కోతులు - టోపీలవాడు

Posted by జీడిపప్పు

అనగనగా ఒక  టోపీలమ్మేవాడు ఉండేవాడు. ఊరురికి వెళ్ళి టోపీలు అమ్ముకొంటూ పొట్ట నింపుకొనేవాడు. ఒక రోజు మధ్యాహ్నం ఒక ఊరి నుండి ఇంకొక వూరికి వెళ్తూ అలసిపోయి తన టోపీల మూటను పక్కన పెట్టి ఒక చెట్టుకింద పడుకొని నిద్రపోయాడు. సాయంత్రం అతడు నిద్ర లేచి చూస్తే పక్కన తన టోపీల మూట ఖాళీగా కనిపించింది. టోపీలు అన్నీ ఎలా మాయయ్యాయి అని ఆలోచిస్తుండగా కిచ కిచమని శబ్దాలు వినపడ్డాయి.

తల ఎత్తి చూస్తే ఆ చెట్టు పైన ఉన్న కోతులన్నీ టోపీలతో ఆడుకుంటున్నాయి. జరిగినది గ్రహించిన ఆ టోపీలవాడు తెలివిగా ఆలోచించి,  గంతులు వెయ్యడం మొదలుపెట్టాడు.  అది చూసిన కోతులు కూడా గంతులు వేసాయి. టోపీలవాడు పల్టీలు కొట్టాడు, కోతులు కూడా పల్టీలు కొట్టాయి. తన టోపీల మూటను విప్పి చెట్టు కింద పరచి తన తల పైన ఉన్న టోపీ తీసి ఆ మూటకేసి విసిరి కొట్టాడు. కోతులు కూడా టోపీలను మూట కేసి విసిరి కొట్టాయి. టోపీలవాడు గబగబా మూట కట్టుకొని వెళ్ళిపోయాడు.

నీతి: అవతలివాళ్ళకు తెలివితక్కువ అని తెలిస్తే మన తెలివితో సులభంగా విజయం సాధించవచ్చు.

రెండు తరాలు మారాయి. ఆ టోపీలవాడి మనవడు టోపీల వ్యాపారం మొదలు పెట్టాడు. ఓ చెట్టుకింద పడుకొని నిద్రపోయి లేచి చూస్తే టోపీలన్నీ చెట్టు పైన ఉన్న కోతుల చేతుల్లో ఉన్నాయి. తన తాతయ్య చెప్పింది గుర్తు తెచ్చుకొని గంతులేసాడు, కోతులు కూడా గంతులేశాయి. పల్టీలు కొట్టాడు, కోతులు కూడా పల్టీలు కొట్టాయి. తన తల పైన ఉన్న టోపీ తీసి నేలకేసి కొట్టాడు.

ఒక పిల్ల కోతి చెట్టు పైనుండి చటుక్కున దుంకి ఆ టోపీని కూడా తీసుకొని చెట్టెక్కబోతూ వెనక్కి తిరిగి ఇలా అన్నది:  "నీకు ఒక్కడికే తాత ఉన్నాడు అనుకున్నావా?"

నీతి: ..... ....  .... ??

9 comments:

  1. amma odi said...

    జీడిపప్పు గారూ,

    కథ, అందులోని నీతి అదిరింది.

  2. Rani said...

    కథ బావుంది :)

  3. krishna rao jallipalli said...

    ఈ extension జోక్ ఎప్పుడో చదివిందే. అయినా మీరు మరలా గుర్తు చేసినందుకు అబినందనలు.

  4. Chari Dingari said...

    ఇది చిరునవ్వుతో సినిమా లో ఉంది ....త్రివిక్రం

  5. కన్నగాడు said...

    ఇలాంటిదే ఇంకోటి నేను విన్నాను, కుందేలు తాబేలు పరుగు పందెం కథ అందరికీ తెలుసు కదా. ఓడిపోయిన కుందేలు తన తెలివి తక్కువ తనానికి బాధపడి ఎలాగైనా గెలవాలని మళ్ళీ పందెం వేసిందట, అయితే ఈ సారి తాబేలు వేరే గమ్యాన్ని సూచించగా కుందేలు సరేనంది. అయితే ఆ మార్గంలో ఒక చెఱువు ఉండడంతో తాబేలే మాళ్ళీ గెలిచింది. ముచ్చటగా మూడోసారి మళ్ళీ పరుగు పందెం అదే మార్గంలో ఈ సారి కుందేలు తాబేలు పరస్పరం సహకరించుకొని భుమ్మీద కుందేలుపై తాబేలు, నీటిలో తాబేలుపై కుందేలు కూర్చొని ఎప్పటికన్నా తొందరగా గమ్యాన్ని చేరుకున్నాయి.

    ఇది నేను ఆంత్రప్రెన్యూర్ (entrepreneur) వర్క్‌షాప్ కి వెల్లినప్పుడు కలిసి పనిచేయడం గూర్చి చెప్పిన పిట్ట కథ.

  6. సూర్యుడు said...

    నీతి: అవతలివాళ్ళకు తెలివితక్కువ అని తెలిస్తే మన తెలివితో సులభంగా విజయం సాధించవచ్చు.

    నీతి: ..... .... .... ??
    తెలివితేటలు ఎల్లప్పుడూ ఒకరి సొత్తు కాదు :)

  7. పరిమళం said...

    :) :)

  8. చైతన్య said...

    ఈ కథ నేను ఇంతకూ ముందు ఎక్కడో చదివానండి... భలే ఉంటుంది :)

  9. శ్రీనివాస్ పప్పు said...

    కథ చదివినదే అయినా దాన్లోని నీతి మాత్రం కొన్ని తరాలకి సరిపోయేది,బాగా గుర్తు చేసారు..

Post a Comment