నిరాశపరిచే పెళ్ళి చేసి చూడు

Posted by జీడిపప్పు

పాత సినిమాల్లో ఎన్నో వినోదాత్మక ఆణిముత్యాలున్నా నాకు బాగా నచ్చే మూడింటిని ఎంపిక చేయవలసి వస్తే మాయాబజార్, మిస్సమ్మ, గుండమ్మ కథలను ఎన్నుకుంటాను. సినిమా ఎలా తీయాలి అన్న విషయంలో మాయాబజార్ "గాడ్ ఫాదర్ ఆఫ్ తెలుగు సినిమా" అయితే మిగిలిన రెండూ దాని సీక్వల్స్ అనిపిస్తాయి. విజయా సంస్థ నిర్మించిన ఈ మూడు చిత్రాలు ఇష్టపడడానికిగల మరొక కారణం వీటిలో అత్యుత్తమ నటులయిన ఎస్వీరంగారావు, ఎంటీయార్, సావిత్రి ఉండడం.

ఎప్పటినుండో వాయిదా వేస్తున్న 'పెళ్ళి చూసి చూడు'  సినిమా చూసే ముందు నటీనటుల వివరాలు చూసాను. ఇది కూడా విజయా వారిచే పైన చెప్పిన ముగ్గురు మహామహులు నటించగా తీయబడింది, అందునా దర్శకుడు మిస్సమ్మ తీసిన ఎల్వీ ప్రసాద్ అని తెలియగానే మరో పసందయిన విందుభోజనం అని కాస్త భారీ అంచనాలతో చూడడం మొదలు పెట్టాను.

సినిమా మొదలయినప్పటినుండీ సుమారు అరగంట వరకు ముగ్గురు మహానటుల్లో ఒక్కరూ కనపడలేదు. కాసేపటికి ఎస్వీఆర్, సావిత్రి కనిపించినా పెద్దగా ఆసక్తి కలగదు. వీరిద్దరివీ చాలా చిన్న పాత్రలు. సావిత్రి అప్పటికి పూర్తి స్థాయి నటిగా ఎదగలేదు అనుకుంటా. ఎస్వీ రంగారావు "ధూపాటి వియ్యన్న" పాత్రలో పర్వాలేదనిపించాడు. ముక్కుఎగరేస్తూ కళ్ళు చటుక్కున మూయడం ఈ పాత్ర మేనరిజం. రెండో హీరో అసిస్టెంట్ పిల్లవాడిది నవ్వించే లేదా కోపం తెప్పించే పాత్ర. "బాల్య ప్రేమికుల" సినిమాల దర్శకుడు తేజ ఈ సినిమాలోని రెండో హీరో అసిస్టెంట్‌ను చూసే స్పూర్తి పొందాడేమో!!!

మొదటి గంటసేపు కథ అంతా జి.వరలక్ష్మి, ఆమె అన్న (నటుడి పేరు తెలియదు) చుట్టూ తిరుగుతుంది. అసలు జి.వరలక్ష్మిని హీరోయిన్ గా ఎందుకు ఎంచుకున్నారో తెలియదు, మరీ అధ్వాన్నమయిన నటన ఈమెది. ఆమె అన్నగా వేసిన నటుడు కూడా చిరాకు పుట్టిస్తాడు. అదృష్టవశాత్తూ గంట తర్వాత అయినా ఎంటీఆర్ కనిపిస్తాడు. అక్కడ నుండి కాసేపు సరదాగా సాగితుంది. అంతలో అర్థం పర్థం లేని డ్రామాలు విసుగు తెప్పిస్తాయి. చాలా సులువుగా కథను సుఖాంతం చేసే అవకాశమున్నా ఎల్వీప్రసాద్ నానా తంటాలు పడ్డాడెందుకో.

కథలో ఎక్కడా పట్టు కనిపించదు, ఎంటీయార్ తప్ప మిగిలిన పాత్రల నటన, సంభాషణలు ఆకట్టుకోవు. ఈ సినిమాలో పాటలు, సంగీతం కూడా అంతంత మాత్రమే. "పెళ్ళి చేసుకొని ఇల్లు చూసుకొని" పాటొక్కటే బాగుంటుంది. ఇవన్నీ గమనిస్తే మూడేళ్ళ తర్వాత అత్యద్భుతమయిన "మిస్సమ్మ" తీసిన ఎల్వీ ప్రసాదేనా ఇంత నాసిరకం సినిమా తీసింది అనిపిస్తుంది. ఈ సినిమా కన్యాశుల్కంలా సందేశాన్ని సూటిగా ఇవ్వదు, మిస్సమ్మలా వినోదం పంచదు. అసలు ఇది వినోదాత్మక చిత్రమో, సందేశాత్మక చిత్రమో లేక వినోశాత్మక చిత్రమో అర్థం కాదు.

చివరగా, మిస్సమ్మ సినిమా ఇరవై రెండోసారి చూస్తావా లేక పెళ్ళి చేసి చూడు సినిమా రెండోసారి చూస్తావా అంటే నా ఓటు ఇరవై రెండోసారికే!

7 comments:

 1. పరిమళం said...

