చెత్త చట్టాలు, స్త్రీవాదులు

Posted by జీడిపప్పు

'చట్టానికి కళ్ళు లేవు తమ్ముడూ' అన్న పాట విన్నపుడు "ఓహో, చట్టానికి చూపులేదు కాబట్టి కేవలం విన్నవి మాత్రమే పరిగణనలోకి తీసుకుంటుందన్నమాట" అనుకుంటాము. కానీ కొన్ని కొన్ని చట్టాలను చూస్తే "చట్టానికి కళ్ళే కాదు మెదడు కూడా లేదు" అనిపిస్తుంది. ముఖ్యంగా మహిళల విషయంలో కొన్ని అతిచెత్త చట్టాలను అమలు చేస్తున్నారు. ఎవరయినా మహిళ తన పైన ఎవడో ఏదో చేసాడని చెప్తే చాలు, ముందూ వెనకా చూడక వాడి పైన కేసు బనాయించేస్తారు, ప్రాథమిక విచారణ కూడా జరపకుండా. దీనికి "మహిళా సంఘాల" మద్దతొకటి.

అనగనగా ఓ కాలేజీ అమ్మాయి ఓ అబ్బాయితో ప్రేమలో పడింది. ఓ రోజు ఇద్దరి మధ్యా గొడవలయి ఇద్దరూ విడిపోయారు. అప్పటివరకు చెట్టపట్టాలేసుకొని అందరి ముందూ "మేము లవ్‌బర్డ్స్" అని తిరిగిన ఈ జంట కలిసి తిరగకపోవడంతో స్నేహితులు ఆ కుర్రాడిని "ఆ అమ్మాయి ఎలా ఉంది" అన్నాడు. వాడు "మేమిద్దమూ విడిపోయాము" అన్నాడు.. అదీ ఫేస్‌బుక్‌లో. ఎంత ఘోరం ఎంత ఘోరం. Oh my heart melts. అది చూసి, IIM- Bangalore విద్యార్థిని అయిన, ఆ అమ్మాయి కనీస ఇంగిత జ్ఞానం లేకుండా తన పైన ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రుల గురించి ఆలోచించకుండా ఆత్మహత్య చేసుకుంది. నిన్న ఆ కుర్రాడి పైన "ఆత్మహత్యకు పురికొల్పినందుకు" కేసు బుక్ చేసారు!!

రోజుకొక బాయ్ ఫ్రెండ్ ను మార్చే అమ్మాయిలు, పూటకొక గర్ల్ ఫ్రెండ్ ను మార్చే అబ్బాయిలున్న ఈ రోజుల్లో ఒకడు తన గర్ల్ ఫ్రెండ్ ను డంప్ చేసాను అని చెప్పడం నేరం ఎందుకవుతుంది? ఫేస్ బుక్‌లో వీళ్ళు జంటలుగా ఉన్న ఫోటోలు పెట్టినపుడు లేని తప్పు అదే ఫేస్‌బుక్ లో "మేము విడిపోయాము" అని చెప్పడం ఎలా తప్పిదమో!

**** ********

ఒకప్పుడు సరోజినీ నాయుడు, దుర్గాబాయి దేశ్‌ముఖ్ లాంటివారు స్త్రీల అభ్యుదయానికి పాటుపడి అసలయిన స్త్రీవాదులు అనిపించుకున్నారు. కానీ కాలక్రమంలో ఈ స్త్రీవాదానికి ఉన్న విలువ దిగజారి మహిళా సంఘం అంటే పనీ పాటా లేక రోడ్లెక్కి నానా గొడవ చేసి, సంసారాలను నాశనం చేసేవారు అని ముద్ర పడింది. (ఈ సో కాల్డ్ స్త్రీవాదుల్లో ఎంతమంది తమ పిల్లలకు చక్కగా విద్యాబుద్దులు నేర్పించి ప్రయోజకులు చేసి "తల్లి అంటే ఇలా ఉండాలి, భార్య అంటే ఇలా ఉండాలి" అనిపించుకున్నారో!) వీళ్ళలో కొందరికి అర్థ నయాపైసా పని ఉండదు, చక్కగా కాపురం చేసుకొనే స్త్రీలను చూసి ఓర్వలేరు. ఎవరో దొరికితే ఒక ఇంటిముందు ధర్నా చేసి, గొడవ చేసి కాసేపు టీవీల్లో కనిపించి వీలయితే నాలుగు డబ్బులు గుంజి ఆ పూటకు పైశాచిక ఆనందం పొందుతుంటారు.

