లోక్‌సత్తాకు ఓటు వేస్టా?

Posted by జీడిపప్పు

ఇందాకే ఎంబీయస్ గారి ఆర్టికల్ ఒకటి  చదివాను. చాలా ఆలోచింపచేసే ఆర్టికల్ అది. ఒకానొకప్పుడు నాకు జేపీగారి మీద పెద్ద నమ్మకం ఉండేది కాదు కానీ గత కొద్ది రోజులుగా కొన్ని వీడియోలు చూశాక, బహుశా ఆంధ్రప్రదేశ్‌ను భిక్షాంధ్రప్రదేశ్ గా మార్చడానికి తహ తహలాడుతున్న మిగతా పార్టీల పైన అయిష్టత వల్ల  కావచ్చు, జేపీగారి మీదా సదభిప్రాయం కలిగింది. కానీ ఆయన చెప్తున్నవి వింటుంటే ఏదో ఫాంటసీ సినిమా చూసినట్లు అనిపిస్తుంది. వింటున్నంత సేపూ రంగు రంగుల ప్రపంచం కనిపిస్తుంది. కాస్తో కూస్తో ఆవేశం వస్తుంది కానీ కొద్ది క్షణాలకే "ఇదంతా జరిగే పని కాదులే" అనిపిస్తుంది.

లోక్‌సత్తా ప్రధాన ఆయుధం యువత, విద్యావంతులు. కానీ ఎంతమంది విద్యావంతులు ఓట్లు వేస్తారు? ఉన్నత విద్యావంతులు కూడా "యువ రాజ్యం" "జగన్ యువసేన" "బాలయ్య సేన"  అంటున్నారు తప్పితే యువతలో కనీసం పదిశాతం కూడా లోక్‌సత్తాకు  ఓట్లు వేస్తారన్న నమ్మకం నాకు లేదు.

ఎంబీయస్ గారు లేవనెత్తిన ప్రశ్న - లోక్‌సత్తా అంటే జేపీగారి పేరు తప్ప ఇంకొకరి పేరు వినపడదు. కనీసం రెండో పేరు వినపడని, రెండో నాయకుడు లేని ఆ పార్టీకి ఓటు వేయడం ఎలా? (మొదటివాడు ఎప్పుడూ ఒక్కడే...అలాంటివి ఇక్కడ ఎక్కడం లేదు!)  ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను మా వూళ్ళో ఉన్నా ఓటు వెయ్యడానికి వెళ్ళను. (విమర్శకులెవరయినా ఉంటే అందుకోండి ఇక :) ) నా ఒక్క ఓటుతో ఎలాగూ గెలిచేది లేదు. పోటీ పడి మన రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్న పార్టీలకు ఓటు వెయ్యను. మా ఊళ్ళో లోక్‌సత్తా తరఫున ఒక అభ్యర్థి నిలబడ్డాడు అనుకుందాము. పోనీ లోక్‌సత్తాకు వేద్దామా అంటే అభ్యర్థి ఎవరో, ఇప్పటివరకు ఊరికి ఏమి చేసాడో తెలియదు.

ఓటు వెయ్యకపోవడం నేరం, ఘోరం, కారం అన్నవారి మాటలు విని తప్పదని బూతులు తిట్టుకుంటూ బూతుకెళ్ళి లోక్‌సత్తాకు ఓటు వేసినా ఒరిగేది ఏమీ ఉండదు. మహా అయితే 5% ఓట్లు వస్తాయి అంతే అనుకుంటున్నాను. దాని ప్రభావం శూన్యం. ప్రతిఒక్కరూ ఇలా అనుకుంటే ఎలా, అంటారా? ఏమో మరి.. నాకయితే లోక్‌సత్తా అనేది ఇంకా utopia అనే అనిపిస్తున్నది.  అందుకే ఈ సారి ఓటు వేసే అవకాశమున్నా ఏదయినా విహారయాత్రకు వెళ్ళి ఫ్యామిలీతో హాయిగా గడపడం బెస్టు అని నా అభిప్రాయం.

ఓటు అడగడానికి వెళ్ళిన నాయకులను నిర్మొహమాటంగా "ఎంతిస్తారు?" అని సగటు ఓటరు అడుగుతున్న ఈ తరుణంలో ఒకవేళ లోక్‌సత్తా నా అంచనాలకు భిన్నంగా రాణిస్తే ఆనందించేవాడిలో  నేనూ ఒకడిని అవుతాను. నా అంచనాలు తప్పు కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. అప్పటివరకు  నా ఊహాప్రపంచంలోకి వెళ్ళి జయప్రకాష్ గారి స్పీచ్ వింటుంటా.

34 comments:

  1. Anonymous said...

    JP speeches are good but he doesn't have honesty and commitment. He never fought for any public issue, all he does is do some talk shows on TV. He never encourages other leaders in the party.Observer keenly, he almost supports TDP in all issues except few.

  2. చైతన్య said...

    మీరు వేసే (లేదా వేయని) ఒక్క వోట్ వలన లోక్ సత్తా కి ఒరిగేది కాని పోయేది కాని ఏమీ ఉండకపోవచ్చు. కానీ మీరు ఆ "ఒక్క" వోట్ వేయటం వలన... ఇంకా మీలాంటి కొందరు తమ ఒక్కొక్క వోట్ వేయటం వలన... కనీసం minimum సీట్స్ అన్న గెలిచే అవకాశం ఉంటుందేమో లోక్ సత్తా కి! ఇప్పుడే అందరూ ఆ పార్టీ కి వోట్ చేసి, అది అధికారంలో కి వస్తుందని నేను కూడా అనుకోను... కానీ లాస్ట్ టైం కంటే కొద్దిగా అన్న ఎక్కువ votes వస్తే వాళ్లకి వాళ్ళ మీద ఇంకా నమ్మకం పెరుగుతుందని, దాంతో వాళ్ళు ఇంకా ఉత్సాహంగా ముందుకు వెళ్తారని నా ఉద్దేశం. ఇంకా మీరు వేయకుండా వదిలేసే వోట్ దుర్వినియోగం (దొంగ వోట్ల రూపంలో) కాకుండా అయినా ఉంటుంది కదా!
    మీకు తెలిసిన సంగతే అయినా మళ్లీ చెప్పాలనిపించింది... గమ్యం చేరాలంటే ఒక్క అడుగుతోనే కదా ప్రయాణం మొదలయ్యేది!

