కాఫీ కప్పు
Posted by జీడిపప్పు
కాఫీ కప్పుల్లో కొన్ని సాధారణమయినవి, పాతవి, కొత్తవి, మంచి డిజైన్ తో ఆకర్షణీయంగా ఉన్నవి ఉన్నాయి. అందరి ముందు పెట్టి కాఫీ తీసుకోమన్నాడు. అందరూ ఒక్కో కప్పు తీసుకొని కాఫీ పోసుకొని త్రాగడం మొదలుపెట్టారు. అపుడు ఆయన "మీరు గమనించారా? మీ అందరి చేతుల్లో మంచి కప్పులే ఉన్నాయి. మాములువి, పాతవి ఇంకా ప్లేటులోనే ఉన్నాయి. ఉన్నవాటిలో ఉత్తమమైనదే కోరుకుంటున్నారు మీరు. అదే మీ అసంతృప్తులకు కారణం అని గ్రహించారా?
కప్పు వల్ల కాఫీ రుచిలో ఎటువంటి మార్పు రాదన్న సంగతి మరచిపోకండి. . నేను మీకు కాఫీ ఇచ్చాను కానీ మీరు అందంగా కనిపించే కప్పులు తీసుకొన్నారు, మీ పక్క వాళ్ళు తీసుకున్న కప్పులతో మీ కప్పులను పోల్చుకుంటున్నారు.
ఇలా చూడండి: జీవితం అన్నది కాఫీ. ఉద్యోగం, డబ్బు, కీర్తిప్రతిష్టలు కాఫీ తాగే కప్పు. ఆ కప్పు కేవలం కాఫీని నింపుకోవడానికే కానీ కాఫీ రుచిలో మార్పుకోసం కాదు. ఖరీదయిన, ఆకర్షణీయంగా కప్పు మనం తాగే కాఫీ రుచిని మనము ఆస్వాదించకుండా చేయగలదు." అన్నాడు.
"ఆనందంగా ఉన్న అందరికీ అత్యుత్తమమయినవి అవసరం లేదు. తమకు అందుబాటులో ఉన్నవాటినే తమ ఆనందానికి మూలం చేసుకుంటారు. అపుడే జీవితాన్ని ఆస్వాదిస్తారు"
వేశ్యలుగా పుట్టిన వాళ్ళు - మరొక ఆస్కార్ విజేత
Posted by జీడిపప్పు
కలకత్తాలోని "సోనాగచ్చి" వ్యభిచార వాటికలో ఫోటోలు తీయడానికి వెళ్ళిన Briski అనే ఫోటోగ్రాఫర్ అక్కడి వేశ్యల పిల్లలను చేరదీసి వాళ్ళకు ఫోటోలు తీయడం నేర్పింది. ఆ పిల్లలకు కెమెరాలు ఇచ్చి వారి జీవితం ఎంత దుర్భరంగా ఉందో ఫోటోలు తీయించి వాటి ఆధారంగా Born Into Brothels అనే డాక్యుమెంటరీ తీసింది. ఆ డాక్యుమెంటరీకి ఎన్నో అవార్డులు వచ్చాయి. కేవలం అవార్డులే కాక ఆ డాక్యుమెంటరీలోని పిల్లల్లో కొందరు ఫోటోగ్రఫీలో పై చదువులు చదువుతున్నారు.
ఇప్పటికే స్లమ్‌డాగ్ లో నటించిన పిల్లల జీవితాలు మారిపోయాయి. ముందు ముందు ఇలా భారతదేశంలో వేశ్యావాటికలు, మురికివాడలు, పేదరికం మొదలయినవాటి ఆధారంగా ఆస్కార్ గెలుచుకొనే చిత్రాలు మరిన్ని వస్తాయేమో. ఆ సినిమాల్లో నటించిన మరికొందరి జీవితాలు బాగుపడతాయేమో చూద్దాం.
బేతాళ కథలు - మారిన నిర్ణయం
Posted by జీడిపప్పు
నాగరాజు అనే యువకుడికి నగరంలో మంచి ఉద్యోగం వున్నది. అతనికి ఇంకా పెళ్ళి కాలేదు. అతని తల్లిదండ్రులకు నాగరాజు మేనమామ కూతురయిన రత్నాన్ని కోడలుగా తెచ్చుకోవాలని కోరిక. ఆమెకు అంతగా చదువు లేదు. అంత అందగత్తె కూడా కాదు. ఆమెకు నాగరాజు అంటే అమితమైన ప్రేమ. అయితే, ఏ ప్రత్యేకతలు లేని రత్నాన్ని పెళ్ళి చేసుకోవడం నాగరాజుకు ఇష్టం లేదు. ఒకసారి నాగరాజు ఏదో పండగకు సొంత వూరు వచ్చాడు. తల్లిదండ్రులు అతనితో "పనిలో పనిగా రత్నాన్ని పెళ్ళి చేసుకొని వెంటబెట్టుకుపో" అన్నారు.
నాగరాజు సూటిగా జవాబివ్వకుండా అసలు విషయాన్ని దాటవేశాడు.
పూర్తి కథ బేతాళ కథలు బ్లాగులో ....
అరచేతిలో గ్రంథాలయం - రచయితలకు, పాఠకులకు ఒక వరం
Posted by జీడిపప్పు

*తాము ఎక్కడికి వెళ్ళినా వేల పుస్తకాలు "సంచార గ్రంథాలయం"లో తమతో పాటే వస్తుంటాయి.
*పుస్తకాలను భద్రపరచడానికి స్థలం అవసరం లేదు. పదివేల భౌతిక పుస్తకాలకు ఒక గది అవసరమయితే పదివేల e-పుస్తకాలను జేబులో సరిపోయే ఒక చిన్న పుస్తకం సైజు ఉన్న Kindle లో అమర్చుకోవచ్చు.
*ఒక మంచి పుస్తకం కావాలనుకుంటే పుస్తకాల షాపుకు వెళ్ళి కొనుక్కోవాలి లేదా ఆన్‌లైన్లో కొని పుస్తకం వచ్చే వరకు కొద్ది రోజులు వేచి ఉండాలి. కానీ Kindle ద్వారా ఒక్క నిమిషంలో కావలసిన పుస్తకాన్ని Amazon.com నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
*కేవలం పుస్తకాలే కాకుండా వార్తా పత్రికలు, మేగజైన్లు, బ్లాగులు కూడా అందుబాటులో ఉన్నాయి.
ధర తక్కువ:
భౌతిక పుస్తకాల ధరలో దాదాపు సగం ధరకే e-పుస్తకాలు లభ్యమవుతున్నాయి. అందుకుగల కారణాలు: పుస్తకాన్ని అచ్చు వేయనవసరం లేదు, పుస్తకాలను గోడౌన్లో పెట్టనవసరం లేదు, ఆర్డరు వచ్చిన తర్వాత పోస్టు చేయనవసరం లేదు. కావలసినదల్లా ఫైళ్ళను భద్రపరచడానికి సర్వర్ మాత్రమే. దీనివల్ల ఎంతో సమయం, శ్రమ, పేపరు కూడా ఆదా అవుతుంది.
రచయితలకు ఉపయోగాలు:

Kindle వల్ల రచయితకు ఈ బాధలుండవు. కంప్యూటర్లో టైప్ చేసి పుస్తకాన్ని తయారు చేసుకోవడం చాలా సులభం. Amazon.com వెబ్‌సైటులో అకౌంటు సృష్టించుకొని పుస్తకాన్ని అప్‌లోడ్ చేసి పుస్తక వివరాలు తెలిపితే చాలు. ప్రతి పుస్తకం ధర $0.99 నుండి $200 వరకు ఉండవచ్చు. ప్రతి డౌన్‌లోడుకు పుస్తకం ధరలో 35 శాతం రచయితకు చెందుతుంది. ఎటువంటి పెట్టుబడి లేని ఈ పద్దతివల్ల రచయితకు నష్టం రానే రాదు, కేవలం లాభమే. ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన స్టీఫెన్ కింగ్ వంటి రచయితలు సైతం కేవలం Kindle కోసం నవలలు వ్రాయడం మొదలుపెట్టి పాఠకులను అలరిస్తున్నారు.
వర్తమానం మరియు భవిష్యత్తు:
ప్రస్తుతం ఇది అమెరికాలో మాత్రమే లభిస్తున్నది. ధర $359.00. ప్రస్తుతం అమెజాన్ వెబ్‌సైటులో సుమారు 2,40,000 e-పుస్తకాలు ఉన్నాయి. 2008లో సుమారు 5 లక్షల Kindle పరికరాలు అమ్ముడుపోయాయి అని అంచనా. భౌతిక పుస్తకాలను మాత్రమే చదివే పాఠకులు సైతం Kindle పట్ల ఆకర్షితులవుతున్నారు. Kindle మరి కొద్ది సంవత్సరాలలో iPod తరహాలో పుస్తక విప్లవం తీసుకురాగలదని విశ్లేషకులు అంటున్నారు.
తెలుగు పుస్తకాల విషయానికొస్తే - Kindle ఇప్పుడిపుడే రూపుదిద్దుకున్నది కాబట్టి మిగతా భాషల్లో రావడానికి సమయం పడుతుంది. బహుశా మరో ఐదేళ్ళలో అన్ని భాషలలో, అన్ని దేశాలలో 100-150 డాలర్లకు ఈ పరికరం అందుబాటులోకి రావచ్చు. తెలుగు రచయితలు, బ్లాగరులు ఇప్పటినుండే Kindle పైన ఒక కన్నేసి తమ రచనలను అందుకు అనుగుణంగా కంప్యూటరీకరణ చేసుకొని భద్రపరుచుకోవడం మంచిది.
Kindle గురించి మరిన్ని వివరాలు, విశేషాలు ఉమాశంకర్ గారు తన బ్లాగులో పొందుపరచారు.
జోకులు
Posted by జీడిపప్పు
విపులలో నాకు నచ్చిన కొన్ని కార్టూన్లు:
1. నువ్వేమో ఎడిటర్‌కి డబ్బులు తక్కువ ఇచ్చావు. దాంతో వాడు వెనకది ముందుకు, ముందుది వెనకకు ఎడిట్ చేసాడు. ఇప్పుడేమో ఇది 'హాలివుడ్ స్క్రీన్‌ప్లే" అని మన సిన్మాని మీడియా ఆకాశానికెత్తేస్తున్నది బావా...
