తెలుగు ప్రముఖుల చమత్కార భాషణలు

Posted by జీడిపప్పు

మాట్లాడడం ఒక కళ, అందులోనూ చమత్కారంగా మాట్లాడడం గొప్ప కళ. ముందుగా సిద్ధం చేసుకున్న మాటలకంటే అప్పటికప్పుడు సందర్భోచితంగా చమత్కారంగా మాట్లాడే వాళ్ళను ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు? అందునా వాళ్ళు ప్రముఖులు అయితే పసందయిన విందే. కొందరు ప్రముఖుల చమత్కారాలను పేపర్లలో, మేగజైన్లలో తరచూ చూస్తుంటాము. అవి చదివినపుడు "ఇలాంటివి మరి కొన్ని చదివితే ఎంత బాగుంటుంది" అనిపిస్తుంటుంది. అలాంటివారి కోసమే అన్నట్టు డా. మృణాళినిగారు ఎంతో శ్రమించి తెలుగు ప్రముఖుల చమత్కారాలను సేకరించి పుస్తకరూపంలో అందించారు. ఈ పుస్తకం ప్రస్తుతం Archive.org వెబ్‌సైటులో ఉచితంగా లభ్యమవుతున్నది. మామూలుగా 50-60 ఏళ్ళ నాటి పుస్తకాలను Archive.org లో పొందుపరుస్తారు కానీ 15 ఏళ్ళు కూడా పూర్తికాక ముందే ఈ పుస్తకం అటకెక్కింది ఎందుకో!!

గురజాడ అప్పారావు, గిడుగు రామ్మూర్తి పంతులు, కట్టమంచి రామలింగా రెడ్డి, త్రిపురనేని రామస్వామి చౌదరి, విశ్వనాథ సత్యనారాయణ, దేవులపల్లి క్రిష్ణశాస్త్రి, శ్రీ శ్రీ వంటి ప్రముఖుల చమత్కారాలు ఇందులో ఉన్నాయి. పూర్తి జాబితా.

పుస్తకం: తెలుగు ప్రముఖుల చమత్కార భాషణలు
రచన: డా|| సి.మృణాళిని
పేజీలు: 76 (92)
లభ్యం: ఇక్కడ (ఈ పుస్తకం చదవడానికి DJVU plugin ఇన్స్టాల్ చేసుకోవాలి)

మచ్చుకు నాలుగు చమత్కారాలు:
ఆదిభట్ల నారాయణదాసు: నారాయణదాసు, ఆనందగజపతిరాజు పేకాటలో నిమగ్నమై వున్నారు. తన చేతిలో మూడు రాజులు చూసుకున్న దాసుగారు ఇక తనకు విజయం తథ్యమనుకుని, ఉన్న డబ్బంతా పందెంలో ఒడ్డారు. అటు ఆనందగజపతి వద్ద మూడు ఆసులు ఉండడంతో, ఆయన ఇంకా ధీమాగా ఉన్నారు. అయినా దాసుగారి మీద ఉన్న గౌరవం కొద్దీ షో చెయ్యమని ఆయన్నే అడిగారు. ఆదిభట్లవారు సగర్వంగా మూడు రాజుల్ని చూపారు. ఆనందగజపతివారు మరింత ధీమాగా మూడు ఆసులు చూపారు. గెలిచిన ఆనందంతో మొత్తం డబ్బును లాగేసుకుంటున్నారు మహరాజు. ఇంతలో ఆదిభట్ల అమాయక మొహం పెట్టి "అయినా రాజావారూ! నాకు తెలియక అడుగుతాను - రాజులుకంటే ఆసులు గొప్పా?!" అని అడిగారు. తక్షణం మహారాజుగారు ఫకాలున నవ్వి, ఆ డబ్బంతా దాసుగారికే ఇచ్చేశారు.

కట్టమంచి రామలింగారెడ్డి : కట్టమంచివారు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి వెళ్ళారు. అక్కడ ఆంగ్లేయుల ఆహార నియమాలు ఆయనకు అర్థం కాలేదు. ఒకసారి ఫలహారంలో ఆపిల్ పళ్ళు పెట్టారు. అందరూ చాకుతో దాన్ని కోసుకొని తింటున్నారు. చాలామంది భారతీయుల్లా చాకులు, ఫోర్కులు వాడడం అప్పట్లో సి.ఆర్.రెడ్డి గారికి తెలీదు. వాళ్ళను అనుసరించబోతే నవ్వులపాలు కావలసి వస్తుందేమోనన్న భయం మరోవైపు. కానీ, ఆయన బుర్రకు అసాధ్యం ఉంటేనా? మెల్లగా పక్కనున్న వ్యక్తితో ఇలా అన్నారు: "మా దేశంలో రామాయణం ఉంది కదా! చాలా ప్రసిద్ధ కావ్యం. అందులో మహావీరుడు హనుమంతుడు ఆపిల్ పళ్ళకు ఎలా తినేవాడో చూపిస్తా" అని పళ్ళెంలోని పండును చేత్తో తీసుకుని తినేశారు. 'ఇదేదో పద్దతి చాలా సరదాగా ఉందాని ఆంగ్లేయులు ఆయన పద్ధతిలోనే తినడం - అసలు జోకు.

