తెలంగాణాలో చదువులు - KTR విశాలహృదయం - ప్రొ.నాగేశ్వర్ కుట్ర

Posted by జీడిపప్పు

తెలంగాణా ఉద్యమం మహారసవత్తంగా సాగుతోంది. ఇప్పటివరకు ఉద్యోగులను, కార్మికులను ఉద్యమంలోకి లాగి వారిని దిక్కుతోచని స్థితికి నెట్టిన రాజకీయనాయకులు అది చాలదన్నట్టు విద్యార్థులపైన కూడా తమ ప్రతాపాన్ని చూపెట్టాలని ప్రయత్నిస్తున్నారు కానీ కొంతమంది తల్లిదండ్రులనుండి గట్టి వ్యతిరేకత ఎదురవుతుండడంతో వీరి ఆటలు అంతగా సాగడం లేదు.

 పిల్లలు నెలలతరబడి స్కూళ్ళకు వెళ్ళకుంటే చదువుకున్నది కాస్తా మరచిపోవడమే కాకుండా చదువుపైన ఆసక్తి తగ్గిపోయి భవిష్యత్తులో డక్కీ ఒకటి పట్టుకొని పాటలు పాడుకుంటారేమో అన్న భయంతో తల్లిదండ్రులు తెలంగాణా నాయకులకు ఎదురు తిరుగుతూ విద్యను ఉద్యమం నుండి మినహాయించాలి అంటూ ఆందోళనలు చేస్తున్నారు. ఇప్పటికే ఉద్యమం పతాకస్థాయికి చేరుకొని విశ్రాంతి దిశవైపు ఆశగా చూస్తోంది. ఈ సమయంలో విద్యను మినహాయిస్తే రైతులు వ్యవసాయాన్ని మినహాయించాలని, ఉద్యోగులు తమ విధులను మినహాయించాలని అడిగితే ఇక సమ్మె చేసేదెవరు? ఏ మహబూబ్ నగర్‌లోనో లేదా నల్గొండలోనో సామాన్యుడు నరకయాతన అనుభవిస్తే కదా ఢిల్లీ మొత్తం కదిలేది. ఇంటర్ చదివే విద్యార్థికి సరి అయిన ర్యాంకు రాక జీవితం మరో మలుపు తిరిగితేనే కదా కేంద్రం ఆలోచించేది.

తెలంగాణా నాయకులను "విద్యను మినహాయించండి" అంటే "నాల్రోజులు స్కూలుకు వెళ్ళకుంటే ఏమి మునిగిపోతుంది? స్కూళ్ళు తెరిచాక ఎక్స్‌ట్రా క్లాసులు చెప్పి వాళ్ళ సిలబస్ ముగించి నిష్ణాతులను చేస్తాము.. అదేమంత కష్టమయిన పని కాదు" అన్నాడు ఒక మహానుభావుడు. ఇంకా "అసలు ఈ చదువులు కావాలని కోరుతున్నవారంతా ఎవరి ప్రోద్భలంతో అలా చేస్తున్నారో అందరికీ తెలుసు.. మా ఉద్యమాన్ని చల్లార్చడానికే సీమాంధ్రులు ఇలా పిల్లలకు చదువు ముఖ్యం అంటున్నారు. పిల్లలకు చదువు ముఖ్యమని అంటున్నది కూకట్‌పల్లి ప్రాంతంలోని సీమాంధ్రులే " అన్నాడు!  వారెవా. జోహార్ మేధావి నీకు!

