అయ్యా మార్తాండగారు ....అలాగే వీవెన్ గారు
Posted by జీడిపప్పు
వీవెన్ గారు, కాస్త దయ తలచరా ఈ http://telugu.stalin-mao.net సైటు పైన. కూడలి నిండా ఇదే కనిపిస్తున్నది ఈ మధ్య!
బ్లాగు మిత్రులారా, నేనేమయినా పొరపాటు పడుతున్నానేమో, మీ అభిప్రాయాలను కూడా తెలియచేయగలరు.
అవీ..ఇవీ..అన్నీ
Posted by జీడిపప్పు
నాకు టెస్ట్ మ్యాచ్‌ల పట్ల ఆసక్తి ఉండదు. ఎందుకంటే దాదాపు అన్నీ ఐదు రోజుల పాటు సా సా సాగుతాయి కాబట్టి. ఒక్కో వైపు మూడు నాలుగు సెంచరీలు, ఆరేడు అర్థ సెంచురీలు ఉంటాయి. ఇక మేడిన్ ఓవర్లు నా సహనానికి పెద్ద పరీక్ష పెడతాయి. ఒక్కోసారి ఆరేడు మేడిన్లు వరుసగా వేస్తారు. బ్యాట్స్ మన్ బాల్‌ను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తూ బాల్‌ను పిచ్ దాటనివ్వడు. ఉత్కంఠత దాదాపు శూన్యం. చాలా మ్యాచులు డ్రాగా ముగుస్తాయి. ఇప్పటివరకు ఐదురోజుల పాటు ఒక్క మ్యాచ్ పూర్తిగా చూసిన సందర్భం లేదు. కేవల స్కోర్లు చూడడమే అలవాటు.
వన్‌డే మ్యాచులు మాత్రం చూసేవాడిని. అందులో అన్నీ సమపాళ్ళలో ఉంటాయి. అపుడపుడు 20-40 ఓవర్ల మధ్య కాస్త బోరు కొడుతుంది. కానీ వన్‌డేలతో వచ్చిన చిక్కేమిటంటే మొత్తం మ్యాచ్ చూడాలంటే దాదాపు ఒక రోజు పోతుంది. వీటన్నిటికీ పరిష్కారం 20-20 రూపంలో లభించింది. 20-20 అంటే గుడ్డిగా సిక్సులు కొట్టడమే, సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేసినవాళ్ళు గెలుస్తారు అనుకున్నాను మొదట. కానీ మొదటి 20-20 వరల్డ్ కప్ చూసిన తర్వాత అసలయిన క్రికెట్ అంటే ఇది అనిపించింది. ఇక IPL చూసాక క్రికెట్ పట్ల మరింత ఆసక్తి కలిగింది. ఈ విషయంలో లలిత్ మోడికి క్రీడాభిమానులు ఋణపడి ఉండాలి.
అసలు విషయానికొస్తే, ఎలక్షన్ల టైంలో IPL జరగాల్సి ఉంది. ఎలక్షన్లవల్ల పోలీసు బందోబస్తు కల్పించడం కష్టమని, మ్యాచ్‌లను వాయిదా వేసుకోమని లేదా షెడ్యూల్ మార్చుకోమని ప్రభుత్వం సూచించింది. తర్జనభర్జనల తర్వాత లలిత్ మోడీ IPL ను దక్షిణాఫ్రికాకు మార్చాడు. టీవీ పోల్స్ ప్రకారం, దక్షిణాఫ్రికాకు మార్చడాన్ని చాలామంది భారతీయులు వ్యతిరేకిస్తున్నారట. నాకయితే ఇందులో ఎటువంటి తప్పు కనిపించలేదు.
IPL అన్నది ఒక ప్రైవేట్ సంస్థలాంటింది. వాళ్ళకు ఇష్టం వచ్చినచోట జరుపుకోవచ్చు. ఇక్కడ ముఖ్యమయినది - ఆటగాళ్ళు తమ క్యాలెండర్ ప్రకారం మిగతా అంతర్జాతీయ ఆటల్లో పాల్గొనాలి. IPL షెడ్యూల్ మారిస్తే వాళ్ళు ఆడలేకపోవచ్చు. ఇక మన దేశంలో ఆడితే స్టేడియం ఖర్చులు, లాభాలు అంటున్నారు కొందరు. మొత్తం ఆదాయంలో స్టేడియం నుండి వచ్చే ఆదాయం 1 శాతం కూడా ఉండదు. పైగా టీవి ప్రేక్షకులతో పోలిస్తే స్టేడియంలో చూసే వాళ్ళు లెక్కలోకి రారు. ఒక వేళ నష్టం వచ్చినా అది IPL కు మాత్రమే. ఇవన్నీ పరిగనణలోకి తీసుకొనే మోడీ నిర్ణయం తీసుకున్నాడు. ఇక ఆటను ఆస్వాదించడమే మన వంతు.
*******
గతవారం టాటా నానో విడుదలయింది. తొందర్లో రోడ్లపైకి వస్తుంది. ఇది నిజంగా సంతోషించదగ్గ విషయమే. నాకు మొదటినుండి "టాటా ఏమి చేసినా అందులో దేశానికి నష్టం/చెడు ఉండదు" అని నమ్మకం. ఈ కారు వల్ల కాలుష్యం మరింత పెరుగుతుంది అంటున్నారు కొందరు. నాకు ఇది పెద్ద జోక్ లా అనిపిస్తుంది. మన దేశంలో ఏడాదికి సుమారు 70 లక్షల స్కూటర్లు, 14 లక్షల కార్లు అమ్ముడుపొతున్నాయి. ఇవి కాక రవాణా వాహనాలు ఇంకో ఐదారు లక్షలు ఉంటాయి. వీటివల్ల ఏర్పడే కాలుష్యం, ఫ్యాక్టరీల కాలుష్యం, మన వీధిలో మనము చేసే కాలుష్యం అన్నీ కలుపుకుంటే ఏర్పడే కాలుష్యంలో "నానో కాలుష్యం" 0.000001% కూడా ఉండదు.ఒకే ఒక ఇబ్బందల్లా ట్రాఫిక్ పెరగుతుంది, అది కూడా మహానగరాల్లో లేదా పెద్ద పట్టణాల్లో. నా వరకు అది కూడా సమ్మతమే. ఉదాహరణకు మన రాష్ట్రంలో మహా అయితే 10 నగరాల్లో ట్రాఫిక్ సమస్య ఉంది. మరి మిగిలిన పట్టణాల సంగతేమి? అక్కడున్న మధ్యతరగతి వారి కోరిక కూడా నెరవేరాలి కదా. చిన్న చిన్న పట్టణాల్లో, కాస్త పెద్ద గ్రామాల్లో లక్ష రూపాయలకు కారు కొనేవాళ్ళు ఎందరో ఉన్నారు. ఈ నానో ముఖ్యంగా వారికి అందుబాటులోకి రావాలి. "నగరాల్లో నానో అమ్మబడదు" అని టాటా ఒక రూల్ పెడితే బాగుంటుందేమో!!?
*******
గతవారం రిపబ్లికన్ నాయకులు "ఒబామా పాలసీలు మంచివి కాకపోతే అవి విఫలం కావాలని కోరుకుంటున్నాము" అన్నారు. రిపబ్లికన్లు ట్రిలియన్లను యుద్దాలకు పెడితే ఒబామా అదే డబ్బును తమ దేశంలోనే విద్యకు, ఆరోగ్యానికీ, నిర్మాణాలకు పెడుతున్నాడు. ఒబామా పదవిని చేపట్టి మూడు నెలలు కూడా పూర్తి కాలేదు. అపుడే వీళ్ళ కుళ్ళు బయట పెడుతున్నారు. భవిష్యత్ రిపబ్లిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి అయిన పీయుష్ "బాబీ" జిందాల్ ఈ సంగతి మరీ మరీ చెప్పాడు. సంతోషించదగ్గ విషయం ఏమిటంటే సగటు రిపబ్లికన్ ఓటర్లకు "జోకర్ జిందాల్" మాటలు నచ్చలేదు. అసలే అమెరికా 40 ఎళ్ళలో ఎన్నడూ లేని గడ్డు పరిస్థితులలో ఉంది. ఇలాంటపుడు వీళ్ళు "ఒబామా పాలసీల్లో తప్పు ఉంటే మేము తగిన సూచనలు ఇస్తాము,సరిదిద్ది అవి సఫలం అయ్యేదానికి కృషి చేస్తాము" అనాలా లేక శాపనార్థాలు పెట్టాలా? అంటున్నారు. అన్నట్టు నా హైస్కూల్ స్వీట్ హార్ట్ "సెరా పేలిన్" వచ్చే ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేయాలని సన్నాహాలు మొదలుపెట్టిందట!*******
ఒబామా తన తప్పుల చిట్టా ఖాతా తెరిచాడు. పాకిస్తాన్‌కు ప్రతి ఏడాది 1.5 బిలియన్ డాలర్లు అప్పు ఇస్తున్నట్టు ప్రకటించాడు. అక్కడ స్కూళ్ళు, ఆస్పత్రులు కట్టిస్తారట. అలా కట్టిన స్కూళ్ళలో బోధించేది అమెరికా వ్యతిరేక పాఠాలే అన్న సంగతి ఒబామాకూ తెలుసు. బహుశా " అమెరికా అధ్యక్షుడు అన్న తర్వాత ఖచ్చితంగా కాస్తో కూస్తో తీవ్రవాదాన్ని పెంచి పోషించాలి. లేకుంటే తల నూరు వ్రక్కలవుతుంది" అన్న శాపం వల్ల ఒబామా కూడా ఇలా చేస్తున్నాడు. ఈ వారానికి NO "GO Obama"
*******
పాత చందమామ పుస్తకాలు కావాలంటే...
Posted by జీడిపప్పు
Madoff మహా స్కాం
Posted by జీడిపప్పు
చట్టాలు, పోలీసులు అంటూ వినపడే అమెరికాలో Madoff అనే పెద్దాయన చట్టబద్దంగా ఒక వ్యాపారం మొదలుపెట్టాడు. సుమారు 30 ఏళ్ళ పాటు వ్యాపారం నడిచిన తర్వాత 2008 డిసెంబరులో తాను చేస్తున్న వ్యాపారమంతా బోగస్ అని బాంబు పేల్చాడు. దానివల్ల నష్టం 50 - 65 బిలియన్ డాలర్ల మధ్య ఉంటుంది. రూపాయల్లో అయితే ఈ స్కాం విలువ ఓ మూడు లక్షల కోట్ల రూపాయలన్నమాట!! అమెరికా అసలే ఆర్థికమాంద్యంతో అతలాకుతలమవుతుంటే మధ్యలో ఈ స్కాం ఒకటి అని అందరికీ మరింత కోపాన్ని తెచ్చింది. కాస్తో కూస్తో సంతోషించదగ్గ విషయం ఏమిటంటే, ఇందులో సామాన్యుడు ప్రత్యక్షంగా నష్టపోలేదు. నష్టపోయింది అత్యాశ గల ధనవంతులు, కొన్ని బ్యాంకులు.
