వంగూరి చిట్టెన్‌రాజు గారి అమెరికామెడీ

Posted by జీడిపప్పు

నాకు టొమాటోరసం తర్వాత బాగా నచ్చే రసం హాస్యరసం. రకరకాల దినుసులతో తయారు చేసిన విభిన్న హాస్యరసాలను ఆస్వాదించినా... ఒక చెంచా వ్యంగ్యం, ఒక చెంచా విమర్శ కలిపి చేసిన హాస్యరసాన్ని ఎక్కువ ఆస్వాదిస్తాను. హాస్యంలో ఈ రెండింటినీ సమపాళ్ళలో మిళితం చేసి నిఖార్సయిన హాస్యరసాన్ని వండే అతికొద్దిమంది సమకాలీన రచయితల్లో వంగూరి చిట్టెన్‌రాజు గారు ఒకరు అని నా own స్వంత పర్సనల్ స్వాభిప్రాయం.

చిట్టెన్‌రాజు గారి రచనలను మొదటిసారి కౌముది వెబ్ పత్రికలో చూసాను. 'అమెరికామెడీ' పేరుతో వెలువడే శీర్షికలో చిట్టెన్‌రాజు గారు తన అనుభవాలను హాస్యభరితంగా, అపుడపుడూ కాస్త ఎగస్ట్రా మసాలా దట్టించి, పాఠకులకు అందిస్తున్నారు. నాకు చిట్టెన్‌రాజు గారి గురించి outside information ఏమీ తెలియదు కానీ, ఆయన రచనల ద్వారా అర్థమయిందేమిటంటే  -

ఆయన తెలుగు సాహిత్యం పట్ల మోతాదుకంటే ఎక్కువ అభిమానమున్న అమెరికాంధ్రుడు. సభలూ, సన్మానాలు అంతా కమర్షియలైజ్ అయిపోతున్న ఈ తరుణంలో కూడా "సాహిత్యం/కళ పట్ల ఆసక్తి అన్నది మనసులో నుండి రావాలి కానీ మెప్పుకోసం, కీర్తి కోసం సాహిత్య పోషణ ముసుగు వేసుకోకూడదు" అనుకొనే సత్తెకాలపు సత్తెయ్య. తెలుగు సాహిత్య సభలు విజయవంతం కావాలంటే నిజమయిన సాహితీ ప్రేమికుల కంటే ముమైత్ ఖాన్ డ్యాన్సులే ముఖ్యం అని తెలుసుకోలేని అమాయకజీవి. లేకుంటే ఒక్క సినీ స్టార్ కూడా లేకుండా హైడ్రాబ్యాడ్ లో సాహితీ సభలు నిర్వహిస్తారా, అదీ ఎంట్రీ ఫీజ్ పెట్టి!! నాకే గనక ఆ ఓపిక, అవకాశం ఉంటే తెలుగు సాహితీ సభలకు ఇలియానాను పిలిపించి నాలుగు బజారు డ్యాన్సులేయించి "నాకీ టెల్గు గొంజం గొంజం వష్టాయ్" అని చెప్పించి ఆ సభను మరింత విజయవంతం చేసి కుప్పలు తెప్పలుగా డబ్బులు సంపాదించేవాడిని. చిట్టెన్‌రాజు గారికి ఆ తెలివి లేదు పాపం!

ఇక 'అమెరికామెడీ' సంగతికొస్తే - ఇంటా బయటా సాహితీ సభలను నిర్వహించడానికి పడ్డ కష్టాలు, ఆంధ్రాకు వెళ్ళినపుడు తగిలిన 'కల్చరల్ ఝలక్‌లు", అమెరికాలో ఆటా, తానా, తందానా సంఘాల పైన చురకలు, తెలుగు సభల్లో ఎదురయ్యే "తీయని అనుభవాలు", అఖండ అఖిల అమెరికాఖండ తెకోకారా డీలక్స్ సాహితీ సదస్సులు, "పెంట" "మంట" సంఘాలు, "టీవీ సీరియల్" కష్టాలు, ఎప్పటికప్పుడు "క్వీన్ విక్టొరియా" గారిచే టెంకిజెల్లలు...  ఆద్యంతం నవ్వుల జల్లులు కురిపిస్తాయి.

ఇప్పటికీ నెల నెలా కౌముది వెలువడగానే నేను మొదట చూసే శీర్షిక చిట్టెన్‌రాజు గారిదే. అమెరికామెడీ ఎపిసోడ్లన్నీ డౌన్‌లోడ్ చేసుకొని ఒక పుస్తకంగా చేయాలన్న ఆలోచనను చాన్నాళ్ళనుండి వాయిదా వేస్తున్నాను. కాగల కార్యం కౌముదివారే చేసారన్నట్టు అమెరికామెడీ ఇపుడు పుస్తకరూపంలో లభ్యమవుతున్నది.  సెల్‌ఫోన్ ఆఫ్ చేసి ఈ పుస్తకం చదువుతూ ఓ రెండు గంటలు నవ్వులలోకంలో విహరించవచ్చు!

3 comments:

  1. Shashank said...

    హైడ్రాబ్యాడ్ - నిన్ను డిక్కి లో తొంగోబెట్టే టైం అయ్యింది. నేను ఆయాన రచనలు చాలా శ్రద్ధగా చదువుతా.. చాలా బాగుంటాయి.

    సెల్ ఫోన్ అందుకే తీలేదు మొన్న? ఇంకా నీకేమైందో అనుకున్న.. శంకర్ చూసి నామీద పగబట్టవేమో అని ఆరాట పడ్డ కద అనవసరంగా..

  2. లక్ష్మి said...

    PDF లింకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. చాలా రోజుల తర్వాత కళ్ళల్లో నీళ్ళు తిరిగేలా నవ్వుకున్నా. మరొక సారి ధన్యవాదాలు.

  3. శ్రీనివాస్ పప్పు said...

    నవ్విస్తూ ఏడ్పించడమంటే ఇదేనేమో?ధన్యవాదాలు బాసూ లింకుకి...

Post a Comment