ఇక ఈ విషయంలో అత్యంత ఆసక్తికరమయిన సంగతేమిటంటే "మీరు ఎందుకు బలవంతంగా స్కూళ్ళను మూయిస్తున్నారు?" అంటే "మేమెక్కడ ఆపాము? తల్లిదండ్రులే స్వచ్చందంగా చదువులొద్దు అంటున్నారు. ఉద్యోగులే జీతాలొద్దు అంటున్నారు. టీచర్లే పాఠాలు చెప్పమంటున్నారు.అంతా వాళ్ళే ముందుండి నడిపిస్తున్నారు" అంటూ తెలంగాణా ప్రజలకు ఎక్కడ వాత పెట్టాలో అక్కడ పెట్టారు. ఈ విషయంలో మాత్రం తెలంగాణా నాయకుల తెలివికి హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేము. ప్రస్తుత పరిస్థితిలో తెలంగాణాలో ఎవరయినా "అయ్యా మా పిల్లలు ఎంసెట్ లో మంచి ర్యాంకు తెచ్చుకోవాలి, దయచేసి కాలేజీలను తెరిపించండి" అంటే వెంటనే "వీడు సీమాంధ్రుల చెంచా" అని ముద్ర వేసి నాలుగు తంతున్నారు.

అన్నట్టు ఓ తెలంగాణా నాయకుడి కొడుకు "నాన్నా నేను కాలేజీకెళ్ళి చదువుకోకపోతే ఈ సారి మంచి ర్యాంకు రాదు..నాకు కాలేజీకి వెళ్ళాలని ఉంది" అంటే, ప్రతివిషయాన్ని "సీమాంధ్రుల కుట్ర" దృష్టితో చూసే ఆ తండ్రి ఏమి ఆలోచిస్తాడు, ఏ జవాబు చెప్తాడు?

************  ************  ************

నాల్రోజులక్రితం మందక్రిష్ణ మాదిగ "తెలంగాణా వ్యాప్తంగా అన్ని స్కూళ్ళనూ మూసివేయించిన రాజకీయనాయకులు తమ పిల్లలనేమో జూబ్లీహిల్స్ లో ఉన్న కార్పొరేట్ స్కూళ్ళకు పంపిస్తున్నారు. నిన్నకూడా కేటీయార్ పిల్లలు చిరాయూ స్కూలుకెళ్ళారు" అన్నాడు. నెలరోజులుగా తెలంగాణా ప్రియ బిడ్డలు స్కూళ్ళకు వెళ్ళకుండా ఇళ్ళలో ఉండిపోతే కేటీయార్ పిల్లలు స్కూలుకెళ్ళడం ఎంతవరకు సమంజసం అని అందరూ అనుకుంటున్న తరుణంలో ఇదే విషయాన్ని కేటీయార్‌ను అడిగారు.

ఈ ప్రశ్నకు బదులుగా కేటీయార్ "నేను తెలంగాణా ఉద్యమాన్ని నడిపించే రాజకీయ నాయకుడినే కానీ అంతకంటే ముందు ఒక బాధ్యతగల తండ్రిని. అభంశుభం తెలియని పిల్లలను స్కూళ్ళకు వెళ్ళకుండా అడ్డుకుంటే ఏమి ఒరుగుతుంది? పైగా బాల్యంలోనే ఇలాంటి విషబీజాలు నాటితే వారి భవిష్యత్తులో చాలాప్రమాదం అని మా నాన్న కేసీయార్‌గారు నాకు ఎన్నోసార్లు చెప్పారు కాబట్టే నాపిల్లలను ప్రతిరోజూ స్కూలుకు పంపుతున్నాను. వాళ్ళు స్కూలుకెళ్ళిన తర్వాత నేను తండ్రి పాత్ర నుండి రాజకీయనాయకుడి పాత్రలోకి ప్రవేశించాక ఒక తెలంగాణా నాయకుడిగా స్కూళ్ళను మూసివేయించడం నా బాధ్యత.

