అరచేతి గ్రంథాలయం 'కిండిల్' కబుర్లు - 2

Posted by జీడిపప్పు

భారతీయ సాహిత్యానికొస్తే - పాశ్చాత్యులకు ఉన్నట్టు మనకు చెప్పుకోదగ్గ "ఆల్ టైం క్లాసిక్స్" పెద్దగా లేవనుకుంటాను. మహాభారత, రామాయణాలు, ఒక యోగి ఆత్మ కథ తప్ప అమెజాన్‌లో మరే ప్రముఖ భారతీయ పుస్తకాలు కనిపించలేదు. Archive.org లో కొన్ని పుస్తకాలున్నాయి కానీ అవి కిండిల్ లో చదవబుల్‌గా లేవు. నాకు అత్యంత ప్రీతిపాత్రమయిన ప్రాచీన, మధ్యయుగ భారతదేశ చరిత్రకు సంబంధించిన పుస్తకాలను ఈ సైటులో చూడగానే మనసు ఆనందంతో ఉరకలేసింది. ముందూ వెనకా చూడక ఓ పది పుస్తకాలను (కిండిల్ కు సానుకూలమయిన mobi ఫార్మాట్‌లో) దింపి కిండిల్‌లో చదవడానికి ప్రయత్నిస్తే తలప్రాణం తోకకొచ్చింది.

విషయమేమిటంటే, పుస్తకాలను digitize చెయ్యడమంటే గుడ్డిగా స్కాన్ చేసి అప్‌లోడ్ చెయ్యడమే అనుకున్నారు మనవాళ్ళు. వచ్చిన చిక్కల్లా ప్రతి పేజీలో ఉన్న foot notes, references తోనే. స్కాన్ చేసిన పీడీయఫ్ ను ఏదో ఒకరకంగా mobi ఫార్మాట్‌లోకి మార్చినపుడు ఈ foot notes, references కూడా అసలు విషయంతో కలిసిపోతున్నాయి. మనము చదువుతున్నది ముఖ్యవిషయమో లేక దాని రెఫెరెన్సులో అర్థం కాక బుర్ర గోక్కోవాలి. (కొన్ని పుస్తకాలయితే మరీ దారుణంగా ఉన్నాయి. పావు పేజీ మేటర్‌కు రెండు పేజీల రెఫరన్సులు! ఓరి మీ కృతజ్ఞత కాకులెత్తుకెళ్ళ అనిపిస్తుంది).

ఈ సైటు కాదని DLI కు వెళ్ళి చూస్తే అక్కడ ఇంకా పెద్ద అవాంతరాలు ఎదురయ్యాయి. చాలా పుస్తకల్లో పెన్నుతో అక్కడడక్కడా హైలైట్ చేసారు. Archive.orgలో నాకు నచ్చిన ఒకట్రెండు పీడీయఫ్ లను PDF to Word ఉపయోగించి, రెండు మూడు గంటలు కష్టపడి శుద్దిచేసి కిండిలీకరించుకున్నాను. ఈ DIL లో ఆ భాగ్యము కూడా దక్కలేదు. పెన్నుమార్కులున్న పుస్తకాన్ని text గా మార్చడానికి అన్ని టూల్స్ ససేమిరా అంటున్నాయి. ఇవన్నీ చూసి ప్రస్తుతానికి భారతీయ ఇంగ్లీషు పుస్తకాల సంగతి పక్కన పెట్టాను.

ఇక తెలుగు పుస్తకాల విషయానికొస్తే - ముందుగా నెట్లో మనకు లభ్యమవుతున్న పుస్తకాలేవో చూసాను. ఉన్న పుస్తకాల్లో దాదాపు అన్నీ PDF ఫార్మాట్లో ఉన్నాయి. కిండిల్ స్క్రీన్ సైజు వల్ల పేజీ పూర్తిగా కనిపించదు. ఒకవేళ zoom చేస్తే సగం వాక్యం మాత్రమే కనిపిస్తుంది. మిగతా సగం కనిపించాలంటే horizontal scroll చెయ్యాలి. ఇలా వాక్య వాక్యానికి స్క్రోల్ చేసి చదవడమంటే అది విజయేంద్రవర్మ సినిమా చూడడానికి తెగించినట్టే.  పై పేరాలో చెప్పిన కారణాలవల్ల archive.org లోని తెలుగు పుస్తకాల జోలికి వెళ్ళనక్కరలేదు.

