హ హ్హ హ్హా @ షారూఖ్ ఖాన్
Posted by జీడిపప్పు
నేను సాధారణంగా ఏ జట్టూ "ఓడిపోవాలని" కోరుకోను. కొన్ని జట్లు గెలవాలని మాత్రమే కోరుకుంటాను, ఒక్క కోల్‌కతా నైట్ రైడర్స్ విషయం లో తప్ప. అందుకు కారణం: కోల్‌కతా జట్టు యజమాని అయిన షారూఖ్ ఖాన్ ప్రవర్తన. తాను బాలీవుడ్ కింగ్ అని సొంతడబ్బా కొట్టుకోవడం, అమీర్ ఖాన్, అమితాబ్ ల కంటే గొప్పవాడని చెప్పుకోవడం వల్ల కాదు ఈ వ్యతిరేకత. ఈ వ్యతిరేకతకు కారణం గత ఏడాది IPL లో కోల్‌కతా తమ చివరి మ్యాచ్‌లో చతికిలపడిన మరుసటిరోజు జరిగిన సంఘటన. దారుణ పరాజయాలు చవిచూసిన ఆటగాళ్ళు తలలు వేలాడేసుకొని చూస్తుంటే, వారికి ధైర్యం చెప్పే నాథుడే లేదు. బాలీవుడ్ బాద్షా (??!!) ముంబై చెక్కేసి మరుసటిరోజు వాళ్ళకు SMS పంపించాడు సరిగా ఆడలేదని!
ఒక జట్టు యజమాని ఇలాగేనా ప్రవర్తించవలసింది? ఓటమి భారంతో ఉన్న ఆటగాళ్ళను నిందించాలా లేక "ఇది మొదటి సిరీస్ కదా, మళ్ళీ ప్రయత్నిద్దాము, 2009లో జరిగే సిరీస్‌లో బాగా ఆడదాము" అంటూ ఆత్మస్థైర్యాన్ని పెంపొందించాలా? 2007 NFL లో మయామీ డాల్ఫిన్స్ కేవలం ఒక్క మ్యాచ్ గెలిచి 15 ఓడిపోయినప్పటికీ యాజమాన్యం వాళ్ళపట్ల ఇలా ప్రవర్తించలేదు. ఆటగాళ్ళలో మార్పులు చేసి వారి ఆత్మస్థైర్యాన్ని పెంచే చర్యలు చేపట్టింది. అందుకే 2008లో దాదాపు playoffs కు చేరుకున్నారు. ఇది తెలుసుకోలేని గరీబ్ ఖాన్ ఎప్పటిలాగే మతిలేని మాటలతో క్రీడాకారుల అంకితభావాన్ని దిగజార్చాడు. దాని ఫలితమే ఇప్పుడు కనిపిస్తున్నది.
దీంట్లో కాస్తో కూస్తో గంగూలీ పాత్ర కూడా లేకపోలేదు. భారతజట్టులో ఉన్నన్ని రోజులూ గ్రూపులు కట్టి సభ్యుల మధ్య ముఠారాజకీయాలు నడిపిన దాదా ఇక్కడా తన బుద్ది చూపిస్తున్నాడు. దెబ్బకు టీం రెండుగా చీలిపోయింది. నాల్రోజులక్రితం టీంలో "అంతర్గత గూఢచారులు" ఉన్నారని తెలిసి ఇద్దరి పైన వేటు వేసారు. ముందు ముందు ఇంకెన్ని తమాషాలు ఉండబోతాయో! కోల్‌కతా ఓటమి చూసి సంతోషంగా ఉన్న నేను "కోల్‌కతా గెలిస్తేనే మళ్ళీ దక్షిణాఫ్రికాలో అడుగుపెడతాను" అంటూ అటూ-ఇటూ కాని షారూఖ్ ఖాన్ మాటలు చూసి ఉబ్బితబ్బిబ్బయ్యాను. ఇలాంటి పనికిమాలిన చవట యజమానికి సరిపడేలా ఆడుతున్నారు ఆ టీం ఆటగాళ్ళు కూడా.
కొసమెరుపు: ఆ మధ్య "చక్ దే ఇండియా" అనే ఒక సినిమా వచ్చింది. అందులో ఒక హాకీ ఆటగాడు అమ్మాయిలను ఉత్సాహపరచి, ఆత్మస్థైర్యాన్ని నూరి, విజయాల బాటలో నడిపిస్తాడు. అది ఎంతో మందికి స్పూర్తినిచ్చే సినిమా, ఓటమితో దిగులు పడకూడదు, అందరూ ఇలా ఉండాలి, అలా ఉండాలి అని నీతులు చెప్పిన ఆ నటుడి పేరు షారూఖ్ ఖాన్.
ఆ మూడున్నర మార్కులు
Posted by జీడిపప్పు
మన తెలుగు అధ్యాపకులకు మార్కులివ్వడం చేతకాదు కాబట్టి 90 దాటనిచ్చేవారు కాదు. వీళ్ళ కొవ్వు అణచాలని ప్రైవేటు కాలేజీల్లో సంస్కృతం ప్రవేశపెట్టారు. ఏ చెత్త వ్రాసినా లేదా ప్రశ్ననే తిప్పి తిప్పి వ్రాసినా సంస్కృతంలో 90 తగ్గేవి కాదు. దానితో రెండేళ్ళ మొత్తాన్ని 970 వరకు తీసుకెళ్ళారు. ఆ తర్వాత ఆ ఐదు మార్కులు పోగొట్టుకోవడం చాలా ఘోరం అని భావించారేమో, నూటికి 99 లేదా నూరు ఇచ్చేయమని ప్రభుత్వానికి కొన్ని బిస్కెట్లు పడేశాక రెండేళ్ళ మార్కుల మొత్తం 980కి చేరుకుంది. ఈ మార్కులు ఇలా పెరుగుతూ, మజ్జిగతూ గత వారం ఇంటర్ ఫలితాలు విడుదలయినప్పటికి 993 సంఖ్యను చేరుకున్నాయి!!
