Snatch. - ఒక అద్భుత సినిమా

Posted by జీడిపప్పు

సినిమా అంటే తెలుగు సినిమా మాత్రమే, ఇంగ్లీషులో సినిమా అంటే రాంబో మాత్రమే అనుకొనే దుర్భర స్థితి నుండి అదృష్టవశాత్తూ బయటపడి కొన్నేళ్ళ క్రితం ఇంగ్లీషు సినిమాలు చూడడం మొదలుపెట్టాను (అదే సమయంలో "కొత్త తెలుగు సినిమాలు" చూడడం దాదాపు మానేశాను). మొదట్లో ఇంగ్లీషు సినిమాలకు కూడా సబ్‌టైటిల్స్ పెట్టుకొని చూసేవాడిని (సుత్తి వీరభద్రరావుగారికి ఈ సంగతి తెలిసి ఉంటే "ఇంగ్లీషు సినిమాను సబ్‌టైటిల్స్ పెట్టుకొని చూసే మొహం నువ్వునూ" అనేవారేమో!). కొద్ది కాలానికి ఆ అవసరం కూడా తీరిపోయింది.

ఒకసారి ఒక అసలు సిసలయిన "ఇంగ్లీషు" సినిమా చూడమని ఒక మిత్రుడు సలహా ఇవ్వడంతో చూడడం మొదలుపెట్టాను. సంభాషణలన్నీ ఇంగ్లీషులోనే సాగుతున్నప్పటికీ సరిగా అర్థం కాలేదు. "ఓహో ఇది బ్రిటీష్ ఇంగ్లీష్" అనుకొని కాస్త చెవులు రిక్కించి విన్నా లాభం లేకపోయింది. తప్పదని సబ్‌టైటిల్స్ తో చూడడం మొదలుపెట్టాను. వాటిపుణ్యమా అని సంభాషణలు అర్థమవుతున్నా ఆ కర్ణ కఠోరమయిన accent భరించలేకపోయాను. చూడకుండా వదిలేయడానికి ఈ సినిమా IMDB లో మంచి ర్యాంకులో ఉంది! మూడు సార్లు ఒక్కోసారి 10-15 నిమిషాలపాటు ప్రయత్నించి ఆ accent చిత్రహింస భరించలేక చేతులెత్తేసాను. ఆ సినిమా పేరే - Lock, Stock and Two Smoking Barrels.

తర్వాత ఇంకోసారి ఇంకో సినిమా రేటింగ్ చూసి దర్శకుడి పేరు చూసి ఉలిక్కిపడ్డాను. ఆ దర్శకుడు మరెవరో కాదు, పైన చెప్పిన సినిమా తీసిన దర్శకుడే. ఈ సినిమా కూడా అలాగే ఉంటుందేమో, అయినా సరే Top 155 ర్యాంకులో ఉంది కదా, ఒకసారి ప్రయత్నించాలి అనుకొని ఈసారి ముందుజాగ్రత్తగా సబ్‌టైటిల్స్ తో చూడడం మొదలుపెట్టాను. ఆ తర్వాతి వారం రోజుల్లో సబ్‌టైటిల్స్ లేకుండా ఆ సినిమాను నాలుగు సార్లు చూసాను. ఆ సినిమా పేరు Snatch., నేను చూసిన అత్యుత్తమ వినోదాత్మక చిత్రాల్లో ఒకటి.

సినిమా అన్న పదానికి వినోదం అర్థమయితే, సాధారణ కథ, చిత్రమయిన పాత్రలు, అంతకంటే విచిత్రమయిన మాటలు, అడుగడుగునా ప్రమాదాలు, ప్రమాదాల్లో కడుపుబ్బా నవ్వించే హాస్యం, చక్కటి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఉన్న Snatch. వినోదం అన్నమాటకు వివరణ అని చెప్పవచ్చు.

