శభాష్ శ్రీలంక

Posted by జీడిపప్పు

క్రికెట్‌లో  టీం ఇండియా అదరగొట్టి శ్రీలంకను చిత్తు చేసి సిరీస్ గెల్చుకొంది, అది కూడా చాలా ఏళ్ళ తర్వాత. మన చేతిలో దారుణంగా ఓడిపోయిన శ్రీలంకను "శభాష్" అనడమేమిటా అనుకుంటున్నారా? అవును, శ్రీలంకను శభాష్ అని అందరూ అనాలి. శ్రీలంకలో జరుగుతున్న పరిణామాలు అలా ఉన్నాయి మరి.

మీది పెద్ద కుటుంబం, పెద్ద ఇల్లు. తెలిసిన దూరపుచుట్టం ఉద్యోగం కోసం వచ్చాడు. పోనీలే అని ఒక రూం ఇచ్చారు. కొద్దిరోజులకు తన పెళ్ళాన్ని, పిల్లలను తెచ్చుకున్నాడు. పోనీలే పాపం మనకు సాయంగా ఉంటారు కదా అని ఉండనిచ్చారు. మీ పిల్లలు వేసుకున్న బట్టలే వాళ్ళ పిల్లలకూ ఇవ్వాలనుకోలేదు మీరు. తప్పో ఒప్పో వాళ్ళను కాస్త చిన్న చూపు చూసారు. నెమ్మదిగా వాళ్ళలో స్వతంత్ర భావాలు పెరిగాయి. మీ ఇంట్లో ఉంటూనే మీ పట్ల ద్వేషం పెంచుకున్నారు. మీ ఇంట్లో ఉన్న రెండు రూములు పూర్తిగా తమకే ఇచ్చేయాలి అన్నారు. మీరు ఇచ్చేస్తారా అపుడు? మీరు రెండు రూములు ఇచ్చిన తర్వాత ఇంకో రూము కావాలంటే ఏమి చేస్తారు?

సరిగ్గా ఇదే జరుగుతున్నది శ్రీలంకలో. దశాబ్దాల క్రితం/నుండి తమిళులను చిన్న చూసిన/చూస్తున్న మాట నిజం. కానీ దాన్ని ప్రతిఘటించడానికి వాళ్ళు ఎన్నుకున్న మార్గమేమిటి? సాయుధపోరాటం. అదీ ఒక దేశ సైన్యంతో. మన దేశంలో ఉన్నట్టే అక్కడా నీచ రాజకీయనాయకులున్నారు. వాళ్ళ పుణ్యమా అని LTTE ఆవిర్భవించి మహాశక్తిగా ఎదిగింది. ఎన్నో దాడులకు సిద్దపడింది. శ్రీలంకలో శాంతి స్థాపన కోసం సైన్యాన్ని పంపినందుకు ప్రతీకారంగా రాజీవ్ గాంధీని హతమార్చింది. LTTE ని కొద్దికాలం పోషించిన ప్రేమదాసనూ హతమార్చింది. తమిళులకు స్వతంత్ర దేశం కావాలన్న స్థాయికి వచ్చింది. ఆగడాలు మితిమీరడంతో ప్రస్తుత అధ్యక్షుడయిన రాజపక్సె పెద్ద ఎత్తున సైనిక చర్యలు మొదలు పెట్టాడు.

కనివిని ఎరుగని రీతిలో సైన్యం పోరాడుతున్నది. సముద్రంలో ఉన్న తీవ్రవాదుల స్థావరాలను నాశనం చేస్తున్నాయి. విదేశాలనుండి ఆయుధాలు రాకుండా అడ్డుకుంటున్నాయి. LTTE ఆధీనంలో ఉన్న ఊళ్ళకు ఊళ్ళు ఖాళీ అయ్యాయి. LTTE దట్టమయిన అడవుల్లోకి లక్షల మంది ప్రజలను తీసుకొని వెళ్ళారు, వారిని రకషణ కవచాలుగా వాడుకుంటున్నారు. వారి క్షేమం ముఖ్యం అంటూ మన తమిళనాడులోని తమిళులు ఆందోళన చేస్తున్నారు. మొన్న తమిళనాడులో కొన్ని చోట్ల రిపబ్లిక్ డే కూడా బహిష్కరించారు!!

