హాస్యచక్రవర్తి సుత్తి వీరభద్రరావు - మొదటి భాగం

Posted by జీడిపప్పు

'నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం' అన్న హాస్య బ్రహ్మ జంధ్యాల హాస్యప్రియులకు అందించిన మరో వరం సుత్తి వీరభద్రరావు గారు. జంధ్యాల సృష్టించిన పాత్రలకు, ఆయన వ్రాసిన మాటలకు సుత్తి వీరభద్రరావు తప్ప ఇంకెవరూ న్యాయం చేయలేరు. చిత్రమయిన పాత్రలలో మరింత విచిత్రమయిన అలవాట్లు, సంభాషణలతో హాస్యానికి కొత్త నిర్వచనాన్ని అందిచారు సుత్తి వీరభద్రరావు.

విజయవాడలో కాలేజీలో చదువుకుంటున్నపుడే నటనపై ఆసక్తి పెంచుకున్న వీరభద్రరావు నాటకాలలో మంచి నటుడిగా పేరుతెచ్చుకున్నాడు. జంధ్యాల దర్శకత్వం వహించిన "నాలుగు స్తంభాలాట" చిత్రంద్వారా తెరంగ్రేటం చేసి ఎన్నో మరిచిపోలేని పాత్రలతో ప్రేక్షకులను నవ్వించారు. తన అలవాట్లతో పక్కవాళ్ళను ఇబ్బంది పెట్టడం, అవతలివాళ్ళు ఉక్కిరిబిక్కిరయ్యేలా గుక్క తిప్పుకోకుండా  మాట్లాడడం, తిట్లు కాని తిట్లతో హింసించడం వీరభద్రరావుకే చెల్లింది. హాస్య బ్రహ్మ జంధ్యాల సినిమా అంటే హీరో ఎవరయినా ముందుగా గుర్తుకొచ్చే ఈ హాస్య చక్రవర్తిని, పరోక్షంగా హాస్య బ్రహ్మను, స్మరించుకుంటూ ఆయన నటించిన కొన్ని చిత్రాలను గుర్తుచేసుకొనే ఓ చిన్న ప్రయత్నమే ఈ వ్యాసాల ఉద్దేశ్యం.

దాదాపు అందరూ కొత్తనటులతో జంధ్యాల తీసిన నాలుగు స్తంభాలాటలో ఒక హీరో తండ్రి పాత్రతో తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టారు వీరభద్రరావు. ఈయనకు భారతీయ సంస్కృతి, ఆచారాలు అంటే చాలా గౌరవం. కానీ కొడుకేమో ఆధునికంగా ఉండాలనుకొంటాడు. ప్రపంచంలోని ప్రసిద్ధులంతా భారతీయులేనని ఈయన గాఠ్ఠి నమ్మకం. అందుకే "పైథాగరస్ ఎవడంటే ఏ జర్మనీవాడో ఏ రష్యావాడో అంటావు. వాడి అసలు పేరు గిరీషుడనీ, కాకినాట్లో మన పైథాగారబ్బాయని తెలుసా? షేక్స్పియర్ ఎవడు? శేషప్పయ్య అనే తమిళుడు, రామనాథ జిల్లావాడు, మన భారతీయుడునూ. న్యూటన్ ఎవరు? నూతనుడని బెంగాలీయుడు, మన భారతీయుడునూ" అంటుంటాడు.

ఇవి పట్టించుకోని కొడుకును, మిగిలినవాళ్ళనూ "నిన్నూ ఈ దేశాన్ని బాగు చెయ్యడం నావల్ల కాదు, నావల్ల కాదు" అంటుంటాడు. ఈయన అసిస్టెంటు సుత్తి వేలు వరండాలో కూర్చుకొని లెక్కలు వ్రాసుకుంటుంటే ప్రతి చిన్నవిషయానికి "అసలు ఈ విషయం తెలుసా నీకు" అంటూ చెప్పడం మొదలుపెడటాడు. మనకు తెరపైన సుత్తితో మేకును కొడుతున్న దృశ్యం కనిపిస్తుంది. ఇలా సుత్తికొట్టించే పాత్ర బాగా పాపులర్ అవడంతో వీరభద్రరావు కాస్తా సుత్తి వీరభద్రరావు అయ్యారు.