తెలుగువన్ లో కొన్ని నవలలున్నాయి కానీ అవి సరి అయిన ఫార్మాట్లో లేవు. కాస్తో కూస్తో చెప్పుకోదగ్గ, చదవదగ్గ పుస్తకాలు కౌముది గ్రంథాలయంలో ఉన్నాయి. నెట్లో ఉన్న పుస్తకాలలో ఉన్నత ప్రమాణాలున్న ఇ-పుస్తకాలు ఇవే అనుకుంటాను. pdf ను అలాగే కిండిల్ లో చదివితే పైన చెప్పిన సగంవాక్య సమస్య వస్తోంది ( కౌముది పుస్తకాలు iPad లొ చక్కగా చదువుకోవచ్చు). వీటిని mobi ఫార్మాట్‌కు మార్చాలని ప్రయత్నిస్తే అదేదో కొత్త భాష పుట్టుకొచ్చింది.  Calibre లో ప్రస్తుతానికి కొన్ని భాషల fonts మాత్రమే అందుబాటులో ఉన్నాయి. తెలుగు fonts కావాలంటే కొన్నాళ్ళు వేచి ఉండక తప్పదు.

నాకు తెలిసిన అన్ని ప్రయత్నాలు చేసాను కానీ కొండను తవ్వి ఎలుకను పట్టిన చందాన , ఆశించిన ఫలితం దక్కలేదు! ప్రస్తుతానికి తెలుగు పుస్తకాలు కిండిల్ లో చదివే అవకాశం దాదాపు లేదు. కాకపోతే "అన్నింటికీ ఆ అమెరికావాడే ఉన్నాడు" అని తరచూ అంటుండే నాకు నమ్మకముంది..
ఏదో ఒక రోజు కిండిల్‌లో కూడా మనకు అందుబాటులో ఉన్న అన్ని తెలుగు పుస్తకాలను తప్పక చదువుకోగలమని, అందుకు తగిన ఏర్పాట్లు ఎవరో ఒకరు చేస్తారని.



కిండిల్ లో ఇంగ్లీషు పుస్తకాలు చదువుతున్నపుడు "తెలుగు కూడా చదవాలి.. ఏదయినా సరే" అని తొలుస్తుంటే ఆగలేక ఓ బ్లాగునుండి కొంత కాపీ చేసి వివిధ font sizeలతో పీడియఫ్‌లు చేసి కిండిల్ లో చదవడానికి ప్రయత్నించగా చివరకి 18 Font size సరిపోయింది.



ఇదంతా చూసి "నెట్‌లో ఉన్న అతి కొద్ది చదవదగ్గ సాహిత్యం కిండిల్‌లో చదవాలంటే ఇంకా కొద్ది కాలం ఆగాలి.. మన బ్లాగుల్లో కూడా కొన్ని చక్కని బ్లాగులున్నాయి.. ప్రస్తుతానికి ఈ బ్లాగు బుక్కులను, ఇతరత్రా సైట్లలో మనకు నచ్చిన శీర్షికలను పీడీయఫ్‌లుగా కిండిల్‌కు తగునట్లు మార్చుకొని ఆస్వాదించాలి" అని సెటిలయ్యాను.

11 comments:

  1. వీరుభొట్ల వెంకట గణేష్ said...

    Few questions(sorry for too many questions, but curious to know)

    1. On internet, I've read that it'll be
    nightmare to read pdfs on Kindle(due to
    multiple scrolling). So, if we convert the
    pdf into kindle format using Calibre, will
    it be resized?

    2. The space available for user content is
    3.3GB, Is there any option to expand it?

    3. Can we read Kindle supported files from USB?

  2. మధురవాణి said...

    అయితే కేవలం తెలుగు పుస్తకాలే చదవాలనుకునే వాళ్ళు ఇంకొంత కాలం వేచి చూడాలంటారు.. అంతేనాండీ?

  3. జీడిపప్పు said...

