మనీప్లాంట్ కథలు
Posted by జీడిపప్పు
ఒక కథ చదివి ఆఫీసు పని మొదలెడదాము అనుకున్నాను కానీ, మొదటి కథ పూర్తి చేసాక రెండవ కథ కూడా చదవాలనిపించింది. ఆ విధంగా మొదటి విడతలో పదకొండు కథలు పూర్తి చేసాను. మొత్తమ్మీద "మంచి" కథల పుస్తకం ఇది. అనువాదకథలయినప్పటికీ ఒకట్రెండు తప్ప అంతా మన ఊళ్ళో జరుగుతున్నట్టు అనిపిస్తూ ఆకట్టుకునేలా వ్రాసారు సోమశంకర్ గారు. పుస్తకాలను బహుమతిగా ఇవ్వాలనుకొనే వారికి ఈ పుస్తకం మంచి అవకాశం. రెండు గంటల ప్రయాణం సమయం తెలియకుండా గడిచిపోతుంది.
మూస ధోరణిలో కాకుండా విభిన్న అంశాలకు చెందిన కథలను, అది కూడా భిన్నమయిన ముగింపులతో నిండివున్న వాటిని అనువాదం చేయడంలో సోమశంకర్ గారు సఫలీకృతులయ్యారు. ఇంత మంచి పుస్తకానికున్న ప్రధాన లోపం పుస్తకం పేరు అని ఇప్పటికీ అనుకుంటున్నాను. ఎవరయినా నాతో "మనీ ప్లాంట్ అనే కథల పుస్తకం ఉంది చదువుతావా" అంటే పెద్దగా ఆసక్తి చూపించేవాడిని కాదు కానీ, "పెరుగన్నం/చెరువు/మిగిలిపోయినవి/సున్నాగాడు అనే కథల పుస్తకం ఉంది చదువుతావా" అని చెప్తే తప్పకుండా ఆసక్తి చూపించేవాడిని. మనీప్లాంట్ అని ఎందుకు పేరు పెట్టారో సోమశంకర్ గారే చెప్పాలి!!
107 పేజీలున్న ఈ చక్కని కథల పుస్తకాన్ని వికాసధాత్రి సైటునుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అడిగిన వెంటనే రిప్లై ఇచ్చిన సోమశంకర్ గారికి కృతజ్ఞతలు. కథల గురించి, 5 పాయింట్ల స్కేలు ఆధారంగా నా రేటింగ్ ఇస్తున్నాను.
పెరుగన్నం: పెరుగన్నం ఇష్టపడని చిన్నపాప పెరుగున్నం తినడానికి తనకు కావలసింది ఇవ్వాలి అని షరతు పెడుతుంది. ఆ పాప ఎందుకు అలా చేస్తుందో కథలో చూడాలి. చిన్నపిల్లల్లోని మంచితనాన్ని, ఆలోచనలను ప్రతిబింబింపచేసే ఈ కథలో చక్కని కథనం, మంచి ముగింపు ఉన్నాయి. రేటింగ్: 5/5
సెల్ ఫోన్: ఎక్కడికి వెళ్ళినా సెల్ఫోన్ల శబ్దాలు, సెల్ఫోన్లో మాట్లాడే..కాదు.. అరిచే వాళ్ళు సాధారణం అయిపోతున్న ఈ రోజుల్లో ఒక సెల్‌ఫోన్ బాధితుడి కథ. కొత్తదనం ఎక్కువ లేకపోయినా పరవాలేదు అనిపించే కథ. రేటింగ్: 3/5
హస్త లాఘవం: మేజిక్ అంటే మంత్రాలు కాదు కేవలం అది కూడా ఒక నైపుణ్యం మాత్రమే అని స్టేజీ ముందు అందరికీ తెలుపుతాడు ఒక మెజీషియన్. కథాంశం అంటూ ఏమీ లేదు కానీ, ఊహించని ముగింపుతో కథ ముగుస్తుంది. రేటింగ్: 3/5
