ఆటోప్రకాష్‌కు కవితాభిషేకం

Posted by జీడిపప్పు

నాకు కవితల పట్ల పెద్దగా ఆసక్తి లేకపోయినా బ్లాగుల్లో కనపడే కవితలను అపుడపుడు చూస్తాను. మొన్నొకరోజు కవితలను చూస్తుంటే వేదన, రోదన, ఖేదన, మోదన, బాదనా కవితలు కనిపించాయి... ఒక్క ముక్కలో చెప్పాలంటే చాలావరకు "ఏడుపు కవితలే" కనిపించాయి. సాధారణంగా ఏదయినా కథల పోటీ అని ప్రకటించగానే "ఆర్ద్రత" కలిగిన ఏడుపు కథలను రాయడం రచయితల ఆనవాయితీ. అలా కొంపతీసి బ్లాగుల్లో కూడా కవితల పోటీ ఏమయినా నడుస్తున్నదా లేక నా పైన "గో గ్రీన్" స్లోగన్ ప్రభావమా అనిపించింది.

anyhow, ఈ వారం సాక్షి సండే స్పెషల్‌లో ఒక మహోన్నత వ్యక్తి గురించి చూసాను. వివరాలు: ఇక్కడ మరియు ఇక్కడ.  అసలు ఇలాంటి విషయం కవితావస్తువుగా పనికొస్తుందా రాదా అన్న సందేహమొచ్చి కొన్ని బ్లాగుల్లో "ఈ వార్త పైన కవిత వ్రాయ"మని కొందరిని కోరాను. వారు అందించిన ఆణిముత్యాలు:

ఆటో ప్రకాష్ 9948029294
ఈ ప్రపంచం దృష్టెపుడూ
పసిపాపలపైనే.
ప్రేమించటానికో లేక
వ్యాపారించటానికో.

అయితే ఇతని చూపు
పండు భారానికి వంగిన కొమ్మపై ఉంటుంది.
అందుకేనేమో
నిండుగర్భిణిని పాపాయిగా మార్చి
పొత్తిళ్లలో పొదువుకోగలడు.
మూలాలపై మమకారమే తప్ప
వ్యాపారముండదిక్కడ.

నెలలు నిండిన స్త్రీని చూస్తే
మగవాడికి భయమో, జలదరింపో!
బహుసా స్త్రీ ముందు తన
అస్థిత్వమేమిటో గుర్తొస్తుందేమో.
ఇతనికి మాత్రం
తన శైశవపు పెదవులనుండి
శబ్దిస్తూ విడిపోయిన తన తల్లి
చన్మొన జ్ఞప్తి కొస్తుందేమో.

కాన్పు కు సిద్దమయిన స్త్రీ నడుస్తూంటే
మృత్యువు, ప్రాణమూ
కలిసి తిరుగుతున్నట్లుంటుంది.

సృష్టిగాలులకు ప్రాణదీపం
రెపరెపలాడే ఆ రాత్రివేళ
మనిషికీ మనిషికీ మధ్య
నమ్మకపు పరిమళం ప్రవహిస్తుంది.
ఇతని మనిషితనం ముందు
మృత్యుదేవత తలదించుకొని
మౌనంగా నిష్క్రమిస్తుంది.

పుడమిలోతుల్లోంచి
మరో ఉదయం బయటపడింది.
దానిని తవ్వితీసిన తల్లి
పొడికనులు ఇతనిని తడిగా చూసిన
చూపుల భాషలోనే కదా
ఈ లోకపు కీర్తనలన్నీ వ్రాయబడ్డాయీ!

అంచులవరకూ నిండిన తృప్తితో
ఇతనూ వెనుతిరుగుతాడు
ఎప్పటిలానే!
- బొల్లోజు బాబా

ఆటో నడిపే దేముడు...
అమ్మ తనాన్ని అమ్మేవాళ్ళూ..
ఆ పిలుపుని పిండమప్పుడే నలిపేవాళ్ళూ..
అద్దెకడుపుల వేలంపాటలూ..
ఏడడుగులేసిన ఏడోరోజే చూరు అంచులకు చేర్చే వాళ్ళూ..
ఆకలి కేకల్లో ఆరాటమార్చుకునే వాళ్ళూ..

