సాహితీ రంగంలో సరికొత్త విప్లవం - బర్గరములు

Posted by జీడిపప్పు

నాకు చిన్నప్పటినుండీ పద్యభాగం అంటే ఇష్టం లేదు. "తెలుగు భాష నిరాదరణకు గురి అవుతున్నది" అంటూ ఉద్యమాలు నడుస్తున్న ప్రస్తుత హైటెక్ కాలంలో ఆ కఠినపదాలు, ఛందస్సుల వల్ల అస్సలు ఉపయోగం లేదు అని నమ్ముతాను. ఆ చెప్పేదేదో అందరికీ అర్థమయ్యేలా సరళమయిన పదాలలో చక్కని వాక్యాలలో చెప్తే ఆసక్తిగా ఉంటుంది, ఎక్కువ కాలం నిలిచి ఉంటుంది కదా? ఉదాహరణకు: విద్యార్థి దశ దాటిన వారిలో ఎంతమందికి ఈ పద్యం అర్థమవుతుంది? దీని అర్థం చేసుకోవాలంటే తొలుత పదాలను విడగొట్టాలి, పిమ్మట వాటికి అర్థాలు తెలుసుకోవాలి, తదుపరి ఆ అర్థాలను కలిపి మళ్ళీ వాక్యాలు తయారు చేయాలి, పిదప ఆ వాక్యాల్లోని సారాన్ని గ్రహించాలి. పోనీ ఇంతా చేస్తే ఆ పద్యం ఎన్నాళ్ళు గుర్తుంటుంది? అందుకే ఆ చెప్పేదేదో ఇలా సారాంశాన్నే చెప్తే చాలు, చక్కని పదాలతో సులభంగా బుర్రకెక్కుతుంది. bottom line ఏమిటంటే -  నాకు పద్యాలు నచ్చవు. చదవడం ఇష్టం లేదు, వ్రాయడం రాదు.

ఇక పోతే, నాకు "ఏదో" వ్రాసి పేరు తెచ్చుకోవాలనే కోరిక ఉంది. అందరూ నా రాతలను చూసి "ఆహా ఓహో" అనాలి. పద్యాలు వ్రాయడం కుదరదు కాబట్టి దీనికున్న మార్గాలు రెండు. ఒకటి - కథలు వ్రాయడం, రెండు - కవితలు వ్రాయడం. కవితలు వ్రాయడం పట్ల నాకు ఆసక్తి లేదు. కథలు వ్రాయడం పెద్దగా రాదు. ఈ మధ్యనే 2019కి ఒక మంచి కథ వ్రాయాలని "విజన్ 2019" అనే ప్రాజెక్టు మొదలుపెట్టి తెలుగు కథలు ఎడా పెడా చదివేస్తున్నా. కానీ అప్పటివరకు ఆగడం కుదరదు కదా. ఏదో ఒకటి వ్రాసి పేరు తెచ్చుకోవాలి అనే గాఠ్ఠి నిరణయానికి (మొన్న ఏవో వార్తలు చూస్తుంటే "నిరణయం" అంది న్యూస్ రీడర్) వచ్చేసాను.

ఎక్కడో వెతకపోయిన మిడ్‌నైట్‌మసాలా వీడియో యూట్యూబ్ లోనే దర్శనమిచ్చినట్లు నా సమస్యకు మార్గం నేను చూసే బ్లాగుల్లో మరియు వెబ్ పత్రికల్లో కనపడింది -- "నానీలు" లేదా "నానోలు" రూపంలో. నాకు ఇవి భలే నచ్చేసాయి. పట్టుమని పది పదాలతో పొందికగా వాక్యం వ్రాయడం చేతకాకపోయినా ఫరవాలేదు, నానోలు రాసేయచ్చు. దీనికి కావలసినదల్లా ఒక వాక్యాన్ని చీల్చి చండాడి అందులో ఉన్న నాలుగు పదాలను గిలక్కోట్టి ఒకదాని కింద మరొకటి అమర్చడమే. అది చూసి కొందరు 'అబ్బో యబ్బో" అంటారు. వీటిని ఎవరు కనిపెట్టారో కానీ, వారికి దండేసి దణ్ణం పెట్టి సన్మానం చేయాలి!!