ఇక కొందరు నేను స్వార్థపరుడిని అంటున్నారు. అది ముమ్మాటికీ తప్పు. కేవలం నా పిల్లలే కాకుండా నా సోదరి కవిత పిల్లలు, మా అంకుల్ హరీష్‌రావు గారి పిల్లలను కూడా స్కూలుకెళ్ళి బాగా చదువుకోమని నేనే చెప్పి ఈ రోజుకూడా స్కూలుకు పంపించాను. కేవలం చిన్న పిల్లలే కాదు, ఇంటర్ చదువుతున్న నా బంధుమిత్రుల పిల్లలను గురించి ఎంతో కేర్ తీసుకుంటున్నాను. వాళ్ళు రెండు వారాలు నష్టపోయినా భవిష్యత్తుకు ఎంతో ముప్పు. అందుకే వారిని గుంటూరు, విజయవాడలో ఉన్న సీమాంధ్ర కాలేజీలకు ట్రాన్స్‌ఫర్ చేయించాను. నేనూ ఒకప్పుడు సీమాంధ్రలో చదువుకొన్నవాడినే కాబట్టి అక్కడ చదువులు ఎలాంటి అడ్డంకులు లేకుండా సాగుతాయని తెలిసీ మావాళ్ళను సీమాంధ్రకు చెందినవారి వోల్వోబస్సులో అక్కడికి పంపించాను"  అని చెప్పాలనుకున్నాడేమో కానీ మళ్ళీ ఏమనుకున్నాడో ఏమో..తెలంగాణా వ్యాప్తంగా స్కూళ్ళు మూతపడ్డ ఈ పరిస్థితుల్లో తన పిల్లలు స్కూలుకెళ్ళడం ఎంతవరకు సమంజసమో చెప్పకుండా దాటవేశాడు.

************  ************  ************

మన ఛానెళ్ళలో జరిగే చర్చా కార్యక్రమాల్లో కాస్త కూల్‌గా మాట్లాడే నాయకులు, తాను పట్టిన కుందేలుకు మూడేకాళ్ళంటు అడ్డగోలువాదన చేసే నాయకులతో పాటు మంచి రాజకీయ విశ్లేషకులు కూడా ఉంటారు. ఇలాంటి విశ్లేషకుల్లో నాకు బాగా నచ్చినవారు తెలకపల్లి రవి గారు, శ్రీనివాసరెడ్డి గారు మరియు ఎమ్మెల్సీ ప్రొ. నాగేశ్వర్ గారు. పక్షపాత ఆలోచనలతో కాకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పే వీరి అభిప్రాయాలను గమనిస్తే మనకు నిజానిజాలు మరింత స్పష్టంగా తెలుస్తుంటాయి.

ఒక మేధావిగా పేరున్న ప్రొఫెసర్ నాగేశ్వర్‌గారు మొన్న ఒక చర్చలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. ఎప్పటిలాగే తెలంగాణా నాయకుడు "చదువులొద్దు, సమ్మెలే ముద్దు" "పిల్లలు స్కూళ్ళకు వెళ్ళకూడదు" "నెలరోజుల చదువు నాల్రోజుల్లో నేర్చుకొనే సత్తా మా తెలంగాణా బిడ్డలకు ఉంది" అంటుంటే నాగేశ్వర్ గారు "అయ్యా మీరు పిల్లలను అడ్డుకొని సాధించేదేమీ లేదు. పైగా వారి భవిష్యత్తు ఎంతగా దెబ్బతింటుందో 1969 ఉద్యమం చూసిన మీకు తెలుసు. విద్యను మినహాయించండి. నేనేమీ సమ్మెలో ఒత్తిడి తగ్గించమనడంలేదు. చదువులొద్దు అన్నమాట మాని లిక్కర్ వద్దు అనండి. ప్రభుత్వం దిగివస్తుంది. మందు వల్ల వేల కోట్ల ఆదాయం వస్తోంది. మీరు ఒక మూడు నెలలు తెలంగాణాలో మద్యం షాపులు మూసివేయించి ఎవరూ మందు తాగకుండా చూడండి. దెబ్బకు తన యువకిరణాలు మసకబారుతుంటే సీయం ఢిల్లీ పరుగెత్తికెళ్ళి రాష్ట్రాన్ని నడపడానికి డబ్బుల్లేవు అంటూ తెలంగాణా కోసం ఒత్తిడి తెస్తాడు" అన్నాడు.

