బాపు - బాలయ్య - బ్లాగు టెర్రరిస్టు

Posted by జీడిపప్పు


రామాయణం ఆధారంగా ఓ సినిమా తీస్తున్నారన్న వార్త చూసిన వెంటనే గుండె గుభేల్ మంది. దర్శకుడు బాపు, సంగీతం ఇళయరాజా అని తెలిశాక రెండుసార్లు గుభేల్ మంది. ఇక రాముడిగా బాలయ్య బాబు అని చూసినపుడు ఎందుకో గుండె గుభేల్మనలేదుగానీ విరక్తిపూరిత నిరాశా నిస్పృహ సమ్మేళనమయిన నవ్వు వచ్చింది. సీతగా నయనతార.. హతవిధీ అనుకున్నాను. సినిమా వివరాలు తెలిసినవెంటనే ఇలాంటి భావాలు కలగడం వెనుక పలు కారణాలున్నాయి.

తెలుగులో నేను ఎక్కువ అభిమానించే దర్శకుల్లో బాపు ఒకరు.ఎన్నో గొప్ప సినిమాలు తీసిన బాపు మిస్టర్ పెళ్ళాం తర్వాత తీసిన సినిమాలు చూస్తే "ఈయన ఎందుకు సినిమాలు తీస్తున్నారు? తెలుగువారు ఉన్నంత కాలం నిలిచిపోయే ఆణిముత్యాలను అందించిన చేత్తోనే నాసిరకం సినిమాలు తీసి జనాలను భయపెట్టవలసిన అవసరం ఏముంది? ఇంతటితో సినిమాలు తీయడం ఆపి హాయిగా విశ్రాంతి తీసుకుంటే బాగుంటుంది కదా. అలా చేస్తే బాపు అంటే ఆ ఆణిముత్యాలే గుర్తుకొచ్చి అందరి మనసుల్లో గౌరవంగా కలకాలం ఉండిపోతాడు" అనుకున్నాను. (దీనికితోడు అపురూప సౌందర్యరాశి జయప్రద సీతగా నటించిన "సీతా కళ్యాణము" సినిమా కొన్నాళ్ళ క్రితం ఓ అరగంట చూసిన చేదు అనుభవం కూడా ఉంది.) 

లయరాజా ఇళయరాజా గురించి కూడా సేం యాజ్ అబవ్. రెహ్‌మాన్ కంటే ఇళయరాజానే గొప్ప మ్యుజీషియన్ అని ఒకప్పుడు నొక్కి వక్కాణించే నేను ఈ మధ్య ఇళయరాజా అందించిన సంగీతం విని "ప్రభువా, ఇళయరాజా యందు దయ ఉంచుడి, మమ్ము కరుణించుడి 36:28' అని ప్రార్థించాను.

ఇక బాలయ్య బాబు విషయానికొస్తే - గత పదేళ్ళలో బాలయ్య చేసినన్ని చిత్రవిచిత్ర మైన ఫీట్లు ఎవరూ చేసి ఉండరేమో. ఈ ఫీట్లే కాక ఆ మధ్య పాండురంగడనబడు ప్రచండ ఘోర పౌరాణిక చిత్రరాజమును జనులబైకి వదలగా యా చిత్రహింస తాళలేక జనులు మతిస్థిమితంగోల్పోయి పలు దిక్కుల పిచ్చివాండ్రవలె పరుగులు తీసిరి. ఇదియొక్కటే కాక పాండురంగడు అనిన ఒక బఫూనుడుయన్న యభిప్రాయమునకొచ్చిరి. అట్టి బాలయ్య ఇపుడు రామావతారములో దర్శనమీయనున్నాడని చూచిన వెంటనే 'యుగాలనుండి రాముని గొలుచు తెలుగువారి దృష్టిలో రాముని యెడల భక్తి తగ్గి పోవునేమో" యని నా మనసు పరిపరివిధముల తపించినది.