ఈ సినిమా తర్వాత శ్రీవారికి ప్రేమలేఖ సినిమాలో ధనవంతుడయిన తండ్రిపాత్ర పోషించినా పెద్దగా పేరు రాలేదు. అదే ఏడాది జంధ్యాల తీసిన "ఆనంద భైరవి" సినిమా ద్వారా సుత్తి వీరభద్రరావు సత్తా ఏమిటో ప్రేక్షకులకు తెలిసివచ్చింది. ఈ సినిమాలో ఆయన ఒక పల్లెటూరి వైద్యుడు. చాలా మంచివాడు, ఉన్నతాభావాలు కలిగిన పెద్దమనిషి. తెలుగు అభిమానమెక్కువ, ఎప్పటికయినా గొప్ప రచయిత కావాలని ప్రాసలున్న వాక్యాలను సృష్టిస్తుంటాడు. ఉద్యోగం లేని కొడుకు, ఆనందమేసినా బాధ కలిగినా కయ్‌య్‌య్‌య్ మని ఈలవేసే కోడలు ఈయన కుటుంబ సభ్యులు. ఇక ఈయన ప్రాసల ప్రసహనం:

తన దగ్గరకు వచ్చిన రోగితో - "ఆయకాయలో వేడి ఉంటుంది. ఆ వేడి నాలాంటి వాడికల వైద్యుడికి నాడిలో తెలుస్తుందిరా బోడి". సినిమానుండి కోడలికంటే ముందే ఇంటికి తిరిగివచ్చిన కొడుకుతో - "కోడలేదిరా అంటే గోడలకేసి, నీడలకేసి చూస్తావేంట్రా ఊడలజుట్టు వెధవా". తన భార్య సినిమాహాల్లో ఈలవేసిందన్న సంగతి చెప్పిన కొడుకుతో -  "అబ్బా మనకా ఈలల గోల ఏల. ఈ ఈలన్నది ఇలలో కలలో మన ఇంటావంటా లేదే"

నిద్రపోతున్న కొడునులేపి "నానీ నానీ నీ నూనె నీ నూనే నా నూనె నా నూనే. నేనే నేను, నీ నూనె నానూనెనని, నానూనె నీనూనని నేనన్నానా  నిన్నను నేనా? నో నో నో. నేనన్నానా నున్నని నాన్నా, నై నై నై. ఇందులో 56 నాలున్నాయి లెఖ్ఖ చూసుకో" అంటాడు. చిరాకేసిన కొడుకు "నాన్నా" అని "ఇవి కూడా కలుపుకో 58 అవుతాయి" అంటాడు.

నాట్య పోటీ రెండవసారి ఏర్పాటు చేయించి హీరోయిన్ నెగ్గిన తర్వాత " మీ సిగ్గు బొగ్గులవ్వ. ఆ రోజు శర్మగారి పైన నెగ్గిన గర్వంతో దిగ్గున లేచి భగ్గున మండిపడ్డారు కాదా. ఈ రోజు నిగ్గుతేలిన ప్రతిభతో ఈ మల్లెమొగ్గ నెగ్గింది. ఇక మీరు తగ్గేసి, మాటకు తల ఒగ్గేసి, ఊరంతా ముగ్గేసి, శర్మగారిని సన్మానించండి. ఆ తర్వాత మీకు సిగ్గనిపిస్తే ఆ దగ్గు ఆపేసి నా దగ్గరకు రండి. ఓ ఉగ్గు గిన్నెడు మందిస్తాను, జగ్గు నీళ్ళు కలిపి ఉగ్గు తాగినట్లు తాగి రగ్గు కప్పుకుని పడుకుందురుగానీ" అంటూ అహంకారులయిన ఊరిపెద్దలకు బుద్ది చెప్తాడు.

కోడలి గురించి "మంచి మర్యాదగల మహా మగువ, మానవసేవయే మాధవసేవ అని మనసారానమ్మిన మహాఇల్లాలు మర్రిచెట్టు మహాలక్షమ్మగారి ముద్దుల మూడో మనవరాలు కదా అని మనువు చేసుకుంటే" అన్నపుడు కొడుకు "నానా నీ ప్రాసలాపు వినలేక ఛస్తున్నాము. ఈ జన్మలో నువ్వు కథ రాయలేవు, రచయితవు కాలేవు" అంటాడు.

