Madoff మహా స్కాం

Posted by జీడిపప్పు

మన ఊళ్ళల్లో చిన్న చిన్న స్కాములు జరుగుతుంటాయి. ముందు ఒకరు 1000 రూపాయలు కడతారు, వాళ్ళు ఇంకో నలుగురిని ఆ స్కీంలో చేర్పిస్తే మొదటివాడికి ఒక గిఫ్ట్ ఇస్తారు. ఒకరికొచ్చిన మిక్సీ చూసి పొలోమని అందరూ కడతారు. కొద్దిరోజులకు ఆ స్కీం పెట్టినవాడు ఉడాయించేస్తాడు. జనాలు వెయ్యిరూపాయలు పోయాయే అని నిట్టూరుస్తారు. ఇలాంటి స్కీంలు చట్టానికి అంత సులభంగా దొరకవు. చాలామంది రిజస్టర్ చేసుకోకుండా కంపెనీ పెట్టి మోసం చేస్తుంటారు. పైగా పెద్దగా చదువుకోని, ఆర్థిక వ్యవహారాల గురించి తెలియని వాళ్ళని మోసం చేయడంలో వింత ఏమీ లేదు.

చట్టాలు, పోలీసులు అంటూ వినపడే అమెరికాలో  Madoff అనే పెద్దాయన చట్టబద్దంగా ఒక వ్యాపారం మొదలుపెట్టాడు. సుమారు 30 ఏళ్ళ పాటు వ్యాపారం నడిచిన తర్వాత 2008 డిసెంబరులో తాను చేస్తున్న వ్యాపారమంతా బోగస్ అని  బాంబు పేల్చాడు. దానివల్ల నష్టం 50 - 65 బిలియన్ డాలర్ల మధ్య ఉంటుంది. రూపాయల్లో అయితే ఈ స్కాం విలువ ఓ మూడు లక్షల కోట్ల రూపాయలన్నమాట!!  అమెరికా అసలే ఆర్థికమాంద్యంతో అతలాకుతలమవుతుంటే మధ్యలో ఈ స్కాం ఒకటి అని అందరికీ మరింత కోపాన్ని తెచ్చింది. కాస్తో కూస్తో సంతోషించదగ్గ విషయం ఏమిటంటే, ఇందులో సామాన్యుడు ప్రత్యక్షంగా నష్టపోలేదు. నష్టపోయింది అత్యాశ గల ధనవంతులు, కొన్ని బ్యాంకులు.

అసలు ఏమి జరిగిందంటే - A అనేవాడు Madoffకు 10 రూపాయలిచ్చాడు. ఆ 10 రూపాయలతో "ఎదో" చేస్తాను అంటాడు Madoff. అది ఏమిటో స్పష్టంగా చెప్పడు. నీకు డబ్బు కావాలా వద్ద అని మభ్యపెడతాడు. ఆ డబ్బంతా స్టాక్స్ లో పెట్టినట్లు పత్రాలు సృష్టించాడు. నిజానికి ఆ డబ్బంతా బ్యాంకులో తన ఎకౌంటులో ఉంచుకున్నాడు. ఏడాది తర్వాత A కి 10% డివిడెండ్ అంటూ ఒక్క రూపాయి  వచ్చింది. అది చూసిన B , C లు ఇద్దరూ చెరో పది రూపాయలు ఇచ్చారు. అంటే మొత్తం Madoff దగ్గర ఉన్న సొమ్ము 29 రూపాయలు. దాన్ని అలాగే బ్యాంకులో ఉంచి మరో ఏడాదికి ముగ్గురికీ తలో రూపాయి బోనస్ ఇచ్చాడు. అంతలో C తన డబ్బులు మొత్తం తీసేసుకున్నాడు. ఈ మధ్యలో Madoff ఓ రెండు రూపాయలు నొక్కేస్తాడు. లెక్కప్రకారం ఇంకా A,Bల పెట్టుబడి ఉంది. అంటే 20 రూపాయల పెట్టుబడి ఉండాలన్నమాట. కానీ Madoff దగ్గర ఉన్నది 30-4-10-2 = 14 మాత్రమే!

