గుడికి వెళ్ళలేకపోవడం తప్పా?

Posted by జీడిపప్పు

నిన్న జ్యోతిగారి బ్లాగులో తప్పా... ఒప్పా.... కాస్త చెప్పరూ??? చూసినపుడు ఒకప్పుడు నాకు కూడా ఇలాంటి సందేహమే వచ్చిన సంగతి గుర్తుకొచ్చింది. రోజువారీ పనులతో సతమతమవుతూ గుడికి వెళ్ళలేకపోవడం వల్ల  తప్పు చేస్తున్నామేమో అనే భావన కలగడం సహజం, ముఖ్యంగా దేవుడిని బాగా నమ్మేవారిలో. ఈ పోస్టు ప్రధానంగా గుడికి వెళ్ళలేని దేవుడిని నమ్మే వాళ్ళకోసమే కానీ గుడికి వెళ్ళే వాళ్ళను "గుడికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి?" అని ప్రశ్నించడానికి కాదు.

ముందుగా ఒక కథ: (ఇలా ముందుగా కథ చెప్పడం అన్నది అమ్మఒడి బ్లాగునుండి దొంగిలించిన ఆలోచన!!)

ఒకసారి పరీక్షిత్తు మహరాజుకు ఒక అనుమానం వచ్చింది. ఏమిటంటే, తానెన్నో దాన ధర్మాలు చేసాడు, దేవాలయాలు కట్టించాడు, క్రమం తప్పకుండా పూజలు చేయించాడు. కాబట్టి తన రాజ్యంలోకెల్లా తానే అందరి కంటే గొప్పవాడు, దేవతలందరికీ తానే అత్యంత ప్రీతిపాత్రుడు. ఇదే ఆలోచనను తన గురువుకు చెప్పాడు. ఆయన చిరునవ్వి నవ్వి "లేదు నాయనా నీకంటే గొప్పవాడు, దేవతలకు ప్రియమయినవాడు ఒకడున్నాడు" అన్నాడు.

పరీక్షిత్తు మహరాజు ఆశ్చర్యపోయి "ఎవరు గురుదేవా అతడు, నాకంటే ఎక్కువ దానధర్మాలు చేసాడా, నాకంటే ఎక్కువ దేవాలయాలు కట్టించాడా" అన్నాడు. గురువు పరీక్షిత్తును వెంటబెట్టుకొని చర్మగ్రంథుడు అను పేరుగల ఆ గొప్ప వ్యక్తి ఉన్న చోటుకు తీసుకెళ్ళాడు. అతడు ఒక  ఊరి అవతల చిన్న ఇంట్లో నివశిస్తున్నాడు. దూరం నుండి రాజు, గురువు అతడు చేస్తున్నది చూడసాగారు.

చర్మగ్రంథుడు ఇంటినుండి బయటకు వచ్చి పక్కనే ఉన్న కొటంలో కట్టివేయబడిన గోవును తీసుకెళ్ళి, దానిని చంపి, చర్మాన్ని వేరు చేసి శుభ్రంగా కడిగి ఎండలో పెట్టి ఇంటికి వచ్చాడు.

ఇది చూసిన పరీక్షిత్తు మహరాజు "గురువర్యా, ఇతడు పాపి. పరమ పవిత్రమయిన గోవును హత్యను చేస్తున్నాడు. ఇతడా గొప్పవాడు" అన్నాడు విస్మయంతో. గురుదేవులు "మహారాజా మీరే అడగండి అతడిని" అని అతడి దగ్గరకు తీసుకెళ్ళారు. మహారాజు అడుగగా చర్మగ్రంథుడు "మహారాజా, నా తండ్రి ఇదే పని చేసేవాడు. నాకు ఇదే పని నేర్పించాడు. ప్రతి రోజూ కబేళాకు వచ్చిన గోవులను చంపి ఆ చర్మాన్ని వేరుచేసి పాదరక్షలు చేసేవారికి ఇవ్వడమే నా వృత్తి" అన్నాడు.