'ఓ టీనేజ్ అమ్మాయిని ఒకడు మోసం చేసాడు ' అని గొడవ మొదలెడతారు. మోసం అంటే ఎలాంటి మోసం? ఆ అమ్మాయిని కొన్నాళ్ళు ప్రేమించి ఆ తర్వాత మరో అమ్మాయిని ప్రేమించడం మోసమా? ఇలాంటి సిల్లీ విషయాలకు కూడా కొందరు గొడవ చేస్తారు... ఇవేమీ అంతగా పట్టించుకోవలసినవి కావు. అసలు సిసలయింది ఏమిటంటే - ఒకడు ఒక అమ్మాయిని గర్భవతిని చేసి తర్వాత పెళ్ళి చేసుకోను అంటాడు. చట్ట ప్రకారం ఇది మోసమే. మరి దీనికున్న పరిష్కారాలేవి? ఇద్దరినీ కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఏది తప్పో ఏదొ ఒప్పో వివరించాలి.

కానీ స్త్రీవాదులు ఆ అమ్మాయితో కేసు పెట్టించి ధర్నాలు చేయిస్తారు, పెళ్ళి చేసుకోమని. తన పైన కేసు పెట్టిన అమ్మాయితో బలవంతంగా పెళ్ళి చేసినా వాడు ఆ అమ్మాయిని సరిగ్గా చూసుకుంటాడా? పెళ్ళి అయిన తర్వాత వాడు ఈ అమ్మాయితో కాపురం చెయ్యకుంటే ఈ స్త్రీవాదులు వెళ్ళి రెండు లారీల జనాన్ని తోలుకొచ్చి కాపురం చేయిస్తారా? రేపు అత్తమామలు ఆ పిల్ల పట్ల ఎలా ప్రవర్తిస్తారు? ఇలా పెళ్ళి చేయిస్తే మున్ముందు ఆ అమ్మాయి జీవితంలో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? అన్న కనీస ఆలోచన లేకుండా తమ పైశాచిక ఆనందం కోసం చట్టాలను దుర్వినియోగం చేసి సంసారాలు నాశనం చేసే కొందరు చీడపురుగులు మన మధ్యనే ఉండడం శోచనీయం. వీరికి అవకాశమిచ్చే పనికిమాలిన చట్టాలుండడం మన దౌర్భాగ్యం.

15 comments:

  1. Anonymous said...

    నాలాంటోళ్ళు మీతో ఏకీభవించి చమిస్తారేమోగాని ఇస్త్రీ-వాదులు చమించరు గాగ చమించరు, బ్లాగుల్లో తిర్ ర్ర్ ర్ర్ రగనీయరు. జీడిపప్పు బాగా నేతిలో వేయించి, ఉప్పూ-కారం కలిపి ఆరగించెదరు గాక. :P :)

  2. లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

    వీటి గురించి సరైన ప్రచారమే ఇంకా ఎక్కువ జరగట్లేదండి. సమస్య అసలు తెలియాలి ముందు అందరికీ.అది ముఖ్యం.

  3. Samaikya said...

    "ఒకడు ఒక అమ్మాయిని గర్భవతిని చేసి తర్వాత పెళ్ళి చేసుకోను అంటాడు."

    దీంట్లో కూడా అనేక కేసులు ఉంటాయి. ఆ అమ్మాయి చేయించుకోకుండానే ఎవరైనా చేస్తారా? ఒక్క రేప్ విషయం లోనే ఇది సాధ్యం. చాలా వరకూ అమ్మాయిలు తిరిగేటప్పుడు తిరిగి తరవాత ఎక్కడ లేని అమాయకపు మాటలూ చెప్తారు.

