తెలంగాణా ఇవ్వాలి, 2025 లో - Part 5 - కేసీయారే దిక్కు

Posted by జీడిపప్పు

దేవుడు ప్రత్యక్షమయితే ఏమి కోరుకుంటావు అంటూ అపుడపుడు కొందరు అడుగుతుంటారు. ఓ ఇళయరాజా వీరాభిమాని అయితే "స్వామీ ఇక ఇళయరాజా మ్యూజిక్ కంపోజ్ చెయ్యకుండా విశ్రాంతి తీసుకొనేలా చూడు" అని, ఓ వంశీ అభిమాని "ఇక వంశీ సినిమాలు తీయకుండా కథలు వ్రాసుకునేలా చూడు" అని, బ్లాగు టెర్రరిస్ట్ అయితే "నేను రాసే విషపూరిత పోస్టులు చదివి కనీసం ఒక్కరయినా ప్రభావితమయ్యేలా చూడమని", నాబోటి టెకీ అయితే "ఓ ప్రభువా, Internet Explorer ఉపయోగించు నీ శిశువుల పాపములను హరించి Firefox ఉపయోగించు వరమును ప్రసాదింపుడి 36:28" అని, దాదాపు ప్రతి తెలుగు బ్లాగు పాఠకుడూ "ఈ మార్తాండ కాస్త అర్థవంతమయిన, విషయ సంబంధిత వ్యాఖ్యలు పోస్టేలా చూడ"మని కోరుకుంటారు. ఈ సివరాఖరిది నెరవేర్చడం నావల్ల కాదని దేవుడు మాయమయి కేసీఆర్ ముందు ప్రత్యక్షమయి "భక్తా ఏమి నీ కోరిక" అంటే, కేసీయార్ " నా బొందిలో ప్రాణం ఉన్నంతవరకు తెలంగాణా రాకుండా చూడు స్వామీ" అని సాష్టాంగపడతాడు.

టీడీపీ నుండి బయటకు వచ్చాక ఏమి చేయాలో తోచక ఏదో టైంపాస్ గా ఉంటుంది కదా అని తెలంగాణా ఉద్యమాన్ని మొదలు పెట్టిన కేసీయార్ ఇంతితై వటుడింతై అన్నట్టు "తెలంగాణా అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణా" అనే స్థాయికి ఎదిగాడు. మిగతాపార్టీల్లో ఎందరు అతిరథ మహారథులున్నా కేసీఆర్ చెప్పిందే ఈ ఉద్యమానికి వేదం. అటు గాంధీవారసులయిన నిజమయిన తెలంగాణా వాదులనుండి ఇటు దేశద్రోహ/దుశ్చర్యలకు పాల్పడే తెలబాన్లవరకు అందరూ కేసీఆర్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించవలసిందే. తెలంగాణా వచ్చిన తర్వాత కేసీఆర్ పరిస్థితి ఏమో కానీ రాష్ట్రం విడిపోయిన పాతికేళ్ళ తర్వాత సీమాంధ్రవాసులు మాత్రం " కేసీఆర్ ఆ ఉద్యమాన్ని నడిపించకపోతే ఈ రోజు మన ప్రాంతాలు ఇంత అభివృద్ది చెంది ఉండేవా" అని తప్పక స్మరించుకుంటారు అని నా అభిప్రాయం.