రెండేళ్ళకు కలిపి 993 మార్కులు వచ్చాయంటే సగటున ప్రతి ఏడాది మూడున్నర మార్కులు పోయి ఉండాలి. ప్రైవేటు కాలేజీల్లో చదివేవారికి మేథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో నూరుశాతం మార్కు రావడం గత దశాబ్ద కాలంగా మామూలే కాబట్టి ఈ మూడున్నర మార్కులు మిగిలిన రెండింటిలో పోయి ఉండాలి. అమాయకురాలయిన సంస్కృతాన్ని దంచి నూటికి 99 మార్కులు తెచ్చుకున్నారు అనుకుందాము. అంటే, ఇంగ్లీషులో తొంభయ్యేడున్నర మార్కులు వచ్చినట్లు. సపోజ్, పర్ సపోజ్, సంస్కృతంలో నూటికి నూరు తెచ్చుకుంటే, ఇంగ్లీషులో తొంభయ్యారున్నర తెచ్చుకున్నట్టు!
ఇవన్నీ ఆలోచించాక గత మూడు రోజులనుండి నన్ను వేధించుకుని తింటున్న ప్రశ్నలేమిటంటే - అసలు ఇంగ్లీషులో ఆ మూడున్నర మార్కులు ఎందుకు పోయాయి? కార్పొరేట్ కాలేజీలు ఎందుకు ఈ దారుణానికి ఒడిగట్టాయి? సంస్కృతంలో ఇస్తున్నట్టు ఇంగ్లీషులో కూడా నూటికి నూరు ఎందుకు ఇవ్వడం లేదు? విద్యార్థులకు 1000కి 1000 తెచ్చుకొనే అవకాశం ఎప్పటికి కల్పించబడుతుంది? సంస్కృతంలో నూటికి నూరు ఇస్తున్నపుడు తెలుగులో కూడా వంద మార్కులు ఇవ్వవచ్చు కదా, అపుడు అందరూ ఎగబడి తెలుగు చదువుతారు కదా?
సాహితీ రంగంలో సరికొత్త విప్లవం - బర్గరములు
Posted by జీడిపప్పు
ఇక పోతే, నాకు "ఏదో" వ్రాసి పేరు తెచ్చుకోవాలనే కోరిక ఉంది. అందరూ నా రాతలను చూసి "ఆహా ఓహో" అనాలి. పద్యాలు వ్రాయడం కుదరదు కాబట్టి దీనికున్న మార్గాలు రెండు. ఒకటి - కథలు వ్రాయడం, రెండు - కవితలు వ్రాయడం. కవితలు వ్రాయడం పట్ల నాకు ఆసక్తి లేదు. కథలు వ్రాయడం పెద్దగా రాదు. ఈ మధ్యనే 2019కి ఒక మంచి కథ వ్రాయాలని "విజన్ 2019" అనే ప్రాజెక్టు మొదలుపెట్టి తెలుగు కథలు ఎడా పెడా చదివేస్తున్నా. కానీ అప్పటివరకు ఆగడం కుదరదు కదా. ఏదో ఒకటి వ్రాసి పేరు తెచ్చుకోవాలి అనే గాఠ్ఠి నిరణయానికి (మొన్న ఏవో వార్తలు చూస్తుంటే "నిరణయం" అంది న్యూస్ రీడర్) వచ్చేసాను.
ఎక్కడో వెతకపోయిన మిడ్‌నైట్‌మసాలా వీడియో యూట్యూబ్ లోనే దర్శనమిచ్చినట్లు నా సమస్యకు మార్గం నేను చూసే బ్లాగుల్లో మరియు వెబ్ పత్రికల్లో కనపడింది -- "నానీలు" లేదా "నానోలు" రూపంలో. నాకు ఇవి భలే నచ్చేసాయి. పట్టుమని పది పదాలతో పొందికగా వాక్యం వ్రాయడం చేతకాకపోయినా ఫరవాలేదు, నానోలు రాసేయచ్చు. దీనికి కావలసినదల్లా ఒక వాక్యాన్ని చీల్చి చండాడి అందులో ఉన్న నాలుగు పదాలను గిలక్కోట్టి ఒకదాని కింద మరొకటి అమర్చడమే. అది చూసి కొందరు 'అబ్బో యబ్బో" అంటారు. వీటిని ఎవరు కనిపెట్టారో కానీ, వారికి దండేసి దణ్ణం పెట్టి సన్మానం చేయాలి!!