  4. Anonymous said...

    *తన పైన ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రుల గురించి ఆలోచించకుండా ఆత్మహత్య చేసుకుంది.*
    మీరు మరి పాతగా ఆలోచిస్తున్నారు. ఆ అమ్మాయి చదువు ఎమైనా తక్కువ చదివిందా ఆపని చేసినందుకు సానుభూతి చూపటానికి. డబ్బులు లేక ఇల్లు గడవక గ్లోబలైసేషన్ వలన దెబ్బతిన్న జీవితమా మనం అయ్యో అనుకోవటానికి. మీడియా వారికి ఐ.ఐ.టి. /ఐ.ఐ.యం. మీద వున్న మక్కువ వలన ఆమే గురించి చాలా బాధపడి, ఆమే చావుకు ప్రచారం కలిపించారు.
    అసలికి చాలా మంది తల్లులు పిల్లల గురించి ఆలోచించటం ఎప్పుడో పోయింది. గత 10సం||లు గా ఇంజనీరింగ్ కాలేజిల (ఐ.ఐ.టి.లు మొదలుకొని చిన్న కాలేజిలవరకు)లో జరిగే స్టెజ్ షో లలో అమ్మాయిల దుస్తుల ప్రదర్శన చూస్తే సినేమా వారే ఎంతో నయం అనే భావన కలుగుతుంది. కాలేజి ఫంక్షన్ పోటొలు అందరు చూసినా ఒక్క తల్లు నోరు మేదపదు. తెలియనట్లు ప్రవర్తిస్తుంటారు. మొదట ధరించే దుస్తులను చూసి చూడనట్లు నటించటం మొదలు పెట్టి, చివరికి అమ్మాయి రోజుకొకరి తో తిరుగుతున్నా పట్టించుకోకుండా వుండటం అనేది ఈ రోజుల్లో సాధారణ అంశం. సమాజం ఇంత మార్పులకు లోనౌతున్నపుడు, అమ్మాయిలు పెళ్ళి చేసుకొవాలనే పాత చింతకాయ పచ్చడి ఆలోచన కలిగి వుండటం వెనకాల గల ఉద్దేశాల గురించి ఎవరైనా ఆలోచించాలి.

  5. మంచు said...

    :-))))

  6. Anonymous said...

    ముందు జనరేషన్ తల్లులు కొందరు తాము అనుభవించలేకపోయిన స్వేచ్చ తమ పిల్లలు అనుభవిస్తున్నారు అని మురిసిపోతున్నారు కానీ అది వారినెక్కడికి తీసుకెళుతుందో ఆలోచించడంలేదు

  7. జయహొ said...

    @rama
    *సమాజం ఇంత మార్పులకు లోనౌతున్నపుడు, అమ్మాయిలు పెళ్ళి చేసుకొవాలనే పాత చింతకాయ పచ్చడి ఆలోచన కలిగి వుండటం వెనకాల గల ఉద్దేశాల గురించి ఎవరైనా ఆలోచించాలి.*
    సమాజం ఎంత మార్పులకు గురి అయినా, ఏ కాలం స్రీలైనా ఆడవారికి డబ్బు/అధికారం/తెలివి/హోదా /అందంవున్న మగవాడు కనిపిస్తే పేళ్లి చేసుకొవాలనే అనుకొంట్టుంది. ప్రేమ కొరకు, ప్రేమించుకోవటం కొరకు కలసి వుందామను కోదు. పెళ్ళి చేసుకోవాలను కొంట్టుంది. పెళ్లి చేసుకొంటే హక్కులు వస్తాయి, దానితో పాటు అదనంగా మగ వారి ఆస్థి, అధికారం అనుభవించ వచ్చు. మొన్న ఆమధ్య చూసాం కదా సర్కోజి గర్ల్ ఫ్రేండ్ అవటం మూలాన ఆమేకి దేశా అధ్యక్షుడి భార్యకి లభించే గౌరవం ఇవ్వమని భారత ప్రభుత్వం చెప్పింది.

    ఇంకొక ఉదాహరణ ఆమధ్య అమేరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ గారికి గర్ల్ ఫ్రేండ్ వుందని హిలరి వదిలేసిందా? ఆయనకి భర్య వుండంగా అలా పరస్రీతో సంబందం కలగి వుండాటం పెద్ద తప్పని, అమేరికా మీడీయా హోరేత్తించినా ఆమే క్షమించేసింది. కారణం ఆయన దగ్గర అధ్యక్ష పదవి వుంది. కనుక తాను పెద్ద మనసు చేసుకొని ఆయనని క్షమించి వేసింది. అమేరికా అయినా, మహా భారతం లో ద్రౌపది అయినా మొగుడి దగ్గర అధికారం వుంటే, వారి వలన అధికార సుఖాలు భవిషత్ లో లభిస్తాయను కొంటే తప్పులన్నింటిని క్షమించి, కొన్ని కష్టాలను భరిస్తారు. ఈ కష్ట్టలను వారు భర్త మీద ప్రేమా అని చెప్పుకొంట్టు వుంటారు. అది వేరే విషయం.

