తెలుగోడు ఎవరు?

Posted by జీడిపప్పు

మొన్నొకపోస్టులో "ఇది మా గురువుగారు తెలుగోడు గారినుండి కాపీ కొట్టాను" అన్నాను. అది చూసిన అబ్రకదబ్ర గారు "తెలుగోడు ఎవరు" అన్నారు. "'అంకుసం" సంఘం స్థాపించి, నాలాంటివారికి ఆదర్శనీయుడు అని నేను చెప్పాను. ఇంకా కొంతమందికి "తెలుగోడు ఎవరు" అన్న అనుమానం వచ్చి ఉంటుంది. అందరి అనుమానం తీర్చడానికే అన్నట్టు మరో "అంకుసం" సభ్యుడు, నాకు జూ||గురువు అయిన తూ.గో.జి కుర్రోడు a.k.a రింగు "తెలుగోడు ఎవరు" అన్న సమస్యకు తనదైన శైలిలో వేసిన వివరణాత్మక కామెంటునే పోస్టుగా అందిస్తున్నాను.

తెలుగోడు ఎవరు?
వహ్! ఏమి కొస్చెన్? అసల ఈ కొస్చన్ లో ఎంత మాధుర్యం వుంది..అలానే తీపి కూడా వుంది. కొంచెం తీపి, కొంచెం పులుపు, కొంచెం చేదు, కొంచెం కారం, కొంచెం వగరు , కొంచెం ఉప్పు...ఇలా ఎన్నైనా రుచులు చెప్పుకోవచ్చు. అసల ఈ రుచీ వుంది చూడండీ, ఈ రుచీ అనే పదాన్ని వాడుకునీ రుచీ పచ్చళ్ళు తయారుచేసారు ప్రియ పచ్చళ్ళ కు పోటీ గా. ఈ ప్రియ పచ్చళ్ళు ఎవరిది అనుకున్నారు? మన రామోజీ రావు ది.

ఈ రామోజీ రావు కి ఒక్క పచ్చళ్ళ బిజినస్సే కాదు ఇంకా ఈనాడు పత్రిక బిజినస్సు, ఆ మధ్యనే గొంతు లోతు మునిగి మళ్ళీ తేలి ప్రస్తుతం వెన్టిలేటరు మీద బ్రతుకు కొనసాఆఆఆ...గిస్తున్న మార్గదర్శి చీటీ పాట బిజినస్సు, ఫిల్మ్ సిటీ బిజినస్సు, కోడలు పిల్ల చూసుకునే డల్ఫిన్ హొటళ్ళ బిజినస్సు, మీ టీవి ఈటీవి బిజినస్సు ఇలా చాలా వున్నాయి. ఈటీవి అంటే ఏమనుకున్నారు? ఈనాడు టెలివిజన్. ఇందులో ’హార్లిక్స్ హృదయాంజలి’ అనీ హార్లిక్స్ వారు స్పాన్సర్ చేసే ప్రోగ్రాం వచ్చేది.

అలాగే ’కాల్గేట్ పాడుతా తీయగా’ అనే ఇంకో ప్రోగ్రాం కూడా వచ్చేది. దాన్నీ మన ఎస్.పీ.బీ. కన్డక్ట్ చేసేవాడు. అసల ఎస్.పీ.బీ ఎంత మంది యంగ్ ట్యాలంట్ ని ఎంకరేజ్ చేసాడో ఈ ప్రోగ్రాం లో...మన ఏడుపు గొంతు ఆర్.పీ.పట్నాయక్ ఫేవరెట్ గాయిని ఉష ఈ ప్రోగ్రామ్ నుండే వెలుగు లోకి వచ్చింది. వెలుగు...ఈ వెలుగు వుంది చూసారూ...వెలుగు కోసం సూరీడు ఒక్కడే...సూరీడు అంటే ’అరిస్తే చరుస్తా పెన్సిల్ ఇస్తే చప్పరిస్తా’ మోహన్ బాబు పుత్రరత్నం మంచు విస్స్ను చేసిన సినిమ ’సూర్యం’ కాదు :), ఆకాశం లో వుండే సూరీడు అనమాట.