నిజానికి ఆ అడవుల్లోకి వెళ్ళిన వారిలో సగం మందికి పైగా తమంతటతాము వెళ్ళినవారే. తాము ఉంటున్న దేశం పట్ల వ్యతిరేకతను విషంలా ఎక్కించుకున్న తమిళులే ఎక్కువ ఉన్నారు. వారిని రక్షణ కవచంగా పెట్టుకొంటున్న LTTE ఆటలు ఎక్కువ కాలం సాగకపోవచ్చు. సేఫ్ జోన్ లొ లేని వాళ్ళ క్షేమం తమ బాధ్యత కాదని చెప్పి, సైన్యం దాడులు చేస్తూనే ఉంది. ఈ దాడిలో కొందరు అమాయకులు మరణించవచ్చు. కానీ దశాబ్దాలుగా పెరిగిన తీవ్రవాదం అంతం కావడానికి ఇలాంటివి జరుగక తప్పదు.

ఏది ఏమయినప్పటికి ఒత్తిళ్ళకు లొంగకుండా తీవ్రవాదులను తరిమి కొట్టి వారి అంతు చూస్తున్న శ్రీలంకను "శభాష్" అనాలి. అక్కడ జరుగుతున్నదాన్ని చూసి తమిళనాడులో జరుగుతున్న ఆందోళనలు ఎక్కువ అవుతున్నాయి. శ్రీలంక నుండి వచ్చే తీవ్రవాదులకు తమిళులు ఎర్ర తివాచీ పరచి స్వాగతం చెపుతున్నారు.  శ్రీలంక సైన్యాన్ని భారతదేశం ఆపలేదన్న కోపంతో ఇక్కడ కూడా ఆత్మాహుతి దాడులు జరుగుతాయా? తమిళనాడు మరో తీవ్రవాద కేంద్రం అవుతుందా అన్న సంగతి కాలమే నిర్ణయిస్తుంది.

15 comments:

  1. అశోక్ చౌదరి said...

    చాల బాగా చెప్పారు జీడిపప్పు గారు.. కాని టపా రాసేముందు ఒక సరి అసలు LTTE ఎలా పుట్టిందనేది తెలుసుకోండి.. ఈ రోజుకీ శ్రీలంక లో తమిళులు ద్వితీయ శ్రేణి పౌరులు. వారికి మిగత వారిలాగా ఎలాంటి హక్కులు వుండవత.. ఎంత దారుణం.. ?? Just because of their race how can they treated as the 2nd grade people..
    నేను కూడా మొదట్లో LTTE, ISI లాగా terrorist activities చేస్తూ వుంటుంది అనుకున్నా..I didnt understood why tamilians supporting.. కాని అసలు కదా మొత్తం చదివాకా తెలిసింది.. శ్రీలంక చేస్తుంది తప్పు.. దాన్ని ఎదుర్కోవటానికి LTTE చేస్తుంది కూడా తప్పేయ్.. తమిళులు సాయుధ మార్గం కాకుండా శాంతి పోరాటం చేయవలసింది.. ..
    సమస్య పరిష్కార మార్గానికి ఇద్దరు ఎంచుకున్న దారులు తప్పు.. అందుకు అమాయకులు బలి అవుతున్నారు..
    ఇలాగ వ్రాస్తున్నానని నేను ఏదో LTTE సానుభూతి పరుదుని అనుకోకండి.. ఒక సరి మొత్తం ఇష్యూ గురించి చదవండి మీకీ అర్ధం అవుతంది...