ఎంత ఘోరమెంతదారుణం! రాష్ట్రానికి మధం నుండి వస్తున్న ఆదాయంలో 75 శాతానికి పైగా అందిస్తున్న తెలంగాణాలో మద్యం మానివేయడమా? పొరపాటున అలా చేస్తే తొందర్లో నిజ్జంగా తెలంగాణా వచ్చినా వచ్చేస్తుంది. ఉద్యమాన్ని వీలయినన్నాళ్ళు సాగదీస్తూ పబ్బం గడపాలనుకొనే నాయకులు, కలెక్షన్ కింగులు, కలెక్షన్ క్వీన్లు ఏమయిపోతారు? "చదువులు వద్దు, ఉద్యోగాలు వద్దు, జీతాలు వద్దు, రోజువారీ ఆదాయం వద్దు" అంటూ సమ్మె చేస్తున్న తెలంగాణా ప్రజలను "మీరు మద్యం మానేస్తే చాలు, ప్రభుత్వం దిగివస్తుంది" అంటూ నాగేశ్వర్ గారు రెచ్చకొట్టడం వెనుక ఏదయినా కుట్ర ఉందా? తెలంగాణా వ్యతిరేక శక్తులున్నాయా?  

11 comments:

  1. John said...

    /తెలంగాణాలో మద్యం మానివేయడమా? పొరపాటున అలా చేస్తే తొందర్లో నిజ్జంగా తెలంగాణా వచ్చినా వచ్చేస్తుంది./

    మరీ అన్నాయంగ మాట్లాడుతున్నవే...మందు లేదూ అంటే...ఇస్కూల్లు, బస్సులు బందు చెయ్యనీకి, రోడ్లమీద దొమ్మీలు చెయ్యనీకి ఎవడొస్తడే అన్నా..ఉజ్జమాన్ని ఆపనీకి మంచి ప్లానే వేసినవ్.

  2. Anonymous said...

    /మీరు మద్యం మానేస్తే చాలు, ప్రభుత్వం దిగివస్తుంది" అంటూ నాగేశ్వర్ గారు రెచ్చకొట్టడం వెనుక ఏదయినా కుట్ర ఉందా? తెలంగాణా వ్యతిరేక శక్తులున్నాయా/
    కొట్టండిరా వీణ్ణి అని ఏ మద్యమకారుడూ పిలుపు ఇవ్వలేదా? మద్యాన్ని ఆపేస్తే మద్యమకారులంతా ఏమవ్వాలి?!
    దిమ్మ వీళ్ళకే తిరిగి పడిపోతే వుజ్జమం ఏంగావాలె?

  3. చదువరి said...

    బాగా రాసారండి.

    ఇక్కడొక విశేషం చెప్పుకోవాలి మనం..
    ఈ సమ్మె కాలంలో పోయిన బడిరోజులకు గాను, ఆదివారాలు, సంక్రాంతి సెలవుల్లో పాఠాలు చెబుతాం అని పంతుళ్ళ జాకర్లు అంటున్నారు.

    కొందరు తెరాస నాయకులు మాత్రం, ’వేసవి సెలవుల్లో పోయిన పాఠాలు చెప్పిస్తాం’ అని అన్నారు.

    అంటే పంతుళ్ళ జాకర్లకు సంక్రాంతి లోపు సమ్మె ముగుస్తుందని నమ్మకం (తెలంగాణ వచ్చినా రాకున్నా). తెరాస నాయకులకు మాత్రం వేసవి సెలవుల దాకా సమ్మె నడుస్తుందని నమ్మకం లాగుంది.