ఈ విధంగా కొత్తగా వచ్చినవారి దగ్గర తీసుకొని పాతవాళ్ళకు ఇచ్చేవాడు. ఇక నెల నెలా ప్రతిఒక్కరికి ఆరేడు పేజీల స్టేట్‌మెంట్స్ పంపించేవాడు. చాలమందికి అదేమిటో కూడా అర్థమయ్యేది కాదు. కాకపోతే పేపరు పైన తమ డబ్బు పెరుగుతుంటే చాలనుకున్నారు. Madoff విలాసవంతమయిన పార్టీలు ఇచ్చేవాడు. అతిథులుగా రాజయకీయ నాయకులు, సెలెబ్రిటీలు వచ్చేవారు. వారికి ఇంద్రభవనాల్లో అతిధి సత్కారాలు, ఖరీదయిన బహుమతులు ముట్టేవి.

తన ఇమేజి పెంచుకోవడానికి Madoff చేసిన జిమ్మిక్కులు భలే ఉంటాయి. సాధారణ మిలియనీర్లకు అందుబాటులో ఉండేవాడు కాదు. Madoff దర్శనం కలిగితే చాలని మిలియనీర్లు తహతహలాడేవారు. కొద్ది రోజులు తిప్పించుకున్న తర్వాత అపాయింట్‌మెంట్ ఇచ్చేవాడు. తమదగ్గర ఉన్న మిలియన్లను తీసుకోమని మిలియనీర్లు ప్రాధేయపడినా అంత సులభంగా అంగీకరించేవాడు కాదు. దాంతో Madoff అంటే మరింత క్రేజ్ పెరిగిపోయేది. Madoff తన కంపెనీలో ఉద్యోగులను చాలా బాగా చూసుకొనేవాడు. సెక్రెటరీ జీతం $500,000. మేనేజర్ల జీతం మిలీయన్లలో ఉండేది.  $5000 లేదా అంత కంటే ఎక్కువ transaction జరిగితే వెంటనే అధికారులకు తెలిసి దాని పైన ఒక కన్నేసి ఉంచుతారు. అలాంటిది మిలియన్లు చేతులు మారినా Madoff పైన చర్య తీసుకోలేదంటే ఏ స్థాయిలో చట్టాన్ని అవినీతిమయం చేసాడో తెలుస్తున్నది.

నిరాటంకంగా సాగిపోతున్న ఈ వ్యాపారాన్ని Recession వెలుగులోకి తెచ్చింది. 2008 డిసెంబరులో కొందరు ఇన్వెస్టర్లు తమ డబ్బు వెంటనే కావాలని పట్టుబట్టారు. లేని డబ్బు తీసుకురావలని రావడంతో విధిలేక Madoff అసలు సంగతి తన కొడుకులకు చెప్పాడట. అది తెలుసుకున్న చట్టం అదర బదరా రంగంలోకి దిగి Madoff పైన చర్యలు తీసుకోవడం మొదలుపెట్టింది.

Madoff నోరు విప్పితే ప్రస్తుత ప్రభుత్వంలోని, గత ప్రభుత్వాల్లోని కొందరు రాజకీయ నాయకుల జీవితాలు ముగుస్తాయి కాబట్టి పెద్దతలకాయలు "బాబ్బాబూ ఎలాగూ నీకు 70 ఏళ్ళు, ఎక్కువ కాలం బ్రతకవు. నీ కుటుంబాన్ని మేము చూసుకుంటాము, మా పేర్లు మాత్రం చెప్పకు" అని బ్రతిమాలుకొని ఉంటారు. దయతలచిన Madoff ఈ నెల 12 న తన పైన ఉన్న అన్ని అభియోగాలను అంగీకరించాడు. అన్ని తప్పులకు తానే బాధ్యుడినన్నాడు.