అసలు ఏమి జరిగిందంటే - A అనేవాడు Madoffకు 10 రూపాయలిచ్చాడు. ఆ 10 రూపాయలతో "ఎదో" చేస్తాను అంటాడు Madoff. అది ఏమిటో స్పష్టంగా చెప్పడు. నీకు డబ్బు కావాలా వద్ద అని మభ్యపెడతాడు. ఆ డబ్బంతా స్టాక్స్ లో పెట్టినట్లు పత్రాలు సృష్టించాడు. నిజానికి ఆ డబ్బంతా బ్యాంకులో తన ఎకౌంటులో ఉంచుకున్నాడు. ఏడాది తర్వాత A కి 10% డివిడెండ్ అంటూ ఒక్క రూపాయి వచ్చింది. అది చూసిన B , C లు ఇద్దరూ చెరో పది రూపాయలు ఇచ్చారు. అంటే మొత్తం Madoff దగ్గర ఉన్న సొమ్ము 29 రూపాయలు. దాన్ని అలాగే బ్యాంకులో ఉంచి మరో ఏడాదికి ముగ్గురికీ తలో రూపాయి బోనస్ ఇచ్చాడు. అంతలో C తన డబ్బులు మొత్తం తీసేసుకున్నాడు. ఈ మధ్యలో Madoff ఓ రెండు రూపాయలు నొక్కేస్తాడు. లెక్కప్రకారం ఇంకా A,Bల పెట్టుబడి ఉంది. అంటే 20 రూపాయల పెట్టుబడి ఉండాలన్నమాట. కానీ Madoff దగ్గర ఉన్నది 30-4-10-2 = 14 మాత్రమే!
ఈ విధంగా కొత్తగా వచ్చినవారి దగ్గర తీసుకొని పాతవాళ్ళకు ఇచ్చేవాడు. ఇక నెల నెలా ప్రతిఒక్కరికి ఆరేడు పేజీల స్టేట్‌మెంట్స్ పంపించేవాడు. చాలమందికి అదేమిటో కూడా అర్థమయ్యేది కాదు. కాకపోతే పేపరు పైన తమ డబ్బు పెరుగుతుంటే చాలనుకున్నారు. Madoff విలాసవంతమయిన పార్టీలు ఇచ్చేవాడు. అతిథులుగా రాజయకీయ నాయకులు, సెలెబ్రిటీలు వచ్చేవారు. వారికి ఇంద్రభవనాల్లో అతిధి సత్కారాలు, ఖరీదయిన బహుమతులు ముట్టేవి.
తన ఇమేజి పెంచుకోవడానికి Madoff చేసిన జిమ్మిక్కులు భలే ఉంటాయి. సాధారణ మిలియనీర్లకు అందుబాటులో ఉండేవాడు కాదు. Madoff దర్శనం కలిగితే చాలని మిలియనీర్లు తహతహలాడేవారు. కొద్ది రోజులు తిప్పించుకున్న తర్వాత అపాయింట్‌మెంట్ ఇచ్చేవాడు. తమదగ్గర ఉన్న మిలియన్లను తీసుకోమని మిలియనీర్లు ప్రాధేయపడినా అంత సులభంగా అంగీకరించేవాడు కాదు. దాంతో Madoff అంటే మరింత క్రేజ్ పెరిగిపోయేది. Madoff తన కంపెనీలో ఉద్యోగులను చాలా బాగా చూసుకొనేవాడు. సెక్రెటరీ జీతం $500,000. మేనేజర్ల జీతం మిలీయన్లలో ఉండేది. $5000 లేదా అంత కంటే ఎక్కువ transaction జరిగితే వెంటనే అధికారులకు తెలిసి దాని పైన ఒక కన్నేసి ఉంచుతారు. అలాంటిది మిలియన్లు చేతులు మారినా Madoff పైన చర్య తీసుకోలేదంటే ఏ స్థాయిలో చట్టాన్ని అవినీతిమయం చేసాడో తెలుస్తున్నది.
నిరాటంకంగా సాగిపోతున్న ఈ వ్యాపారాన్ని Recession వెలుగులోకి తెచ్చింది. 2008 డిసెంబరులో కొందరు ఇన్వెస్టర్లు తమ డబ్బు వెంటనే కావాలని పట్టుబట్టారు. లేని డబ్బు తీసుకురావలని రావడంతో విధిలేక Madoff అసలు సంగతి తన కొడుకులకు చెప్పాడట. అది తెలుసుకున్న చట్టం అదర బదరా రంగంలోకి దిగి Madoff పైన చర్యలు తీసుకోవడం మొదలుపెట్టింది.
Madoff నోరు విప్పితే ప్రస్తుత ప్రభుత్వంలోని, గత ప్రభుత్వాల్లోని కొందరు రాజకీయ నాయకుల జీవితాలు ముగుస్తాయి కాబట్టి పెద్దతలకాయలు "బాబ్బాబూ ఎలాగూ నీకు 70 ఏళ్ళు, ఎక్కువ కాలం బ్రతకవు. నీ కుటుంబాన్ని మేము చూసుకుంటాము, మా పేర్లు మాత్రం చెప్పకు" అని బ్రతిమాలుకొని ఉంటారు. దయతలచిన Madoff ఈ నెల 12 న తన పైన ఉన్న అన్ని అభియోగాలను అంగీకరించాడు. అన్ని తప్పులకు తానే బాధ్యుడినన్నాడు.
Madoff ఆస్తులన్నీ సీజ్ చేసారు. వీటివిలువ మహా అయితే ఒక బిలియన్ డాలర్లు ఉంటుంది. తెలియని ఆస్థులు, స్విస్ బ్యాంక్‌లో డబ్బులు మొదలయిన వివరాలు Madoffకే ఎరుక. చేసిన నేరానికి 150 ఏళ్ళ శిక్ష అనుభవించి, 170 బిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాలి అని తీర్పునిచ్చారు. 150 ఏళ్ళ శిక్ష అనుభవించాలంటే 70 + 150 = 220 ఏళ్ళు బ్రతకాలి. అది మానవుడికి సాధ్యం కాదు, కేవలం తాబేలుకే సాధ్యం. అందుకే ఆరిజోనా ఎడారిలోని రహస్య భూగర్భ పరిశోధనశాలలో Madoff ను తాబేలుగా మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అవీ..ఇవీ..అన్నీ
Posted by జీడిపప్పు
గతవారం రాజకీయాల్లో ఆశించినదాని కంటే ఎక్కువ వినోదం లభించింది.
ముందుగా జాతీయ స్థాయిలో - బీజేపీకి చెందిన వరుణ్ గాంధీ "హిందువుల వైపు చెయ్యి చూపితే చెయ్యి నరుకుతా" అంటూ ఇంకా ఏవో "హిందూ" వ్యాఖ్యలు చేసాడు. కాంగ్రెస్ కు ఇది ఒక వరం అయింది. వరుణ్ గాంధీ పైన క్రిమినల్ కేసు పెట్టాలన్నారు. శివసేన ముందుకు వచ్చి వరుణ్ గాంధీకి మద్దతు ప్రకటించింది. బీజేపీ మాత్రం "మాకు సంబంధం లేదు. అసలు ఈ గాంధీ వంశస్థులెపుడూ ఇంతే" అంది. వరుణ్ గాంధీ మాత్రం "నేనలా అనలేదు, నా మాటలను మార్చేసారు" అంటున్నాడు. ఏది ఏమయినప్పటికీ వరుణ్ గాంధీకి మంచి రాజకీయ భవిష్యత్తు ఉందని ఈ సంఘటనతో తెలుస్తోంది.
*****
రాష్ట్ర రాజకీయాలకొస్తే - భవిష్యత్తు ముఖ్యమంత్రి జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యర్థుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తున్నాడు. అది చూసి ఓర్వలేని కాంగ్రెస్ నాయకులు "ముందు నీ తల్లికి న్యాయం చెయ్యి" అంటున్నారు. ఇది చూసిన చంద్రబాబు "సోనియా గాంధీ రహస్యాలు కూడా నాకు తెలుసు, కాంగ్రెస్ నాయకుల సంగతి బయట పెడతా" అన్నాడు. ఈ గొడవల్లో ప్రధాన లోపం ఏంటంటే, రోజా, గంగాభవాని, శోభారాణి లేకపోవడం. మహిళా జాతికే మసిబొగ్గుల్లాంటి వీళ్ళు దిగజారి తిట్టుకోవడం కనిపించడం లేదు. ఐ మిస్ యూ రోజా, శోభా, గంగా. *****
జయప్రకాష్ గారు నిర్వహిస్తున్న సభలకు మీడియాలో కవరేజీ అస్సలు లభించడం లేదు. ఇది చూసిన జేపీ గారు ఆగ్రహం పట్టలేక మీడియా పైన విరుచుకుపడ్డారు. ఏమి చేస్తాం మరి!! అన్నట్టు నేను క్రితవారం వారం "లోక్‌సత్తాకు ఓటు వేస్టా" లో " మా ఊళ్ళో కనీసం ముక్కూ మొహం తెలియని వాడు వచ్చి నేను లోక్‌సత్తా అభ్యర్థిని, ఓటెయ్యండి అంటే ఎలా నమ్మాలి..." అన్నాను. ఎంబీయస్ గారు మరో వ్యాసంలో ఇలాంటి అభిప్రాయాన్ని చక్కగా చెప్పారు. *****
108 వాహనం పైన రాజీవ్ గాంధీ బొమ్మ ఉండకూడదు అన్నారు తెదెపా వాళ్ళు. అది చూసిన రోశయ్య గారు "అలా అయితే ఎక్కడా ఎన్టీఆర్సినిమాలు ప్రదర్శించకూడదు" అన్నారు. జనం వెర్రివాళ్ళు అయితే మాత్రం ఎన్టీవోడిని చూసి ముందూ వెనక ఆలోచించకుండా ఓట్లు వేసే అంత వెర్రివాళ్ళు అనుకున్నారా రోశయ్యగారు!! బెస్ట్ జోకర్ అవార్డు శిరీష్ భరద్వాజ్ కు ఇవ్వవచ్చు. చిరంజీవి కూతురును లేపుకుపోయినవాడుగా తప్ప ఇతడి గురించి ఇంకెవరికీ తెలియదు. ఈ బచ్చా కూడా "నాకు రాజకీయాలంటే ఆసక్తి, భవిష్యత్తులో రాజకీయ్యాల్లోకి రావలన్న ఆలోచన ఉంది" అన్నాడు. హతవిధీ!! *****
బాలయ్య బాబు ఒంగోలులో తన అక్క ఇంటిముందు తొడకొట్టి మీసం మెలేశాడు. పైగా తన సొంత అక్కను విమర్శిస్తూ ఆమె రైతులను ముంచింది అన్నాడు. ఇది మన రాష్ట్ర రాజకీయాల్లో చారిత్రాత్మక మలుపు మరియు జానపద ???? (i donno). పార్టీ కోసం సొంత అక్కను విమర్శించడం అంటే మాటలా? సీన్ కట్ చేస్తే, నాల్రోజుల తర్వాత హైదరాబాదులో పురంధ్రీశ్వరి ఇంట్లో: మందక్రిష్ణ మాదిగ మహాకూటమిలో చేరానని ప్రకటించుకొని మాదిగ పోరాట సమితికి 30 అసెంబ్లీ సీట్లు, 4 లోక్‌సభ సీట్లు ఇవ్వాలన్నాడు. చంద్రబాబు "ఛస్, అసలు మందక్రిష్ణ మా కూటమిలో ఉన్నాడని ఎవరన్నారు" అన్నాడు. వామపక్షాలు కూడా అపహాస్యం చేసాయి. అవమానాన్ని తట్టుకొని మందక్రిష్ణ మాదిగ "కనీసం 15 అసెంబ్లీ సీట్లు, 2 లోక్‌సభ సీట్లు ఇవ్వండి. లేకుంటే 1) ఎన్నికలను బహిష్కరిస్తాము లేదా 2) రాష్ట్రమంతా మాదిగ పోరాట సమితి సొంతంగా పోటీ చేస్తుంది" అన్నారు. నాకు తెలిసి ఎన్నికలను బహిష్కరించడం సబబు కాదు. ఎందుకంటే అలా జరిగితే రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో సుమారు ఒకటి నుండి రెండు ఒట్లు ఎందుకూ పనికిరాకుండా పోతాయి. అలా కాకుండా రాష్ట్రవ్యాప్తంగా 294 స్థానాల్లో పోటీ చేయాలి. కనీసం 136 అసెంబ్లీ సీట్లు గెలుచుకుంటే మందక్రిష్ణ మాదిగ ముఖ్యమంత్రి అవ్వచ్చు. ఓ పాతిక ఎంపీ సీట్లు గెలుచుకుంటే మాయావతి సహాయంతో మందక్రిష్ణ మాదిగ ప్రధానమంత్రి అవ్వచ్చు లేదా తాతచ్చు.
