వంగూరి చిట్టెన్రాజు గారి అమెరికామెడీ
Posted by జీడిపప్పు
చిట్టెన్రాజు గారి రచనలను మొదటిసారి కౌముది వెబ్ పత్రికలో చూసాను. 'అమెరికామెడీ' పేరుతో వెలువడే శీర్షికలో చిట్టెన్రాజు గారు తన అనుభవాలను హాస్యభరితంగా, అపుడపుడూ కాస్త ఎగస్ట్రా మసాలా దట్టించి, పాఠకులకు అందిస్తున్నారు. నాకు చిట్టెన్రాజు గారి గురించి outside information ఏమీ తెలియదు కానీ, ఆయన రచనల ద్వారా అర్థమయిందేమిటంటే -
ఆయన తెలుగు సాహిత్యం పట్ల మోతాదుకంటే ఎక్కువ అభిమానమున్న అమెరికాంధ్రుడు. సభలూ, సన్మానాలు అంతా కమర్షియలైజ్ అయిపోతున్న ఈ తరుణంలో కూడా "సాహిత్యం/కళ పట్ల ఆసక్తి అన్నది మనసులో నుండి రావాలి కానీ మెప్పుకోసం, కీర్తి కోసం సాహిత్య పోషణ ముసుగు వేసుకోకూడదు" అనుకొనే సత్తెకాలపు సత్తెయ్య. తెలుగు సాహిత్య సభలు విజయవంతం కావాలంటే నిజమయిన సాహితీ ప్రేమికుల కంటే ముమైత్ ఖాన్ డ్యాన్సులే ముఖ్యం అని తెలుసుకోలేని అమాయకజీవి. లేకుంటే ఒక్క సినీ స్టార్ కూడా లేకుండా హైడ్రాబ్యాడ్ లో సాహితీ సభలు నిర్వహిస్తారా, అదీ ఎంట్రీ ఫీజ్ పెట్టి!! నాకే గనక ఆ ఓపిక, అవకాశం ఉంటే తెలుగు సాహితీ సభలకు ఇలియానాను పిలిపించి నాలుగు బజారు డ్యాన్సులేయించి "నాకీ టెల్గు గొంజం గొంజం వష్టాయ్" అని చెప్పించి ఆ సభను మరింత విజయవంతం చేసి కుప్పలు తెప్పలుగా డబ్బులు సంపాదించేవాడిని. చిట్టెన్రాజు గారికి ఆ తెలివి లేదు పాపం!
ఇక 'అమెరికామెడీ' సంగతికొస్తే - ఇంటా బయటా సాహితీ సభలను నిర్వహించడానికి పడ్డ కష్టాలు, ఆంధ్రాకు వెళ్ళినపుడు తగిలిన 'కల్చరల్ ఝలక్‌లు", అమెరికాలో ఆటా, తానా, తందానా సంఘాల పైన చురకలు, తెలుగు సభల్లో ఎదురయ్యే "తీయని అనుభవాలు", అఖండ అఖిల అమెరికాఖండ తెకోకారా డీలక్స్ సాహితీ సదస్సులు, "పెంట" "మంట" సంఘాలు, "టీవీ సీరియల్" కష్టాలు, ఎప్పటికప్పుడు "క్వీన్ విక్టొరియా" గారిచే టెంకిజెల్లలు... ఆద్యంతం నవ్వుల జల్లులు కురిపిస్తాయి.
ఇప్పటికీ నెల నెలా కౌముది వెలువడగానే నేను మొదట చూసే శీర్షిక చిట్టెన్రాజు గారిదే. అమెరికామెడీ ఎపిసోడ్లన్నీ డౌన్లోడ్ చేసుకొని ఒక పుస్తకంగా చేయాలన్న ఆలోచనను చాన్నాళ్ళనుండి వాయిదా వేస్తున్నాను. కాగల కార్యం కౌముదివారే చేసారన్నట్టు అమెరికామెడీ ఇపుడు పుస్తకరూపంలో లభ్యమవుతున్నది. సెల్‌ఫోన్ ఆఫ్ చేసి ఈ పుస్తకం చదువుతూ ఓ రెండు గంటలు నవ్వులలోకంలో విహరించవచ్చు!