ఓ మనిషీ, ఎందుకిలా: అంతరిక్షం నుండి భూమిని చూసిన పాపాయి ముచ్చటపడి భూలోకానికి వెళ్ళాలని మారాం చేస్తే దేవుడు ఆ పాపను భూలోకానికి పంపిస్తాడు. ఆ తర్వాత ఏమయింది? రేటింగ్: 5/5
చెరువు: చెరువుతో తన అనుబంధాన్ని పోగొట్టుకోలేని ఒక వృద్దుడి కథ. కథ కంటే వ్యథ అనాలేమో. అందరూ ఆ ఎండిపోయిన చెరువు ద్వారా డబ్బు సంపాదించాలనుకుంటారు కానీ వృద్దుడు మాత్రం దానితో ఉన్న అనుబంధాన్ని తెంచుకోలేడు. రేటింగ్: 4/5
బాకీ: కారు రిపేరు చేయించుకోవడానికి వచ్చిన ఒకడు డబ్బులు తక్కువ కావడంతో ఏమి చేసాడన్నది కథాంశం. కథ అంత స్పష్టంగా అనిపించలేదు. ముగింపు కూడా సరిగా అర్థం కాలేదు. ఈ కథ ఇంకోసారి చదవాలి. రేటింగ్: 2/5
బొమ్మ: తన తాహతుకు మించిన బొమ్మను కొనివ్వమని కూతురు అడిగినపుడు కాదనక బొమ్మ కొనివ్వడానికి సిద్దపడిన తండ్రి కథ. ముగింపు అత్యద్భుతం. రేటింగ్: ఆరు/5
అమ్మ వస్తే బాగుండు: పక్షి గూటిలోని గుడ్ల జాగ్రత్త గురించి చిన్న పిల్లల తపన ద్వారా మనల్ని కూడా బాల్యంలోకి తీసుకెళ్ళే మరో మంచి కథ. రేటింగ్: 5/5
లాటరీ: వ్యసనాలు పచ్చని పల్లెట్టూరి వాసుల జీవితాలను ఎలా నాశనం చేస్తున్నాయో లాటరీ వ్యసనం ద్వారా వివరించే కథ. కథాంశం పాత వస్తువే, కథనం కూడా మామూలుగు సాగుతుంది. రేటింగ్: 3/5
మిగిలిపోయినవి: మిగిలిపోయిన ఆహారాన్ని అడిగి మరీ తీసుకొని బ్రతికే పనిమనిషి కథ. ఎంత డబ్బు ఉన్నా కొందరు "మిగిలిపోయిన"వాటితో బ్రతుకుతుంటారు అని సారాంశం రేటింగ్: 4/5
సున్నాగాడు: ఎందులోనూ ప్రావీణ్యం లేని ఒక సున్నాగాడి కథ. చాలా చక్కని కథనం, మంచి ముగింపు. రేటింగ్: 5/5
వృత్తిధర్మం: ప్రేమ-వృత్తిల మధ్య వృత్తికే ప్రాధాన్యం ఇచ్చిన వైద్యుడు- తన భార్యకు మరణభిక్ష ఇవ్వమని అడిగే వృద్దుడు ఇందులోని కథాంశం. ప్రేమ ఎపిసోడ్ సరిగా నచ్చలేదు. రేటింగ్ : 3/5
సందేశం X అనుభవం: సందేశాలు ఇవ్వడానికే కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజజీవితంలో అందుకు భిన్నంగా ఉంటుంది అని చెప్పే ప్రాక్టికల్ కథ. రేటింగ్: 5/5
మనీప్లాంట్: పుస్తకం టైటిల్ కథ కాబట్టి కాస్త ఎక్కువ అంచనాలతో చదివాను. కథ సాదాసీదాగా సాగిపోతుంది. కొన్ని చోట్ల స్పష్టత కనపడలేదు. ఈ కథ మరోసారి చదవాలి. రేటింగ్: 3/5
యమరాజు: ఈ పుస్తకంలో ఉండకూడని ఏకైక కథ ఇది అనిపించింది. అసలు కథాంశం కానీ కథనం కానీ ముగింపు కానీ ఏమీ కనిపించలేదు. అంతర్లీనంగా ఏదయినా గొప్ప సందేశాన్ని ఇస్తున్నారేమో, ఏమీ తోచనపుడెపుడయినా చూడాలి. రేటింగ్: 0/5
