అమెరికాలో తెలుగు ఉద్యమం

Posted by జీడిపప్పు

ఈ మధ్య బ్లాగుల్లో LTTE సంస్థ గురించి, తమిళ-తెలుగు భాషల గురించి పోస్టులు, చర్చలూ జరుగుతున్నాయి. కొందరు శ్రీలంకలో తమిళులు చేసినదాన్ని సమర్థిస్తూ, కీర్తిస్తూ చక్కని పోస్టులు వేసారు. కానీ అందరికంటే అసంబద్ధమైన పోస్టు "బ్లాగాడిస్తా రవి" గారు వేసారు. నాకు రవిగారి పోస్టు నచ్చకపోవడానికి కారణం - ముందు వెనుకా ఆలోచించకుండా "భాష" అన్న పదం వినపడగానే పూనకం వచ్చి ఊగిపోయి "అవును అందరూ భాష కోసం ఉద్యమాలు జరపాలి" అనకపోవడం. రవిగారి పోస్టులో ఇంకా నచ్చనిదేమిటంటే - అన్నికోణాల్లో ఆలోచించి ఉన్నవి ఉన్నట్లు చెప్పడం.

శ్రీలంకలో తమిళులు తమ భాషకోసం జరుపుతున్న పోరాటాన్ని, వారికి తమ భాష పట్ల ఉన్న అభిమానాన్ని చూసి ప్రవాసాంధ్రుడిగా నాకు నిఝ్ఝంగానే తెలుగువాడిని అయినందుకు సిగ్గు వేసింది. నాకు తెలిసి ప్రతి తెలుగువాడూ శ్రీలంక తమిళులనుండి నేర్చుకోవలసింది ఎంతో ఉంది, ముఖ్యంగా ప్రవాసాంధ్రులు.  అమెరికాలో ఉన్న భారతీయుల్లో ఎక్కువమంది తెలుగువారే. న్యూజెర్సీ, బే ఏరియా మొదలయిన ప్రాంతాల్లో తెలుగువారి జనాభా చాలా ఎక్కువ. ప్రతి ఇద్దరు భారతీయుల్లో ఒకరు తెలుగువారే అంటే అతిశయోక్తి కాదేమో. అయినా సరే అమెరికాలో తెలుగు నిరాదరణకు గురి అవుతున్నది. అందుకుగల కారణాలు, పరిణామాలు, పరిష్కారము చూద్దాము.

శ్రీలంకలో తమిళులు Vs అమెరికాలో తెలుగులు
శ్రీలంకకు వెళ్ళిన తమిళులు తాము సింహళం నేర్చుకోము, తమకోసం అన్నీ తమిళంలోనే ఉండాలి అన్నారు. మనము ఏమి చేసాము? అమెరికాకు వచ్చాకో, వచ్చే ముందో ఇంగ్లీషు నేర్చుకొన్నాము. కొద్ది కాలానికి అమెరికన్ యాస కూడా అలవాటు చేసుకున్నాము.
వీళ్ళు మేమంతా తమిళులము కాబట్టి మేమంతా ఒకే చోట ఉంటాము, మీతో కలవము అన్నారు. మనమేమో ఎక్కడుంటే ఏముంది, హాయిగా ఉంటే చాలు అని తెల్లవాళ్ళ మధ్య నివశిస్తున్నాము.
వీళ్ళు సింహళీయుల చట్టాలను పట్టించుకోలేదు, వాటిని అతిక్రమించి ఎదురుతిరిగారు. మనమేమో అమెరికావాడు చెప్పినట్టు కుడి వైపునే కారు నడిపాము, రోడ్డు పైన చెత్త వెయ్యలేదు, క్యూలో ఉన్నపుడు తొక్కిసలాటలు జరపలేదు.
వీళ్ళు తమ పిల్లలకు "సింహళ బాష నేర్చుకోకూడదు" అని చెప్పారు. మనమేమో "మనం ఈ దేశానికి వచ్చినపుడు ఈ దేశస్థుల్లా ఉండాలి" అంటూ పిల్లలకు ఇంగ్లీషు నేర్పిస్తున్నాము.
వీళ్ళు తమ పిల్లలకు "మనం ఉంటున్న శ్రీలంక మన దేశం కాదు, మనము మన భాషను, సంస్కృతినే ఆచరించాలి" అని భోధించారు. మనమేమో "మనము ఇక్కడకు వలస వచ్చాము. భాషకంటే మనకు కూడూ, గుడ్డ పెడుతున్న దేశం పట్ల గౌరవం ముఖ్యం. ఈ దేశాన్ని గౌరవించాలి, వీరి సంస్కృతి కూడా అలవాటు చేసుకోవాలి" అంటూ తెలుగువారింట్లో కూడా క్రిస్మస్ రోజున అందరూ హాయిగా, సంతోషంగా బహుమతులతో గడిపే దీనస్థితికి వచ్చాము.

