హ హ్హ హ్హా @ షారూఖ్ ఖాన్

Posted by జీడిపప్పు

నిన్న కోల్‌కతాకు, బెంగళూరుకు మధ్య జరిగిన మ్యాచ్ స్కోర్ చూసినప్పటికి బెంగళూరు ఐదు ఓవర్లలో 42 రన్లు కొట్టాల్సి ఉంది. ఈ మ్యాచ్ కూడా ఓడిపోతే విజయ్‌మల్యాకు ఇంకాస్త కొవ్వు తగ్గుతుంది అనిపించింది కానీ, అవతలి జట్టు షారూఖ్ ఖాన్‌ది కాబట్టి  ఎలా అయినా బెంగళూరు గెలవాలి అని కోరుకోవడం మొదలుపెట్టాను. అంతలో టపటపా వికెట్లు పడడంతో ఎక్కడ కోల్‌కతా గెలుస్తుందో అని దిగులు మొదలయింది. అద్రుష్టవశాత్తూ మార్క్ బౌచర్ ఒంటిచేత్తో బెంగళూరును లాక్కొచ్చేసి నా దిగులును దూరం చేసాడు. ఈ ఏడాది కూడా షారూఖ్ ఖాన్‌కు IPL ఫైనల్ యోగం లేదు.

నేను సాధారణంగా ఏ జట్టూ "ఓడిపోవాలని" కోరుకోను. కొన్ని జట్లు గెలవాలని మాత్రమే కోరుకుంటాను, ఒక్క కోల్‌కతా నైట్ రైడర్స్ విషయం లో తప్ప. అందుకు కారణం: కోల్‌కతా జట్టు యజమాని అయిన షారూఖ్ ఖాన్ ప్రవర్తన. తాను బాలీవుడ్ కింగ్ అని సొంతడబ్బా కొట్టుకోవడం, అమీర్ ఖాన్, అమితాబ్ ల కంటే గొప్పవాడని చెప్పుకోవడం వల్ల కాదు ఈ వ్యతిరేకత. ఈ వ్యతిరేకతకు కారణం గత ఏడాది IPL లో కోల్‌కతా తమ చివరి మ్యాచ్‌లో చతికిలపడిన మరుసటిరోజు జరిగిన సంఘటన. దారుణ పరాజయాలు చవిచూసిన ఆటగాళ్ళు తలలు వేలాడేసుకొని చూస్తుంటే, వారికి ధైర్యం చెప్పే నాథుడే లేదు. బాలీవుడ్ బాద్షా (??!!) ముంబై చెక్కేసి మరుసటిరోజు వాళ్ళకు SMS పంపించాడు సరిగా ఆడలేదని!

ఒక జట్టు యజమాని ఇలాగేనా ప్రవర్తించవలసింది? ఓటమి భారంతో ఉన్న ఆటగాళ్ళను నిందించాలా లేక "ఇది మొదటి సిరీస్ కదా, మళ్ళీ ప్రయత్నిద్దాము, 2009లో జరిగే సిరీస్‌లో బాగా ఆడదాము" అంటూ ఆత్మస్థైర్యాన్ని పెంపొందించాలా? 2007 NFL లో మయామీ డాల్ఫిన్స్ కేవలం ఒక్క మ్యాచ్ గెలిచి 15 ఓడిపోయినప్పటికీ యాజమాన్యం వాళ్ళపట్ల ఇలా ప్రవర్తించలేదు. ఆటగాళ్ళలో మార్పులు చేసి వారి ఆత్మస్థైర్యాన్ని పెంచే చర్యలు చేపట్టింది. అందుకే 2008లో దాదాపు playoffs కు చేరుకున్నారు. ఇది తెలుసుకోలేని గరీబ్ ఖాన్ ఎప్పటిలాగే మతిలేని మాటలతో క్రీడాకారుల అంకితభావాన్ని దిగజార్చాడు. దాని ఫలితమే ఇప్పుడు కనిపిస్తున్నది.