  8. Anonymous said...

    జయహో,
    మీరు చెప్పింది బాగుంది. ఇపుడు క్లింటన్ అధ్యక్షుడు కాదు, ఆమె స్టేట్ సెక్రెట్రీ, మరి ఇంకా వదిలేయకపోవడం గురించి మీ తాజా విస్లేషణ ఏమైవుంటుందో తెలుసుకోవాలని వుంది.

  9. వనజ తాతినేని/VanajaTatineni said...

    బాగుంది .బాగా చెప్పారు. ప్రేమలకి,పెళ్ళిళ్ళకి,విడాకులకి,ఆత్మహత్యలకి..ఇప్పుడు ఫేస్ బుక్ వేదిక. మద్య తరగతి అమ్మలలో చాలా దైర్యం వచ్చేసింది అమ్మాయి చదువు ఉద్యోగాలతో పాటు నవనాగరికతను మోసుకొస్తుంటే నోరు మెదపడం లేదు. నిజమే చదువుకుని అభివ్రుద్దిలోకి రమ్మని పంపితే బాయ్ ఫ్రెండ్స్ ని డ్రెస్స్లు మార్చినట్లు మారుస్తుంటే తెలియనట్లు నటించక ఏం చేస్తారు చెప్పండి? అమ్మల మాటలకి విలువనిచ్చె యువత పురుషులలో..ఉంటే కూడా ఇలా జరగవవు కదా? ఎదైతే అది అవుతుంది కానీ మహిళా సంఘాలకి చురక బాగుంది.

  10. పద్మ said...

    ఫేస్ బుక్ లో విడిపోయామని చెప్పినందుకు ఒక IIM స్టూడెంట్ ఆత్మహత్య చేసుకుందా? Strange.. మహిళా సంఘాల గురించి, మహిళా చట్టాల గురించి మీరు చెప్పింది చాలా నిజం. ఒక అమ్మాయి కంప్లైంట్ ఇస్తే చాలు ముందు వెనక ఆలోచించకుండా వెళ్ళి ఆ అబ్బాయిని అతని కుటుంబాన్ని వేధిస్తారు. కాని ఈ చట్టాలన్నీ పెళ్ళి అయిన ఆడపిల్లలకి హెల్ప్ చెయ్యటానికే ఉన్నట్టున్నాయి కదా?

    ఇదివరకు ఈ మహిళాసంఘాల లీడర్ ఒకావిడ ఉండేది. సంధ్య అనుకుంటా పేరు. ఎక్కడన్నా చిన్న పెసరబద్దంత గొడవైతే చాలు ముందు ఒక గుంపుని తీసుకొచ్చేసి ఆ ఇంటి ముందు గోల చేసి పోలీసులు ఈడుస్తుంటే ఫొటోలు తీయించుకుని పత్రికలలో మర్నాడు వచ్చేలా చేసుకునేది. అసలీ మహిళా సంఘాలన్నీ కూడా ఆ పిల్ల చేత కేసులు వేయించేంత వరకు నానా హడావిడి చేస్తారు. ఆతర్వాత అసలా పిల్లకి అండగా ఉంటారా? గాలికొదిలేసి పోతారు. ఏదో ఆడపిల్లలని ఉధ్ధరించటం మా జన్మహక్కని వస్తారు, ఎవరిచ్చారా హక్కు వాళ్ళకి? గోటితో పోయేదాన్ని గొడ్డలి దాక తీసుకొచ్చి, సవ్యంగా జరిగేదాన్ని కూడా చెడగొట్టటానికి?