ఇలా బాపు, ఇళయరాజా, బాలయ్య కలిసి ఓ చెత్త సినిమా తీస్తారేమో.. ముఖ్యంగా తొడకొట్టి రైలు ఆపడం, వేలు చూపెట్టి కుర్చీ లేపడం, విజయేంద్రవర్మ స్టంట్లులాంటివి, ఓ మాంఛి రొమాంటిక్ పాట పెట్టి "ఓస్ రాముడు ఇలాంటివాడా? మేమేదో గొప్పవాడనుకున్నామే" అని ప్రేక్షకులు అనుకొనేలా చేస్తారేమో అని భయపడ్డాను. అవన్నీ చూసి బ్లాగు టెర్రరిస్టు "చూసారా మీ రాముడిని మీ హిందువులే ఎలా చూపించారో, నిజం కాకపోతే ఎందుకు అలా చూపిస్తారు" అంటూ తన పైశాచిక ఆనందంకోసం రాముడు పైన చెత్త పోస్టులు వేస్తాడేమో అనుకున్నా.

బ్లాగు టెర్రరిస్టు రాముడిని అవహేళన చేస్తూ పోస్టులేసినా, తమ సంసారం చంకనాకిపోయిందని మిగతావారు కూడా అలాగే ఉండాలని కొందరు విషప్రచారాలతో విషవృక్షాలు నాటాలని ప్రయత్నించినా ఏమీ నష్టం లేదు.. దానికి కౌంటర్లు పడతాయి.. నాల్రోజులకు అందరూ మరచిపోతారు..కానీ ఎన్ని యుగాలయినా రాముడు ఉంటాడు!!  కాకపోతే చెప్పులో రాయిలా వీటికి అవకాశం లేకుంటే బాగుంటుంది కదా!

పైన చెప్పిన నా ఆలోచనలను, ఆందోళనను పటాపంచలు చేస్తూ బాపు-బాలయ్య-రాజా మరో ఆణిముత్యాన్ని ఇవ్వడం మన అదృష్టంగానే భావించాలి. ముఖ్యంగా నయనతార సీతగా న భూతో న భవిష్యతి అన్నట్టు నటించడం చూసి బాపు కు హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేము. ఇంతటితో బాపు, ఇళయరాజా సినీరంగం నుండి విరమించి హాయిగా విశ్రాంతి తీసుకుంటారని ఆశిద్దాము. బాలయ్య బాబు ఇక నుండి ఏదయినా సినిమా ఒప్పుకోబోయే ముందు ఓ ఐదు నిమిషాలు ఆలోచించి సరి అయిన నిర్ణయం తీసుకోవాలని కోరుకుందాము.

ఇక అతి ముఖ్యమయినది, పరమ నాస్తికులు కూడా గుడికి వెళ్ళి ఓ ఫదిరవై కొబ్బరికాయలు కొట్టి మరీ దేవుడిని ప్రార్థించవలసినది ఒకటుంది. అదే - దర్శకేంద్రుడు కె.నాభికేంద్రరావు ఈ సినిమా చూసి ఉత్తేజపూరితుడయి మరో పౌరాణికాన్ని తీయడానికి ఉపక్రమించకూడదు.

18 comments:

  1. Krishnapriya said...

    ఇక అతి ముఖ్యమయినది, పరమ నాస్తికులు కూడా గుడికి వెళ్ళి ఓ ఫదిరవై కొబ్బరికాయలు కొట్టి మరీ దేవుడిని ప్రార్థించవలసినది ఒకటుంది. అదే - దర్శకేంద్రుడు కె.నాభికేంద్రరావు ఈ సినిమా చూసి ఉత్తేజపూరితుడయి మరో పౌరాణికాన్ని తీయడానికి ఉపక్రమించకూడదు.
    >>>> LOL

  2. Indian Minerva said...

    Amen.

  3. Anonymous said...

    meeremanna gani ee madhya kaalamlo Sri rama rajyam anta manchi album raalaedanipistundi

  4. Saahitya Abhimaani said...

    "....రావు ఈ సినిమా చూసి ఉత్తేజపూరితుడయి మరో పౌరాణికాన్ని తీయడానికి ఉపక్రమించకూడదు....." Hear! Hear!!

