అరచేతిలో గ్రంథాలయం - రచయితలకు, పాఠకులకు ఒక వరం

Posted by జీడిపప్పు

పుస్తక పఠనం తగ్గిపోతున్న ఈ తరుణంలో మళ్ళీ పుస్తకాలకు మంచిరోజులు రానున్నాయా అంటే, అవును రానున్నాయి అనే చెప్పాలి. కాకపోతే అవి మనము చేతితో పట్టుకొనే పుస్తకాలు కావు. అన్నీ e-మయం అవుతున్న ఈ రోజుల్లో పుస్తకాలు కూడా e-రూపం సంతరించుకుంటున్నాయి. ఎంతయినా పుస్తకాన్ని చేతితో పట్టుకొని చదవడానికి కంప్యూటర్లో పుస్తకం చదవడానికి తేడా ఉంది. ఆ తేడాను వీలయినంతవరకు తగ్గించే పరికరమే Amazon.com వారి Kindle. చిన్న పుస్తకం సైజు, పెన్సిల్ మందము ఉన్న ఈ పరికరంలో పుస్తకాలను  ఒక్కొక్క పేజీ చదువుకోవచ్చు. కేవలం ఒక్క పుస్తకమే కాకుండా కొన్ని వేల పుస్తకాలను  ఆ చిన్న పరికరంలో భద్రంగా దాచుకొని ఎప్పుడు కావాలంటే అపుడు చదువుకోవచ్చు.

పాఠకులకు ఉపయోగాలు:

*తాము ఎక్కడికి వెళ్ళినా వేల పుస్తకాలు "సంచార గ్రంథాలయం"లో తమతో పాటే వస్తుంటాయి.
*పుస్తకాలను భద్రపరచడానికి స్థలం అవసరం లేదు. పదివేల భౌతిక పుస్తకాలకు ఒక గది అవసరమయితే పదివేల e-పుస్తకాలను జేబులో సరిపోయే ఒక చిన్న పుస్తకం సైజు ఉన్న Kindle లో అమర్చుకోవచ్చు. 
*ఒక మంచి పుస్తకం కావాలనుకుంటే పుస్తకాల షాపుకు వెళ్ళి కొనుక్కోవాలి లేదా ఆన్‌లైన్లో కొని పుస్తకం వచ్చే వరకు కొద్ది రోజులు వేచి ఉండాలి. కానీ Kindle ద్వారా ఒక్క నిమిషంలో కావలసిన పుస్తకాన్ని Amazon.com నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
*కేవలం పుస్తకాలే కాకుండా వార్తా పత్రికలు, మేగజైన్లు, బ్లాగులు కూడా అందుబాటులో ఉన్నాయి.

ధర తక్కువ:
 
భౌతిక పుస్తకాల ధరలో దాదాపు సగం ధరకే e-పుస్తకాలు లభ్యమవుతున్నాయి. అందుకుగల కారణాలు: పుస్తకాన్ని అచ్చు వేయనవసరం లేదు, పుస్తకాలను గోడౌన్లో పెట్టనవసరం లేదు, ఆర్డరు వచ్చిన తర్వాత పోస్టు చేయనవసరం లేదు. కావలసినదల్లా ఫైళ్ళను భద్రపరచడానికి సర్వర్ మాత్రమే. దీనివల్ల ఎంతో సమయం, శ్రమ, పేపరు కూడా ఆదా అవుతుంది.

రచయితలకు ఉపయోగాలు:

మామూలుగా అయితే ఒక పుస్తకం వ్రాసిన తర్వాత రచయిత ముందుగా ఒక పబ్లిషర్ ను చూసుకోవాలి, ఆ పబ్లిషర్ ఒప్పుకున్నాక పుస్తకం ప్రచురించాలి. పుస్తకం హిట్ అయితే సరి, లేకుంటే ప్రచురణ ఖర్చులు కూడా నష్టం వస్తాయి. అమ్ముడుపోని ప్రతులను కాపాడుకోవడం ఇంకో సమస్య.

