బేరమాడకండి

Posted by జీడిపప్పు

చిన్నపుడు నాకు "మంచి బేరగాడు" అని పేరుండేది. అంటే, వేరేవాళ్ళు 10 రూపాయలకు కొన్న వస్తువును నేను 8 రూపాయలకే కొంటాను అని.  అపుడపుడు పళ్ళు కొనడానికి వెళ్ళినపుడు నా ట్యాలెంట్ బయట పెట్టేవాడిని. దాదాపు కొనే స్థాయికి వచ్చి, ఇంకో రూపాయి తగ్గిస్తేనే కొంటాను అని బ్లాక్‌మెయిల్ చేసి వెళ్ళిపోతుంటే ఆ బండివాడు విధిలేక రూపాయి తగ్గించి అమ్మేవాడు. అప్పట్లో నాకు చాలా సంతోషంగా ఉండేది అది తలచుకొని. చిన్నతనంలో ఎన్నో చేస్తుంటాము, పెద్దయిన తర్వాత అవి తప్పులుగా కనిపించినా తెలియక చేసిన తప్పు అని నవ్వుకుంటాము కానీ, ఇది మాత్రం నన్ను ఇప్పటికీ బాధిస్తుంటుంది.

ఎలాంటివాడి దగ్గర బేరమాడాను, అది కూడా ఒకట్రెండు రూపాయలకోసం అని గుర్తు చేసుకుంటే సిగ్గుతో తలవంచుకోవాలి. బండి పైన అరటిపళ్ళు అమ్ముకుంటున్నాడంటే అతడి పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. చాలమంది పరిస్థితి ఇలా ఉంటుంది: ఒక దళారి రోజూ తెల్లవారి ఆరింటింటి ఒక చోటకు వస్తాడు. ఈ బండ్ల వాళ్ళు అతడి దగ్గరికి వెళ్ళి 90 రూపాయలు తీసుకుంటారు. ఆ 90 రూపాయలు తీసుకొని మండీకెళ్ళి పళ్ళు కొనుక్కొని రోజంతా వ్యాపారం చేస్తారు. సాయంత్రం మళ్ళీ ఆ దళారి వచ్చి 100 రూపాయలు తీసుకుంటాడు. అంటే రోజుకు నూటికి 11 రూపాయలు వడ్డీ అన్నమాట! నెలకు నూటికి 3-5 రూపాయల వడ్డీ అంటేనే బెంబేలెత్తిపోతాము కానీ వీళ్ళు రోజుకు నూటికి 11 రూపాయల వడ్డీ చెల్లిస్తున్నారు కడుపు నింపుకోవడానికి.

పళ్ళన్నీ అమ్ముడు పోవాలి, దళారికి 11 రూపాయలు ఎక్‌స్ట్రా ఇవ్వాలి, ఆ పైన వచ్చిన లాభంతో బ్రతకాలి. అలాంటివాళ్ళ దగ్గరన్నమాట నేను బేరమాడింది, అది కూడా ఒకట్రెండు రూపాయలకు. నేనే కాదు, సగటు మధ్యతరగతి మనిషులలో చాలామంది ఇలాంటివారే. ఇక అడవుల్లోకి వెళ్ళి ఈతపళ్ళు, ఉసిరికాయలు పీక్కొచ్చి బుట్టలో పెట్టుకొని మండుటెండలో ఇళ్ళ ముందు తిరుగుతు గొంతెండిపోయేలా అరుస్తూ తిరిగే స్త్రీమూర్తుల దగ్గ సగటు గృహిణి ఆడే బేరం గురించి తలుచుకుంటే మాటలు రావడం లేదు.

కాయకష్టం చేసి పొట్టకూటికోసం ఇల్లీల్లూ తిరిగే ఆ నిర్భాగ్యుల దగ్గర గీచి గీచి బేరమాడి రూపాయి మిగిల్చిన నేను ఒక ఫ్యాన్సీ స్టోరుకెళ్ళి అక్కడున్న ఒక వస్తువును వాడు చెప్పిన ధరకు నోరుమూసుకొని కొనడం తలుచుకుంటే చాలా బాధ వేస్తుంది. ఒక సగటు మనిషి ఏడాదిలో ఈ బేరమాడి మిగిల్చినది అంతా ఒక షర్టో లేక చీరో కొన్నపుడు ఆ షాపు వాడితో బేరమాడడం చేతకాక పోగుట్టుకొన్నదానికంటే తక్కువే ఉంటుంది.