  2. Anonymous said...

    ఎ.కె.47 పట్టుకున్న వాళ్ళందరూ ఉగ్రవాదులని నమ్మేసే అమాయకులున్నారు.

  3. Anonymous said...

    శ్రీలంకలో తమిళుల విషయం నాకూ పూర్తిగా తెలియదు..ఎప్పటి నుండొ ఎవరన్నా ఈ విషయం మీద సమాచారం రాస్తారని చూస్తున్నా :)

  4. Anonymous said...

    LTTE ఆవిర్భావం గురించి కానీ, తమిళులు ఎందుకు అంత support చేస్తున్నరు అనికాని ఏమాత్రం home work చేయకుండా వ్రాసినట్లు ఉన్నారు. ఒక్కసారి,మొత్తం చరిత్రను చదివి ఇంకో సారి వ్రాయండి. LTTE వాళ్లు పట్టిన బాట మాత్రం తప్పే అనుకొనేవాళ్లలో నేనూ ఒకడినే. ఇక మీ article లో లోపాలు.

    1. సరిగ్గా ఇదే జరుగుతున్నది శ్రీలంకలో. దశాబ్దాల క్రితం/నుండి తమిళులను చిన్న చూసిన/చూస్తున్న మాట నిజం అన్నారు.
    ఆ చిన్న చూపు ఎమిటొ తెలుసుకొన్నారా? కనీసం internet లో చదివారా?
    2. శ్రీలంకలో శాంతి స్థాపన కోసం సైన్యాన్ని పంపినందుకు ప్రతీకారంగా రాజీవ్ గాంధీని హతమార్చింది.
    అసలు ఆ peace agreement ప్రభాకరన్ ఏ conditions లో సంతకాలు పెట్టాడో తెలుసుకొన్నరా? సరే శాంతి కొసం వెళ్లిన భారత సైన్యం అలాగే ప్రవర్తించింది అనుకొంటున్నరా? అది ఇద్దరి మద్య మద్యవర్తి గా వెళ్లి, ఎందుకు ఒక side తీసుకొంది, అలా తీసుకోవటం వలన ఏమి జరిగిందో గమనించారా? ముక్యం గా, రాజకీయ నాయకులు అంటున్నారు, ఆ రాజకీయ నాయకులు అప్పట్లో సైన్యం చేతులు ఎలా కట్టేసారో, అల్ల చేతులు కట్టటం వలన వచ్చిన frustration(s) తో మన సైన్యం ఎలా ప్రవర్తించిదో ఒక్క సారి చదవండి.
    3. అదీ ఒక దేశ సైన్యంతో అన్నారు.
    దేశ సైన్యంతో వాళ్లు దశాబ్దాలుగా పోరాడుతున్నారు. కాకపోతే ఇప్పుడే సైన్యానికి పైచేయి sudden గా ఎందుకు అయ్యిందో ఆలోచించారా?

    నేనేదో LTTE కో, ఉగ్రవాదులకో సానుభూతి పరుడనయ్యి ఇలా రాయటం లేదు. బగా వ్రాయగలిగిన మీరు బ్లాగ్ లో, వ్రాసేటప్పుడు, మొత్తం విషయం చదివి వ్రస్తే ఇంకా బాగుండేదేమో , అలోచించుకోండి.

  5. జీడిపప్పు said...