  3. శ్రీనివాస్ said...

    1857లో సిపాయిల తిరుగుబాటు మొదలయితే 1947 లో మనకి స్వరాజ్యం వచ్చింది ..అలాగే నేడు మనం జే పి గారికి ఇచ్చే ఈ కొన్ని ఓట్లే .. ముందు ముందు మహా సాగరం గా మారి మెరుగైన పాలన ముందు తరాల వాళ్ళకి అందించే ఆవకాశం ఉంటుంది . అందుకే వోట్ వెయ్యండి ... మరో పాతికేళ్ళ తర్వాతైనా మెరుగైన రాజకీయాన్ని చూడడానికి చదువుకున్న వాళ్ళు వివేకం ఉన్న వాళ్ళు ఇవాళ వేసే అడుగులే ముందు తరాల వాళ్ళకి మార్గదర్శ కాలవుతాయి

  4. Kathi Mahesh Kumar said...

    లోక్ సత్తా వస్తే సంతోషమేగానీ మీరు ఓటు మాత్రం వెయ్యనంటారు! బాగుంది. Typical middle class మనిషిలాగా మాట్లాడారు. సాంఘిక దురాచారాల గురించి, లంచగొండితనం గురించీ సభల్లో బిగ్గరగా మాట్లాడి, వాటినే దర్జాగా జీవితంలో చేసేస్తూ బ్రతికే మనస్థత్వమే మనందరిదీను. జేపీ ని అభిమానిస్తాం, కానీ ఓటేస్తే మన "extra money and power"కి గండికొడతాడుకాబట్టి ఓటుమాత్రం వెయ్యం. భళా మధ్యతరగతి హిపోక్రటిక్ సోదరా!

  5. మనోహర్ చెనికల said...

    ఊరికే రావాలి అంటే ఎలా వస్తుంది, మీరూ నేనూ ఓటేస్తేనే కదా వచ్చేది.

  6. Praveen Mandangi said...

    నీతులు బోధించడం ఇష్టమే కానీ నీతిగా బతకడం ఇష్టం లేదు. ఏమి గొప్ప ఆదర్శవాదమండీ బాబు!

  7. ఏకాంతపు దిలీప్ said...

    ఎంబీఎస్ అలా మాట్లాడటం విడ్డూరంగా ఉంది. పోనీ ఎలా చేసి, ఏం చేసి గెలవాలో కూడా సెలవిస్తే బాగుండేది... గ్రేటాంధ్ర సైటుకి స్థాయికి సరిపోయేట్టుగానే రాసాడు... ఆయన మాటలు అదీ ఇదీ ఇని, అంతా ఒకటే అని చివరకి కాంగ్రెస్ కే మీ వోటు అనేట్టు ఉంటాయి ఆయన ఆ సైటులో అన్ని రాతలని కలిపి గమనిస్తే...

    దేనికైనా నాయకత్వం కావాలి... ఒకడున్నాడు ముందు వరసలో అని తెలియాలి... సరైన నాయకత్వం అందించేవాడు, సరైన నాయకులని ప్రోత్సహిస్తాడు. దేశంలో ఏ పార్టీనీ ఎంబిఎస్ ఈ ప్రశ్న అడగడు.. నిజమైన, నిజాయితీ కూడిన ప్రణాళికలు, లోక్సత్తా వాటిలో కొన్నిటిని గ్రామా స్థాయిల్లో ప్రయోగించి పరిశీలించారు ఫలితాలు చూపించారు కూడా... ఎంబీఎస్ కాంగ్రెస్ ని అడగడు ఆ ప్రశ్న, వై ఎస్సార్ కాకుండా ఇంకెవడున్నాడు అని... తెలుగు దేశాన్ని అడగడు... ప్రజా రాజ్యాన్ని అడగడు... ఒకవేళ ఉంటే వారికి ఆ అర్హత ఉందా అని ప్రశ్నించడు...ఒకపక్క మంచోడే, తెలివైనవాడే, వినడానికి బాగున్నాయి, సమర్ధుడే అంటూనే అతని నిజాయితీని సంకించడం, దాన్ని సైటు ఉంది కదా అని, నాకు కొంచెం పేరు ఉంది కదా, రాస్తే జనం చదివేస్తారు కదా అని అడ్డకోలు వాదనలు, వివరణలు చేసేయ్యడం...

    క్యూబా లో విప్లవం ఒకడి నాయకత్వంలోనే జరిగింది, అతనిని అనుసరించేప్పుడు ప్రజలు రెండో నాయకుడేడి? కాస్ట్రో పోతే మన పనేంటి అని ఆలోచించలేదు... ఎందుకంటే ప్రజలు వాళ్ళ అవసరాన్ని గుర్తించారు, ఉద్యమ స్పూర్తిని నింపుకున్నారు కాబట్టి... విజయం సాధించిన ఏ నిజమైన ఉద్యమాన్ని తీసుకున్నా, అందులే పాల్గున్న ప్రతీ ఒక్కడూ నాయకుడే... లక్ష్యం చేరుకునే వరకు తమకి ముండుండి నడిపిస్తున్నవాడిని శంకించలేదు... లక్ష్యం చేరుకున్న తరవాత ఎవరికి అందాల్సిన ఫలాలు గుర్తింపు వారికి అందింది... ముందునుండే ఎవడి నెంబెరు ఏంటి? ఈడు పోతే ఏంటి? ఈడొక్కడేనా ఉంది? ఇలాంటి ప్రశ్నలు వేసుకోలేదు...