*****
పురంధ్రీశ్వరి, ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వర్రావు ఇద్దరూ ఒక మూల టేబుల్ దగ్గర కూర్చుని తెలుగుదేశాన్ని ఎలా ఓడించాలో తీక్షణంగా చర్చిస్తున్నారు. కాస్త దూరంలో నందమూరి తారక రత్న (న.తా.ర ) తన ల్యాప్‌టాప్ లో బాలక్రిష్ణ వీడియో చూస్తూ తన్మయత్వంలో ఉన్నాడు. అంతలో బాలయ్య బాబు లోనికి వచ్చాడు. బాలయ్యను చూసిన న.తా.ర గట్టిగా "బాబాయే సీయం" అని అరిచాడు. ఆ అరుపుకు ఉలిక్కిపడిన పురంధ్రీశ్వరి "ఓరి నీ దుంపతెగ ఏమొచ్చింది అలా అరిచావు" అంది.
"బాబాయే సీయం వచ్చాడత్తా" అన్నాడు న.తా.ర సంతోషంగా. "రా తమ్ముడూ" అంటూ పురంధ్రీశ్వరీ బాలయ్యను ఆప్యాయంగా పలకరించింది. బాలయ్య "ఎలా విమర్శించానక్కా నిన్ను, బావా రాసిచ్చినదంతా బట్టీ కొట్టి చెప్పేసాను కదా" అన్నాడు తల అడ్డదిడ్డంగా తిప్పుతూ. పురంధ్రీశ్వరీ "నా బాబే, నేను చెప్పినట్టే చక్కగా చేసావురా. అయినా సిగ్గు లేకుండా తొడకొట్టావేంటి తమ్ముడూ. నేను చెప్పలేదుగా తొడకొట్టమని" అంది కాస్త నొచ్చుకుంటూ. "సారీ అక్కా. నా బుర్రలేని అభిమానులు కొట్టమన్నారు, కొట్టేశాను" అన్నాడు. "సరేలే, అందరూ నవ్వుతున్నారు అక్క ఇంటి ముందు తొడకొట్టడమేమిటని. ఇకనుండి కొట్టమాకయ్యా" అంది.
సోఫాలో కూర్చున్న బాలయ్య టీవీ పెట్టి అందులో జూనియర్ NTR కనపడగానే ఆపేశాడు. బాలయ్య మొహం వాడిపోయింది. "ఏమయింది తమ్ముడూ" అన్న అక్క మాటలకు "ఈ జూనియర్ ఏంటక్కా ఇలా దూసుకుపోతున్నాడు, వీడి ముందు నేను ఎందుకూ పనికిరాను అంటున్నారు" అన్నాడు. న.తా.ర పళ్ళు పట పటా కొరుకుతూ కోపంగా "బాబాయే సీయం" అన్నాడు.
పురంధ్రీశ్వరీ న.తా.ర తల పైన ఒక టెంకిజెల్ల పీకి "తప్పంతా నీదే తమ్ముడు. నీకు మాట్లాడ్డం రాదు. నువ్వు ఏమి మాట్లాడుతున్నావో నీకే తెలియదు. కనీసం బుర్రకు నాలుకకు మధ్య ఒక్క నరం కూడా లేదురా నీకు. వాడిని చూడు, ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో, నాకే ముచ్చటేస్తున్నది వాడి మాటలు వింటుంటే. మీరంతా వాడిని చూసి నేర్చుకోవాలి ఎలా మాట్లాడాలో" అంది. బాలయ్య చిన్నబుచ్చుకున్నాడు. అది చూసిన న.తా.ర బాధగా "బాబాయే సీయం" అన్నాడు.
పురంద్రీశ్వరీ న.తా.ర తల పైన ఇంకో టెంకిజెల్ల పీకి "నువ్వూ ఉన్నావు ఎందుకురా? తొమ్మిది సినిమాలు మొదలుపెట్టిస్తే ఒక్క హిట్టు లేదు. యాక్టింగ్ రాదు, డాన్స్ రాదు. ఎందుకూ పనికిరానివాడివి అని పాలిటిక్స్ లో పెడితే అక్కడా ఫ్లాప్ అయ్యావు" అంది. న.తా.ర కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. కన్నీళ్ళు తుడుచుకుంటూ వెక్కిళ్ళు ఆపుకుంటూ "బాబాయే (కూక్) సీయం" అన్నాడు.
బాలయ్య "అదొకటే కాదక్కా, చంద్రబావ కూడా జూనియర్ ను వెనకేసుకొస్తున్నాడు" అన్నాడు దిగులుగా. "నువ్వేమీ భయపడకురా, ఓట్లకోసమే అలా అంటున్నాడు చంద్రబాబు. అవసరం తీరాక జూనియర్‌ను అణగదొక్కేస్తాడు. పైగా తన కొడుకు ఉన్నాడు కదా. కావాలంటే మీ బావను చూడు. ఎలా ముంచేసాడో అవసరం తీరాక" అంది. దగ్గుబాటి భరోసాగా చూసాడు. బాలయ్య మొహం లో ఆనందం తాండవించింది. న.తా.ర హుషారుగా ఈల వేసి "బాబాయే సీయం" అన్నాడు.
అంతలో బాలయ్య బుర్ర బరుక్కుంటూ "ఏంటో అక్కా నేను నిన్ను తిట్టాలి, నువ్వు చంద్రబావను తిడతావు, మనిద్దరం జూనియర్‌ను తిడతాము, ఈ బావ చంద్రబావను తిడతాడు. చంద్రబావ అందరినీ ముంచేస్తాడంటావు. మళ్ళీ అందరం మన మధ్య గొడవలే లేవు అని చెప్పుకోవాలి. అసలు ఎందుకక్కా ఇదంతా" అంది. పురంధ్రీశ్వరీ ప్రేమగా బాలయ్య తలనిమిరి "దాన్నే రాజకీయం అంటారు తమ్ముడూ. నీకు అర్థం కాదులే. అది అర్థం కావాలంటే చీమతలకాయంతయినా మెదడు ఉండాలి" అని ""సరే భోజనానికి లేవండి" అంటూ వంటగదిలోకి వెళ్ళింది.
"బాబాయ్, నీకోసం అత్తయ్య స్పెషల్‌గా "బాబాయే సీయం" కూర చేసింది" అంటూ న.తా.ర. కిచెన్‌లోకి రివ్వున వెళ్ళాడు. బాలయ్య బాబుకు అర్థం కాక "అదేమి కూర బావా" అన్నాడు. దగ్గుబాటి "ఏమీ లేదు బామ్మర్దీ, వీడు వారం నుండి మా ఇంట్లోనే ఉంటున్నాడు. వీడికి ఏదిచ్చినా దానిపేరు బాబాయే సీయం అని చెప్పాలి. గుత్తివంకాయ కూర అని చెప్తే తినడు, బాబాయే సీయం కూర అంటే తింటాడు" అన్నాడు.
బాలయ్య కిచెన్‌లోకి వచ్చాడు.. టేబుల్ పైన అన్ని గిన్నెలకు స్టిక్కర్లు అతికించి ఉన్నాయి: బాబాయే సీయం కూర, బాబాయే సీయం రసం, బాబాయే సీయం వేపుడు, బాబాయే సీయం పెరుగు అని.
అది చూసిన బాలయ్య ->

ఇల్లు కాలిపోతుంటే..
Posted by జీడిపప్పు
కంపెనీ లాభాల్లో ఉన్నపుడు ఇచ్చినా పర్వాలేదు కానీ AIG మరణావస్థలో ఉంది. చనిపోతున్నదాన్ని బ్రతికించడానికి ప్రభుత్వం వందల బిలియన్లు ఇస్తుంటే, యాజమాన్యం ఏమో "కంపెనీ రూల్స్ అలా ఉన్నాయి" అనో "మంచి వాళ్ళను పోగొట్టుకోకూడదని ఇస్తున్నాము" అనో అంటోంది. పన్ను చెల్లించే సగటు పౌరుడికి మాత్రం ఇది చూసి మండుతోంది. ఒక వైపు లక్షల మందికి ఉద్యోగాలు లేవు. వీళ్ళేమో ప్రజల సొమ్మును ఇలా దోచుకుంటున్నారు. నిజానికి ఇది ఒబామా రాక ముందే జరిగింది. అయినా సరే ఇందులో ఒబామా తప్పు కాస్త ఉంది అని నమ్ముతున్నా. అన్ని బిలియన్లు ఇచ్చినపుడు ప్రతి సెంటుకూ లెక్క చూపాలని, అన్ని వివరాలు బహిర్గతం చెయ్యాలని ఆంక్షలు పెట్టాలి.
ఈ రోజు ఇంకో వార్త ఏమిటంటే, ఆటో ఇండస్ట్రీకి ఐదు బిలియన్ డాలర్లు ఇస్తున్నారు. ఇది మరొక ఘోర తప్పిదం అనిపిస్తోంది. డెట్రాయిట్ ఆటో సంస్థల కంటే అవినీతిమయమయినవి అమెరికాలో మరేవీ ఉండవు. అక్కడి లేబర్ యూనియన్ల ముందు మాఫియా ఎందుకూ పనికిరాదు అంటారు. వాళ్ళ జీతాలు, ఇతర సదుపాయాలు చూస్తే కళ్ళుతిరుగుతాయి. మేనేజ్‌మెంట్ కూడా అలాంటిదే. దొరికినంత వరకు దోచుకోవడమే. కంపెనీ డబ్బులతో ప్రైవేట్ జెట్లను కొనిపిస్తారు, ఆఫీసు పక్కన ల్యాండ్ అవడానికి!
