అవీ..ఇవీ..అన్నీ

Posted by జీడిపప్పు


నాకు టెస్ట్ మ్యాచ్‌ల పట్ల ఆసక్తి ఉండదు. ఎందుకంటే దాదాపు అన్నీ ఐదు రోజుల పాటు సా సా సాగుతాయి కాబట్టి.  ఒక్కో వైపు మూడు నాలుగు  సెంచరీలు, ఆరేడు అర్థ సెంచురీలు ఉంటాయి. ఇక మేడిన్ ఓవర్లు నా సహనానికి పెద్ద పరీక్ష పెడతాయి. ఒక్కోసారి ఆరేడు మేడిన్లు వరుసగా వేస్తారు. బ్యాట్స్ మన్ బాల్‌ను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తూ బాల్‌ను పిచ్ దాటనివ్వడు. ఉత్కంఠత దాదాపు శూన్యం. చాలా మ్యాచులు డ్రాగా ముగుస్తాయి. ఇప్పటివరకు ఐదురోజుల పాటు ఒక్క మ్యాచ్ పూర్తిగా చూసిన సందర్భం లేదు. కేవల స్కోర్లు చూడడమే అలవాటు.

వన్‌డే మ్యాచులు మాత్రం  చూసేవాడిని. అందులో అన్నీ సమపాళ్ళలో ఉంటాయి. అపుడపుడు 20-40 ఓవర్ల మధ్య కాస్త బోరు కొడుతుంది. కానీ వన్‌డేలతో వచ్చిన చిక్కేమిటంటే మొత్తం మ్యాచ్ చూడాలంటే దాదాపు ఒక రోజు పోతుంది.  వీటన్నిటికీ పరిష్కారం 20-20 రూపంలో లభించింది. 20-20 అంటే గుడ్డిగా సిక్సులు కొట్టడమే, సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేసినవాళ్ళు గెలుస్తారు అనుకున్నాను మొదట. కానీ మొదటి 20-20 వరల్డ్ కప్ చూసిన తర్వాత అసలయిన క్రికెట్ అంటే ఇది అనిపించింది. ఇక IPL చూసాక క్రికెట్ పట్ల మరింత ఆసక్తి కలిగింది. ఈ విషయంలో లలిత్ మోడికి క్రీడాభిమానులు ఋణపడి ఉండాలి.

అసలు విషయానికొస్తే, ఎలక్షన్ల టైంలో IPL జరగాల్సి ఉంది. ఎలక్షన్లవల్ల పోలీసు బందోబస్తు కల్పించడం కష్టమని, మ్యాచ్‌లను వాయిదా వేసుకోమని లేదా షెడ్యూల్ మార్చుకోమని ప్రభుత్వం సూచించింది. తర్జనభర్జనల తర్వాత లలిత్ మోడీ IPL ను దక్షిణాఫ్రికాకు మార్చాడు. టీవీ పోల్స్ ప్రకారం, దక్షిణాఫ్రికాకు మార్చడాన్ని చాలామంది భారతీయులు వ్యతిరేకిస్తున్నారట. నాకయితే ఇందులో ఎటువంటి తప్పు కనిపించలేదు.

IPL అన్నది ఒక ప్రైవేట్ సంస్థలాంటింది. వాళ్ళకు ఇష్టం వచ్చినచోట జరుపుకోవచ్చు. ఇక్కడ ముఖ్యమయినది - ఆటగాళ్ళు తమ క్యాలెండర్ ప్రకారం మిగతా అంతర్జాతీయ ఆటల్లో పాల్గొనాలి. IPL షెడ్యూల్ మారిస్తే వాళ్ళు ఆడలేకపోవచ్చు. ఇక మన దేశంలో ఆడితే స్టేడియం ఖర్చులు, లాభాలు అంటున్నారు కొందరు. మొత్తం ఆదాయంలో స్టేడియం నుండి వచ్చే ఆదాయం 1 శాతం కూడా ఉండదు. పైగా టీవి ప్రేక్షకులతో పోలిస్తే స్టేడియంలో చూసే వాళ్ళు లెక్కలోకి రారు. ఒక వేళ నష్టం వచ్చినా అది IPL కు మాత్రమే. ఇవన్నీ పరిగనణలోకి తీసుకొనే మోడీ నిర్ణయం తీసుకున్నాడు. ఇక ఆటను ఆస్వాదించడమే మన వంతు.