కకృతి కోరల కరాళ నృత్యం..
కాగితం చుట్టగా.. ముంగిట్లోకి..

మధ్య పేజీలో మరో ఉదయం..

కలికాలపు ప్రవాహంలో...
అడ్డుగా .. ఓ గడ్డి పరక.

తన బ్రతుకే ఎదురీత..
ఎన్ని కడుపుల భారాన్నో మోస్తూ
ఓ కాలుతున్న కడుపు..

ప్రతి క్షణమూ ప్రసవ వేదనే..
చెక్కిళ్ళపై ఆగని పురిటి స్నానాలే..

ఏడుకొండల మీడ హుండీలు నింపుతూ
ఏ గర్భ గుడిలోనో మనమెదికేవాడు
మూడు చక్రాల గుడిలో
నిండు గర్భాలు మోస్తూ
మన మధ్యనే తిరుగుతున్నాడు..

చెమరిన కళ్ళతో..
తన కాళ్ళకిదే కవితాభిషేకం.!
- ఆత్రేయ కొండూరు

మానవత్వపు ప్రతీక
ఈ ఆటో -
అమ్మతనానికి ఒక అడుగు ముందుంటుంది
మాతృత్వాన్ని వరంగా ఇస్తుంది
ఈ ఆటో పుణ్యమా అని
ఎందరో అమ్మలు పుట్టారు

తొమ్మిదినెలలు స్వప్నించిన మధురక్షణం
మరణమా? మనుగడా? అని ప్రశ్నిస్తే
ఇతని ఫోను మోగుతుంది
అంతే -
పుట్టుకకు మరణానికి మధ్య
తన ఆటో అడ్డం పెట్టేస్తాడు

తండ్రిలా చేరదీసి
అన్నలా ఆదరించి
అమ్మగా బతకమని ఆశీర్వదిస్తాడు

ఆశకు మూడు చక్రాలు తొడిగి
ఆశయమనే ఇంధనం కలిపాడేమో
ఈ నగరారణ్యంలో
ఎన్నో పసి నవ్వుల పువ్వుల పూయించాడు

ఇప్పుడు ప్రసవ వేదనంటే
జీవితానికి మరణానికి మధ్య ప్రశ్న కాదు
జీవం పోసే మంచితనానికి
మానవత్వపు ప్రతీక..!
- సత్యప్రసాద్ అరిపిరాల

పుడమి తల్లి గర్భాన్ని ఛేదించుకుని
ఉద్భవించబోతున్న బాలభానులకు
మూడు గుర్రాల రథానికి
సారథ్యం వహించే అనూరునివా ?
మానవత్వ పరిమళంతో ’ప్రకాశి‘స్తున్న
ఓ మానవతావాదీ ! నీకు నమో నమః
- చిలమకూరు విజయమోహన్ 

ఆ సూర్యప్రకాశమే నీలో.. ఆటో ప్రకాష్
చంటి పిల్లల ఏడుపులే తమ
వ్యాపారానికి పెట్టుబడిగా పెట్టేవాళ్ళు
కేర్ కేర్ అనే భాషకు
విలువకట్టి విపణి వీధిలో
కన్న కడుపలు వేలంవేసే వాళ్ళు

ఆక్రందనలతో తల్లడిల్లుతున్న
కాబోయే తల్లుల నిస్సహాయాన్ని
ఆసరా చేసుకుని చార్జీలు పెంచే
ఆటో వాళ్ళూ, ఇందరి మధ్యలో
వన్నెతగ్గని మానవత్వం
మూర్తివంతమైంది నీలో, ఇదెలా?

క్రౌంచ పక్షుల శోకం
నాడు వాల్మీకి హృదయాన్ని
తట్టి లేపినట్లు,
సతి వేదన నేడు నీలో
మంచితనపు చిగురు తొడిగింది
మానవత్వపు చాయలింకా మాసిపోలేదంది

తన కిరణాల కాంతిలో జగతిని
వెలిగించే ఆ సూప్రకాశమే నీలో
మళ్లీ కొత్తరూపు సంతరించుకుని
మరెందరి తల్లులకో కంటి
వెలుగు నిలుపుతోంది, "ఆటో ప్రకాష్"మై.