    లోక్సత్తాకి ఒక విధానం ఉంది,... ఈ రోజు ఒకరు చేరిపోయి రేపూ నేనే నెంబెర్ 1, నెంబెర్ 2 అనడం అక్కడ చెల్లదు... ఆ పార్టీ నుండి ఈ పార్టీకొస్తే నాకేమిస్తావు అని అడిగితే ఇక్కడ చెల్లదు, చేరితే నాకేంటి నన్ను ఏ పదవిలో కుర్చోపెడతావు అంటే పొమ్మంటారు... ఆ పార్టీలో ఎన్నికలున్నాయి, నువ్వు చేసిన పనులని, నీలో నాయకత్వ లక్షణాలని చూసే ఆ పార్టీ సభ్యులు నిన్ను ఎన్నుకుంటారు... దాని ప్రకారమే నాయకులు తయారవుతారు... అంతే కానీ పని చెయ్యకముందే ఫలితాలు కావలనడం ఉండదు...

    లోక్సత్తా ప్రజలలో మారుతున్న వర్గానికి, మార్పు కోరుకుంటున్న వారికి ప్రతీక. ఆ వర్గం నిరంతరం పెరుగుతూనే ఉంది. ఎంబీఎస్ లాంటి సత్తెకాలపు మనుషులకి అవి అర్ధం కావు...

  8. Anonymous said...

    Avineeti Nayakula kante Prajallone ekkuva. Kaabatti evaru emi cheyaleru. Bogus cardulu erivese dhyryam loksatta kunda? Prajalaku anni vuchitanga kaavali. Immediate benefits & Personal benefits ante chala istam. Long term benefits ante evariki istam vundadu. P.V. Narasimharao nu evaraina gurthinchara? Prajalanu batte nayakulu. Nayakula tappemi ledu. Ee vastavam konni yella tarvatha grahistaru. Appatiki jaragavalacina nastam jarigipotundi.

  9. పిచ్చోడు said...

    నేను ఖచ్చితంగా లోక్సత్తా కే ఓటు వేస్తానండీ. నాకు తెలుసు వాళ్ళు ఖచ్చితంగా గెలవరని.ఒక చెడ్డ అభ్యర్థికి ఓటు వేయడం కన్నా అసలు ఓటు వేయక పోవడమే మంచిదనుకొని (మీ లాగే) ఇంత కాలం అసలు ఓటు హక్కునే ఉపయోగించుకోలేదు. కానీ ఈ రోజు మనం కోరుకొనే ఒక మంచి అభ్యర్థి మన ముందు ఉండి కూడా మనం అతడిని ఉపయోగించుకోక పోవడం అవివేకమే. నా ఓటు చాలా విలువైనది (ఈ విలువ ని కుడా నాకు తెలియచెపింది జేపీ గారే). దాన్ని నన్ను దోచుకొనే వారి చేతిలో మాత్రం పెట్టను. నేను ఓటు వేయక పోతే ఎవరో ఒకరు నా ఓటు వేసేస్తారు. కాబట్టి నా ఓటు నేనే వేస్తాను. గంటల పాటు ఎండలో నిలబడైనా సరే

  10. పరిమళం said...

    చెడ్డ వాళ్ల దుర్మార్గం కంటే ...మంచివాళ్ళ మౌనమే ప్రమాదం ...ఇవి జేపీగారి మాటలే ...
    కుంభ వృష్టి కూడా చినుకు తోనే మొదలవుతుంది ...మీకు చెప్పాలా .....

  11. Anonymous said...

    మన దౌర్భాగ్యం ఎలా ఉందంటే ఎమ్బీయస్ లాంటి హాఫ్ నాలెడ్జి వాళ్ళు మన పొలిటికల్ కామెంటేటర్స్ అయ్యారు. అయినా గ్రేట్ ఆంధ్రా లాంటి లుచ్చా సైట్లో రాసే ఆయన రైటింగ్స్ చదివి వాటి గురించి డిస్కసన్ అవసరమా?

  12. Anonymous said...

    అందుకే ఈ సారి ఓటు వేసే అవకాశమున్నా ఏదయినా విహారయాత్రకు వెళ్ళి ఫ్యామిలీతో హాయిగా గడపడం బెస్టు అని నా అభిప్రాయం.

    And you are talking about honesty of Mr. JP

    If you remember he was an IAS officer, if he is not honest, he would have earned what he wanted in that post. Its he the daring personality who stepped up to change the society he lives. If he succeeds or not, he has done his best.

    - Pedaraydu

  13. Anonymous said...

    jIDipappU... O chinna katha chepta vinu.. swaree... chaduvukO.. nIku telisindE anukunTA..

    O mAyAvati lAnTi rAjugAru, tana puTTinarOjuku rAjyam lO prati inTinunDi okkO chembu pAlu supply cheyyAlani Order vESADu. anduku anuguNamgA, prati vIdhi chivarA, O pedda Drum peTTADu. nIlAnTODE okaDu, andarU elAgU pAlE postAru kadA, nEnokkaDu O chembuDu nILLu pOstE, Em pedda tEDA unTundanukoni, nILLu pOSADaTa. tIrA chUstE, drum ninDA nILLE unnAyaTa.

    anchAta.... OTu hakku viniyOginchukOlEni vADiki, anyAyAlu, daurjanyAlu, akramAla gurinchi mATTADE hakku lEdantE... samjhe!!!

  14. Anonymous said...

    లోక్ సత్తాకి వేసిన వోటు వృధా కాదు.

    లోక్ సత్తాకి వేసిన వోటు,
    అవినీతికి వ్యతిరేఖంగా,
    కులరాజకీయాలకి వ్యతిరేఖంగా,
    కుటుంబ రాజకీయాలకి వ్యతిరేఖంగా,
    సారా, ధన రాజకీయాలకి వ్యతిరేఖంగా,
    బూర్జువా పార్టీలకి వ్యతిరేఖంగా వేసిన వోటు అవుతుంది.

