తెలంగాణా ఇవ్వాలి, 2025 లో - Part 3 - తెలబాన్లు

Posted by జీడిపప్పు


తెలంగాణా ఉద్యమం మొదలయిన కొన్నాళ్ళకు 'దుశ్చర్యలు, ఆగడాలు, దౌర్జన్యాలు, ఉన్మాద చర్యలు ' లాంటి మాటలు తరచుగా వినపడేవి. ఇవన్నీ అప్పటికే ప్రాచుర్యంలో ఉన్న మాటలు. ఈ మాటలకు భిన్నంగా 'తెలబాన్లు ' అనే ఒక కొత్త పదం పుట్టుకొచ్చి అందరి నోళ్ళలో నానుతోంది. ఈ పదం పుట్టు పూర్వోత్తరాలను తెలుసుకొనే క్రమంలో రెండో దశ తెలంగాణా ఉద్యమ ఆవిర్భావం గురించి ఒకసారి మననం చేసుకుందాము.

మద్రాసు రాష్ట్రం నుండి విడిపడిన కొన్నేళ్ళకు తెలంగాణా ప్రజల్లో అసంతృప్తి మొదలయింది కానీ అప్పటి కాంగ్రెసు నాయకులు దాన్ని ఉద్యమరూపం దాల్చనివ్వలేదు. తెలుగుదేశం నుండి బయటకు వచ్చాక కేసీఆర్ ఈ ఉద్యమాన్ని మళ్ళీ పునరుజ్జీవం చేసాడు. అప్పటినుండి తెలంగాణా వాసులు "ఎన్నాళ్ళీ కట్టు బానిసత్వం? ఎన్నేళ్ళీ నిరంకుశత్వ పాలన? ఈ వెట్టి చాకిరీ మనమెందుకు చేయాలి? ఈ బానిస బ్రతుకుల నుండి విమోచన కావాలి" అంటూ ప్రత్యేక రాష్ట్రంకోసం ఉద్యమించసాగారు.

ఈ ఉద్యమానికి రూపకర్త కీ.శే|| ప్రొ.జయశంకర్ గారు. తెలంగాణా సిద్దాంత కర్త, తెలంగాణా జాతిపిత అయిన కీ.శే|| ప్రొ.జయశంకర్ గారు ఉద్యమ పంథాను వివరిస్తూ "ఏనాటికయినా మనం తెలంగాణాను సాధించుకోవాలి. అందుకు ఎన్నో మార్గాలున్నాయి కానీ మనము గాంధీమార్గమే ఎంచుకోవాలి. ఎన్నడూ ఇతరులను నొప్పించకూడదు. అహింస ద్వారా తెలంగాణాను సాధించుకొని గాంధీమార్గాన్ని ప్రపంచానికి ఎలుగెత్తి చాటి చెప్పి తెలంగాణా ప్రజలే అసలు సిసలయిన గాంధీ వారసులు అని నిరూపించాలి" అన్నారు.

అమాయకులయిన తెలంగాణా ప్రజలు కీ.శే|| ప్రొ.జయశంకర్ గారుచెప్పినట్టే నడుచుకోవడం మొదలు పెట్టారు. "మా రాష్ట్రాన్ని మాకు ఇవ్వండి చాలు. అన్నదమ్ముల్లా విడిపోదాము" అంటూ ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్న తరుణంలో వీరి అమాయకత్వాన్ని అలుసుగా తీసుకొని కొన్ని దుష్టశక్తులు ఉద్యమంలో చాపకింద నీరులా ప్రవేశించాయి.  "సీమాంధ్రులను తరిమి కొట్టండి, నాలుకలు చీరేస్తాం, తలలు నరికేస్తాం" అంటూ అమాయకులయిన తెలంగాణా ప్రజలను రెచ్చకొట్టి పెడత్రోవ పట్టించాయి.

అప్పటికీ మెజారిటీ తెలంగాణా వాసులు "ఇలా తోటివారి పైనే దాడులకు దిగడం మంచిది కాదు" అంటున్నా, అతి కొద్దిశాతం ఉన్న ఈ ముష్కురులు వారి మాటలను ఖాతరు చెయ్యక దాడులకు దిగారు. "ఆంధ్రా మెస్" అని బోర్డు పెట్టుకొని జీవనం సాగిస్తున్న వారిపైన దాడులు చేసి మెస్ అంతా ధ్వంసం చేయడం, సీమాంధ్రులు అని తెలిస్తే వారి కార్ల అద్దాలు పగలకొట్టడం, ఇక అతి నీచాతినీచంగా పరీక్ష పేపర్లు దిద్దను వచ్చిన గురువులను తరిమి  కొట్టడం లాంటి చర్యలకు పాల్పడ్డారు.

