్కలకు కేవలం మతగజ్జే కాకుండా కులగజ్జి కూడా ఉండడం వల్ల వీటిని దూరంగా ఉంచాలి. లేకపోతే "ఆ ఏముంది, ఇది మంచి దేశభక్తి పద్యం" అనే వాళ్ళను కూడా "లేదు, సరిగా చూడు, ఇందులో కుల, మత ప్రస్తావన ఉంది" అంటూ విషబీజాలు నాటి తమకున్న గజ్జిని మనుషులకు కూడా అంటిస్తాయి.

ఏది ఏమనయిప్పటికీ, చిలకమర్తివారు ఈ పద్యం ద్వారా సంపాదించుకున్న కీర్తిని రద్దు చేసి, చెన్నాప్రగడ గారికి దక్కవలసిన పేరును దక్కించి, అలాగే ఈ మతగజ్జి కుక్కలను తరిమికొట్టే విధంగా రాబోవు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని ఆశిద్దాం.

నిరాశపరిచే పెళ్ళి చేసి చూడు

Posted by జీడిపప్పు

పాత సినిమాల్లో ఎన్నో వినోదాత్మక ఆణిముత్యాలున్నా నాకు బాగా నచ్చే మూడింటిని ఎంపిక చేయవలసి వస్తే మాయాబజార్, మిస్సమ్మ, గుండమ్మ కథలను ఎన్నుకుంటాను. సినిమా ఎలా తీయాలి అన్న విషయంలో మాయాబజార్ "గాడ్ ఫాదర్ ఆఫ్ తెలుగు సినిమా" అయితే మిగిలిన రెండూ దాని సీక్వల్స్ అనిపిస్తాయి. విజయా సంస్థ నిర్మించిన ఈ మూడు చిత్రాలు ఇష్టపడడానికిగల మరొక కారణం వీటిలో అత్యుత్తమ నటులయిన ఎస్వీరంగారావు, ఎంటీయార్, సావిత్రి ఉండడం.

ఎప్పటినుండో వాయిదా వేస్తున్న 'పెళ్ళి చూసి చూడు'  సినిమా చూసే ముందు నటీనటుల వివరాలు చూసాను. ఇది కూడా విజయా వారిచే పైన చెప్పిన ముగ్గురు మహామహులు నటించగా తీయబడింది, అందునా దర్శకుడు మిస్సమ్మ తీసిన ఎల్వీ ప్రసాద్ అని తెలియగానే మరో పసందయిన విందుభోజనం అని కాస్త భారీ అంచనాలతో చూడడం మొదలు పెట్టాను.

సినిమా మొదలయినప్పటినుండీ సుమారు అరగంట వరకు ముగ్గురు మహానటుల్లో ఒక్కరూ కనపడలేదు. కాసేపటికి ఎస్వీఆర్, సావిత్రి కనిపించినా పెద్దగా ఆసక్తి కలగదు. వీరిద్దరివీ చాలా చిన్న పాత్రలు. సావిత్రి అప్పటికి పూర్తి స్థాయి నటిగా ఎదగలేదు అనుకుంటా. ఎస్వీ రంగారావు "ధూపాటి వియ్యన్న" పాత్రలో పర్వాలేదనిపించాడు. ముక్కుఎగరేస్తూ కళ్ళు చటుక్కున మూయడం ఈ పాత్ర మేనరిజం. రెండో హీరో అసిస్టెంట్ పిల్లవాడిది నవ్వించే లేదా కోపం తెప్పించే పాత్ర. "బాల్య ప్రేమికుల" సినిమాల దర్శకుడు తేజ ఈ సినిమాలోని రెండో హీరో అసిస్టెంట్‌ను చూసే స్పూర్తి పొందాడేమో!!!