Kindle వల్ల రచయితకు ఈ బాధలుండవు. కంప్యూటర్లో టైప్ చేసి పుస్తకాన్ని తయారు చేసుకోవడం చాలా సులభం. Amazon.com వెబ్‌సైటులో అకౌంటు సృష్టించుకొని పుస్తకాన్ని అప్‌లోడ్ చేసి పుస్తక వివరాలు తెలిపితే చాలు. ప్రతి పుస్తకం ధర $0.99 నుండి $200 వరకు ఉండవచ్చు. ప్రతి డౌన్‌లోడుకు పుస్తకం ధరలో 35 శాతం రచయితకు చెందుతుంది. ఎటువంటి పెట్టుబడి లేని ఈ పద్దతివల్ల రచయితకు నష్టం రానే రాదు, కేవలం లాభమే. ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన స్టీఫెన్ కింగ్ వంటి రచయితలు సైతం కేవలం Kindle కోసం నవలలు వ్రాయడం మొదలుపెట్టి పాఠకులను అలరిస్తున్నారు.

వర్తమానం మరియు భవిష్యత్తు:

ప్రస్తుతం ఇది అమెరికాలో మాత్రమే లభిస్తున్నది. ధర $359.00. ప్రస్తుతం అమెజాన్ వెబ్‌సైటులో సుమారు 2,40,000 e-పుస్తకాలు ఉన్నాయి. 2008లో సుమారు 5 లక్షల Kindle పరికరాలు అమ్ముడుపోయాయి అని అంచనా. భౌతిక పుస్తకాలను మాత్రమే చదివే పాఠకులు సైతం Kindle పట్ల ఆకర్షితులవుతున్నారు. Kindle మరి కొద్ది సంవత్సరాలలో iPod తరహాలో పుస్తక విప్లవం తీసుకురాగలదని విశ్లేషకులు అంటున్నారు.

తెలుగు పుస్తకాల విషయానికొస్తే - Kindle ఇప్పుడిపుడే రూపుదిద్దుకున్నది కాబట్టి మిగతా భాషల్లో రావడానికి సమయం పడుతుంది. బహుశా మరో ఐదేళ్ళలో అన్ని భాషలలో, అన్ని దేశాలలో 100-150 డాలర్లకు ఈ పరికరం అందుబాటులోకి రావచ్చు. తెలుగు రచయితలు, బ్లాగరులు ఇప్పటినుండే Kindle పైన ఒక కన్నేసి తమ రచనలను అందుకు అనుగుణంగా కంప్యూటరీకరణ చేసుకొని భద్రపరుచుకోవడం మంచిది.

Kindle గురించి మరిన్ని వివరాలు, విశేషాలు ఉమాశంకర్ గారు తన బ్లాగులో  పొందుపరచారు.

12 comments:

  1. సిరిసిరిమువ్వ said...

    మంచి విషయాలు అందించారు. ఇక రచయితలకి పబ్లిషర్ల చుట్టూ తిరిగే బాధ తప్పుతుందన్నమాట!

  2. ఉమాశంకర్ said...

    మరికొన్ని విషయాలు తెలిసాయి.. ధేంక్స్ జీడిపప్పుగారు నా బ్లాగు రిఫర్ చేసినందుకు .....

  3. పరిమళం said...

    మంచి విషయాలు తెలియ చేశారు .మీకూ , ఉమా శంకర్ గారికి థాంక్స్ .

  4. జీడిపప్పు said...

    @సిరిసిరిమువ్వ గారు, @పరిమళం గారు - ధన్యవాదాలు
    @ఉమాశంకర్ గారు - మీరు పెట్టిన టైటిల్ కాపీ కొట్టాను.. మీకు కూడా థ్యాంక్స్ :)

  5. తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

    ఈ ఇ-వాచకాలు త్వరగా మన దేశానిక్కూడా రావాలనీ, అవి ఇక్కడే స్థానికంగా తయారై ఈ ధరలో నాలుగో వంతుకే అందఱికీ అందుబాటులోకి రావాలనీ కోరుకుంటున్నాను. వీటిగురించి నేను అయిదాఱేళ్ళ క్రితమే విన్నాను. ఈరోజు దాకా ఇవి ఇండియాలో మొహం చూపించిన పాపాన పోలేదు. ఒకవేళ అవి ఇక్కడి విపణిలోకి వచ్చినా ఎవరో నాలాంటి బహుకొద్దిమంది చాదస్తులు తప్ప ఎవరూ వాటిని ఎగబడి కొంటారనుకోను. ఇది మానసిక నిరక్షరాస్యుల దేశం. తక్షణ బతుకుతెఱువుకు సంబంధించనిదేదీ ఈ దేశస్థులకి ఫేవరైట్ కాదు. మ్యూజిక్ వరల్డ్ వాడు హైదరాబాదు కూకటిపల్లిలో ఒక పుస్తకాల కొట్టు తెఱిచి అమ్మకాలు లేక నిరాశోపహతుడై ఆర్నెల్లలో మూసేశాడు. ఇప్పుడక్కడ సినిమా సి.డి.లు మాత్రమే అమ్ముతున్నారు.