2.(తప్పస్సు చేస్తున్న ముని ముందు మైకు పట్టుకొని TV రిపోర్టరు) - ఎంతకాలం నుంచి తపస్సు చేస్తున్నాడు..? ఏ దేవుడి కోసం తపస్సు చేస్తున్నాడు.. ఈ వివరాలకోసం ఈయన్నే డైరక్టుగా అడిగి తెలుసుకుందాం
3.(T.V. లో ) ఇప్పుడు "బ్రైన్ మీది - ప్రైజ్ మాది" కార్యక్రమంలో ఈ వెంట్రుక ఏ హీరోదో కనిపెట్టి వెంటనే మాకు S.M.S. పంపండి...
4.టీచరు: "వికటకవి" ఇలాంటిదే మరో పేరు చెప్పరా.
విద్యార్థి: పోరా పో
5.(హిప్పీ జుట్టు కుర్రాడితో డాక్టరు) రకరకాలయిన టెస్టులు చెయ్యగా, నీ చెవి వినపడకపోవటానికి గల కారణం తెల్సింది. ఇమ్మీడియట్‌గా జుట్టు కత్తిరించుకో.
6.కారు వెనకసీట్లోని ధనవంతుడు పక్కనున్న మిత్రుడితో: హైదరాబాద్ వచ్చినపుడు ఒక్క గోచీతో వచ్చా ఇప్పుడు పదికోట్లు సంపాదించా
కారు డ్రైవరు: అన్ని గోచీలు ఏం చేసుకుంటారు సార్!...
అమెరికాను బహిష్కరిద్దాం
Posted by జీడిపప్పు
సరే, ఇక అసలు విషయానికొస్తే - అమెరికా ప్రభుత్వం వందల బిలియన్లు ఇచ్చి "మీరు కొత్తవాళ్ళను తీసుకోవాలనుకుంటే అమెరికన్లనే తీసుకోండి. H1B వాళ్ళను వద్దు" అన్నది. వినడానికి అన్యాయం అనిపిస్తున్నా, నాకయితే వారివాదనలో తప్పులేదు అనిపిస్తున్నది. Of course సరి అయిన నిపుణులు లేక, పని సరిగా జరగక వాళ్ళ పాట్లేవో వాళ్ళే పడతారు, కళ్ళు తెరచి మళ్ళీ H1Bను పిలవవచ్చు లేదా మరింత outsource చెయ్యవచ్చు.
"కాలిఫోర్నియాలో ఉద్యోగాలకు కేవలం కాలిఫోర్నియా వాళ్ళనే తీసుకోవాలి" అని చెప్పిఉంటే నేనూ వ్యతిరేకించేవాడిని. వాళ్ళు చెప్పింది "ఇతర దేశస్థుల" గురించి. "ముందు మనదేశ పౌరులకు ఉద్యోగాలుండాలి, ఆ తర్వాతే ఎవరికయినా" అన్నారు. వాళ్ళేమీ భారతీయులను తీసేయమనలేదు. ఉన్నవాళ్ళను అలాగే ఉంచచ్చు కానీ కొత్తగా ఉద్యోగాలు ఇస్తే మాత్రం అమెరికన్లకే ఇవ్వాలి అంటున్నారు. ఈ రోజు అక్షరాలా 50 లక్షల మంది నిరుద్యోగ భృతి తీసుకుంటున్న అమెరికాలో ఈ షరతు సరి అయినదే అని నా నమ్మకం.
ఒక్కనిమిషం ఆలోచించండి - మన దేశంలో రోజుకు కొన్ని వేల ఉద్యోగాలు పోతున్నాయి అనుకోండి. అప్పుడు మన ప్రభుత్వం కంపెనీలకు కొన్ని వందల కోట్లు ఇచ్చింది, ఉద్యోగాలు కల్పించడానికి. అప్పుడు Infosys బెంగుళూరు ఆఫీసులో భారతీయుల బదులు చైనీయులను బెంగుళూరుకు పిలిపిస్తే ఎలా ఉంటుంది? ముందు మన దేశస్థులకు ఉద్యోగాలు ఇవ్వాలి, ఆ తర్వాతే బయటి దేశస్థులకు లేదా మన దేశానికి వలస వచ్చినవారికి.
ఒక నాయకుడు అమెరికా వస్తువులను బహిష్కరించాలని ఆందోళనలు చేయాలని పిలుపునిచ్చాడు. మీలో ఎవరయినా దానిని సమర్థిస్తే, ఈ క్రిందివి కూడా చేయండి.
- మీ ఇంట్లో అమెరికా సాంకేతిక పరిజ్ఞానం ఉన్న కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ ఉంటే వెంటనే బద్దలు కొట్టండి
- అమెరికానుండి మీవాళ్ళు తెచ్చిన బహుమతులు చెత్తలో పడవేయండి
- మీ ఇంట్లో ఎవరయినా IT ఉద్యోగం చేస్తుంటే వెంటనే మానిపించండి. ఎందుకంటే 60% పైగా మన IT ఉద్యోగాలు అమెరికాకు పని చేయడానికే ఉన్నాయి
- IT లేదా అమెరికానుండి వచ్చిన డబ్బుతో కొన్న భూములు, ఇళ్ళు పేదలకు దానం చెయ్యండి
- ఇంటర్నెట్ కనిపెట్టింది అమెరికావాళ్ళే. ఇంకెప్పుడూ ఇంటర్నెట్ వాడకండి
- అన్నట్టు మరచిపోయాను, బ్లాగు అన్నది అమెరికావాళ్ళ ప్రాడక్టు. ఇంకెందుకు ఆలశ్యం...బ్లాగింగు మానెయ్యండి.
కళ్ళల్లో యాసిడ్ పోయాలి
Posted by జీడిపప్పు
ఇరాన్‌లో 2002లో 24 ఏళ్ళ ఎలక్ట్రానిక్స్ విద్యార్థిని అయిన బరామీని ఒకడు వేధించడం మొదలుపెట్టాడు. రెండేళ్ళపాటు వేధింపులు సాగిన తర్వాత ఆమె తనను నిరాకరించిందన్న కోపంతో బస్‌స్టాప్‌లో ఉన్న ఆమె పైన వెనుకనుండి దాడి చేసి ఆమె మొహం పైన యాసిడ్ పోసాడు. ఆమె కళ్ళుపోయాయి. మొహాన్ని కప్పుకొనడానికి చేసిన ప్రయత్నంలో ఆమె చేతి వేళ్ళు కాలిపోయాయి.
2005లో నిందితుడు నేరం ఒప్పుకొన్నాడు కానీ అతడిలో పశ్చాత్తాపం లేదు. తాను చేసింది సరి అయినదే అన్నాడు. శిక్షగా ఆ అమ్మాయికి కొంతడబ్బు వచ్చే అవకాశం ఉన్నా బరామీ అందుకు ఒప్పుకొనక తనకు కళ్ళు లేకుండా చేసినవాడికి కళ్ళు లేకుండా చేయాలని కోరింది. కోర్టు అందుకు అంగీకరించింది. నిందితుడు పెట్టుకున్న పిటీషన్ గతవారం కోర్టు కొట్టి వేసింది. కొద్ది వారాల్లో నిందితుడి కళ్ళలో యాసిడ్ చుక్కలు వేయబడతాయి. (కొందరి స్పందన )
"నేను అతడి కళ్ళు పోగొట్టాలన్నది అతడి పైన పగతో కాదు, ఇలాంటివి మళ్ళీ జరగకూడదని. రేపు మరొక అమ్మాయికి నాలాగే జరిగితే, నన్ను నేను జీవితాంతం క్షమించుకోలేను" అన్నది బరామీ. ఆమెకు ఇప్పటికి 12 సర్జరీలు జరిగాయి, ఇంకా కొన్ని కావాలి.
యాసిడ్ దాడికి ముందు ప్రస్తుతం
బేతాళ కథలు - విష ప్రయోగం
Posted by జీడిపప్పు
ఒకప్పుడు ఉజ్జయినీ నగరంలో వజ్రగుప్తుడనే వజ్రాల వర్తకుడుండేవాడు. అతను అపూర్వమైన వజ్రాలను మాత్రమే కొనేవాడు, అమ్మేవాడు. అతని వజ్రాలను రాజులూ, మహరాజులూ మాత్రమే కొనేవారు. అపూర్వమైన వజ్రాలు ఎక్కడ ఉన్నట్టు వార్త వచ్చినా వజ్రగుప్తుడు సముద్రాలు సైతం దాటి వెళ్ళి, వాటిని ఖరీదు చేసేవాడు.
ఒకసారి అతను క్రౌంచద్వీపంలో "శిరీషకం" అనే గొప్ప వజ్రాన్ని కొన్నాడు. దాన్ని యాభై లక్షల వరహాలకు అమ్మాలని అతను నిశ్చయించుకొని స్వదేశానికి తిరిగివచ్చాడు.
పూర్తి కథ బేతాళ కథలు బ్లాగులో ....
నిర్మలమ్మకు నివాళి
Posted by జీడిపప్పు
ఎల్.వి.ప్రసాద్ నుండి రాజేంద్రప్రసాద్ తర్వాతి వరకు మూడు-నాలుగు తరాలవారితో 1000 పైగా చిత్రాలలో నటించిన ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిద్దాం.
కోతులు - టోపీలవాడు
Posted by జీడిపప్పు
తల ఎత్తి చూస్తే ఆ చెట్టు పైన ఉన్న కోతులన్నీ టోపీలతో ఆడుకుంటున్నాయి. జరిగినది గ్రహించిన ఆ టోపీలవాడు తెలివిగా ఆలోచించి, గంతులు వెయ్యడం మొదలుపెట్టాడు. అది చూసిన కోతులు కూడా గంతులు వేసాయి. టోపీలవాడు పల్టీలు కొట్టాడు, కోతులు కూడా పల్టీలు కొట్టాయి. తన టోపీల మూటను విప్పి చెట్టు కింద పరచి తన తల పైన ఉన్న టోపీ తీసి ఆ మూటకేసి విసిరి కొట్టాడు. కోతులు కూడా టోపీలను మూట కేసి విసిరి కొట్టాయి. టోపీలవాడు గబగబా మూట కట్టుకొని వెళ్ళిపోయాడు.