అదృష్టవశాత్తూ నాకు గత ఇండియా ట్రిప్పులో చేసిన తప్పు కాస్త సరిదిద్దుకొనే అవకాశం కలిగింది. ఇండియాలో అడుగుపెట్టినపుడు నా లగేజ్ రాలేదు. "రేపు ఇంటికి పంపుతాము" అన్నారు. చాలామంది సరేనని వెళ్ళిపోయారు. నేను ఇంకొకరు మాత్రం వెళ్ళి compensation కోసం బేరం మొదలు పెట్టాము. "నేనిప్పుడు పళ్ళు తోముకోవాలి, డబ్బుల్లేవు" అన్నాను. తప్పదని per day expenses అని కొన్ని వేలరూపాయలు ఇచ్చారు. మరుసటి రోజు 9 గంటలకు మళ్ళీ ఫోన్  చేసి "మీరు ఇచ్చింది ఒక్క రోజుకే కదా, మళ్ళీ డబ్బులు కావాలి ఈ రోజు ఖర్చులకు" అన్నాను.

ఇక ట్రిప్పు మొత్తం అందరి దగ్గరా చివాట్లే నేనిచ్చే టిప్పులు చూసి. ఉదాహరణకు - 70 రూపాయలు టిఫిన్ బిల్లు అయితే 100 రూపాయలు ఇచ్చి చిల్లర ఉంచుకోమన్నాను. ఆ సర్వర్ మోహంలో ఆనందం ఇప్పటికీ గుర్తుంది. ఇంకో చోట పళ్ళు కొన్నపుడు చిల్లర ఉంచుకోమన్నాను. "నీలాంటోళ్ళు డాలర్ల కొవ్వును చూపించడం తగ్గించాలి" అంటుంటే "అది డాలర్ల కొవ్వు కాదు, ఇండియాకు వచ్చిన వెంటనే ఫ్లైట్ వాళ్ళు ఇచ్చిన రూపాయల కొవ్వు" అనుకొంటూ నవ్వుకున్నాను. అనవసరంగా డబ్బు ఇచ్చి తప్పుచేసానో లేదో తెలియదు కానీ, రెక్కాడితేకానీ డొక్కాడని వాళ్ళకు పాతిక రూపాయలు ఎక్కువ ఇచ్చానని ఒకరకమయిన సంతృప్తి కలిగింది.

చివరగా - పొట్టకూటి కోసం కాయకష్టం చేసి బ్రతికేవాళ్ళ దగ్గర కాదు బేరమాడవలసింది.  చేతనయితే ఏసీ రూముల్లో రెట్టింపు రేటుకు వస్తువులు అమ్మేవాళ్ళ దగ్గర బేరమాడాలి.

18 comments:

  1. Anonymous said...

    నాకు ఒక కజిన్ ఉన్నాడు. అతనితో షాపింగుకి వెళ్ళాలంటే నాకు భయం. యాభై రూపాయల కోసం అరగంట బేరం ఆడతాడు.
    అతనితో నేనంటాను ఎందుకంత సమయం వృధా చేస్తావని?

    ఎందుకంటే అతని అరగంట జీతం యాభై రూపాయలకంటే ఎన్నొ రెట్లు ఎక్కువ.

  2. నేస్తం said...