    Who is blog terrorist? I am just 2 years old in Blog and so this surprise.

  5. మధురవాణి said...

    హహ్హహ్హ్హా... కొసమెరుపు భలే మెరిపించారండీ... :)))))))

  6. Sravya V said...

    :)))

  7. Disp Name said...

    బాపు బాలయ్య జీడిపప్పు అని టపా టైటిలు ఉండవలె!
    చాలా బాగా రాసారు.
    ఆఖర్న రాసిన మీ కోరిక మన్నించ బడలేదు !

    రాఘవేంద్రుడు ఈ సినిమా చూసి ఉత్తేజ భరితుడై , కొత్త చిత్రానికి నాందీ పలికారు, రతీ-మన్మధ చరిత్రం - ఇవ్వాళే చిత్ర జగత్తులో ఫ్లాష్ వార్త వచ్చేసింది !

  8. Jai Gottimukkala said...

    సినిమా నిజంగా బాగుందా? నేను నాస్తికుడినే కానీ పౌరాణిక చిత్రాలంటే సరదా. మీరు పై టపాలో చెప్పిన కారణాల వల్ల ఆజోలికి ఈ మధ్య వెళ్ళడం లేదు (లేదా వెళ్ళే ధైర్యం చేయడం లేదు).

  9. నీహారిక said...

    ఈ రోజే కాస్త ఖాళీ దొరికింది అని వస్తే రాగానే మీ పోస్టు స్వాగతం చెప్పింది.
    అసలు నా లెగ్గులోనే ఏదో ఉంది అనుకుంటా ??

    అపుడు అందరూ నన్ను తప్పు పట్టారు. ఇపుడు అందరూ నేను ఏది వ్రాసానో అదే వ్రాస్తున్నారు. రామ రాజ్యం చూస్తేనే సీత గుర్తుకొచ్చిందా అందరికీ ???
    ఆ రోజున నేనడిగిన ప్రశ్నలే ఇపుడు అందరూ అడుగుతున్నారు. మీరు బజ్ లు చూడరు అనుకుంటా, ఆ రోజున నన్ను విమర్శించిన నా ప్రియ "నేస్తాలు" ఐన సాధ్వీ శూర్పణక లు ( నేను వ్రాసినదే వారూ రాసినపుడు నన్ను అన్న మాటలే వారికీ వర్తిస్తాయి ) తమ "మనసులోని మాట" లను బయట పెట్టారు. వీలైతే చూడండి నేను అడిగిన ప్రశ్నలే మక్కీ మక్కీ అడుగుతున్నారు. స్త్రీలందరి మనసుల్లో అదే ఉన్నది అని నిరూపితమైంది. మరి నన్ను ఎందుకు అందరూ తిట్టినట్లు? సంవత్సరం తర్వాత అందరూ నోరెత్తుతున్నారు, అపుడే ఎందుకు ఎత్తలేదు?

    సోక్రటీసు చెప్పింది బ్రతికి ఉండగా ఎవరికీ ఎక్కలేదు, చలాన్ని బ్రతికి ఉండగా ఎవరూ మెచ్చుకోలేదు. నేను చచ్చాకే వీళ్ళు నోరు తెరుస్తారనుకున్నా !! అక్కడికి సంతోషపడాల్సిందే !!!

    ఇక నేను పెట్టిన టైటిల్ విషయం రాముడిని ఎలా వెనకేసుకు వస్తున్నారో అలాగే మీ తోటి వ్యక్తిని కూడా వెనకేసుకొచ్చి ఉంటే బాగుండేది. మీకేమైనా వ్యక్తిగత కక్షలున్నాయేమో నాకు తెలియదు.

    ఇటువంటి పోస్టుల వల్ల , ఇటువంటి సినిమాలు చూసి కళ్ళనీళ్ళు తుడుచుకోవడం వల్ల రాముడు గొప్పవాడయిపోడు, సీత బాధ తీరదు కదా !!!!