    @మార్తాండ గారు - ప్రపంచవ్యాప్తంగా ban చేయబడిన వాటిని ఉగ్రవాద సంస్థలు అనుకుంటున్నా. నక్సల్స్ ను ఏరి పారేసిన్నట్టు LTTE ని కూడా ఏరిపారవేయాలి.
    @అశోక్ గారు , @ Anonymous గారు - "తప్పో ఒప్పో వాళ్ళను కాస్త చిన్న చూపు చూసారు." " మన దేశంలో ఉన్నట్టే అక్కడా నీచ రాజకీయనాయకులున్నారు." అని స్పష్టంగా చెప్పాను. ఎంత అణగదొక్కబడుతున్నా దానికి సాయుధపోరాటం మార్గం కాదు. దక్షిణాఫ్రికాలో మండేలా, భారత్‌లో గాంధీజీ, అమెరికాలో MLK ల కంటే గొప్ప విజయాలు ఎవరయినా సాధించారా? వారు LTTE తీవ్రవాదులు చంపినట్లు మంత్రులను, భారత మాజీ ప్రధానిని, ఒక దేశ అధ్యక్షుడిని, వందలమంది నాయకులను హతమార్చారా? LTTE ఎంచుకున్న మార్గం తప్పు. అందుకు తగిన ఫలితం అనుభవించాలి.

  6. Anonymous said...

    గాంధీ బ్రిటిష్ వాళ్ళ ఏజెంట్ అని ఇప్పటి గాంధేయవాదులకి తెలియదు. గాంధీని విమర్శిస్తూ వ్రాసిన కొన్ని పుస్తకాల్ని ఇండియాలో నిషేదించారు. బ్రిటిష్ వాళ్ళు భగత్ సింగ్ ని ఉరితీసినప్పుడు గాంధీ బ్రిటిష్ వాళ్ళని సమర్థించాడని వ్రాసినందుకు.

  7. జీడిపప్పు said...

    "గాంధీ బ్రిటిష్ వాళ్ళ ఏజెంట్"
    అవునా? చాలా ఆసక్తిగా ఉంది. ఓ పోస్టు వేయగలరా వివరాలు తెలుపుతూ?

  8. దైవానిక said...

    జీడిపప్పు గారు, మీకు ఇక్కడో సిద్దాంతం చెప్పాలి. తెల్లవాళ్ళ సిద్ధాంతం ప్రకారం, దక్షిణ భారత దేశీయులే అసలు భారతీయులు. ఉత్తర భారతీయులు వలస వచ్చిన వాళ్ళు. అందుకని మీ లాజిక్కు ప్రకారం వాళ్ళందరిని వెళ్ళగొట్టాలన్నమాట. ఎవడో పనిలేని వాడు ఏదో సిద్దాంతం చెబితే, అన్ని నమ్మేసి అసలు వాళ్ళని వెల్లగొట్టేయడం ఎంతవరకు సబబు. అసలు LTTE వాళ్ళు సాయుధ పోరాటం ఎప్పుడూ ఎందుకు ముదలెట్టారో మీకు తెలుసా??
    ఇంకో సిద్దాంతం ప్రకారం సింహలీలు కూడా వలస వచ్చినవాళ్ళే అని తెలుసా.
    ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం,
    నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం -- శ్రీ శ్రీ

    అసలు ప్రపంచంలో చంపుకోడానికి, యుద్దాలు చేయడానికి రీజన్, లాజిక్క్ అవసరమే లేదు. వెతికితే మనకి కూడా చాలా కారణాలు కనబడతాయి. కనపడ్డాయి కదా అని యుద్ధం చేయడం మూర్ఖత్వం.

  9. Kathi Mahesh Kumar said...

    ప్రతి ఉగ్రవాదీ తాను ఎవరికోసం పోరాడుతున్నాడో వారికి విప్లవకారుడే...మనం ఎటువైపున్నాం అనేదానిబట్టి ఈ అర్థం మారుతుంది. ఎంత మంది అధికారం గలవాళ్ళు దాన్ని సర్ధిస్తారు అన్నదాన్నిబట్టి దాని నిర్వచనమే మారుతుంది. మీరు ఈ విషయాన్ని చాలా simplistic గా చూసినట్లు అనిపిస్తోంది.

  10. చైతన్య said...