నేను కూడా నానోలు రాసేద్దామని ఒక పేపరునుండి నాలుగు పదాలను కత్తిరించి డబ్బాలో వేసి గిలక్కొట్టడం మొదలుపెట్టాను. కానీ అంతలో గుండెల్లో కలుక్కుమంది... భాగ్యం కోసం 13 వేలు ఇవ్వాల్సినప్పుడు చిన్నారావుకు అనిపించినట్లు. ఎవరో కనిపెట్టిన ఈ "వాక్య విధ్వంస ప్రయోగాన్ని" నేనూ అనుసరిస్తే నాకూ వాళ్ళకూ తేడా ఏముంది? నేను సరికొత్త ప్రక్రియ కనిపెట్టి, తెలుగు సాహితీ రంగంలో విప్లవం సృష్టించి, మరుగునపడుతున్న తెలుగుపై వెలుగులు కురిపించి, ఇంకేదో చించాలని ఇంకోసారి నిరణయించుకొని తెలుగు సాహితీ జగత్తులో ఇప్పటివరకు లేని అత్యద్భుత పాకిక్రియను, క్షమించాలి, ప్రక్రియను కనిపెట్టాను. దానిపేరే "బర్గరము".

పాణ్యం నిఘంటువులో "బర్గరము" అంటే ఉన్న అర్థం- మూడు పదాలతో ఏర్పడిన వాక్యాలు మూడు ఉన్న సమూహం. ఉదాహరణకు:

అయిపోయాయి ఎన్నికలు రాష్ట్రంలో
ఎదురు చూస్తున్నారు అందరూ
చకోరపక్షుల్లా ఫలితాల కోసం

"రాష్ట్రంలో ఎన్నికలయిపోయాయి, అందరూ ఫలితాలకోసం చకోరపక్షుల్లా ఎదురుచూస్తున్నారు" అనే ఒక మామూలు వాక్యాన్ని చీల్చి చెండాడి గిలక్కొడితే ఒక అత్యద్భుత "బర్గరము" తయారయింది. చూసారా, సాహితీ రంగాన్ని కొత్తగుంతలు, పుంతలు తొక్కించడం ఎంత సులభమో?

నానోలు కేవలం నాలుగు పదాలతో కూడుకున్నవి. కానీ "బర్గరములు" తొమ్మిది పదాలతో కూడుకున్నవి. నాలుగు పదాలను ఒకదాని కింద ఒకటి అమర్చడం కంటే, తొమ్మిది పదాలను వాక్యానికి మూడేసి అమర్చడంలో రచయిత సామర్థ్యం బయట పడుతుంది. పైగా బర్గరములో నానోల కంటే ఎక్కువ సాహితీ విలువలు ఉంటాయి. కాబట్టి ఇకనుండి అందరూ నానోలు పక్కన పెట్టి బర్గరములు వ్రాయడం మొదలుపెట్టి తెలుగు సాహితీ రంగాన్ని ఇంకో దిక్కుకు తీసుకెళ్ళాలి.

22 comments:

  1. chavakiran said...

    :)

  2. Kathi Mahesh Kumar said...

    http://parnashaala.blogspot.com/2009/04/blog-post_21.html

    గుల్జార్ మూడుపాదాల కవితలైన త్రివేణి ల గురించి నేను రాసిన టపా.

  3. మేధ said...

    :)

  4. Unknown said...

    "సాహితీ రంగాన్ని కొత్తగుంతలు, పుంతలు తొక్కించడం ఎంత సులభమో" :)

  5. కొత్త పాళీ said...

    Actually your attempt is pretty good - nothing to laugh at.
    కానీ ఎవరో దేనికోసమో చకోరపక్షుల్లా ఎదురు చూస్తున్నారని చెప్పడం మాత్రం చాలాచాలా పాత కవిసమయం .. ఆంగ్లంలో clice అంటారు.

  6. Shashank said...

    అందుకో మా అభివందనాలు
    బుడుగు భలే మంచి
    పాకిక్రియ ముచ్చటగా కనుక్కునావోయి.


