వినోదాత్మక చిత్రం "చిక్కడు దొరకడు"
Posted by జీడిపప్పు
కథ విషయానికొస్తే - తన కొడుకును రాజు చేయాలన్న తలంపుతో రాణిగారి తమ్ముడు సింహబలుడు రాణిగారికి పుట్టిన కవల పిల్లలను చంపడానికి కుట్రపన్నుతాడు. మంచివాళ్ళయిన సైనికులు ఆ కవలలను చంపకుండా అడవిలో వదిలిపెడతారు. ఒకడు దొంగల ముఠా నాయకుడయిన "చిక్కడు"గా మరొకడు మంచివాడయిన "దిలీపుడు"గా పెరిగి పెద్దవారవుతారు. పేదవాళ్ళను దోచుకోవడం తప్పు, ధనవంతులను దోచుకోవాలి అని చిక్కడు ఖజానాలను కొల్లగొడుతుంటే, తన తెలివిని ఉపయోగించి రాజులకు కానుకలు పంపుతూ "దిలీప చక్రవర్తి"గా పేరుపొందుతాడు దిలీపుడు.
అపారమయిన నిధికి సంబంధించిన రహస్యం ఉన్న మూడు హారాలు మూడు రాజ్యాల రాణుల దగ్గర ఉంటాయి. ఒక వైపు దుర్మార్గుడయిన సింహబలుడి కొడుకు ప్రచండుడు, మరో వైపు చిక్కడు, దొరకడు ఆ మూడు హారాలకోసం తమ శక్తిసామర్థ్యాలను ఉపయోగిస్తారు. చివరకు తామిరువురు కవలలన్న సంగతి తెలుస్తుంది. మూడు రాజ్యాల కుటుంబాలు ఏకమవడంతో కథ సుఖాంతమవుతుంది.
సినిమాలో ఎన్టీఆర్, కాంతారావు ఇద్దరూ హీరోలు, దాదాపు ఇద్దరివీ సరిసమాన పాత్రలు అయినప్పటికీ ఎన్టీఆర్ నటనే ఎక్కువ ఆకట్టుకుంటుంది. మంజువాణి ఇంట్లో ఎన్టీఆర్ నవ్వులు, నటన తప్పక చూడాలి. ఈ సినిమాతోనే ఎన్టీఆర్ ద్వారా "హైసర మచ్చా" అనే మాట బాగా పాపులర్ అయింది. కాంతారావు నటన కూడా బాగుంది, మారువేషాల్లో మాత్రం అదరగొట్టాడు. రాణిగా జయలలిత ఫర్వాలేదు. కొన్ని చోట్ల కాస్త ఛీప్ డ్యాన్సులు వేసినా సందర్భానుసారం అని సరిపెట్టుకోవాలి. రాకుమారిగా కృష్ణకుమారి పాత్ర చిన్నదే కానీ అందంగా కనిపిస్తుంది. త్యాగరాజు, సత్యనారాయణలు విలన్ల పాత్రలకు సరిపోయారు. హీరోల,విలన్ల సైడ్-కిక్‌లుగా విఠలాచార్య గ్యాంగు నటులు ఎక్కువమందే ఉంటారు,అద్రుష్టవశాత్తూ మిగిలిన విఠలాచార్య సినిమాల్లోలా వీళ్ళు చిరాకు పుట్టించలేదు.
ఈ సినిమాకు పెద్ద మైనస్ పాయింట్ పాటలు. ఆ మాటకొస్తే విఠలాచార్య ఏ సినిమాకు అయినా అంతే. ఈ సినిమాలోని పాటలు అంత ప్రాచుర్యం పొందినవి కాదు. సాహిత్యం కూడా అంతంత మాత్రమే. విఠలాచార్యగారికి క్లబ్‌డ్యాన్స్ అంటే ఇష్టంలా ఉంది, అగ్రనటులున్న ఈ సినిమా చూస్తే అవునో కాదో తెలిసిపోతుంది!
సినిమా మొత్తం వినోదమే ప్రధానాంశంగా సాగిపోతుంది. అందులో కొన్ని:
- టైటిల్స్ పడుతున్నపుడే వీలయినంతవరకు ఆ రంగానికి చెందిన బొమ్మలను చూపెట్టడం
- గూడెంలో నాయకుడిగా ఎన్నికవడానికి చిక్కడు రకరకాల పోటీలలో పాల్గొనడం
- సామాన్యుడయిన దిలీపుడు అడవిలో దొరికే వస్తువులనే రాజుకు బహుమతులుగా పంపించి తనకు వచ్చిన బహుమతులను వేరే రాజులకు పంపుతూ తన పేరు ప్రఖాతులను పెంచుకోవడం
- "లక్షలు చేయలేని పని లక్ష్యం చేస్తుంది" "చతురంగబలగాలు సాధించలేని కార్యం చాతుర్యం సాధిస్తుంది" లాంటి పంచ్ లైన్స్
- మంజువాణి-బంగారు బాతు ఎపిసోడ్, దానిమొగుడు, మూతినాకుడుపాడు లాంటి పదప్రయోగాలు
- ధర్మ సత్రంలో చిక్కడు,దొరకడు ఒకరి హారాలు ఒకరు కాజేయడం, ఆసక్తిగొలిపే,అబ్బురపరిచే జిత్తులు
- చివరగా మూడు హారాలను సమన్వయపరచి నిధిని కనుగొనడం
మొత్తమ్మీద విఠలాచార్య తీసిన చిత్రాలలోని అతికొద్ది "నాణ్యమయిన వినోదాత్మక" చిత్రాలలో ఇది ఒకటి.
April 1, 2009 at 3:21 AM
మంచి సినిమా.క్లైమాక్స్ లో విగ్రహాల మధ్య జరిగే ఫైటింగ్ నాకింకా గుర్తు. మళ్ళీ చూడాలి!
April 17, 2009 at 12:21 PM
మీ బ్లాగ్ మొదటి సారి చదువుతున్నాను. బావుందండీ. చిన్నప్పుడు మంచి జానపద కధల్తో బోల్డు సినిమాలొచ్చేవి. ఆ మధ్య బాలకృష్ణ హీరోగా భైరవ ద్వీపం వచ్చింది. ఇప్పుడు కూడా అలా చందమామ కధల్లాంటివి సినిమాలు తీస్తే బావుణ్ణు. పిల్లలు చూడ్డానికి బావుంటాయి. మంచి మార్కెట్ ఉంటుంది అని నా అభిప్రాయం.