నాకు ఎందుకలా అనిపించిందంటే - ఇప్పటివరకు ఏ సీమాంధ్ర నాయకుడయినా మనస్పూర్తిగా తమ ప్రాంతాల అభివృద్దికి కృషి చేసాడా? సీమాంధ్రప్రాంతాల్లో జరిగిన అభివృద్ది "జరగవలసినది కాబట్టి దానంతట అదే జరిగింది" తప్ప నాయకుల కృషి వల్ల జరగలేదు. (It just happened, as it should happen) సీమాంధ్రలోని మానవ, సహజవనరులను సక్రమంగా ఉపయోగించుకొనేలా ఈ నాయకులు కృషి చేసి ఉంటే ఈ ప్రాంతాలు మరింత అభివృద్ది చెందేవి. ఎవరో అతి కొద్దిమంది తప్ప ప్రతి సీమాంధ్ర రాజకీయనాయకుడూ హైదరాబాదు చుట్టూ ఎక్కువ దృష్టిసారించారు. రాజకీయ నాయకుల వరకు ఎందుకులే, చేతిలో నాలుగు డబ్బులున్న సగటు సీమాంధ్ర పౌరుడు కూడా "హైదరాబాదులో స్తిరాస్థి కావాలి" అని పొలోమని హైదరాబాదు వెళ్ళేవాడు. ఇలాంటివారందరూ ఈ రోజు హైదరాబాదులో పెట్టుబడులు పెట్టాలంటే కాస్త తటపటాయిస్తుండడానికీ, ఎన్నడూ లేని విధంగా టీవీల్లో  సీమాంధ్రప్రాంతాల పట్టణాలకు సంబంధించిన "రియల్ ఎస్టేట్, విల్లాస్, అపార్ట్మెంట్ల" గురించి ప్రకటనలు రావడానికి ప్రధాన కారణం కేసీఆరే నడిపిస్తున్న ఈ ఉద్యమమే!

ఇక కేసీఆర్ ఈ ఉద్యమాన్ని సాగదీసే విధానం బహుముచ్చటగొల్పును. "అసలు ఎప్పటికీ తెలంగాణా ఇవ్వరు, ఈ ఉద్యమం పేరుతో మామూళ్ళు వసూలు చేసుకోవచ్చు, అధికార పార్టీతో చేతులు కలిపి ఉద్యమ బూచి చూపి పేరు, డబ్బు గడించవచ్చు" అన్న కేసీఆర్ ప్లానుకు బై ఎలక్షన్ల ఫలితాలను చూసి మిగతా పార్టీలు కూడా తెలంగాణా పాటకు శ్రుతి కలిపినపుడు సమస్య ఎదురయింది.. అప్పటివరకు అంతా తానై నడిపిస్తున్న కేసీఆర్‌కు మిగతా పార్టీలవాళ్ళు కూడా తమతో కలుస్తామని అనడంతో, ఎక్కడ పొలిటికల్ గా తన మైలేజీ తగ్గుతుందో, ఎక్కడ తాను సీమాంధ్రులనుండి వసూలు చేస్తున్న మామూళ్ళలో వాటా మిగతావారికి ఇవ్వవలసి వస్తుందో అన్న అనుమానం మొదలయింది.

టీఆరెస్ ఒక్కటే ఉద్యమిస్తున్న కాలంలో కేసీఆర్ అపుడపుడు తెరపైకి వచ్చి నాలుగు పిట్టకథలు చెప్పి రెచ్చకొట్టే ప్రసంగాలు చేసి రెండ్రోజులు కోలాహలం చేసి "తాంబూలాలు ఇచ్చేసాను, తన్నుకు చావండి" అంటూ వెళ్ళిపోయాడు. తర్వాతి రోజుల్లో ఉద్యమకారులు, ఉన్మాదులు, తెలబాన్లు కాస్త హల్‌చల్ చేసేవారు. ఆ సమయంలో కేసీఆర్ కమీషన్ల లెక్కలు, తన కొడుకు సీమాంధ్ర వ్యాపారవేత్తలతో కలిసి చేస్తున్న వ్యవహారాలు చూసుకొనేవారు. ఉద్యమం కాస్త చల్లబడుతోందన్న సంకేతాలు వస్తే వెంటనే కాస్త పెట్రోలో డీజిలో పోసి మళ్ళీ మంటలు రేపేవాడు. ఏదో మొక్కుబడిగా  మొదలుపెట్టిన ఉద్యమం కాస్తా ఉధృత రూపం దాల్చడము, మిగతా పార్టీలవాళ్ళు కూడా అందులో చేరి "మేమూ ఉద్యమంలో చేరాము, మేమూ రాజీనామా చేసాము" అనడంతో ఖంగుతిన్న కేసీఆర్ ఇలా అయితే తొందరగా తెలంగాణా వచ్చే ప్రమాదముందని గ్రహించి, మిగతా పార్టీలవారిని దూరంచేసేందుకు అన్ని ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ అన్ని తెలంగాణా పార్టీలు ఒకే తాటివైపు రాకుండా ఉండడానికి తన సర్వ శక్తులు కేంద్రీకరిస్తున్నాడు. అన్ని పార్టీలు ఒకే తాటిపైకి వస్తే తెలంగాణా రావడం ఎంతసేపు? అలా వస్తే తర్వాత తన ప్రాభవమేముంటుంది?