  6. సుజాత వేల్పూరి said...

    చాలా ఆసక్తికరంగా ఉంది. ఇలాంటివి తెలుగు భాషలో కూడా అందుబాటులోకి వస్తే పండగే మరి! తెలుగులోకి ఇది అందుబాటులోకొస్తే మొదట కొనే వారిలో నా పేరుంటుంది. ఉమా శంకర్ గారి టపా కూడా ఇప్పుడే చదివొస్తున్నాను. మీ ఇద్దరికీ ధన్యవాదాలు.

  7. Anonymous said...

    iphone or ipod touch + ebook reader = beats the crap out of Kindle. IMHO. (used both)

  8. జీడిపప్పు said...

    తాడేపల్లి గారు, ఇంతకు ముందు ఇలాంటి e-book readers కొన్ని వచ్చినా పాఠకులను ఆకట్టుకోలేదు. Sony కంపెనీ కూడా ఇలాంటిదొకటి చేసింది కానీ అట్టర్ ఫ్లాప్ అయింది. కానీ kindle చాలా సక్సెస్ అయింది. ఐదారేళ్ళలో మంచి ధరకు అందరికీ అందుబాటులోకి వస్తుందని, ఒకప్పటి పుస్తక స్వర్ణయుగం మళ్ళీ రాబోతుందని నమ్మకం ఉంది. చూద్దాం!

    సుజాత గారు - అపుడు మీ బ్లాగు పుస్తకాన్ని నేనే మొదట కొంటాను :)

    imaaya గారు - I Don't think so. అన్ని i ప్రాడక్టులు కూడా సైజు చిన్నవి అవడం వల్ల ఎక్కువ విజయాన్ని సాధించాయి. రెండు చేతులతో Kindle లో చదువుతుంటే నిజయ్మయిన పుస్తకం చదువుతున్న భావన వస్తుంది కానీ iPhone/iPod touchలో ఆ ఫీలింగ్ రాదు. అవి Kindle కు పోటీ అయ్యే అవకాశాలు లేవు. ఒకవేళ అయితే మరీ మంచిది.. పోటీ పెరిగి మరింత చౌకగా మనకు లభిస్తాయి.

  9. Anonymous said...

    viluvaina samaachaaraanni aMdiMchaaru;
    rachanaa prapaMchamulO, speed nuu, aaSAvaha Bavishyattunuu Erparacha gala saaMkEtika pariNAmaanni mii vyaasaM dvaaraa aMdiMchaaru;thank you!

  10. Chari Dingari said...

    http://theory.isthereason.com/?p=1966

    http://wiki.mobileread.com/wiki/E-book_Reader_Matrix

    నాకు సోనీ మంచిదేమో అనిపిస్తుంది

  11. జీడిపప్పు said...

    నరహరి గారూ, సోనీ ఫ్లాప్ అవడానికి సాంకేతిక కారణాలు నాకు ఎక్కువ తెలియదు కానీ, సోనీ సైటులో చాలా తక్కువ పుస్తకాలు అందుబాటులో ఉన్నాయట. ఆ విషయంలో పుస్తక సముద్రమయిన అమెజాన్ ముందు నిలదొక్కుకోవడం కష్టమే.

    అన్నట్టు ఈ రోజు న్యూస్ - kindle compatible బుక్స్ అన్నీ iPhone/iPod లొ చదువుకోవచ్చంట. Appleకు, Amazonకు ఏదో డీల్ కుదిరింది.
    http://news.cnet.com/8301-13860_3-10188193-56.html

  12. Anonymous said...

    Good posts :) Will look forward for more in this category.

Post a Comment