నేను కూడా నానోలు రాసేద్దామని ఒక పేపరునుండి నాలుగు పదాలను కత్తిరించి డబ్బాలో వేసి గిలక్కొట్టడం మొదలుపెట్టాను. కానీ అంతలో గుండెల్లో కలుక్కుమంది... భాగ్యం కోసం 13 వేలు ఇవ్వాల్సినప్పుడు చిన్నారావుకు అనిపించినట్లు. ఎవరో కనిపెట్టిన ఈ "వాక్య విధ్వంస ప్రయోగాన్ని" నేనూ అనుసరిస్తే నాకూ వాళ్ళకూ తేడా ఏముంది? నేను సరికొత్త ప్రక్రియ కనిపెట్టి, తెలుగు సాహితీ రంగంలో విప్లవం సృష్టించి, మరుగునపడుతున్న తెలుగుపై వెలుగులు కురిపించి, ఇంకేదో చించాలని ఇంకోసారి నిరణయించుకొని తెలుగు సాహితీ జగత్తులో ఇప్పటివరకు లేని అత్యద్భుత పాకిక్రియను, క్షమించాలి, ప్రక్రియను కనిపెట్టాను. దానిపేరే "బర్గరము".
పాణ్యం నిఘంటువులో "బర్గరము" అంటే ఉన్న అర్థం- మూడు పదాలతో ఏర్పడిన వాక్యాలు మూడు ఉన్న సమూహం. ఉదాహరణకు:
అయిపోయాయి ఎన్నికలు రాష్ట్రంలో
ఎదురు చూస్తున్నారు అందరూ
చకోరపక్షుల్లా ఫలితాల కోసం
"రాష్ట్రంలో ఎన్నికలయిపోయాయి, అందరూ ఫలితాలకోసం చకోరపక్షుల్లా ఎదురుచూస్తున్నారు" అనే ఒక మామూలు వాక్యాన్ని చీల్చి చెండాడి గిలక్కొడితే ఒక అత్యద్భుత "బర్గరము" తయారయింది. చూసారా, సాహితీ రంగాన్ని కొత్తగుంతలు, పుంతలు తొక్కించడం ఎంత సులభమో?
నానోలు కేవలం నాలుగు పదాలతో కూడుకున్నవి. కానీ "బర్గరములు" తొమ్మిది పదాలతో కూడుకున్నవి. నాలుగు పదాలను ఒకదాని కింద ఒకటి అమర్చడం కంటే, తొమ్మిది పదాలను వాక్యానికి మూడేసి అమర్చడంలో రచయిత సామర్థ్యం బయట పడుతుంది. పైగా బర్గరములో నానోల కంటే ఎక్కువ సాహితీ విలువలు ఉంటాయి. కాబట్టి ఇకనుండి అందరూ నానోలు పక్కన పెట్టి బర్గరములు వ్రాయడం మొదలుపెట్టి తెలుగు సాహితీ రంగాన్ని ఇంకో దిక్కుకు తీసుకెళ్ళాలి.
అవీ..ఇవీ..అన్నీ
Posted by జీడిపప్పు
ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే, మొన్న ఒక కుర్రాడికి 25 ఏళ్ళ శిక్ష పడింది ,అతడు చేసిన "ఘోర" తప్పిదానికి. ఒక టీనేజ్ అమ్మాయి తన నగ్న చిత్రాలను తీసి సెల్‌ఫోన్లో తన బోయ్ ఫ్రెండ్ కు పంపింది. టీనేజ్ అమ్మాయిల్లో చాలామంది తమంతట తామే ఇలాంటి పనులు చేస్తుంటారు తన బోయ్ ఫ్రెండ్ తనను మెచ్చుకోవాలని. కొద్ది రోజులకు ఆ అమ్మాయి ఇతడితో విడిపోయింది. ఆ కోపంలో ఆ కుర్రాడు ఆ అమ్మాయి పంపిన ఫోటోలు అందరికీ పంపించాడు.
అంతే, ఆ కుర్రాడిని "చైల్డ్ పోర్నోగ్రఫీ" చట్టం కింద అరెస్టు చేసారు. 43 ఏళ్ళ వయసు వచ్చాక ఆ 18 ఏళ్ళ కుర్రాడు బయట వస్తాడు! ఇది చాలా దారుణం అనిపిస్తున్నది. ఆ కుర్రాడు చేసింది తప్పే కానీ దానికి విధించిన శిక్ష మాత్రం సరి అయినది కాదు. ఈ వార్త చదివిన ఎంతో మంది తల్లిదండ్రులు దీనిని ఖండిస్తున్నారు. అందరికీ తెలుసు - అనుక్షణం రెచ్చగొట్టే వాతావరణం లో ఉన్న పిల్లలు ఇలాంటివి చేస్తుంటారని. అంత మాత్రానికి ఆ కుర్రాడి జీవితం నాశనం చెయ్యడం భావ్యం కాదు. ఒక వేళ తప్పు చేసిన వారినందరినీ శిక్షించాలంటే, ఆ అమ్మాయిని కూడా జైల్లో పెట్టాలి.. అమెరికాలోని సగం మందికి పైగా టీనేజర్లను జైళ్ళలో పెట్టాలి!
