తెలంగాణా ఇవ్వాలి, 2025 లో - Part 1

Posted by జీడిపప్పు


ప్రత్యేక తెలంగాణా -  గత రెండేళ్ళనుండి దాదాపు అందరు తెలుగువాళ్ళ నోట నానుతున్న మాట ఇది.  రాష్ట్రంలో పాలనను అస్తవ్యస్తం చేసి ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ ను "అయోమయ ప్రదేశ్" స్థితికి  తీసుకొచ్చి, "అంధ ప్రదేశ్" వైపు పరుగులు తీయిస్తున్న ఈ సున్నిత అంశం గురించి బ్లాగుల్లో ఇప్పటికే పుంఖానుపుంఖాలుగా ఎన్నో వ్యాసాలొచ్చాయి. తెలంగాణా ఇస్తారా ఇవ్వరా? ఎందుకు తెలంగాణా ఇవ్వాలి? ఎందుకు ఇవ్వకూడదు, ఇస్తే లాభనష్టాలేంటి? అంటూ ఎవరికి తోచిన విశ్లేషణలు వారు విశ్లేషిస్తున్నారు.. నీటుగా, ఘాటుగా, నాటుగా.

ఈ బ్లాగుల్లోని పోస్టులు చదువుతున్నపుడు నా అభిప్రాయాలు కూడా చెప్పాలనిపించేది కానీ సమయం, ఓపిక లేక దాటవేయవలసి వచ్చింది.  నా అభిప్రాయాన్ని కూడా భద్రపరిస్తే ఓ పదేళ్ళ తర్వాత ఓ సాయంత్రం వేడి వేడి మిర్చి బజ్జీ తింటూ నా ప్రస్తుత ఆలోచనలను చూసి నెమరు వేసుకుంటే బాగుంటుందేమో అనిపించి వ్రాయడానికి ఉపక్రమించాను.

తెలంగాణా విషయంలో బ్లాగుల్లోని టపాల్లో లేదా వ్యాఖ్యల్లో దాదాపు ప్రతి ఒక్కరి అభిప్రాయమూ 1) తెలంగాణా ఇవ్వాలి అనో లేదా 2) సమైక్యాంధ్ర గా ఉండాలి అనో ఉంది.  నాది ఈ రెండింటి కలయిక మరియు సవరణ అయిన అభిప్రాయం. అది -   3) తెలంగాణాను కొన్నేళ్ళ తర్వాత (2025 అయితే బాగుంటుంది) ఇస్తూ, రాష్ట్రాన్ని రెండు భాగాలుగా కాకుండా మూడు భాగాలుగా విభజించాలి.. ముందు ముందు మళ్ళీ ఇలాంటి గొడవలు తలెత్తకుండా.

ఇక వివరాల్లోకి వద్దాము. ముందుగా, తెలంగాణా విభజనకు నేను పూర్తిగా సానుకూలం. ఇందుకు పలు కారణాలున్నాయి. అందులో ముఖ్యమయింది "జనాభా ప్రాతిపదికన రాష్ట్రాలను ఏర్పాటు చేయడం". 2-3 కోట్ల మంది జనాభాకు ఒక రాష్ట్రం ఉంటే పరిపాలన మరింత సులభతరం అవుతుంది. ఎనిమిది కోట్లమంది (తొందర్లో పదికోట్ల మంది) బాగోగులు చూడ్డానికి ఒకే మంత్రి, ఒకే శాఖ ఉంటే పరిపాలన అంత సులభం కాదన్నది నా అభిప్రాయం.

మరో కారణం -  హైదరాబాదుతో పోలిస్తే సీమాంధ్ర అంతగా అభివృద్ది చెందకపోవడం.
అందరూ పెట్టుబడులు హైదరాబాదు చుట్టూ పెట్టడంతో అదేమో రాకెట్ స్పీడులో డెవలప్ అయింది కానీ సీమాంధ్ర ప్రాంతాలు ఆస్థాయిలో అభివృద్దికి నోచుకోలేదు. "రాష్ట్రానికి 70% ఆదాయం హైదరాబాదు నుండే వస్తోంది కాబట్టి విడిపోతే మన ప్రాంతాలు అభివృద్ది చెందడమెలా" అంటారు సమైక్యవాదులు.  నిజమే, ప్రస్తుతానికి హైదరాబాదే మూలాధారం కానీ ఇలా ఎన్నేళ్ళు? గత 20 యేళ్ళలో హైదరబాదు నూటపాతిక మైళ్ళ వేగంతో దూసుకెళ్తుంటే సీమాంధ్ర మాత్రం మహా అయితే ఓ పాతిక మైళ్ళ వేగంతో అభివృద్ది చెందుతోంది.  ప్రతిదానికి చకోర పక్షుల్లా హైదరాబాదు వైపే చూస్తుంటే ఇంకో ఐదు దశాబ్దాలయినా సీమాంధ్ర ప్రాంతాలు ఇలాగే ఉండిపోతాయి.  అందుకే సీమాంధ్ర ప్రాంతానికి ఈ తెలంగాణా ఉద్యమం ఒక Blessing in disguise అనిపిస్తుంది.