పరిణామాలు
తెలుగువారు ఇలా అమెరికా పద్దతులను గౌరవిస్తూ, ఆచరిస్తూ అమెరికన్లతో కలసిపోయి హాయిగా జీవిస్తున్నారు. మొదటితరం తెలుగు పిల్లలకు తెలుగు చదవడం, వ్రాయడం, మాట్లాడడం సరిగా రాదు. తెలుగు సంతతివారు అమెరికన్లతో పోటీ పడి చదువుతున్నారు. ఎన్నో కాంపిటీషన్లలో నెగ్గుతున్నారు. కంపెనీల్లో ఉన్నత పదవులను చేపడుతున్నారు. కేవలం మన తెలుగు పండగలయిన ఉగాది, సంక్రాంతి వంటివి మాత్రమే కాక అమెరికన్ల పండగలయిన థ్యాంక్స్ గివింగ్, క్రిస్మస్ పండగలను కూడా జీవితంలో ఒక భాగం చేసుకుంటున్నారు. తమ భాషకంటే తమకు బ్రతుకుతెరువునిస్తున్న దేశ పద్దతులకు గౌరవమిస్తూ ఆ దేశ ప్రజల్లా బ్రతుకుతున్నారు. ఈ విపరీత ధోరణి ఇలా కొనసాగితే మరో రెండు తరాల తర్వాతి తెలుగువారు 'వాట్ ఈజ్ టెల్గు? హూ ఈజ్ ఉగాడి?' అంటారు.

తక్షణ కర్తవ్యం
ఎందుకు? ఎందుకు ఇలా జరుగుతోంది? ఇన్ని లక్షల మంది తెలుగువాళ్ళు అమెరికాలో ఉన్నా "భారతీయులు" గా గుర్తింపు పొందుతున్నారే కానీ "భారతీయ తెలుగువారి"గా ఎప్పుడు గుర్తింపబడతారు? కొన్ని తరాల తర్వాత అమెరికాలో తెలుగువారి పరిస్థితి ఏమి?
ఇలాంటి ప్రశ్నలకున్న ఏకైక జవాబు -  అమెరికాలోని తెలుగువారు ఉద్యమించడం.

"తెలుగు" అన్న మాట వినిపిస్తే కల్లు తాగిన కోతిలా చిందులు తొక్కే మతిలేనివాడిని నాయకుడిగా ఎన్నుకోవాలి. ఈ తెలుగోన్మాది తెలుగువారిలో భాషాభిమానాన్ని రెచ్చకొట్టేవాడయి ఉండాలి.
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఎన్నో భారతీయ భాషలున్నా తమిళులకు జరుగుతున్న అన్యాయాలే వినిపిస్తాయి కానీ తెలుగువారికి జరుగుతున్న అన్యాయాలు వెలుగులోకి రావడం లేదు. ఇకనుండి తెలుగువారికి కూడా అన్యాయం జరిగేలా ఈ తెలుగోన్మాది చర్యలు చేపట్టాలి.
అమెరికాలో తెలుగు వారి కోసం ప్రత్యేక రాష్ట్రం ఏర్పరచాలి. తెలుగు వారి పిల్లలకు బోధన తెలుగులోనే జరగాలి.
తెలుగు వారు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ట్రాఫిక్ సూచనల మొదలు అన్నీ తెలుగులో ఉండాలని ఆందోళనలు చేపట్టాలి.
ఇలా చేసినపుడే తెలుగు వారికి గుర్తింపు లభిస్తుంది.