తగిలిన గోరంత దెబ్బకే
కొండంత ప్రతీకారంతో
ఎందరి బ్రతుకులనో కాలరాచే
అసురగణాల నడుమ
నిజంగా నువ్వు పాడింది సరికొత్త
జీవనగీతమే, అది ఎందరెందరికో
ఆచరణీయమైన పాఠమే

మనసుంటే మార్గముందని
మరో సారి చేసి చూపించిన
నేస్తమా, ఏ అక్షరాల మాల కూర్చి
నిన్ను నుతించను? అందుకే
శిరసు వంచి చేస్తున్నా వందనం
శ్రుతి

పేకాటో ప్రకాశ్ లెందరో! ”ఆటో ప్రకాశ్ “ మాత్రం ఒక్కడే!!
దాన కర్ణుడిలాగ కానవసరము లేదు!
నీ నిర్లక్ష్యపు చిల్లర ఖర్చులతొ క్షుదార్తి కడుపు నింపగ వచ్చు!!
శిభి చక్రవర్తిలా దేహమర్పించగనేల?
చిన్నారుల ముదుసలుల దారి కావలి దరి చేర్చగ వచ్చు!!
బలి చక్రవర్తిలా స్వీయ త్యాగంబేల?
వ్యసనాల మానేసి బీద విద్యార్థికి చేయూత గావచ్చు!!
బిల్గేట్స్ అంబానీలవొలె కోటికి పడగెత్త నవసరము లేదు!
చేతనైనంతలో సేవ చేయగ “వైజాగ్ ఆటోప్రకాశ్” లా అవతరించవచ్చు!!
మనసుండే చోటుకై మార్గమే ఉండదా?!
మానవత్వము తోటె ప్రతి బ్రతుకు పండదా!!!
- Rakhee


అటో ఇటో ఎటో అటు సీటు చోదకుడి పక్కనైన చాలు
ఎక్కి ఇరుక్కుని గమ్యం చేరగలం
ఆటో ఉన్నది ముగ్గురికే అనే రధకుడు మూడు తరాల వెనక సంగతి
రోడ్డు పక్క పురిళ్ళు, బెడ్డులివ్వని ఆస్పత్రులు
అయితేనేం ఆటోలో చోటు చూపి
అవసరమైతే అన్నవలె తోడుండి
వచ్చే కిరాయిని పరాయి చేసి
కలికితురాయిగా నిలిచి
సైకత తీరమున అడుగు వేయనున్న పసిపాపల ఆటలకై
తన ఆటోనే ప్రసవ స్థలము చేసి..
అది ఆటో కాదు కదిలే దేవాలయముగా మార్చి
ఆ దేవాలయమున పూజారియై నిలిచి
ప్రకాశమొందుచున్నావా ప్రకాశా
 -  మిరియాల శ్రీ సత్య భ్రమరార్జున ఫణి ప్రదీప్

17 comments:

  1. చిలమకూరు విజయమోహన్ said...

    పుడమి తల్లి గర్భాన్ని ఛేదించుకుని
    ఉద్భవించబోతున్న బాలభానులకు
    మూడు గుర్రాల రథానికి
    సారథ్యం వహించే అనూరునివా ?
    మానవత్వ పరిమళంతో ’ప్రకాశి‘స్తున్న
    ఓ మానవతావాదీ ! నీకు నమో నమః

  2. Bolloju Baba said...

    థ్రిల్లింగా ఉంది
    థాంక్యూ
    ఈ కవితకు టైటిల్
    ఆటో ప్రకాష్ 9948029294

    బొల్లోజు బాబా

  3. సుజాత వేల్పూరి said...

    బాబా గారికి పాదాభివందనం చేయాలనిపిస్తోంది.

    ఆత్రేయ గారు, సత్య ప్రసాద్ గారు కూడా ఎంతో ఆర్ద్రత తో రాశారు. హాట్సాఫ్!

  4. Sujata M said...

    జీడిపప్పు గారు,

    ముందుగా ఈ అసామాన్య వ్యక్తిత్వాన్ని గురించి బ్లాగర్లకి చెప్పినందుకు, మంచి ఉద్ద్యేశ్యంతో, ఈ కవితల ను ఆహ్వానించినందుకూ చాలా థాంక్స్.