నీతి: అవతలివాళ్ళకు తెలివితక్కువ అని తెలిస్తే మన తెలివితో సులభంగా విజయం సాధించవచ్చు.
రెండు తరాలు మారాయి. ఆ టోపీలవాడి మనవడు టోపీల వ్యాపారం మొదలు పెట్టాడు. ఓ చెట్టుకింద పడుకొని నిద్రపోయి లేచి చూస్తే టోపీలన్నీ చెట్టు పైన ఉన్న కోతుల చేతుల్లో ఉన్నాయి. తన తాతయ్య చెప్పింది గుర్తు తెచ్చుకొని గంతులేసాడు, కోతులు కూడా గంతులేశాయి. పల్టీలు కొట్టాడు, కోతులు కూడా పల్టీలు కొట్టాయి. తన తల పైన ఉన్న టోపీ తీసి నేలకేసి కొట్టాడు.
ఒక పిల్ల కోతి చెట్టు పైనుండి చటుక్కున దుంకి ఆ టోపీని కూడా తీసుకొని చెట్టెక్కబోతూ వెనక్కి తిరిగి ఇలా అన్నది: "నీకు ఒక్కడికే తాత ఉన్నాడు అనుకున్నావా?"
నీతి: ..... .... .... ??
10%-90% మరియు 20%-80% సూత్రాలు
Posted by జీడిపప్పు
ప్రణాళిక లేదా ప్లానింగ్ అంటే - భవిష్యత్తును వర్తమానంలోకి తీసుకురావడం.
మనిషికున్న అత్యంత విలువయిన శక్తులు - ఆలోచించడం మరియు నిర్ణయించడం. తెలివిగా ఆలోచించి పకడ్బందీ ప్రణాళికను వేసుకోగలిగినపుడు వాయిదాలను మాని విజయాన్ని తొందరగా సొంతం చేసుకోగలుగుతారు. మీరు ఆఫీసులో పని చేస్తున్నపుడు మీ మానసిక, శారీరక శ్రమలకు ఎన్నో రెట్లు ప్రతిఫలం రావాలి. ప్రణాళిక వెయ్యడానికి ఖర్చు పెట్టిన ప్రతినిమిషం సుమారు 10-12 నిమిషాల శారీరక, మానసిక సమయాన్ని ఆదా చేస్తుంది. అంటే రోజూ ఉదయం 10-12 నిమిషాలపాటు ఆ రోజు చేయవలసిన పనుల గురించి ప్రణాళిక వేసుకుంటే సుమారు రెండు గంటల సమయాన్ని ఆదా చేయవచ్చు.
చేయవలసిన పనుల జాబితాను తయారు చేసిన తర్వాతే మీ రోజువారీ పనులను మొదలుపెట్టండి. మధ్యలో ఏదయినా కొత్త పని వస్తే దానిని జాబితాలో చేర్చండి. ప్రతిరోజూ ఆఫీసు వదిలి వెళ్ళేముందు కొద్ది నిమిషాల పాటు ఆ జాబితాను చూడండి. ఈ రోజు చేయలేకపోయినవి, రేపు చేయవలసినవి కలిపి క్రొత్త జాబితా తయారు చేయండి. అలా చేయడం వల్ల అంతర్గతంగా మీ మనసులో ఆ పనుల గురించి ఆలోచనలు మొదలవుతాయి. ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే ఆ పని పూర్తి చేయడానికి మెరుగయిన మార్గాలు, చిట్కాలు మీకు తట్టడానికి అవకాశాలు ఎక్కువ అవుతాయి.
వ్యక్తిగత విజయానికి కీలక సూత్రం 10%-90% పాటించండి. సరి అయిన ప్రణాళిక కోసం ఖర్చు పెట్టే 10% సమయం ఆ పనిని అమలు చేయడానికి అవసరమయిన 90% శారీరక, మానసిక శ్రమను మరియు సమయాన్ని మిగల్చగలదు.
20% - 80% సూత్రం
ఒక పని పూర్తి చేయడానికి అవసరమయిన 10 సంబధిత చిన్న పనుల జాబితా తయారు చేస్తే, అందులో రెండు పనులు పూర్తి చేయడం వల్ల మొత్తం పనిలో 80 శాతం పూర్తి అవుతుంది అని తెలుసా? ఇది నమ్మలేని నిజం. అతి ముఖ్యమయిన పనులు తక్కువే అయినా, అవే ఫలితాన్ని శాసిస్తాయి. పది పనుల్లో కేవలం ఒక్క పని యొక్క ఫలితం మిగతా తొమ్మిది పనుల ఫలితాల మొత్తంతో సమామయ్యే అవకాశాలున్నాయి.
దురద్రుష్టవశాత్తు చాలా మంది ఆ "అతి ముఖ్యమయిన" ఒకటి-రెండు పనులను వాయిదా వేస్తూ స్వల్ప ఫలితాలనిచ్చే పనులను ముందుగా మొదలుపెడతారు. ఈ అతి ముఖ్యమయిన పనులు చాలా కష్టంగా ఉండవచ్చు. కానీ అవి పూర్తి చేయడం వల్ల మిగిలిన పనులు పూర్తి చేయడం సులభమవుతుంది. అందుకే అడుగున ఉన్న 80 శాతం పనుల కంటే అగ్రభాగాన ఉన్న 20 శాతం పనులను చేయడానికి ప్రయత్నించాలి.
ఏదయినా ఒక పని మొదలుపెట్టే ముందు "ఇది Top 20% లో ఉండవలసిందా లేక Bottom 80% లో ఉండతగినదా" అని ఒక్క నిమిషం ప్రశ్నించుకోండి. కష్టమయిన పని మొదట చేయడం అలవాటు లేకపోయినా కొద్ది రోజుల పాటు ప్రతి రోజూ కష్టమయిన పని మొదట చేయడం ప్రారంభించండి. ఊహించని ఫలితాలను మీరే చూస్తారు.
(ఇది Eat That Frog పుస్తకం నుండి రాసుకున్న నోట్సు)
సైనికుడి మిత్రుడు
Posted by జీడిపప్పు
మూడు వారాల తర్వాత ఫోన్ వచ్చింది. "అమ్మా నేను బ్రతికే ఉన్నాను, నన్ను మన సైనికులు కనుగొన్నారు. తొందర్లో ఇంటికి వస్తాను" అన్న కొడుకు గొంతు విని తల్లిదండ్రులు ఇద్దరూ ఎంతో ఆనందించారు. అంతలో అతడు మళ్ళీ "నా తోటి సైనికుడు తన ప్రాణాలు ఫణంగా పెట్టి నన్ను రక్షించాడు. ఆ సంఘటనలో అతడు బాంబు బారిన పడ్డాడు. మొహం అంతా కాలిపోయింది, ఒక చెయ్యి, ఒక కాలు పోయాయి. అతడికి ఎవరూ లేరు. నాతో పాటు అతడిని కూడా తీసుకువస్తాను. మనతోనే ఉండమన్నాను కానీ మనకు భారమవుతానేమోనని అతడు మొహమాట పడుతున్నాడు" అన్నాడు.
అతడి తల్లిదండ్రులు కొద్దిసేపు ఆలోచించి "అలాంటివాడు కొద్ది రోజులు ఉంటే పరవాలేదు కానీ ఎక్కువ రోజులు ఉంటే అతడికి సేవలు చేయడం కష్టమే, ఇంకోసారి ఆలోచించు అలా కాలు, చెయ్యి లేనివాడితో ఎంత ఇబ్బందో" అన్నారు. "సరే"నని అతడు ఫోన్ పెట్టేసాడు.
మూడు రోజుల తర్వాత వారికొక టెలిగ్రాం వచ్చింది "మీ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నా"డని. ఇంటికి తిరిగి వస్తాడు అనుకున్న కొడుకు ఎందుకలా చేసాడో తెలియక తల్లిదండ్రులిరువురు కుప్పకూలిపోయారు. అతడి శవం వచ్చిన తర్వాత పెట్టె తెరచి చూసారు. అతడి మొహం మొత్తం కాలిపోయి ఉంది. ఒక చెయ్యి, ఒక కాలు లేవు.
ఒబామా మంత్రం ఫలిస్తుందా?
Posted by జీడిపప్పు
- రోడ్లు, నిర్మాణాలు, బ్రిడ్జిల రిపేర్లకు $120 బిలియన్లు, విద్యకు $100 బిలియన్లు, ఇంధన/శక్తి ఉత్పాదనకు $30 బిలియన్లు
- ఆరోగ్యానికి $10 బిలియన్లు, నాసాకు $2 బిలియన్లు
- హై-స్పీడ్ రైలు వ్యవస్థకు $8 బిలియన్లు, Amtrak రైళ్ళకు $1.3 బిలియన్లు
- అమ్మకానికి సిద్ధంగా ఉన్న ఇళ్ళను కొనుగోలు చేయడానికి $2 బిలియన్లు, ఇళ్ళు లేనివారికి $1.5 బిలియన్లు
- ఏడాదికి $125,000 కంటే తక్కువ సంపాదన ఉన్నవారు 2009లో కొత్త కారు కొంటే సేల్స్ ట్యాక్స్ కట్టనవసరం లేదు
- మొదటిసారి ఇల్లు కొంటున్నవారికి $8,000 ట్యాక్స్ చెల్లింపు
- ఒక్కరి సంపాదన $80,000 కంటే లేదా కుటుంబ సంపాదన $160,000 కంటే తక్కువ ఉంటే కాలేజ్ ఫీజులో $2,500 పన్ను మినహాయింపు
- ఒక్కరి సంపాదన $75,000 కంటే లేదా కుటుంబ సంపాదన $150,000 కంటే తక్కువ ఉంటే ఒక్కరికి $400 లేదా కుటుంబానికి $800 చెల్లింపు
చివరి పాయింటుకు, అంటే ఏమీ ఖర్చు పెట్టని వాళ్ళకు కూడా డబ్బు ఇవ్వడం, నేను పూర్తి వ్యతిరేకిని. ఈ పరిస్థితుల్లో ఒక మధ్య తరగతి కుటుంబానికి ఓ $800 ఇస్తే వాళ్ళు ఆ డబ్బు ఖర్చుపెడతారా లేక జరుగుతున్నవి చూసి ఆ డబ్బు ఖర్చుపెట్టగలిగే స్థితిలో ఉన్నా దాచుకుంటారా? ప్రజలకు డబ్బు ఇవ్వకూడదు. ఆ డబ్బుతో మరిన్ని ఉపాధి అవకాశాలు కలిగించాలి, డబ్బు చేతులు మారేలా చేయాలి. జార్జ్ బుష్ అన్ని బిలియన్లు కుమ్మరించాడు. ఏమయింది? ఒబామా ప్రణాళికలో 35 శాతం ట్యాక్స్ కోతలు/చెల్లింపులు, 65 శాతం ఖర్చులు ఉన్నాయి. ఇవి 20-80 శాతాలుగా ఉండి ఉంటే బాగుండేదేమో.