    నిజమే భారంగా వంట్లో శక్తిని కూడ దీసుకుని పళ్ళ బిగువున తమ భాదను ఓర్చుకుంటూ తొక్కే ముసలి రిక్షా వాడిదగ్గర,రూపాయి మిగిలితే హమ్మయా అనుకుని తృప్తి పడే నిరుపేదదగ్గర బేరమాడటం తప్పే .. అలా అని ప్రతి చోటా వారు చెప్పిన దరకు కొనేయరాదు.. కానీ మీరన్నట్లు అలాంటి వారిదగ్గర ఎవరూ బేరమాడరు.. నోరు మూసుకుని వుంటారు.. మొన్న మా ఆయన ఇండియా వెళ్ళినపుడు కేవలం తలకు నార్మల్ కటింగ్ చేసినందుకు పెద్ద మంగలి షాపులో అక్ష్రాలా 599 రూపాయలు తీసుకున్నాడంట :) ఇంత రేటా అని అడగడానికి భయమేసి వచ్చేసారు వీది చివరన 20 రూపాయలకు అయిపోయే వాడిదగ్గర వదిలేసి బేషజాలకు పెద్ద షాప్ కి వెళ్ళారు :)

  3. పరిమళం said...

    బాగా చెప్పారండీ ....ఏసీ రూముల్లో ....బేరమాడితే ఎక్కడ చీప్ ఐపోతమో అని రాయల్ గా షాపింగ్ చేసేవాళ్ళే చిన్న విషయాల దగ్గర ఎక్కువ బేరం చేస్తారు .బళ్ల వాళ్ళ లో కూడా మనిషికో రేటు చెప్పేవారూ ఉన్నారు .ఏమైనా మనకు సంతృప్తి కలిగే పని చేయటంలో ఆనందం ఉంది .

  4. శ్రీనివాస్ said...

    ఇంత వరకు నేను కూడా ఎక్కడ బేరం ఆడలేదు .. నా మిత్రులు నన్ను చేత కాని వాడి కింద జమ కట్టినా ఆ రెండు రూపాయలలో మనకోచ్చేదేంటి తల నేప్పికి డాక్టరు దగ్గర కెళ్తే స్కానింగ్ అంటే వేలకొద్దీ వదిలిచ్చుకోడం లేదు కానీ బక్క జీవి దగ్గర బేరం ఆడడం సగటు మద్య తరగతి అక్కయ్యలు తగ్గిచాలి

  5. సుజాత వేల్పూరి said...

    నాకూ ఈ విషయంలో మార్కులు పడవు. బేరమాడనని, బేరమాడటం రాదని, అందరం కలిసి వెళ్ళినపుడు వెనకే ఉంచేస్తారు. పండ్లో మరోటో అమ్ముకుంటే తప్ప కడుపు నిండని వాళ్ల దగ్గర బేరమాడకూడదు కానీ, కోఠీ, జనరల్ బజార్ వంటి చోట్ల మాత్రం సగానికి సగం తగ్గించి అడక్క పొతే గోతిలో పడేది మనమే!

    అసలు మా వారి సిస్టర్ తో షాపింగ్ వెళ్లాలంటే నాకు దడ. 70% తగ్గించి అడుగుతారు ఆమె.షాపు వాడు నన్ను గురించి ఏమనుకుంటాడో అని బెంగ నాకు. నేనసలు బేరమాడను కాబట్టి.

    రిక్షా వాళ్ల దగ్గర బేరమాడటం చాలా నీచం. ఎంత అడిగితే అంత ఇవ్వాల్సిందే!

  6. మురళి said...

    చెప్పులు కుట్టే వాళ్ళ దగ్గర బేరం ఆడే వాళ్ళని చూసి 'ఛీ' అనిపించినా సందర్భాలు ఎన్నో.. ఇలా గుర్తు చేసుకుంటే చాలా గుర్తొస్తాయి. మంచి టపా అండి..

  7. చైతన్య said...

    బాగుందండి మీ టపా...
    మంచి విషయం చెప్పారు...
    నాకు బేరం ఆడటం అస్సలు రాదు... నా మొహం చూస్తూనే 5 రూ వస్తువు 10 రూ అంటారని నా నమ్మకం...
    బేరం ఆడటం రాకపోవటం ఒక లోపం గా తోచేది నాకు ఇంతకుముందు... మా స్నేహితురాలిని (తను బాగా బేరం ఆడుతుంది) వెంటపెట్టుకుని వెళ్ళేదాన్ని ఏది కొనాలన్నా... ఇప్పుడు అది మానుకున్నాననుకోండి...
    మా అమ్మ మాత్రం అస్సలు బెరమాడేది కాదు... 2 రూ అన్న తగ్గించి అడుగమ్మా అంటే... "ఆ 2 రూ తో మనమేమైనా ఇల్లు కడతామా... వాళ్లకి మిగిలేదే అది ... అది కూడా మనం బేరమాడితే ఎలా?"... అనేది.