తమ ఫ్యాక్టరీలను బ్రతికించుకోవడానికి ప్రభుత్వాన్ని అప్పు అడగడానికి మూడు కార్ల కంపెనీల పెద్దలుముగ్గురూ కంపెనీ ప్రైవేట్ విమానాల్లో వాషింగ్టన్‌కు వెళ్ళారు. ఒక సెనేటర్ కు మండిపోయి "ఇప్పటికిప్పుడు మీ జెట్ విమానాలను అమ్మివేసి మామూలు విమానంలో సాధారణ ప్రయాణీకుల్లా వెళ్ళడానికి మీలో ఎవరు సిద్దమో చేతులెత్తండి. " అంటే ఒక్కరు కూడా చేతులెత్తలేదు. ఇక వీళ్ళ కంపెనీలకు ఎంత డబ్బు కావాలో వీళ్ళకే తెలియదు. మొదట 13 బిలియన్లు అన్నారు, తర్వాత 25 బిలియన్లు అన్నారు.
ఏమయినా అంటే ఆ మూడు కంపెనీల పైన 2 మిలియన్ ఉద్యోగాలు ఆధారపడి ఉన్నాయి అంటారు. పోనీ ఆ కార్లు కొనదగినవా అంటే అదీ కాదు. సగటు అమెరికన్లు "మా దేశపు కారు కొని పడ్డ కష్టాలు చాలు. ఇప్పుడు ఈ జపాన్ కారుతో హాయిగా ఉంది" అంటున్నారు.
ఇప్పుడు 50 బిలియన్లు ఇచ్చినా లేబర్ యూనియన్లు "రూల్స్" అంటూ శుభ్రంగా తినేస్తాయి తప్పించి ఆ కంపెనీలు బాగుపడతాయన్న నమ్మకం లేదు. ఆ కంపెనీలతో దివాలా ప్రకటింపచేసి మొత్తం ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని ఏ టొయోటాకో హోండాకో అమ్మివేయడమే ఉత్తమం.
మనీప్లాంట్ కథలు
Posted by జీడిపప్పు
ఒక కథ చదివి ఆఫీసు పని మొదలెడదాము అనుకున్నాను కానీ, మొదటి కథ పూర్తి చేసాక రెండవ కథ కూడా చదవాలనిపించింది. ఆ విధంగా మొదటి విడతలో పదకొండు కథలు పూర్తి చేసాను. మొత్తమ్మీద "మంచి" కథల పుస్తకం ఇది. అనువాదకథలయినప్పటికీ ఒకట్రెండు తప్ప అంతా మన ఊళ్ళో జరుగుతున్నట్టు అనిపిస్తూ ఆకట్టుకునేలా వ్రాసారు సోమశంకర్ గారు. పుస్తకాలను బహుమతిగా ఇవ్వాలనుకొనే వారికి ఈ పుస్తకం మంచి అవకాశం. రెండు గంటల ప్రయాణం సమయం తెలియకుండా గడిచిపోతుంది.
మూస ధోరణిలో కాకుండా విభిన్న అంశాలకు చెందిన కథలను, అది కూడా భిన్నమయిన ముగింపులతో నిండివున్న వాటిని అనువాదం చేయడంలో సోమశంకర్ గారు సఫలీకృతులయ్యారు. ఇంత మంచి పుస్తకానికున్న ప్రధాన లోపం పుస్తకం పేరు అని ఇప్పటికీ అనుకుంటున్నాను. ఎవరయినా నాతో "మనీ ప్లాంట్ అనే కథల పుస్తకం ఉంది చదువుతావా" అంటే పెద్దగా ఆసక్తి చూపించేవాడిని కాదు కానీ, "పెరుగన్నం/చెరువు/మిగిలిపోయినవి/సున్నాగాడు అనే కథల పుస్తకం ఉంది చదువుతావా" అని చెప్తే తప్పకుండా ఆసక్తి చూపించేవాడిని. మనీప్లాంట్ అని ఎందుకు పేరు పెట్టారో సోమశంకర్ గారే చెప్పాలి!!
107 పేజీలున్న ఈ చక్కని కథల పుస్తకాన్ని వికాసధాత్రి సైటునుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అడిగిన వెంటనే రిప్లై ఇచ్చిన సోమశంకర్ గారికి కృతజ్ఞతలు. కథల గురించి, 5 పాయింట్ల స్కేలు ఆధారంగా నా రేటింగ్ ఇస్తున్నాను.
పెరుగన్నం: పెరుగన్నం ఇష్టపడని చిన్నపాప పెరుగున్నం తినడానికి తనకు కావలసింది ఇవ్వాలి అని షరతు పెడుతుంది. ఆ పాప ఎందుకు అలా చేస్తుందో కథలో చూడాలి. చిన్నపిల్లల్లోని మంచితనాన్ని, ఆలోచనలను ప్రతిబింబింపచేసే ఈ కథలో చక్కని కథనం, మంచి ముగింపు ఉన్నాయి. రేటింగ్: 5/5
సెల్ ఫోన్: ఎక్కడికి వెళ్ళినా సెల్‌ఫోన్ల శబ్దాలు, సెల్‌ఫోన్లో మాట్లాడే..కాదు.. అరిచే వాళ్ళు సాధారణం అయిపోతున్న ఈ రోజుల్లో ఒక సెల్‌ఫోన్ బాధితుడి కథ. కొత్తదనం ఎక్కువ లేకపోయినా పరవాలేదు అనిపించే కథ. రేటింగ్: 3/5
హస్త లాఘవం: మేజిక్ అంటే మంత్రాలు కాదు కేవలం అది కూడా ఒక నైపుణ్యం మాత్రమే అని స్టేజీ ముందు అందరికీ తెలుపుతాడు ఒక మెజీషియన్. కథాంశం అంటూ ఏమీ లేదు కానీ, ఊహించని ముగింపుతో కథ ముగుస్తుంది. రేటింగ్: 3/5
ఓ మనిషీ, ఎందుకిలా: అంతరిక్షం నుండి భూమిని చూసిన పాపాయి ముచ్చటపడి భూలోకానికి వెళ్ళాలని మారాం చేస్తే దేవుడు ఆ పాపను భూలోకానికి పంపిస్తాడు. ఆ తర్వాత ఏమయింది? రేటింగ్: 5/5
చెరువు: చెరువుతో తన అనుబంధాన్ని పోగొట్టుకోలేని ఒక వృద్దుడి కథ. కథ కంటే వ్యథ అనాలేమో. అందరూ ఆ ఎండిపోయిన చెరువు ద్వారా డబ్బు సంపాదించాలనుకుంటారు కానీ వృద్దుడు మాత్రం దానితో ఉన్న అనుబంధాన్ని తెంచుకోలేడు. రేటింగ్: 4/5
బాకీ: కారు రిపేరు చేయించుకోవడానికి వచ్చిన ఒకడు డబ్బులు తక్కువ కావడంతో ఏమి చేసాడన్నది కథాంశం. కథ అంత స్పష్టంగా అనిపించలేదు. ముగింపు కూడా సరిగా అర్థం కాలేదు. ఈ కథ ఇంకోసారి చదవాలి. రేటింగ్: 2/5
బొమ్మ: తన తాహతుకు మించిన బొమ్మను కొనివ్వమని కూతురు అడిగినపుడు కాదనక బొమ్మ కొనివ్వడానికి సిద్దపడిన తండ్రి కథ. ముగింపు అత్యద్భుతం. రేటింగ్: ఆరు/5
అమ్మ వస్తే బాగుండు: పక్షి గూటిలోని గుడ్ల జాగ్రత్త గురించి చిన్న పిల్లల తపన ద్వారా మనల్ని కూడా బాల్యంలోకి తీసుకెళ్ళే మరో మంచి కథ. రేటింగ్: 5/5
లాటరీ: వ్యసనాలు పచ్చని పల్లెట్టూరి వాసుల జీవితాలను ఎలా నాశనం చేస్తున్నాయో లాటరీ వ్యసనం ద్వారా వివరించే కథ. కథాంశం పాత వస్తువే, కథనం కూడా మామూలుగు సాగుతుంది. రేటింగ్: 3/5
మిగిలిపోయినవి: మిగిలిపోయిన ఆహారాన్ని అడిగి మరీ తీసుకొని బ్రతికే పనిమనిషి కథ. ఎంత డబ్బు ఉన్నా కొందరు "మిగిలిపోయిన"వాటితో బ్రతుకుతుంటారు అని సారాంశం రేటింగ్: 4/5
సున్నాగాడు: ఎందులోనూ ప్రావీణ్యం లేని ఒక సున్నాగాడి కథ. చాలా చక్కని కథనం, మంచి ముగింపు. రేటింగ్: 5/5
వృత్తిధర్మం: ప్రేమ-వృత్తిల మధ్య వృత్తికే ప్రాధాన్యం ఇచ్చిన వైద్యుడు- తన భార్యకు మరణభిక్ష ఇవ్వమని అడిగే వృద్దుడు ఇందులోని కథాంశం. ప్రేమ ఎపిసోడ్ సరిగా నచ్చలేదు. రేటింగ్ : 3/5
సందేశం X అనుభవం: సందేశాలు ఇవ్వడానికే కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజజీవితంలో అందుకు భిన్నంగా ఉంటుంది అని చెప్పే ప్రాక్టికల్ కథ. రేటింగ్: 5/5
మనీప్లాంట్: పుస్తకం టైటిల్ కథ కాబట్టి కాస్త ఎక్కువ అంచనాలతో చదివాను. కథ సాదాసీదాగా సాగిపోతుంది. కొన్ని చోట్ల స్పష్టత కనపడలేదు. ఈ కథ మరోసారి చదవాలి. రేటింగ్: 3/5
యమరాజు: ఈ పుస్తకంలో ఉండకూడని ఏకైక కథ ఇది అనిపించింది. అసలు కథాంశం కానీ కథనం కానీ ముగింపు కానీ ఏమీ కనిపించలేదు. అంతర్లీనంగా ఏదయినా గొప్ప సందేశాన్ని ఇస్తున్నారేమో, ఏమీ తోచనపుడెపుడయినా చూడాలి. రేటింగ్: 0/5
ఆశా నిరాశేనా: అమెరికాకు వెళ్ళిన కొడుకు కోడలు మారిపోతారు, అది చూసి తల్లి పడే బాధ కథాంశం. ఇప్పటికే ఇలాంటి కథలు వందల కొద్దీ వచ్చాయి. వ్యక్తిగతంగా ఇలాంటి కథలంటే నాకు చాలా చిరాకు. (i know what you are thinking :) వీలయితే ఒక పోస్టు వేస్తాను "చెత్త కథలు" అని). కథాంశం పక్కన పెడితే కథను చెప్పిన తీరు చాలా బాగుంది. రేటింగ్: 3/5
కట్టుకథ: పెళ్ళికి ముందు తాను ప్రేమించిన అమ్మాయి గురించి భార్యకు చెప్పిన భర్త కథ. రేటింగ్: 4/5
ఆత్మావలోకనం: చిన్ననాటి మిత్రుడిని కలుసుకోబోయే ముందు బాల్యస్మృతులు తలుచుకోవడం, కలిసిన తర్వాత సంఘటనల కథ. రేటింగ్: 5/5
విషవలయం: కష్టాల్లో ఉన్న ఒకడు తర్కం అంటూ తన కారును రౌండుగా తిప్పుతుంటాడు. నిజానికి కథ చదివిన తర్వాత నాకు కాస్త తల తిరిగింది. ఒక్క నిమిషం ఆలోచించాను అసలు ఈ కథలో ఏముందా అని.. ఏదో ఉంది కానీ నా ట్యూబ్‌లైట్ ఇంకా వెలగలేదు. రేటింగ్: 1/5
లోక్‌సత్తాకు ఓటు వేస్టా?