*****
ధనాధన్ ధోని పట్టిందల్లా బంగారమే అవుతోంది. ఏ రకమయిన ఫార్మాట్ అయినా సరే విజయవిహారం చేస్తున్నాడు. దాదాపు 40 ఏళ్ళ తర్వాత న్యూజిలాండ్‌లో సిరీస్ గెలుచుకోవడం అభినందనీయం. ఇక మూడవ టెస్టులో ముందుగానే డిక్లేర్ చెయ్యకపోవడం చూస్తే కెప్టెన్ గా ధోని సమర్థత తెలుస్తోంది. అంతకు ముందు మ్యాచులో 600 కొట్టిన వాళ్ళకు మరో రెండు రోజులు అవకాశం ఇస్తే లక్ష్యాన్ని ఛేదించించినా ఛేదించవచ్చు. ఇక్కడ మ్యాచ్ గెలవడం ముఖ్యం కాదు, సిరీస్ గెలవడం ముఖ్యం. అందుకే నాలుగో రోజు కూడా కాసేపు బ్యాటింగ్ చేసి సిరీస్ కైవసం చేసుకున్నారు. స్టీవ్ వా తర్వాత కెప్టెన్ అంటే ధోని అనిపించుకుంటాడేమో భవిష్యత్తులో!*****
అల్లు అరవింద్ వైఖరి నాకు అస్సలు నచ్చలేదు. ఇప్పటికే పార్టీ కోసం ఎంతో కష్టపడ్డవారు, అభిమానులు పార్టీకి గుడ్ బై చెప్పేశారు. సుమారు ఆరేడు వందల కోట్లకు టికెట్లు అమ్మాడు అరవింద్. రాజయకీయాల్లోకి వచ్చీ రాగానే అంత కక్కుర్తి ఎందుకో? పొరపాటున ఎందుకూ కొరగాని సీట్లు వస్తే చక్రం తిప్పలేడు . అలా కాకుండా ఒక 70-80 సీట్లను అమ్ముకొని 200-300 కోట్లు సంపాదించుకోవాల్సింది. పైగా వాళ్ళు అడిగిన సీట్లను పడేస్తే నమ్మకంగా కాళ్ళ దగ్గర పడి ఉంటారు కదా?ఎలక్షన్లలో అభ్యర్థులు గెలిచినా అరవింద్ చేతిలో కీలుబొమ్మలుగా ఉంటారు కాబట్టి నెలవారీ మామూళ్ళ కింద నెల నెలా కొన్ని కోట్లు వస్తాయి. మరో వైపు అభిమానులలో కూడా అసంతృప్తి ఉండదు. ఈ విధంగా చేయడం వల్ల రాబోవు ఐదేళ్ళలో సులభంగా ఐదారు వందల కోట్లు సంపాదించవచ్చు. అంతేకాక ఐదేళ్ళ తర్వాత సీట్లను ఎక్కువ రేటుకు అమ్ముకోవచ్చు. మొత్తమ్మీద చెప్పొచ్చేదేమిటంటే, చెడ్డవాడిగా ముద్ర వేయించుకొని ఇప్పటికిప్పుడు కొన్ని వందల కోట్లు సంపాదించుకోవడం కంటే, మంచివాడిగా పేరు తెచ్చుకొని నెమ్మదిగా వేల కోట్లు సంపాదించవచ్చు. ఇప్పటికయినా అల్లు అరవింద్ కళ్ళు తెరవాలి.
అన్నట్టు, చిరంజీవి గారి అభిమానులకు ఒక సువర్ణావకాశం.పీఆర్పీ ఎన్నారై విభాగం "మార్పు కోసం" ప్రజారాజ్యం పార్టీకి విరాళాలు ఇవ్వమని కోరింది. వరద/భూకంప బాధితులకు విదిల్చినట్లు పాతికో,పరకో,చాటో కాకుండా చిరంజీవి గారి అభిమానులు కనీసం ఒక నెల జీతం అయినా డొనేట్ చేసి మెగా ఫ్యాన్స్ పవర్ ఏంటో చూపించి జ్యోతీరావు ఫూలే అనుచరులు అనిపించుకోవాలి. ఈ అవకాశాన్ని జారవిడుచుకోకండి.
తెలుగు ప్రముఖుల చమత్కార భాషణలు
Posted by జీడిపప్పు
గురజాడ అప్పారావు, గిడుగు రామ్మూర్తి పంతులు, కట్టమంచి రామలింగా రెడ్డి, త్రిపురనేని రామస్వామి చౌదరి, విశ్వనాథ సత్యనారాయణ, దేవులపల్లి క్రిష్ణశాస్త్రి, శ్రీ శ్రీ వంటి ప్రముఖుల చమత్కారాలు ఇందులో ఉన్నాయి. పూర్తి జాబితా.
పుస్తకం: తెలుగు ప్రముఖుల చమత్కార భాషణలు
రచన: డా|| సి.మృణాళిని
పేజీలు: 76 (92)
లభ్యం: ఇక్కడ (ఈ పుస్తకం చదవడానికి DJVU plugin ఇన్స్టాల్ చేసుకోవాలి)
మచ్చుకు నాలుగు చమత్కారాలు:
ఆదిభట్ల నారాయణదాసు: నారాయణదాసు, ఆనందగజపతిరాజు పేకాటలో నిమగ్నమై వున్నారు. తన చేతిలో మూడు రాజులు చూసుకున్న దాసుగారు ఇక తనకు విజయం తథ్యమనుకుని, ఉన్న డబ్బంతా పందెంలో ఒడ్డారు. అటు ఆనందగజపతి వద్ద మూడు ఆసులు ఉండడంతో, ఆయన ఇంకా ధీమాగా ఉన్నారు. అయినా దాసుగారి మీద ఉన్న గౌరవం కొద్దీ షో చెయ్యమని ఆయన్నే అడిగారు. ఆదిభట్లవారు సగర్వంగా మూడు రాజుల్ని చూపారు. ఆనందగజపతివారు మరింత ధీమాగా మూడు ఆసులు చూపారు. గెలిచిన ఆనందంతో మొత్తం డబ్బును లాగేసుకుంటున్నారు మహరాజు. ఇంతలో ఆదిభట్ల అమాయక మొహం పెట్టి "అయినా రాజావారూ! నాకు తెలియక అడుగుతాను - రాజులుకంటే ఆసులు గొప్పా?!" అని అడిగారు. తక్షణం మహారాజుగారు ఫకాలున నవ్వి, ఆ డబ్బంతా దాసుగారికే ఇచ్చేశారు.