మొదటి గంటసేపు కథ అంతా జి.వరలక్ష్మి, ఆమె అన్న (నటుడి పేరు తెలియదు) చుట్టూ తిరుగుతుంది. అసలు జి.వరలక్ష్మిని హీరోయిన్ గా ఎందుకు ఎంచుకున్నారో తెలియదు, మరీ అధ్వాన్నమయిన నటన ఈమెది. ఆమె అన్నగా వేసిన నటుడు కూడా చిరాకు పుట్టిస్తాడు. అదృష్టవశాత్తూ గంట తర్వాత అయినా ఎంటీఆర్ కనిపిస్తాడు. అక్కడ నుండి కాసేపు సరదాగా సాగితుంది. అంతలో అర్థం పర్థం లేని డ్రామాలు విసుగు తెప్పిస్తాయి. చాలా సులువుగా కథను సుఖాంతం చేసే అవకాశమున్నా ఎల్వీప్రసాద్ నానా తంటాలు పడ్డాడెందుకో.

కథలో ఎక్కడా పట్టు కనిపించదు, ఎంటీయార్ తప్ప మిగిలిన పాత్రల నటన, సంభాషణలు ఆకట్టుకోవు. ఈ సినిమాలో పాటలు, సంగీతం కూడా అంతంత మాత్రమే. "పెళ్ళి చేసుకొని ఇల్లు చూసుకొని" పాటొక్కటే బాగుంటుంది. ఇవన్నీ గమనిస్తే మూడేళ్ళ తర్వాత అత్యద్భుతమయిన "మిస్సమ్మ" తీసిన ఎల్వీ ప్రసాదేనా ఇంత నాసిరకం సినిమా తీసింది అనిపిస్తుంది. ఈ సినిమా కన్యాశుల్కంలా సందేశాన్ని సూటిగా ఇవ్వదు, మిస్సమ్మలా వినోదం పంచదు. అసలు ఇది వినోదాత్మక చిత్రమో, సందేశాత్మక చిత్రమో లేక వినోశాత్మక చిత్రమో అర్థం కాదు.

చివరగా, మిస్సమ్మ సినిమా ఇరవై రెండోసారి చూస్తావా లేక పెళ్ళి చేసి చూడు సినిమా రెండోసారి చూస్తావా అంటే నా ఓటు ఇరవై రెండోసారికే!

వంగూరి చిట్టెన్‌రాజు గారి అమెరికామెడీ

Posted by జీడిపప్పు

నాకు టొమాటోరసం తర్వాత బాగా నచ్చే రసం హాస్యరసం. రకరకాల దినుసులతో తయారు చేసిన విభిన్న హాస్యరసాలను ఆస్వాదించినా... ఒక చెంచా వ్యంగ్యం, ఒక చెంచా విమర్శ కలిపి చేసిన హాస్యరసాన్ని ఎక్కువ ఆస్వాదిస్తాను. హాస్యంలో ఈ రెండింటినీ సమపాళ్ళలో మిళితం చేసి నిఖార్సయిన హాస్యరసాన్ని వండే అతికొద్దిమంది సమకాలీన రచయితల్లో వంగూరి చిట్టెన్‌రాజు గారు ఒకరు అని నా own స్వంత పర్సనల్ స్వాభిప్రాయం.

చిట్టెన్‌రాజు గారి రచనలను మొదటిసారి కౌముది వెబ్ పత్రికలో చూసాను. 'అమెరికామెడీ' పేరుతో వెలువడే శీర్షికలో చిట్టెన్‌రాజు గారు తన అనుభవాలను హాస్యభరితంగా, అపుడపుడూ కాస్త ఎగస్ట్రా మసాలా దట్టించి, పాఠకులకు అందిస్తున్నారు. నాకు చిట్టెన్‌రాజు గారి గురించి outside information ఏమీ తెలియదు కానీ, ఆయన రచనల ద్వారా అర్థమయిందేమిటంటే  -