    లోక్ సత్తాకి ఎన్ని వోట్లు వస్తే అంతగా ప్రజలు ప్రస్తుత రాజకీయాలని ద్వేషిస్తున్నారని అర్థం.

  15. asha said...

    మనం ఓట్లేస్తేనే వాళ్ళు గెలుస్తారు.
    వాళ్ళు గెలవరని మనం ఓట్లేయటం మానేస్తే ఎలా?
    అయినా అలా చేస్తే, మన గొయ్యి మనమే త్రవ్వుకోటం తప్ప
    ఇంకేమీ కాదు.

  16. Anonymous said...

    "లోక్‌సత్తా నా అంచనాలకు భిన్నంగా రాణిస్తే ఆనందించేవాడిలో నేనూ ఒకడిని అవుతాను." - అంటే లోక్‌సత్తా పట్ల మీరు సానుకూలంగానే ఉన్నారు. అలాంటపుడు ఇలా నిరాశాపూరితంగా రాయడమెందుకు? మీరు, మీలాంటి మేమూ వోట్లేస్తేనే గదా మీ అంచనాలు తప్పయ్యేది!

    అనేక కారణాల వల్ల వివిధ పార్టీలపై మనకు వ్యతిరేకత ఉంటోంది - అవినీతిపరులనో, నేరస్తులనో, వంశపారంపర్యమనో, తప్పుడు విధానాలనో, సరైన విధానాలు లేవనో, కులమనో, మతమనో.. ఇలాగ. లోక్‌సత్తా విషయంలో మాత్రం, దానికి ప్రజల మద్దతు లేదనే వింత కారణంపై మనం మద్దతు ఇవ్వదలచుకోవడం లేదు. మనం మద్దతు ఇవ్వం, పైగా జనాల మద్దతు లేదని అంటాం. చిత్రం! మన గీకువీరులు దీన్ని సర్క్యులర్ రిఫరెన్సు ఎర్రరంటారనుకుంటా.

    ఒక సంగతి.. ఖైరతాబాదు ఉపఎన్నికలో లోక్‌సత్తాకు 15% వోట్లొచ్చాయి . ఇప్పుడొచ్చే వోట్లతో లోక్‌సత్తా అధికారంలోకి రాకపోవచ్చు, కానీ కొందరినైనా గెలిపించగలిగితే శాసనసభ చర్చలు కాస్త అర్థవంతంగా ఉంటాయి. మిగతా జనం కాస్తో కూస్తో నేర్చుకోవచ్చు. మొన్న శాసనమండలి ఎన్నికలు జరిగినపుడు నాగేశ్వర్ కోసం చేసిన ప్రచారంలో పాల్గొన్న కొందరు మండలి సభ్యులు, సభలో చర్చలు ఎలా జరగాలనే దానికి నాగేశ్వర్ గారు ఉదాహరణగా నిలిచారు అని చెప్పారు. రేపు శాసనసభలో కూడా అలాంటి వాతావరణం ఏర్పడవచ్చు.

    "He never fought for any public issue,.." అని ఇక్కడొకరన్నారు. కలెక్టరుగా ఉండగా ప్రకాశం జిల్లాలో సాగునీరు ఇచ్చినందుకుగాను, విశాఖ ఉక్కు కర్మాగార నిర్వాసితులకోసం ఆయన చేసిన పనులకు గాను ఇప్పటికీ ఆయన్ను తలుచుకుంటారట అక్కడి ప్రజలు. రాజకీయ నాయకులేగాదు, మనమూ మంచిపనులు చెయ్యవచ్చు. అన్నిటికంటే తేలికైన పని, సరైనవాడికి వోటెయ్యడం! (అసలు ఎవడో ఒకడికి వోటెయ్యాలని అనుకోవాలి. బూతు కాడికి పోయాక, మంచివాడికే వేద్దామని అనిపిస్తుంది, మనం మంచివాళ్ళం కాబట్టి :))

    మీరు ఉదహరించిన ఆ స్కెప్టిక్కు "...(వీళ్ళ)కోసం డబ్బు ఖర్చు పెట్టేవాడు ఊరికినే ఖర్చు పెడతాడా? ప్రతిఫలంగా ఏదో ఒకటి ఆశించడూ?" అని అడుగుతున్నాడు. అవున్నిజమే, ప్రతిఫలం ఆశించకుండా మనం మాత్రం లోక్‌సత్తా కోసం డబ్బెందుకు ఖర్చు పెడతాం? వోట్లెందుకు వేస్తాం? -నిజాయితీగా ఉంటాడు, వ్యవస్థలో కాస్తో కూస్తో మార్పు తెస్తాడనే ఆశ, అదే మనమాశించే ప్రతిఫలం!

    నా కులం కాబట్టి ఫలానావాడికి వోటేస్తాననుకునేవాళ్ళు, డబ్బుల్తీసుకుని వోట్లేసేవాళ్ళు, మందు పోయించాడు కాబట్టి వాడికే వోటేస్తాననుకునేవాళ్ళు స్కెప్టిక్కులకంటే ఎంతో నయం.

  17. Praveen Mandangi said...

    లోక్ సత్తాకి వోట్ వేసినంతమాత్రాన జె.పి.ని సమర్థించినట్టు కాదు. నేను జె.పి. పై చెయ్యాల్సిన విమర్శలు కూడా ఉన్నాయి కానీ అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడడం కూడా చేతకాని రాజకీయ నాయకులు కంటే జె.పి.యే ధైర్యవంతుడని నేను నమ్ముతాను. అవినీతిని వ్యతిరేకిస్తున్నట్టు నటించే "జీడిపప్పు" లాంటి వాళ్ళ కంటే కూడా జె.పి. గొప్పవాడే.