కట్టమంచి రామలింగారెడ్డి : కట్టమంచివారు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి వెళ్ళారు. అక్కడ ఆంగ్లేయుల ఆహార నియమాలు ఆయనకు అర్థం కాలేదు. ఒకసారి ఫలహారంలో ఆపిల్ పళ్ళు పెట్టారు. అందరూ చాకుతో దాన్ని కోసుకొని తింటున్నారు. చాలామంది భారతీయుల్లా చాకులు, ఫోర్కులు వాడడం అప్పట్లో సి.ఆర్.రెడ్డి గారికి తెలీదు. వాళ్ళను అనుసరించబోతే నవ్వులపాలు కావలసి వస్తుందేమోనన్న భయం మరోవైపు. కానీ, ఆయన బుర్రకు అసాధ్యం ఉంటేనా? మెల్లగా పక్కనున్న వ్యక్తితో ఇలా అన్నారు: "మా దేశంలో రామాయణం ఉంది కదా! చాలా ప్రసిద్ధ కావ్యం. అందులో మహావీరుడు హనుమంతుడు ఆపిల్ పళ్ళకు ఎలా తినేవాడో చూపిస్తా" అని పళ్ళెంలోని పండును చేత్తో తీసుకుని తినేశారు. 'ఇదేదో పద్దతి చాలా సరదాగా ఉందాని ఆంగ్లేయులు ఆయన పద్ధతిలోనే తినడం - అసలు జోకు.
త్రిపురనేని రామస్వామిచౌదరి: ఒక సభలో ఒక ఆస్తికుడు "నాస్తికుడినని చెప్పుకునే మీరు ఆస్తికులైన ఆర్య సమాజంలో ఎలా చేరారు" అని అడిగారు. దానికి చౌదరిగారి సమాధానం :అయ్యా! తక్కినవాళ్ళు ముప్పైమూడు కోట్ల దేవతలున్నారంటున్నారు. ఆర్యసమాజంవారు చక్కగా ఒకే దేవుడున్నాడంటారు. ఆ ముప్పైమూడు కోట్ల దేవతలతో వాళ్ళు కుస్తీపడి ఓడించి, తమ ఒక్క దేవుడినీ నిలబెట్టగలిగితే, ఆ ఒక్క దేవుడితో కుస్తీపట్టి ఓడించడం నాకు సుళువు కదా! అందుకని ఈ సమాజంలో చేరాను."
దుగ్గిరాల గోపాలకృష్ణ్ణయ్య: ఓసారి దుగ్గిరాల గోపాలకృష్ణ్ణయ్య గారు జట్కాలో వెళ్తున్నారు. ముందువైపు బరువు చాలక జట్కావాడికి ఇబ్బందిగా ఉంది. అందువల్ల అతడు 'కొంచెం పైకి రండి సార్ ' అన్నాడు. దుగ్గిరాల బోలెడు ముచ్చటపడిపోయి - 'ఇంతకాలానికి నువ్వొక్కడివి దొరికావురా ఆంధ్రదేశంలో తోటి ఆంధ్రుడిని పైకి రమ్మన్నవాడివి" అన్నాడు.
అందరికంటే అత్యుత్తమ చమత్కారి శ్రీ శ్రీ అని తెలుసుకుని హాచ్చెర్యపోయాను!!
అవీ..ఇవీ..అన్నీ
Posted by జీడిపప్పు
By the way, ఆర్థిక వ్యవహారాల గురించి సత్యప్రసాద్ గారి బ్లాగుతో పాటు శశాంక్ బ్లాగులో కూడా కొన్ని ఆసక్తికరమయిన పోస్టులు వస్తున్నాయి.
*******
అనుకున్నట్టే వరుణ్ గాంధీకి ఉజ్వల భవిష్యత్తు ఉందని నిశ్చయమయింది. ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడాడు అన్న ఆరోపణలు చూసి బీజేపీ "మాకు సంబంధం లేదు ఈ గాంధీ మాటలతో" అన్నప్పటికీ, ఆ తర్వాత తన ఓటు బ్యాంకు పెంచుకోవచ్చన్న విషయం గ్రహించిన రథరత్న, రథవిదూషక, రథబీభత్స, రథపిశాచి అద్వానీగారు ముందుకొచ్చి వరుణ్ గాంధీ పైన కేసు పెట్టడం ఎమర్జెన్సీ లాంటిదని మద్దతు పలికాడు. వరుణ్ గాంధీని హత్య చేసేందుకు పాకిస్తాన్ నుండి వచ్చిన ఛోటా షకీల్ అనుచరుడిని పోలీసులు అరెస్టు చేసారు. వరుణ్ గాంధీని "హిందూ పరిరక్షకుడి"గా వర్ణిస్తూ ఆకాశానికెత్తేస్తున్నారు బీజేపీవాళ్ళు. చివరకు బీజేపీకీ మరో "గాంధీ" దిక్కయినా హాచ్ఛర్యపోనక్కర్లేదు.*******
"బాబుల్ గాడి దెబ్బ గోల్కొండ అబ్బ" అన్న మాట చంద్రబాబు చేసినదానికి వర్తిస్తుంది. ప్రపంచ స్థాయిలో ఒక వెలుగు వెలిగిన చంద్రబాబును సర్కస్‌లో రింగ్ మాస్టర్ లా ఆడించాడు కేసీయార్. కేసీయార్ చెప్పినదానికల్లా తలఊపిన చంద్రబాబు నామినేషన్ల చివరిరోజు టీఆర్‌యెస్ కు కేటాయించిన సీట్లలో టీడీపీ అభ్యర్థులతో నామినేషన్లు వేయించాడు. దెబ్బకు దిమ్మె తిరిగిన కేసీయార్ పరిగెత్తికెళ్ళి బాబు కాళ్ళో వేళ్ళో పట్టుకొని బ్రతిమాలుకొన్నాడు. దయతలచిన బాబు కొందరితో నామినేషన్లు ఉపసంహరింప చేశాడు. కొన్ని చోట్ల "స్నేహపూర్వక పోటీ" లో కొందరిని దింపాడు. ఎన్నికల ఫలితాల తర్వాత కేసీయార్ ప్రతీకారం తీర్చుకొంటాడో లేదో వేచి చూడాలి.*******