ఇక జరుగుతున్న ఉద్యమానికొస్తే - తెలంగాణా కావాలని కోరడం వరకు పరవాలేదు కానీ కొందరు తెలంగాణావాదుల పద్దతే చిరాకు, కోపం, అసహ్యం కలిగిస్తున్నాయి.  తెలుగుదేశం నుండి బయటకొచ్చాక అప్పటి రాజకీయ నిరుద్యోగి అయిన కేసీఆర్ ప్రత్యేక తెలంగాణా ఉద్యమం మొదలుపెట్టినపుడు ఒక సగటు తెలుగువాడిగా "రాష్ట్రాన్ని విభజించడమా? కుదరదంటే కుదరదు.  తెలుగు వారందరూ ఎప్పటికీ సమైక్యంగానే ఉండాలి" అనుకొంటూ తెలంగాణాను వ్యతిరేకించేవాడిని.  వైయస్సార్ ఉన్నన్నాళ్ళూ కేసీఆర్ కు కొన్ని బిస్కట్లు పడేస్తూ నోరుమూయించాడు కానీ వైయస్సార్ మరణం తర్వాత కేసీఆర్ విజృంభణ ఎక్కువయింది.  కేసీఆర్ "తెలంగాణా జాగో ఆంధ్రావాలా భాగో" "నాలుకలు చీరేస్తాం" "సీమాంధ్రులను తరిమి కొట్టండి" "దోపిడీదారులు" అనడంతో అప్పటివరకు తెలంగాణా వాదాన్ని ఉద్యమంగా చూస్తున్న నాబోటివారు కాస్తా "ఇది కేవలం ఉద్యమమే కాదు, ఉన్మాదం కూడా" అనుకోనారంభించారు.

ఎప్పుడయితే తెలంగాణా వాదులు వ్యక్తిగత దాడులకు, ఆస్తుల విధ్వంసాలకు పాల్పడడం మొదలు పెట్టారో "ఈ ఉన్మాదులతో కలిసి ఉండడం అవసరమా" అనిపించడం మొదలయింది.  అప్పటివరకు తెలంగాణా ఇస్తే హైదరాబాద్ పోతుంది, మన ప్రాంత అభివృద్ది ఎలా అనుకొనే ఆలోచనలు కాస్త "ఒకవేళ హైదరాబాదు పోతే మన ప్రాంతాలు అభివృద్ది కాలేవా? హైదరాబాదులో సీమాంధ్ర పెట్టుబడిదార్లు ఎక్కువ అవుతున్నారు అనే కదా తెలంగాణావాదుల్లోని కొందరి ఆరోపణ. మరి ఆ సీమాంధ్ర పెట్టుబడి దారులు తమ పెట్టుబడులను తమ ప్రాంతాల్లో పెడితే సరిపోతుంది కదా" అనిపించేది.

ఇక తెలంగాణా ఇస్తే 2025 లో ఇవ్వాలి అని ఎందుకంటున్నానో, ప్రస్తుతం జరుతున్న పరిణామాలు ఇలాగే మరికొన్నేళ్ళు కొనసాగితే సీమాంధ్రకు ఏ విధంగా లబ్ది చేకూరుతుందని ఆశిస్తున్నానో రాబోవు టపాల్లో పంచుకుంటాను (సశేషం)


6 comments:

  1. Sravya V said...

    Wow ! After a long time, welcome back !

  2. సూర్యుడు said...

    Cool, where have you been for so long :)

  3. Anonymous said...

    2025 నాటికి రెండో రాజధాని తెనాలి-గుంటూరు-బెజవాడల మధ్య , అంతర్జాతీయ విమాన అడ్డా, సెంట్రల్ రైల్వే స్టేషన్ లతో సహా కట్టి, BHEL, DRDO, తరలించి, 2030లో హైద్రాబాద్ స్టేట్ ఏర్పాటు చేస్తే 2035లో ఏడుస్తూ, ముక్కుచీదుకుంటూ విడిపోవటానికి నాకే అభ్యంతరమూ వుండదు. :P

  4. Anonymous said...

    అంత వరకూ ఈ జీడిపప్పులు వుడకనీయం, అంతే! :))

  5. జీడిపప్పు said...

    @ శ్రావ్య గారు - ధన్యవాదాలు
    @ సూర్యుడు గారు - బిజీ బిజీ :)
    @ Snkr గారు - loll

  6. karthik said...

    మాష్టారూ..
    ఏమైపోయారు ఇన్నాళ్ళు?? we missed you..welcome back!!

Post a Comment