కొన్నేళ్ళకు తెలంగాణా వచ్చినా క్రెడిట్ మొత్తం కేసీఆర్‌కు కొన్నాళ్ళే ఉంటుంది. తెలంగాణా వచ్చిన తర్వాత కాంగ్రెస్, టీడీపీలు అక్కడా పోటీ చేసి మొదటిసారి కాకపోయినా రెండోసారి ఎన్నికలనుండి తమ సత్తా చూపుతాయి. అప్పుడు కేసీఆర్ గుంపులో గోవిందుడుగా మిగిలినా ఆశ్చర్యంలేదు. కాబట్టి తెలంగాణా వస్తే ఆ తర్వాత కేసీఆర్ భవిష్యత్తు, ముఖ్యంగా తనయుడు కేటీఆర్ రాజకీయ భవిష్యత్తుకు పెద్దగా ఎదుగుదల ఉండకపోవచ్చు.

ఇందులో భాగంగానే టీవీల్లో ఎన్నో వినోదాత్మక దృశ్యాలను చూసాము. ఉన్మాదియాలో విద్యార్థులు నిరాహారదీక్ష చేస్తుంటే టీఆరెస్ నాయకులు వెళ్తే ఏ గొడవా లేదు కానీ అప్పట్లో టీడీపీలో ఉన్న నాగం జనార్ధన రెడ్డి వెళ్తే చెప్పులతో కొట్టి తరుముకున్నారు.  ట్యాంక్‌బండ్ పైన మార్చ్ సమయంలోనూ కేశవరావు పైన దాడి చేసారు.  మొన్నటికి మొన్న టీడీపీ నాయకుడయిన ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంటి పైన దాడి చేసి ఆస్తి నష్టం చేసారు. ఎక్కడ ఏ దీక్షను పరామర్శించడానికి వెళ్ళినా ఆ వెళ్ళినవారు Non-TRS నాయకులయితే చాలు, వారి పైన దాడులకు దిగుతారు "మేము కూడా తెలంగాణా కోసం పోరాటం చేస్తున్నాము మొర్రో, మమ్మల్నీ మీలో కలుపుకోండి" అని కాళ్ళా వేళ్ళా బ్రతిమాలుకున్నా వినిపించుకోకుండా! ఇది కేవలం శ్రీమాన్ కేసీఆర్ గారు తెలంగాణా నాయకులను ఏకతాటిపైన తీసుకురాకుండా చేసే ప్రయత్నం తప్ప ఇంకేమయినా ఉందా?

తెలంగాణా వస్తే తన ఆటలు ఎక్కువకాలం సాగవని తెలంగాణాలోని పార్టీలు ఏకం కాకుండా కృషి చేస్తూ, ఉద్యమాన్ని వీలయినంతగా సాగదీస్తూ అదేసమయంలో సీమాంధ్రులకు తమ ప్రాంతం గురించి ఆలోచించే అవకాశం ఇచ్చినందుకు, తమ ప్రాంతాలను కూడా అభివృద్దిపరచుకొనే సువర్ణావకాశం కల్పించినందుకు భావి సీమాంధ్రులు కేసీఆర్‌కు తప్పక ధన్యవాదాలు తెలుపుకుంటారు.. కేసీఆర్ ఈ ఉద్యమాన్ని ఇలాగే ఇంకొన్నేళ్ళు నడిపిస్తే!



0 comments:

Post a Comment