గురుదేవులు చర్మగ్రంథుడికి నమస్కరించి వెనుతిరిగారు. "మహారాజా చూసారా, అతడు ఎంత గొప్పవాడో. తన విధిని తాను నిర్వర్తిస్తున్నాడు. మీ రాజ్యపాలనలో పొరపాట్లున్నాయి కానీ, అతడు ఒక్క రోజు కూడా తాను చేయవలసిన పనిలో ఎటువంటి పొరపాటు చేయలేదు. తాను యే పని చేయడానికి నియమింపబడ్డాడో ఆ పనిని సక్రమంగా నిర్వహించేవాడే మహోన్నతుడు, దేవతలకు అత్యంత ప్రీతిపాత్రుడు" అన్నాడు.

ఇది కథ.

కాబట్టి, గుడికి వెళ్ళలేకపోయినంత మాత్రాన చింతించవలసిన అవసరం లేదు. మన ధర్మాన్ని/ duty ని సరిగా చేస్తుంటే ఆ దేవుడే మన దగ్గరకు వస్తాడు. రోజంతా మనము చేయవలసిన పనులు సక్రమంగా చేసి పడుకోబోయే ముందు "దేవుడా, నేను చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. అవి అయిన తర్వాతే నీ గుడికి వస్తాను. అంతవరకు ఇంట్లో ఒక నిమిషమో అరనిమిషమో నీ ఫోటోకు మొక్కగలను" అనుకొంటే చాలు.

ఇక గుడికి వెళ్ళడం - ఇది మన తృప్తి కోసమే. ఇంట్లో ఉన్న దేవుడే అక్కడా ఉంటాడు.  మన ప్రముఖ దేవాలయాలు అవినీతికి ఆలయాలు. గంటల సమయాన్ని వెచ్చించి వెళ్ళి, ఆ అవినీతిని చూసి "ఎందుకు వచ్చామురా దేవుడా" అనుకొనే బదులు ఇంట్లోనే ఒక్క నిమిషం మొక్కితే చాలు.

అన్నట్టు -  "వెయ్యి గుళ్ళ చుట్టూ వందేసి ప్రదక్షిణలు చేయడం కంటే ఒకరి ఆకలి తీరిస్తే ఇంకా ఎక్కువ పుణ్యం వస్తుందని" ఎవరో అన్నారు!!

13 comments:

 1. నేస్తం said...

  baagaa cheppaaru

 2. sobha said...

  మీరు అన్నది బానే ఉన్నది.. ఇంట్లో దణ్ణం పెట్టుకుంటే సరిపోతుంది .
  కాని గుడిలో ప్రతిష్టించే విగ్రహము కింద యంత్రము ఉంటుంది..అది చాలా గొప్పది.
  మరియు గుడికి వచేవాళ్ళు ఎలాంటివాళ్ళు అయిన వాళ్లు గుడిలో ఉన్నంతసేపు ఎక్కువగా మంచి ఆలోచనలతోనే ఉంటారు.మరియు కొంతమంది మంత్రోచారణ చేస్తూ ఉంటారు...ఇంక అనేకానేక కారణాల వల్ల గుడి వాతావరణంలో ఎక్కువగా positve ఎనర్జీ ఉంటుంది. కాసేపు ధ్యానము చేసుకుని ఎనర్జి మనము పొందవచ్చు. ఇదే నండి గుడికి ఇంటికి తేడా....
  మీరు అన్నట్టు మనకు వెళ్ళటానికి వీలు కానప్పుడు ఇంట్లో నే పెట్టుకుంటాము....
  దేవుడు ఎక్కడిన ఒకరే ...కాని ఇంట్లో కన్నా గుడిలోనే మన మనసు ప్రశాంతము గ వుంటుంది.

 3. durgeswara said...

  గుడికి వెళ్ళాలనే నియమము పెట్టటానికి చాలా కారణాలున్నాయి.అంతమాత్రము చేత గుడికివెళ్లకపోతే తప్పు అని ఎవరూ అనరు. ఇక పురాణ పురుషులతో అందరమూ పోల్చుకోకూడదు. వారిలాంటి ధర్మనిష్టకలవారుతప్ప. మీలాంటి వారు కూడా కొద్దిగా సత్యాన్నుంచి పక్కకుతొలగి వ్రాస్తుండటము అనర్ధాలకు దారి తీస్తున్నది.గుడికి వెళ్ల లేకపోవటము మీ వ్యక్తిగత సమస్య.అక్కడ జరిగే కొన్ని పొరపాట్లు సామాజిక సమస్య.వాటిని దిద్దుకోకుంటే వచ్చే పాపములో మనకూ వాటావుంటుంది.అది అన్ని చోట్ల లోపాలున్నయనేలా వ్యాఖ్యానము చేయటము భక్తుల మనసులను కల్లోల పరచటమే. ఇలాంటివి మీరు గమనించాలి.దీనివలన ఏమి జరగబోతున్నదో మీరు కొంచెము దూరం ఆలోచించి చూడండి.మరలా ఇక్కడకొచ్చే తీరిక నాకుండదు. ఏదైనా మీ అభిప్రాయం నాకు మైల్ చేయండి