    @ VVG -
    1) Yes, Calibre will convert pdf to a good readable format, but you have to pay additional attention to headers and page numbers

    2) I Don't think it can be expanded

    3) You have to store a file in Kindle. You can copy the files to a computer, connect Kindle and copy into Kindle. Kindle books can be read in a computer using "kindle for pc" tool.

    @ మధురవాణి gaaru - Sadly, yes!

  4. కౌటిల్య said...

    భారతీయ సాహిత్యానికొస్తే - పాశ్చాత్యులకు ఉన్నట్టు మనకు చెప్పుకోదగ్గ "ఆల్ టైం క్లాసిక్స్" పెద్దగా లేవనుకుంటాను.>>>>

    ఇది చాలా అవమానకర వాక్యం అండీ! మీకు తెలీకపోతే తెలీదని చెప్పండి, అంతేగాని అమెజాన్ సైట్లూ, ఆర్కైవులూ చూసి డిసైడు చేస్తే ఎలా! మనవాళ్ళకి ఇలాంటి భావాలు కలిగించడంలో తెల్లోడు బాగా సఫలీకృతుడయ్యాడనే చెప్పుకోవచ్చు....రాజకీయ స్వతంత్రం ప్రకటించి తెలివిగా వెళ్ళిపోయాడు, వచ్చినపని సుష్టుగా నెరవేరిందికదా అని.....మన వేలయేళ్ళ చరిత్రనీ, సంస్కృతినీ మింగిపడేసి, సాంస్కృతికంగా,మానసికంగా కూడా పూర్తి బానిసలని చేసుకుని ఆనందిస్తున్నాడు... వాడు మీకసలు చరిత్రే లేదని చెప్పటమూ, మనవాళ్ళు "అవును, లేదు లేదు" అని చంకలు గుద్దుకుంటూ వాడు చెప్పిన తప్పుడు రాతలు తలకెక్కించుకుని బళ్ళల్లో పిల్లలతో చదివించటమూ...

  5. జీడిపప్పు said...

    కౌటిల్య గారు,
    మీరు చదివిన ఒక పాతిక "ఆల్ టైం క్లాసిక్స్" జాబితా ఇవ్వగలరా? ప్రయత్నించి చూస్తాను.

  6. రవి said...

    ఆల్ టైమ్ క్లాసిక్స్ :

    రామాయణం, భారతం, భాగవతం, పంచతంత్రం (నాలుగు భాగాలు), సింహాసనద్వాత్రింశిక కథలు, కథాసరిత్సాగరం, తెనాలి రామలింగని కథలు, అక్బల్ బీర్బల్ కథలు, కాశీమజిలీ కథలు, సహస్ర శిరచ్ఛెద అపూర్వ చింతామణి, పరమానందయ్య శిష్యులకథలు, మర్యాదరామన్న కథలు, దశకుమారచరిత్ర, జాతకకథలు, పల్నాటివీరచరిత్రము, బౌద్ధ సాహిత్యకథలు, సంస్కృత నాటకాలు (రామాయణ, భారత నేపథ్యంలోవి తీసివేస్తే) స్వప్నవాసవదత్తం, మృచ్ఛకటికం, రత్నావళి, ప్రతిజ్ఞాయౌగంధరాయణం, ముద్రారాక్షసం, మాలతీమాధవం...

    (పాతిక అయినట్టున్నాయి. వీటిలో మీ దృష్టిలో క్లాసిక్స్ ఏవో వాటిని స్వీకరించండి)

  7. Manasa Chamarthi said...

    వేయిపడగలు, ఆంధ్ర మహా భారతం, పోతన భాగవతం, విశ్వంభర, తిలక్ అమృతం కురిసిన రాత్రి, కృష్ణ శాస్త్రి కవిత్వం-1,2,3,4, కన్యాశుల్కం, గణపతి, బారిష్టరు పార్వతీశం, శ్రీపాద కథలు, అమరావతి కథలు, శ్రీ రమణ మిథునం.. ఇవీ- చూసీ చూడగానే నాకు తట్టిన కొన్ని అద్భుతమైన పుస్తకాలు. ఇది, పుస్తకాలను కేవలం తీరిక వేళల్లో తీరిక చూసుకుని చదివే నాబోటి వాళ్ళ వద్ద ఉన్న సమాచారం. తెలుగు సాహిత్యం మీద సమగ్ర అవగాహన ఉండి, తీయ తేనియ తెలుగు రుచులు తెలిసిన మరొకరెవరైనా అయితే, తప్పకుండా మరిన్ని వివరాలు మీకందించగలరు.