*******
గతవారం టాటా నానో విడుదలయింది. తొందర్లో రోడ్లపైకి వస్తుంది. ఇది నిజంగా సంతోషించదగ్గ విషయమే. నాకు మొదటినుండి "టాటా ఏమి చేసినా అందులో దేశానికి నష్టం/చెడు ఉండదు" అని నమ్మకం. ఈ కారు వల్ల కాలుష్యం మరింత పెరుగుతుంది అంటున్నారు కొందరు. నాకు ఇది పెద్ద జోక్ లా అనిపిస్తుంది. మన దేశంలో ఏడాదికి సుమారు 70 లక్షల స్కూటర్లు, 14 లక్షల కార్లు అమ్ముడుపొతున్నాయి. ఇవి కాక రవాణా వాహనాలు ఇంకో ఐదారు లక్షలు ఉంటాయి. వీటివల్ల ఏర్పడే కాలుష్యం, ఫ్యాక్టరీల కాలుష్యం, మన వీధిలో మనము చేసే కాలుష్యం అన్నీ కలుపుకుంటే ఏర్పడే కాలుష్యంలో "నానో కాలుష్యం" 0.000001% కూడా ఉండదు.

ఒకే ఒక ఇబ్బందల్లా ట్రాఫిక్ పెరగుతుంది, అది కూడా మహానగరాల్లో లేదా పెద్ద పట్టణాల్లో. నా వరకు అది కూడా సమ్మతమే. ఉదాహరణకు మన రాష్ట్రంలో  మహా అయితే 10 నగరాల్లో ట్రాఫిక్ సమస్య ఉంది. మరి మిగిలిన పట్టణాల సంగతేమి? అక్కడున్న మధ్యతరగతి వారి కోరిక కూడా నెరవేరాలి కదా. చిన్న చిన్న పట్టణాల్లో, కాస్త పెద్ద గ్రామాల్లో లక్ష రూపాయలకు కారు కొనేవాళ్ళు ఎందరో ఉన్నారు. ఈ నానో ముఖ్యంగా వారికి అందుబాటులోకి రావాలి. "నగరాల్లో నానో అమ్మబడదు" అని టాటా ఒక రూల్ పెడితే బాగుంటుందేమో!!?

*******
గతవారం రిపబ్లికన్ నాయకులు "ఒబామా పాలసీలు మంచివి కాకపోతే అవి విఫలం కావాలని కోరుకుంటున్నాము" అన్నారు. రిపబ్లికన్లు ట్రిలియన్లను యుద్దాలకు పెడితే ఒబామా అదే డబ్బును తమ దేశంలోనే విద్యకు, ఆరోగ్యానికీ, నిర్మాణాలకు పెడుతున్నాడు.  ఒబామా పదవిని చేపట్టి మూడు నెలలు కూడా పూర్తి కాలేదు. అపుడే వీళ్ళ కుళ్ళు బయట పెడుతున్నారు. భవిష్యత్ రిపబ్లిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి అయిన  పీయుష్ "బాబీ" జిందాల్ ఈ సంగతి మరీ మరీ చెప్పాడు. సంతోషించదగ్గ విషయం ఏమిటంటే సగటు రిపబ్లికన్ ఓటర్లకు "జోకర్ జిందాల్" మాటలు నచ్చలేదు. అసలే అమెరికా 40 ఎళ్ళలో ఎన్నడూ లేని గడ్డు పరిస్థితులలో ఉంది. ఇలాంటపుడు వీళ్ళు "ఒబామా పాలసీల్లో తప్పు ఉంటే మేము తగిన సూచనలు ఇస్తాము,సరిదిద్ది అవి సఫలం అయ్యేదానికి కృషి చేస్తాము" అనాలా లేక శాపనార్థాలు పెట్టాలా? అంటున్నారు. అన్నట్టు నా హైస్కూల్ స్వీట్ హార్ట్ "సెరా పేలిన్" వచ్చే ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేయాలని సన్నాహాలు మొదలుపెట్టిందట!

*******
ఒబామా తన తప్పుల చిట్టా ఖాతా తెరిచాడు. పాకిస్తాన్‌కు ప్రతి ఏడాది 1.5 బిలియన్ డాలర్లు అప్పు ఇస్తున్నట్టు ప్రకటించాడు. అక్కడ స్కూళ్ళు, ఆస్పత్రులు కట్టిస్తారట. అలా కట్టిన స్కూళ్ళలో బోధించేది అమెరికా వ్యతిరేక పాఠాలే అన్న సంగతి ఒబామాకూ తెలుసు. బహుశా " అమెరికా అధ్యక్షుడు అన్న తర్వాత ఖచ్చితంగా కాస్తో కూస్తో తీవ్రవాదాన్ని పెంచి పోషించాలి. లేకుంటే తల నూరు వ్రక్కలవుతుంది" అన్న శాపం వల్ల ఒబామా కూడా ఇలా చేస్తున్నాడు. ఈ వారానికి NO "GO Obama"
Image and video hosting by TinyPic