అప్పటివరకు ఇలాంటి దేశద్రోహ చర్యలు చేస్తున్నవారిని "అల్లరి మూకలు, గూండాలు, ఉన్మాదులు" అని పిలిచేవాళ్ళు కానీ ఆ పదాలేవీ వీరి చేష్టలకు సరిపోలేదు. పదివేలమందితో పదిలక్షలమంది మార్చ్ నిర్వహించిన రోజున ట్యాంక్‌బండ్ పైన విగ్రహాలను కూల్చినపుడు వీరికి "తెలబాన్లు" అన్న పేరు పెట్టారు.  ఆఫ్ఘనిస్తాన్లో బుద్ద విగ్రహాలను నాశనం చేసి తాలిబాన్లు ఏ విధంగా (అన్)పాపులర్ అయ్యారో, ఈ కొద్దిమంది ముష్కురులు కూడా విగ్రహాలను ధ్వంసం చేసి తెలబాన్లుగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆఫ్‌కోర్స్, ఆ వీడియో క్లిప్పింగులు అన్నీ కేంద్రానికి పంపించి "ఇదీ వీళ్ళు చేస్తున్నది, మున్ముందు చేయబోయేది" అంటూ నివేదిక ఇచ్చింది ఇంటెలిజెన్స్.

తెలబాన్ల ప్రస్తావన వచ్చినపుడల్లా వినిపించే మరో పదం "ఉస్మానియా". ఈ ఉద్యమానికి ముఖ్యకేంద్రంగా నిలిచిన ఉస్మానియాలో కూడా కొందరు ముష్కురులు ప్రవేశించి బస్సులను తగులబెట్టడం, షో రూముల పైన రాళ్ళు రువ్వి అద్దాలు పగలకొట్టడం లాంటి చర్యలతో 'ఉన్మాదియా' అన్న చెడ్డపేరు తెచ్చారు.   ప్రస్తుత స్పీకర్ నాదెండ్ల మనోహర్ అపుడెపుడో అమెరికా అధికారితో "ఈ ఉస్మానియా విద్యార్థుల్లో మెరిట్ స్టూడెంట్స్ ఎవరూ ఉద్యమంలో పాల్గొనడం లేదు, అంతా 30 ఏళ్ళకు పైబడినవారే" అన్నాడట. వీడియోల్లో చూస్తే ఎంతవరకు నమ్మశక్యమో తెలుస్తుంది.

ఉద్యమంలో పాల్గొనందుకు JNTU విద్యార్థుల పైన ఈ ఉస్మానియా విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. "ఈ JNTU లో ఉంటున్న తెలంగాణాలో పుట్టినవారు కూడా ఉద్యమంలో పాల్గొనడం లేదు. ఎప్పుడూ మెరిట్లో పాసవ్వాలి, ఎక్కువ మార్కులు తెచ్చుకొని ఏ అమెరికాకో వెళ్ళాలి లేదా ఐటీ కంపెనీల్లో చేరి ఏసీ రూముల్లో నిద్రపోవాలి, ఇల్లు కారు కొనాలి అనుకుంటున్నారే తప్ప తెలంగాణాకు జరుగుతున్న అన్యాయం గురించి ఏనాడయినా పట్టించుకున్నారా? మేము మా చదువులను పక్కనబెట్టి భవిష్యత్తును ఫణంగా పెట్టి చేస్తున్న పోరాటంలో ఎందుకు పాల్గొనడం లేదు? వీరంతా తెలంగాణా ద్రోహులే" అన్నారు. ఇది ఆలోచింపదగ్గ విషయమే.

మళ్ళీ తెలబాన్ల విషయానికొస్తే - కీ.శే|| ప్రొ.జయశంకర్ గారు చెప్పినట్టు అహింసామార్గంలో పోరాటం చేసి ఉంటే ఏమి జరిగి ఉండేదో కానీ, తెలబాన్ల ప్రవేశముతో సీన్ మారిపోయింది.  సీమాంధ్రుల ఆస్తుల పైన దాడులు చేయడం, మామూళ్ళకు పాల్పడడం, ఇష్టమొచ్చినపుడు బందులు చెయ్యడం, రోజువారీ జీవితానికి ఆటంకం కలిగించడంతో హైదరాబాదులో వ్యాపారం చేసేవాళ్ళకు, హైదరాబాదుకు వెళ్ళాలనుకొనే వారికి అనిశ్చితి, ఆందోళన కలగడం మొదలయింది. తను సీమంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి అని తెలబాన్లకు తెలిస్తే బెదిరింపులకు దిగరని, మామూళ్ళు అడగరని ఏ సీమాంధ్ర వ్యాపారికి కూడా నమ్మకం లేదు.