ఆశా నిరాశేనా: అమెరికాకు వెళ్ళిన కొడుకు కోడలు మారిపోతారు, అది చూసి తల్లి పడే బాధ కథాంశం. ఇప్పటికే ఇలాంటి కథలు వందల కొద్దీ వచ్చాయి. వ్యక్తిగతంగా ఇలాంటి కథలంటే నాకు చాలా చిరాకు. (i know what you are thinking :) వీలయితే ఒక పోస్టు వేస్తాను "చెత్త కథలు" అని). కథాంశం పక్కన పెడితే కథను చెప్పిన తీరు చాలా బాగుంది. రేటింగ్: 3/5
కట్టుకథ: పెళ్ళికి ముందు తాను ప్రేమించిన అమ్మాయి గురించి భార్యకు చెప్పిన భర్త కథ. రేటింగ్: 4/5
ఆత్మావలోకనం: చిన్ననాటి మిత్రుడిని కలుసుకోబోయే ముందు బాల్యస్మృతులు తలుచుకోవడం, కలిసిన తర్వాత సంఘటనల కథ. రేటింగ్: 5/5
విషవలయం: కష్టాల్లో ఉన్న ఒకడు తర్కం అంటూ తన కారును రౌండుగా తిప్పుతుంటాడు. నిజానికి కథ చదివిన తర్వాత నాకు కాస్త తల తిరిగింది. ఒక్క నిమిషం ఆలోచించాను అసలు ఈ కథలో ఏముందా అని.. ఏదో ఉంది కానీ నా ట్యూబ్‌లైట్ ఇంకా వెలగలేదు. రేటింగ్: 1/5
March 18, 2009 at 1:00 AM
జీడిపప్పు గారు... మీరు చెప్పిన కథా వస్తువులు చదివగానే ఆ పుస్తకం డౌన్లోడ్ చేయటం మొదలు పెట్టాను. కానీ మీరు చెప్పినట్టే ఆ పేరు మాత్రం అంత ఆసక్తికరంగా లేదు...
అసలు మీ పోస్ట్ పేరు చదవగానే... మీ ఇంట్లో పెరిగే moneyplant గురించి ఏదో రాసుంటారేమో అనుకున్నాను... అంతగా ఆసక్తికరంగా అనిపించకపోయినా... పై పైన చూద్దాం అని చదవటం మొదలుపెట్టాను!
March 18, 2009 at 2:33 AM
పేరు చూసి ఈ పుస్తకాన్ని చాలా సార్లు పక్కన పెట్టినవాళ్ళలో నేనూ ఉన్నానండి.. ఈ వారం కొనబోయే పుస్తకాలలో ఇదీ ఉంటుంది.. నాకు పుస్తకం చదవడమే ఇష్టం, పుస్తకం దొరకనప్పుడు మాత్రమే నెట్లో చదువుతాను.. మీకు బోల్డన్ని థాంకులు ..
March 18, 2009 at 3:02 AM
thank you boss
March 18, 2009 at 4:09 AM
ఈ పుస్తకం కొనాలంటే హైదరాబాద్ లో ఎక్కడ దొరుకుతుంది?
క్షమించండి... నాకు ఈ పుస్తకాల షాప్స్ అవీ పెద్దగా తెలీదు...
March 18, 2009 at 4:43 AM
సర్ ! మీరు రాసిన విధానం నన్ను వెంటనే ఆ కధలు చదివేలా చేసింది .పెరుగన్నం కధలో నిస్వార్ధమైన ,నిష్కల్మషమైన బాల్యాన్ని చూసి నా కళ్లు చెమర్చాయి .బహుశా బాల్యంలోనే ఇటువంటి త్యాగం సాధ్యమేమో ....ధన్యవాదాలు .
March 18, 2009 at 4:46 AM
మొదటగా పుస్తకాన్ని సమీక్షించినందుకు ధన్యవాదాలు. మీరు లేవనెత్తిన కొన్ని ప్రశ్నలకి నా సమాధానాలు ఇవి.