*******
ఇంతకు ముందు ఒక సారి "నాకు ఒకప్పుడు జేపీ పైన నమ్మకం ఉండేది కాదు" అన్నాను. కొద్ది రోజుల క్రితం మూడు ప్రధాన పార్టీలను జేపీ ఎడా పెడా విమర్శించడం చూసి కాస్త నమ్మకం వచ్చింది కానీ మొన్న లోక్‌సత్తా బీసీ యునైటెడ్ ఫ్రంట్ తో పొత్తు పెట్టుకున్నదన్న వార్త చూసి జయప్రకాష్ నారాయణను నమ్మవచ్చా అన్న అనుమానం వచ్చింది. అసలు బిసీ యునైటెడ్ ఫ్రంట్‌తో ఎందుకు పొత్తు పెట్టుకోవాలి? కులాల పార్టీలతో పొత్తులు పెట్టుకోవడమే నిజమయిన న్యాయమా? ఇదొకటే కాదు, ముస్లిం ఫ్రంట్‌తో కూడా పొత్తు పెట్టుకోవాలనుకుంటున్నారట. మరి ఇతర కులాల ఫ్రంట్‌లతో ఎందుకు పొత్తు పెట్టుకోకూడదు/పెట్టుకోవాలి? రత్తయ్య లాంటి అవకాశవాద రాజకీయ నాయకుడిని లోక్‌సత్తాలో చేర్చుకోవడంలో ఆంతర్యమేమి?  కొండముది సాయికిరణ్ గారు అన్నట్టు  జేపీ కూడా శతకోటి లింగాల్లో బోడిలింగమే అనిపిస్తోంది ఇవన్నీ చూస్తుంటే.

7 comments:

 1. ఏకాంతపు దిలీప్ said...

  ఆ పొత్తులు షరతులతో కూడుకున్నవి... లోక్సత్తా ప్రధాన నినాదం అవినీతి నిర్మూలన... ఎన్నికల్లో డబ్బు పంచడం అవినీతికి ఊతాన్నిస్తుంది... డబ్బు పంచము, మంచి వ్యక్తులనె నిలబెడతాము అనే షరతులమీద పొత్తు కుదరడం జరిగింది...

  రత్తయ్య ని కూడా అవకాశవాది అనేసారా? ఏ ప్రాతిపదిక మీద?

 2. Shashank said...

  @బుడుగు - తప్పు దేశం నుండి దక్షిణ ఆఫ్రికా కి మార్చడం కాదు... రెండు అంటే ఎన్నికలకి మరియు IPL కి సెక్యురిట్య్ ఇవ్వలేకపోవడం. అంటే ఆ మాత్రం కూడా లేదా మన పోలీసు యంత్రాంగం? మన ప్రియతమ నాయకుడు MMS పరోక్షంగా ఒప్పుకున్నట్టే కద భారత దేశం safe కాదని? IPL కావాలంటే అంటార్టికా లో ఆడిన ఎవ్వరు అడ్డు చెప్పరు.. ఎందుకంటే అది వాళ్ళ స్వియభిప్రాయం. సెక్యురిట్య్ ముళానా అనడం చిర్రెత్తుతోంది... IPL మీద కాదు మన దేశ ప్రభుత్వం మీద.

 3. సూర్యుడు said...

  @Shashank:

  ఇక్కడ చిర్రెత్తే విషయమేముంది? దేశవ్యాప్త సార్వత్రిక ఎన్నికల సమయం లో దేశం మొత్తంమీద ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికే సరి‌ఐన భద్రత ఇవ్వలేక వేర్వేరు తారీఖులలో ఎన్నికలు పెడుతోంది, అదే సమయంలో క్రికెట్ మ్యాచ్‌లు పెడతాం, భద్రత కల్పించండి అంటే ఎవరికైనా కష్టమే ...