శ్రీలంకలోని తమిళులు చేసినది చూసి ఇకనయినా ప్రవాసాంధ్రులు కళ్ళు తెరుస్తారని, తెలుగు ఉద్యమాలు, తెలుగు ఆందోళనలు చేపడుతారనీ, అమెరికాలో తెలుగు వాడి ఆత్మ గౌరవాన్ని చాటి చెబుతారని ఆశిద్దాం.

25 comments:

  1. కన్నగాడు said...

    మీరే మా నాయకుడు, ఏమంటారు? :)

  2. చావాకిరణ్ said...

    శ్రీలంకలో తమిళోల్ల బదులుగా తెలుగోళ్లు ఉండి, సింహళ వాళ్లు ఆలాగే ప్రవర్తిస్తే అప్పుడు తెలుగోళ్ల ప్రవర్తన ఇప్పటి తమిళ వాళ్ల ప్రవర్తనలానే ఉండేది. కాదంటారా?

  3. Kathi Mahesh Kumar said...

    మనతెలుగోడు ఇప్పటి తెలు‘గోడు’గా మారడానికి మన ఆర్థికసంస్కృతి కారణం.

    సామాజిక-సాహితీ సంస్కతుల్ని ఆర్థిక లావాదేవీలకు ముఖ్యంగా ఫ్యూడల్ సంస్కృతి అత్యంతగా ప్రభావితం చేసిన చరిత్ర మనది. అందుకే మనకు మన సాంస్కృతిక అస్తిత్వంకన్నా, ఆర్థిక బలిమి (భూమి/డబ్బు) ముఖ్యం.డబ్బుకోసం దేన్నైనా తాకట్టుపెట్టే గౌరవనీయమైన జాతి మన తెలుగు జాతి. అందులో భాగంగానే ఈ పరిస్థితి.

    దీనికి కారణం ఎవరైనా, చరిత్ర ఇలా ఎందుకు అఘోరించినా మార్పుకోసం ఆశించే "సాహసం" మాత్రం మనమన comfort levels దాటి మనం చెయ్యం.అదే మన సంస్కృతి. మన తెలుగు గౌరవం. ఆత్మగౌరవ నినాదం.

  4. Chivukula Krishnamohan said...

    పరవాలేదు లెండి. మీరు ఉన్నంతవరకు అలాంటి ప్రమాదం రాకుండా కాపాడతారని మా అందరికీ తీవ్ర్రమైన నమ్మకం. మా నమ్మకాన్ని వమ్ము చెయ్యకండి.

  5. కామేశ్వరరావు said...

    జీడిపప్పుగారు,

    మీరు మూడు మౌలిక నిజాలు గమనించ లేదు (లేదా మరిచిపోయారు):
    1. శ్రీలంకలో తమిళులు భాషకోసం పోరాటం జరపలేదు
    2. శ్రీలంకలో తమిళులు అమెరికాలో తెలుగువాళ్ళలా వలసవెళ్ళిన వాళ్ళు కారు
    3. అమెరికాలో తమిళులు శ్రీలంకలో తమిళులలాగా ఏ ఉద్యమాన్నీ చేపట్ట లేదు

  6. Pratap said...

    తమిళులు తమ రాష్ట్రం లో ఏనాడో తమిళాన్ని అధికార భాషగా దర్జాగా అమలు లోకి తెచ్చారు.
    అట్లాగే కన్నడిగులు, మలయాళీలు, మహారాష్ట్రీయులు తమ రాష్ట్రాల్లో తమ భాషను అధికార భాషగా అమలు పరుస్తున్నారు.
    ఒక్క తెలుగు వాళ్ళే తమ సొంత రాష్ట్రం లో ఇప్పటికీ ఇంకా తెలుగును అధికార భాషగా అమలు చేయలేని అసమర్ధులుగా మిగిలిపోయారు.

    ఇక అమెరికా దాకా ఎందుకులే మన గొప్పలు.