వెలుగు కోసం సూరీడు ఒక్కడే వున్డాల్సిన అవసరం లేదు...ఇంట్లో కర్మ కాలీ కరంటు వుంటే, స్విఛ్ వేస్తే బల్బ్ వెలుగునిస్తుంది. కర్మ కాలకపోయి కరంటు పోతే అగ్గిపుల్ల కాల్చాలి. అది కూడా వెలుగునిస్తుంది. ఆ అగ్గిపుల్ల తో ఓ కొవ్వత్తి ని అంటిస్తే అది కూడా వెలుగునిస్తుంది. కొవ్వత్తి ని హస్టల్స్ లో రాత్రి పూట కరంటు పోయినప్పుడు కొంత మంది చదువుకోడానికి వాడేవారు. మిగిలిన మరికొంత మంది అమ్మాయిల హాస్టల్ పోడానికి వాడుకునేవారు.

ఈ హాస్టల్స్ లో వెలుగు చూడని చాలా ఆశలు..చాల గొడవలు , రౌడీయిజంలు వుంటాయి. రౌడీయిజం అంటే మామూలు చేతులతో కొట్టుకోడం కాదు...కత్తులు కటారులతో ఖడ్గాలతో కాట్రాజు మాదిరి కొట్టేసుకోడం లాంటివి అనమాట. ఖడ్గం అంటే గుర్తొచ్చింది, ఖడ్గం సినిమా లో ఎక్కడ చూసినా మూడు రంగులు చూపిస్తాడు మన కిస్స్న వంశి. అసల ఈ మూడు రంగుల జాతీయ జండాని ఎవరు మొదట డిజైన్ చేసారనుకుంటున్నారూ?

...మన తెలుగోడు.


తెలుగోడు ఎవరు?

ఓపన్ లెటర్ టు చిరంజీవి గారు

Posted by జీడిపప్పు

కొన్ని వెబ్‌సైట్లలో "ఓపన్ లెటర్ టు xyz" అని రాస్తుంటారు. ఎందుకో తెలియదు కానీ, ఆ హెడ్డింగ్ చూడగానే నాకు కిసుక్కున నవ్వొస్తుంది. ఆ నటుడు ఈ లెటర్ చదివేస్తాడని, తాము చెప్పినవన్నీ ఆచరిస్తాడని ఫీల్ అవుతారనిపిస్తుంది అది రాసిన వాళ్ళు. అలా ఎప్పుడూ జరగదు. ఎవడో ముక్కూ మొహం తెలియనివాడు రాసిన ఆ లెటర్ చదవడానికి అంత పెద్ద స్టార్ తన పనులు పక్కన పెట్టి ఆ వెబ్‌సైటుకు రాడు. కానీ నేను రాసిన ఈ వ్యాసాన్ని చిరంజీవి గారు తప్పక చదువుతారు, నేను చెప్పినవన్నీ తప్పక ఆచరిస్తాన్న నమ్మకం నాకుంది. అందుకు కారణాలనేకం, అనంతం.

ఏంటి చిరంజీవి గారూ ఇంత పని చేసారు? మీకిది భావ్యమా? ఇలాంటి ఫలితాలనా మీ అభిమానులకు ఇచ్చేది? మనం పార్టీ పెట్టింది ఎందుకు? మన పార్టీ స్లోగన్ "అధికారమే లక్ష్యం, డబ్బే మార్గం" అని పెట్టుకున్నాము. ముందు అధికారం కావాలి, ఆ తర్వాత డబ్బు కావాలి అని ఎలా మర్చిపోయారు? అధికారం ఉంటే డబ్బు వస్తుంది, డబ్బు వస్తే అధికారం రాదు అని చిలక్కు చెప్పినట్టు చెప్పాను, మీరేమో "నాకు చిలకభాష రాదు, నువ్వు చెప్పింది అర్థం కాలేదు" (ఇది మా గురువుగారు తెలుగోడు గారినుండి కాపీ కొట్టాను) అన్నారు.