ఆయన తెలుగు సాహిత్యం పట్ల మోతాదుకంటే ఎక్కువ అభిమానమున్న అమెరికాంధ్రుడు. సభలూ, సన్మానాలు అంతా కమర్షియలైజ్ అయిపోతున్న ఈ తరుణంలో కూడా "సాహిత్యం/కళ పట్ల ఆసక్తి అన్నది మనసులో నుండి రావాలి కానీ మెప్పుకోసం, కీర్తి కోసం సాహిత్య పోషణ ముసుగు వేసుకోకూడదు" అనుకొనే సత్తెకాలపు సత్తెయ్య. తెలుగు సాహిత్య సభలు విజయవంతం కావాలంటే నిజమయిన సాహితీ ప్రేమికుల కంటే ముమైత్ ఖాన్ డ్యాన్సులే ముఖ్యం అని తెలుసుకోలేని అమాయకజీవి. లేకుంటే ఒక్క సినీ స్టార్ కూడా లేకుండా హైడ్రాబ్యాడ్ లో సాహితీ సభలు నిర్వహిస్తారా, అదీ ఎంట్రీ ఫీజ్ పెట్టి!! నాకే గనక ఆ ఓపిక, అవకాశం ఉంటే తెలుగు సాహితీ సభలకు ఇలియానాను పిలిపించి నాలుగు బజారు డ్యాన్సులేయించి "నాకీ టెల్గు గొంజం గొంజం వష్టాయ్" అని చెప్పించి ఆ సభను మరింత విజయవంతం చేసి కుప్పలు తెప్పలుగా డబ్బులు సంపాదించేవాడిని. చిట్టెన్‌రాజు గారికి ఆ తెలివి లేదు పాపం!

ఇక 'అమెరికామెడీ' సంగతికొస్తే - ఇంటా బయటా సాహితీ సభలను నిర్వహించడానికి పడ్డ కష్టాలు, ఆంధ్రాకు వెళ్ళినపుడు తగిలిన 'కల్చరల్ ఝలక్‌లు", అమెరికాలో ఆటా, తానా, తందానా సంఘాల పైన చురకలు, తెలుగు సభల్లో ఎదురయ్యే "తీయని అనుభవాలు", అఖండ అఖిల అమెరికాఖండ తెకోకారా డీలక్స్ సాహితీ సదస్సులు, "పెంట" "మంట" సంఘాలు, "టీవీ సీరియల్" కష్టాలు, ఎప్పటికప్పుడు "క్వీన్ విక్టొరియా" గారిచే టెంకిజెల్లలు...  ఆద్యంతం నవ్వుల జల్లులు కురిపిస్తాయి.

ఇప్పటికీ నెల నెలా కౌముది వెలువడగానే నేను మొదట చూసే శీర్షిక చిట్టెన్‌రాజు గారిదే. అమెరికామెడీ ఎపిసోడ్లన్నీ డౌన్‌లోడ్ చేసుకొని ఒక పుస్తకంగా చేయాలన్న ఆలోచనను చాన్నాళ్ళనుండి వాయిదా వేస్తున్నాను. కాగల కార్యం కౌముదివారే చేసారన్నట్టు అమెరికామెడీ ఇపుడు పుస్తకరూపంలో లభ్యమవుతున్నది.  సెల్‌ఫోన్ ఆఫ్ చేసి ఈ పుస్తకం చదువుతూ ఓ రెండు గంటలు నవ్వులలోకంలో విహరించవచ్చు!