    భలే భలే.. ఉండు సాక్షీ, ఈనాడు లో కొన్ని వాక్యాకు పట్టుకొని బర్గరం చేసేస్తా.. నీకంటే ముందు పేరు తెచ్చేసుకుంటా... రేపే నా "బర్గరీయం" పుస్తకం విడుదల చేస్తా. best ఒక program రాసేస్తే పోలే.. మన ప్రయేయం లేకుండా వాటంతట అవే రాసుకుపోతాయి..

  7. చెడుగుడు said...

    ఈ మూడు లైన్ల చిన్న కవితలనే హైకులు అంటారనుకుంటాను. నిజమేనా??

  8. భాస్కర రామిరెడ్డి said...

    జీడిపప్పు గారు, మీకు చేదోడుగా వుంటుందని మరో బర్గర్

    జీడిపప్పు రాసాడు ఒకటపా

    కనిపెట్టాడు తెలుగు బర్గర్

    తిన్నాము మేము బర్గరం.

  9. Anil Dasari said...

    బర్గరములు Carls Jr బర్గర్ అంత బాగున్నాయి. ఇంకా పిజ్జీర్ణములు, చలూపద్యములు, లాతేత్యములు కూడా కనిపెట్టి పారెయ్యండి.

  10. Anonymous said...

    @కొత్త పాళీ: did you mean "cliché"?

  11. Varunudu said...

    "Padya Bhagam Shuddha dandaga" - Mallee modalettaavaa ..:escape:

  12. Naga said...

    హూఁ.. నానోకు వ్యతిరేకంగా అమ్మోలు కూడా రాయెచ్చు.. ఇంకో ఐడియా :)

  13. జీడిపప్పు said...

    ముందుగా - ఈ పోస్టు వెనుక ఉన్న ఉద్దేశ్యమేమిటో అందరికీ బాగా అర్థమయి ఉంటుంది అని ఆశిస్తున్నాను.

    @ చావాకిరణ్ గారు - :)

    @ మహేష్ గారు - బాగుంది మీరు వ్రాసిన టపా. దానికి తెలుగు వెర్షన్ ఈ "బర్గరము" ;)

    @ మేథ గారు - :)

    @ ఫణి ప్రదీప్ గారు - మన కొత్త నినాదం - "నానోలు మానండి, బర్గరములు వ్రాయండి"

    @ కొత్తపాళీ గారు - ధన్యవాదాలు

    @ శశాంక్ అన్నా - నువ్వు కత్తి. హింటిస్తే చాలు, చెలరేగిపోతావు కదా :)

    @ శ్రీను గారు - హైకూలకు మూడు పదాలే వాడాలన్న నియమం లేదనుకుంటా. బర్గరములు ఆ నియమం పాటించాలి.

    @ భాస్కర రామి రెడ్డి గారు - హ హ్హ హ్హా భలే ఉంది మీరు రాసిన బర్గరము

    @ అబ్రకదబ్ర గారు - అసలు సంగతి పసిగట్టేసారు!!పిజ్జీర్ణములు, చలూపద్యములు నా? కేక. నానోలకు గట్టి పోటీ ఇవ్వాలంటే ఇలాంటివి కూడా కనిపెట్టాల్సిందే. మీరూ ఒక చెయ్యి వెయ్యండి.

    @ వరుణుడు గారు - ఏదో మీ అభిమానం :) బ్లాగు ఇపుడే మొదలుపెట్టరా?

    @ నాగన్న గారు - ఈ ఐడియా ఏదో భలే ఉంది. అపుడు అమ్మోలకు భయపడి నానోలు పారిపోతాయేమో!!

  14. చదువరి said...

    బాగుందండీ మీ బర్గరము
    అవిడియా ఎంతో అబ్బురము
    "అమ్మో" మాత్రం సూపరము!

    మీ బ్లాగు గాలిలో ఏదో మహత్తుందండి.. నేనూ బర్గరుణ్ణయిపోయా!

  15. కొండముది సాయికిరణ్ కుమార్ said...