50 లక్షల ఉద్యోగాలు కల్పించడానికి ఒబామాకు ఇవన్నీ ఎంత దోహదం చేస్తాయో చూద్దాం. అంతా మంచే జరగాలని, అమెరికా తొందరగా కోలుకోవాలని ఆశిద్దాము.
$10 కే ల్యాప్‌టాప్!
Posted by జీడిపప్పు
" ప్రపంచమంతా చూస్తున్నపుడు సరి అయిన అవగాహన లేకుండా చెప్పడమెందుకు? చెప్పి నవ్వులపాలు కావడమెందుకు? మొత్తం ల్యాప్‌టాప్ యే 50 డాలర్లో అని నిజం చెప్పొచ్చుగా? ఇపుడు విదేశీయులు $10కే ల్యాప్‌టాప్ పెద్ద జోక్ అని మనల్ని చూసి నవ్వుతున్నారు. భారతీయులు అందరూ సిగ్గుపడాలి ఇలాంటివి చూసి. ఇకనుండి మనము అమీర్‌పేట్ లో ఎలా తలెత్తుకుని తిరగగలము?" అనుకొనేవాళ్ళు కాసేపు సిగ్గుపడి సిగ్గుతో మొగ్గలవండి.
జరిగిందేదో జరిగిపోయింది. నాకయితే మనవాళ్ళు సాధించినది నిజంగానే గొప్ప వార్త అనిపించింది. మనకున్న పరిమిత వనరులతో, అవకాశాలతో $100కు ల్యాప్‌టాప్ వచ్చినా అంతకంటే ఏమి కావాలి? పైగా ఇది ఆరంభం మాత్రమే, ఎవరికి తెలుసు తొందర్లో నిజంగా $10 కే మంచి ల్యాప్‌టాప్ వస్తుందేమో! ఈ సందర్భంగా ఇప్పటివరకు సాధించిన పురోగతికి మన శాస్త్రవేత్తలకు ఒకసారి జై కొడదాం.

$10 కే ల్యాప్‌టాప్ న్యూస్ చూసి నేను క్రింద చెప్పబడిన ఒక్కో పాయింటు తలచుకుంటూ కూర్చుకున్న కుర్చీ నుండి ఒక్కో అడుగు గాలిలో తేలడం మొదలు పెట్టాను
- ప్రతి ఇంట్లో తల ఒక్కింటికీ ఒక ల్యాప్‌టాప్ ఉంటుంది
- పిల్లలకు పుస్తకాల మోత ఉండదు. పిల్లలు వంగిపోయి ఆ ఐదు కిలోల సంచి మోయనక్కర్లేదు. చిన్న ల్యాప్‌టాప్ పట్టుకొని నిటారుగా నడుస్తూ స్కూలుకు వెళ్తారు
- మా చంటిది క్లాస్ రూంలో టీచరు చెప్తున్న rhymes అన్నీ తన బ్లాగులో Live Update చేస్తుంటుంది
- మా చంటోడు బస్‌స్టాప్ లో కూర్చొని Anonymus పేరుతో తన ఫ్రెండ్స్ బ్లాగుల్లో బండ బూతులు తిడుతుంటాడు.
- పాల అంకుల్, పనిమనిషి ఆంటీ, చెత్త అంకుల్ వచ్చి మా ఆవిడను "అమ్మగారు ఈ పండగకు ఓ ల్యాప్‌టాప్ ఇప్పించండి" అంటారు
- మా చంటోడితో మా ఆవిడ "నాన్నా నీ ల్యాప్‌టాప్ ఫార్మాట్ చేసి చెత్తంకుల్‌కు ఇవ్వు" అంటుంది. వాడిచ్చిన ల్యాప్‌టాప్ చూసి చెత్తంకుల్ మొహం సంతోషంగా వెలిగిపోవడం చూసిన నా కళ్ళలోని సంతృప్తిని చూసిన మా ఆవిడ మొహంలోని ఆనందాన్ని చూసిన మా చంటిది కేరింతలు కొట్టడం చూసి మా చంటోడు గంతులు వేస్తుంటాడు
500 రూపాయలకే ల్యాప్‌టాప్ వస్తే మీ ఇంట్లో ఎలా ఉంటుందో ఊహించుకొని మీరు కూడా కాసేపు గాలిలో తేలండి మరి!!
అన్నట్టు మీరు బ్లాగు ప్రతిజ్ఞ చేసారా?
బ్లాగు ప్రతిజ్ఞ
Posted by జీడిపప్పు
బ్లాగరులందరూ నా సహోదరులు
సంగీత, సాహిత్య, భక్తి, హాస్యపూరితమయిన బ్లాగుల సంపద నాకు గర్వకారణము
వీటిని పెంపొందించుటకు నేను సర్వదా కృషి చేయుదను
బ్లాగులలో దేశ ద్రోహ, దేశ వ్యతిరేక, ప్రాంతీయ, కుల, మత భావనలను పెంచను
ముసుగేసుకున్న బ్లాగు తీవ్రవాద ముష్కురులను తరిమి కొడతాను
బ్లాగరులపట్ల సత్ప్రవర్తన, బ్లాగుల పట్ల గౌరవం కలిగియుందును
వారి మంచి పోస్టులే నా ఆనందానికి మూలము
జైహింద్
గుడికి వెళ్ళలేకపోవడం తప్పా?
Posted by జీడిపప్పు
ముందుగా ఒక కథ: (ఇలా ముందుగా కథ చెప్పడం అన్నది అమ్మఒడి బ్లాగునుండి దొంగిలించిన ఆలోచన!!)
ఒకసారి పరీక్షిత్తు మహరాజుకు ఒక అనుమానం వచ్చింది. ఏమిటంటే, తానెన్నో దాన ధర్మాలు చేసాడు, దేవాలయాలు కట్టించాడు, క్రమం తప్పకుండా పూజలు చేయించాడు. కాబట్టి తన రాజ్యంలోకెల్లా తానే అందరి కంటే గొప్పవాడు, దేవతలందరికీ తానే అత్యంత ప్రీతిపాత్రుడు. ఇదే ఆలోచనను తన గురువుకు చెప్పాడు. ఆయన చిరునవ్వి నవ్వి "లేదు నాయనా నీకంటే గొప్పవాడు, దేవతలకు ప్రియమయినవాడు ఒకడున్నాడు" అన్నాడు.
పరీక్షిత్తు మహరాజు ఆశ్చర్యపోయి "ఎవరు గురుదేవా అతడు, నాకంటే ఎక్కువ దానధర్మాలు చేసాడా, నాకంటే ఎక్కువ దేవాలయాలు కట్టించాడా" అన్నాడు. గురువు పరీక్షిత్తును వెంటబెట్టుకొని చర్మగ్రంథుడు అను పేరుగల ఆ గొప్ప వ్యక్తి ఉన్న చోటుకు తీసుకెళ్ళాడు. అతడు ఒక ఊరి అవతల చిన్న ఇంట్లో నివశిస్తున్నాడు. దూరం నుండి రాజు, గురువు అతడు చేస్తున్నది చూడసాగారు.
చర్మగ్రంథుడు ఇంటినుండి బయటకు వచ్చి పక్కనే ఉన్న కొటంలో కట్టివేయబడిన గోవును తీసుకెళ్ళి, దానిని చంపి, చర్మాన్ని వేరు చేసి శుభ్రంగా కడిగి ఎండలో పెట్టి ఇంటికి వచ్చాడు.
ఇది చూసిన పరీక్షిత్తు మహరాజు "గురువర్యా, ఇతడు పాపి. పరమ పవిత్రమయిన గోవును హత్యను చేస్తున్నాడు. ఇతడా గొప్పవాడు" అన్నాడు విస్మయంతో. గురుదేవులు "మహారాజా మీరే అడగండి అతడిని" అని అతడి దగ్గరకు తీసుకెళ్ళారు. మహారాజు అడుగగా చర్మగ్రంథుడు "మహారాజా, నా తండ్రి ఇదే పని చేసేవాడు. నాకు ఇదే పని నేర్పించాడు. ప్రతి రోజూ కబేళాకు వచ్చిన గోవులను చంపి ఆ చర్మాన్ని వేరుచేసి పాదరక్షలు చేసేవారికి ఇవ్వడమే నా వృత్తి" అన్నాడు.
గురుదేవులు చర్మగ్రంథుడికి నమస్కరించి వెనుతిరిగారు. "మహారాజా చూసారా, అతడు ఎంత గొప్పవాడో. తన విధిని తాను నిర్వర్తిస్తున్నాడు. మీ రాజ్యపాలనలో పొరపాట్లున్నాయి కానీ, అతడు ఒక్క రోజు కూడా తాను చేయవలసిన పనిలో ఎటువంటి పొరపాటు చేయలేదు. తాను యే పని చేయడానికి నియమింపబడ్డాడో ఆ పనిని సక్రమంగా నిర్వహించేవాడే మహోన్నతుడు, దేవతలకు అత్యంత ప్రీతిపాత్రుడు" అన్నాడు.
ఇది కథ.