సినిమా కథ మూడంటే మూడు ముక్కల్లో  - "వజ్రం కోసం వేట". ఏ సినిమాకయినా ప్రధానపాత్రలు, సైడ్ పాత్రలు అని ఉంటాయి. కానీ ఇందులో దాదాపు అన్నీ ప్రధాన పాత్రలే. అందరూ హీరోలే, అందరూ విలన్లే, అందరూ కామెడీ చేసేవారే. ఈ సినిమా (మళ్ళీ మళ్ళీ) చూస్తున్న కొద్దీ క్యారక్టర్లు విపరీతంగా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా Turkish, Bullet Tooth Tony, Mickey, Brick Top.

డైలాగుల విషయానికొస్తే - ప్రతి సినిమాలో గుర్తించుకోదగ్గ కొన్ని పంచ్ డైలాగులుంటే, ఇందులో మొదటి నుండి చివరివరకూ డైలాగుల పంచ్‌లే పంచ్‌లు. "as greedy as a pig" అన్నమాటలకు పందుల గురించి Brick Top ఇచ్చే వివరణ, హోటల్లో Bullet Tooth Tony తన దగ్గరికి వచ్చిన Sol త్రయాన్ని భయపెట్టే మాటలు masterpiece డైలాగులు. తన అసిస్టెంటుకు Turkish ఇచ్చే జవాబులు, బ్రిటీషర్ల పైన Avi చూపే కోపం, Sol త్రయం కామెడీ కొద్ది రోజులపాటు గుర్తుండిపోతాయి.

కుందేలును కుక్కలు తరుముకోనే సన్నివేశంలో, Brick Top తన క్రూరత్వాన్ని చూపించుకొనే సన్నివేశాల్లో వాడిన మ్యూజిక్ చాలా బాగా సరిపోయింది. అక్కడక్కడా కాస్త భారతీయసంగీతం తాకుతుంది. Massive Attack's  Angelను ఉపయోగించుకున్నట్టే Teardrop పాటను కూడా ఏదో ఒక సన్నివేశంలో వాడుకొని ఉండవచ్చు. నిజానికి Angel కంటే Teardrop పాటే బాగుంది.

సినిమా మొత్తం మీద దాదాపు స్త్రీ పాత్ర లేకపోవడం, దాదాపు 26 మర్డర్లు జరిగినా ఒక్క మర్డరు కూడా స్క్రీన్ పైన కనిపించకపోవడం, బ్రిటీషర్లకే అర్థం కాని ఇంగ్లీషును Brad Pitt ద్వారా చెప్పించడం, 163 సార్లు $%* పదం వాడడం, టైటిల్ చివర ఫుల్‌స్టాప్ ఉండడం మొదలయినవి ఈ సినిమాలోని మరికొన్ని హైలైట్స్. చాలా సాధారణమయిన కథ ఉన్న ఈ సినిమా ఎందుకు ఆల్ టైం గ్రేట్ జాబితాలో ఉందో వీక్షించి తెలుసుకోకుంటే ఒక మంచి సినిమా మిస్ అవుతున్నట్టే!

4 comments:

  1. మంచు said...

    రెండు సినిమాలలొను..నాకు వయిలన్స్ ఎక్కువ అనిపించింది.

  2. బ్లాగాగ్ని said...

    మిగతావన్నీ ఓకేగానీ
    >>టైటిల్ చివర ఫుల్‌స్టాప్ ఉండడం మొదలయినవి
    ???
    మీరు నిజంగా అన్నారో లేక వ్యంగ్యంగా అన్నారో నాకర్థం కాలేదు. ఇది మరీ అంత హైలైటా?

  3. Sravya V said...

    బ్లాగాగ్ని గారి సందేహమే నాది కూడా ?

  4. జీడిపప్పు said...

    @ మంచు పల్లకి గారు - వయొలెన్సును రాజమౌళిలా చూపించకుండా, తెలియజెప్పడమే రెండు సినిమాల గొప్పదనం అనిపిస్తుంది నాకు

    @ బ్లాగాగ్ని గారు, శ్రావ్య గారు - సీరియస్ గానే అన్నాను. ఇప్పటివరకు టైటిల్‌లో ఫుల్‌స్టాప్ చూడలేదు!

Post a Comment