ఇంక చాలు..వెళ్ళు Brett Favre

Posted by జీడిపప్పు

మిగతావారితో పోలిస్తే నాకు NFL పట్ల ఆసక్తి కలగడానికి కాస్త ఎక్కువ సమయమే పట్టింది. ఒక సీజన్ పూర్తిగా చూసాక NFL అభిమానినయ్యాను, తర్వాత క్రమక్రమంగా వీరాభిమానినయ్యాను. ఈ క్రమంలో కొందరు ప్రస్తుత, గత ఆటగాళ్ళ గురించి తెలుసుకొని ఆటను మరింత ఆస్వాదించడం మొదలుపెట్టాను. డాన్ మరినో, ట్రాయ్ ఐక్‌మన్ నుండి నేటి పేటన్ మేనింగ్, టాం బ్రేడీ వరకు ఎవరికి వారే సాటి. కానీ వీరందరికంటే గొప్పవాడు బ్రెట్ ఫార్వ్ అనిపించింది, కొన్ని విషయాలు తెలుసుకున్నాక. 15 ఏళ్ళపాటు మయామీ డాల్ఫిన్స్ QB గా ఉన్న డాన్ మరినో, అమెరికాను నివ్వెరపోయేలా చేసిన పిట్స్ బర్గ్ స్టీలర్స్ QB టెర్రీ బ్రాడ్‌షా, క్వార్టర్‌బ్యాక్ లకు ఆదర్శమయిన జో మాంటానా లాంటి అతిరథ మహారథులున్నా బ్రెట్ ఫార్వ్ పట్ల ఎక్కువ గౌరవం కలగడానికి కారణం గ్రీన్‌బే ప్యాకర్స్ కు క్వార్టర్‌బ్యాక్ కావడమే.

మిగతా టీములకంటే గ్రీన్ బే ప్యాకర్స్ కున్న ప్రత్యేకత ఏమిటంటే - ప్రజాస్వామ్యం నిర్వచనం టైపులో ఈ టీం విస్కాన్సిన్ రాష్ట్ర ప్రజలయొక్క, ప్రజలచేత, అఫ్కోర్స్ ప్రజలకొరకు పుట్టిన టీం. మిగిలిన 31 టీములకూ ఒక్కో వ్యక్తి యజమాని అయితే, ప్యాకర్స్ కు ప్రజలే యజమానులు. పెట్టుబడి అంతా ప్రజలనుండే వస్తుంది. అందుకు ప్రతిఫలంగా ప్రజలకు షేర్లు, కొన్ని నిర్ణయాల పైన హక్కులు ఇవ్వబడుతాయి. మిగిలిన టీములన్నిటిపట్లా ఆ పట్టణాల్లోని చూపించే అభిమానం కంటే ప్యాకర్స్ పట్ల విస్కాన్సిన్ వాసుల అభిమానమే ఎక్కువ.

ఇలాంటి టీములో అడుగుపెట్టిన బ్రెట్ ఫార్వ్ కొద్ది కాలానికే ప్యాకర్స్ అంటే ఫార్వ్, ఫార్వ్ అంటే ప్యాకర్స్ అనే స్థాయికి ఎదిగాడు. బయటనుండి ఎన్ని ఆఫర్లు వచ్చినా కాదని అక్కడే స్థిరపడ్డాడు. బ్రెట్ ఫార్వ్ పేరుతో వెలువడిన ఏ వస్తువయినా ప్రజలు ఎగబడి కొనేవాళ్ళు. ఫార్వ్ ఏది చేసినా ప్యాకర్స్ మంచి కొరకే అని నమ్మేవాళ్ళు, ఫార్వ్ కూడా అలాగే చేసాడు. ఎన్నో రికార్డులను బద్దలు కొట్టి అందరి అంచనాలను మించి ఆడేవాడు,  జీసస్ క్రైస్ట్ ను కలుస్తారా బ్రెట్ ఫార్వ్ ను కలుస్తారా అంటే విస్కాన్సిన్ మొత్తం "జీసస్ క్రైస్టా? who" అనడానికి సంకోచించేవారు కాదు.

అలాంటి బ్రెట్ ఫార్వ్ నాలుగేళ్ళ ముందు, 12 ఏళ్ళు ప్యాకర్స్ తో ఆడిన తర్వాత రిటైర్ ఆలోచన వెలుబుచ్చాడు. మరో రెండు ఏళ్ళు అదే మాట చెపుతూ ఆడాడు. ఆ మధ్యలో బోర్డ్ ఆఫ్ డైరక్టర్లతో అభిప్రాయభేదాలు వచ్చాయి. ఎట్టకేలకు గత ఏడాది మార్చ్ లో రిటైర్ అయ్యాడు. క్రీడాలోకం అంతా ఫార్వ్ గొప్పదనాన్ని వేనోళ్ళ పొగిడింది. అభిమానుల బాధకయితే అంతే లేదు.