  18. Anonymous said...

    "Observer keenly, he almost supports TDP in all issues except few" అని అన్నారో వ్యాఖ్యాత. ఆ కొన్ని ఏవోగానీ..

    ఎన్నికల ప్రకటన వెలువడ్డాక, ఈ ఎన్నికల దిశను మార్చగల సంఘటనలు రెండు జరిగాయి. వాటిలో ఒకటి తెదేపా వారి "డబ్బుల పందేరం చేసే" వాగ్దానం. (ఈ ఎన్నికల ఫలితాలను ఈ అంశం ప్రభావితం చేసినంతగా, -కూటముల ఏర్పాటు కాకుండా- మరే ఒక్క అంశం కూడా చెయ్యదని నా ఉద్దేశం.) దాన్ని లోక్‌సత్తా వ్యతిరేకించినంతగా మరేపార్టీ కూడా వ్యతిరేకించలేదు.

  19. krishna rao jallipalli said...

    YOUR POST IS VERY GOOD...BYE

  20. Anil Dasari said...

    మీరు గమనించారో లేరో కానీ, లోక్ సత్తాకి వెయ్యాలనునుకునే వారిలో ఎక్కువమంది తెలుగుదేశం సానుభూతిపరులు ఉంటారు. కాంగ్రెస్ వాదులు లోక్ సత్తా వైపు మళ్లటం చాలా తక్కువ. ఈ తెదెపా అభిమానులకి లోక్ సత్తా గెలిస్తే బాగుంటుందనే ఆశున్నా, ఆ పార్టీకి వోటేస్తే తెదెపా వోట్లు చీలిపోయి మళ్లీ కాంగ్రెస్సే అధికారంలోకొచ్చే అవకాశముందనే భయమూ ఉంది. అదే జరిగిన పక్షంలో మరో ఐదేళ్ల పాటు కాంగిరేసుని భరించే శక్తి రాష్ట్రానికుందా? లోక్ సత్తా మెల్లి మెల్లిగా సత్తా పుంజుకుని ఏ ఇరవయ్యేళ్లకో అధికారంలోకి రావచ్చు, లేదా ఇప్పుడో రెండు అప్పుడో రెండు సీట్లు గెలుస్తూ చట్ట సభల్లో ఉనికి చాటుకుని అక్కడ జరిగే దిక్కుమాలిన, అర్ధం పర్ధం లేని చర్చల తీరు కొంత మార్చొచ్చు. ఈ లోగా కాంగిరేసు కనకారావులు చక్కగా ఉన్నదంతా ఊడ్చుకు పోవటం ఖాయం. అప్పుడు లోక్ సత్తా బాగు చెయ్యటానికి ఏమన్నా మిగిల్తే కదా. కాబట్టి ప్రస్తుతం లోక్ సత్తాని గెలిపించటం కన్నా కాంగ్రెస్సుని దించటం ముఖ్యం.

  21. Anonymous said...

    నన్నడిగితే రోజుకొకరకంగా, వెయ్యి నాలుకలతో మాట్లాడే ISP administrator కంటే ప్రతి ఒక మనిషీ గొప్పోడే!

  22. Anonymous said...

    జెపి గారు ఆలోచించలేని, ఊహకందని ఘోరాలు జరుగుతున్నాయి. అందుకు ఒక్క ఉదాహరణ ఇది.
    "లక్ష కోట్లతొ కోటి ఎకరాలకు సాగు నీరు"
    అంటె ఎకరానికి లక్ష రూపాయలు.
    జనాలు ఇది అభివృద్ధి అనుకుంటున్నారు.
    ఇంత మోసం జరుగుతుంటె జెపి కూడా మాట్లాడటం లేదు.
    ఆయన మాటలకు జనం దగ్గర పెద్ద విలువలేదు.
    ఆయన ఇంకా సరియైన ప్రత్యామ్నాయం చూపెట్టాలి. జనాల దగ్గరికి వెళ్లాలి.

  23. సుజాత వేల్పూరి said...

    లోక్ సత్తా కు వేసే వోటు వృధా కాదు.
    ఇంకా చెప్పాలంటే లోక్ సత్తాకు వేసే వోటు మాత్రమే వృధా కానిది.

    ఇతర రాజకీయ పార్టీల పట్ల ఎంత శాతం జనం విసిగిపోయి ఉన్నారో లోక్ సత్తా కు పడే వోట్ల సంఖ్య తెలుపుతుంది. అసలు ఇది కూడా మొత్తం నిజం కాదు. ఎందుకంటే సమాజం బాగుపడాలని చాలా మందికి ఉంటుంది. కానీ కులం, డబ్బు, వంటివి పని చేసి తమ తమ కులాల వారికి వోట్లు(ఇష్టం లేకుండా) వేసేవాళ్ళుంటారు. ఖైరతాబాదు ఉప ఎన్నికలో లోక్ సత్తాకు అన్ని వోట్లు వస్తాయని, లోక్ సత్తాయే ఊహించలేదు. ఒకవిధంగా ఇది వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని బూస్టప్ చేసింది. కానీ రేపు ఒకటో రెండో సీట్లు గెలిస్తే వాళ్ల అభ్యర్థులు ఎలా పని చేస్తారనే దానిమీదే పార్టీ భవిష్యత్తు ఏమిటనేది నిర్ణయిస్తుంది.

    నాకైతే జేపీ కూడా గెలుస్తారనే ఆశలేదు.(ప్రజారాజ్యం లాగా మిగతా పార్టీలు కూడా అక్కడ తమ అభర్ధులను నిలబెట్టకుండా ఉంటే బాగుండు). కానీ వోటు మాత్రం లోక్ సత్తాకే వేస్తాను. వెయ్యమని ప్రచారం చేయడానికి కూడా సిద్ధమే!ఇప్పుడున్న రెండు మూడు వర్గాలే కాక మరో విభిన్న వర్గం కూడా ఉందనే విషయం నిరూపించబడాల్సిందే!