 4. భవాని said...

  మంచి టపా

 5. Anonymous said...

  jyothi rasina post swathi patrika lo jagjeevan swamy gaariche raayinche upanyasalu meeru swathi follow avandi. sandehalaku samaadhaanalu :)

 6. మార్తాండ said...

  శోభ గారు వ్రాసారు:
  >>మరియు గుడికి వచేవాళ్ళు ఎలాంటివాళ్ళు అయిన వాళ్లు గుడిలో ఉన్నంతసేపు ఎక్కువగా మంచి ఆలోచనలతోనే ఉంటారు.>>
  బయటి వచ్చిన తరువాత ఎన్ని నీతిలేని పనులైనా చెయ్యగలరు ఈ మత భక్తులు. అయ్యప్ప భక్తులు కూడా అంతే, నలభై రోజుల దీక్ష సమయంలో మందు, మాంసం ముట్టుకోరు కానీ దీక్ష పూర్తైన తరువాత బాగా మంసం భుక్కి ఫుల్ గా మందు కొట్టి వ్యభిచారం కూడా చేస్తారు. నీతీగా బతకాలని నిజంగా చిత్తశుద్ధి ఉండాలి కానీ గుడి పేరో మస్జీద్ పేరో చెప్పుకుని ఎవర్ని సంతృప్తి పరచగలం?

 7. చైతన్య said...

  మీరు చెప్పిన కథ సంగతి ఏమో కానీ... చివర్లో చెప్పిన మాట మత్రం అక్షరాల నిజం... నేను కూడా అది నమ్ముతాను.

 8. నరహరి said...

  meeru cheppina katha kaushikudu-dharmavyadhuni kathanu pOli undi....

 9. arunank said...

  "వెయ్యి గుళ్ళ చుట్టూ వందేసి ప్రదక్షిణలు చేయడం కంటే ఒకరి ఆకలి తీరిస్తే ఇంకా ఎక్కువ పుణ్యం వస్తుందని"
  నేను నమ్ముతాను.

 10. ...Padmarpita... said...

  నిజమేనండి.... ప్రార్ధించే పెదవులకన్న,సహాయము చేసే చేతులు మిన్న.

 11. suresham said...

  "వెయ్యి గుళ్ళ చుట్టూ వందేసి ప్రదక్షిణలు చేయడం కంటే ఒకరి ఆకలి తీరిస్తే ఇంకా ఎక్కువ పుణ్యం వస్తుందని" చాలా బాగ గుర్ఠు చేసారు. అది నేను నమ్ముతాను.

 12. పరిమళం said...

  "ఈ పోస్టు ప్రధానంగా గుడికి వెళ్ళలేని దేవుడిని నమ్మే వాళ్ళకోసమే కానీ గుడికి వెళ్ళే వాళ్ళను "గుడికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి?" అని ప్రశ్నించడానికి కాదు."అని ముందే చెప్పారు కనుక మీరుచేప్పిన కధ సందర్భోచితంగా ఉంది .గుడికి వెళ్ళటం మంచిదే ,వెళ్లలేనివారు అదేదో పాపమన్న భ్రమను వదిలి తోటివారికి తోచిన సహాయం చేయటం లో సంతృప్తి పొంద వచ్చు .మానవ సేవ మాధవ సేవేనన్నది నిర్వివాదాంశం .

 13. Anonymous said...

  Aruna Garu,
  Okkari akali theerchadam kanna.......inka oka adugu mundhuku vesi aakali theerchey margam chupisthee inka baga untundhi naaa abhiprayam ..emantaaru?

Post a Comment