    ఇప్పటికి ఉన్న తీవ్రవాద సంస్థలు చాలవనా మనకి (మన దేశంలో) ఇంకో తమిళ తీవ్రవాద సంస్థ పుట్టటం!
    LTTI దేని గురించి పుట్టిందో నాకు తెలిదు... కానీ అది ఎంత మంచి విషయం కోసమైనా సాయుధ మార్గం ఎన్నుకోవటం మాత్రం తప్పు (నా దృష్టిలో)... అంతమంది రాజకీయ నాయకులని, అమాయకులని చంపటం వలన, వీళ్ళూ చనిపోవటం వలన ఏం సాధించారు / సాధిస్తున్నారు?
    ప్రాతీయాభిమానం, భాషాభిమానం ఉండొచ్చు... కాని మన భాషవాడు, మన ప్రాంత వాడు తప్పు చేసిన అది ఒప్పే అని సమర్ధించే ఆలోచనరీతి మారాలి. కొందరు రాజకీయ నాయకుల లాభం కోసం పుట్టించిన ఇటువంటి తప్పుడు సంస్కృతి నుండి జనం ఇప్పటికైనా బయటపడటానికి ప్రయత్నించాలి.
    త్వరలోనే శ్రీలంక లో శాంతి పావురం ఎగురుతుందని / ఎగరాలని ఆశిస్తున్నాను.

  11. జీడిపప్పు said...

    @ దైవానిక గారు - తరిమివేయడం గురించి కాదు చెబుతున్నది. "ఆత్మాహుతి దళాలతో హత్యలు చేస్తున్న తీవ్రవాదులును ఏరివేయాలి" అని
    @కత్తి మహేష్ కుమార్ గారు - శ్రీలంకలో తీవ్రవాదులు మేయర్ నుండి అధ్యక్షుడి వరకు హత్యలు చేస్తూ ఒక దేశ సార్వభౌమత్వాన్ని సవాల్ చేస్తున్నారు !
    @చైతన్య గారు - నేను కూడా సరిగ్గా అదే అనుకుంటున్నాను :)

  12. సుజాత వేల్పూరి said...

    మార్తాండ గారు, ఆసక్తికరంగా ఉంది.

    భగత్ సింగ్ ఉరిని గాంధీ సమర్ధించాడని ఆయన మీద వ్యతిరేకత ఉన్న మాట నిజమే! ఆయన బ్రిటిష్ ఏజెంట్ అన్న విషయాన్ని వివరిస్తూ ఒక పోస్టు మీ బ్లాగులో రాస్తే బాగుంటుంది. ఇక్కడ వివరించినా సరే!అన్నట్లు మీ బ్లాగులో కామెంట్స్ మామూలు పద్ధతిలో పెట్టలేమా? ఒకసారి చూడండి దాని సంగతి!

  13. Anonymous said...

    శ్రీలంక సైన్యం తమిళ స్త్రీలని రేప్ చెయ్యడం గురించి ఈ సో కాల్డ్ శాంతి కాముకులకి చీమ కుట్టినట్టైనా అనుపించదా? రాజీవ్ గాంధీ పంపిన శాంతి సేనలు తమిళ స్త్రీలతో పాటు సింహళ స్త్రీలని కూడా రేప్ చేశాయి. మానవ హక్కుల వార్తలు చదివితే ఈ వివరాలన్ని తెలుస్తాయి.

  14. చైతన్య said...

    @మార్తాండ గారు
    ఎదుటి వాడు తప్పు చేసాడని మనమూ చేస్తామా? అలా చేస్తే వాడికి మనకి ఏంటి తేడా?
    వాళ్ళు చేసింది తప్పే.. వీళ్ళు చేసేదీ తప్పే. ఒక తప్పు కి మరో తప్పు సమాధానం కాకూడదు అని నేను అనుకుంటున్నాను.

  15. Anonymous said...

    ఫ్రపంచములొ గొప్పవారు రెండు రకాలు. ఓకరు సహజంగా గొప్ప పనులు చేసేవారు. రెండవవారు వారిని విమర్సించేవారు.

Post a Comment