Posted by జీడిపప్పు
లోక్‌సత్తా ప్రధాన ఆయుధం యువత, విద్యావంతులు. కానీ ఎంతమంది విద్యావంతులు ఓట్లు వేస్తారు? ఉన్నత విద్యావంతులు కూడా "యువ రాజ్యం" "జగన్ యువసేన" "బాలయ్య సేన" అంటున్నారు తప్పితే యువతలో కనీసం పదిశాతం కూడా లోక్‌సత్తాకు ఓట్లు వేస్తారన్న నమ్మకం నాకు లేదు.
ఎంబీయస్ గారు లేవనెత్తిన ప్రశ్న - లోక్‌సత్తా అంటే జేపీగారి పేరు తప్ప ఇంకొకరి పేరు వినపడదు. కనీసం రెండో పేరు వినపడని, రెండో నాయకుడు లేని ఆ పార్టీకి ఓటు వేయడం ఎలా? (మొదటివాడు ఎప్పుడూ ఒక్కడే...అలాంటివి ఇక్కడ ఎక్కడం లేదు!) ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను మా వూళ్ళో ఉన్నా ఓటు వెయ్యడానికి వెళ్ళను. (విమర్శకులెవరయినా ఉంటే అందుకోండి ఇక :) ) నా ఒక్క ఓటుతో ఎలాగూ గెలిచేది లేదు. పోటీ పడి మన రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్న పార్టీలకు ఓటు వెయ్యను. మా ఊళ్ళో లోక్‌సత్తా తరఫున ఒక అభ్యర్థి నిలబడ్డాడు అనుకుందాము. పోనీ లోక్‌సత్తాకు వేద్దామా అంటే అభ్యర్థి ఎవరో, ఇప్పటివరకు ఊరికి ఏమి చేసాడో తెలియదు.
ఓటు వెయ్యకపోవడం నేరం, ఘోరం, కారం అన్నవారి మాటలు విని తప్పదని బూతులు తిట్టుకుంటూ బూతుకెళ్ళి లోక్‌సత్తాకు ఓటు వేసినా ఒరిగేది ఏమీ ఉండదు. మహా అయితే 5% ఓట్లు వస్తాయి అంతే అనుకుంటున్నాను. దాని ప్రభావం శూన్యం. ప్రతిఒక్కరూ ఇలా అనుకుంటే ఎలా, అంటారా? ఏమో మరి.. నాకయితే లోక్‌సత్తా అనేది ఇంకా utopia అనే అనిపిస్తున్నది. అందుకే ఈ సారి ఓటు వేసే అవకాశమున్నా ఏదయినా విహారయాత్రకు వెళ్ళి ఫ్యామిలీతో హాయిగా గడపడం బెస్టు అని నా అభిప్రాయం.
ఓటు అడగడానికి వెళ్ళిన నాయకులను నిర్మొహమాటంగా "ఎంతిస్తారు?" అని సగటు ఓటరు అడుగుతున్న ఈ తరుణంలో ఒకవేళ లోక్‌సత్తా నా అంచనాలకు భిన్నంగా రాణిస్తే ఆనందించేవాడిలో నేనూ ఒకడిని అవుతాను. నా అంచనాలు తప్పు కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. అప్పటివరకు నా ఊహాప్రపంచంలోకి వెళ్ళి జయప్రకాష్ గారి స్పీచ్ వింటుంటా.
అవీ..ఇవీ..అన్నీ
Posted by జీడిపప్పు
కేసీఆర్ గారు ఒక మహత్తరమయిన స్టేట్‌మెంట్ ఇచ్చారు. "తెలంగాణా కోసం తల నరికించుకోవడానికి సిద్దంగా ఉన్నవాళ్ళకు టికెట్టు ఇస్తాను" అన్నారు. ఈ నరకడాలు పొడవడాలు వదలరా? ఎవరికయినా టికెట్లు కావాలంటే కేసీఆర్ గారి దగ్గరకు వెళ్తారు. అక్కడ పదునయిన కత్తి పట్టుకొని ఒక రిటైర్డ్ తలారి ఉంటాడు. వీళ్ళు వెళ్ళి ఆ తలారి ముందు వంగి నిలుచున్నప్పుడు ఆ తలారి "నరుకుతా, నరుకుతా" అని భయపెడుతుంటాడు. మెడ పైన కత్తి ఉన్నా భయపడని వాళ్ళకు టికెట్ వస్తుంది. ఒక వేళ తలారి ముచ్చటపడి పుటుక్కున తల నరికినా భయం లేదు. మొండానికో లేదా తలకో సీటు వస్తుంది!
**********
రాష్ట్రంలో అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతున్నది. బాపట్లలొ ఒక అమ్మాయి ర్యాగింగ్ భరించలేక ఆత్మహత్య చేసుకున్నది. ఆ అమ్మాయిని ర్యాగింగ్ చేసింది నజ్మ, సాహిత్య, స్రవంతి, సౌజన్య, వనిత అనే విద్యార్థినులట. స్త్రీవాదులెవరూ ఈ సంఘటనను ఖండించలేదు, కనీసం కత్తిరించినట్లు కూడా చూడలేదు నేను. ఇప్పుడు మహిళా సంఘాలు ఆ ఐదుమంది అమ్మాయిలను కఠినంగా శిక్షించాలని, వాళ్ళు కాళ్ళో చేతులో తీసేయాలని లేదా ఉరి తీయలని రాష్ట్రవ్యాప్త ధర్నాలు, నిరసనలు, మీటింగులు పెడతాయో లేదో వేచి చూడాలి.**********
చిరంజీవి గారు ఇప్పటివరకు మనకు తెలియని కఠోర నిజాన్ని చెప్పారు. ఇప్పటివరకు కేవలం 24 మంది మాత్రమే ముస్లింలు మంత్రులు అయ్యారట. ఎన్నడూ మతానికింతమంది మంత్రులు అని ఆలోచించని సగటు మనిషిలో మత విషబీజాన్ని నాటడం మొదలు పెట్టారు చిరంజీవిగారు. అధికారంలోకి వస్తే ఏ పని చేయాలన్నా "మాదంతా సామాజిక న్యాయం. నీ కులమేది, నీ మతమేది" అని ప్రశ్నిస్తారేమో!! అన్నట్టు ఇప్పటివరకు ఎంత మంది క్రైస్తవ మతస్తులు, బౌద్ద మతస్తులు మంత్రులయ్యారో తెలుసా?**********
సరిగా చదువురానివాళ్ళు, లేదా కాస్తో కూస్తో చదువుకున్నవాళ్ళు తిట్టుకుంటుంటే "సిగ్గులేకుండా అసెంబ్లీలో ఎమ్మెల్యేలలా తిట్టుకోకండి" అంటాము. అదే బాగా చదువుకొని ఉన్నత స్థానాల్లో ఉంటూ తిట్టుకొనేవాళ్ళను ఏమనాలి? "అసెంబ్లీ ఎమ్మెల్యేల్లా" అంటే బాగోదు. అందుకే ఈ మధ్య కొత్తగా "తానా సభ్యుల్లా తన్నుకోకండి" అని అందరూ అంటున్నారు. ఏడాది నుండి తానా రెండుగా చీలింది. కోర్టు కేసులు నడిచాయి. ఒకరినొకరు నానామాటలనుకున్నారు. మొన్న ఏమయిందో ఏమో "తూచ్, అంతా ఉత్తుత్తిదే..మనమంతా ఒకటే" అన్నారు. ఇది చూసి విసుగు చెందిన కొందరు తానాను బహిష్కరించారు. కొత్తగా యునైటెడ్‌తానా ఏర్పడింది. ముందు ముందు చాలా ఎంటర్‌టైన్‌మెంట్ ఉండబోతోంది. Stay Tuned!!**********
ఆపిల్ స్టోర్లో కొత్త iPod shuffle దర్శనమిచ్చింది. బటన్స్ లేకపోవడం దీని ప్రత్యేకత. మస్కిటో మ్యాట్‌లా ఉండే ఇంతకు ముందు shuffle నాకు బాగా నచ్చింది. చిన్న చక్రం పైన అన్ని కంట్రోల్స్ ఉండేవి. ప్యాంట్ జేబుకు తగిలిస్తే అవసరమయినపుడు మార్చుకోవడానికి సులభంగా ఉండేది. కానీ కొత్త shuffle కు అన్ని కంట్రోల్స్ ear phones వైరులో పెట్టారు. పాట మార్చుకోవాలంటే దాదాపు గొంతుదగ్గరకు చెయ్యి తీసుకురావాలి. multiple playlists ఈ కొత్త shuffle ప్రత్యేకత. మరింత చిన్న సైజు, 4 GB మెమొరీ ఉన్న దీని విలువ $79. **********
కాంగ్రెస్, బీజేపీ లు తప్ప మిగిలిన దాదాపు అన్నీ పార్టీలు కలసి మూడో ఫ్రంట్ పెట్టాయి. జయలలిత, కేసీఆర్ కూడా అందులో ఉన్నారన్న వార్త చూడగానే నా ఆనందానికి అవధులు లేవు. తనను ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తేనే మద్దతు ఇస్తానంటోంది మాయావతి. మిగతా అందరూ కూడా ఒప్పుకుంటారనుకుంటా. నాక్కూడా మాయవతిని ప్రధానమంత్రి చేసి పారేస్తే పోలా అనిపిస్తున్నది కానీ, ఆమె పుట్టిన రోజు బహుమతులకు అడిగినంత డబ్బు ఇవ్వలేదని మా ఇల్లు ధ్వంసం చేసి నన్ను కత్తితో కసుక్కున పొడుస్తారేమో. అలా అయితే 2055లో నేను తలపెట్టిన ప్రపంచయాత్ర జరగదు అని భయంగా ఉంది!