మనం పార్టీ పెట్టినపుడే అనుకున్నాము కదా -  సుమారు 50 సీట్లు తప్పక వస్తాయి, ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ రాదు కాబట్టి మనమే కింగ్ మేకర్ అవుతాము అని. మీరు సపోర్ట్ ఇచ్చినందుకు గాను కొన్ని వేల కోట్లు, మినిస్ట్రీలు ఇచ్చేవారు. నాలుగో ఐదో ఏంపీ సీట్లొస్తే కేంద్రంలో కూడా చక్రం తిప్పవచ్చు, అరవింద్ గారిని కేంద్ర మంత్రి చేయవచ్చు అనుకున్నాము కదా?

మీరు కూడా కేసీయార్, లాలూ ప్రసాద్ యాదవ్, రాంవిలాస్ పాశ్వాన్‌ల సరసన చేరి ఇటు రాష్ట్ర, అటు కేంద్రప్రభుత్వాల సుస్థిరతను నాశనం చేయగలిగే మరో రాజకీయనాయకుడు అవుతారు అనుకున్నాము కానీ మీరేమో తొందరపడి సీట్లన్నీ అమ్ముకొని ఎందుకూ పనికిరాని 18 సీట్లు గెల్చుకొని "చేతకాని చవట నాయకుడు" "మెగా జోకర్" "సీట్ల బ్రోకర్" అని పేరు తెచ్చుకున్నారు చిరంజీవి గారూ, పేరు తెచ్చుకున్నారు.

వేరే పార్టీలనుండి వలస వచ్చిన భిక్షగాళ్ళకు, రాత్రికి రాత్రి పార్టీలు మారిన వాళ్ళకు టికెట్లు ఇచ్చారు. మీరేమో "ప్రజలు పిలిస్తే వచ్చాను, నాకేమీ రావాలని లేదు" అన్నారు. ప్రజలేమో ఆ భిక్షగాళ్ళను పట్టించుకొలేదు, మేము పిలవకుండానే పిలిచామని చెప్తావా ఆయ్ అని మన పార్టీ అభ్యర్థులను, మిమ్మల్నొక చోట డొక్కలో తన్ని డిక్కీలో పడుకోబెట్టారు.

ఇన్నేళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఉన్నా ఒక్కరంటే ఒక్క సినీస్టార్ కూడా మీ వెంట రాలేదు. మీవెంట వచ్చిన పిల్ల స్టార్లను "కోతి మనిషిగా ఎదగకపోతే ఎలా ఉంటుందో" చూడడానికి వచ్చారు కానీ వాళ్ళను చూసి ఓట్లేయడానికి కాదు చిరంజీవిగారూ, కాదు. ఆ పిల్లకోతులను మళ్ళీ సినీజూకే పరిమితం చేయండి.

జరిగిందేదో జరిగిపోయింది.  వచ్చే ఎలక్షన్లలో అల్లు అరవింద్ గారిని దూరంగా పెట్టి సీట్ల అమ్మకాన్ని మీరే దగ్గరుండి చూసుకోండి. 100 సీట్ల కంటే ఎక్కువ అమ్మవద్దు లేదా నాన్నవద్దు. అలా అయితేనే మనం అనుకున్న 50-60 సీట్లు గ్యారంటీగా వస్తాయి, మీరు కింగ్ మేకర్ అయి వేలకోట్లకు మన ఎమ్మెల్యేలను అమ్మవచ్చు.