    ఇక్కడి రైతులూ, కార్మికులు, సామాన్య జనం పరాయి పాలన లో వున్నట్టు ప్రభుత్వ జీవోలను, కోర్టు తీర్పులను , చట్టాలను, చట్టుబండలను అన్నీ ఇంగ్లీష్ లో చదువుకోవలసి న దుస్థితి లో వున్నారు,
    ఇదే నేల మీద ఇంగ్లీష్ వాడు ఇంగ్లీష్ ను తురకవాడు ఉర్దూను అవలీలగా అధికార భాషలుగా చేస్తే మనం చచ్చినట్టు వాటిని నేర్చుకున్నాం, కాని తెలుగు ను ఇప్పటికైనా అమలు చేయమని అడగలేక పోతున్నాం. ఎంత ఆత్మగౌరవమో మనకి కదా.

    తన మాత్రు భాష పట్ల ఇంత గౌరవంలేని వాడు ప్రపంచం లో తెలుగువాళ్ళను మించిన వాళ్ళెవరు. వుంటారు. ????

  7. రవి said...

    అదేదో సినిమాలో కోట శ్రీనివాస రావు అడిగినట్టు అడుగుతున్నాను. "మీరు నన్ను పొగుడుతున్నారా? తిడుతున్నారా?"

    anyway, ఉద్యమించండి. ఇంక్విలాబ్, జిందాబాద్.

  8. Vani said...

    ఇది ఒక ముఖ్యమైన చర్చ.
    ఒక దేశానికి వలస వెళ్ళినప్పుడు ఆ దెస సంస్కుతి తో మమేకమవ్వటం లో తప్పు లేదని నాకు అని పిస్తుంది.
    మనకు మనం గిరి గీసుకొని ఉండాలను కొంటె అసలు వేరే ప్రాంతాలకు లేక దేశాలకు వేల్ల్లకూడదు.
    అధితుల్లాగా వెళ్ళటం వేరు , ఆ దేశా పౌర సత్వాన్ని తేసుకోవటం వేరు. ఒక సారి ఆ దేశా పౌరాలు అయ్యాక ఆ దేశానికే, వారి భావాలకు గొంతు కలపటం. , ఆ దేశా శౌభాగ్యనికి కృషి చెయ్యటం లో తప్పు లేదు. పైగా అదే కరెక్టు.
    రెండు పడవల పై కాలు పెడితే ఎలా. ఆ దేశ హక్కులు పొందాక , వనరులు అనుభవించాక మరో దేశం పై ప్రేమ ఒలక పోస్తే ఎలా
    భారతీయ ముస్లిం లు తోటి భారతీయుల్ని కాక , మొఖం ఎరగని విదేశీయుల్ని మతం పేరు తో ఇష్ట పడ బట్టే కదా ఎన్నో సమస్యలు. ఇదే ప్రపంచ వ్యాప్తం గా ఉన్న సమస్య.
    నా మటుకు నాకు నేషన్ అనేది ముందు. జాతి, భాష, మతం తర్వాత గా ఉండాలి ఎవరికైనా .
    ప్రభుత్వాలు కూడా అదే enforce చెయ్యాలి
    అమెరికా లో వాళ్ళు విరగేస్తారు కాబట్టే అమెరికా తమిలోల్లు ఎదురు తిరగటం లేదు.

  9. Vani said...

    భాషా దోషాలు మన్నించండి . గూగుల్ లేఖిని చెత్త గా ఉంది

  10. కామేశ్వరరావు said...

    మైత్రేయిగారు,

    "ఒక దేశానికి వలస వెళ్ళినప్పుడు ఆ దెస సంస్కుతి తో మమేకమవ్వటం లో తప్పు లేదని నాకు అని పిస్తుంది. పైగా అదే కరెక్టు."