స్టెంసెల్ రీసెర్చ్ పైన బుష్ విధించిన ఆంక్షలను ఒబామా రద్దు చేసి మరిన్ని నిధులను ఇచ్చాడు. ఇది ఒబామా తీసుకున్న "గొప్ప" నిర్ణయాల్లో ఒకటిగా నిలిచిపోతుంది. పిండాల పైన రీసెర్చ్ తప్పు, వాటిని హత్య చేయడం అమానుషం అని చాలామంది రిపబ్లికన్లు, పని లేని చర్చి ఫాదర్లు అరుస్తున్నారు కానీ దీనివల్ల భవిష్యత్తులో కాన్సర్, డయాబెటిస్, పాంక్రియాస్ మొదలయిన వాటికి చికిత్స కనుగొనే అవకాశం ఉంది. Go Obama!!
**********
కొత్త H1-B వీసాలు వద్దు
Posted by జీడిపప్పు
ఇప్పటికే IT కంపెనీలు ఉన్నవాళ్ళను ఉద్యోగాలనుండి తీసేస్తున్నారు. కొత్త ఉద్యోగాలు దాదాపు శూన్యం. రాబోవు రోజుల్లో మరిన్ని firings ఉంటాయే తప్ప hirings ఉంటాయన్న నమ్మకం, ఆశ లేదు. గత ఆరు నెలల్లో ఉద్యోగాలు ఊడినవాళ్ళకు కొత్త ఉద్యోగాలు వస్తున్న దాఖలాలు లేవు. వేలమంది స్వదేశాలకు వెళ్ళిపోతున్నారు.
ఒక వేళ ఈ ఏడాది ఆఖరికి మళ్ళీ ఆర్థిక వ్యవస్థ బాగుపడినా అమెరికాలో ఉన్నవారికే అవి సరిపోవు. ఉద్యోగాలు పోయిన అనుభవజ్ఞులకు ముందు ప్రాధాన్యత ఉంటుంది. వాళ్ళందరూ అయిన తర్వాత dependent గా వచ్చి తర్వాత H1 కు మారిన వాళ్ళకు ఉద్యోగాలు కావాలి. వీళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చి మిగిలితే కొత్తవాళ్ళకు ఇవ్వాలి. అందుకే ఈ ఏడాది ఒక్క H1 ఇవ్వకపోయినా నష్టం లేదు. ఉన్నవాళ్ళతో, అమెరికన్లతో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ఏడాది సాఫీగా సాగిపోతుంది. వచ్చే ఏడాది కావాలంతే అప్పటి సంగతి అప్పుడు చూసుకోవచ్చు. పని చేయించుకొనే అమెరికా వాడికి లేని దురద పని చేసే మనకెందుకో!!
ఇది తెలియని మన మీడియా, కుహానా మేధావులు భౌ భౌ అని మొరుగుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక వేళ ఎవరయినా ఉద్యోగాన్వేషణకు H1 పైన అమెరికాకు వస్తే, స్వర్గం చూస్తారు. అది కూడా మామూలు స్వర్గం కాదు.. కలలో కూడా ఊహించని స్వర్గం. నమ్మండి!
ముందు వీళ్ళు మారాలి
Posted by జీడిపప్పు
ఈ మధ్య హాలీవుడ్ సినిమాలను మన నిర్మాతలు చవకగా డబ్బింగ్ చేసి తెలుగులో విడుదల చేస్తున్నారట.. ఇది తప్పంట. అమ్మ పెట్టదు, అడుక్కుతిననివ్వదు అన్నట్టుంది ఇది. ఇప్పటి దర్శకులకు మంచి సినిమాలు తీయడం రాదు కానీ మంచి సినిమాలు డబ్బింగ్ చేస్తే ప్రేక్షకులు చూడకూడదట. గంపెడాశతో నిర్మాత కోట్లు తీసుకొచ్చి దర్శకుడి చేతిలో పెడితే, ఆ దర్శకుడు ఒక చెత్త సినిమా తీసి నిర్మాతను నట్టేట ముంచినపుడు - ఆ నిర్మాత దయగల తల్లి షకీలాతో సినిమా తీసి/డబ్బింగ్ చేసి కాస్తో కూస్తో డబ్బు రాబట్టుకున్న సందర్భాలు కోకొల్లాలు.
దశాబ్దం నుండి ఎంత మంది దర్శకులు మంచి సినిమాలు తీస్తున్నారు? సినిమా తీయలంటే ఒక "వారసుడు" కావాలి. కుప్పిగంతులేసే కోతిగాడయినా, విలన్ గ్యాంగులో మూడో లైన్లో నిలుచుకొనే దానికి పనికిరాని వాడయినా సరే.. ఒక నిర్మాత కొడుకో, హీరో కొడుకో అయితే చాలు.. జనాలమీదకు వదలడమే. హీరో పరమ ఉల్ఫాగాడు.. వందమందిని ఒక్క చేత్తో చితక్కొడతాడు. బజారుదానిలా ఎంతసేపూ హీరో పైన పడిపోయే ఒక పేద అమ్మాయిని (పేద అమ్మాయి ఎందుకంటే - ఒంటినిండా కట్టుకోవడానికి బట్టలు ఉండవు) హీరోయిన్ గా పెడతారు. దానికి (అవును.. "దానికి"!!) ఒక్క ముక్క తెలుగు రాదు, కనీసం డైలాగులు కూడా నేర్చుకోదు అన్ని లక్షలు తీసుకొని. దానికి తెలిసిందల్లా వెగటు పుట్టించేలా విప్పడమే . ఇక సినిమాలో ఉండేవి: తెలుగు రాని విలన్లు, ఈ విలన్ బతుకంతా హీరోను పొగడడానికే సరిపోతుంది. ఒక చెత్త కామెడీ ట్రాక్. మధ్యలో నాలుగు కుప్పిగంతులు తప్పనిసరి. ఇలాంటి సినిమాలు కాకుంటే లపాకీ లవ్‌స్టోరీలు తీస్తారు.
వీళ్ళు తీసే చెత్త చూసి చూసి విసుగుపుట్టింది. ఎంత సేపూ "బాబు" కోసం సినిమా తీస్తున్నారు కానీ, అసలు "స్క్రిప్ట్" అంటే తెలుసా వీళ్ళకు? హాలీవుడ్ సినిమాల పైన పడి ఏడుస్తున్నారు కానీ హాలీవుడ్‌లో ఉన్న ఏకైక హీరోను ఏనాడయినా పట్టించుకున్నారా? అసలు హాలీవుడ్ సినిమాల ప్రమాణాలు మనకంటే బాగుండడానికి కారణమయిన ఆ హీరో పేరు "స్క్రిప్ట్" అని తెలుసా వీళ్ళకు? రొటీన్ చెత్త మాని పక్కా స్క్రిప్ట్ రాసుకొని విభిన్నంగా సినిమా తీస్తే ప్రేక్షకులు ఎందుకు ఆదరించరు? ఈ మధ్య వచ్చిన అతి కొద్ది సినిమాలే అందుకు సాక్ష్యం.
ఇక ఈ వ్యాసంలో హైలైట్ - హాలీవుడ్ సినిమాల వల్ల మన సంస్కృతి దెబ్బ తింటున్నదట.
బాబూ చిట్టీ.. ఏమన్నావ్.. మన సంస్కృతి దెబ్బ తింటున్నదా?

ఆంధ్రభూమిలో ఈ వ్యాసం పైన ఉన్న మరో వ్యాసం లోని వార్త -బొమ్మరిల్లు సినిమా కథ దొంగిలించినదట!! దర్శకుడేమో గొప్పగా నా కథ అని చెప్పుకున్నాడు. సినిమాకు ప్రాణమయిన కథను అందించినవాడి అనుమతి లేకుండా దొంగిలించి గొప్పలు చెప్పుకుంటున్నారు మన దర్శకులు. ఇక ట్యూన్లు, సీన్లు దొంగిలించడం గురించి చెప్పనక్కర్లేదు. బొమ్మరిల్లు కథ దొంగిలించినందుకు మూడొంతుల కలెక్షన్ ఆ కథ వ్రాసిన రచయితకు ఇవ్వాలని కోర్టు తీర్పునిచ్చింది. ఇకనుండి ఇలా మరిన్ని జరిగితే బాగుంటుంది.
సినిమా చూడకుండా ఉండలేని నేను అదృష్టవశాత్తూ గత కొద్ది ఏళ్ళుగా హాలీవుడ్ సినిమాల పట్ల ఆసక్తిని పెంచుకొని ఆనందంగా ఆస్వాదిస్తున్నాను. అపుడపుడు అనుకుంటాను.. "ఒకప్పుడు కె.నాభికేంద్రరావు కొడుకు సినిమాలు, ఆర్యన్ రాజేష్ సినిమాలు.. చివరకు బ్రహ్మానందం కొడుకు సినిమాలు కూడా ఎలా చూసాను?, ఎందుకు హాలీవుడ్ సినిమాల పట్ల ఆసక్తి లేదు అపుడు?" అని!
ఏది ఏమయినప్పటికీ హాలీవుడ్ సినిమాలు, ఇతర విదేశీ సినిమాలు సామాన్యుడికి అందుబాటులో వచ్చాయి అన్నది చాలా మంచి వార్త. కనీసం ఇకనుండయినా కొన్ని మంచి సినిమాలు చూసే అదృష్టం మన తెలుగు ప్రేక్షకులకు కలుగుతుంది.
బేరమాడకండి
Posted by జీడిపప్పు
ఎలాంటివాడి దగ్గర బేరమాడాను, అది కూడా ఒకట్రెండు రూపాయలకోసం అని గుర్తు చేసుకుంటే సిగ్గుతో తలవంచుకోవాలి. బండి పైన అరటిపళ్ళు అమ్ముకుంటున్నాడంటే అతడి పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. చాలమంది పరిస్థితి ఇలా ఉంటుంది: ఒక దళారి రోజూ తెల్లవారి ఆరింటింటి ఒక చోటకు వస్తాడు. ఈ బండ్ల వాళ్ళు అతడి దగ్గరికి వెళ్ళి 90 రూపాయలు తీసుకుంటారు. ఆ 90 రూపాయలు తీసుకొని మండీకెళ్ళి పళ్ళు కొనుక్కొని రోజంతా వ్యాపారం చేస్తారు. సాయంత్రం మళ్ళీ ఆ దళారి వచ్చి 100 రూపాయలు తీసుకుంటాడు. అంటే రోజుకు నూటికి 11 రూపాయలు వడ్డీ అన్నమాట! నెలకు నూటికి 3-5 రూపాయల వడ్డీ అంటేనే బెంబేలెత్తిపోతాము కానీ వీళ్ళు రోజుకు నూటికి 11 రూపాయల వడ్డీ చెల్లిస్తున్నారు కడుపు నింపుకోవడానికి.
పళ్ళన్నీ అమ్ముడు పోవాలి, దళారికి 11 రూపాయలు ఎక్‌స్ట్రా ఇవ్వాలి, ఆ పైన వచ్చిన లాభంతో బ్రతకాలి. అలాంటివాళ్ళ దగ్గరన్నమాట నేను బేరమాడింది, అది కూడా ఒకట్రెండు రూపాయలకు. నేనే కాదు, సగటు మధ్యతరగతి మనిషులలో చాలామంది ఇలాంటివారే. ఇక అడవుల్లోకి వెళ్ళి ఈతపళ్ళు, ఉసిరికాయలు పీక్కొచ్చి బుట్టలో పెట్టుకొని మండుటెండలో ఇళ్ళ ముందు తిరుగుతు గొంతెండిపోయేలా అరుస్తూ తిరిగే స్త్రీమూర్తుల దగ్గ సగటు గృహిణి ఆడే బేరం గురించి తలుచుకుంటే మాటలు రావడం లేదు.