    లోక్ సత్తా ఇంకా మెరుగ్గా ఉండుంటే బాగుండేది అన్న అబిప్రాయం, మరికొన్ని అసంతృపుతులూ నాకున్నా, వోటు మాత్రం లోక్ సత్తాకే వేస్తాను. రెండూ మూడు సీట్లన్నా గెలిచి రాజకీయ పార్టీగా బలోపేతం అవుతుందనే ఆశ.

    కనీసం జేపీ ఒక్కరన్నా గెలవాలి. శాసన సభలో ఆయన గొంతు వినపడాలి.

  24. Praveen Mandangi said...

    పనిలేని అజ్నాత వ్రాశాడు: >>>నన్నడిగితే రోజుకొకరకంగా, వెయ్యి నాలుకలతో మాట్లాడే ISP administrator కంటే ప్రతి ఒక మనిషీ గొప్పోడే!>>>

    ఎవడు రోజుకి ఒక నాలుక మారుస్తాడో నాకు తెలుసు. ఎన్నికలు బహిష్కరించేవాళ్ళకి కూడా నిజాయితీ ఉంటుంది. నిన్నమొన్నటి వరకు ప్రజాస్వామికవాదిలా నటించి చివరికి ఈ టాపిక్ లో తనకి వోటు వెయ్యడం ఇష్టం లేదు అన్న నిజం బయట పెట్టాడు జీడిపప్పు. నేను మునిసిపల్ ఎలెక్షన్స్ లో ఎవరికీ వోటు వెయ్యలేదు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎలెక్షన్స్ లో కూడా వోటు వెయ్యదలచుకోలేదు. ప్రజాస్వామికవాదిలా మొదట నటించి చివరికి తాను తెలుగు దేశం వరల్డ్ బ్యాంక్ వాదిననో లేదా కాంగ్రెస్ వాదిననో నిజం బయట పెట్టుకునే వాళ్ళ కంటే నేను ఎంత నయమో. అతనికి జె.పి. మీద నిజంగా నమ్మకముంటే జె.పి.కి వోట్ వెయ్యొచ్చు లేకపోతే కాంగ్రెస్ కో తెలుగు దేశానికో వోట్ వెయ్యొచ్చు కానీ నటనలు, డొంక తిరుగుడు వాదనలు ఎందుకు?

  25. Praveen Mandangi said...

    నేను ఎమ్బీయస్ ప్రసాద్ రాసిన ఆర్టికల్ చదివాను. కొన్ని నిజాలు మాట్లాడితేనే ఆ వ్యక్తిని సత్తెకాలపు మనిషి అని వెక్కిరించే నీతిలేని కుక్కలలో ఎమ్బీయస్ ఒకడు. అలాంటి వెక్కిరింపుదారులని లెట్రిన్ కింది సెప్టిక్ ట్యాంక్ లలో పడేయాలి.

  26. Varunudu said...

    చాలా మంది చాలా చెప్పారు. ఇంత మంది దేశం కోసం మాట్లాడడం చూస్తే, ఇంత విఙత కలిగిన ప్రజలను పెట్టుకొని కూడా.. ఈ రోజు మరో కొత్త నాయకుడు రాలేని దుస్థితి ఎందుకు ఉంది?

    మనమంతా ప్రజల్లో ఒకరమే.. మనకు యే సినిమా స్టారో, లేదా నేనే దేవుడిని అనే వాడో, అసెంబ్లీ లో ఫలానా సమస్య ఎందుకయ్యా తీర్చలేదు అని అడిగిన ప్రతిపక్షాలకు, మీ జమానాలో పీకింది ఏంటి అనే సమాధానం చెప్పి, సమస్య దారి మళ్ళించి వాళ్ళూ వాళ్ళు కొట్టుకొనే వాళ్ళే కావాలి.

    అయినా.. జీడి పప్పు ఇలా అన్నారు...

    "....ఓటు అడగడానికి వెళ్ళిన నాయకులను నిర్మొహమాటంగా "ఎంతిస్తారు?" అని సగటు ఓటరు అడుగుతున్న ఈ తరుణంలో..."

    ఈ పైన వ్రాసిన వాక్యాన్ని ఖండించండి, ఎవరైనా..? మనకెందుకండీ జే పీ లాంటి నాయకులు? ప్రస్తుతం జరుగుతున్న ఈ ఎన్నికల కోలాహలమంతా పెద్ద ఫార్సు. వాళ్ళు దోచుకొంటూనే ఉంటారు.. మనం ఇలా చర్చిస్తూనే ఉంటాం.. ఒరిగేది ఏమీ లేదు..

    పతితులారా, భ్రష్టులారా
    బాధా సర్ప దష్టులారా
    శని దేవత రధ చక్రపు
    టిరుసులలో పడి నలిగిన
    దీనులారా, హీనులరా
    కూడు లేని, గూడు లేని
    పక్షులారా, భిక్షులారా..
    సఖుల వలన పరిచ్యుతులు
    జనుల వలన తిరస్కృతులు
    సంఘానికి బహిష్కృతులు
    చ్యుతాషయులు
    హృతాష్రయులు
    హతాశులైa
    ఏడవకండేడవకండీ..
    జగన్నాధ రధ చక్రాల్.
    వస్తున్నాయొస్తున్నాయి..

    అన్నాడు శ్రీ శ్రీ చాలా చాలా యేళ్ళ క్రితం

    కానీ, ఆ రధ చక్ర చిరు సవ్వడి కూడా వినబడనంత అంధకారం లోకి దిగి పోయిన మనకెందుకండీ ఈ జే పీ లు?

  27. Anonymous said...

    dubugs.... nI aalOchanA dhOrani bAga kanapADutundi nI blogs lO... vyangyam, chaturatha and konchem mUrkhatvaM.