కొద్ది రోజులకు ఏమయిందో ఏమో, తాను మళ్ళీ ఆడతానన్నాడు. అప్పటికే ఉన్న విభేదాలవల్ల డైరక్టర్లు ఒప్పుకోలేదు. విస్కాన్సిన్‌లో ఆరాధ్య దైవం ఇమేజ్ ఉన్న ఫార్వ్, ఆ కోపంలో న్యూయార్క్ జెట్స్ తరపున ఒక ఏడాది ఆడి అపఖ్యాతిపాలయ్యాడు. అభిమానులు చాలా అసంతృప్తితో ఉండగా ఆ సీజన్ అయిన వెంటనే మళ్ళీ రిటైర్మెంట్ ప్రకటించాడు. అందరూ జరిగినది పీడకలలా మర్చిపోతుంటే, ప్యాకర్స్ ఆగర్భ శత్రువయిన మిన్నెసోటా వైకింగ్స్ తరపున ఆడడానికి మంతనాలు జరపడం మొదలుపెట్టాడు.

ఒకప్పుడు కేవలం విస్కాన్సిన్‌లో మాత్రమే కాక అమెరికా అంతా అభిమానులను సంపాదించుకున్న ఫార్వ్ చేస్తున్నవి చూసి అందరూ అసహ్యించుకుంటున్నారు. ఇప్పటికయినా బ్రెట్ ఫార్వ్ తన పద్దతి మార్చుకొని ఫుట్‌బాల్‌కు స్వస్తి చెపితే ఆ మిగిలి ఉన్న అభిమానం అయినా ఉంటుంది. లేకపోతే చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు!

కామెడీ షోలు

Posted by జీడిపప్పు

అమెరికాకు వచ్చిన కొత్తల్లో నన్ను బాగా ఆకట్టుకున్న అంశాలలో సిట్‌కాం గా పిలువబడే సిచ్యువేషన్ కామెడీ షోలు ఒకటి. ఇవి నచ్చడానికి గల కారణాలు ఏమిటంటే - సీరియళ్ళలోలా ఇందులో "అంతులేని కథలు" ఉండవు, పాత్రల గురించి కాస్త తెలిస్తే చాలు. కుట్రలు, కుతంత్రాల బదులు ఆద్యంతం నవ్వులే నవ్వులు. రోజూ స్కూల్ నుండి ఇంటికి రాగానే Everybody Loves Raymond చూడడం ద్వారా మొదలయింది ఈ సిట్‌కాంల వీక్షణం.  క్రమక్రమంగా ఇవి దైనందిన జీవితంలో భాగమయిపోయాయి. అప్పట్లో "గుప్తుల కాలం స్వర్ణయుగం" అన్నట్టు కామెడీ స్వర్ణయుగాన్ని సాక్షాత్కరింపచేసిన కామెడీ షోలు గత రెండేళ్ళుగా చాలా నిస్సారంగా సాగుతున్నాయి అనిపిస్తోంది. ఈ సందర్భంగా కొన్ని షోల సింహావలోకనం:

Bill Cosby Show - ఇది ఇప్పటివరకు నేను చూసిన అత్యద్భుత, అమోఘమైన, ఆరోగ్యకరమైన షో. ఒక్క పరుషమయిన మాట లేకుండా, కించపరిచే లేదా నొప్పించే మాటలు లేకుండా, సకుటుంబసమేతంగా చూడగలిగే హాస్యాన్ని సృష్టించినందుకు బిల్ కాస్బీకి అపర హాస్య బ్రహ్మ అని బిరుదు ఇవ్వవచ్చు. ఈ షో వల్ల చదువుకున్న నల్లజాతీయుల పట్ల మిగతా అమెరికన్ల దృక్పథం కొంతయినా మారిందట. భార్య-భర్తలు, పెద్దలు-పిల్లలు, పెద్దలు-పెద్దలు, పిల్లలు-పెద్దలు ఎలా ఉండాలో ఈ షోలో చెప్పినంత చక్కగా, హాస్యభరితంగా మరి ఏ ఇతర షోలోనూ చెప్పలేదనుకుంటా. ఇది కుటుంబానికి ఎన్‌సైక్లోపీడియా లాంటిది అంటుంటారు. ఈ షో గురించి పూర్తిస్థాయి వ్యాసం వ్రాయవచ్చు.