  11. Anonymous said...

    @jayaho,
    *ప్రేమ కొరకు, ప్రేమించుకోవటం కొరకు కలసి వుందామను కోదు.* అధికార సుఖాలు భవిషత్ లో లభిస్తాయను కొంటే తప్పులన్నింటిని క్షమించి, కొన్ని కష్టాలను భరిస్తారు. ఈ కష్ట్టలను వారు భర్త మీద ప్రేమా అని అంటారు. *
    ఎమీటి మీరు చెప్పేది. అయితే ఈ ప్రపంచం లో ప్రేమ అనేదే లేదా?
    ఆడవారు భర్తతో కష్ట్టనష్ట్టాలను భరించట్టాన్ని,కలసి వుండటాన్ని ప్రేమ అనుకొంటే, మగవారు(ఉదా || పాండవులు) తాము కష్ట్టాలు పడుతున్నా తమను అంటిపెట్టికొన్న భార్యను చూసి మగ వారు వారికి/ ఆబంధానికి ఎమైనా పేరు పెట్టి పిలుస్తారా?
    --------------------------
    జీడీపప్పు గారు మీ బ్లాగులో ఇలా ప్రస్నించటం మీకు ఎమైనా అభ్యంతరకరమైతే తెలిపేది

  12. జయహొ said...

    *ఇపుడు క్లింటన్ అధ్యక్షుడు కాదు, ఆమె స్టేట్ సెక్రెట్రీ, మరి ఇంకా వదిలేయకపోవడం గురించి *