కాబట్టి, గుడికి వెళ్ళలేకపోయినంత మాత్రాన చింతించవలసిన అవసరం లేదు. మన ధర్మాన్ని/ duty ని సరిగా చేస్తుంటే ఆ దేవుడే మన దగ్గరకు వస్తాడు. రోజంతా మనము చేయవలసిన పనులు సక్రమంగా చేసి పడుకోబోయే ముందు "దేవుడా, నేను చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. అవి అయిన తర్వాతే నీ గుడికి వస్తాను. అంతవరకు ఇంట్లో ఒక నిమిషమో అరనిమిషమో నీ ఫోటోకు మొక్కగలను" అనుకొంటే చాలు.
ఇక గుడికి వెళ్ళడం - ఇది మన తృప్తి కోసమే. ఇంట్లో ఉన్న దేవుడే అక్కడా ఉంటాడు. మన ప్రముఖ దేవాలయాలు అవినీతికి ఆలయాలు. గంటల సమయాన్ని వెచ్చించి వెళ్ళి, ఆ అవినీతిని చూసి "ఎందుకు వచ్చామురా దేవుడా" అనుకొనే బదులు ఇంట్లోనే ఒక్క నిమిషం మొక్కితే చాలు.
అన్నట్టు - "వెయ్యి గుళ్ళ చుట్టూ వందేసి ప్రదక్షిణలు చేయడం కంటే ఒకరి ఆకలి తీరిస్తే ఇంకా ఎక్కువ పుణ్యం వస్తుందని" ఎవరో అన్నారు!!
స్లమ్‌డాగ్‌కు అన్ని అవార్డులెందుకు?
Posted by జీడిపప్పు
ఇంతకంటే ఎన్నో గొప్పసినిమాలు మన దేశంలో వచ్చాయి గత పదేళ్ళలో. ఇంతకంటే గొప్ప మ్యూజిక్ రెహ్‌మాన్ ఎన్నో సార్లు అందించాడు. ఇంతకంటే గొప్ప కథా వస్తువులు ఎన్నో చూసాము. అయినా ఈ సినిమాకు అన్ని అవార్డులు రావడం ఎందుకంటారు?
మీకు గుర్తుందా, ఒకప్పుడు విశ్వసుందరి, ప్రపంచసుందరి, భూలోక సుందరి,, అతిలోక సుందరి మొదలయిన కిరీటాలన్నీ భారతీయులకే వచ్చాయి కానీ ఆ తర్వాత రాలేదు. ఆ సుందరుల్లో ఎంతమంది అందుకు సరిపోతారో అందరికీ తెలిసిందే. అయినా ఎందుకు వరించాయి? ఎందుకంటే - కాస్మెటిక్స్ కంపెనీలు తమ ప్రాడక్టులు పెంచుకోవడానికి. ప్రతి వెర్రి పుల్లమ్మా "నేనెందుకు పాతాళ సుందరి కాకూడదు" అనుకొని ఎగబడి కొంది. ఆ పుణ్యమే ఈ రోజు వాడవాడలా బ్యూటీ ప్యార్లర్లు, మేకప్పులు, ముందు ముందు సైడెఫెక్టులవల్ల ముందుగానే ముసలితనం మరియు చర్మ రోగాలు. మొత్తమ్మీద వాళ్ళ బిజినెస్ పెంచుకోవడానికే ఈ సుందరి అవార్డులు అర్హత లేనివాళ్ళకు కూడా ఇచ్చారు.
ఇక స్లమ్‌డాగ్ విషయానికొస్తే - ఈ మధ్యనే అమెరికాకు చెందిన కొన్ని సినీ సంస్థలు మన దేశంలో అడుగు పెట్టాయి. ఇక్కడి సినిమాలను Cash చేసుకోవడానికి ఉన్న సులువయిన మార్గం - "ఇది ఆస్కార్ నామినేటెడ్" అని చెప్పడం. అందుకే స్లమ్‌డాగ్ సినిమాకు అన్ని అవార్డులకు అర్హత లేకున్నా, ఆ సినిమా డిస్త్టిబ్యూటరు అయిన అమెరికాకు చెందిన ఫాక్స్ సంస్థ రాజకీయాలవల్లే అన్ని అవార్డులకు నామినేట్ అయింది. లేకుంటే ఏ 2-3 అవార్డులకు మాత్రమే నామినేట్ అయ్యేది.
ఒకవేళ ఇదే సినిమాకు భారతీయ దర్శకుడు, నిర్మాత, డిస్ట్రిబ్యూటరు ఉండి ఉంటే ఇన్ని అవార్డులు, నామినేషన్‌లు వచ్చి ఉండేవా?
ఎవరు గొప్ప మెజీషియన్?
Posted by జీడిపప్పు
మొదటి మెజీషియన్: నేనిచ్చిన మేజిక్ ప్రదర్శనలో ప్రేక్షకులలోని ముగ్గురు స్త్రీలను అందరూ చూస్తుండగా మాయం చేసాను. ప్రేక్షకులు ఎంత వెతికినా ఆ ముగ్గురూ కనిపించలేదు. గంట తర్వాత మళ్ళీ ప్రత్యక్షమయ్యారు.
రెండవ మెజీషియన్: మా పక్క వూళ్ళో ఉన్న మున్సిపాలిటీ ఆఫీసును మాయం చేసాను. ఊరి జనమంతా గాలించినా వారికి కనపడలేదు. రెండు గంటల తర్వాత మళ్ళీ అక్కడే కనిపించింది.
మూడవ మెజీషియన్: మీరిద్దరూ చేసినవి చాలా చిన్న మాయలు. నేను ఆగ్రా వెళ్ళాను. టీవీలో ప్రత్యక్షప్రసారం అవుతుండగా అక్కడ ఉన్న తాజ్‌మహల్‌ను మాయం చేసాను. ఆగ్రావాసులు అందరూ ఎంత వెతికినా అది కనిపించలేదు. నాలుగు గంటల తర్వాత మాత్రమే అక్కడ ప్రత్యక్షమయింది.
ఇలా ముగ్గురూ నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదులాడుకోవడం మొదలుపెట్టారు.
అంతలో సూటు బూటు వేసుకున్న ఒక వ్యక్తి బార్‌లోకి అడుగుపెట్టాడు. అతడిని చూసిన మెజీషియన్లు గొడవ ఆపి కిక్కురుమనకుండా కూర్చున్నారు. కాసేపటికి ఆ వ్యక్తి వెళ్ళిపోయాక ముగ్గురూ "హమ్మయ్యా వెళ్ళిపోయాడు" అని నిట్టూర్చారు. ఇదంతా గమనిస్తున్న ఒక వ్యక్తి "ఎవరతను? అతడిని చూడగానే మీరు ఎందుకలా సైలెంట్ అయ్యారు?" అన్నాడు.
అపుడు ముగ్గురిలో ఒకడు ఇలా అన్నాడు: "అతడు చాలా గొప్ప మెజీషియన్. అతడి ముందు మేము ఎందుకూ పనికిరాము. మాలాగా చిన్న చిన్నవి అదృశ్యం చేయలేదతడు. అతడి పేరు రామలింగ రాజు. అందరూ చూస్తున్నాము అనుకుంటుండగానే 7,000 కోట్ల రూపాయలను మాయం చేసాడు. అది ఎక్కడుందో ఎవరికీ తెలియదు, ఇంకా వెతుకుతూనే ఉన్నారు"
స్లమ్‌డాగ్ Vs విజయేంద్ర వర్మ - 2
Posted by జీడిపప్పు
గమనిక: " ఇది కేవలం హాస్యం కోసం రాసింది, రచయితకు ఆ సినిమాలను కించపరిచే ఉద్దేశ్యం లేదు" అనుకోకండి.
ఇక విషయానికి వస్తే -
విజయేంద్ర వర్మ పారాచూట్ వేసుకొని గాలిలో ఎగురుతూ పాకిస్తాన్‌కు వెళ్ళి అక్కడ విలన్ల స్థావరం పైన దిగి, తెలుగులో మాట్లాడి, అందరితో ఫైట్ చేసి, అందరినీ చంపేసి తిరిగి వస్తాడు. పారాచూట్ వేసుకొని పాకిస్తాన్‌లో విలన్ స్థావరం పైన దిగడం నమ్మశక్యంగా లేదా? ఆ వెళ్ళినవాడు ఏదో కొండల పైన పడకుండా సరాసరి విలన్ల స్థావరం పైన దిగుతాడు. పోనీ అక్కడ ఏ హిందీనో ఇంగ్లీషో మాట్లాడుతాడా అంటే ఊహూ.. అచ్చ తెలుగు మాట్లాడుతాడు పాకిస్తానీయులతో!! విలన్లకు అందరికీ అన్ని ఆయుధాలున్నా అందరినీ చంపేస్తాడు. మరీ అంత ఎదవలా విలన్లు? అనిపించిందా మీకు? అలా జరగడం అసంభవం అని అన్నవాళ్ళు ముమ్మాటికీ మనుషులే, కాదన్నవాళ్ళు విజయేంద్ర వర్మ ఫ్యాన్స్ అన్నమాట.
స్లండాగ్‌లో - అనిల్ కపూర్ "కేంబ్రిడ్జ్ సర్కస్ ఎక్కడ ఉంది" అని అడుగుతాడు. మళ్ళీ స్లండాగ్ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తాడు. బొంబాయికి వచ్చాక ఒక కస్టమర్ సర్వీస్ సెంటర్లో టీలు కాఫీలు అందించే కుర్రాడిగా చేరుతాడు. అక్కడివి గుర్తు తెచ్చుకొని "లండన్" అని చెప్తాడు.
నా మిత్రుడు అడిగిన ప్రశ్నలు, నేను చెప్పిన జవాబులు:
ప్ర: బొంబాయికి తిరిగి వచ్చిన తర్వాత హీరో ఒక కాల్ సెంటర్‌లో పని చేస్తుంటాడు. చిన్నపుడు ఒకటో రెండో తరగతి మాత్రమే చదువుకున్న హీరోకు కాల్ సెంటర్‌లో ఎలా ఉద్యోగం వచ్చింది? ఇంటర్వ్యూ చేసేటపుడు సర్టిఫికేట్లు అడగరా?