    ఈ మూడు కవితలూ బావున్నాయి. ముగ్గురూ, ముగ్గురే ! బాబా గారికీ, ఆత్రేయగారికీ, సత్యప్రసాద్ గారికి కూడా అభినందనలు.

  5. Pinstriped Zebra said...

    "కాన్పు కు సిద్దమయిన స్త్రీ నడుస్తూంటే
    మృత్యువు, ప్రాణమూ
    కలిసి తిరుగుతున్నట్లుంటుంది"

    Brilliant!

    ఒక top class కవి మాత్రమే రాయగల పంక్తులివి.

  6. ఏక లింగం said...

    "కాన్పు కు సిద్దమయిన స్త్రీ నడుస్తూంటే
    మృత్యువు, ప్రాణమూ
    కలిసి తిరుగుతున్నట్లుంటుంది."

    Excellent...

  7. ఆత్రేయ కొండూరు said...

    బాబా గారూ.. అరిపిరాల వారూ.. మీ కవితలు అద్భుతంగా ఉన్నాయి. అభినందనలు.

  8. Bolloju Baba said...

    సత్యప్రసాద్ గారికి
    ఈ వాక్యాఅలు నాకు బాగా నచ్చాయి.

    తొమ్మిదినెలలు స్వప్నించిన మధురక్షణం
    మరణమా? మనుగడా? అని ప్రశ్నిస్తే
    ఇతని ఫోను మోగుతుంది
    అంతే -
    పుట్టుకకు మరణానికి మధ్య
    తన ఆటో అడ్డం పెట్టేస్తాడు

    ఆత్రేయగారు మీ బ్లాగులో మీకవిత గురించి కామెంటాను, చూసారా.

    జీడిపప్పు గారికి,

    ఇక థ్రిల్లింగుగా ఉన్నది అన్న నా పైకామెంటులోని పదానికి అర్ధం, మీరు ఇలా ఒకే అంశన్ని నలుగురికీ ఇచ్చి రాయిస్తున్నట్లు నాకు తెలియదు. అందుకని.

    బొల్లోజు బాబా

  9. Padmarpita said...

    మానవత్వం మూర్తీభవించిన వ్యక్తిని పరిచయం చేసిన జీడిపప్పుగారికి నెనర్లు.
    త్రిమూర్తుల కవితలకు....నా జోహార్లు.

  10. Anonymous said...

    బాబా గారి కవిత పరిపూర్ణంగా, ఆశువుగా చెప్పినట్లు ఉంది. 'సాహితీ యానా'నికి ఎప్పుడు వెళ్ళినా సూఫీ కవిత్వం కనిపిస్తూ ఉండటంతో ఇవేవో అనువాదాలూ, అర్ధం కాని విషయాలనుకుని వెనుదిరిగేవాడ్ని.

    '...శైశవపు పెదవులనుండి శబ్దిస్తూ విడిపోయిన తన తల్లి చన్మొన...'
    '...మృత్యువు, ప్రాణమూ కలిసి తిరుగుతున్నట్లుంటుంది ...'

    వాక్యాలు నన్ను మళ్ళీ 'సాహితీ యానా'న్ని వెతుక్కుంటూ లాక్కెళ్ళాయి.

    ఆత్రేయ గారి కవిత కొంచెం అవేశపు పాళ్ళతో మొదలైనా,

    "ఏడుకొండల మీద హుండీలు నింపుతూ
    ఏ గర్భ గుడిలోనో మనమెదికేవాడు
    మూడు చక్రాల గుడిలో
    నిండు గర్భాలు మోస్తూ
    మన మధ్యనే తిరుగుతున్నాడు.."

    అంటూ అద్భుతంగా ముగిసింది

    సత్యప్రసాద్ గారి కవిత
    "ఆశకు మూడు చక్రాలు తొడిగి
    ఆశయమనే ఇంధనం కలిపాడేమో"

    అంటూ చమక్కులు మెరిపించినా, మొత్తంగా చూస్తే పెద్దగా శ్రధ్ధ చూపి రాయలేదేమోననిపిస్తోంది.