Madoff ఆస్తులన్నీ సీజ్ చేసారు. వీటివిలువ మహా అయితే ఒక బిలియన్ డాలర్లు ఉంటుంది.  తెలియని ఆస్థులు, స్విస్ బ్యాంక్‌లో డబ్బులు మొదలయిన వివరాలు Madoffకే ఎరుక. చేసిన నేరానికి 150 ఏళ్ళ శిక్ష అనుభవించి, 170 బిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాలి అని తీర్పునిచ్చారు. 150 ఏళ్ళ శిక్ష అనుభవించాలంటే 70 + 150 = 220 ఏళ్ళు బ్రతకాలి. అది  మానవుడికి సాధ్యం కాదు, కేవలం తాబేలుకే సాధ్యం. అందుకే ఆరిజోనా ఎడారిలోని రహస్య భూగర్భ  పరిశోధనశాలలో Madoff ను తాబేలుగా మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

7 comments:

  1. Shashank said...

    ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా చాలా మంది ఫించన్ డబ్బు ఈ స్కాం లో ఇర్రుకొని ట్యాంక్ బండ్ ఎడమ కాలువలో కలిసాయి. ఒక 95 సంవత్సరాల వృద్ధుడు పాపాం ఈ స్కాం వళ్ళ తిరిగి పని మొదలెట్టాల్సి వచ్చింది. అలా చాలా మంది నష్టపోయారు.

  2. శ్రీనివాస్ said...

    kade desamu scamulakanarham

  3. ఉమాశంకర్ said...

    Boston కేంద్రం గా పనిచేసె ఒక సంస్థ దాదాపు పదేళ్ళుగా మేడాఫ్ సంస్తలో "ఏదో" జరుగుతోంది, ఏరకంగా చూసినా పెట్టుబడులమీద ఇంత రాబడి అసాధ్యం అని Securities and Exchange Commission (SEC) వద్ద మొత్తుకుంటూనే ఉంది, ఎవడూ పట్టించుకున్న పాపాన పోలేదు.

    రాబడి కంటే ఖర్చులెక్కువున్న సగటు మధ్యతరగతి కుటుంబం ఇలాంటి ఆకర్షణీయమైన వడ్డిరేట్లకి ఆశ పడితే అందులో తెలివితక్కువతనం ఉన్నా కాస్తోకూస్తో అర్ధం ఉంది..నాకర్ధం కానిదేమిటంటే స్పీల్బర్గ్ లాంటి హాలీవుడ్ హేమా హేమీలూ, ల్యారీ కింగు లంటి పెద్దమనుషులూ నష్టపోయినవారిలో ఉండటం.. మరీ అంత అత్యాశా?

  4. చిలమకూరు విజయమోహన్ said...

    అందుకే ఆరిజోనా ఎడారిలోని రహస్య భూగర్భ పరిశోధనశాలలో Madoff ను తాబేలుగా మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. బాగుంది.

  5. కన్నగాడు said...

    ఒక్క దెబ్బతో అందరికీ 'MAD - OFF' పిచ్చి వదిలించాడన్నమాట

  6. Anil Dasari said...

    ఈ పాంజీ స్కీముల్ని ఓ పక్క చట్ట వ్యతిరేకం అంటూనే ఎలా అనుమతిస్తారో నాకర్ధం కాదు. మన దేశంలోనూ ఉన్నాయిలాంటివి బోలెడు. మొన్నీ మధ్యనే పెరల్స్ అనేదొకటి బయట పడింది. మాడాఫ్ స్థాయిలో కాదనుకోండి, కానీ చాలా మందినే ముంచిందది. అసలు తప్పు అత్యాశకు పోయి వీటిలో చేరే జనాలదే. తెలిసి తెలిసే అడుసులో దిగుతుంటారిలాంటి జీవులు.

    ఈ సందర్భంగా బుడ్డ బుష్ ఇన్ఫేమస్ డవిలాగ్గుర్తొస్తోంది: 'Fool me once, shame on you. Fool me twice .. '.

  7. Suresh said...

    Good post!
    ''150 ఏళ్ళ శిక్ష అనుభవించాలంటే 70 + 150 = 220 ఏళ్ళు బ్రతకాలి. అది మానవుడికి సాధ్యం కాదు, కేవలం తాబేలుకే సాధ్యం. అందుకే ఆరిజోనా ఎడారిలోని రహస్య భూగర్భ పరిశోధనశాలలో Madoff ను తాబేలుగా మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.''
    This line is very good!
    Thanks!

Post a Comment