నా ఓటు ఎవరికంటే...??

Posted by జీడిపప్పు

ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి. ఒక బాధ్యతగల పౌరుడిగా వోటు వేయవలసిన ధర్మం  నాకుంది. ఫ్రీగా వచ్చిన సినిమా చూడాలన్నా ఓసారి ఆ సినిమా రేటింగ్ తెలుసుకొని, బాగుంటేనే  చూడడం అలవాటు నాకు. అందుకే వోటు వేసే ముందు ఆ పార్టీల  ఎజెండా  తెలుసుకోదలిచి వివరాలు సేకరించడం మొదలుపెట్టాను. మొత్తమ్మీద మూడు పార్టీలు ఉన్నాయి. ఒక్కో పార్టీ అజెండా ఏమిటి, ఒక వేళ ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఎలా ఉంటుంది, ఎవరికి ఓటు వెయ్యాలి మొదలయినవి బేరీజు వేసుకుంటే:

కాంగ్రెస్: ఇందిరమ్మ ఇళ్ళ పథకం, జల యజ్ఞం, రైతులకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, పావలా వడ్డికి రుణాలు, రెండు రూపాయలకు బియ్యం, 50 రూపాయలకు  వంట సామాగ్రి మొదలయినవి అజెండాలో ఉన్నాయి.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే: ఒక సగటు కూలీ కుటుంబం రోజుకు 100 రూపాయలు సంపాదిస్తుంది అనుకుందాము. ఎలాగూ ఇందిరమ్మ ఇళ్ళ పథకంలో ఇల్లు వస్తుంది కాబట్టి అద్దె బాధ లేదు. 2 రూపాయలకు బియ్యం కాబట్టి ఒక రోజు సంపాదనతో బియ్యం వస్తుంది, 50 రూపాయలకు కొన్ని వంట సరుకులు వస్తాయి. ఇంకో పది రోజుల సంపాదనతో మిగాతా ఆహారం కొనుక్కోవచ్చు. ఆరోగ్యసమస్యలొస్తే ఉచిత వైద్యం ఎలాగూ ఉంది. చదువు ఉచితం కాబట్టి భయం లేదు. మొత్తం మీద కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సగటు కూలీ కుటుంబం కూడా హాయిగా బ్రతుకుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళూ కాంగ్రెస్‌కే వోటెయ్యాలి.

తెలుగుదేశం: ప్రతి నిరుపేద కుటుంబానికీ నెలకు రెండు వేల రూపాయలు. రెండు రూపాయల బియ్యం, కలర్ టీవీ, ఉచిత విద్యుత్, డ్వాక్రా, బెల్టు షాపుల నిషేధం, విద్యార్థులకు స్కాలర్‌షిప్పులు మొదలయినవి అజెండాలో ఉన్నాయి.

తెలుగుదేశం అధికారంలోకి వస్తే: ఒక చిన్న గుడిశెలో ఒక లైటు, ఫ్యాన్ వేసుకొని పడుకొని అందరూ ఉచితంగా వచ్చిన కలర్ టీవీ చూస్తుంటారు. అంతలో పోస్ట్ మ్యాన్ లేదా బ్యాంక్ గుమాస్తా వచ్చి రెండు వేల రూపాయలు ఇస్తాడు. అందులో రెండు రూపాయల బియ్యం, ఇతర ఆహారానికి వెయ్యి రూపాయలు ఖర్చయినా మిగతా ఖర్చులకు ఇంకో వెయ్యి ఉంటుంది. ఓపిక ఉంటే పని చేసుకొవచ్చు లేదా పని చేయకుండా టీవీ చూసుకుంటుంటే కూడా రెండు వేలు వస్తాయి. పేదవాడికి కష్టపడకుండా డబ్బులు  వస్తుంటే అంతకంటే ఏమి కావాలి? కాబట్టి ఈ సారి అందరూ తెలుగుదేశానికే ఓటు వెయ్యాలి.

ప్రజారాజ్యం: రైతులకు పెన్షన్-భీమా మరియు ఉచిత విద్యుత్తు, ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీలకు ఉచిత విద్యుత్తు, నూరు రూపాయలకు వంట సామాగ్రి, నిరుద్యోగులకు  వెయ్యి రూపాయలు, పేదవారికి రెండున్న లేదా ఐదు ఎకరాల భూమి, పసుపు-కుంకుమ, వెయ్యి రోజుల్లో 10 లక్షల ఉద్యోగాలు మొదలయినవి అజెండాలో ఉన్నాయి.