    శంకర్ గారు, ఇక్కడ హిలరి గురించి ప్రస్థావించటానికి కొంచెం చరిత్ర వుంది. కారణం మీకు తెలుసుకదా! మన దేశం లో హిందూ మత సంస్కృతిని, దానిలో ని హిపోక్రసిని వివిధ వాదా లతో దుమ్మేత్తి పోసేవారు. చాలా మంది పాశ్చాత్యులు ఒక భార్య వుంటే ఆవిడకే కమిట ఐయి ఇతరులతో సంబందాలు కొనసాగించరని, అలా కొనసాగిస్తే ఆ భార్య బారతీయ మహిళలా మొగుడితో కలసి ఉండక, విడాకులు తీసుకొంట్టుందని. ఇలా ఆ దేశాల స్రీ స్వాతంత్రం గురించి, వారి హక్కుల గురించి మన దేశం లో కొంతమంది చదువుకొన్న వారు బాగా డబ్బా కోట్టేవారు. ప్రజా జీవితం లో వున్నాడు కనుక ఈ అంశం బాగా ఆకర్షించేది. వీరి నాయకుల భార్యలు ఎంత గట్టిగా వుంటారు. ఇటువంటి సంఘటనలు జరిగినపుడు అని ఆరోజుల్లో క్లింటన్ గారి ఈ ఎపిసోడ్ను చాలా ఓపికగా ట్రాక్ చేసేవాడిని! తీర ఆ సంఘటన కాఫీ కప్పులో తుఫాను లాగా తేలిపోయింది.
    -----------------------------------------
    ఇక మీరడిగిన ప్రశ్నకు వస్తే నా సమాధానం. కేరిర్ హిలరి గారు సీరియస్ గా తీసుకొన్నారు. కనుక ఆమే తన కేరీర్ లో పైకి పోవటమే (అధ్యక్ష పదవి )ముందున్న లక్ష్యం. పైకి పోవాలను కొనే వారు అనవసరం గా ఇతరులతో తగవులు వేసుకోరు.అందరిని కలుపుకు పోవాలని చూస్తారు. తాను ప్రస్తుతం ఉన్న స్థితిని కోరి గందర గోళం లో పడేసుకోరు/చేసుకోరు. అంటే ఇప్పుడు హిల్లరిగారికి బిల్లి బాయ్ మీద కక్ష తీరుచుకోవాలను కొని విడాకులు ఇస్తే ఆవిడకు వచ్చే లాభమేమిటి? మీడియా వారు వెంటపడి, ఆమే ఎందుకు విడాకులు ఇస్తున్నాదని ఉహాగానాలతో కూడిన ప్రోగ్రాంస్ ప్రసారం చేయటం, కనిపించిన ప్రతివాడు గాసిప్ మీద గాసిప్ లు రాస్తూ ఇబ్బందికి గురి చేస్తారు. ఈ దెబ్బతో ఆవిడ మీద ప్రేసిడెంట్ రేసు లో వున్న ఆవిడ జీవితం సినేమా యాక్టర్ జీవితం లాగా అయిపోతుంది(విడాకులు మీద వార్తలు, ఆ తరువాత వాడి తో ప్రేమలో పడిందన్న గాసిప్, రేపో మాపో పేళ్లి అని ఇలా వార్తలు వస్తూనే వుండవచ్చు, ప్రత్యర్దులు మీడీయా వారికి డబ్బులిచ్చినంత కాలం). ప్రజలు సినేమా వారైతే ప్రేమా, రేండో పెళ్లి, విడాకులు అనే వాటిని ఆసక్తి గా చదువుతారు, పెద్ద సిరియస్ తీసుకోరు. అదే రాజకీయ నాయకులు, అందులోను మొదటి సారిగా అధ్యక్ష పదవికి పోటి పడే మహిళ మీద రోజు ఇటువంటి వార్తలు పేపర్లలో వస్తుంటే ప్రజలు ఏవిధంగా ప్రతిస్పందిస్తారో చెప్పటం చాలా కష్ట్టం. ఇటువంటి సందర్భంలో ఎవరికి వారు తమకు అనుకూలంగా పరిస్థితి ఉందంట్టూ, ఊహించు కొంట్టూ ప్రచారం చేసినా, వారి భయాలు వారికి వుంటాయి. ముఖ్యంగా పార్టి అధ్యక్ష పదవి అభ్యర్ధిగా ఎన్నిక చేస్తుందా అన్నది మొదటిది, చేసినా గెలవగలమా అనేది రెండవది. ప్రతిపక్షం విడాకుల విషయాన్ని ఎలా చిత్రికరిస్తుందో మూడవది. స్థానిక ప్రజల మనోభావాల మీద ఆ అంశం ఎలా పని చేస్తుందో అనేది నాలుగది. ఇలా ఇంకా రాయవచ్చు కాని
    ఈ వయసులో ఆ ముసలి మొగుడిని వదిలి వేయటం వలన అనవసరమైన ఇస్యుని గెలికి నెత్తిన పేట్టుకోకుండా. అతనితో కలసి వుంటే కలిగే లాభాలు చూస్తుంది. కలసి వుంటే అతనికి తన పార్టిలో,ఇతర పార్టిలో వారి బలాబలాలు తెలుసు.ఎందుకంటే వారు స్వమ్యంగా అధ్యక్షులుగా పనిచేశారు, కనుక భర్తగా ఆయన ఎంతో సహాయం చేయవచ్చు. చేసిన ఎవరు తప్పు పట్టరు సరికదా! ఇంత వయసులో ను చిలకా గోరింకల లా చాలా ఒద్దికగా వున్నారను కొంటారు. ఒక వేళ అధ్యక్ష్యురాలైతే మొదటిసారిగా మొదటిసారిగా అధ్యక్షులుగా ఎన్నికైన భర్య భర్తలుగా రికార్డ్ నెల కొలపవచ్చు.
    ఆ తరువాత భార్య భర్తలు అంటే వారిలాగా వుండాలను కొనే విధంగా ప్రజల చేత అనిపించుకోనువచ్చు.
    ---------------------------
    మనుషులు నిర్ణయాలు తీసుకొనేది తమకు లాభం కలగాలని/ మేలు జరగాలని ఆశించి తీసుకొంటారు. అంతే కాని ప్రస్తుతం వున్న పరిస్థితిని గందర గోళం లో పడేసు కోవటం జరుగుతుందంటే ఎవరు నిర్ణయం తీసుకోరు. అందువలన హిలరి కూడా మొగుడు కి విడాకులు ఇచ్చే నిర్ణయం తీసుకోక పోయివుండవచ్చు. మీరు అడిగిన ఊహాజనిత ప్రశ్నకి నా సమధానం. మీరే మంటారు?

  13. జయహొ said...

    *తాము కష్ట్టాలు పడుతున్నా తమను అంటిపెట్టికొన్న భార్యను చూసి మగ వారు వారికి/ ఆబంధానికి ఎమైనా పేరు పెట్టి పిలుస్తారా? *

