ఆ మూడున్నర మార్కులు

Posted by జీడిపప్పు

ఒకప్పుడు ఇంటర్మీడియట్లో 900 కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకున్న వాళ్ళను మెచ్చుకోలుగా చూసేవాళ్ళు, అదొక మైలురాయిగా భావించేవారు.  లాంగ్వేజీలలో 90 కంటే ఎక్కువ తెచ్చుకోవడం కుదరదు కాబట్టి ఏడాదికి 20 మార్కుల చొప్పున రెండేళ్ళకు కలిపి సుమారు 40 మార్కులు పోగా ఇంటర్లో స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ కు 960 ప్రాంతంలో మార్కులు వచ్చేవి. కాలక్రమేణా కార్పొరేట్ కాలేజీల పుణ్యమా అని ఈ "పోగొట్టుకోవలసిన" మార్కులు తగ్గుముఖం పుట్టాయి.

మన తెలుగు అధ్యాపకులకు మార్కులివ్వడం చేతకాదు కాబట్టి 90 దాటనిచ్చేవారు కాదు. వీళ్ళ కొవ్వు అణచాలని ప్రైవేటు కాలేజీల్లో సంస్కృతం ప్రవేశపెట్టారు. ఏ చెత్త వ్రాసినా లేదా ప్రశ్ననే తిప్పి తిప్పి వ్రాసినా సంస్కృతంలో 90 తగ్గేవి కాదు. దానితో రెండేళ్ళ మొత్తాన్ని 970 వరకు తీసుకెళ్ళారు. ఆ తర్వాత ఆ ఐదు మార్కులు పోగొట్టుకోవడం చాలా ఘోరం అని భావించారేమో, నూటికి 99 లేదా నూరు ఇచ్చేయమని ప్రభుత్వానికి కొన్ని బిస్కెట్లు పడేశాక రెండేళ్ళ మార్కుల మొత్తం 980కి చేరుకుంది. ఈ మార్కులు ఇలా పెరుగుతూ, మజ్జిగతూ గత వారం ఇంటర్ ఫలితాలు విడుదలయినప్పటికి 993 సంఖ్యను చేరుకున్నాయి!!

రెండేళ్ళకు కలిపి 993 మార్కులు వచ్చాయంటే సగటున ప్రతి ఏడాది మూడున్నర మార్కులు పోయి ఉండాలి. ప్రైవేటు కాలేజీల్లో చదివేవారికి మేథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో నూరుశాతం మార్కు రావడం గత దశాబ్ద కాలంగా మామూలే కాబట్టి ఈ మూడున్నర మార్కులు మిగిలిన రెండింటిలో పోయి ఉండాలి. అమాయకురాలయిన సంస్కృతాన్ని దంచి నూటికి 99 మార్కులు తెచ్చుకున్నారు అనుకుందాము. అంటే, ఇంగ్లీషులో తొంభయ్యేడున్నర మార్కులు వచ్చినట్లు. సపోజ్, పర్ సపోజ్, సంస్కృతంలో నూటికి నూరు తెచ్చుకుంటే, ఇంగ్లీషులో తొంభయ్యారున్నర తెచ్చుకున్నట్టు!

ఇవన్నీ ఆలోచించాక గత మూడు రోజులనుండి నన్ను వేధించుకుని తింటున్న ప్రశ్నలేమిటంటే - అసలు ఇంగ్లీషులో ఆ మూడున్నర మార్కులు ఎందుకు పోయాయి? కార్పొరేట్ కాలేజీలు ఎందుకు ఈ దారుణానికి ఒడిగట్టాయి? సంస్కృతంలో ఇస్తున్నట్టు ఇంగ్లీషులో కూడా నూటికి నూరు ఎందుకు ఇవ్వడం లేదు? విద్యార్థులకు 1000కి 1000 తెచ్చుకొనే అవకాశం ఎప్పటికి కల్పించబడుతుంది? సంస్కృతంలో నూటికి నూరు ఇస్తున్నపుడు తెలుగులో కూడా వంద మార్కులు ఇవ్వవచ్చు కదా, అపుడు అందరూ ఎగబడి తెలుగు చదువుతారు కదా?

17 comments:

 1. chavakiran said...

  avunu telugu kooDaa 100 ki 100 maarkulu ivvaali.

 2. amma odi said...

  నిజంగా ఎంతదారుణం మూడన్నర మార్కులు తెగ్గోయటం?

 3. పరిమళం said...

  అవును ! తప్పకుండా! తెలుగుకు వంద మార్కులు వేస్తె అందరూ తెలుగే తీసుకుంటారు .కానీ ఆ తెగులు ...క్షమించాలి ...ఆ తెలుగు చదివి మార్కులేసేవారి పరిస్థితి :) :) ?

 4. Hima bindu said...

  :):):)

 5. కొత్త పాళీ said...