కాయకష్టం చేసి పొట్టకూటికోసం ఇల్లీల్లూ తిరిగే ఆ నిర్భాగ్యుల దగ్గర గీచి గీచి బేరమాడి రూపాయి మిగిల్చిన నేను ఒక ఫ్యాన్సీ స్టోరుకెళ్ళి అక్కడున్న ఒక వస్తువును వాడు చెప్పిన ధరకు నోరుమూసుకొని కొనడం తలుచుకుంటే చాలా బాధ వేస్తుంది. ఒక సగటు మనిషి ఏడాదిలో ఈ బేరమాడి మిగిల్చినది అంతా ఒక షర్టో లేక చీరో కొన్నపుడు ఆ షాపు వాడితో బేరమాడడం చేతకాక పోగుట్టుకొన్నదానికంటే తక్కువే ఉంటుంది.
అదృష్టవశాత్తూ నాకు గత ఇండియా ట్రిప్పులో చేసిన తప్పు కాస్త సరిదిద్దుకొనే అవకాశం కలిగింది. ఇండియాలో అడుగుపెట్టినపుడు నా లగేజ్ రాలేదు. "రేపు ఇంటికి పంపుతాము" అన్నారు. చాలామంది సరేనని వెళ్ళిపోయారు. నేను ఇంకొకరు మాత్రం వెళ్ళి compensation కోసం బేరం మొదలు పెట్టాము. "నేనిప్పుడు పళ్ళు తోముకోవాలి, డబ్బుల్లేవు" అన్నాను. తప్పదని per day expenses అని కొన్ని వేలరూపాయలు ఇచ్చారు. మరుసటి రోజు 9 గంటలకు మళ్ళీ ఫోన్ చేసి "మీరు ఇచ్చింది ఒక్క రోజుకే కదా, మళ్ళీ డబ్బులు కావాలి ఈ రోజు ఖర్చులకు" అన్నాను.
ఇక ట్రిప్పు మొత్తం అందరి దగ్గరా చివాట్లే నేనిచ్చే టిప్పులు చూసి. ఉదాహరణకు - 70 రూపాయలు టిఫిన్ బిల్లు అయితే 100 రూపాయలు ఇచ్చి చిల్లర ఉంచుకోమన్నాను. ఆ సర్వర్ మోహంలో ఆనందం ఇప్పటికీ గుర్తుంది. ఇంకో చోట పళ్ళు కొన్నపుడు చిల్లర ఉంచుకోమన్నాను. "నీలాంటోళ్ళు డాలర్ల కొవ్వును చూపించడం తగ్గించాలి" అంటుంటే "అది డాలర్ల కొవ్వు కాదు, ఇండియాకు వచ్చిన వెంటనే ఫ్లైట్ వాళ్ళు ఇచ్చిన రూపాయల కొవ్వు" అనుకొంటూ నవ్వుకున్నాను. అనవసరంగా డబ్బు ఇచ్చి తప్పుచేసానో లేదో తెలియదు కానీ, రెక్కాడితేకానీ డొక్కాడని వాళ్ళకు పాతిక రూపాయలు ఎక్కువ ఇచ్చానని ఒకరకమయిన సంతృప్తి కలిగింది.
చివరగా - పొట్టకూటి కోసం కాయకష్టం చేసి బ్రతికేవాళ్ళ దగ్గర కాదు బేరమాడవలసింది. చేతనయితే ఏసీ రూముల్లో రెట్టింపు రేటుకు వస్తువులు అమ్మేవాళ్ళ దగ్గర బేరమాడాలి.
నా ఓటు ఎవరికంటే...??
Posted by జీడిపప్పు
కాంగ్రెస్: ఇందిరమ్మ ఇళ్ళ పథకం, జల యజ్ఞం, రైతులకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, పావలా వడ్డికి రుణాలు, రెండు రూపాయలకు బియ్యం, 50 రూపాయలకు వంట సామాగ్రి మొదలయినవి అజెండాలో ఉన్నాయి.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే: ఒక సగటు కూలీ కుటుంబం రోజుకు 100 రూపాయలు సంపాదిస్తుంది అనుకుందాము. ఎలాగూ ఇందిరమ్మ ఇళ్ళ పథకంలో ఇల్లు వస్తుంది కాబట్టి అద్దె బాధ లేదు. 2 రూపాయలకు బియ్యం కాబట్టి ఒక రోజు సంపాదనతో బియ్యం వస్తుంది, 50 రూపాయలకు కొన్ని వంట సరుకులు వస్తాయి. ఇంకో పది రోజుల సంపాదనతో మిగాతా ఆహారం కొనుక్కోవచ్చు. ఆరోగ్యసమస్యలొస్తే ఉచిత వైద్యం ఎలాగూ ఉంది. చదువు ఉచితం కాబట్టి భయం లేదు. మొత్తం మీద కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సగటు కూలీ కుటుంబం కూడా హాయిగా బ్రతుకుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళూ కాంగ్రెస్‌కే వోటెయ్యాలి.
తెలుగుదేశం: ప్రతి నిరుపేద కుటుంబానికీ నెలకు రెండు వేల రూపాయలు. రెండు రూపాయల బియ్యం, కలర్ టీవీ, ఉచిత విద్యుత్, డ్వాక్రా, బెల్టు షాపుల నిషేధం, విద్యార్థులకు స్కాలర్‌షిప్పులు మొదలయినవి అజెండాలో ఉన్నాయి.
తెలుగుదేశం అధికారంలోకి వస్తే: ఒక చిన్న గుడిశెలో ఒక లైటు, ఫ్యాన్ వేసుకొని పడుకొని అందరూ ఉచితంగా వచ్చిన కలర్ టీవీ చూస్తుంటారు. అంతలో పోస్ట్ మ్యాన్ లేదా బ్యాంక్ గుమాస్తా వచ్చి రెండు వేల రూపాయలు ఇస్తాడు. అందులో రెండు రూపాయల బియ్యం, ఇతర ఆహారానికి వెయ్యి రూపాయలు ఖర్చయినా మిగతా ఖర్చులకు ఇంకో వెయ్యి ఉంటుంది. ఓపిక ఉంటే పని చేసుకొవచ్చు లేదా పని చేయకుండా టీవీ చూసుకుంటుంటే కూడా రెండు వేలు వస్తాయి. పేదవాడికి కష్టపడకుండా డబ్బులు వస్తుంటే అంతకంటే ఏమి కావాలి? కాబట్టి ఈ సారి అందరూ తెలుగుదేశానికే ఓటు వెయ్యాలి.
ప్రజారాజ్యం: రైతులకు పెన్షన్-భీమా మరియు ఉచిత విద్యుత్తు, ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీలకు ఉచిత విద్యుత్తు, నూరు రూపాయలకు వంట సామాగ్రి, నిరుద్యోగులకు వెయ్యి రూపాయలు, పేదవారికి రెండున్న లేదా ఐదు ఎకరాల భూమి, పసుపు-కుంకుమ, వెయ్యి రోజుల్లో 10 లక్షల ఉద్యోగాలు మొదలయినవి అజెండాలో ఉన్నాయి.
ప్రజారాజ్యం అధికారంలోకి వస్తే: అందరికీ రెండున్నర ఎకరాలు మాగాణి ఇస్తారు. ఒక ఎకరం వరి, ఒక ఎకరం కూరగాయలు వేసుకున్నా చాలు. ఒకవేళ పంట పండకపోయినా రైతు భీమా ఉంది. ఆడపిల్ల ఉంటే లక్షరూపాయలు ఉన్నట్టే. ఇంట్లో నిరుద్యోగి ఉంటే నెలకు ఇంకో వెయ్యి రూపాయలు అదనం. ఇలా కుటుంబం లోని అందరికీ అన్నీ సుఖాలే, ఎక్కడ చూసినా డబ్బులే. కాబట్టి ఈ సారి అందరూ ప్రజారాజ్యానికే ఓటు వెయ్యాలి.
Bottom line ఏంటంటే, ఏ పార్టీకి వోటు వేసినా అధికారంలోకి వచ్చే పార్టీ వల్ల పేద బడుగువర్గాలకు మేలే జరుగుతుంది. ఒక వేళ ముగ్గురికీ ఓట్లు వేసి ముగ్గురినీ ముఖ్యమంత్రులు చేస్తే అందరి జీవితం మూడు రెట్లు ఎక్కువ సుఖంగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ "భూతల స్వర్గం" అన్నమాట.
నిన్న ఇలా ఆలోచిస్తూ పడుకున్నాను. అర్థరాత్రివరకు వరకు మంచి కలలు వచ్చాయి. ఎక్కడ చూసినా గుడిసెల్లో కలర్ టీవీలు, ఇందిరమ్మ ఇళ్ళు, రెండెకరాల భూస్వాములు..స్వర్గం అంటే ఇదే అనిపించింది. అర్థరాత్రి తర్వాత, అంటే దెయ్యాలు నిద్రలేచిన సమయంలో, కాస్త భయంకరమయిన కలలు వచ్చాయి. ప్రతిపార్టీ ఏడాదికి సుమారు లక్ష కోట్ల అప్పులు చేసి "ఉచిత" పథకాలకు ఖర్చు పెడుతుంది. దాని వడ్డీ కింద ప్రజలను పీక్కుతింటున్న ప్రపంచ బ్యాంకు రాబందులు కనిపించాయి. ప్రజలు సోమరిపోతులయి ప్రభుత్వం పడవేసే "ముష్టి" తిని బిచ్చగాళ్ళలా బ్రతుకుతుంటారు. తెల్లవారివరకు ఇలాంటి కలలే వచ్చాయు. నిద్రలేచాక, భవిష్యత్తులో మన రాష్ట్రం "భూతలస్వర్గం" కాదు, "భూతాలస్వర్గం" అని కొట్టొచ్చినట్టు, తన్నొచ్చినట్టు, బాదొచ్చినట్టు తెలిసింది.