  "వినోశాత్మక"? ? :) :)

 2. Anonymous said...

  నేను 2003 లొ ఒకసారి విడియొ కొట్టు కు ఈ సినెమాల గురించి వెళ్ళాను.CD ధర 325/-. బేరమాడితే అతను ఏమి తగ్గించనన్నాడు. ప్రక్కనె Jr. NTR క్రొత్త సినిమా CD ధర 125/-. ఆది చూపించి పాత సినిమా కదా ధర తగ్గించమంటె అతని సమాధానం: ఈ సినిమాలు నెను ఎప్పటికైన అమ్ముకుంటాను కనుక ధర తగ్గించను. కావలంటె క్రొత్త సినిమా మీద డిస్కౌంట్ ఇస్తాను.

  మీరు చెప్పిన సినిమాలు వజ్రాలు. అవి Evergreen.

 3. రవి said...

  నేనూ ఈ సినిమా డీవీడీ ఎంతో డబ్బు పోసి కొన్నాను. చాలా నిరాశపర్చిన సినిమా ఇది. ఇలాంటిదే విజయా వారి ఇంకొక చిత్రం సీ ఐ డీ. పరమ బోరు.

 4. Shashank said...

  అదేంటీ నా ఇంతకముందు వ్యాఖ్య తేసేసావ్? సరెలే.. నీ ఇష్టం అనుకో..

 5. కొత్త పాళీ said...

  పెళ్ళిచేసి చూడు గొప్ప సినిమా కాదు గానీ మరీ తీస్పారెయ్యాల్సిన సినిమా కూడా కాదు. కాలప్రంఆణంగా చూస్తే మిస్సమ్మ కంటే ముందుది కాబట్టి ప్రసాదు ఇంకా కథ చెప్పే మెళకువలు నేర్చుకుంటున్నాడు అనుకోవచ్చు. పాటలు చాలా గొప్పగా ఉంటాయి (కనీసం నా ఉద్దేశం అది). ప్రధాన పాత్రలే కాక, దొరస్వామి (వరలక్ష్మి మేనమామ), కూచిభొట్ల శివరామక్రిష్ణయ్య (రామారావు తండ్రి) ఇత్యాదుల నటన కూడా అద్భుతంగా ఉంటుంది.
  వరలక్ష్మి అన్నగా వేసిన నటుడి పేరు జోగారావు అనుకుంటా. చంద్రహారం సినిమాలో నిక్షేపరాయుడు అనే కామిక్ విలన్ పాత్ర చేశాడు.
  అన్నట్టు మరిచి పోయాను .. జోగారావు తన బడి పిల్లలతో వేయించే రెండు నాటికలూ అద్భుతంగా ఉంటాయి.
  అఫ్కోర్సు, మిస్సమ్మ మాయాబజారులతో పోలిస్తే తక్కువే.

 6. నేస్తం said...

  సినిమా లో కధానాయకి జి వరలక్ష్మి గారు అవ్వడం వల్ల ( ఆమె మనకు అమ్మ పాత్రలలో చిరపరిచియురాలు కాబట్టి కూడా )ఆమెను హీరోయిన్ పాత్రకు ఊహించలేము కాని అప్పటికి సావిత్రికి అంత పేరు లేదు కదా కాబట్టి అప్పుడు జి వరలక్ష్మి గారే పేరున్న నటిమణేమో ... కాని పాటలు బాగాలేదనడం నేనొప్పుకోను గాక ఒఫ్ఫు కోనంతే ..మీరు మొదటి సారి వినడం అవ్వడం వల్ల కొత్త గా ఉండి ఉండచ్చు .. అందులో ఎడుకొండలవాడ పాట రాత్రి పడుకునేటప్పుడు వెన్నెలలో పాడుకుంటే మనసు ఎంత హాయిగా ఉంటుందో .. ఒక సారి ఆ లిరిక్ చూడండి ఎంత బాగా రాసారో .. దేవుని మీద పాడినట్లు గా పాడుతూ భర్త కు ఎంత చక్కని హింట్స్ ఇస్తుంది భార్య .." పాల సంద్రపుటలలు పట్టె మంచముగా ..పున్నమీ వెన్నెలలు పూల పానుపుగా ,కనుల వొలికే వలపు పన్నీటి జల్లుగా " నీకు సమకూరుస్తా .. ఈ సారికి వదిలేయి అని భర్తను ఎంత చక్కగా లాలిస్తుంది అంత చక్కని పాటలు పట్టుకుని బాలెదంటారా... ఆయ్

 7. జీడిపప్పు said...

  @ పరిమళం గారు - :)

  @ అనానిమస్ గారు - Glad to hear that

  @ రవి గారు - ఓహో ఇలాంటి సినిమా ఇంకొకటుందన్నమాట. ముందుగా చెప్పి బ్రతికించారు.

  @ శశాంక్ అన్నా - :)

  @ కొత్త పాళీ గారు - ఈ సినిమా పాటలు అంతగా ప్రాచుర్యం పొందలేదు అనుకుంటా. ఇక ఆ మిలిగిన పాత్రధారులు నచ్చలేదు, బహుశా ఆ తరహా పాత్రల నటుల గురించి వేరే అంచనాలవల్ల కాబోలు!

  @ నేస్తం గారు - వామ్మో ఈ రేంజిలో పాత పాటలు వింటారా? నేనయితే ఈ సినిమాలో "పెళ్ళి చేసుకొని" పాట తప్ప మిగిలినవి అరనిమిషం చూసి ఫార్వర్డ్ చేసాను :)

Post a Comment