ఇంక చాలు..వెళ్ళు Brett Favre
Posted by జీడిపప్పు
మిగతా టీములకంటే గ్రీన్ బే ప్యాకర్స్ కున్న ప్రత్యేకత ఏమిటంటే - ప్రజాస్వామ్యం నిర్వచనం టైపులో ఈ టీం విస్కాన్సిన్ రాష్ట్ర ప్రజలయొక్క, ప్రజలచేత, అఫ్కోర్స్ ప్రజలకొరకు పుట్టిన టీం. మిగిలిన 31 టీములకూ ఒక్కో వ్యక్తి యజమాని అయితే, ప్యాకర్స్ కు ప్రజలే యజమానులు. పెట్టుబడి అంతా ప్రజలనుండే వస్తుంది. అందుకు ప్రతిఫలంగా ప్రజలకు షేర్లు, కొన్ని నిర్ణయాల పైన హక్కులు ఇవ్వబడుతాయి. మిగిలిన టీములన్నిటిపట్లా ఆ పట్టణాల్లోని చూపించే అభిమానం కంటే ప్యాకర్స్ పట్ల విస్కాన్సిన్ వాసుల అభిమానమే ఎక్కువ.
ఇలాంటి టీములో అడుగుపెట్టిన బ్రెట్ ఫార్వ్ కొద్ది కాలానికే ప్యాకర్స్ అంటే ఫార్వ్, ఫార్వ్ అంటే ప్యాకర్స్ అనే స్థాయికి ఎదిగాడు. బయటనుండి ఎన్ని ఆఫర్లు వచ్చినా కాదని అక్కడే స్థిరపడ్డాడు. బ్రెట్ ఫార్వ్ పేరుతో వెలువడిన ఏ వస్తువయినా ప్రజలు ఎగబడి కొనేవాళ్ళు. ఫార్వ్ ఏది చేసినా ప్యాకర్స్ మంచి కొరకే అని నమ్మేవాళ్ళు, ఫార్వ్ కూడా అలాగే చేసాడు. ఎన్నో రికార్డులను బద్దలు కొట్టి అందరి అంచనాలను మించి ఆడేవాడు, జీసస్ క్రైస్ట్ ను కలుస్తారా బ్రెట్ ఫార్వ్ ను కలుస్తారా అంటే విస్కాన్సిన్ మొత్తం "జీసస్ క్రైస్టా? who" అనడానికి సంకోచించేవారు కాదు.
అలాంటి బ్రెట్ ఫార్వ్ నాలుగేళ్ళ ముందు, 12 ఏళ్ళు ప్యాకర్స్ తో ఆడిన తర్వాత రిటైర్ ఆలోచన వెలుబుచ్చాడు. మరో రెండు ఏళ్ళు అదే మాట చెపుతూ ఆడాడు. ఆ మధ్యలో బోర్డ్ ఆఫ్ డైరక్టర్లతో అభిప్రాయభేదాలు వచ్చాయి. ఎట్టకేలకు గత ఏడాది మార్చ్ లో రిటైర్ అయ్యాడు. క్రీడాలోకం అంతా ఫార్వ్ గొప్పదనాన్ని వేనోళ్ళ పొగిడింది. అభిమానుల బాధకయితే అంతే లేదు.
కొద్ది రోజులకు ఏమయిందో ఏమో, తాను మళ్ళీ ఆడతానన్నాడు. అప్పటికే ఉన్న విభేదాలవల్ల డైరక్టర్లు ఒప్పుకోలేదు. విస్కాన్సిన్లో ఆరాధ్య దైవం ఇమేజ్ ఉన్న ఫార్వ్, ఆ కోపంలో న్యూయార్క్ జెట్స్ తరపున ఒక ఏడాది ఆడి అపఖ్యాతిపాలయ్యాడు. అభిమానులు చాలా అసంతృప్తితో ఉండగా ఆ సీజన్ అయిన వెంటనే మళ్ళీ రిటైర్మెంట్ ప్రకటించాడు. అందరూ జరిగినది పీడకలలా మర్చిపోతుంటే, ప్యాకర్స్ ఆగర్భ శత్రువయిన మిన్నెసోటా వైకింగ్స్ తరపున ఆడడానికి మంతనాలు జరపడం మొదలుపెట్టాడు.
ఒకప్పుడు కేవలం విస్కాన్సిన్లో మాత్రమే కాక అమెరికా అంతా అభిమానులను సంపాదించుకున్న ఫార్వ్ చేస్తున్నవి చూసి అందరూ అసహ్యించుకుంటున్నారు. ఇప్పటికయినా బ్రెట్ ఫార్వ్ తన పద్దతి మార్చుకొని ఫుట్‌బాల్‌కు స్వస్తి చెపితే ఆ మిగిలి ఉన్న అభిమానం అయినా ఉంటుంది. లేకపోతే చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు!