    మంచి అభిప్రాయాన్ని చక్కగా సూటిగా చెప్పారు. అది కరెక్టనే నాకూ అనిపిస్తుంది. వచ్చిన చిక్కేవిటంటే, దాన్ని ఆచరించేవాళ్ళు అతి తక్కువమంది. తరచూ దాన్ని ఆచరించినవాళ్ళే నష్టపోతారు. రెండు వందల సంవత్సరాల కిందట మన దేశానికి వర్తకానికి వచ్చిన బ్రిటీషువాళ్ళు ఇలా అనుకొని ఉంటే ఎంత బావుణ్ణు! అలా అనుకోకపోవడంవల్ల వాళ్ళకి జరిగిన నష్టంకన్నా ఎన్నో రెట్లు నష్టపోయింది మనం!
    ఇప్పటికీ మరో మార్గంలో అమెరికా చేస్తున్న పనీ యిదే. తమకున్న బలం ద్వారా ఇతర దేశాల్లో తమ సంస్కృతిని సూదిమందులా ఎక్కించడం.
    మీరు సాఫ్ట్వేరులో పనిచేస్తూ ఉంటే యీ విషయం మీకు ప్రత్యక్షమే. మనం అమెరికాకి వెళ్ళినప్పుడు వాళ్ళ వేషధారణే చేస్తాం, వాళ్ళతో తినేప్పుడు వాళ్ళ భోజనమే తింటాం, వాళ్ళ భాషనే మాట్లాడతాం. అదే ఒక అమెరికా అతను మన దేశం వచ్చాడనుకోండి. అయినా అతను తన వేషధారణే చేస్తాడు, తను తినే తిండే తింటాడు. అతని మెప్పు కోసం మనం కూడా (మన దేశంలోనే ఉండికూడా) అతని వేషభాషలనే అనుసరిస్తాం. మరి మీరన్న ఏ దేశంలో ఉంటే ఆ దేశ సంస్కృతితో మమేక మవ్వడం అవతలివాళ్ళ విషయంలో ఎందుకు జరగటం లేదు? అతను మనకన్నా "బలవంతుడు" కాబట్టి.
    ఆచరణయోగ్యం కాని ఆదర్శం ఏం ప్రయోజనాన్ని సాధిస్తుంది చెప్పండి?

  11. శరత్ కాలమ్ said...

    Ee udyamaaniki nene kosaadhikaarigaa vuntaanu ;)

  12. cbrao said...

    తెలుగన్నా, తెలుగువారన్నా నాకు ఇష్టమే. అయితే మొదట నేను భారతీయుడిని. ఈ విశాల ప్రపంచ సభ్యుడను. ప్రపంచ దేశాల మధ్య సరిహద్దులు, ఈ సరిహద్దుల రక్షణకై యుద్ధాలకు నేను వ్యతిరేకం. ఈ ప్రపంచ పౌరులుగా ఉంటూ ప్రపంచ భాష Esperanto నేర్చుకుందాము రండి.

  13. తెలుగోడు said...

    "americalO Andhrulaku inkO eelam" kAvAli... inquilab zindabad.

  14. Varunudu said...

    నీ యెంకమ్మా (Sorry for this usage, I could not control)... నీ యే ఒక్క పోస్ట్ ఐనా, ఒక్క సారి చదివితే అర్థం కాదు. తిట్టాడా, పొగిడాడా లాంటి చెత్త అనుమానాలు వస్తాయి. మొదట యేదో ఉద్యమం,అన్యాయం లాంటి మాటలు చూసి " ఓహో బుడుగు ఈ సారి తెలుగు మీద విప్లవిస్తున్నాడే" అన్న ఫీలింగ్ కలిగింది. తీరా చివరాఖరుకు వచ్చి చూస్తే, తిట్టినట్టు గా ఉంది. "ఏమో లే పైన పేరాల్లో నేనే తప్పు చదివానేమో" అనుకొని మళ్ళీ చదివితే, అది సరిగ్గానే ఉంది.ఇలా కాదని..యే ఫీలింగులూ లేకుండా చదివితే బుర్రలో బల్బు వెలిగింది. యే మాటకు ఆ మాటే... ఆంధ్ర భూమి తరవాత నీ బ్లాగే ! వ్యంగ్యం లో ఆంధ్రభూమి స్థాయిని దాటుతున్నావ్( ఆంధ్ర భూమి లొ ఒక్క సారికే అర్థమౌతుంది నాకు మరి !)

    జయహో తెలుగు జాతి, జయ జయ హో ఆంధ్ర సంస్కృతి.. ఎక్కడ నా కత్తి.. ఏది నా విల్లు ?