జ: అవసరం లేదు. ఏ కాల్ సెంటర్‌లో అయినా సర్వెంట్ మొదలయిన ఉద్యోగాలు చదువురాని వాళ్ళకే ఇస్తారు. కాబట్టి హీరోకు ఇచ్చారు. ఒక వేళ చదువు వచ్చిన వాళ్ళకే ఇచ్చారు అనుకుంటే, హీరో తాజ్‌మహల్ దగ్గర చదువు నేర్చున్నాడు. అక్కడే పార్ట్ టైం హై స్కూలుకు వెళ్ళి చదువుకొని 86% తో ప్యాసయ్యి సర్టిఫికేట్లు తెచ్చుకున్నాడు.
ప్ర: కాల్ సెంటర్‌లో కస్టమర్లతో మాట్లాడే ఎవరయినా కాఫీలు టీలు అందించే వాడిని "నేను ఇప్పుడే వస్తాను, కాస్త ఇక్కడ కూర్చొని మెయింటెన్ చెయ్యి" అంటారా?
జ:ఎందుకు అనకూడదు? ఒక డాక్టరు పేషంటుకు అనస్తీషియా ఇచ్చి పక్కనే ఉన్న నర్సుతో "నేను సిగరెట్ తాగి వస్తాను, ఈ లోపు పేషంట్‌కు మెలకువ వస్తే ఆపరేషన్ చేసెయ్యి" అని చెప్పడా ఏంటి? అంతెదుకు, నువ్వు మీ అఫీసులో చెత్త వూడ్చే వాడితో "ఇదిగో నేను అలా బయట వెళ్ళి వస్తాను, కోడ్ రన్ అవుతోంది, మధ్యలో ఎర్రర్స్ వస్తే డీబగ్ చెయ్యి" అని చెప్తావా చెప్పవా?
ప్ర: కస్టమర్ సర్వీస్ సెంటర్లో లండన్‌కు సంబంధించిన ఫోటోలు ఉంటాయి. అలా ఎక్కడయినా ఉంటాయా?
జ: ఎందుకుండవు? ఎపుడయినా ఇన్‌ఫోసిస్, విప్రో ఆఫీసులు చూసావా? ఎవరయితే వాళ్ళ కస్టమర్లో ఆ ప్రదేశాలకు సంబంధించిన ఫోటోలు పెద్ద పెద్ద వాల్ పేపర్లలా పెడతారు
ప్ర: అక్కడేదో బోట్ రేసింగ్ పోస్టర్ ఉంటే హీరో క్విజ్ లో గుర్తు తెచ్చుకొని "లండన్‌కు అదేదో ఊరికి మధ్య రేస్ కాబట్టి .." అని చెప్తాడు. అదెలా సాధ్యం?
జ: కామన్సెన్సు ఉందా నీకు? మీ ఫ్రెండ్ ఎవడయినా పారిస్ ఉన్న క్లయింటుకు ఏ బెంగుళూరు నుండో సపోర్ట్ చేస్తున్నాడు అనుకుందాము. అప్పుడు బెంగుళూరులోని మీ ఫ్రెండ్ ఆఫీసులో ఈఫిల్ టవర్ పోస్టర్ ఉంటుంది. రోజూ దాన్ని చూసిన మీ ఫ్రెండ్ కు ఈఫిల్ టవర్ చరిత్ర, ఆటోమాటిగ్గా తెలిసిపోతుంది కదా. అలాంటప్పుడు కాఫీలు అందిచే కుర్రాడికి అవన్నీ తెలియకూడదా?
ప్ర: అవును, కాల్ సెంటర్ అంటే గుర్తొచ్చింది - అక్కడ కంప్యూటర్‌లో తన అన్న పేరు సెర్చ్ చేసి నంబర్ కనుక్కొని ఫోన్ చేస్తాడు కదా, ఎలా సాధ్యం? హీరోకు అంత సరిగ్గా కంప్యూటర్ ఆపరేట్ చెయ్యడం ఎలా తెలుసు?
జ: కిలోమీటర్లు గాలిలో వెళ్ళిన విజయేంద్ర వర్మ విలన్ల స్థావరం పైనే, అదీ విలన్లు గన్లు పట్టుకొని గట్టి కాపలా ఉన్నపుడు, దిగడం ఎలా సాధ్యమో ఇది కూడా అలాగే సాధ్యం
ప్ర: గన్లు అంటే గుర్తొచ్చింది. రివాల్వర్ కనిపెట్టింది ఎవరు అని అనిల్ కపూర్ క్విజ్ లో అడిగితే కోల్ట్ అని ఎలా చెప్పగలడు?
జ: లతికను వేశ్యా గృహం(?) నుండి రక్షించేటపుడు జమాల్ అన్న అంటాడు కదా దిస్ కోల్ట్ విల్ కిల్ యు అని
ప్ర: అన్నంత మాత్రాన రివాల్వర్ ను కోల్ట్ కనిపెట్టాడు అని ఎలా తెలుసు? సరే, సపోజ్ నేను నా సెల్ ఫోన్ నీకు ఇచ్చి 'దిస్ మొబైల్ విల్ హెల్ప్ యు"' అంటే సెల్ ఫోన్‌ను మొబైల్ అనేవాడు కనిపెట్టినట్టా?
జ: తిక్క తిక్క ప్రశ్నలు వెయ్యకు. విజయేంద్ర వర్మ సినిమాలో ఎవరు ఏ భాష మాట్లాడినా ఆ భాషలో మాట్లాడుతాడు. అంటే అవతలి వాళ్ళు ఏమి చెప్పినా అట్టే క్యాచ్ చేసి ఇట్టే జవాబు చెప్పేస్తాడు విజయేంద్రవర్మ. ఇక్కడ జమాల్ అన్న కూడా విజయేంద్ర వర్మ కు తీసిపోడు, తన తమ్ముడిలా.
ప్ర: జమాల్ అన్న అంటే ఇంకో డవుట్ వస్తోంది. అసలు జమాల్ అన్నకు రివాల్వర్ కనిపెట్టింది "కోల్ట్" అని ఎలా తెలుసు?
జ: రోజూ రివాల్వర్ వాడుతుంటాడు కదా, మరి ఆ మాత్రం తెలియదా? అయినా విజయేంద్ర వర్మ రైలు పైనుండి బైక్‌ను ఎలా జంప్ చేయించాడో స్లండాగ్ కూడా రివాల్వర్ కనిపెట్టింది "కోల్ట్" అని చెప్పి ఉంటాడు.
ప్ర: అంటే రోజూ ఒకటి వాడుతున్నంత మాత్రాన దాని ఎవరు కనిపెట్టాడో తెలిసిపోతుందా?
జ: నీకు అంత నమ్మకం లేకుంటే మన ఆంధ్రాలో ఏ మధ్యతరగతి ఇంటికయినా వెళ్ళి రోజూ మిక్సీ వాడుతున్న ఓ గృహిణిని మిక్సీ ఎవరు కనిపెట్టారో అడుగు, ఇట్టే చెప్పేస్తుంది. (బ్లాగర్లకు ఒక ప్రశ్న: మీరు రోజూ వాడుతున్న బ్లాగు ఎవరు కనిపెట్టారో చెప్పండి చూద్దాం.)
ఇప్పుడు చెప్పండి: పాకిస్తానుకు పారాచూట్లో వెళ్ళి తెలుగులో మాట్లాడి విలన్లను చంపిన విజయేంద్ర వర్మ గొప్పవాడా? అడిగినవన్నిటికీ జవాబులు చెప్పిన స్లమ్‌డాగ్ గొప్పవాడా?
బ్లాగు మూసేస్తున్నా - Shame on You!
Posted by జీడిపప్పు
అసలు బ్లాగింగ్ ఎందుకు మొదలుపెట్టాము? మనకు నచ్చిన భావాలను వ్యక్తపరచడానికి. ఆఫీసులో బాసు చెప్పిన పని మాత్రమే చేయాలి. కానీ మీ బ్లాగులో ఆ అవసరం లేదు. మీరు మెచ్చినది, మీకు నచ్చినది ఎప్పుడయినా ఎలా అయినా రాసుకోవచ్చు. మీ బ్లాగులో ఎలాంటి పోస్టులు పడాలన్నా, ఎలాంటి కామెంట్లు రావాలన్నా అది మీ చేతుల్లో ఉంది. మీ బ్లాగుకు మీరే రాజు/రాణి/మంత్రి/E-TV సుమన్. అలాంటప్పుడు ఈ "బ్లాగు మూయడం" ఏమిటి?
నిజజీవితంలో మనకు ఎన్నో చేయాలని, చెప్పాలని ఉన్నా అవకాశాలు, స్వాతంత్ర్యం ఉండకపోవచ్చు కానీ బ్లాగుల్లో ఆ స్వాతంత్ర్యం ఉంది. మరి ఇంత స్వతంత్రం ఉండి కూడా ఎవరో ముక్కూ మొహం తెలియని వ్యక్తి ఏదో అన్నాడని భయపడి పిరికితనాన్ని, బేలతనాన్ని పెంచుకొని బ్లాగు మూసేయాలనుకున్న ఈ బ్లాగురులు నిజజీవితంలో ఎలా బ్రతుకుతున్నారో తలుచుకుంటే జాలేస్తున్నది.
జరిగినదానిలో మీ తప్పు ఏమయినా ఉందా? ఉంటే మీ తప్పు ధైర్యంగా ఒప్పుకొని క్షమాపణలు చెప్పండి. ఒక వేళ మీ తప్పు లేనట్లయితే ఎందుకు పిరికివారిలా "బ్లాగు మూయడం"? .