నేను ఈ తెలబాన్ల దుశ్చర్యలను పూర్తిగా ఖండిస్తాను కానీ గమనించదగ్గ విషయం ఏమిటంటే,  లోపాయకారంగా వీరి దుశ్చర్యలవల్ల ఈ రోజు హైదరాబాదులో పెట్టుబడులు పెట్టాలంటే కొందరు జంకుతూ మరో మార్గం చూసుకోవడం మొదలుపెట్టారు.  పెట్టుబడుల సంగతి పక్కనపెడితే, హైదరాబాదుకు బస్సులోనో రైల్లోనో వెళ్ళాలన్నా "ఎప్పుడు బంద్ అంటారో, ఎప్పుడు తిరిగివస్తామో" అని ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మొదలుపెట్టారు. (ఈ బందుల గురించి మరో టపాలో!) ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాము.  "ఏ నాటికయినా తెలబాన్ల నుండి తలనొప్పి తప్పదు" అనుకున్నాడేమో, ప్రముఖ నిర్మాత రామానాయుడుగారు వైజాగ్‌లో ఒక సినీ స్టూడియో నిర్మించారు. ఆ స్టూడియో ఎంత సౌకర్యంగా ఉందో హాస్యనటుడు ఏవీయస్ గారు తన బ్లాగులో వివరించారు.

హైదరాబాదులో ఏ సినిమా షూటింగ్ జరుగుతున్నా (ఒక్క నితిన్ సినిమా తప్ప) అక్కడ వెంటనే తెలబాన్లు ప్రత్యక్షమవుతారు. సినిమా రిలీజ్ ముందు నానా గొడవచేసి డబ్బులు గుంజడం,  మహేష్‌బాబు కారు పైన దాడి చేయడం, గీతా ఆర్ట్స్ ఆఫీసు పైన రాళ్ళు రువ్వడం, కొన్ని లక్షల విలువయిన సెట్టు తగలపెట్టడం లాంటి ఉన్మాద చేష్టలను చూసి కోట్లలో ఖర్చుపెట్టే నిర్మాతలు ఇపుడిపుడే మరోదిక్కు వైపు చూడడం మొదలుపెట్టారు. వైజాగ్‌లో ఈ స్టూడియో వల్ల కొన్ని వందల కుటుంబాలకు ఉపాధి లభిస్తోంది. ఇది కేవలం ప్రారంభమే కాబట్టి మున్ముందు రామానాయుడుగారిని ఆదర్శంగా తీసుకొని మరింతమంది తమ పెట్టుబడులను సీమాంధ్రకు మళ్ళించే అవకాశాలు ఎక్కువే ఉన్నాయి.

ఈ ఉద్యమం ఇలాగే ఇంకో పది-పదిహేనేళ్ళు కొనసాగితే సీమాంధ్ర వ్యాపారవేత్తలు ఎటువంటి నష్టాలకు గురి కాకుండా హైదరాబాదులో పెట్టుబడులు తగ్గిస్తూ తమప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టి అభివృద్ది చేస్తారేమో అనిపిస్తుంది. తెలంగాణా వాదులు కోరుకుంటున్నదీ ఇదే కదా మరి!! (సశేషం)

3 comments:

 1. Krishna said...

  bhesh. kavalsindi kuda ade. hyd lo pettubadi tagginchi evari prantamlo vallu pettukunte telangana kakunda migata prantallo venukabadinavi abhivruddhi chendutaayi. hyd pettubadulu seemandhrulu taggiste seemandhra prajala netti mida palu posinavallu avtaru. alage aa telangana icheste kuda potadi o gola.

 2. shayi said...

  "మద్రాసు రాష్ట్రం నుండి విడిపడిన కొన్నేళ్ళకు తెలంగాణా ప్రజల్లో అసంతృప్తి మొదలయింది" అన్నారు.
  తెలంగాణ ప్రజలు మద్రాసు రాష్ట్రంలో ఎప్పుడైనా ఉన్నారా?
  ఈ ఒక్క వాక్యం చాలు - మీ అవగాహన ఏ పాటిదో తెలియడానికి.

 3. జీడిపప్పు said...

  shayi గారు, "మద్రాసు రాష్ట్రం నుండి కొన్ని ప్రాంతాలను వేరుచేసి తెలంగాణాతో కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుచేసిన కొన్నేళ్ళకు" అని ఉండాల్సింది. పొరపాటును సరిదిద్దుకునే అవకాశం కలిపించినందుకు ధన్యవాదాలు.

Post a Comment