Q. మనీప్లాంట్ అని ఎందుకు పేరు పెట్టారో సోమశంకర్ గారే చెప్పాలి!!
A. ఈ పుస్తకానికి మొదట అనుకున్న టైటిల్ పెరుగన్నమే. అయితే కవర్ పేజి డిజైన్ చేసేడప్పుడు పెరుగన్నం బొమ్మ దొరకలేదు. ఆర్టిస్ట్ చేత గీయిద్దామంటే అదొక అడిషనల్ ఖర్చు అని ఆలోచించి, ఈ టైటిల్‌ని ఎంచుకోడం జరిగింది. (ఈ సంకలనాన్ని నేను నా డబ్బులతో ముద్రించుకున్నాను.) మా ఎదురింట్లో మనీ ప్లాంట్ తీగ పెద్దది ఉంది. దాన్నే డిజిటల్ కెమెరాతో ఫొటో తీసి కవర్ పేజిలో వాడాను. ఇంకా చెరువు, సున్నాగాడు వంటి వాటిని పరిశీలించినా, నాకెందుకో అవి నచ్చలేదు.
Q. బాకీ: కారు రిపేరు చేయించుకోవడానికి వచ్చిన ఒకడు డబ్బులు తక్కువ కావడంతో ఏమి చేసాడన్నది కథాంశం. కథ అంత స్పష్టంగా అనిపించలేదు. ముగింపు కూడా సరిగా అర్థం కాలేదు. ఈ కథ ఇంకోసారి చదవాలి. రేటింగ్: 2/5
A.కష్టపడకుండా సులువుగా డబ్బు సంపాదించడం కాదు, చేసే ఏ పనీన నిజాయితీగా చేసి సక్రమ పద్దతిలో డబ్బు సంపాదించాలని ఈ కథ చెబుతుంది. పనిచేసే చోట తమ వ్యక్తిగత విషయాలు ప్రస్తావించకుండా, పనిని ఏకాగ్రతతో చేయాలని ఈ కథ సూచిస్తుంది. It stresses the importance of Diginity of Labour
Q. లాటరీ: వ్యసనాలు పచ్చని పల్లెట్టూరి వాసుల జీవితాలను ఎలా నాశనం చేస్తున్నాయో లాటరీ వ్యసనం ద్వారా వివరించే కథ. కథాంశం పాత వస్తువే, కథనం కూడా మామూలుగు సాగుతుంది. రేటింగ్: 3/5
A. నిజమే ఈ కథని అనువాదంకి ఎంచుకోడంలో నా జడ్జిమెంట్ తప్పైంది. కథని పత్రికలో చదివినప్పుడు బావుందనిపించినా సంకలనంలో చేర్చాక, పుస్తకంలో ఒక కథలా చదివితే మాత్రం సంతృప్తిగా లేదు.
Q. వృత్తిధర్మం: ప్రేమ-వృత్తిల మధ్య వృత్తికే ప్రాధాన్యం ఇచ్చిన వైద్యుడు- తన భార్యకు మరణభిక్ష ఇవ్వమని అడిగే వృద్దుడు ఇందులోని కథాంశం. ప్రేమ ఎపిసోడ్ సరిగా నచ్చలేదు. రేటింగ్ : 3/5
A. ఈ కథలోని డాక్టర్‌ది వన్‌సైడ్ ప్రేమ. తానకి నచ్చిన అమ్మాయి తనని ప్రేమించేలా చేసుకోడానికి కష్టపడతాడు. కానీ వారి సామాజిక, ఆర్థిక నేపధ్యాలు భిన్నమైనవి కావడంతో ఆ అమ్మాయి మొదట అంగీకరించినా, తర్వాత తిరస్కరిస్తుంది. వృద్ధ దంపతులదే నిజమైన ప్రేమని గ్రహించిన డాక్టర్ మెర్సీకిల్లింగ్కి సిద్ధపడతాడు.