ప్రజారాజ్యం అధికారంలోకి వస్తే: అందరికీ రెండున్నర ఎకరాలు మాగాణి ఇస్తారు. ఒక ఎకరం వరి, ఒక ఎకరం కూరగాయలు వేసుకున్నా చాలు. ఒకవేళ పంట పండకపోయినా రైతు భీమా ఉంది. ఆడపిల్ల ఉంటే లక్షరూపాయలు ఉన్నట్టే. ఇంట్లో నిరుద్యోగి ఉంటే నెలకు ఇంకో వెయ్యి రూపాయలు అదనం. ఇలా కుటుంబం లోని అందరికీ అన్నీ సుఖాలే, ఎక్కడ చూసినా డబ్బులే. కాబట్టి ఈ సారి అందరూ ప్రజారాజ్యానికే ఓటు వెయ్యాలి.

Bottom line ఏంటంటే, ఏ పార్టీకి వోటు వేసినా అధికారంలోకి వచ్చే పార్టీ వల్ల పేద బడుగువర్గాలకు మేలే జరుగుతుంది. ఒక వేళ ముగ్గురికీ ఓట్లు వేసి ముగ్గురినీ ముఖ్యమంత్రులు చేస్తే అందరి జీవితం మూడు రెట్లు ఎక్కువ సుఖంగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ "భూతల స్వర్గం" అన్నమాట.నిన్న ఇలా ఆలోచిస్తూ పడుకున్నాను. అర్థరాత్రివరకు వరకు మంచి కలలు వచ్చాయి. ఎక్కడ చూసినా గుడిసెల్లో కలర్ టీవీలు, ఇందిరమ్మ ఇళ్ళు, రెండెకరాల భూస్వాములు..స్వర్గం అంటే ఇదే అనిపించింది. అర్థరాత్రి తర్వాత, అంటే దెయ్యాలు నిద్రలేచిన సమయంలో, కాస్త భయంకరమయిన కలలు వచ్చాయి. ప్రతిపార్టీ ఏడాదికి సుమారు లక్ష కోట్ల అప్పులు చేసి "ఉచిత" పథకాలకు ఖర్చు పెడుతుంది. దాని వడ్డీ కింద  ప్రజలను పీక్కుతింటున్న ప్రపంచ బ్యాంకు రాబందులు కనిపించాయి. ప్రజలు సోమరిపోతులయి ప్రభుత్వం పడవేసే "ముష్టి" తిని  బిచ్చగాళ్ళలా  బ్రతుకుతుంటారు. తెల్లవారివరకు ఇలాంటి కలలే వచ్చాయు. నిద్రలేచాక, భవిష్యత్తులో మన రాష్ట్రం "భూతలస్వర్గం" కాదు, "భూతాలస్వర్గం" అని కొట్టొచ్చినట్టు, తన్నొచ్చినట్టు, బాదొచ్చినట్టు తెలిసింది.

అయినా ఓటు హక్కును దుర్వినియోగం చెయ్యకూడదుగా. అందుకే బాగా ఆలోచించి ఒక వ్యక్తికి ఓటు వేయాలని నిర్ణయించుకున్నాను. అందుకు కారణాలు: ఆ వ్యక్తి
 • ఎన్నడూ ఫ్యాక్షన్ రాజకీయాలు చెయ్యలేదు
 • ఎవరినీ వెన్నుపోట్లు పొడవలేదు
 • సినిమాల్లో కుప్పిగంతులేసి రాజకీయ డ్రామాలు ఆడలేదు
 • తాగిన మత్తులో ఇష్టమొచ్చినట్లు తిట్టడు
 • అప్పులు తీసుకురావలసిన ఖర్మ ఆయనకు లేదు. తలుచుకుంటే అన్నీ సృష్టించగలడు
అన్నిటికంటే ముఖ్యంగా - జీవితానికి కావలసినది ఆనందం. ఆనందం అంటే అన్నీ మరచిపోయి హాయిగా నవ్వగలగడం. అలా నవ్వించేవాడే అసలయిన నాయకుడు. నేను ఒటు వెయ్యబోయే వ్యక్తి అలాంటివాడే. చూస్తే చాలు నవ్వొస్తుంది. ఆ మాటలు వింటే ఎన్ని కష్టాల్లో ఉన్నవాడయినా హాయిగా నవ్వుతాడు. ఆయన పట్ల కోపం, అసహ్యం అస్సలు కలగవు. ఇంతకూ ఎవరంటారా? క్లిక్కండిక్కడ

14 comments:

 1. Anonymous said...

  'fun'tastic

 2. Anonymous said...

  Are you just joking ??? If it is, then OK.