మనకు అందరికంటే ముఖ్యం కార్యకర్తలు. మనం చెప్పినట్లు కాళ్ళ దగ్గర పడి ఉండి నమ్మకంగా పనిచేసేలా వీళ్ళను తయారుచేసుకోవాలి, లేకుంటే మిమ్మల్ని పాలకొల్లులో తరిమి కొట్టినట్టు తరిమికొడతారు. కార్యకర్తలతో ఆప్యాయంగా మాట్లాడినట్టు నటించండి. మీరు వాళ్ళకు లక్షలివ్వనక్కర్లేదు, మీదగ్గరికి వచ్చినపుడు ఆప్యాయంగా "టిఫిన్ తిన్నారా" అని పలకరించి ఇడ్లీ, రవ్వ ఇడ్లీ, గారె, మషాలా గారె, ఉప్మా, కిచిడీ, పెసరట్టు, మినపట్టు, రవ్వట్టు, మషాలా అట్టు, బాత్తు, టమేటా బాత్తు, బోండా, బజ్జీ, మైసూరు బజ్జీ, మిరపకాయ బజ్జీ, అరిటికాయ బజ్జీ, తమలపాకు బజ్జీ, లడ్డు, బందరు లడ్డు, రవ్వ లడ్డు, మిఠాయి, పీచు మిఠాయి, బందరు మిఠాయి, బొంబాయి మిథాయి, కలకత్తా మిఠాయి, జాంగ్రీ, పాలకోవా,హల్వా, మైసూరు పాకు, అమలాపురం కాజా, భీమవరం బాజా, పెద్దాపురం కూజా .. ఇలా మీ ఇంట్లో ఏవుంటే అవి పెట్టండి. మీరు తెచ్చిపెట్టుకొనే ఎమోషన్‌తో వీళ్ళముందు బాగా నటిస్తే చాలు, పొంగిపోయి నమ్మకంగా కాళ్ళ దగ్గర పడి ఉంటారు. అదే మన ఓటుబ్యాంకుకు శ్రీరామరక్ష.

ప్రచారం మరో ముఖ్యమయిన అంశం. ఏదో మొక్కుబడిగా ఊరికొక సభ కాకుండా వాడవాడలా సభలు నిర్వహించండి. ఉదాహరణకు, బెజవాడలో  ప్రచారం చేయాలంటే... గవర్నరుపేట, లబ్బీ పేట, పున్నమ్మ తోట, భాస్కర్రావు పేట, సింగు నగరం, ప్రజాశక్తి నగరం, అయోధ్యా నగరం, ముత్యాలపాడు, గుణదల, గాంధీ నగరం, చిట్టి నగరం, మాచవరం, రోకళ్ళపాలెం, మారుతీ నగరం, మొగల్రాజపురం, భవానీపురం, సత్యన్నారాయనపురం, సీతారామపురం.. మొదలయిన అన్ని ప్రాంతాల్లో సభలు నిర్వహించాలన్నమాట.

అమెరికాలో సభలు నిర్వహించి "అమెరికా చిరంజీవి", సైబరాబాద్‌లో సభలు నిర్వహించి "'హైటెక్ చిరంజీవి", మురికివాడల్లో సభలు నిర్వహించి "మురికి చిరంజీవి", పెంటపాడులో సభలు నిర్వహించి "పెంట చిరంజీవి".. ఇలా రక రకాల ఫోజులతో ఫోటోలు తీయించుకొని మాకు పంపండి. మేము వెబ్‌సైట్లు పెట్టి మీ గొప్పదనాన్ని చాటుతూ డబ్బులు ఇవ్వమని అడుగుతాము. ఆ ఫోటోలు చూసి ముందు-వెనుక ఆలోచించకుండా గొర్రెల్లా డబ్బు ఇవ్వడానికి ఎంతోమంది సిద్ధంగా ఉన్నాము చిరంజీవి గారూ, సిద్ధంగా ఉన్నాము.

కనీసం ఇకనయినా మీరు కళ్ళు తెరిచి, చీమతలకాయంతయినా బుర్ర ఉపయోగించి అన్ని సీట్లు అమ్ముకోకుండా, వచ్చే ఎలక్షన్ల తర్వాతయినా మన పార్టీ ట్యాగ్‌లైన్ అయిన 'అధికారమే లక్ష్యం, డబ్బే మార్గం' సాధిస్తారన్న నమ్మకంతో...

ఓ అభిమాని.