 4. Anil Dasari said...

  బాబీ జిందాలుడి విదూషక వేషాలు మరి కొన్నీ ఉన్నాయి. వాటిలోకి తలమానికమైనది కాంగ్రెస్‌లో అధ్యక్షుడి ప్రసంగానికి ధన్యవాదాలు చెబుతూ జిందాల్ చేసిన ప్రసంగం. లూసియానాకి స్టిములస్ ప్యాకేజిలో వచ్చిన ఫెడరల్ నిధులు తిరస్కరించటం అన్నిట్లోకీ పెద్ద జోకు. (కత్రినా అప్పుడు ఆ ఫెడరల్ నిధులతోనే లూసియానా బయటపడిందని ఆయనకి గుర్తు లేదేమో). ఈయన, సారా పాలిన్ వంటి వారు రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్ధులైతే ఇక డెమొక్రాట్లకి పండగే.

 5. ఉమాశంకర్ said...

  జీడిపప్పు గారు,

  అసలైన క్రికెట్ అంటే టెస్ట్ మ్యాచేనండీ. ఇప్పుడు టెస్ట్ మ్యాచ్ అంటే ఐదు రోజులు. కొన్నేళ్ళ క్రితమయితే మధ్యలో ఒక రెస్ట్ డే తో ఆర్రోజులు జరిగేది.అంటే దాదాపు వారం వెయిట్ చెయ్యాలి. అంతా చేసి చాలా వరకు "డ్రా" లు చూసినట్టు గుర్తు.. :(

  ఈ మధ్యలో ఇంకొక స్టార్ రాకుంటే, ప్రస్తుతానికి ఒబామా కి పోటీగా రిపబ్లికన్లకు జిందాలే గతి. నల్ల జాతి ఒబామాకి ఈ ఏసియన్ మూలాల జిందాల్ గట్టిపోటీ నివ్వగలడని వారి ఆశ. రష్ లింబా అయితే ఈయన్ని ఆకాశానికెత్తేస్తున్నాడు.

  నిజానికి ఈ ఫెడరల్ నిధుల బిల్లులన్నీ బహుశా ఎవ్వరూ క్షుణ్ణంగా చదివుండరు. అంత తీరిక పస్తుతానికి ఎవరికీ లేదు. మొన్నటికి మొన్న పదకొండు వేల పేజీల బిల్లు పూర్తి పాఠం ఎవరు చదవకుండానే ఓట్లేయాల్సొచ్చింది. .
  @అబ్రకదబ్ర గారు
  జిందాల్ స్టిమ్యులస్ మనీ తీసుకునేవాడే, అయితే ఆ స్టిమ్యులస్ బిల్లు లో సాయం కావాలంటే కొన్నిరకాల టేక్సులు పెంచాలనే నియమముంది. ఒకచేత్తొ ఇచ్చి ఇంకో చేత్తో తీసుకునేలా ఉంది కాబట్టి ఆయన దాన్ని ఏకమొత్తంగా తిరస్కరించాడు.

 6. Anonymous said...

  "నగరాల్లో నానో అమ్మబడదు" అని టాటా ఒక రూల్ పెడితే బాగుంటుందేమో!!?

  Then people will buy it in villages and drive it to the cities ;-) The rule must be "the nano would not be allowed to be driven in the cities" (I know you fumbled the sentence but just for fun, laugh it off). Even that rule will not work because those who drive will pass buck under the table to cops who watch. Who cares? Hmm..

 7. జీడిపప్పు said...

  @ఏకాంతపు దిలీప్ గారు - రత్తయ్య రాజకీయ జీవితం ఎలా కొనసాగిందో కాస్త చెప్తారా?

  @ శశాంక్ - CD, ఈ విషయంలో సూర్యుడు గారు చెప్పినదానికే నా ఓటు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అటు ఎన్నికలకు, ఇటు క్రికెట్‌కు భద్రత కల్పించడం తలకు మించిన భారం. ప్రభుత్వం చెప్పిందీ కరెక్టే, మోడీ చేసిందీ కరెక్టే.

  @ సూర్యుడు గారు - కరెక్టుగా చెప్పారు.

  @అబ్రకదబ్ర గారు - "జోకర్ జిందాల్" అన్నది ఆ స్పీచ్‌ను ఉద్దేశించే :)

  @ ఉమాశంకర్ గారు - అసలయిన క్రికెట్ టెస్టు అయినా సామాన్యుడు చూడడం చాలా తక్కువ.
  Bill O'Reilly, Rush Limbaugh లాంటివాళ్ళు ఈ దేశానికి శనిదేవుడి ప్రతినిధులు. అద్రుష్టవశాత్తూ Jon Stewart లాంటివాళ్ళు ఉన్నారు కాబట్టి మీడియా ఇంకా బ్రతికి ఉంది అనిపిస్తుంది.

  @ Anonymous గారు - మీ అభిప్రాయం తెలిపినందుకు ధన్యవాదాలు

Post a Comment