పేపరు పైన ఆలోచించండి

Posted by జీడిపప్పు

మనము అద్భుతమయిన కాలంలో జీవిస్తున్నాము. మన లక్ష్యాలను సాధించడానికి ఇప్పుడున్న అవకాశాలు బహుశా ఎప్పుడూ లేవేమో. అదే సమయంలో ఎన్నడూ లేని విధంగా ఆ అవకాశాలను వృధా చేస్తున్నాము. మీరు కూడా మిగతా అందరిలాంటివారు అయితే, మీరు ఎన్నో పనులు చేయాలనుకున్నా తగిన సమయం లేక చేయలేకపోతుంటారు. చేతిలో ఉన్న పనులు పూర్తి చేయడానికి తంటాలు పడుతుంటే కొత్త పనులు వచ్చి పడుతుంటాయి. దీనివల్ల మీరు చేయాలనుకున్నవి అన్నీ ఎప్పటికీ పూర్తి చేయలేరు. రోజువారీ పనుల్లో కూడా వెనుకబడిపోతారు. అందుకే, చేయవలసిన పనుల్లో అత్యంత ముఖ్యమయిన పనిని ఎంచుకోవడం చాలా అవసరం.

ప్రతి రోజు ఉదయం ఒక బ్రతికి ఉన్న కప్పను తినవలసి వస్తే, ఆరోజు అంత కంటే కష్టమయిన పని మరొకటి ఉండదు అన్న భావన మీలో కలిగి మిగిలిన పనులు కష్టమయినవిగా అనిపించవు. అలాగే రెండు కప్పలను తినవలసి వస్తే అసహ్యంగా ఉన్నదాన్ని ముందు తినాలి. దీనినే మరో రకంగా చెప్పాలంటే - మీరు రెండు ముఖ్యమయిన పనులు చేయవలసి ఉంటే, పెద్దది మరియు కష్టమయినది ముందుగా ఎంచుకోండి. దీనిని ఒక సవాలుగా తీసుకోండి. సులభమయిన పని ముందుగా చేయడాలని కోరిక ఉన్నా, ఆపుకోండి. ప్రతి రోజూ మీరు చేయబోయే పనుల్లో ఏది ముఖ్యం, ఏది కష్టం అని నిర్ణయించుకోవడం పైన ఆ రోజు ఆధారపడి ఉంటుంది అని గుర్తించుకోండి.

సక్సెస్ అన్నది 95% మీ రోజువారీ అలవాట్లపైన ఆధారపడి ఉంటుంది. పనుల ప్రాముఖ్యతను నిర్ణయించడం, వాయిదా వేయకుండా ఎప్పటిపనులు అప్పుడు పూర్తి చేయడం అన్నది ప్రాక్టీస్ చేయడం వల్ల కొంత కాలానికి మీ ఆలోచనలో, విధానాల్లో భాగమయి మీ పనితీరును, జీవనశైలిని ప్రభావితం చేస్తాయి.

ఏదయినా పని మొదలుపెట్టే ముందు ఆ పని ఎందుకు చేస్తున్నారో, ఎలాంటి ఫలితం ఆశిస్తున్నారో ఆలొచించండి. స్పష్టత అన్నది చాలా ముఖ్యం. కొందరు కొన్ని పనులు తక్కువ సమయంలో నేర్పుగా ముగించడానికి ప్రధానకారణం వారికి తాము చేయబోతున్న దాని పట్ల, ఫలితం పట్ల స్పష్టత ఉండడం. వాయిదా వేయడానికిగల ప్రధాన కారణం కూడా "స్పష్టత లేకపోవడం". ఎపుడయితే స్పష్టత ఉండదో, అపుడు అంతా అయోమయంగా ఉండి పనిచేయడానికి ఉత్తేజం, ఆసక్తి ఉండవు. అందుకే "పేపరు పైన ఆలోచించండి".

కేవలం 3 శాతం మంది మాత్రమే తాము చేయాలనుకున్న పనులను, తమ లక్ష్యాలను రాసుకుంటారు. అదే వయసు, అవకాశాలు, సమయం ఉన్నవారి కంటే ఇలా తాము చేయవలసిన పనులను రాసుకొనేవాళ్ళు 5-10 రెట్లు తొందరగా పూర్తి చేస్తారు. అందుకే "పేపరు పైన వ్రాయడం" తెలివయినవారు పాటించే సులువయిన మార్గం.
సులభంగా పని పూర్తి చేయడానికి పాటించవలసినవి:

1. మీ అంతట మీరే లేదా మరొకరితో చర్చించి మీరు ఏమి చేయాలనుకుంటున్నారో, వాటి ప్రాధాన్యతలు ఏమిటో నిర్ణయించండి. ఎంతోమంది ఈ విషయం పక్కన పెట్టి చిన్న చిన్న, ప్రాధాన్యతలేని విషయాల పైన రోజుల తరబడి పని చేస్తూఉ తమ శక్తిని, తెలివితేటలను వృథా చేస్తుంటారు.
2. పేపరు పైన ఆలోచించండి. మీరు చేయాలనుకున్నవన్నీ పేపరు పైన వ్రాయండి. వ్రాయకుండా సాధించాలనుకొనేవి అలాగే కలలుగా మిగిలిపోగలవు. వ్రాయడం వల్ల ఎటువంటి అస్పష్టత ఉండదు, తప్పులు చేసే అవకాశాలు తక్కువ, సరి అయిన దిశలో వెళ్ళడం సులభమవుతుంది.
3. గడువు పెట్టుకోకుండా నిర్ణయించినవి ముందుకు కదలవు. అందుకే మీరు సాధించాలనుకున్న వాటిని ఒక గడువులోగా పూర్తి చేయాలని ఆ గడువును పేపరు పైన వ్రాయండి.
4. మీరు లక్ష్యాన్ని అందుకోవడానికి చేయవలసిన పనులు అన్నీ వ్రాయండి. అది ఎంత చిన్నదయినా సరే తప్పక వ్రాయాలి. ఎపుడయితే అలా రాస్తారో మీరు చేయవలసిన పనులన్నీ మీ కళ్ళ ముందు కదలాడుతాయి. చేయవలసిన పనులను పేపరు పైన చేతితో స్పృశించగలడం దాదాపు సగం విజయం సాధించడంతో సమానం.
5. ఏ పని ముందు ఏ పని చేయాలి, మొదట ఏ పని చేయాలి - చివర ఏ పని చేయాలి ఆలోచించి నంబర్లు వేసి ఆ పనులను ఒక క్రమంలో అమర్చండి.
6. మీ ప్రణాళికను వెంటనే అమలు పరచండి. అమలు పరచని అద్భుత ప్రణాళిక కంటే అమలు పరిచే మామూలు ప్రణాళికే వేల రెట్లు మేలు అని మరువకండి.
7. మీ లక్ష్యాన్ని సాధించడానికి ప్రతిరోజూ ఏదో ఒక అడ్డంకిని అధిగమించండి. ప్రతి రోజూ 2-3 నిమిషాలు క్రితం రోజు మీరు ఏమి సాధించారో, ఈ రోజు చేయవలసిన పనులేమిటో ఆలోచించండి.

(ఇది Eat That Frog పుస్తకం నుండి రాసుకున్న నోట్సు)

3 comments:

  1. చిలమకూరు విజయమోహన్ said...

    చాలా బాగున్నాయి మీరు చెప్పినవి.

  2. నేస్తం said...

    :) nice post

  3. Anonymous said...

    Chala Bagundandi mee post

Post a Comment