Everybody Loves Raymond - కాస్బీ షో తర్వాత నాకు బాగా నచ్చే షో ఇది. కుటుంబంలో ఎటువంటి సమస్య వచ్చినా బిల్ కాస్బీ తనదైన శైలిలో సున్నితంగా పరిష్కరిస్తే, రేమండ్ మాత్రం తనదైన పద్దతిలో మరింత సంక్లిష్టం చేస్తాడు. రేమండ్ చేసే తింగరి పనులకు ఘాటుగా స్పందిస్తూ, రేమండ్ ను అమితంగా ప్రేమించే భార్య, తన కొడుకులకు 40 ఏళ్ళు వచ్చినా చిన్న పిల్లల్లా భావిస్తూ, కోడలికి చురకలంటిచే అత్త, ముసలివాడయినా ఏ మాత్రం చురుకుదనం తగ్గకుండా భార్య పైన సెటైర్లు వేసే తండ్రి, పోలీసు ఆఫీసరు అయినా తమ్ముడితో కీచులాడే అన్న, వీళ్ళ మధ్య బొమ్మలాంటి అమ్మాయి, ఇద్దరు కవలలతో ఆద్యంతం కుటుంబంలో గొడవలు, కీచులాటలు, ప్రేమాభిమానాలతో నవ్వించే మరో ఆణిముత్యం ఈ షో.

F.R.I.E.N.D.S - ఇప్పటివరకు వచ్చిన టీవీ షోలలో యువతను ఈ షో కంటే ఎక్కువ ఏదీ ఆకట్టుకొని ఉండదేమో. కలసిమెలసి జీవించే ముగ్గురు యువకులు, ముగ్గురు యువతుల కథ ఇది. ఒక ప్రేమ జంట, ప్రేమించుకున్నా చెప్పుకోని మరో జంట, ప్రేమించడానికి అమ్మాయి దొరకని జోయి, అదో అయోమయం మాలోక ఫీబీ,  వీరితో పాటు వచ్చి పోయే బోయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ తో యువత జీవితానికి దర్పణం పడుతుంది. ఒకానొకదశలో ఎవరు ఎవరితో కలుస్తారో తెలియక అయోమయంతో పాటు సాగతీత ఎక్కువయింది.

 That 70s Show - ఇది F.R.I.E.N.D.S కు కాస్త అటు-ఇటుగా ఉంటుంది. విస్కాన్సిన్ లో ఉన్న ఒక మధ్య తరగతి కుటుంబంలోని టీనేజ్ కుర్రాడు ఇందులో కథానాయకుడు. పక్కింటి మగరాయుడు అమ్మాయి ఇతడి గర్ల్ ఫ్రెండ్. హీరో తల్లిదండ్రులు దత్తత తీసుకున్న మరొకడు, అదేదో దేశం నుండి వచ్చిన ఇంకో కుర్రాడు, ఇంకో యువ జంట అంతా కలసి బేస్‌మెంట్‌లో మాటలు చెప్పుకుంటూ గడిపేస్తుంటారు. భయస్తుడయిన హీరోను వాళ్ళ నాన్న అనే మాటలు కొన్ని సుత్తి వీరభద్రరావును గుర్తు తెస్తాయి. కథానాయకుడయిన టోఫర్ గ్రేస్ సినిమాల్లోకి వెళ్ళడంతో షో పాపులారిటీ తగ్గి 2006లో షో ముగిసింది. నాకయితే ఫ్రెండ్స్ కంటే ఇందులోనే ఎక్కువ హాస్యం కనిపిస్తుంది.