భరతఖండంబు పద్యం - మతగజ్జి కుక్కలు

Posted by జీడిపప్పు

నిన్న మహేష్ గారి బ్లాగులో "భరతఖండంబు చక్కని పాడి ఆవు" పద్యం గురించి కొత్త విషయాలు తెలుసుకున్నాను. మహేష్ గారి మిగిలిన చెత్త పోస్టులలా కాకుండా ఈ పోస్టు ఆలోచింపచేస్తూ నిజాలను వెలుగులోకి తెచ్చేలా ఉంది. "రాముడికి సీత ఏమవుతుంది" లాంటి పోస్టులు వేసి "బ్లాగులోకపు కే ఏ పాల్" అని పేరు తెచ్చుకున్న మహేష్ గారు తన ట్యాలెంట్‌ను ఇలాంటి మంచి పోస్టులకు వినియోగిస్తే ఎంత బాగుంటుందో! ఆ రోజు తొందర్లో రావాలని మహేష్ గారి అభిమానిగా ఆశిస్తున్నా.

సరే, ఇక అసలు విషయానికొస్తే - ఈ పద్యం రాసింది చిలకమర్తివారు అని అందరూ అనుకుంటారు కానీ, నిజానికి ఇది ఆయన రాసింది కాదట, చెన్నాప్రగడ భానుమూర్తి అనే ఆయన రాసిందట. దాదాపు వందేళ్ళ తర్వాత అసలు సంగతి ఆధారాలతో సహా బయటపడింది. ఇది నిజంగా చాలా గొప్పవిషయం. చెన్నాప్రగడ భానుమూర్తికి దక్కవలసిన గుర్తింపు ఇప్పటికయినా దక్కింది. లేకుంటే ఆయన పేరు భావి తరాల వారికి తెలిసేది కాదు.

ఆసక్తికరమయిన విషయం ఏమిటంటే, ఈ సంగతి దాదాపు "నూరేళ్ళ" తర్వాత బయటపడింది. 1910 ప్రాంతంలో ఈ పద్యం పాడని ఆంధ్రులు లేరు. ప్రతి ఒక్కరూ ఈ పద్యం పాడుకొని తమలోని దేశాభిమానాన్ని పెంచుకొనేవారు. మరి అప్పుడే చెన్నాప్రగడ వారు ఎందుకు నిజాన్ని బయటపెట్టలేదు? ఆ సంగతి నలుగురికీ చెప్పి చిలకమర్తివారికి దక్కాల్సిన ఖ్యాతిని ఎందుకు దక్కించుకోలేదు? అన్న ప్రశ్నలు ఉదయించకమానవు. దీని వెనుక ఆసక్తికరమయిన నిజాలు ఉన్నాయి.

నిజానికి చెన్నాప్రగడ వారూ, చిలకమర్తివారూ ఇద్దరూ మంచి మిత్రులు. కానీ చిలకమర్తివారు తన రచనా సామర్థ్యంతో అనతికాలంలో గొప్ప పేరు తెచ్చుకొని ధనవంతుడయ్యాడు. ఒకసారి చెన్నాప్రగడ గారు 'భరతఖండంబు" పద్యం వ్రాసి అభిప్రాయం చెప్పమని చిలకమర్తివారికి చూపించారు. ఆ పద్యం విలువ తెలుసుకున్న చిలకమర్తివారు ఆ పద్యాన్ని జూదంలో పందెంగా పెట్టమని చెన్నాప్రగడ వారిని బలవంత పెట్టి మోసపూరితంగా ఆ పద్యాన్ని సొంతం చేసుకున్నారు.