  8. లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

    కౌటిల్య గారు, రవి గారు, చప్పట్లు. పాతిక్కి తక్కువయ్యాయంటే ఇంకా అందుకోండి.
    ఆముక్తమాల్యద, మేఘసందేశం.
    రామాయణాదుల్లోంచి తీసేస్తే అనే మాట ఉంది. కానీ అవి విడిగా క్లాసిక్స్ లాగా రూపొందినవి ఇంకా ఉన్నాయి.
    ఇవన్నీ నేనూ చదవలేదు. అందుకు తగిన పాండిత్యం లేకపోవటం నా తప్పే గానీ, క్లాసిక్స్ లేవని అనలేం జీడిపప్పు గారు!

  9. రవి said...

    మందాకిని గారు: మీరు ఉటంకించిన ఆముక్తమాల్యద - ఒక ప్రబంధం. మేఘసందేశం - చంపువు.

    అవి గొప్పకావ్యాలు అవచ్చేమో కానీ, నేను దేశ, కాల, సంస్కృతి పరిధులకతీతంగా ఎవరు చదివినా (కాస్త కష్టంతో అనుకోండి)కాస్తో, కూస్తో అర్థమవగలిగిన పుస్తకాలను క్లాసిక్స్ అన్న ఉద్దేశ్యంతో గ్రహించాను. (మనుచరిత్రాలు, ఆముక్తమాల్యద వగైరాలకు అంచేత నేను పొందుపర్చిన జాబితాలో మినహాయింపు)జీడిపప్పు గారి దృష్టిలో క్లాసిక్స్ అంటే ఇంచుమించు ఆ నిర్వచనమేనేమోనని నా ఊహ.

    మానస చామర్తి గారు అద్భుతమైన పుస్తకాల గురించి చెప్పారు. క్లాసిక్స్ అనలేదు కాబట్టి పేచీ లేదు.

  10. లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

    మానస గారు, కృష్ణపక్షం, చందమామలో భేతాళుని కథలు, ఏకవీర, భర్తృహరి సుభాషితాలు ఇంకెన్నో.
    జీడిపప్పు గారు, ఏమిటో ఇలా చెప్పేస్తున్నారు అనుకుంటారేమో, సుభాషితాలు కూడా చదువుతుంటే ఆసక్తిగా అనిపిస్తుంటాయి. అసలు పెద్దబాల శిక్షలో ఎన్ని వివరాలుంటాయనుకున్నారు? ఇవన్నీ మీకు తెలిసీ అడిగారేమో అనిపిస్తున్నది.

  11. కౌటిల్య said...

    జీడిపప్పు గారూ! పాతికేం ఖర్మ! పదివేలివ్వగలను....అసలు మీ దృష్టిలో "ఆల్ టైమ్ క్లాసిక్స్", "ఒన్ టైమ్ క్లాసిక్స్" అంటే ఏంటో చెప్తే....
    మీకు ఏ భాషలో కావాలో కూడా చెప్పండి...

    రవి గారూ!మానస గారూ! మందాకిని గారూ! మంచి లిస్టులు ఇచ్చారు...

    నాది కూడా మరో చిన్న మనవి, మీరు ఎన్ని పాశ్చాత్య క్లాసిక్స్ ని మథించారో తెలీదు నాకు...వాటిల్లోంచి పాతిక కాకపోయినా,ఒక పది చెప్పండి. నేను చదవనివి ఏమన్న ఉంటే తెచ్చుకుని చదువుతాను.... ఇలియడ్, ఒడిస్సీ, షేక్స్ పియర్, టాల్ స్టాయ్ ,మార్క్ ట్వెయిన్, డాస్టవిస్కీ ఇలాంటి కొన్ని మాత్రమే పెద్దలు క్లాసిక్స్ అని చెప్పగా విని చదివాను....ఇంకా ఉంటే చెప్పగలరు..ఇక హారీపోటర్లూ,డాన్ బ్రౌనులూ, నవల్లూ మీరు క్లాసిక్ అనరేమో అని చెప్పలేదు...

Post a Comment