ఇవి నాకు బాగా నచ్చిన షోలు. కొద్ది రోజులు King of Queens చూసాను కానీ మొనాటనస్ కామెడీ అనిపించింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, యావత్ అమెరికా ఏకగ్రీవంగా The greatest show అని నిర్ణయించిన Seinfeld పట్ల ఎందుకో నాకు ఆసక్తి కలగలేదు. ఈసారెపుడయినా ఈ షోను ఒక పట్టు పట్టాలి.

ఇక వర్తమానానికొస్తే -  ప్రస్తుత ఏ షో కూడా పైన చెప్పినవాటిలోని హాస్యాన్ని అందించడం లేదు. గత రెండు మూడేళ్ళలో రియాలిటీ షోలు, ట్యాలెంట్ షోలు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. దీనివల్లేనేమో హాస్యంలో నాణ్యత తగ్గిపోతున్నది. అయినా అలవాటుపడిన ప్రాణం కాబట్టి కొన్ని కామెడీ షోలు చూస్తున్నాను. ఈ మధ్య నేను రెగ్యులర్‌గా చూస్తున్న షో Everybody Hates Chris. ఈ షోకున్న పెద్ద మైనస్ పాయింట్ క్రిస్ రాక్. క్రిస్ రాక్ అంటే నల్లజాతీయులను కించపరుస్తూ బూతులు మాట్లాడతాడు అని ప్రశస్తి. అటువంటివాడు తీస్తున్న షో ఎలా ఉంటుందో అని చూసాను, ఫరవాలేదు. నల్లజాతీయులను కించపరచడం ఎక్కువ లేదు. ఒక హైస్కూల్ కుర్రాడు ఇంట్లో, స్కూల్లో ఎదుర్కొనే సంఘటనల ఆధారంగా ఈ షో నడుస్తుంది. ప్రతి సెంటూ లెక్క చూసే తండ్రి, పిల్లలను క్రమపద్దతిలో పెంచే తల్లి పాత్రలు ఆకట్టుకుంటాయి.

మరొక అడల్ట్ కామెడీ షో Two and a Half Men కూడా పరవాలేదు. ఒక జల్సారాయుడు, డబ్బుల్లేని అతడి సోదరుడు, మనిషి పెరిగినా బుర్ర పెరగని కుర్రాడు ఒకే ఇంట్లో ఉంటారు. చాలా వరకు రేటెడ్ కామెడీ అయినా  చూడవచ్చు. చివరగా, యానిమేషన్ షో అయిన Family Guy - ఇప్పటివరకు ఈ షో ఎదుర్కున్న విమర్శలు మరి ఏ ఇతర యానిమేషన్ షో ఎదుర్కొని ఉండదు. చాలా చీప్ కామెడీ అయినా ఇందులోని స్టీవీ పాత్రను కాసేపు చూస్తే ఈ షోను వదలబుద్ది కాదు. మాటలు రాని ఈ చంటోడు (??!!) ప్రపంచాన్ని మొత్తం తన స్వాధీనంలో ఉంచుకోవాలనుకుంటాడు. వీడి తర్వాత బాగా ఆకట్టుకొనేది మాట్లాడే కుక్క బ్రయన్. ఈ రెండు పాత్రలకోసం చూడవచ్చు ఈ షో.

ఇదన్నమాట సిట్‌కాం ల ప్రసహనం. ఇప్పుడొస్తున్న షోలు మొక్కుబడిగా చూస్తున్నా, 20 నిమిషాలు హాయిగా నవ్వుకోవాలంటే మొదట చెప్పిన కాస్బీ, రేమండ్, ఫ్రెండ్స్, 70s షోలే ఇప్పటికీ శరణ్యం. మళ్ళీ అలాంటి షోలు ఎప్పుడొస్తాయో!