మరో ధృవతార బాబీ కెన్నెడీ

Posted by జీడిపప్పు

కెన్నెడీ. ఆ పేరు వింటే ఎంతోమంది అమెరికన్ల హృదయం పులకరిస్తుంది. ఆ పేరు విన్నపుడు ఉప్పొంగే సంతోషంతో పాటు విషాద జ్ఞాపకాలు కూడా గుర్తుకొస్తాయి. గత అర్థ శతాబ్దంలో అమెరికాను పాలించిన అతి గొప్ప అధ్యక్షుడు ఎవరంటే అందరి మదిలో మెదిలే వ్యక్తి జాన్ ఎఫ్ కెన్నెడీ. కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే దేశాన్ని పాలించినా, ప్రెసిడెంట్ అన్న పదానికున్న గౌరవాన్ని మరింత ఇనుమడింపచేసిన జాన్ ఎఫ్ కెన్నెడీ అంత గొప్పవాడిగా పేరుపొందడానికి కారకుడు ఆయన తమ్ముడు రాబర్ట్ "బాబీ" కెన్నెడీ.

కెన్నెడీ దంపతులకు ఏడవ సంతానమయిన బాబీ కెన్నెడీ బాల్యం ఆటపాటలతో గడిచిపోయింది. జాన్ కెన్నెడీకీ, బాబీ కెన్నెడీకి మధ్య ఎనిమిదేళ్ళ వ్యత్యాసం ఉండడంతో చిన్నపుడు ఇరువురిమధ్య ఎక్కువ చనువు ఉండేది కాదు. 1951 లో తన అన్నతో కలసి ఆరువారాలపాటు ఇజ్రాయిల్, ఇండియా మొదలయిన దేశాలను పర్యటించాడు. ఆ ఆరువారాల్లో అన్నదమ్ములమధ్య సాన్నిహిత్యం పెరిగింది. అమెరికాకు తిరిగివచ్చిన తర్వాత బాబీ తన భార్య పిల్లలతో కలసి వాషింగ్టన్‌కు వెళ్ళి అక్కడ లాయరు వృత్తి మొదలుపెట్టాడు. కొద్ది రోజులకు జాన్ కెన్నెడీ సెనేటర్ గా పోటీ చేస్తుంటే తన సోదరుడికి సహయంగా ఉండడానికి లాయరు వృత్తిని విడిచిపెట్టాడు. అప్పటినుండి చట్ట సభల్లో ఎన్నో పదవులు చేపట్టి పేరు తెచ్చుకొన్నాడు.

1960లో జాన్ ఎఫ్. కెన్నెడీ అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసినపుడు బాబీ సర్వం తానై నడిపించాడు. ఎత్తులకు పైఎత్తులు వేసి ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టేవాడు. కాస్త మొండివాడయినా నమ్మకానికి మారుపేరుగా నిలిచి ప్రజల దగ్గర "అన్నకు తగ్గ తమ్ముడంటే జాన్ ఎఫ్. కెన్నెడీకి బాబీ కెన్నెడీలా ఉండాలి" అని ప్రశంసలు తెచ్చుకున్నాడు. జాన్ కెన్నెడీ ప్రెసిడెంట్ అయిన తర్వాత తన తమ్ముడిని అటార్నీ జనరల్ గా నియమించాడు. అమెరికా చరిత్రలో ఈనాటి వరకు ఏ అటార్నీ జనరల్‌కు లేని అధికారాలు బాబీ చేతికి వచ్చాయి.

బాబీ కెన్నెడీ తీసుకొనే ప్రతి నిర్ణయాన్ని జాన్ కెన్నెడీలాంటి మేధావి మారుమాటాడక అంగీకరించేవాడు. చిన్నతనం నుండి విశాలభావాలుగల బాబీ నల్లజాతీయుల హక్కులకోసం ఎన్నో చట్టాలు తెచ్చాడు. వర్ణవివక్ష ఎక్కువ ఉన్న మిసిసిపీలో ఒక యూనివర్సిటీలో మొదటిసారి ఒక నల్లజాతీయుడయిన విద్యార్థి చేరుతున్న రోజు గొడవలను ఆపడానికి పెద్ద ఎత్తున సైన్యాన్ని మొహరింపచేసి తెల్లవారిని అదుపులో ఉంచి అమెరికాను నివ్వెరపోయేలా చేసాడు. మార్టిన్ లూథర్ కింగ్‌కు రక్షణ కల్పించి నల్లవారికి సమానహక్కులు ఉండాలని ప్రజల భావాలను మార్చే ప్రయత్నం చేసాడు.

60, 70లలో అమెరికాలో పాతుకుపొయి ఉన్న మాఫియాకు బాబీ సింహస్వప్నమయ్యాడు. మాఫియాను అదుపులోకి తెచ్చేందుకు చట్టాలను ప్రవేశపెట్టి అణిచివేయడం మొదలుపెట్టాడు. క్యూబా వివాదంలో రష్యాతో అణుయుద్దం దాదాపు ఖాయమయినా జరగకపోవడానికి కారణం జాన్-బాబీ కెన్నెడీల మంత్రాంగమే. అప్పటివరకు అధ్యక్షులను తమ చెప్పుచేతల్లో ఉంచుకొన్న CIA ఆటలు బాబీ ముందు సాగలేదు. CIA దురాగతాలకు అడ్డుకట్టవేయడానికి ప్రయత్నించిన జాన్ ఎఫ్ కెన్నెడీ 1963 లో CIA కుట్రవల్ల హత్య చేయబడ్డాడు.