  సపోజ్, ఫర్ సపోజ్ .. ఆ సదరు విద్యార్ధి ఆ మూడూన్నరు మార్కులు కోల్పోయే తప్పేదో రాసి ఉంటుందేమో?
  రెండో భాషగా సంస్కృతంతో తూగేట్టు మార్కులేస్తే తెలుగు తీసుకునే విద్యార్ధుల సంఖ్య పెరగొచ్చు. కానీ ఇంటర్లో తెలుగు తీసుకున్నంత మాత్రాన ఆ విద్యార్ధుల తెలుగు మెరుగు పడుతుందనుకోను. తెలుగు భాషకి వొరిగేది అస్సలేమీ ఉండదు.

 6. మురళి said...

  మీరు కోరుకున్న రోజు త్వరలోనే వస్తుంది.. ఎలా అని మాత్రం అని అడక్కండి.. ఇప్పటి వరకు ఎలా పెరిగాయో అలాగే.. బాగుంది టపా.. ప్రకటనల మీద నిషేధం లేకపొతే ఈ పాటికి కాలేజీల వాళ్ళ హోరు ఎన్నికలని మించి పోయేది..

 7. Bolloju Baba said...

  ఒక పాత జోకు
  ఒకసారి, ఎదో తెలుగు పరీక్షల పేపర్లు దిద్దుతున్న చోట ఒక మాస్టారు నూటికి ఎనభై తొంభైలు వేసేస్తున్నారంటూ ఒక పెద్దాయన, విశ్వనాధో మరొకరో వంటి మరో పెద్దాయనతో బుగ్గలు నొక్కు కుంటూ చెప్పాట్ట.
  దానికి ఆ విశ్వనాధో మరొకరో అన్నాట్ట, మార్కులు ఎక్కువ రావటం అనేది దిద్దే వాని అజ్ఞానం పై ఆధారపడి ఉంటుంది నాయినా. దిద్దేవాడు అజ్ఞాని అయితే ఎక్కువ మార్కులు వేసేస్తాడు. జ్ఞాని అయితే అసలు మార్కులే విదపడు.

  ఇక ప్రస్తుతానికి వస్తే
  ఎక్కువ మార్కులు రావటమనేది అజ్ఞానం పై కాక భయం పై ఆధారపడి ఉన్నట్లు అనిపిస్తోంది.

  దిద్దేవాడు భయస్తుడైతే, ఎందుకొచ్చినగొడవ అసలే రీకౌంటింగులు, రీవాల్యూయషనులు, జిరాక్స్ కాపీలు అంటున్నారు, కనుక ఫుల్లు మార్కులు వేసేస్తే పోలా (బోర్డర్లో ఉండే కేసులకు) అన్నట్టు ఉంటుంది దిద్దేవాని ఆలోచనా సరళి. ఎందుకంటే ఏ గొడవా ఉండదు కనుక.

  కొండొకచో ఒకరో ఇద్దరో ధైర్యంగా నిలబడినా, రీవాల్యూషనులో కొంతమంది జాలిగుండె అజ్ఞానులు ఒకవేళ ఫుల్లు మార్కులు వేస్తే, ముందు దిద్దిన ఆసామీకి ఫైనులు (పాపం వాడు స్పాటులో దిద్దినందుకు అయిదు వేలు సంపాదిస్తే, ఇలా డిస్క్రిపెన్సీ వచ్చినందుకు పాతికవేలు ఫైను కట్టాలి)

  వెరసి చెప్పచ్చోదేమిటంటే, ముందుముందు వెయ్యికి వెయ్యి లేదా వెయ్యినూటపదహార్లు వచ్చినా హాశ్చర్యపడక్కరలేదు.

 8. రవి said...

  వచ్చే ఎన్నికల్లో, ఏ పొలిటికల్ పార్టీనో దీన్ని కూడా మ్యానిఫెస్టో లో చేరుస్తుంది లెండి. మాకు ఓటేస్తే, నూటికి నూరు మార్కులు వేయిస్తాం అంటూ..

 9. సుజాత said...

  @రవి,
  బాగా చెప్పారు.

  జీడిపప్పు గారూ, మీ ఆవేదన అర్థం చేసుకోదగ్గదే! దారుణం ఆ మూడున్నర మార్కులూ ఇవ్వకపోవడం. విద్యార్థుల ఉసురు వాళ్లకు కొట్టక మానదులెండి!