    తమ సంసారం చంకనాకి పోయిందని..... వగైరా ...

    ఆ వ్యాఖ్య నా గురించి అయితే మటుకు మీరు పొరపడుతున్నారు, మాది చాలా ఆదర్శవంతమైన దాంపత్యం , మేమే కనుక విడిపోయామంటే ఈ భారత దేశంలో వివాహ వ్యవస్థ కోలుకోడానికి కొన్ని యుగాలు పడుతుంది. "చాలెంజ్" చేసి చెప్పగలను.

  10. Anonymous said...

    మీ టపా కత్తిలా ఉంది
    కాముధ

  11. Anonymous said...

    మొత్తానికి అమావాస్య ఎఫెక్ట్ బానే ఉన్నట్లుంది ఈ సారి :)

  12. Anonymous said...

    డుబుగ్స్... అంత అందమైన సినిమా గురించి వ్రాశేటప్పుడు, మజ్జెన అరిష్టుల, టెర్రరిష్టుల గోలేల...

    నాకు ఈ సినిమ, బావుంది అనిపించింది, అంతకన్నా, అందంగా ఉంది అని కూడా అనిపించింది. నయనతార నభూ...నభ.. పోతే, సీత గా స్నేహ చేసుంటే, ఇంకా అందంగా ఉండేదేమో. of course రాధాగోపాళం లోని వగలూ, వయ్యారాలు (అనబడే overaction) కురిపించే అవకాశం లేదు కదా.... ఇంకా బావుండేది అనిపించింది.

  13. జీడిపప్పు said...

    @క్రిష్ణప్రియ గారు - ధన్యవాదాలు
    @ మినర్వా గారు - - ధన్యవాదాలు
    @శివరామప్రసాదు గారు - బ్లాగు టెర్రరిస్టు తెలియాలంటే రెండేళ్ళ క్రితం బ్లాగుల స్థితిగతులు కూడా తెలియాలి :)
    @ మధురవాణి గారు - :)
    @ శ్రావ్య గారు - ;)
    @ జిలేబి గారు - నిజమా జోకుతున్నారా ? :( :(
    @ గొత్తిముక్కల గారు - సినిమా ఒకసారి (తప్పక) చూడవచ్చు
    @ కముధ గారు - ధన్యవాదాలు
    @ గురువు గారు - ఆర్టిష్టులు, టెర్రరిష్టుల గోల ఎందుకంటే... అదో తుత్తి :)

  14. జీడిపప్పు said...

    @ నీహారిక గారు, మీరు చెప్పిన చర్చా విషయాలను నేను చూడలేదు. ఇక నేను అన్న "తమ సంసారం.." మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు. నేను ఆ మాట గత దశాబ్దంగా అంటున్నాను. నా పోస్టును మరోసారి తరచి చూస్తే నేను సరిగ్గా ఎవరిని అన్నానో మీకు బోధపడవచ్చు.

    "మీ తోటి వ్యక్తిని వెనుకేసుకు రావడం" అన్నారు. దయచేసి వివరాలు తెలుపగలరు.

  15. Disp Name said...

    జీడిపప్పు గారు,

    @ జిలేబి గారు - నిజమా జోకుతున్నారా ? :( :(

    మీకు చేదైన నిజం. తెలుగు లోకాని కి జిలేబి లాంటి తియ్యటి వార్త అది !


    చీర్స్
    జిలేబి.

  16. రసజ్ఞ said...

    హహహ! కొసమెరుపు బాగుందండీ!

  17. Unknown said...

    మీ అనుమానాలూ.. అవి పటాపంచలైనతీరు చాలా బావుంది. మీ టపా అంతకంటే బావుంది.. చివరలోని మీ కోరిక మన్నించబడే ఆస్కారం మాత్రం తక్కువగానే ఉంది.. :)

  18. anjani02 said...

    Pega Learning
    Start your Pega learning journey with in-depth tutorials on decisioning, case processing, and integration capabilities. Strengthen your skills through practical exercises and mock tests.

Post a Comment