మీ పిరికితనాన్ని, బేలతనాన్ని బయటపెట్టి మీలాంటివారిని మరికొందరిని తయారుచేస్తున్నారు. మిమ్మల్ని మీరు వంచించుకోవడం, అవమానించుకోవడం మాని ధైర్యంగా మీ పని మీరు కానివ్వండి. బ్లాగు మూసి వేయడం లేదా ప్రైవేటు చేయడం అన్నది దాడులు చేస్తున్న వారికి మరింత అవకాశం ఇవ్వడమే. వాళ్ళ వాఖ్యలను పట్టించుకోకండి. మన గురించి చెడుగా చెప్తుంటే సెటైర్ ఆన్సర్ ఇవ్వగలిగితే నోరెత్తలేరు. ఒక వేళ అలా వద్దనుకుంటే "పుట్టపుటేనుగు రాజఠీవితో వెళ్తుంటే ఆ రాజసం చూసి కుక్కలు మొరుగుతూనే ఉంటాయి, ఏనుగు కన్నెత్తి చూడకుండా ముందుకు వెళ్తూ పూజలు, గౌరవాలు అందుకుంటుంది" అన్న సంగతి గుర్తించుకోండి .
కావాలని బాగా ఆలోచించి (నొప్పించినా పరవాలేదని) Shame on You!! అని ఎందుకన్నానో ఒక్క నిమిషం ఆలోచించండి.
ఈ సందర్భంగా నేనింతే ... మారనుగాక మారను.... అన్న జ్యోతిగారికి

శభాష్ శ్రీలంక
Posted by జీడిపప్పు
మీది పెద్ద కుటుంబం, పెద్ద ఇల్లు. తెలిసిన దూరపుచుట్టం ఉద్యోగం కోసం వచ్చాడు. పోనీలే అని ఒక రూం ఇచ్చారు. కొద్దిరోజులకు తన పెళ్ళాన్ని, పిల్లలను తెచ్చుకున్నాడు. పోనీలే పాపం మనకు సాయంగా ఉంటారు కదా అని ఉండనిచ్చారు. మీ పిల్లలు వేసుకున్న బట్టలే వాళ్ళ పిల్లలకూ ఇవ్వాలనుకోలేదు మీరు. తప్పో ఒప్పో వాళ్ళను కాస్త చిన్న చూపు చూసారు. నెమ్మదిగా వాళ్ళలో స్వతంత్ర భావాలు పెరిగాయి. మీ ఇంట్లో ఉంటూనే మీ పట్ల ద్వేషం పెంచుకున్నారు. మీ ఇంట్లో ఉన్న రెండు రూములు పూర్తిగా తమకే ఇచ్చేయాలి అన్నారు. మీరు ఇచ్చేస్తారా అపుడు? మీరు రెండు రూములు ఇచ్చిన తర్వాత ఇంకో రూము కావాలంటే ఏమి చేస్తారు?
సరిగ్గా ఇదే జరుగుతున్నది శ్రీలంకలో. దశాబ్దాల క్రితం/నుండి తమిళులను చిన్న చూసిన/చూస్తున్న మాట నిజం. కానీ దాన్ని ప్రతిఘటించడానికి వాళ్ళు ఎన్నుకున్న మార్గమేమిటి? సాయుధపోరాటం. అదీ ఒక దేశ సైన్యంతో. మన దేశంలో ఉన్నట్టే అక్కడా నీచ రాజకీయనాయకులున్నారు. వాళ్ళ పుణ్యమా అని LTTE ఆవిర్భవించి మహాశక్తిగా ఎదిగింది. ఎన్నో దాడులకు సిద్దపడింది. శ్రీలంకలో శాంతి స్థాపన కోసం సైన్యాన్ని పంపినందుకు ప్రతీకారంగా రాజీవ్ గాంధీని హతమార్చింది. LTTE ని కొద్దికాలం పోషించిన ప్రేమదాసనూ హతమార్చింది. తమిళులకు స్వతంత్ర దేశం కావాలన్న స్థాయికి వచ్చింది. ఆగడాలు మితిమీరడంతో ప్రస్తుత అధ్యక్షుడయిన రాజపక్సె పెద్ద ఎత్తున సైనిక చర్యలు మొదలు పెట్టాడు.
కనివిని ఎరుగని రీతిలో సైన్యం పోరాడుతున్నది. సముద్రంలో ఉన్న తీవ్రవాదుల స్థావరాలను నాశనం చేస్తున్నాయి. విదేశాలనుండి ఆయుధాలు రాకుండా అడ్డుకుంటున్నాయి. LTTE ఆధీనంలో ఉన్న ఊళ్ళకు ఊళ్ళు ఖాళీ అయ్యాయి. LTTE దట్టమయిన అడవుల్లోకి లక్షల మంది ప్రజలను తీసుకొని వెళ్ళారు, వారిని రకషణ కవచాలుగా వాడుకుంటున్నారు. వారి క్షేమం ముఖ్యం అంటూ మన తమిళనాడులోని తమిళులు ఆందోళన చేస్తున్నారు. మొన్న తమిళనాడులో కొన్ని చోట్ల రిపబ్లిక్ డే కూడా బహిష్కరించారు!!
నిజానికి ఆ అడవుల్లోకి వెళ్ళిన వారిలో సగం మందికి పైగా తమంతటతాము వెళ్ళినవారే. తాము ఉంటున్న దేశం పట్ల వ్యతిరేకతను విషంలా ఎక్కించుకున్న తమిళులే ఎక్కువ ఉన్నారు. వారిని రక్షణ కవచంగా పెట్టుకొంటున్న LTTE ఆటలు ఎక్కువ కాలం సాగకపోవచ్చు. సేఫ్ జోన్ లొ లేని వాళ్ళ క్షేమం తమ బాధ్యత కాదని చెప్పి, సైన్యం దాడులు చేస్తూనే ఉంది. ఈ దాడిలో కొందరు అమాయకులు మరణించవచ్చు. కానీ దశాబ్దాలుగా పెరిగిన తీవ్రవాదం అంతం కావడానికి ఇలాంటివి జరుగక తప్పదు.
ఏది ఏమయినప్పటికి ఒత్తిళ్ళకు లొంగకుండా తీవ్రవాదులను తరిమి కొట్టి వారి అంతు చూస్తున్న శ్రీలంకను "శభాష్" అనాలి. అక్కడ జరుగుతున్నదాన్ని చూసి తమిళనాడులో జరుగుతున్న ఆందోళనలు ఎక్కువ అవుతున్నాయి. శ్రీలంక నుండి వచ్చే తీవ్రవాదులకు తమిళులు ఎర్ర తివాచీ పరచి స్వాగతం చెపుతున్నారు. శ్రీలంక సైన్యాన్ని భారతదేశం ఆపలేదన్న కోపంతో ఇక్కడ కూడా ఆత్మాహుతి దాడులు జరుగుతాయా? తమిళనాడు మరో తీవ్రవాద కేంద్రం అవుతుందా అన్న సంగతి కాలమే నిర్ణయిస్తుంది.
పేపరు పైన ఆలోచించండి
Posted by జీడిపప్పు
ప్రతి రోజు ఉదయం ఒక బ్రతికి ఉన్న కప్పను తినవలసి వస్తే, ఆరోజు అంత కంటే కష్టమయిన పని మరొకటి ఉండదు అన్న భావన మీలో కలిగి మిగిలిన పనులు కష్టమయినవిగా అనిపించవు. అలాగే రెండు కప్పలను తినవలసి వస్తే అసహ్యంగా ఉన్నదాన్ని ముందు తినాలి. దీనినే మరో రకంగా చెప్పాలంటే - మీరు రెండు ముఖ్యమయిన పనులు చేయవలసి ఉంటే, పెద్దది మరియు కష్టమయినది ముందుగా ఎంచుకోండి. దీనిని ఒక సవాలుగా తీసుకోండి. సులభమయిన పని ముందుగా చేయడాలని కోరిక ఉన్నా, ఆపుకోండి. ప్రతి రోజూ మీరు చేయబోయే పనుల్లో ఏది ముఖ్యం, ఏది కష్టం అని నిర్ణయించుకోవడం పైన ఆ రోజు ఆధారపడి ఉంటుంది అని గుర్తించుకోండి.
సక్సెస్ అన్నది 95% మీ రోజువారీ అలవాట్లపైన ఆధారపడి ఉంటుంది. పనుల ప్రాముఖ్యతను నిర్ణయించడం, వాయిదా వేయకుండా ఎప్పటిపనులు అప్పుడు పూర్తి చేయడం అన్నది ప్రాక్టీస్ చేయడం వల్ల కొంత కాలానికి మీ ఆలోచనలో, విధానాల్లో భాగమయి మీ పనితీరును, జీవనశైలిని ప్రభావితం చేస్తాయి.
ఏదయినా పని మొదలుపెట్టే ముందు ఆ పని ఎందుకు చేస్తున్నారో, ఎలాంటి ఫలితం ఆశిస్తున్నారో ఆలొచించండి. స్పష్టత అన్నది చాలా ముఖ్యం. కొందరు కొన్ని పనులు తక్కువ సమయంలో నేర్పుగా ముగించడానికి ప్రధానకారణం వారికి తాము చేయబోతున్న దాని పట్ల, ఫలితం పట్ల స్పష్టత ఉండడం. వాయిదా వేయడానికిగల ప్రధాన కారణం కూడా "స్పష్టత లేకపోవడం". ఎపుడయితే స్పష్టత ఉండదో, అపుడు అంతా అయోమయంగా ఉండి పనిచేయడానికి ఉత్తేజం, ఆసక్తి ఉండవు. అందుకే "పేపరు పైన ఆలోచించండి".
కేవలం 3 శాతం మంది మాత్రమే తాము చేయాలనుకున్న పనులను, తమ లక్ష్యాలను రాసుకుంటారు. అదే వయసు, అవకాశాలు, సమయం ఉన్నవారి కంటే ఇలా తాము చేయవలసిన పనులను రాసుకొనేవాళ్ళు 5-10 రెట్లు తొందరగా పూర్తి చేస్తారు. అందుకే "పేపరు పైన వ్రాయడం" తెలివయినవారు పాటించే సులువయిన మార్గం.
సులభంగా పని పూర్తి చేయడానికి పాటించవలసినవి:
1. మీ అంతట మీరే లేదా మరొకరితో చర్చించి మీరు ఏమి చేయాలనుకుంటున్నారో, వాటి ప్రాధాన్యతలు ఏమిటో నిర్ణయించండి. ఎంతోమంది ఈ విషయం పక్కన పెట్టి చిన్న చిన్న, ప్రాధాన్యతలేని విషయాల పైన రోజుల తరబడి పని చేస్తూఉ తమ శక్తిని, తెలివితేటలను వృథా చేస్తుంటారు.