Q. మనీప్లాంట్: పుస్తకం టైటిల్ కథ కాబట్టి కాస్త ఎక్కువ అంచనాలతో చదివాను. కథ సాదాసీదాగా సాగిపోతుంది. కొన్ని చోట్ల స్పష్టత కనపడలేదు. ఈ కథ మరోసారి చదవాలి. రేటింగ్: 3/5
A. కథలోని మెసేజి - "అవసరమైనప్పుడు చిన్న పెరటి తీగే మహవృక్షం అవుతుంది " - నాకు బాగా ఇష్టం. ఈ కథలో కుటుంబాన్ని ఆదుకుంటాడనుకున్న కొడుకు, తన దారి తాను చూసుకుంటే అప్పటి దాక ఆడపిల్ల అని చిన్న చూపుచూసిన కూతురే కుటుంబాన్ని ఆదుకోడానికి సిద్ధమవుతుంది. అందుకే ఈ కథ శీర్షికనే, పుస్తకానికి కూడా ఉపయోగించాను
Q. యమరాజు: ఈ పుస్తకంలో ఉండకూడని ఏకైక కథ ఇది అనిపించింది. అసలు కథాంశం కానీ కథనం కానీ ముగింపు కానీ ఏమీ కనిపించలేదు. అంతర్లీనంగా ఏదయినా గొప్ప సందేశాన్ని ఇస్తున్నారేమో, ఏమీ తోచనపుడెపుడయినా చూడాలి. రేటింగ్: 0/5
A. అంతర్లీనంగా ఏదయినా గొప్ప సందేశాన్ని ఇచ్చే కథేమీ కాదిది. ఓ వ్యంగ్య కథ అంతే. సీరియస్ కథల మధ్య కాస్త రిలీఫ్ గా ఉంటుందని ఈ కథని సంకలనంలో చేర్చాను.
Q. ఆశా నిరాశేనా: అమెరికాకు వెళ్ళిన కొడుకు కోడలు మారిపోతారు, అది చూసి తల్లి పడే బాధ కథాంశం. ఇప్పటికే ఇలాంటి కథలు వందల కొద్దీ వచ్చాయి. వ్యక్తిగతంగా ఇలాంటి కథలంటే నాకు చాలా చిరాకు. కథాంశం పక్కన పెడితే కథను చెప్పిన తీరు చాలా బాగుంది. రేటింగ్: 3/5
A. ఇప్పటికే ఇలాంటి కథలు వందల కొద్దీ వచ్చాయి.నిజమే. కానీ మీరన్నట్లు కథని నడిపిన తీరు బాగుంది. అందుకే ఈ కథని అనువదించాను. అయితే కాస్త అనుభవం వచ్చాక, ఇప్పుడనిపిస్తుంది ఇలాంటి కథలని వదిలేయాలని.
Q. విషవలయం: కష్టాల్లో ఉన్న ఒకడు తర్కం అంటూ తన కారును రౌండుగా తిప్పుతుంటాడు. నిజానికి కథ చదివిన తర్వాత నాకు కాస్త తల తిరిగింది. ఒక్క నిమిషం ఆలోచించాను అసలు ఈ కథలో ఏముందా అని.. ఏదో ఉంది కానీ నా ట్యూబ్‌లైట్ ఇంకా వెలగలేదు. రేటింగ్: 1/5
A. కారుని గుండ్రంగా తిప్పడం అనేది సింబాలిక్ చర్య. మనలో చాలా మంది సమస్యలు ఎదురైనప్పుడు పరిష్కారాల కోసం అలోచించకుండా ఆ సమస్య కలిగించే నష్టం/కష్టం గురించి ఆలోచిస్తారు. సమస్యలో పడి దాని చుట్టూ మన ఆలోచనలు తిరగడాన్ని కారుని గుండ్రంగా తిప్పే చర్య సూచిస్తుంది. సమస్యని కాకుండా పరిష్కారం గురించి ఆలోచించడమే వలయాన్ని ఛేదించడం!
నిష్పక్షపాతంగా సమీక్షించారు, కృతజ్ఞతలు
March 18, 2009 at 4:51 AM
@చైతన్య గారు,
ఈ పుస్తకం హైదరబాదులో కోటిలోని విశాలాంధ్ర పుస్తక కేంద్రంలోను, నవయుగ పబ్లిషర్స్వారి వద్ద దొరుకుతుంది, ఇంకా కాచీగుడ క్రాస్ రోడ్స్ దాటిన తర్వాత నవోదయ పబ్లిషర్స్ వారి విక్రయ కేంద్రం వుంది. అక్కడ కూడ దొరుకుతుంది. చిక్కడపల్లి లో ప్రజాశక్తి బుక్‌హౌస్‌లో కూడా దొరుకుతుంది.