కామెడీ షోలు
Posted by జీడిపప్పు
Bill Cosby Show - ఇది ఇప్పటివరకు నేను చూసిన అత్యద్భుత, అమోఘమైన, ఆరోగ్యకరమైన షో. ఒక్క పరుషమయిన మాట లేకుండా, కించపరిచే లేదా నొప్పించే మాటలు లేకుండా, సకుటుంబసమేతంగా చూడగలిగే హాస్యాన్ని సృష్టించినందుకు బిల్ కాస్బీకి అపర హాస్య బ్రహ్మ అని బిరుదు ఇవ్వవచ్చు. ఈ షో వల్ల చదువుకున్న నల్లజాతీయుల పట్ల మిగతా అమెరికన్ల దృక్పథం కొంతయినా మారిందట. భార్య-భర్తలు, పెద్దలు-పిల్లలు, పెద్దలు-పెద్దలు, పిల్లలు-పెద్దలు ఎలా ఉండాలో ఈ షోలో చెప్పినంత చక్కగా, హాస్యభరితంగా మరి ఏ ఇతర షోలోనూ చెప్పలేదనుకుంటా. ఇది కుటుంబానికి ఎన్సైక్లోపీడియా లాంటిది అంటుంటారు. ఈ షో గురించి పూర్తిస్థాయి వ్యాసం వ్రాయవచ్చు.
Everybody Loves Raymond - కాస్బీ షో తర్వాత నాకు బాగా నచ్చే షో ఇది. కుటుంబంలో ఎటువంటి సమస్య వచ్చినా బిల్ కాస్బీ తనదైన శైలిలో సున్నితంగా పరిష్కరిస్తే, రేమండ్ మాత్రం తనదైన పద్దతిలో మరింత సంక్లిష్టం చేస్తాడు. రేమండ్ చేసే తింగరి పనులకు ఘాటుగా స్పందిస్తూ, రేమండ్ ను అమితంగా ప్రేమించే భార్య, తన కొడుకులకు 40 ఏళ్ళు వచ్చినా చిన్న పిల్లల్లా భావిస్తూ, కోడలికి చురకలంటిచే అత్త, ముసలివాడయినా ఏ మాత్రం చురుకుదనం తగ్గకుండా భార్య పైన సెటైర్లు వేసే తండ్రి, పోలీసు ఆఫీసరు అయినా తమ్ముడితో కీచులాడే అన్న, వీళ్ళ మధ్య బొమ్మలాంటి అమ్మాయి, ఇద్దరు కవలలతో ఆద్యంతం కుటుంబంలో గొడవలు, కీచులాటలు, ప్రేమాభిమానాలతో నవ్వించే మరో ఆణిముత్యం ఈ షో.
F.R.I.E.N.D.S - ఇప్పటివరకు వచ్చిన టీవీ షోలలో యువతను ఈ షో కంటే ఎక్కువ ఏదీ ఆకట్టుకొని ఉండదేమో. కలసిమెలసి జీవించే ముగ్గురు యువకులు, ముగ్గురు యువతుల కథ ఇది. ఒక ప్రేమ జంట, ప్రేమించుకున్నా చెప్పుకోని మరో జంట, ప్రేమించడానికి అమ్మాయి దొరకని జోయి, అదో అయోమయం మాలోక ఫీబీ, వీరితో పాటు వచ్చి పోయే బోయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ తో యువత జీవితానికి దర్పణం పడుతుంది. ఒకానొకదశలో ఎవరు ఎవరితో కలుస్తారో తెలియక అయోమయంతో పాటు సాగతీత ఎక్కువయింది.