  15. Unknown said...
    This comment has been removed by the author.
  16. కాలనేమి said...

    వ్యంగ్యం, మీరు చెప్పదలచుకున్న విషయం అర్థమయింది కానీ, మీరు తీసుకొచ్చిన పోలికలు, Its like comparing apples with oranges and judging one of them! ఒహవేళ అదే మీరు చెయ్యదలచుకున్నదీ, అదే వ్యంగ్యపూరిత సందేశమే మీరివ్వదలచుకున్నదీ అయితే, నో కామెంట్ :)

    కానీ, పనిలో పని గా మేతావి శునకాలు "డబ్బుకోసం దేన్నైనా తాకట్టుపెట్టే గౌరవనీయమైన జాతి మన తెలుగు జాతి" లాంటి పనికిమాలిన మాటల్ని మతి తప్పిన మిడీవల్ స్కాలర్ల పరిభాషలో (అంటే మన చర్చిల్లో గౌరవనీయులైన రెవరెండ్ నాగేందర్ పింటో గాళ్ళు వాడే భాష కు ఇంటలెక్చువల్ వర్షన్ అన్నమాట) కలిపి అనే వేదికనివ్వడం అస్సలు బాగాలేదు. త్వరలో ఇంకో రెండు మూడు శునకాలు వచ్చి ఈ మాటను తీవ్రం గా వ్యతిరేకిస్తాయి, అదే సమస్యం లో నేను కోట్ చేసిన మాటను దారుణం గా ఏకీభవిస్తాయి. Have fun!

    ఈ వ్యాఖ్యను చూసి మతిపోగొట్టుకునే తీవ్రవాదులకి - wanna play hard ball? ;)

  17. జీడిపప్పు said...

    @ కన్నగాడు గారు - అంటే నేను "తెలుగోన్మాది"నంటారా :)

    @ చావాకిరణ్ గారు - మీరే చెప్పండి, ఏమి చేస్తామో. గత శతాబ్దపు చరిత్రలో "అణచబడిన వాళ్ళు" ఏమి చేసారో మీకు తెలుసనుకుంటా!!

    @ మహేష్ గారు - నాకెపుడూ అలా అనిపించదు. కాలానుగుణంగా మారే జాతి మనది అని నా నమ్మకం.

    @ క్రిష్ణమోహన్ గారు - :)

    @ ప్రతాప్ గారు - తెలుగును అధికారభాష చేసేస్తే సరిపోతుందా మీరన్న "గౌరవం" రావాలంటే?

    @ రవి గారు - హ హ్హ హ్హా. ఇంకోసారి మొదటి పేరా చదవండి, అర్థమవుతుంది లేదా అర్దమవుతుంది :)

    @ మైత్రేయి గారు - Wonderful and well said. మన భాష, సంస్కృతి కంటే మనకు కూడు, గుడ్డ పెడుతున్న దేశం పట్ల గౌరవమే ముఖ్యం అని నమ్ముతాను.

    @ శరత్ గారు - డబ్బులు నొక్కేద్దామనా?? ;)

    @ సీబీరావు గారు - :)

    @ తెలుగోడు గారు - హ హ్హ. ఈలం బదులు ఏదయినా తెలుగు పేరు పెడదాం

    @ వరుణుడు గారు - హి హ్హి హ్హీ.. చెమించండి. ఈ మధ్య వ్యంగ్యం కాస్త ఎక్కువే అవుతోంది, తగ్గిస్తా. అన్నట్టు నేను కూడా ఆంధ్రభూమి 'సాక్షీ కి ఫ్యానునే! అయినా ఈ పోస్టు కాసేపటికే 'వ్యంగ్యం' అని తెలిసిపోతుంది కదా??!!

    @ యోగి గారు - ఇది వ్యంగ్యపూరిత సందేశమంటారా :)

    @ భైరవభట్ల గారు - నేను కేవలం భాష గురించే కాదు, సంస్కృతి, పద్దతుల గురించి కూడా చెప్పాను. శ్రీలంకలో తమిళులు ఎప్పటినుండో సహజీవనం సాగించేవారు కానీ 19 శతాబ్దపు చివరలో వేలాదిమంది కూలీలు వెళ్ళిన తర్వాతే ఈ గొడవలు మొదలయ్యాయి.