గతవారం పద్మశ్రీ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. కుళ్ళు రాజకీయాలకు, అవగాహనా రాహిత్యానికి చిరునామా అయిన పద్మశ్రీ అవార్డులు అర్హత లేని వ్యక్తులకు అర్హతలేని వారి చేతుల పైన ఇవ్వబడడం సంతోషించదగ్గ విషయం. ఒకప్పుడు అబ్దుల్ కలాం ఉన్న స్థానంలో ప్రతిభా పాటిల్ ను చూస్తుంటే "కనకపు సింహాసనమున.." గుర్తుకొచ్చింది ఎందుకో. సోనియా మాత కాళ్ళ దగ్గర, క్షమించాలి, చెప్పుల కింద పడి ఉంటే చాలు, రాష్ట్రపతి అయిపోవచ్చు!!! అన్నట్టు గత ఏడాది నైట్ శ్యామలన్‌కు పద్మశ్రీ ఇచ్చారు. నైట్ శ్యామలన్‌కు ఉన్న అర్హతేమి స్టీవెన్ స్పీల్బర్గ్ కు లేని అర్హతేమి? కేవలం భారతీయుడిగా పుట్టి అమెరికాలో సినిమాలు తీయడమేనా?*******
సాధారణంగా ఫ్యాషన్ షో అంటే - చెత్త కుప్పల్లో ఉన్న చెత్త తెచ్చి పీలికలు తయారు చేసి అస్థిపంజరాలకు తగిలించి నడిపించడం అనే భావన ఉండేది. ఆ బట్టలు వేసుకొని రోడ్డు పైన వెళ్తే ఎంత మంచి కుక్క అయినా తరుముకోవాలి అన్న నిబంధనకు లోబడి డిజైన్ చేస్తారు. కానీ ఈ సారి లాక్మే ఫ్యాషన్ వీక్‌లో అలా కనిపించలేదు. దాదాపు అన్నీ మనుషులు వేసుకొనే దుస్తులే ప్రదర్శించారు. సినీ తారలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అందరికంటే కత్రినా కైఫ్ చాలా బాగుంది. కత్రినా బార్బీ బొమ్మలా ఉందా లేక బార్బీ బొమ్మ కత్రినాలా ఉంటుందా అనిపించింది!! *******
ఈ రాష్ట్రాన్ని ఎవరూ బాగు చెయ్యలేరు. మొన్నటివరకు ఎవరో ఒకరు వస్తారు ఏదో చేస్తారు అన్న ఆశ ఉండేది,ఇప్పుడు అది కూడా పోయింది. రాజకీయాల్లో ఉన్నవాళ్ళకు దమ్ము, ధైర్యం ఉండాలి. ఎన్నికలలో పోటీకి నిలబడి ధైర్యంగా అవతలివాళ్ళను ఎదుర్కోవాలి. కే.ఏ.పాల్ గారు మొత్తం 294 + 42 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసి అన్నీ కంప్యూటర్లో పెట్టారు. ఈ సంగతి తెలిసిన మిగిలిన అన్ని రాజకీయ పార్టీలకు వణుకు పుట్టి నామినేషన్లు ఒక రోజు ఉండగా ఆ సీడీని, కంప్యూటర్‌ను దొంగిలించారు. విధిలేక పాల్ గారు తాను ఒక్కడే పాలకొల్లు నుండి నామినేషన్ వేసారు. రాజకీయాల్లో మరీ ఇంత దిగజారుడుతనం ఎప్పుడూ చూడలేదు. పాల్ గారు 2014 ఎలక్షన్లపుడు తాను తయారు చేసిన జాబితాను ఈమెయిల్ లో భద్రపరుచుకొని, లేదా ఒక పేపరు పైన రాసుకొని మిగతాపార్టీల అంతు తేలుస్తారు అని నమ్మకం ఉంది.మీరు తప్పకుండా మిగిలిన పార్టీల అంతు తేలుస్తారు పాల్ గారు, అంతు తేలుస్తారు

జై హో జాన్ స్టీవర్ట్
Posted by జీడిపప్పు
24 గంటల చానెళ్ళల్లో Exclusive Report అని Breaking News అని ఏవేవో చెప్తుంటారు. ఇవన్నీ బాగానే ఉంటాయి కానీ కనీసం ఎలక్షన్లపుడయినా నిజాలను చెప్పరు. అందుకే అమెరికాలో మీడియాను "మాఫియా మీడియా " అనవచ్చు. రిపబ్లికన్లు అధికారంలో ఉన్నపుడు ఇది మరీ ఎక్కువ ఉండేది. ప్రతి చానెల్ పోటీ పడి జార్జ్ బుష్ గురించిన నిజాలను తొక్కిపెట్టేవి. అసలు ఇరాక్ యుద్దం ఎందుకు చేస్తున్నారో రెండేళ్ళవరకు చాలామందికి తెలియదంటే ఈ "మాఫియా మీడియా" ప్రభావం ఎంతో తెలుసుకోవచ్చు.