    హ హ హ. బాగుందండి 'బర్గర' ప్రయోగం. వ్రాసేవాళ్ళకు బహుమతులు కూడా ప్రకటిస్తే ఇంకా బాగుంటుంది.

  16. జీడిపప్పు said...

    @ చదువరి గారు - భలే ఉంది మీ బర్గరము. బర్గరశతకం మొదలుపెట్టండి

    @ కిరణ్ కుమార్ గారు - బహుమతి మాత్రమే కాదు, తొందర్లో ప్రముఖ నగరాల్లోని మురికివాడల్లో బర్గర సభలు నిర్వహించి సన్మానం చేయాలన్న ఆలోచన ఉంది :)

  17. teresa said...

    :)

  18. నేస్తం said...

    హ హ 'అమ్మో'లు... బాగుంది :)

  19. మహాపోకిరి said...

    "అయిపోయాయి ఎన్నికలు రాష్ట్రంలో
    ఎదురు చూస్తున్నారు అందరూ
    చకోరపక్షుల్లా ఫలితాల కోసం"

    దీన్నే simpleగా " ప్రజలు ఎన్నికల ఫలితాల కోసం చాలా ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు." అని కూడా రాయొచ్చు... చకోరపక్షులు ... తొక్క .. తోలు ఎందుకు.... ఆ చకోరపక్షి అనే పదం ఎంతా ఆశక్తిగా ఎదురు చూస్తున్నారో చెప్పటానికి వాడావు.

    ఒక్కొక్కొళ్ళకి ఒక్కోటి ఇష్టం వుంటాయి... కొంత మందికి లెక్కలంటే ఇష్టం, కొంతమందికి సైన్స్ అంటే ఇష్టాం, ఇంకొంతమందికి ఇంకేవో అంటే ఇష్టం/ఆశక్తి.

    పదాలతో ఆడగలగటం ఒక కళ. simpleగా అందరూ చెప్పగలరు. కాని ఆకట్టూకోవాలంటే ఏదో ఒక ప్రత్యేకత వుండాలి. పద్యం అలా ఆకట్టుకోగల ఒక ప్రత్యేకత.

  20. madhu said...

    జీడిపప్పు గారు, ఇన్నాళ్ళూ ఎలా మిస్ అయ్యానో ఈ బర్గరము ! :-) నవ్వలేక నవ్వలేక నవ్వాను ! కామెంట్లు కూడా అంతే విందు గా, పసందుగా ఉన్నాయి.

    ఈ హైకులో, బోకులో, చదవలేక చచ్చే చావోస్తోంది ఈ మధ్య ! స్నేహితులు రాస్తుంటే, తప్పించుకోలేము కూడానూ ! ఆ అమ్మోలేవో త్వరగా వస్తే బాగుణ్ణు ! ఈ నానోల గొడవ వదిలిపోతుంది !

  21. సమతలం said...

    బాగున్నాయి బర్గరాలు
    నాదొకటి సీరియస్ గా
    తాత్వికత మానసిక రోగం
    హేతుకత మానవ సంకుచితం
    జీవికత మనిషి ప్రాపకం
    సమతలం

  22. Dr. TALATHOTI PRITHVI RAJ said...

    జీడి పప్పు గారి సాహిత్యావగాహనకి నమస్కారం. కొన్ని ప్రక్రియలపై మీకున్న చిన్నచూపు ఏమిటో తెలిసిపోతుంది. నాకు తెలిసి రెండు రకాల ప్రచారకులు ఉంటారు. ఒకటి బాగాలేని దాన్ని ప్రచారం చేసేవారు. బాగాలేనిదాన్ని ప్రచారం చేసేదానికంటే బాగున్న ఆకొంచంనైనా విస్తృత ప్రచారం చేసేవారు. బాగాలేని కవిత్వం, ప్రక్రియ నానీలు , నానోలు అని మీరు ఒక దురభిప్రాయానికి వచ్చారు. ఎంతో వ్యాఖ్యానించ తగినవి అన్ని ప్రక్రియలలో ఉన్నాయని గమనించండి.

Post a Comment