    జీడిపప్పు గారూ, కొంపదీసి Top 1,2,3 అని Rankలిచ్చి మరీ Orderలో పెట్టారా ఏంటి??

  11. Unknown said...

    నిజం చెప్పొద్దూ.. కవితలు చదువుదామనే ఈ టపా చూశాను.. దానికి ముందే జీడిపప్పుగారు ఇచ్చిన లంకెలు పట్టుకోని వార్త చదివాను. వెంటనే మనసు స్పందించి కవిత్వమైంది.. అది వ్యాఖ్యగా పెట్టి తరువాత బాబాగారి కవిత, ఆత్రేయగారి కవితా చదివాను. వీరిద్దరిముందు నా కవిత్వమెంత? అయినా జీడిపప్పుగారు టపాలో కలిపారు.
    అభినందించిన అందరికీ ముఖ్యంగ బాబాగారికి, ఆత్రేయగారికి నెనర్లు.

    వికాసంగారు,

    అక్షరాల నిజం.. ఈ కవితలో వున్నవన్నీ మొదటి వాక్యాలే.. ఒకసారి రాసిన తరువాత improvisation పైన శ్రద్ధ పెట్టనని చాలా మంది complain చేశారు..! ఎందుకో అలా చెయ్యబుద్ధెయ్యదు నాకు..!!

  12. Unknown said...

    http://sruti-minestam.blogspot.com/2009/07/blog-post_14.html

  13. శ్రుతి said...

    ఒకే విషయంపై స్పందించిన మనసుల ఆర్ద్రత నిజంగా అద్భుతం.
    ఇంత మంది ఘనాపాఠీల మధ్య మంచితనం, అమ్మతనం ఎంత చక్కగా మెరుస్తున్నాయో!
    అందరూ చగా చెప్పారు. అందరికీ నమ్స్కారం చేయాలనిపిస్తుంది. చేస్తున్నాను.

  14. DR.GOLLAPELLI RAMKISHAN RAKI DHARMAPURI said...

    ""పేకాటో ప్రకాశ్ లు ఎందరో! ఆటో ప్రకాశ్ మాత్రం ఒక్కడే""
    కవితకోసం ఇంకా ఇతర పాటలు/గీతాలు/కవితలు/నానీ లకోసం
    www.raki9-4u.blogspot.com మరియుwww.rakigita9-4u.blogspot.com సందర్శించండి
    సదా మీ
    స్నేహాభిలాషి
    రాఖీ

  15. నేస్తం said...

    అద్భుతం :)

  16. పరిమళం said...

    సర్ ! మంచి ప్రయత్నం చేశారు .మీవల్ల ఒక మానవత్వం మూర్తీభవించిన ఆటో ప్రకాష్ గురించి తెలుసుకోగలిగాం .అలాగే మహామహుల కవితలు ఆస్వాదించగాలిగాం ధన్యవాదాలు .

  17. Unknown said...

    కొంచెం ఆలస్యమయ్యింది ... నా ప్రయత్నం ఈ కవితా హారానికి.. ఇది అందమైతే చేర్చుకోండి, కురూపి అయితే కలుపుకోండి... దిష్టి గానైనా ఉంటుంది
    =========
    అటో ఇటో ఎటో అటు సీటు చోదకుడి పక్కనైన చాలు
    ఎక్కి ఇరుక్కుని గమ్యం చేరగలం
    ఆటో ఉన్నది ముగ్గురికే అనే రధకుడు మూడు తరాల వెనక సంగతి
    రోడ్డు పక్క పురిళ్ళు, బెడ్డులివ్వని ఆస్పత్రులు
    అయితేనేం ఆటోలో చోటు చూపి
    అవసరమైతే అన్నవలె తోడుండి
    వచ్చే కిరాయిని పరాయి చేసి
    కలికితురాయిగా నిలిచి
    సైకత తీరమున అడుగు వేయనున్న పసిపాపల ఆటలకై
    తన ఆటోనే ప్రసవ స్థలము చేసి..
    అది ఆటో కాదు కదిలే దేవాలయముగా మార్చి
    ఆ దేవాలయమున పూజారియై నిలిచి
    ప్రకాశమొందుచున్నావా ప్రకాశా

Post a Comment