అమెరికాలోని అత్యంత ప్రమాదకర సంస్థ పేరు FOX News. రిపబ్లికన్లు 2+ 2 = 3 అంటే అది నిజమని వారం రోజులు, డెమొక్రాట్లు 2+ 2 = 4 అంటే అందులో ఏదో తప్పు ఉందని నెలరోజులు ఊదరగొడుతుంది ఈ మాఫియా గ్యాంగ్. వీళ్ళు ఎంత ప్రమాదకరం అంటే, ఇరాక్ అణ్వాయుధాలు వేస్తే మారుమూల పల్లెల్లో ఉన్నవాళ్ళు ఎలా చనిపోతారు, అలా చనిపోకుండా ఉండాలంటే రక్షించుకోవడానికి అవసరమయిన Safety Equipment ఫలానా కంపెనీవాళ్ళ దగ్గరే కొనాలి అని పుంఖానుపుఖలుగా రోజుల తరబడి న్యూస్ లో కథలు చెప్తూ ప్రజలను భయభ్రాంతులను చేసారు. సగటు ఓటరు నిజమేననుకొని బుష్‌ను రెండో సారి అధ్యక్షుడిగా చేయాల్సి వచ్చింది, "అమెరికా బీహార్" అయిన ఫ్లోరిడా పుణ్యమా అని.
ఇక అసలు విషయానికొస్తే, నేను మీడియాలో వెతికినది "రిపబ్లికన్లను ఎండగట్టే" వార్తల కోసం. ఒక రోజు చానెల్స్ మారుస్తూ Comedy Central లో ఏదో "కామెడీ షో" వస్తుంటే చూసాను. ఎవరో రిపబ్లికన్ల పైన భలే జోకులు వేస్తూ విమర్శిస్తున్నారు. ఇదేదో భలే ఉందే అనుకుంటూ చూడడం మొదలుపెట్టాను.
సీన్ కట్ చేస్తే, కొన్నేళ్ళ తర్వాత - ఈ రోజు అసలు సిసలయిన వార్తల కోసం యువత అత్యధికంగా చూసేది ఆ "కామెడీ" షో. దాన్ని నిర్వహిస్తున్న వ్యక్తిపేరు జాన్ స్టీవర్ట్. ఆర్థిక మాంద్యం లేకుంటే ఈ ఎన్నికల్లో కూడా రిపబ్లికన్లకు ఓట్లు బాగానే పడేవి. అయినా ఒబామా గెలిచేవాడు. అందుకు ప్రధాన కారణం యువత పెద్ద ఎత్తున ఎన్నికల్లో పాల్గొనడం. దీని కారకుడు జాన్ స్టీవర్ట్. ఈ మధ్య జరిపిన ఒక సర్వే ప్రకారం, మిగతా న్యూస్ చానెళ్ళను గంటల తరబడి చూసేవారికంటే, జాన్ స్టీవర్ట్ The Daily Show చూసే వాళ్ళకే వాస్తవాలు ఎక్కువ తెలుస్తాయట!
ఒక Stand-up కమెడియన్ గా కెరీర్‌ను మొదలు పెట్టిన జాన్ స్టీవర్ట్ కామెడీ సెంట్రల్ చానల్లో ఒక చిన్న షో నిర్వహించేవాడు. క్రమంగా రాజకీయ అంశాలపై తనదైన శైలిలో విమర్శిస్తూ అనతికాలంలో పేరు తెచ్చుకున్నాడు. CNN లో Crossfire అనే పరమ చెత్త షో నడిచేది. వాళ్ళు జాన్ ను తక్కువ అంచనా వేసి తమ షోకు పిలిచి ఎప్పటిలాగే పనికిరాని సంభాషణలు మొదలుపెట్టారు, కానీ తన పదునైన మాటలతో ఇద్దరినీ విమర్శించి ఇద్దరికీ దిమ్మె తిరిగేలా చేసాడు. జాన్ స్టీవర్ట్ గురించి సరిగా తెలియనివాళ్ళు నోరు వెళ్ళబెట్టారు "టీవీ రంగంలో నిజాలను ఇంత ఖచ్చితంగా చెప్పే ఈ వ్యక్తి ఎవరా" అని. కొద్ది రోజులకు Crossfire షో పైన వీక్షకులకు నమ్మకంపోవడంతో ఆ షో క్యాన్సిల్ చేసేసారు.అదీ జాన్ స్టీవర్ట్ మాటల తడాఖా!

మరోసారి రిపబ్లికన్ ఎన్నిక కాకుండా అమెరికాను కాపాడేందుకు తన సర్వశక్తులు ఒడ్డి పోరాడిన జాన్ స్టీవర్ట్, ఒబామా అంటే పక్షపాతం చూపిస్తాడు అనుకోవడం పొరపాటే. ఒబామా తప్పు చేస్తే అదే వాడి, వేడి మాటలతో విమర్శిస్తున్నాడు.
నిమిష నిమిషానికి నవ్విస్తూ, నిజాలను నిర్భయంగా చెబుతూ అసలు సిసలయిన "న్యూస్ మేన్" గా ఆరాధింపబడే జాన్ స్టీవర్ట్ కు మరోసారి జై హో!