  28. Anonymous said...

    :D pidug/Jeddipappu

    ప్రజస్వామిక వాతావరణ సాధనే ప్రాధమికాంశం.మన స్థాయిలో ఎం చెయ్యాలో అది చెయ్యాలి.!

    ముందు అడుగులు వెయ్యకపోతే నేరం కాదు ,వెనకడుగులు వెయ్యటం మాత్రం నేరం.

    so వొటు వెయ్యి లోక్ సత్తా కి

  29. Shashank said...

    లైటుగా వర్షం పడితేనే ఇంట్లో దుప్పటికప్పుకొని పడుకునే రకం మనం.. afterall వోటు వేసేదానికి దేశం కి వెళ్తాం అంటావా అభీ, బాబాయి, వరుణ్?

  30. జీడిపప్పు said...

    @ Anonymous గారు - ఇప్పటికీ కొందరికి అనుమానం ఉంది. చూద్దాం ఏమవుతుందో

    @ చైతన్య గారు - ఒక్క అడుగే అంటారా... చూడాలి ఎప్పుడు వేయాలో :)

    @ శ్రీనివాస్ గారు - 2009 లో ఉన్నాము :) అయినా లోక్‌సత్తాలో గెలిచే ఏకైక అభ్యర్తి అయిన జేపీగారి నియోజకవర్గంలో ఉంటే ఓటు వేసేవాడిని కానీ ఈ వ్యాస ప్రధానాంశం అనకాపల్లిలో "నేను లోక్‌సత్తా అభ్యర్థిని" అన్న ఊరూ పేరు తెలియని వాడికి ఓటు వేయడం అనవసరమని నమ్ముతున్నా.

    @ కత్తి మహేష్ కుమార్ గారు - సరిగ్గా క్యాచ్ చేసారు :)

    @ మనోహర్ చెనికల గారు - ధన్యవాదాలు

    @ ఏకాంతపు దిలీప్ గారు - నాకిక్కడ క్యూబా ప్రజలు కనపడడం లేదు. సగటు ఓటరు "వోటుకెంత" అని నిర్మొహమాటంగా అడుగుతున్న రోజులివి. పైగా "నేను లోక్‌సత్తా అభ్యర్థిని" అన్న ఊరూ పేరు తెలియని వాడికి ఓటు వేయడం అనవసరమని నమ్ముతున్నా.

    @ Anonymous గారు - మీతో పూర్తిగా ఏకీభవిస్తాను స్వార్థ ప్రజల గురించి

    @ పిచ్చోడు గారు - ఘూద్ స్పిరిత్

    @ పరిమళం గారు - :)

    @ Anonymous గారు - ఎమ్బీయస్ గారి ఆర్టికల్స్ మామూలు న్యూస్ పేపర్లకంటే వెయ్యి రెట్లు బాగుంటాయి

    @ Anonymous గారు - I'm not talking about JPs honesty. i'm talking about: అనకాపల్లిలో "నేను లోక్‌సత్తా అభ్యర్థిని" అన్న ఊరూ పేరు తెలియని వాడికి ఓటు వేయడం అనవసరమని నమ్ముతున్నా.

    @ telugODu గారు - ఓ ఆశీర్వాదం వేసుకోండి :)

    @ bonagiri గారు - పైన చెప్పేసాను చూడండి :)

    @ Bhavani గారు - మనము ఓటు వెయ్యకపోతే ఓడిపోతారు కాబట్టి మిగతా పార్టీలకు ఓటు వెయ్యడం లేదు. :)

    @ chaduvari గారు - ఈ ఎలక్షన్ల తర్వాత లోక్‌సత్తా ప్రజల్లోకి చొచ్చుకుపోయి ఆ తర్వాత ఎన్నికలప్పటికి మా వూరి లోక్‌సత్తా అభ్యర్థి గురించి కాస్తో కూస్తో తెలిసే వరకు ఈ స్కెప్టిజం ఉంటుంది నాకు!!

    @ ISP Administrator గారు - బాగుందా నా నటన లేక ఇంకా ఇంప్రూవ్ చేసుకోమంటారా? :)

    @ krishna rao jallipalli గారు - ధన్యవాదాలు

    @ అబ్రకదబ్ర గారు - ఇంతకూ మీ ఓటు ఎవరికంటారు ఒక వేళ వెయ్యవలసి వస్తే?

    @ సుజాత గారు - లోక్‌సత్తా తరఫున ఒక్క జేపీ మాత్రం గెలుస్తాడన్న ఆశ ఉంది. ఇక "మిగతా పార్టీలు కూడా అభ్యర్థులను నిలబెట్టకూడదు" అన్నారు చూడండి, నేను వ్యతిరేకిస్తాను. అలా జరిగితే ఆ పార్టీల దయవల్ల జేపీ గెలిచినట్టవుతుంది. అన్ని పార్టీలు పోటీ చేసినపుడే అసలయిన ప్రజాతత్వం బయటపడుతుంది. జేపీ కోరుకొనేది కూడా అదే.

    @ Varunudu గారు - స్వాగతం. ఎలా ఉన్నారు? ఎప్పుడొస్తాయంటారు ఆ జగన్నాథ రథచక్రాలు :)

    @ Beavis - ఎలా ఉన్నావు గురూ? Thank you for the compliment :)

    @ Abhi - :)

    @ CD - కేక అన్నా!