    మొత్తమ్మీద ఇద్దరూ కూడా మీరు సూచించిన "..పిల్లలు నెలలతరబడి స్కూళ్ళకు వెళ్ళకుంటే చదువుకున్నది కాస్తా మరచిపోవడమే కాకుండా చదువుపైన ఆసక్తి తగ్గిపోయి .." అనే ఇంగిత జ్ఞానం లేకుండా మాట్టాడుతున్నారు. ఇదంతా తెలంగాణ ప్రాంతంలో చదూకుంటున్న పిల్లల, వాళ్ళ తల్లిదండ్రుల దురదృష్టం, అంతే!

    మరో సంగతి..
    "ఇప్పటికే ఉద్యమం పతాకస్థాయికి చేరుకొని విశ్రాంతి దిశవైపు ఆశగా చూస్తోంది." - నిజమే. స్వామి గౌడ్ నాయకులను తిడుతూ అంటున్న మాటలు చూస్తూంటే, సమ్మెను ముగించేందుకు దార్లు వెతుకుతున్నట్టుగా అనిపిస్తోంది.

  4. Sravya V said...

    పొరపాటున అలా చేస్తే తొందర్లో నిజ్జంగా తెలంగాణా వచ్చినా వచ్చేస్తుంది. ఉద్యమాన్ని వీలయినన్నాళ్ళు సాగదీస్తూ పబ్బం గడపాలనుకొనే నాయకులు, కలెక్షన్ కింగులు, కలెక్షన్ క్వీన్లు ఏమయిపోతారు?
    --------------
    నిజమే కదా అలా జరిగితే ఎంత కష్టం మరి :)))

  5. Anonymous said...

    ఎంత అన్యాయంగా రాస్తున్నారు!
    ఎంత దారుణమైన కామెంట్లు...!!
    తెలంగాణా విద్యార్ధుల చదువులు దెబ్బ తింటున్నాయని మొసలి కన్నీరు కారుస్తున్నది మీరే!
    తెలంగాణా ఉద్యమం మీద, ప్రజల మీదా ఏమాత్రం సంస్కారం లేకుండా అవాకులూ చెవాకులూ పేలుతున్నదీ మీరే!!
    తెలంగాణా అస్తిత్వ పోరాటం అంటే మీకు ఎంత చులకన !!!
    అయినా తెలంగాణా మీద శాస్వతంగా పెత్తనం చేయాలనే ఇంకా మీ దురాశ.
    ఇంతకంటే దుర్మార్గం ఎక్కడా వుండదు.

    కానివ్వండి ..
    మీ ముఖ్య మంత్రి
    మీ స్పీకర్,
    మీ డీ జీ పీ ,
    మీ సెక్రటేరియట్ ..... మీకు అడ్డేమిటి
    ఈ అన్యాయం ఇంకా ఎంతో కాలం సాగదు గాక సాగదు.

    ఇప్పటికే మీ రాతలను, మీ వెకిలి విమర్శలను తెలంగాణా ప్రజలు పట్టించుకోవడం మానేశారు.
    మీ ఇష్ట మోచ్చినట్టు ....
    తెలంగాణా వచ్చేంత వరకూ ...........!

  6. సూటిగా said...

    తూచ్! ఇలా అన్ని నిజాలని బ్లాగులలో,కామెంట్లలో చెప్పడం బాగాలేదు

  7. Imtiaz Ali Khan said...

    అనానిమస్ గారూ,

    మీరు మాది గొప్ప ఉద్యమం అంటూ.. అన్ని కామెంట్స్ ని కలిపి ఉక్రొశం వెళ్ళ గక్కారుకానీ..ఈ పొస్ట్ లొ ఒక్క దానికైనా జవాబు చెప్ప లెదే...బాగున్నాయి మీ శాపనార్థాలు..

    మీ హోం మినిస్టర్...
    మీ డెప్యుటి సీ యం...

    మరిచినట్టు ఉన్నారు..

  8. సుజాత వేల్పూరి said...