    ఇక "అమెరికావాడు మనదేశానికి వచ్చడనుకోండి" అన్నారు. అమెరికావాడే కాదు, ఇండియా వాడు అమెరికాకు "కొద్ది కాలం" ఉండడానికి వస్తే అమెరికా పద్దతులు పట్టించుకోడు. అదే జీవనాధారం కోసం వచ్చి స్థిరపడితే అన్నీ అలవరుచుకుంటాడు.
    అమెరికానుండి ఇండియాకు కుటుంబ సమేతంగా వెళ్ళిపోయి అక్కడే శాశ్వత నివాసం ఏర్పరుచుకొన్న తర్వాత కూడా "మేము అమెరికన్లలాగే జీవిస్తాము" అనేవాళ్ళను ఎందరిని చూసారు?
    అంతెందుకు, మొన్నామధ్య ఓ వారపత్రికలో సికింద్రాబాదులో ఉన్న ఆంగ్లో-ఇండియన్ల గురించి వ్యాసం వచ్చింది చూసారా? వీళ్ళు బ్రిటీష్ సంతతివారయినా "మేము భారతీయులమే" అంటూ హాయిగా జీవించడం లేదా?

  18. తెలుగోడు said...

    eelam badulO unkOTi peTTochchu. but, eelam ayitE, enchakkA, "a aa i ee" sangham ani piluchukOvachchani... alA eel(am)ESA ;)

  19. Vani said...

    @భైరవభట్ల కామేశ్వర రావు గారు,
    మీరు అన్న విషయం కూడా బొత్తిగా తెసివేయ దగ్గది కాదు. ఇప్పటి వరకు మనము receiving end లో నే ఉన్నాము.
    కాని బ్రిటిష్ వాళ్ళు కాని అంతక ముందు తురక , ఆఫ్గాన్ రాజులు గాని మనల్ని యుద్ధం లో ఓడించిన వారు.వాళ్ళు వలస పౌరులు కారు. వలస రాజులు. కనుక వాళ్ళు మన సంస్కృతీ అలవరుచుకో లేదు అంటే ఆశ్చర్యం లేదు. మన బలహీనత, అనైక్యత , అతి మంచితనము, అప్పటి లేటెస్ట్ ఆయుధాలు మనదగ్గర లేక పోవటం ఇవన్నిటి వల్ల మనం వాళ్ళకు దాసులము అయ్యాము అప్పుడు మన మాటకు విలువేమీ ఉంటుంది.
    కాని ఇప్పటి పరిస్తితి అది కాదు. ఈ దేశ ప్రజలు ఇంకో దేశానికీ వెళ్ళినా అక్కడి వనరుల పట్ల , అవకాశాల పట్ల ఆశతో వెళ్ళిన వారే . అప్పుడు వెళ్ళిన వాళ్ళకు అధికారం ఎలా ఉంటుంది. కనుక ఇతర దేశాలలో నివసించే భారతీయులు ఆ యా దేశాలు ఇచ్చినత వరకే స్వేచ్చ వినియోగించు కోవాలి. లేదా సామరస్యం గా పరిష్కరించుకోవాలి. దానికి ఇక్కడ నుండి కరుణానిధి లా మనం ఆవేశ పడటం తగదు.
    అయితే మన దేశం లో మన రాష్ట్రం లో మనం తెలుగు వ్యాప్తికి ఏమి చెయ్యచ్చు అని మనం ఆలోచించాలి. తెలుగు వ్రాయటం , చదవటం రాని పిల్లలు (ముస్లింలు కాక ) మన భాగ్యనగరం లో ఎంతమంది ఉన్నారో. మా తాతయ్య చెప్పిన పద్యం ఒకటి గుర్తుకు వసున్నది., జీడిపప్పు గారువ్యాఖ్య వ్యాసం అయింది అనుకోక పొతే వ్రాస్తాను
    "తెలివికి సంస్కృతము ; కలిమికి అరవము ; కొలువుకు ఆంగిలేయమో , తురకమో; తెలుగు ఎవ్వరికిచ్చి తిరుగుదవు ఆంద్రుడా?" చెన్నై కి వెళ్లి వ్యాపారాలు చెయ్యాలంటే అరవం, నిజాం ప్రభుత్వం లోనో , బ్రిటిష్ వాళ్ళ దగ్గరో ఉద్యోగం చేయాలంటే వాళ్ళ భాష, పూర్వ విద్యలు చదవాలంటే సంసృతం చదివే వారట స్వాతంత్రానికి ముందు. ఇప్పుడు ఆయినా తెలుగు ఎందుకు చదవాలో మనం చెప్పలేక పోతున్నాం ఆంధ్రులకు.