  31. Anonymous said...

    అవును మీరు చెప్పెది నిజమె కాని లొక్ సత్తా కన్నా మంచి పార్తీ యెదీ....... సొ ఉన్న కొద్ది మంది అభిమానుల ప్రచారం యెమి అధ్బుతం చెయ్యక పోయినా తర్వాత సారి కి ఊపయోగ పదవచ్చు

  32. Anonymous said...

    ఒక చెత్త రచన కి అనుబంధ రచన.. మీరు పూర్తిగా విషయ అవగాహన లేకుండా మాట్లాడారు.. మీరు ఓటు వెయ్యక పొయినా అది దుర్వినియోగం కాకుండా చూడటం మీ కనీస బాధ్యత. పైగా నేను వేసినందువల్లే గెలుస్తాడా అని భావించటం కూడా సరైన ధోరణి కాదు. మనవి నెగెటివ్ రాజకీయాలుగా తయారయ్యాయి. అంటే జనాలు ఫలాన వ్యక్తి గెలవాలి అనేదానికన్నా ఫలానా వాడు ఓడాలి అన్న భావన తో ఓట్లు వేస్తున్నారు. ఉదాహరణ కి కాంగ్రెస్ ఓడిపోవాలి అనుకునే వారికి ప్రత్యమ్న్యాయం టీడీపీ, ప్రజారాజ్యం, లోక్‌సత్తా ఉన్నాయనుకోండి, వాళ్ళు లోక్‌సత్తా, లేక ఇంకో మంచి పార్టీ కి వేస్తే తన లక్ష్యం (కాంగ్రెస్ ఓడటం) నెరవేరదేమో అని అయిష్టంగా ఐనా ఇంకో పనికి రాని పార్టీ కి ఓటు వేస్తున్నారు. అలా కాకుండా ఫలానా వాళ్ళు గెలవాలి అని మనసు లో ఎటువంటి శంక లేకుండా ఓటెస్తే లోక్‌సత్త కొన్ని స్థానాలైనా గెలవటం సాధ్యమే.. కనీసం వారికి moral boosting ఐనా ఇద్దాం.

    ఖైరతాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికలో లోక్‌సత్తా బీజేపీ, టీఆర్ఎస్ కన్నా ఎక్కువ శాతం ఓట్లు సంపాదించిందన్న విషయం మీకు తెలుసా? మీరు ఇంకా రాజకీయం అంటే, వేలం వెర్రిగా జనాలు రావటం, అసలు ఏం చెప్తున్నారో కూడా వినిపించుకోకుండా ఈలలు, అరుపులు, మందీ మార్బలం, కాన్వాయ్ లో కార్ల వరస, బిర్యానీలు, భోజనాలు, కిరోసిన్ పోసుకోవటం, అధిష్టానం భజన వీటన్నిటి మేలు కలయిక అని నమ్ముతున్నారు.

    భయపడకండి. లోక్‌సత్తా లో జేపీ తో పాటు ఎందరో మంచి నాయకులు ఉన్నారు. అయితే మీడియా వారిని ఎప్పుడూ ప్రొజెక్ట్ చెయ్యదు..ఎందుకంటే వాళ్ళు చెప్పే మంచి ముక్కల వల్ల మీడియా కి ఎలాంటి న్యూస్ క్రియేట్ అవ్వదు. అదే, ఏ మారెప్పనో, గంగాభవాని నో, రోజానో, దానం నాగేందర్‌నో, బొత్సనో, కెలికితే ఇంక మీడియా కి పండగే పండగ.

    చదువుకున్న వారు సైతం ఇలాంటి మాయ లో పడటం దురదృష్టం.

  33. Anonymous said...

    మీ నిర్ణయాన్ని సమర్ధించుకోటానికి బాగానే లౌక్యం ప్రదర్శించారు.. నాకు జేపీ తెలుసు కానీ అనకాపల్లి అభ్యర్ది ఎవరో తెలీదని. కానీ చాలామందికి వాళ్ళ నియోజక వర్గాల్లోని అభ్యర్దులు ఎక్కడి వారో, వాళ్ళు ఏం చేస్తుంటారో ఏమీ తెలీదు.. ఏ పార్టీ నో తప్ప.. ఎక్కడెక్కడి నించో వచ్చిన వాళ్ళు సంభందం లేనిచోట పోటీ చేస్తుంటారు. బాపట్ల తో సంభందం లేని పురంధరేశ్వరి, నర్సరావుపేట కి నెల్లూరు నించి వచ్చిన రాజమోహన్ రెడ్డి, విశాఖ లో జనార్ధన్ రెడ్డి..ఇలా వీళ్ళలో కొందరు పేరు ప్రతిష్టల ఆధారం గా వచ్చేవాళ్ళు అయితే మరికొందరు కేవలం ధనబలం తో వచ్చేవాళ్ళు... 1999 ఎలక్షన్లలో తెలుగుదేశం చాలా మంది కొత్త వాళ్ళకి టికెట్లు ఇచ్చింది. ఫ్రెష్ ఫేస్ అయితే అవినీతి ముద్ర ఉండదని. అప్పటికప్పుడే పార్టీ లో చేరి అధిష్టానానికి డబ్బులు ముట్టజెప్పి టికెట్ సాధించిన చాలామంది గెలిచారు కూడా..

    మీకు జెపీ తెలుసు కదా..లోక్‌సత్తా పాటించే విలువలు తెలుసు కదా.. ఇంక అభ్యర్ది ఎవరో పూర్తిగా తెలీకపోయినా తెలిసిన సమాచారం(జేపీ,లోక్సత్తా సిద్దాంతాలు) తో పోల్చి చూసుకున్నా కచ్చితంగా మిగిలిన పార్టీల కంటే కూడా మెరుగైన అభ్యర్దే అయిఉండొచ్చు.. కాబట్టి మీరు ఒకసారి పునరాలోచించుకోండి. లేదు..ఒక్కసారి నిర్ణయించుకున్న తర్వాత మార్చుకోవటం ఏదో అవమానం అని భావిస్తే కనీసం అది దుర్వినియోగం కాకుండా అయినా చూసుకోండి. ప్రత్యక్షంగా తోడ్పడకపోయినా పరోక్షంగా వ్యతిరేకించిన వారు కాకండి.

  34. agkanth said...

    https://www.google.com/amp/s/m.tupaki.com/article/Jayaprakash-Narayana-Comments-on-AP-CM-Jagan-Decision-Over-Praja-Vedika/216984/amp

Post a Comment