That 70s Show - ఇది F.R.I.E.N.D.S కు కాస్త అటు-ఇటుగా ఉంటుంది. విస్కాన్సిన్ లో ఉన్న ఒక మధ్య తరగతి కుటుంబంలోని టీనేజ్ కుర్రాడు ఇందులో కథానాయకుడు. పక్కింటి మగరాయుడు అమ్మాయి ఇతడి గర్ల్ ఫ్రెండ్. హీరో తల్లిదండ్రులు దత్తత తీసుకున్న మరొకడు, అదేదో దేశం నుండి వచ్చిన ఇంకో కుర్రాడు, ఇంకో యువ జంట అంతా కలసి బేస్మెంట్లో మాటలు చెప్పుకుంటూ గడిపేస్తుంటారు. భయస్తుడయిన హీరోను వాళ్ళ నాన్న అనే మాటలు కొన్ని సుత్తి వీరభద్రరావును గుర్తు తెస్తాయి. కథానాయకుడయిన టోఫర్ గ్రేస్ సినిమాల్లోకి వెళ్ళడంతో షో పాపులారిటీ తగ్గి 2006లో షో ముగిసింది. నాకయితే ఫ్రెండ్స్ కంటే ఇందులోనే ఎక్కువ హాస్యం కనిపిస్తుంది.
ఇవి నాకు బాగా నచ్చిన షోలు. కొద్ది రోజులు King of Queens చూసాను కానీ మొనాటనస్ కామెడీ అనిపించింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, యావత్ అమెరికా ఏకగ్రీవంగా The greatest show అని నిర్ణయించిన Seinfeld పట్ల ఎందుకో నాకు ఆసక్తి కలగలేదు. ఈసారెపుడయినా ఈ షోను ఒక పట్టు పట్టాలి.
ఇక వర్తమానానికొస్తే - ప్రస్తుత ఏ షో కూడా పైన చెప్పినవాటిలోని హాస్యాన్ని అందించడం లేదు. గత రెండు మూడేళ్ళలో రియాలిటీ షోలు, ట్యాలెంట్ షోలు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. దీనివల్లేనేమో హాస్యంలో నాణ్యత తగ్గిపోతున్నది. అయినా అలవాటుపడిన ప్రాణం కాబట్టి కొన్ని కామెడీ షోలు చూస్తున్నాను. ఈ మధ్య నేను రెగ్యులర్‌గా చూస్తున్న షో Everybody Hates Chris. ఈ షోకున్న పెద్ద మైనస్ పాయింట్ క్రిస్ రాక్. క్రిస్ రాక్ అంటే నల్లజాతీయులను కించపరుస్తూ బూతులు మాట్లాడతాడు అని ప్రశస్తి. అటువంటివాడు తీస్తున్న షో ఎలా ఉంటుందో అని చూసాను, ఫరవాలేదు. నల్లజాతీయులను కించపరచడం ఎక్కువ లేదు. ఒక హైస్కూల్ కుర్రాడు ఇంట్లో, స్కూల్లో ఎదుర్కొనే సంఘటనల ఆధారంగా ఈ షో నడుస్తుంది. ప్రతి సెంటూ లెక్క చూసే తండ్రి, పిల్లలను క్రమపద్దతిలో పెంచే తల్లి పాత్రలు ఆకట్టుకుంటాయి.
మరొక అడల్ట్ కామెడీ షో Two and a Half Men కూడా పరవాలేదు. ఒక జల్సారాయుడు, డబ్బుల్లేని అతడి సోదరుడు, మనిషి పెరిగినా బుర్ర పెరగని కుర్రాడు ఒకే ఇంట్లో ఉంటారు. చాలా వరకు రేటెడ్ కామెడీ అయినా చూడవచ్చు. చివరగా, యానిమేషన్ షో అయిన Family Guy - ఇప్పటివరకు ఈ షో ఎదుర్కున్న విమర్శలు మరి ఏ ఇతర యానిమేషన్ షో ఎదుర్కొని ఉండదు. చాలా చీప్ కామెడీ అయినా ఇందులోని స్టీవీ పాత్రను కాసేపు చూస్తే ఈ షోను వదలబుద్ది కాదు. మాటలు రాని ఈ చంటోడు (??!!) ప్రపంచాన్ని మొత్తం తన స్వాధీనంలో ఉంచుకోవాలనుకుంటాడు. వీడి తర్వాత బాగా ఆకట్టుకొనేది మాట్లాడే కుక్క బ్రయన్. ఈ రెండు పాత్రలకోసం చూడవచ్చు ఈ షో.
ఇదన్నమాట సిట్కాం ల ప్రసహనం. ఇప్పుడొస్తున్న షోలు మొక్కుబడిగా చూస్తున్నా, 20 నిమిషాలు హాయిగా నవ్వుకోవాలంటే మొదట చెప్పిన కాస్బీ, రేమండ్, ఫ్రెండ్స్, 70s షోలే ఇప్పటికీ శరణ్యం. మళ్ళీ అలాంటి షోలు ఎప్పుడొస్తాయో!