    వారిని మగవారు "పతివ్రతా శిరోమణి" అని బిరుదు నిచ్చి గౌరవిస్తారు. ప్రేమ గురించి నాకు పెద్దగా తెలియదు గాని. ద్రుపది విషయమే తీసుకో, అడవులలో వున్నపుడు కృష్ణునితో తన బాధాలు, తన భర్తలు పడిన బాధలు చెప్పుకొని భోరు మని ఏడుస్తుంది. అలాగే పాండవులు తనను జూదం లో ఎందుకు పణ్నంగా, పెట్టారని ప్రశ్నిస్తుంది. దానికి వారి దగ్గర నుంచి సమధానం వుండదు. ఇంత చేసినా భర్తలతోనే ఆవిడ కలసి అడవులకు వేళుతుంది. ఇక్కడ ఆమే భర్తలను ప్రశ్నించటం, కృష్ణుడి వద్ద ఏడవటం చేసినా, ఆమే తన తప్పు పెద్దగా పట్టించుకొన్నట్లు కనపడదు. దుర్యోధనుడు మయ సభలో కాలు జారి నీళ్ళలో పడితే, ద్రౌపది గారి కిల కిల మని నవ్వుతుంది. పడిన వాడు మహారాజు. ఈవిడ చిన్న పిల్ల కాదుకదా నవ్వటానికి. కొంచేం కూడా తనను నిభాయించుకోకుండా పక్కున నవ్వింది. దుర్యోధనుడు పాచికలాడటానికి, వారిని అడవులకు పంపటానికి కారణమైంది.
    -----------------------------------------------
    పాండవులు ఆవిడను నీ నవ్వు వల్లే మాకు ఇది జరిగిందని పెద్దగా గలభా చేయలేదు. ఈవిడా జూదం లో ఎందుకు పణ్నంగా, పెట్టారని ప్రశ్నించినా దాని ఎక్కువ చేయలేదు. ధర్మరాజు ఇచ్చిన సమాధానం విని గమ్ముగా వుండి పోయింది. ఇలా భర్యా భర్తలు ఒకరి తప్పును ఒకరు మనించుకొంట్టూ, అడవులలో తిరుగుతూ కనిపించిన వారికి, కౌరవుల వలన కలిగిన తమ కష్ట్టాలను ఏకరువు పెడుతు కాలం గడిపారు. అది చూసేవారికి ప్రేమగా కనిపించ వచ్చు. కాని అక్కడ తమ తమ బలహీనతలను భర్య భర్తలు కప్పి పుచ్చుకొని ఎదుటి వారిమీద, ఎక్కువగా కృష్ణుడు దగ్గర పంచాయితి పేట్టేవారు. కృష్ణుడు లిసనింగ్ స్కిల్స్ ఎక్కువ. కృష్ణుడంటె వీరందరికి చాలా ఇష్ట్టం. ముఖ్యం గా ద్రౌపదికి, ఎందుకంటే ఆవిడ పేట్టె పంచాయితిని, ఆయన చాలా ఓపిక గా వినే వాడు. అదే కాక సహజంగా ఆడవారికి తాము చేప్పే మాటలు విని, గుర్తుంచుకొని, వారు తిరిగి ప్రశ్నించినపుడు జవాబు చెప్పే మగ వారంటె అదొక విధమైన తెలియని గౌరవం. మొగుడైతే ప్రేమ. దేవుడైతే భక్తి అన్న మాట.
    --------------------------
    భార్యా భర్తలు తము చేసిన తప్పులను చూసి చూడనట్లుగా వుండటాన్ని ప్రేమ అని అనుకొంటారు. వారు చెప్పె కష్ట్టాలు వినే వ్యక్తి ఎవరైనb కృష్ణుడి లాగా వినే వాడు వుంటే దానిని ప్రేమ అని అనుకొంటారని పిస్తుంది. ఇక అందరికి తెలిసినదే మొగుడొ,పేళ్ళమో జబ్బున పడితే చేసుకొనే సహాయం కూడా లోకంలో ప్రేమ అని చెప్పబడును.

  14. మధురవాణి said...

    హుమ్మ్..!

  15. Anonymous said...

    @ padma garu
    ఇదివరకు ఈ మహిళాసంఘాల లీడర్ ఒకావిడ ఉండేది. సంధ్య అనుకుంటా పేరు. ఎక్కడన్నా చిన్న పెసరబద్దంత గొడవైతే చాలు ముందు ఒక గుంపుని తీసుకొచ్చేసి ఆ ఇంటి ముందు గోల చేసి పోలీసులు ఈడుస్తుంటే ఫొటోలు తీయించుకుని పత్రికలలో మర్నాడు వచ్చేలా చేసుకునేది.

    aavida ippatiki undi. challaga sage samsarallo nippu pettadaniki. intlo mogudiki, pillalaki intha mudda ayina peduthunda anedi naa anumaanam.

Post a Comment