త్రిపురనేని రామస్వామిచౌదరి: ఒక సభలో ఒక ఆస్తికుడు "నాస్తికుడినని చెప్పుకునే మీరు ఆస్తికులైన ఆర్య సమాజంలో ఎలా చేరారు" అని అడిగారు. దానికి చౌదరిగారి సమాధానం :అయ్యా! తక్కినవాళ్ళు ముప్పైమూడు కోట్ల దేవతలున్నారంటున్నారు. ఆర్యసమాజంవారు చక్కగా ఒకే దేవుడున్నాడంటారు. ఆ ముప్పైమూడు కోట్ల దేవతలతో వాళ్ళు కుస్తీపడి ఓడించి, తమ ఒక్క దేవుడినీ నిలబెట్టగలిగితే, ఆ ఒక్క దేవుడితో కుస్తీపట్టి ఓడించడం నాకు సుళువు కదా! అందుకని ఈ సమాజంలో చేరాను."

దుగ్గిరాల గోపాలకృష్ణ్ణయ్య: ఓసారి దుగ్గిరాల గోపాలకృష్ణ్ణయ్య గారు జట్కాలో వెళ్తున్నారు. ముందువైపు బరువు చాలక జట్కావాడికి ఇబ్బందిగా ఉంది. అందువల్ల అతడు 'కొంచెం పైకి రండి సార్ ' అన్నాడు. దుగ్గిరాల బోలెడు ముచ్చటపడిపోయి - 'ఇంతకాలానికి నువ్వొక్కడివి దొరికావురా ఆంధ్రదేశంలో తోటి ఆంధ్రుడిని పైకి రమ్మన్నవాడివి" అన్నాడు.

అందరికంటే అత్యుత్తమ చమత్కారి శ్రీ శ్రీ అని తెలుసుకుని హాచ్చెర్యపోయాను!!

8 comments:

 1. మనోహర్ చెనికల said...

  good info, thanks

 2. Shashank said...

  శ్రీ శ్రీ ది ప్ర-జ (ప్రశ్న - జవాబు) అని ఒక శిర్షిక వచ్చేది అప్పట్లో. అది చదువు వీలైతే. డా|| మృణాళిని గారి పుస్తకం చెప్పెనందుకు :flower:

 3. Malakpet Rowdy said...

  LOLZ, nice ones!

  and yeah as Manohar said, very goo dinfo - Thanks for sharing.

 4. Varunudu said...

  Sree Sree Gaari gurinchi machchuki okkatainaa vrayochchu gaa...!

 5. Shashank said...

  budugu biased kada guru. anduke raayaledu.

 6. జీడిపప్పు said...

  @ మనోహర్ చెనికల గారు , రౌడీ గారు, CD - ధన్యవాదాలు,
  @ వరుణుడు గారు - శ్రీ శ్రీ గారి చమత్కారాలు కావాలని వ్రాయలేదు. ఆ వాక్యం చూసి అందుకోసమయినా ఆ పుస్తకాన్ని, ముఖ్యంగా శ్రీ శ్రీ గారి ఆణిముత్యాలను, అందరూ తప్పక చదవాలని అలా చేసాను. లేకుంటే రెండు లైన్లు వ్రాయడం ఎంత పని!
  @ CD - Thank you!

 7. Sujata M said...

  very nice post sir. thanks.

 8. Bolloju Baba said...

  సినారె గారి చలోక్తులు, ఉపన్యాసాలలోని చమక్కులు చాలా బాగుంటాయి. చాలా కాలం క్రితం ఓపత్రికలో వాటిని సీరియల్ గా ప్రచురించారు. దానికి కంట్రిబ్యూటర్స్ పాఠకులే. వాటిని సంకలన పరచి బుక్కురూపంలోకి తీసుకువచ్చ్నట్లు లేదు.
  ఎవరికైనా ఆ వివరాలు తెలుసునా? దయచేసి తెలుపగలరా?
  బొల్లోజు బాబా

Post a Comment