  20. Kathi Mahesh Kumar said...

    @జీడిపప్పు: మనది కాలానుగుణంగా మారే జాతైతే మరి ఇలా మారినందుకు బాధ పడటమెందుకు? గర్వపడాలిగానీ!

    తెలుగువాళ్ళకు మానసిక విలువలకన్నా, భౌతిక అవసరాలు మిన్న. అందుకే we place economics over culture. ఆ మాటే నేను కొంచెం ఘాటుగా చెప్పాను.అది అంతర్లీనంగా వచ్చిన ఒక ఫ్యూడల్ సంస్కృతి. ఈ విషయాలు అర్థం కానివాళ్ళు తమ జ్ఞానాన్ని పరమావధి అనుకుని మిగతావాళ్ళని మేతావులు,కుక్కలు అని ఎద్దేవాచేస్తూ తమ లేకి బుద్దిని బయటపెట్టుకుంటుంటారు.

  21. జీడిపప్పు said...

    మహేష్ గారు - నేను తెలుగు గురించి బాధపడుతున్నట్టు అనిపించిందన్నమాట మీకు!! :)

  22. Anonymous said...

    @జీడిపప్పు: "కాలానుగుణంగా మారే జాతి మనది అని నా నమ్మకం" - That killed me! :)

    Then what makes this "Chandu" feel that we will always keep learning from Hollywood!!!!!

  23. Anonymous said...

    తెలుగు గురించి జనాల అభిప్రాయాలని సర్వే చేసే ఉద్దేశ్యంలో ఓ ప్రైమరీ ట్రైల్ వేస్తున్నాం.

    విజయ్ మాధవ్ అనే ఔత్సాహిక యువకుడు ఇందుకు సహాయంగా, ఇమ్మిడియట్ గా తన బ్లాగ్ లో ఈ సర్వే పెట్టారు. పర్ణాశాల పాఠకులందరికి, త్వరగా ఇక్కడ ఓ చిన్న ఆఫ్షన్ సెలెక్ట్ చేసి, పుణ్యం కట్టుకోమని మనవి.

    http://vijayamadhava.blogspot.com/2009/05/rayray.html

  24. జీడిపప్పు said...

    రేరాజ్ గారు,
    హాలీవుడ్‌లో సినిమాలు తీయడం చూసి మనవాళ్ళూ సినిమాలు తీశారు. హాలీవుడ్‌లో ట్రయాంగిల్ లవ్ స్టొరీలు వస్తే మనవాళ్ళు అవీ తీశారు. హాలీవుడ్‌లో కౌబోయ్ సినిమాలు వస్తే అవీ తీసారు..మొన్నెపుడో "మేట్రిక్స్" వస్తే దాన్నినుండీ కొన్ని కాపీ కొట్టారు. "మేము భారత రామాయణాల సినిమాలే తీస్తాము" అనకుండా కాలానుగుణంగా మారుతూ హాలీవుడ్ నుండి నేర్చుకోవలసింది ఎంతో ఉంది అని తెలుసుకుంటున్నారు.

    అన్నట్టు, మన తెలుగు సినిమాల స్థాయి ఎప్పటికీ హాలీవుడ్ సినిమాల స్థాయికంటే తక్కువే, మనవాళ్ళు ఎప్పటికీ హాలీవుడ్ నుండి నేర్చుకోవలసిందే.

    - జీడిపప్పు a.k.a చందు a.k.a Keyser Söze

  25. Anonymous said...

    :) అంతా ఓకే. నేర్చుకుంటూ ఉంటామేమో గానీ, "నేర్చుకోవలసిందే" అని మీరు చెప్పలేరు. ఈ శాపనార్ధాలు పని చేయవు. అదే ఆబ్సల్యూట్ అని చెబితే తిరగబడేవారు, పీకి పాతరేసేవారు తయారౌతారు.
    అదే మీ లక్షం ఐతే - ఫైన్, వెల్ అండ్ గుడ్! :)
    ------------------
    అందుకే ఆరోజన్నాను: "డామ్ ఇట్ - కధ అడ్డం తిరిగింది" అని.
    ____________
    తెలుగు సినిమా చించి చేతిలో పెడుతుంది...చూస్తుండేహే!

Post a Comment