March 18, 2009 at 8:16 AM
హా...ఈ సమీక్ష చదవగానే ఆ బుక్ డౌన్లోడ్ చేసి మొత్తం చదివేసాను... బాగున్నాయి కథలు... చాలా రోజుల తర్వాత ఒక ఆసక్తి కరమైన పుస్తకం చదివాను.
@సోమశంకర్ గారు
వివరాలు చెప్పినందుకు చాల థాంక్స్! తప్పకుండా పుస్తకం కొంటాను.
March 18, 2009 at 12:33 PM
జీడిపప్పు గారు,
ఇదన్యాయం కదూ! సోమశంకర్ గారి స్వహస్తాల మీదుగా సంతకం పెట్టించి మరీ పుస్తకాల పండగలో అందుకున్నాను ఈ పుస్తకం. నెమ్మదిగా చదూతూ, చివరి కథ కూడా అయ్యాక పరిచయం రాద్దామని(నిజానికి పుస్తకం చదవడం అయ్యేపోయింది.రాయడానికి బద్ధకం)తీవ్రంగా ఆలోచిస్తూంటే మీరు రాసేస్తారా రివ్యూ?
ఇక్కడ సోమ శంకర్ గారి ఇచ్చిన సమాధానాలు కూడా చాలా బాగున్నాయి. ఈ పుస్తకం నేను ఒకరికి బహూకరించాను కూడా!
March 18, 2009 at 8:57 PM
ముందుగా, @ సోమ శంకర్ గారు - వివరణాత్మక పోస్టుకు ధన్యవాదాలు. మంచి పుస్తకాన్ని అందించినందుకు కృతజ్ఞతలు.
@చైతన్య గారు - అపుడే చదివేశారన్నమాట!! కీపిటప్.
@మురళి గారు - చాలా మంచిమాట చెప్పారు. కథాప్రియులు తప్పక చదవవలసిన పుస్తకం ఇది.
@ అశోక్ గారు - ధన్యవాదాలు
@పరిమళం గారు - ధన్యవాదాలు. మిగతాకథలన్నీ చదివి మీరూ ఓ రివ్యూ వ్రాసేయండి :)
@సుజాత గారు - కుందేలు-తాబేలు కథ గుర్తుందా? just joking. అయినా పర్లేదు. మీరు కూడా రివ్యూ వ్రాయండి. నిజంగా ఇది బహుమతి ఇవ్వదగిన పుస్తకమే. మంచిపని చేసారు బహుమతిగా ఇచ్చి.
March 19, 2009 at 5:35 PM
జీడిపప్పు గారూ,
పెరుగన్నం కధని నేను నాదైన పంధాలో మూడు భాగాలుగా బ్లాగాను. ఈ కధ నేను ప్రచురించే సమయానికి నాకు ఇవి కొల్లూరి వారు ప్రచురించారని తెలియదు. అందువలన నా సొంత కవిత్వం కొంచం తగిలించాను.
౧) http://ubusu.blogspot.com/2008/04/blog-post_30.html
౨)http://ubusu.blogspot.com/2008/04/blog-post_4278.html
౩)http://ubusu.blogspot.com/2008/04/blog-post_6088.html
కానీ ఆ తరువాత అసలు కధ హక్కుదారులు వీరని తెలిసింది. వీరికి ప్రత్యేకంగా వేరే పుటలో హక్కు దారులుగా తెలియ జేసాను. ఆ విషయాన్ని మీరు ఇక్కడ చూడ వచ్చు http://ubusu.blogspot.com/2008/05/blog-post_07.html
వీలైతే ఓ లుక్కు వేసుకుని స్పందించ గలరు
March 19, 2009 at 5:38 PM
http://www.eemaata.com/em/issues/200801/1199.html
April 4, 2009 at 3:31 AM
http://kasturimuralikrishna.wordpress.com/2008/04/13/%e0%b0%a8%e0%b1%87%e0%b0%a8%e0%b1%81-%e0%b0%9a%e0%b0%a6%e0%b0%bf%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%ae%e0%b0%82%e0%b0%9a%e0%b0%bf%e0%b0%aa%e0%b1%81%e0%b0%b8%e0%b1%8d%e0%b0%a4%e0%b0%95%e0%b0%82-3/