వినోదాత్మక చిత్రం "చిక్కడు దొరకడు"
Posted by జీడిపప్పు
కథ విషయానికొస్తే - తన కొడుకును రాజు చేయాలన్న తలంపుతో రాణిగారి తమ్ముడు సింహబలుడు రాణిగారికి పుట్టిన కవల పిల్లలను చంపడానికి కుట్రపన్నుతాడు. మంచివాళ్ళయిన సైనికులు ఆ కవలలను చంపకుండా అడవిలో వదిలిపెడతారు. ఒకడు దొంగల ముఠా నాయకుడయిన "చిక్కడు"గా మరొకడు మంచివాడయిన "దిలీపుడు"గా పెరిగి పెద్దవారవుతారు. పేదవాళ్ళను దోచుకోవడం తప్పు, ధనవంతులను దోచుకోవాలి అని చిక్కడు ఖజానాలను కొల్లగొడుతుంటే, తన తెలివిని ఉపయోగించి రాజులకు కానుకలు పంపుతూ "దిలీప చక్రవర్తి"గా పేరుపొందుతాడు దిలీపుడు.
అపారమయిన నిధికి సంబంధించిన రహస్యం ఉన్న మూడు హారాలు మూడు రాజ్యాల రాణుల దగ్గర ఉంటాయి. ఒక వైపు దుర్మార్గుడయిన సింహబలుడి కొడుకు ప్రచండుడు, మరో వైపు చిక్కడు, దొరకడు ఆ మూడు హారాలకోసం తమ శక్తిసామర్థ్యాలను ఉపయోగిస్తారు. చివరకు తామిరువురు కవలలన్న సంగతి తెలుస్తుంది. మూడు రాజ్యాల కుటుంబాలు ఏకమవడంతో కథ సుఖాంతమవుతుంది.
సినిమాలో ఎన్టీఆర్, కాంతారావు ఇద్దరూ హీరోలు, దాదాపు ఇద్దరివీ సరిసమాన పాత్రలు అయినప్పటికీ ఎన్టీఆర్ నటనే ఎక్కువ ఆకట్టుకుంటుంది. మంజువాణి ఇంట్లో ఎన్టీఆర్ నవ్వులు, నటన తప్పక చూడాలి. ఈ సినిమాతోనే ఎన్టీఆర్ ద్వారా "హైసర మచ్చా" అనే మాట బాగా పాపులర్ అయింది. కాంతారావు నటన కూడా బాగుంది, మారువేషాల్లో మాత్రం అదరగొట్టాడు. రాణిగా జయలలిత ఫర్వాలేదు. కొన్ని చోట్ల కాస్త ఛీప్ డ్యాన్సులు వేసినా సందర్భానుసారం అని సరిపెట్టుకోవాలి. రాకుమారిగా కృష్ణకుమారి పాత్ర చిన్నదే కానీ అందంగా కనిపిస్తుంది. త్యాగరాజు, సత్యనారాయణలు విలన్ల పాత్రలకు సరిపోయారు. హీరోల,విలన్ల సైడ్-కిక్‌లుగా విఠలాచార్య గ్యాంగు నటులు ఎక్కువమందే ఉంటారు,అద్రుష్టవశాత్తూ మిగిలిన విఠలాచార్య సినిమాల్లోలా వీళ్ళు చిరాకు పుట్టించలేదు.
ఈ సినిమాకు పెద్ద మైనస్ పాయింట్ పాటలు. ఆ మాటకొస్తే విఠలాచార్య ఏ సినిమాకు అయినా అంతే. ఈ సినిమాలోని పాటలు అంత ప్రాచుర్యం పొందినవి కాదు. సాహిత్యం కూడా అంతంత మాత్రమే. విఠలాచార్యగారికి క్లబ్‌డ్యాన్స్ అంటే ఇష్టంలా ఉంది, అగ్రనటులున్న ఈ సినిమా చూస్తే అవునో కాదో తెలిసిపోతుంది!
సినిమా మొత్తం వినోదమే ప్రధానాంశంగా సాగిపోతుంది. అందులో కొన్ని:
- టైటిల్స్ పడుతున్నపుడే వీలయినంతవరకు ఆ రంగానికి చెందిన బొమ్మలను చూపెట్టడం
- గూడెంలో నాయకుడిగా ఎన్నికవడానికి చిక్కడు రకరకాల పోటీలలో పాల్గొనడం
- సామాన్యుడయిన దిలీపుడు అడవిలో దొరికే వస్తువులనే రాజుకు బహుమతులుగా పంపించి తనకు వచ్చిన బహుమతులను వేరే రాజులకు పంపుతూ తన పేరు ప్రఖాతులను పెంచుకోవడం
- "లక్షలు చేయలేని పని లక్ష్యం చేస్తుంది" "చతురంగబలగాలు సాధించలేని కార్యం చాతుర్యం సాధిస్తుంది" లాంటి పంచ్ లైన్స్
- మంజువాణి-బంగారు బాతు ఎపిసోడ్, దానిమొగుడు, మూతినాకుడుపాడు లాంటి పదప్రయోగాలు
- ధర్మ సత్రంలో చిక్కడు,దొరకడు ఒకరి హారాలు ఒకరు కాజేయడం, ఆసక్తిగొలిపే,అబ్బురపరిచే జిత్తులు
- చివరగా మూడు హారాలను సమన్వయపరచి నిధిని కనుగొనడం
మొత్తమ్మీద విఠలాచార్య తీసిన చిత్రాలలోని అతికొద్ది "నాణ్యమయిన వినోదాత్మక" చిత్రాలలో ఇది ఒకటి.