  My vote is for LOK SATTA.

 3. నేస్తం said...

  :))

 4. Anonymous said...

  Hello Jeedi Pappu Garu,
  Oh my got it is really good analysis sir,okkadu kooda pani chesukondi pani kalipistham ledha pillalani chadhivinchandi anni sadhupayalu kalpistham chepaarent sir...chala badhakaramaina vishayam ivanni vini,chusi emi cheyyalekapovadam.....
  chala santhoshakaramaina vishayam nenu americalo undi prathyakshanga aaa badhani anubhavinchaka povadam...anyways you are sooo good analyzer please rasthuuney undandi.......JYOTHI REDDY

 5. సుజాత వేల్పూరి said...

  LOL!

 6. xyz said...

  @సినిమాల్లో కుప్పిగంతులేసి రాజకీయ డ్రామాలు ఆడలేదు

  దీని మీద పెద్ద లైట్ వెయ్యండి. అందరితో పాటు తిట్టాలని తిట్టారా ? నిజంగా మీ మనసులో మాట ?

 7. పరిమళం said...

  :) :) :) !

 8. Anonymous said...

  నవ్వండి నవ్వండి.. నవ్విన నాపచేనే పండుద్దండీ. తరవాతి ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రిని ఈయనే ఎంచి, నియమించినపుడు.. అప్పుడు తెలుస్తుంది, ఆయనేంటో!

 9. ఉమాశంకర్ said...

  తను తలచుకుంటే అమెరికా అధ్యక్షుడిని ఒక్కరోజులో పదవిలోంచి దింపెయ్యగలనని ఆయన అన్నట్టు గుర్తు నాకు. ప్రపంచ రాజకీయాలనే ప్రభావితం చేయగలిగిన వ్యక్తికి మీరు ఓటు వేద్దామని నిర్ణయించుకోవడం ముదావహం. :)

 10. చైతన్య said...

  ఏంటండి నిజంగానే ఆ వ్యక్తికే మీ వోటా!? లేకపొతే జోక్ చేసారా?

  ఆ మూడు పార్టీల గురించి బాగానే విశ్లేషించారు కాని... లోక్ సత్తా ని వదిలేసారెంటి?
  ఆ పార్టీ విధానాల గురించి కూడా కొంచం చెప్పి ఉంటే... ఈ రాజకీయాల గురించి ఎక్కువగా తెలియని నా లాంటి వాళ్ళకి వోట్ వేయటంలో హెల్ప్ చేసినట్టు ఉంటుంది...

 11. జీడిపప్పు said...

  @Anonymous గారు, @ నేస్తం గారు, @Jyothi Reddy గారు, @సుజాత గారు, @పరిమళం గారు, @chaduvari గారు, @ఉమాశంకర్ గారు - ధన్యవాదాలు.

  @Anonymous గారు, @xyz గారు, @చైతన్య గారు - :)

 12. Anonymous said...

  మళ్ళీ మళ్ళీ చెపుతున్నానని ఏమనుకోకండి.

  మూడు పార్టీలు,

  మూడు కుటుంబాలు,

  మూడు కులాలు.

  ఇదేనా రాజకీయం?

  ఆలోచించండి.

 13. Anonymous said...

  sir meeru baaga raasaru,

  andukani andaru lokesatta ku vote vesi gelipiste
  ap munduku povadaniki manamu kuda dohadam chesina vallam avutamu

 14. Anonymous said...

  మన దేశం లో కూడా అమెరికా లాగా ఒక జాన్ స్టెవార్ట్ అవసరం అనిపిస్తోంది. మన రాజకీయవేత్తలు నోరు తెరిస్తే ఒకటా బండ బూతులు, లేదా ఇల ఎందుకు పనికిరాని జాతి రతణాలు లాంటి వాగ్ధానాలు. వోట్ల కోసం ఏమైనా చేస్తారు. ఇన్ని వేల కోట్ల అప్పులు చేసారు గత 10-15 ఏళ్లల్లో ఎవడు తీరుస్తాడంటా? అసలు దాని గురించి ఎవ్వరు మాట్లాడడు.. దేశం బాగుపడే లక్షణాలే అగుపించడం లేదు..

Post a Comment