  8. శేఖర్ పెద్దగోపు said...

    మంచి విషయం గురించి రాసారండి....కొంత మంది బళ్ళ వాళ్ళు 'స్వాతిముత్యం' కమలహాసన్ లాగా మొహం కనపడితే ఒక రేటు, 'పోలీస్ స్టోరీ ' సాయి కుమార్ లాగ కనపడితే ఒక రేటు చెప్తారు. బేరమాడటమ్లో తప్పులేదేమో... కాక పోతే గీసి గీసి బేరమాడటం అంటారు చూసారూ..ఆ విధంగా వాళ్ళను టార్చర్ పెట్టకుండా ఉంటే బావుంటుంది.

  9. Shashank said...

    చిన్నప్పుడు ఆ విద్య ఫలితమే అనుకుంటా ఈ దేశం లో కారు కొన్నప్పుడు ఒక గంటపాటు బేరమాడాను. దాదాపుగా మూడూవేలు తగ్గింది. నాకు గంటకి మూడువేల డలర్ల జీతం రాదు కాబట్టి తలదించుకోవాలనో ఏదో తప్పు చేసాను అనో అనిపించలేదు.
    మన దేశంలో అరటిపళ్ళు అమ్మేవాడి దగ్గర టయి కట్టుకొని బేరమాడేవాళ్ళని చూస్తేనే ఎక్కడో మండుతుంది. ఎప్పుడూ అడగాలనిపిస్తుంది.. "గురు బార్ కి వెళ్ళి బీర్ కోసం బేరమాడతుతావా?" అని.

  10. పద్మనాభం దూర్వాసుల said...

    క్షమించండి
    మిమ్మల్ని సంప్రదించడానికి మార్గాంతరం లేక ఈ మార్గం ఎన్నుకొన్నాను.
    మీతో అర్జంటుగా మట్లాడవలసిన పని పడింది. మీరు నాకు ఈ-మెయిల్ గాని లేక ఫోన్ కాని చెయ్యగలరా?
    నా మెయిల్ చిరునామా: telugugreetings@gmail.com
    ఫోను న్ంబరు: 27002787 9989691606
    అన్యధా భావించ వద్దు.
    - దూర్వాసుల పద్మనాభం

  11. Anonymous said...

    మీలా తమ పొఱపాటు తెలుసుకునేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఆభినందనలు. చాలామంది మారదామనుకుంటారు కానీ ఎంత ప్రయత్నించినా మారలేరు. కారణం వాళ్ళ జాతకంలో కోణాలు బలంగాను, కేంద్రాలు బలహీనంగాను ఉండడం. అందుచేత వాళ్ళలో మార్పు ఒక జీవితకాలం లేటు. (అంటే వాళ్లు ఇహ వచ్చే జన్మకి మారాల్సిందే)

    అదలా ఉంచితే, నాకు బేరమాడ్డం రాదు. సాధారణంగా అవతలివాడు ఎంత చెబితే అంతిచ్చి కొనడమే చిన్నప్పట్నుంచి అలవాటు. అయినా ఈ దేశంలో ఏ విషయంలో నైనా బేరమాడదగ్గ సంపన్నవిక్రేతలు (rich sellers) ఎవరున్నారు గనుక ? మనం వ్యవహారం నడిపేవాళ్ళందరూ పేదవాళ్ళే. కాబట్టి మనం బేరమాడనంత మాత్రాన తెలివితక్కువవాళ్ళమైపోము. జనం పేదవాళ్ళతోను, మధ్యతరగతివాళ్ళతోను బేరమాడగలరు. MRP లు వేసి వెన్నువిఱవగల కార్పొరేట్ సంపన్నవిక్రేతలతో మటుకు ఎవడూ బేరమాడడు. అప్పుచేసి మఱీ వాళ్ళు చెప్పిన ధరకే కొంటారు. ఇది sellers' market.