అయినా ఓటు హక్కును దుర్వినియోగం చెయ్యకూడదుగా. అందుకే బాగా ఆలోచించి ఒక వ్యక్తికి ఓటు వేయాలని నిర్ణయించుకున్నాను. అందుకు కారణాలు: ఆ వ్యక్తి
- ఎన్నడూ ఫ్యాక్షన్ రాజకీయాలు చెయ్యలేదు
- ఎవరినీ వెన్నుపోట్లు పొడవలేదు
- సినిమాల్లో కుప్పిగంతులేసి రాజకీయ డ్రామాలు ఆడలేదు
- తాగిన మత్తులో ఇష్టమొచ్చినట్లు తిట్టడు
- అప్పులు తీసుకురావలసిన ఖర్మ ఆయనకు లేదు. తలుచుకుంటే అన్నీ సృష్టించగలడు
అమెరికాకు నష్టం - ప్రపంచానికి లాభం
Posted by జీడిపప్పు
అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించి లేదా ఉద్యోగం చేసి తమ స్వదేశానికి వెళ్ళినవారి గురించి కొన్ని వివరాలు:
- వీరందరూ ఉన్నత విద్యావంతులు. చైనీయులలో 51% మాస్టర్స్, 40.8% PhD చేసినవారు, భారతీయులలో 65.6% మాస్టర్స్, 12.1% PhD చేసినవారు
- 26.9% భారతీయులు, 34% చైనీయులు అమెరికాలో గ్రీన్‌కార్డ్ లేదా సిటిజన్‌షిప్ ఉన్నవారు
- 76% వారికి వీసా అన్నది సమస్య కాదు
- 90% పైగా అమెరికాకు రావడానికి కారణం ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలు
- 68.7% భారతీయులు, 84% చైనీయులు తమ స్వదేశంలో అమెరికాలో కంటే మంచి ఉద్యోగావకాశాలున్నాయి అన్నారు
- 42.4% భారతీయులు, 17.6% చైనీయులు తమ పిల్లలకు అమెరికాలో కంటే తమ స్వదేశంలో మంచి విద్య లభిస్తుంది అన్నారు
- అమెరికాలోకంటే స్వదేశంలో ఉద్యోగాల్లో ఉన్నత స్థానానికి చేరుకోవడం సులభం
- 56.6% భారతీయులు మరో ఐదేళ్ళలో తమ సొంత కంపెనీలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు
వినడానికి చాలా తమాషాగా ఉన్నా, చాలామంది అమెరికన్ల పరిస్థితి ఇంతే. ఆర్ట్స్ అంటే ప్రాణమిస్తారు కానీ మ్యాథ్స్, సైన్స్ అంటే పరుగులుపెడతారు. ఈ తరం పిల్లల్లో ఇది మరీ ఎక్కువ అవుతుండడం చూసి నాలుగేళ్ళ ముందు అనుకుంటా, కొందరు మేధావులు కలసి మ్యాథ్స్, సైన్స్ కోర్సులు చేసే వారికోసం ప్రత్యేక సదుపాయాలు, స్కాలర్‌షిప్‌లు ఇవ్వమని, సుమారు $20 బిలియన్ డాలర్ల ప్రతిపాదన చేసారు కానీ జార్జ్ బుష్ అమలు పరచలేదు. ఇంత కష్ట సమయంలో కూడా ఒబామా $50 బిలియన్లు విద్యకు కేటాయించడం వెనుక రహస్యం రాబోవు తరం వారికి అవసరమయిన ఉన్నత విద్యకోసమే. అందులో మ్యాథ్స్, సైన్స్ లకు ప్రాధాన్యత ఉండబోతుంది తప్పకుండా.
ఏది ఏమయినప్పటికీ ఈ మేథోవలస వల్ల భవిష్యత్తులో ఇండియాలో సిలికాన్ వ్యాలీలు, మరెన్నో యాహూ, గూగుల్ లాంటివి పుట్టడం తథ్యం.
ఇజ్రాయిల్‌కు జై కొడదాం రండి
Posted by జీడిపప్పు
1972లో ఇజ్రాయిల్ తమ దేశానికి చెందిన పదకొండుమంది అత్యుత్తమ ఆటగాళ్ళను జర్మనీలోని మ్యునిక్‌లో జరిగే ఒలింపిక్ క్రీడలకు పంపించింది. అప్పటికే ఇజ్రాయిల్-పాలస్తీనాల మధ్య పోట్లాటలు జరుగుతున్నాయి. పాలస్తీనాకు చెందిన కొందరు "బ్లాక్ సెప్టెంబర్" పేరుతో ఒక తీవ్రవాద సంస్థను ఏర్పాటు చేసి మ్యునిక్‌కు వెళ్ళి 11 మంది ఆటగాళ్ళను హతమార్చారు. హత్య చేసిన వారిలో ముగ్గురు తీవ్రవాదులు పట్టుబడ్డారు.
ఒక్కసారిగా ఇజ్రాయిల్ ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. తీవ్రవాదుల పట్ల చర్యలు తీసుకోవాలని దేశవ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి. అప్పటి ఇజ్రాయిల్ ప్రధానమంత్రి అయిన గోల్డా మెయిర్ తాను, రక్షణ మంత్రి, అత్యంత ప్రమాదకర గూఢచార వ్యవస్థ అయిన మొస్సాద్ అధ్యక్షుడితో కలిపి "కమిటీ X" ఏర్పాటు చేసింది. కమిటీలోని సభ్యులు అందరూ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండడానికి ఆ హత్యల వెనుక ఉన్న అందరినీ హతమార్చడమే సరి అయినదని, తద్వారా భవిష్యత్తులో తీవ్రవాదులు ఇజ్రాయిల్ అంటే భయపడతారని గోల్డా మెయిర్‌కు తెలిపారు.
గోల్డాకు ఇది నచ్చకపోయినా అసంతృప్తిగా ఆమోదించింది. అంతలో జర్మనీలో తీవ్రవాదులు విమానాన్ని హైజాక్ చేసి బందీలుగా ఉన్న ముగ్గురు తీవ్రవాదులను విడిపించుకుపోయారు. ఇది చూసిన గోల్డా మెయిర్ బ్లాక్ సెప్టెంబర్‌ను అంతం చేయమని కమిటీకి పూర్తి అధికారాలు ఇచ్చింది. ఆమె ఆదేశాల మేరకు మొస్సాద్ ఆరితేరిన తమ గూఢచారులను యూరోప్ అంతటా రంగంలోకి దింపింది.
కొద్దిరోజుల్లో బ్లాక్ సెప్టెంబర్ వెనుక ఉన్న ప్రముఖుల జాబితా తయారయింది. మొత్తం 25-30 మంది ప్రపంచంలోని వివిధ దేశాల్లో, ఎక్కువగా యూరోప్ దేశాల్లో తల దాచుకుంటున్నారు. వీరిని అంతం చెయ్యడంలో ఎక్కడా ప్రభుత్వ హస్తం ఉన్నట్టు ఆధారాలు ఉండకూడదు అన్న నియమమం పెట్టింది గోల్డా మేయిర్.
ఇందుకోసం మొస్సాద్ మెరికల్లాంటి ఏజెంట్లను ఎంపిక చేసింది. ఒక అంచనా ప్రకారం మొత్తం ఆపరేషన్ లోని సభ్యులు ఐదు గ్రూపులుగా విభజింపబడ్డారు:
- Aleph - హత్యలు చేయడంలో నిష్ణాతులయిన ఇద్దరు కిల్లర్స్
- Bet - Aleph గ్రూపులోకి కిల్లర్స్ ను నీడలా అనుసరించేవారు
- Heth - ఇందులోని ఇద్దరు గూఢచారులు మిగతా అందరికీ అవసరమయిన హోటళ్ళు, కార్లు, ఇతర వసతి సదుపాయాలు చూసుకుంటారు
- Ayin - ఇందులో ఆరునుండి ఎనిమిదిమంది ఉంటారు. లక్ష్యాన్ని వెతికి వారిని ఎక్కడ హత్య చేయాలో నిర్ణయించి, హత్య జరిగిన తర్వాత Aleph, Bet గ్రూపుల సభ్యులు తప్పించుకొనే ఏర్పాటు చేయడం వీరి విధి
- Qoph - ఒక గ్రూపులో పని చేసే వారు మరొక గ్రూపుకు తెలియకపోవచ్చు. అన్ని గ్రూపుల మధ్య కమ్యూనికేషన్ ఈ ఇద్దరు చూసుకుంటారు.
అక్టోబర్ 16, 1972న మొదటి హత్యతో మొదలయిన ఆపరేషన్ కొన్ని ఏళ్ళ పాటు నడిచింది. మొదటి తయారు చేసుకున్న జాబితాలో ఒక్కరిని కూడా విడిచిపెట్టకుండా హత్య చేసారు. ఆపరేషన్‌లో ఎందరో ఏజంట్లు మరణించారు, లెక్కలేనంత డబ్బు ఖర్చయింది కానీ ఇజ్రాయిల్ ప్రజల్లో సంతృప్తి కలిగింది. ఈ ఆపరేషన్ తర్వాత ఏ తీవ్రవాద సంస్థ కూడా అంత ఎత్తున ఇజ్రాయిల్ ప్రజల ఆత్మాభిమానాన్ని గాయపరిచేలా దాడి చేయడానికి సాహసించలేదు.
దీని ఆధారంగా స్పీల్‌బర్గ్ "మ్యునిక్" అనే సినిమా తీసాడు. అందరూ తప్పక చూడవలసిన సినిమా ఇది. తీవ్రవాదులను ఎలా వెంటాడి, వేటాడి చంపారు అన్నది కథాంశం.
మనుషులను వెంటాడి కిరాతకంగా చంపడాన్ని చూడమంటున్నాడు వీడేమి శాడిస్టు అనుకుంటున్నారా? అయితే ఈ క్రింది రెండు వర్గాల్లో మీరు రెండో వర్గానికి చెందినవారయితే ఈ సినిమా చూడకండి.
మొదటి వర్గం: మన దేశంలో ఎప్పుడు, ఎక్కడ తీవ్రవాదులు బాంబులు పెడతారో తెలియదు. "గోకుల్ చాట్‌లో బాంబు పేలినపుడు నా కుటుంబ సభ్యులు ఉండి ఉంటే" అని తలుచుకుంటే భయం వేస్తుంది. మొన్నటికి మొన్న ముంబైలో జరిగింది మన దేశానికే తలవంపు. అంతకంటే అవమానం మరొకటి ఉండదు. దాని వెనక ఉన్న తీవ్రవాదులను ఎలా శిక్షించాలి అంటే, భవిష్యత్తులో భారతదేశం పేరు చెబితే తీవ్రవాదులు భయపడాలి.
రెండవ వర్గం: తీవ్రవాదులు బాంబులు పేల్చినంత మాత్రాన వారిని చంపకూడదు. మొన్ననే పాకిస్తాన్ తీవ్రవాది పైన చార్జ్ షీట్ దాఖలు చేసాము. దాని ఆధారంగా విచారణ జరపాలి. ఈ లోపు కాందహార్ తరహాలో మరో హైజాక్ జరిగితే ఆ తీవ్రవాదిని విడిచిపెట్టాలి. రేపు నా కుటుంబ సభ్యులు ఉన్న చోట బాంబు పేలినా ఇలాగే చేయాలి.
ఎలాగూ మొదటిది జరగదు కాబట్టి ఆ భావాలు ఉన్న వాళ్ళు "మ్యునిక్" సినిమా చూసి కాసేపు మన దేశంలో కూడా అలా జరుతున్నట్టు ఊహించుకొని మిమ్మల్ని మీరు మోసం చేసుకోండి!!
PS: ఈ పోస్టు లింకు లేదా content మీ మిత్రులకు forward చేయండి.