తల్లిదండ్రులకంటే ఎక్కువ సాన్నిహిత్యం ఉన్న తన సోదరుడు హత్యకు గురికావడం బాబీని కలచివేసింది. కొద్దిరోజులు జీవితం పట్ల నిరాశ చెందినా, తమ ఇద్దరి ఆశయాలకోసం మళ్ళీ అధ్యక్ష పదవికి పోటీ చేసాడు. బాబీ అధ్యక్షుడయితే తమ ఆటలు సాగవని తెలుసుకున్న CIA, మాఫియా కలసి బాబీ కెన్నడీని కాలిఫోర్నియాలో హత్య చేయించాయి.

1968 జూన్ 6 న కేవలం 42 ఏళ్ళ వయసులో మరణించిన బాబీ కెన్నెడీ అన్యాయాన్ని అరికట్టి ప్రజల మేలు కోసం ఏదయినా చేయడానికి వెనుకాడని నాయకుడిగా, తనను నమ్మిన అన్న కోసం ప్రాణాలివ్వడానికి వెనుకాడని తమ్ముడిగా ఇప్పటికీ అందరి హృదయాల్లో ఉన్నాడు.

5 comments:

 1. హరే కృష్ణ said...

  నాకు జాన్ బాబి ఇప్పటి దాక తెలుసుకోవాలని వుండేది కాదు..బావుంది..ఎమైన autobiography or నోవెల్ ఉన్నాయా సూచించగలరు... బాగా రాసారు పోస్ట్

 2. amma odi said...

  Good information.

 3. Shashank said...

  బానే ఉంది కాని కొంచం తప్పు రాసావు. CIA దురాగతాలు అడ్డుకున్నందుకు కాదు జే.ఎఫ్.కే ని చంపింది, అతడు ఒక చట్టం తీసుకొచ్చాడు. మన దేశం లో లా కాకుండా ఇక్కడి ఫెడరల్ రిసర్వ్ ఒక ప్రైవేటు సంస్థ. అది US govt కి డాలర్లు ఇచ్చి అందుకు ట్రెజరీ బాండ్స్ తీసుకుంటుంది. ఈ దేశం లో కట్టే ఆదాయపు పన్ను ఫెడరల్ రిసర్వ్ కి అమేరికా ప్రభుత్వం ప్రతి యేడూ కట్టే వడ్డి. వాళ్ళిచ్చిన డాలర్లకి బదులు. 1963 లొ (జూన్ లో అనుకుంటా) జే.ఎఫ్.కే ఒక executive order మీద సంతకం పెట్టాడు ఫెడ్ డాలర్లకి బదులు US govt డాలర్లని వాడుకలోకి క్రమంగా తెచ్చేదానికి.

  అలా చేస్తే ఫెడ్ ఎందుకు ఊరుకుంటుంది? అప్పటికి ఇప్పటికి ఫెడ్ చాలా చాలా చాలా పెద్ద ప్రవేట్ సంస్థ అదీ కాకుండా ప్రతి యేటా ఇంతింత వడ్డి వచ్చే వ్యాపారం ఎందుకు వదులుకుంటుంది? ఎల్.బి.జే (లిండ్సన్ జాన్సన్, జె.ఎఫ్.కే వైస్ ప్రెసిడెంట్) చేసిన మొట్టమొదటి పని ఆ అమేరిక ప్రబుత్వ నోట్లని రద్దు చేయడం.

  ఇంకో విషయం చెప్పన? ఇలా ప్రబుత్వ నోట్లని వాడుకలోకి తీసుకొని వద్దాం అని ప్రయత్నించిన మరో ప్రెసిడెంట్ ఎవరో తెలుసా? ఏబ్రహం లింకన్. అతన్ని చంపేసారు. తర్వత అతను వాడుకలోకి తెచ్చిన నోట్లని కూడా రద్దు చేసారు. అప్పుడు ఫెడ్ లేదు కాని అంతర్గత యుద్ధానికి 24-34% వడ్డి తో అప్పులు ఇచ్చారు అమేరికా ప్రభుత్వానికి బ్యాంకర్లు. రాత్స్ చైల్డ్ పేరు గాన్, రాకీఫెల్లర్ పేరు గాని వినేఉంటావ్. వాళ్ళ చేతుల్లోనే ఉంది బాబు మన ప్రపంచం.

  సారీ - నీ టప అంత అయ్యింది నా వ్యాఖ్య.

 4. Anil Dasari said...

  వాళ్ల హత్యల గురించి చాలా కాన్స్పిరసీ థియరీస్ ఉన్నాయి. ఫలానాదే సరైనదని చెప్పటం కష్టం. సిఐఏ గురించి అంత ఖరాఖండిగా చెప్పటం తీసేస్తే మిగతా టపా అంతా బాగుంది.

  కెవిన్ కాస్ట్నర్ కెనడీ కుటుంబాభిమాని. రెండు మంచి సినిమాలు కూడా అందించాడు వాళ్ల గురించి: JFK, 13 Days. రెండూ మంచి సినిమాలు.

 5. amma odi said...

  శశాంక్ గారు,
  మంచి సమాచారం ఇచ్చారు. నెనర్లు.

Post a Comment