  12. asha said...

    మంచి టపా.

  13. సిరిసిరిమువ్వ said...

    మంచి టపా.
    మరీ గీచి గీచి కాదు కాని బేరాలు ఆడక తప్పదు. కొన్నిచోట్ల బేరమాడకపోతే పిచ్చివాళ్లని చూసినట్టు చూస్తారండి. హైదరాబాదులో కొన్ని ప్రాంతాలలో అయితే ధరలు ఆకాశాన వుంటాయి, అలాంటి చోట్ల బేరమాడక తప్పదు మరి. కొంతమంది ఈ బేరాలాడటం కోసమే షాపింగుకి వెళ్లేటప్పుడు పక్కన బేరాలాడటంలో నిష్ణాతులని తీసుకెళుతుంటారు.

    తాడేపల్లి గారన్నట్లు జనం పేదవాళ్ళతోను, మధ్యతరగతివాళ్ళతోను మాత్రమే బేరమాడగలరు.

  14. Anonymous said...

    మంచి టపా.

  15. Unknown said...

    బేరం అడాల వద్దా అన్నది పెద్ద debatable ఇష్యూ .ప్రత్యేకించి footpath మీద అమ్మే వాళ్ళ విషయం లో . వాళ్ళు మనిషి కో రేట్ చెపుతారు . పోనీ లో ఎండలో అమ్ముకున్తున్నాడని వాడడిగిన ధర ఇచేస్తే తర్వాతి వాడికి కూడా అదే ధర ఫిక్స్ అయి పోతుంది .ఆ వస్తువు ఎంతకీ తుగుతుందో అంతే ఇవ్వాలి గాని మనకి వుంది కదా అని చెప్పిన రేట్ కి కొనేస్తే నా వెనక వచ్చిన ఇంకో సగటు జీవికి నేను అన్యాయం చేసినట్టు అవుతుంది .వస్తువు వున్న ప్లేస్ బట్టి దాని విలువ వస్తుంది .గాంధీ గారి కళ్ళ జోడు pavement మీద పది రూపాయలకి కూడా ఎవడూ కొనకపోవచ్చు. అదే అంతర్జాతియ మార్కెట్ లో ప్రచారం ఇచ్చి వేలం పెడితే ఏ తాగుబోతు కంపెనీ వాడో కోట్లు రాల్చొచ్చు .బేరం ఆడాలి గాని శ్రమ జీవి ని దోచుకునే దృక్పదం తో మాత్రం కాదు .

  16. Pradeep said...

    Excellent post ...

  17. Raj said...

    మీ టపా బాగుంది. మీరన్నట్లు పేదవారి దగ్గర ఎక్కువగా బేరమాడకూడదు. కానీ ధర ఎక్కువ అనిపిస్తే తప్పదు. అమ్మేవాళ్ళు కూడా కొనేవారి ముఖం చూసి ధర చెప్పకూడదు కదా. బెంగళూరు వైట్ ఫీల్డ్ దగ్గర ఒక బండివాడు చాలా ఎక్కువ ధర చెప్పాడు. అదేమిటయ్యా అనడిగితే, మీకేం సార్, బాగా డబ్బులు సంపాదిస్తారుగా, ఇవ్వడానికేం? అన్నాడు. అమ్మేవాళ్ళు ఒకటి, రెండు రూపాయలు ఎక్కువ అడగటం వేరు, ఇలా కొనేవారిని బట్టి వేర్వేరు ధరలు చెప్పటం వేరు. కాబట్టి ఎక్కువ అనిపిస్తే బేరమాడటానికి వెనుకాడను ఎక్కడైనా సరే.

  18. Vinay Chakravarthi.Gogineni said...

    choosara koncham dabbu chetiki vaste (uchitamga)...em chestunnaro teleekunda kharchu pettaru alanti meeru vere means politicians vimarshinchadam no baaledu............meeru vallaki ichharu vallu valla bandhuvulaku ichharu......anthe

Post a Comment