దీంట్లో కాస్తో కూస్తో గంగూలీ పాత్ర కూడా లేకపోలేదు. భారతజట్టులో ఉన్నన్ని రోజులూ గ్రూపులు కట్టి సభ్యుల మధ్య ముఠారాజకీయాలు నడిపిన దాదా ఇక్కడా తన బుద్ది చూపిస్తున్నాడు. దెబ్బకు టీం రెండుగా చీలిపోయింది. నాల్రోజులక్రితం టీంలో "అంతర్గత గూఢచారులు" ఉన్నారని తెలిసి ఇద్దరి పైన వేటు వేసారు. ముందు ముందు ఇంకెన్ని తమాషాలు ఉండబోతాయో! కోల్‌కతా ఓటమి చూసి సంతోషంగా ఉన్న నేను "కోల్‌కతా గెలిస్తేనే మళ్ళీ దక్షిణాఫ్రికాలో అడుగుపెడతాను" అంటూ అటూ-ఇటూ కాని షారూఖ్ ఖాన్ మాటలు చూసి ఉబ్బితబ్బిబ్బయ్యాను. ఇలాంటి పనికిమాలిన చవట యజమానికి సరిపడేలా ఆడుతున్నారు ఆ టీం ఆటగాళ్ళు కూడా.

కొసమెరుపు: ఆ మధ్య "చక్ దే ఇండియా" అనే ఒక సినిమా వచ్చింది. అందులో ఒక హాకీ ఆటగాడు అమ్మాయిలను ఉత్సాహపరచి, ఆత్మస్థైర్యాన్ని నూరి, విజయాల బాటలో నడిపిస్తాడు. అది ఎంతో మందికి స్పూర్తినిచ్చే సినిమా, ఓటమితో దిగులు పడకూడదు, అందరూ ఇలా ఉండాలి, అలా ఉండాలి అని నీతులు చెప్పిన ఆ నటుడి పేరు షారూఖ్ ఖాన్.

6 comments:

  1. Anil Dasari said...

    ఖాన్ సంగతేమో కానీ గంగూలీ ఉన్న చోట ఆట కంటే లుకలుకలే ఎక్కువ. ముందతన్ని పీకేస్తే సగం మ్యాచులన్నా గెలుస్తారు వాళ్లు.

  2. చావాకిరణ్ said...

    :)

  3. నిషిగంధ said...

    Sharukh is good for one man show only! నైట్ రైడర్స్ ఓడినప్పుడల్లా ప్లేయర్స్ కోసం కాస్తో కూస్తో బాధ పడినా షారుఖ్ ఫేస్ చూస్తే మాత్రం భలే సంతోషమేస్తుంది :-)

    2007 లో డాల్ఫిన్స్ ఎక్కడ ఆడారండీ!? they only showed up :))

  4. sunita said...

    నాకైతే ఎందెదు వెతికితే అందందు కలడు అని పరమాత్ముడి గురుంచి చెపుతారేమో కాని వీణ్ణి ప్రతి యాడ్ లోను, టీవీ లోను, నెట్లోను చూసీ చూసీ, వచ్చిన విరక్తికి తోడు వీడి డబ్బా, పైగా అందరినీ వెక్కిరించడం వీడి బాధ ఎప్పుడు వదులుతుందా అని ఎదురు చూస్తుంతే ఇప్పుడు ఈ క్రికెట్ ఒకటి. ఇహ మాకు నిష్క్రుతి లేనట్టుంది.

  5. కన్నగాడు said...

    అద్దెచ్చా గరీబ్ ఖాన్ అని అమీర్ ఖాన్ ని ఆయన అబిమానులు పిలుచుకుంటారనుకుంటా!

    p.s. 'అబిమానులు' 'భి' వాడాలని తెలుసును కాని మాక్ ఇన్-స్క్రిప్టులో రెండో బ పెట్టటం మరిచిపోయారు :(

  6. జీడిపప్పు said...

    @ సూర్యుడు గారు, @ చావాకిరణ్ గారు - ధన్యవాదాలు

    @ అబ్రకదబ్ర గారు - గంగడిని తీసేస్తే బెంగాలీలు చేసే గొడవలు మర్చిపోయారా? షారూఖ్ ఖాన్ ను కోల్‌కతాలోకి అడుగుపెట్టనివ్వరు!

    @ నిషిగంధ గారు - హ హ్హ భలే చెప్పారు. డాల్ఫిన్స్ నే అలా అంటే 2008లో పదహారూ ఓడిపోయిన డెట్రాయిట్ లయన్స్ ను ఏమనాలో ;)

    @ నాబ్లాగు గారు - Same feeling here :(

    @ కన్నగాడు గారు - Team spirit విషయం లో వీడు గరీబే!

Post a Comment