  కార్పొరేట్ స్కూళ్ళు, కాలేజీలు వచ్చాక ఇలా మార్కులు వరదలై పారటం మొదలెట్టిన సంగతి మీకు నేను చెప్పాలా? కార్పొరేట్ స్కూళ్ళలో ఎనిమిదో తరగతి పూర్తయి తొమ్మిదో తరగతికొచ్చాక, తొమ్మిదో తరగతి సిలబస్ చెప్పటం లేదు. పదో తరగతి సిలబస్. మళ్ళీ పదో తరగతి లోనూ పదో తరగతి సిలబస్సే!రెండేళ్ల పాటు రుబ్బిన సబ్జెక్టులో 589 మార్కులు రాకపోతే ఆ సబ్జెక్టుకే అవమానం కదూ!

  సంస్కృతం గురించి మీరు చెప్పిన సంగతి కూడా నిజమే! స్కోరింగ్ కదాని స్కూళ్లలో కూడా దానికే డిమాండ్. ఇంతా చేసి నేర్చుకు చచ్చేదేమీ ఉండదు. రెండు, మూడక్షరాల పదాలూ, వాక్యాలూనూ!మీరన్నట్లు తెలుగుకు కూదా నూటికి నూరు ఇచ్చేస్తే, తెలుగైనా నేర్చుకుంటారు.

  బాబా గారు సాధికారంగా చెప్పిన విషయాలు కూడా విస్మరించకూడదు.

 10. సూర్యుడు said...

  Good one :-)

 11. చదువరి said...

  గతంలో గ్రూపు సబ్జెక్టుల్లో శాతం ఎక్కువగా ఉండేది. మిగతా రెంటిని కూడా కలుపుకుంటే శాతం బాగా తగ్గిపోయేది. 90కిపైగా వచ్చిన వాళ్ళు కూడా భాషలతో కలుపుకుంటే 80ల్లోకొచ్చేవాళ్ళు. ఇప్పుడది తిరగబడింది; భాషల్లో 95కి దిగడం లేదు.

  పైగా ఇంకో విశెషమేంటంటే.. ఇంటర్మీడియేటు ఫ్యాక్టరీల్లో వారానికి ఒకటో అరో మాత్రమే భాషల క్లాసులుంటాయి. పిల్లలు సంవత్సరమంతా చదవరు; సరిగ్గా పరీక్షలకు నాలుగైదు రోజులు ముందు మాత్రమే ఈ సబ్జెక్టులు చదువుతారు. మార్కులు మాత్రం 95లు 96లూ!

 12. Anonymous said...

  I agree with kothapali garu. Telugu will die for sure. It is just an accident waiting to happen. Do whatever you can, nobody can actually save this language. The reason is that we in general do not have "that killing instinct" like the Tamilians, Malayalees or any other. Hyderabad city is the best example where the language has been dying.

 13. Anil Dasari said...

  ఈ కార్పొరేట్ కార్ఖానాల్లో ర్యాంకులు కొట్టేసి వచ్చేసే వాళ్లు పై చదువుల్లో ఏమైపోతున్నారు? ఇంటర్, ఎమ్‌సెట్ ర్యాంకులు అసలు సత్తాకి అద్దాలు కావా?

 14. చిలమకూరు విజయమోహన్ said...

  సంస్కృతం భాషగా తీసుకుంటే సంస్కృతానికి ఎంతప్రయోజనం చేకూరిందో అదే మాదిరి తెలుగుకు కూడా ఒరిగేదేమీలేదు వీళ్ళకు మార్కులమీద యావేగాని భాషపై ప్రేముంటుందంటారా ?

 15. deitaDi said...

  @ డుబుగ్స్

  మస్తుంది టపా! మస్త్ రాష్నవ్. ఆ కార్పొరేట్ కాలేజ్ లు తీస్కొచ్చిన ఇంకో ట్రెండు - కాలేజ్ లను జైల్ల కంటె బత్తర్ చేసుడు. కుయ్ అనొద్దు, కయ్ అనొద్దు, జోకులెయ్యొద్దు, నవ్వొద్దు, దోస్తుల్తోటి మాట్లాడొద్దు, జుట్టెక్కువ పెంచద్దు, పోర్ల దిక్కు సూడొద్దు.. బాంచన్.. discipline పేర్జెప్పి భౌరన్ భౌరన్ జేసెటొల్లు

  @ Anonymous
  మనదే ఊరు తమ్మి? తెలుగు రాసుడు నేర్పిర్రా మీ ఊళ్ళె?

 16. తెలుగోడు said...

  డుబుగ్స్.... ఎంత అన్నాయం జరిగిపోతోంది. ఈ results ఏవో ఎన్నికల ముందు వచ్చుంటే, నీ పాయింట్ మన సిరంజీవో, చంబాబో, రెడ్డిగారో ఎవరో ఒకరు, వాళ్ళ agenda లో పెట్టేసుకునేవారు కదా!! కనీసం నీకు ముందుచూపు లేకుండా పోయింది. చా!!!

 17. Vinay Chakravarthi.Gogineni said...

  baagundi.............post.niceone.............baaba gari comment chala reasnable ga vundi.........

Post a Comment