మోసాన్ని మోసంతో జయించాలన్న చెన్నాప్రగడగారు ఆ పద్యాన్ని "భారత ధర్మ దర్శనం" అనే పుస్తకంలో ఇరికించి మొత్తం 875 పుస్తకాల ప్రతులను అచ్చువేయించారు. ఈ పుస్తకం జనాల్లోకి వెళ్ళి అందరూ ఆ పద్యం చిలకమర్తివారు వ్రాసింది కాదు అని తెలుసుకోవడం మొదలుపెట్టారు. ఇది సహించలేని చిలకమర్తివారు మెరికల్లాంటి గూండాల ద్వారా ఆ పుస్తకాలను బలవంతంగా స్వాధీనం చేసుకోవడం మొదలుపెట్టాడు. అచ్చయి ఉన్న పుస్తకాల్లో 874 పుస్తకాలను స్వాధీనం చేసుకొని అన్నీ తగులబెట్టాడు. ఒక్కటి మాత్రం ఎంత ప్రయత్నించినా దొరక లేదు. చిలకమర్తి వారి కుట్ర తెలుసుకున్న ఒకడు ఆ పుస్తకం తీసుకొని కుటుంబంతో సహా రంగం (బర్మా) పారిపోయాడు. చిలకమర్తివారు తన గూఢచారులతో ఎంత వెతికించినా ఆ చివరి పుస్తకాన్ని కనుక్కోలేకపొయారు.

తనకున్న అర్థబలం, అంగబలంతో చెన్నాప్రగడ గారికి ప్రాణహాని తలపెడతానని భయపెట్టడంతో ఆయన ఆ పద్యం తానే రాసానన్న సంగతి ఎప్పటికీ బయట పెట్టలేదు. అసలు సంగతి తెలిసిన కొందరు చెన్నాప్రగడ గారిని నిజం బయటపెట్టమన్నా ఆయన పెట్టకపోవడానికి కారణం ప్రాణభయమే. ఆ దొరకని ఒక్క పుస్తకం దొరకడం వల్ల నూరేళ్ళ తర్వాత అసలు నిజం బయటపడింది. ఇప్పటికయినా మన ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని ఈ పద్యం ద్వారా చిలకమర్తివారు సంపాదించిన కీర్తిని, ధనాన్ని రద్దు చేసి చెన్నాప్రగడ వారికి ఆ కీర్తి, ధనం దక్కేలా చేయాలి.

మహేష్ గారు ఈ గొప్ప నిజాన్ని పరిచయం చేయడంతో పాటు "ఈ వివాదానికి తోడు ఈ పద్యంలో మతప్రస్తావనా, కులప్రస్తావనా ఉండటంవల్ల మరోవివాదం రగలకుండా ఉంటే అంతే చాలు." అని కూడా అన్నారు. ఇది అక్షర సత్యం. చిలకమర్తివారి పైన చర్య తీసుకోవడం కంటే ఈ పద్యం వల్ల మతకల్లోలాలు, కుల ఘర్షణలు తలెత్తకుండా చూడాలి.

అందరూ మహేష్ గారిలా వివాదం రగలకూడదు అని కోరుకొనేవాళ్ళు కాదుగా! కొందరు మతగజ్జి రోగులు ఉంటారు. వీరివల్లే అసలు ముప్పు. నూరేళ్ళుగా ఎన్నడూ ఎవరికీ కనిపించని కుల, మత విషయాలు ఈ గజ్జి కుక్కలకు కనిపిస్తాయి. ఈ కుక్కలకు కేవలం మతగజ్జే కాకుండా కులగజ్జి కూడా ఉండడం వల్ల వీటిని దూరంగా ఉంచాలి. లేకపోతే "ఆ ఏముంది, ఇది మంచి దేశభక్తి పద్యం" అనే వాళ్ళను కూడా "లేదు, సరిగా చూడు, ఇందులో కుల, మత ప్రస్తావన ఉంది" అంటూ విషబీజాలు నాటి తమకున్న గజ్జిని మనుషులకు కూడా అంటిస్తాయి.

ఏది ఏమనయిప్పటికీ, చిలకమర్తివారు ఈ పద్యం ద్వారా సంపాదించుకున్న కీర్తిని రద్దు చేసి, చెన్నాప్రగడ గారికి దక్కవలసిన పేరును దక్కించి, అలాగే ఈ మతగజ్జి కుక్కలను తరిమికొట్టే విధంగా రాబోవు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని ఆశిద్దాం.