2. పేపరు పైన ఆలోచించండి. మీరు చేయాలనుకున్నవన్నీ పేపరు పైన వ్రాయండి. వ్రాయకుండా సాధించాలనుకొనేవి అలాగే కలలుగా మిగిలిపోగలవు. వ్రాయడం వల్ల ఎటువంటి అస్పష్టత ఉండదు, తప్పులు చేసే అవకాశాలు తక్కువ, సరి అయిన దిశలో వెళ్ళడం సులభమవుతుంది.
3. గడువు పెట్టుకోకుండా నిర్ణయించినవి ముందుకు కదలవు. అందుకే మీరు సాధించాలనుకున్న వాటిని ఒక గడువులోగా పూర్తి చేయాలని ఆ గడువును పేపరు పైన వ్రాయండి.
4. మీరు లక్ష్యాన్ని అందుకోవడానికి చేయవలసిన పనులు అన్నీ వ్రాయండి. అది ఎంత చిన్నదయినా సరే తప్పక వ్రాయాలి. ఎపుడయితే అలా రాస్తారో మీరు చేయవలసిన పనులన్నీ మీ కళ్ళ ముందు కదలాడుతాయి. చేయవలసిన పనులను పేపరు పైన చేతితో స్పృశించగలడం దాదాపు సగం విజయం సాధించడంతో సమానం.
5. ఏ పని ముందు ఏ పని చేయాలి, మొదట ఏ పని చేయాలి - చివర ఏ పని చేయాలి ఆలోచించి నంబర్లు వేసి ఆ పనులను ఒక క్రమంలో అమర్చండి.
6. మీ ప్రణాళికను వెంటనే అమలు పరచండి. అమలు పరచని అద్భుత ప్రణాళిక కంటే అమలు పరిచే మామూలు ప్రణాళికే వేల రెట్లు మేలు అని మరువకండి.
7. మీ లక్ష్యాన్ని సాధించడానికి ప్రతిరోజూ ఏదో ఒక అడ్డంకిని అధిగమించండి. ప్రతి రోజూ 2-3 నిమిషాలు క్రితం రోజు మీరు ఏమి సాధించారో, ఈ రోజు చేయవలసిన పనులేమిటో ఆలోచించండి.
(ఇది Eat That Frog పుస్తకం నుండి రాసుకున్న నోట్సు)
స్లమ్‌డాగ్ Vs విజయేంద్ర వర్మ - 1
Posted by జీడిపప్పు
విజయేంద్రవర్మలో బాలకృష్ణ రన్‌వే పైన నిలబడి దూరం నుండి తన వైపు వస్తున్న విమానం చక్రాల బోల్టులను షూట్ చేస్తాడు. అవి విడిపోయి విమానం దెబ్బతింటుంది. మానవ మాత్రుడెవడయినా అలా కాల్చగలడా, ప్రొఫెషనల్ స్నైపర్స్ కూడా కాల్చలేరు అన్న అనుమానం రావచ్చు మనకు. కానీ అది సాధ్యం. ఫ్లైట్ మన వైపు ఎంత స్పీడుతో వస్తున్నది, మనకు ఫ్లైట్‌కు మధ్య ఎంత దూరం ఉన్నది, ఆ దూరం ఏ రేటులో తగ్గుతున్నది, విమానం చక్రం వ్యాసమెంత, ఆ బోల్టుకు మనకు ఉన్న కోణం ఎంత లాంటివి 5 సెకన్లలోపు లెక్క కట్టగలితే 476 మీట్లర్లో ఉన్న ఎలాంటి గుండుసూదినయినా నిలబడి కూలింగ్ గ్లాసులు పెట్టుకొని కాల్చవచ్చు.
స్లం డాగ్ మిలియనీర్‌లో క్విజ్‌లో "$100 నోటు పైన ఎవరి బొమ్మ ఉంటుంది" అన్న ప్రశ్న వేస్తాడు అనిల్ కపూర్. మీరు అప్పుడెప్పుడో అదేదో డాలరు నోటు పైన చూసిన అబ్రహాం లింకన్ (మనకు గాంధి ఎలాగో అమెరికా వాళ్ళకు లింకన్ అలాగ అనుకొని) పేరు చెబితే తప్పులో వేలేసినట్లే. ఎందుకంటే మన నోట్లన్నిటిపైనా గాంధీజీ ఉన్నట్టు అమెరికన్ కరెన్సీ ఉండదు . ఒక్కో నోటు పైన ఒక్కొక్కరి బొమ్మ ఉంటుంది. ఈ ప్రశ్న అడిగిన వెంటనే హీరోకు ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. బొంబాయికొచ్చిన హీరో ఒక చోట అడుక్కుంటున్న ఒక అంధబాలుడిని తన చిన్ననాటి మిత్రుడిగా గుర్తించి దయ తలచి ఒక నూరు డాలర్లు ఇస్తాడు. (అక్షరాలా అమెరికన్ $100) అది నూరు డాలర్లు అని తెలుసుకొన్న అంధబాలుడు "అయితే దీని పైన ఎవరి బొమ్మ ఉందో చెప్పు" అంటాడు. హీరో తనకు తెలియదు అంటాడు. అపుడు అంధబాలుడు "బెంజిమన్ ఫ్రాంక్‌లిన్" అని చెప్తాడు. తన ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకున్న హీరో, క్విజ్‌లో సరి అయిన ఆన్సర్ చెబుతాడు. (ప్రవాస ఆంధ్రులకు ఒక ప్రశ్న - $5 నోటు పైన ఎవరి బొమ్మ ఉంటుందో చెప్పండి చూద్దాం

సినిమా చూసిన తర్వాత తలెత్తిన మరియు తలతిన్న ప్రశ్నలు, వాటి జవాబులు:
ప్ర: అసలు మన హీరోకు $100 ఎలా వచ్చింది?
జ: తాజ్‌మహల్ దగ్గర గైడ్‌గా పని చేసాడుగా అక్కడ ఇచ్చారేమో
ప్ర: ఎక్కడో బొంబాయి స్లం నుండి తాజ్‌మహల్ దగ్గరకు వచ్చి వెంటనే తాజ్‌మహల్ గురించి ఎలా చెప్పగలడు?
జ: బొమ్మ చూసి ఆ మాత్రం చెప్పలేరా? చెత్త పక్కన ఉండేవాడు కదా, ఆ చెత్తలో రోజూ తాజ్‌మహల్ సిగరెట్ ప్యాకెట్ల పైన ఉన్న బొమ్మలు చూసేవాడు. సిగరెట్ ప్యాకెట్లు చెప్పి ఉంటాయి.
ప్ర: సిగరెట్ ప్యాకెట్లకు మాటలు రావుగా??
జ: ఏం రాకూడదా

ప్ర: సరే, సిగరెట్ ప్యాకెట్లు చెప్పాయే అనుకున్నాము. మరి హీరో ఇంగ్లీషులో ఎలా చెప్పగలుగుతాడు, ఫారిన్ టూరిస్టులకు?
జ: సిగరెట్ ప్యాకెట్లు ఇంగ్లీషులో చెప్పి ఉంటాయి, పైగా స్లంస్‌లో ఉన్నవాళ్ళకు మనకంటే ఎక్కువ ఇంగ్లీషు వస్తుంది.

ప్ర: అమెరికన్ టూరిస్ట్ ఇండియాకు వస్తే తమ కరెన్సీని రూపాయల్లో మార్చుకొని ఆ రూపయలు ఇస్తారు కదా, మరి హీరోకు డాలర్లు ఎందుకిచ్చారు?
జ:

ప్ర: ఆ ఇచ్చేదేదో డాలరో, అంటే 50 రూపాయలో లేదా పది డాలర్లో అంటే 500 రూపాయలో ఇవ్వాలో కానీ 100 డాలర్లు ఇవ్వడమేమిటి?
జ:

ప్ర: అసలు ఆ అంధబాలుడికి అమెరికన్ డాలరు గురించి ఎలా తెలుసు?
జ: ఎవరో అమెరికన్ టూరిస్టులు ఇచ్చి ఉంటారు
ప్ర: సరే, మరి అంధబాలుడికి $100 డాలర్ల నోటు గురించి, దాని పైన ఉన్న బొమ్మ గురించి ఎలా తెలుసు?
జ: పది అమెరికన్ డాలర్లకు ఒక్క రూపాయి, పది రూపాయలు ఇవ్వాలనుకొని $100 ఇచ్చారేమో అమెరికన్ టూరిస్టులు
ప్ర: మరి దాని పైన ఉన్న బొమ్మ గురించి ఎలా తెలుసు?
జ:


ప్ర: చెప్పు, పైన ఉన్న బొమ్మ గురించి ఎలా తెలుసు?
జ: చిన్నపుడు WWF కార్డులతో ఆడుకొనేవాళ్ళము, గుర్తుందా, ఆ కార్డు పైన పేరు చెప్పి, Stats చెప్పి? ఇది కూడా అలాగే. బిచ్చగాళ్ళు అయిన బాలలు ప్రపంచ వ్యాప్త కరెన్సీ అంతా కలెక్ట్ చేసి అలా ఆడుకుంటారు. అలాగే ఈ అంధబాలుడికి తెలిసింది నూరు డాలర్ల పైన ఎవరుంటారో. పైగా బెంజిమన్ ఫ్రాంక్‌లిన్ అనేది అందరికీ తెలిసిన పేరే కదా, సులభంగా గుర్తు పెట్టుకున్నాడు.
ప్ర:

ఇప్పుడు చెప్పండి ఎక్కడో ఉన్న విమానచక్రం బోల్టును కాల్చిన విజయేంద్ర వర్మ గొప్పవాడా, బొంబాయిలో బిచ్చమెత్తుకొనే కుర్రాడు $100 నోటు పైన ఉన్న బొమ్మ చెబితే ఆ విషయాన్ని కొన్ని సంవత్సరాల తర్వాత క్విజ్‌లో చెప్పిన హీరో గొప్పవాడా? లేక ఇద్దరూ సరిసమానమేనా?
Thank you CD annaa!!