    ఇంకోటి! ఇంజనీరింగ్ కాలేజీలన్నీ సమ్మె వల్ల మూత పడటంతో కాంపర్ రిక్రూట్మెంట్స్ అన్నీ ఆగి పోయాయి. దానివల్ల ఇక్కడి విద్యార్థుల బదులు కార్పొరేట్ కంపెనీలు ఇతర రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్ కాలేజీల్లో కాంపస్ రిక్రుట్ మెంట్స్ నిర్వహించి ఉద్యోగాలిస్తున్నాయిట! చేతిలో ఉన్న ఉద్యోగావకాశాల్ని కాల రాసి, రాబోయే రోజుల్లో ఎప్పుడో బోల్డు ఉజ్జోగాలిస్తామని చెప్పడంలో ఔచిత్యం ఏమైనా ఉందా అసలు?

    ఇంకా ఈ T-Teachers అంటున్నారు...సెలవుల్లో కూడా పని చేసి పిల్లలకు పాఠాలు చెప్తార్ట. అంతా వీళ్ళిష్టమేనా?

  9. Anonymous said...

    రిక్రూట్మెంట్స్ కంపెనీలం మమల్ని అడగండి బాధలేంటో.

    అసలు తెలుగువాళ్ళు ఫేక్ రెజుమె లని ఏ ముహుర్తాన అన్నారో కాని,ఏ ఒక్క కంపెనీ అంధ్రా కి రావడం లేదు.దయ చేసి తెలుగు వాళ్ళు వద్దు అని నిర్మొహమాటం గా చెప్పేస్తారు. అసలు మొదటి మైల్ లో నోట్ పెట్టెస్తారు.డొంట్ లుక్ ఫర్ ఆంధ్ర పీపుల్ అని. :( . ముల్లు లా గుచ్చుకుంటుంది.

    అయినా నా రాష్ట్రం మీద మమత చావక, రిక్రూట్మెంట్ మనేజర్ లని బతిమాలితే, హైదరాబాద్ కి చచ్చినా రాము అని తెగేసి చెప్పారు. వుయ్ డోంట్ థింక్ థిస్ ఇస్ ద టైమ్ టు హోల్డ్ కాంపస్ సెలెక్షన్స్. హ్మ్మ్మ్...

    మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా.... ???????

  10. Unknown said...

    "విద్యను మినహాయించండి" అంటే "నాల్రోజులు స్కూలుకు వెళ్ళకుంటే ఏమి మునిగిపోతుంది? స్కూళ్ళు తెరిచాక ఎక్స్‌ట్రా క్లాసులు చెప్పి వాళ్ళ సిలబస్ ముగించి నిష్ణాతులను చేస్తాము.. అదేమంత కష్టమయిన పని కాదు" అన్నాడు ఒక మహానుభావుడు. వీడు ఉపాధ్యాయుడు అంటేనే అసహ్యం వేస్తోంది. ఇటువంటి వెధవలు తెలంగాణా లోనే ఉపాధ్యాయులుగా ఉంటారు తప్ప ఏ ప్రాంతం లోనూ ఇటువంటి వెధవలని ఉపాధ్యాయులుగా చూడం. ఎక్స్ ట్రా క్లాసులు పెట్టి ఊదరగోడితే పిల్లలకు చదువు తలకు ఎక్కదనే విషయం కూడా తెలియని వెధవని ఉపాధ్యాయ వృత్తి లో ఉన్చినందులకు ఆ జిల్లా విద్యా శాఖాధికారిని చెప్పు తీసుకొని కొట్టాలి.

  11. Anonymous said...

    @Anonymous of October 15, 2011 11:13 AM:

    You are 100% correct about Andhra fake resmes. When I recruit, I never select Andhra guys (especially those who are trained in Ameerpet bogus instituites). Most of these "engineers" don't even understand English. We always prefer Telangana, Karnataka or TN people.

Post a Comment