అంతే, - "మొక్కుబడికి బుక్కులెన్ని చదివినా బక్కచిక్కిన కుక్కగొడుగు మొక్కలా చెదలు కొట్టేసిన చెక్క ముక్కలా కుక్క పీకేసిన పిచ్చి మొక్కలా బిక్కమొహం వేసుకొని వక్క నోట్లో కుక్కుతూ బొక్కుతూ బెక్కుతూ చుక్కలు లెక్క పెడుతూ ఇక్కడే గుక్క పెట్టి ఏడుస్తూ ఈ చుక్కల చొక్కా వేసుకొని డొక్కు వెధవలా గోళ్ళు చెక్కుకుంటూ నక్కపీనుగులా చెక్కిలాలు తింటూ అరిటి తొక్కలా ముంగిట్లో తుక్కులా చిక్కు జుట్టేసుకుని ముక్కుపొడి పీలుస్తూ కోపం కక్కుతూ పెళ్ళాన్ని రక్కుతూ పెక్కు దిక్కుమాలిన పనులు చేస్తూ రెక్కలు తెగిన అక్కుపక్షిలా నక్కి నక్కి ఈ చెక్కబల్ల మీద పక్కచుట్టలా పడుకోకపోతే, ఏ పక్కకో ఓ పక్కకెళ్ళి పిక్కబలం కొద్దీ తిరిగి నీ డొక్కశుద్దితో వాళ్ళను ఢక్కామొక్కీలు తినిపించి నీ లక్కు పరీక్షించుకొని ఒక్క చక్కటి ఉద్యోగం చేజిక్కించుకుని ఒక్క చిక్కటి అడ్వాన్సు చెక్కు చెక్కుచెదరకుండా పుచ్చుకుని తీసుకురావచ్చు కదరా తిక్క సన్నాసీ. ఇందులో యాభయ్యారు కాలున్నాయి తెలుసా" అని కొడుక్కు తన విశ్వరూపాన్ని చూపిస్తాడు

ఎంతటి కఠినమయిన వాక్యాన్నయినా అక్షర, ఉచ్చారణ దోషాలు లేకుండా అనర్గళంగా చెప్పడమే కాకుండా చక్కని నటనను జోడించి ఆ పాత్రకు జీవంపోయడం ద్వారా ఒక్కసారిగా అగ్ర హాస్యనటుడయి వెనువెంటనే "బాబాయ్, అబ్బాయ్" సినిమాలో రెండో హీరో పాత్ర చేజిక్కించుకున్నాడు.    

                                                                                 (మిగతా రెండవ భాగంలో)

19 comments:

 1. Anonymous said...

  జంధ్యాల గారు తెలుగువారికి దొరికిన రత్నమండి. సున్నితమైన హాస్యంతో మనలని రంజింపజేశారు. ఆయన సినిమాలు చూడడం మన ఆదృష్టం. సుత్తి వీరభద్ర రావు గారిని గుర్తు చేసినందురకు ధన్యవాదాలు. అంతంత పెద్ద డైలాగులు ఆయన ఎలా వ్రాశారో ఈయన ఎలా చెప్పారో మీరు వాటిని పట్టి మాకు వినిపించారు. Waiting for next part.

 2. హరే కృష్ణ . said...
  This comment has been removed by the author.
 3. హరే కృష్ణ . said...

  జీడిపప్పు గారు ఒక మంచి నటుడి ప్రత్యేకతను అతను మాత్రమే చెయ్యగలిగే పాత్రల గురుంది చెప్పిన మీకు అభినందనలు ..ఆ డైలాగ్ లని గుర్తుపెట్టుకొని రాయడం అంత కష్టం అయినప్పుడు ఎలా రాసారు రాసిన మీరే ఇంత కష్టపడితే..వీరభద్రరావు అలవోకగా చెప్పడం ఆశ్చర్యాని కలిగించక మానదు
  కాకినాట్లో మన పైథాగారబ్బాయని తెలుసా ఈ డైలాగ్ బాగా గుర్తు..
  మీకు ధన్యవాదాలు

 4. Shashank said...

  kunti's second son boon - అదే భీమవరం, garden vegetable curry - తోటకూర పప్పు - ఇలా ఎన్నో ఎన్నెన్నో అద్భుతాలని శృష్టించిన జంధ్యాల గారికి వాటికి తెరకెక్కించి చిరస్థాయిగా మన మనస్సుల్లో ఉండేట్టు చేసిన వీరభద్రరావు రారికి సతకోటి వందనాలు.

  నీ fav డవిలాగ్ కోసం వేచి చూస్తూంటా..

 5. Bhaskar said...

  Thank you very much

 6. భాస్కర్ రామరాజు said...

  "అయ్యా పలానీ వారి ఇల్లు ఇదేనా?"
  "పదా అలా వాకింగు చేస్తూ చర్చిద్దాం పలానీ వాళ్ళు ఇదో కాదో."
  అలా నడుచుకుంటూ కొంతదూరం (34km) వెళ్ళాక
  "ఇప్పుడు చెప్పవోయ్!! నా ఇంటికే వచ్చి నన్నే ఆదుగుతావా పలానీ వారి ఇల్లు ఇదేనా అని, హన్నా!! తప్పుకదూ"
  అని వాడినక్కడ వదిలేసి సుత్తి వీరభద్రరావు చక్కా కార్లో వెళ్ళి పోతాడు.

  "నువ్వు చెప్పే కతలో యాడ్నో లోటు ఉందోయ్ కవి. నే చెప్తా ఇనుకో.
  మధ్యతరగతి ఎదవనాయాలా"
  "మహాప్రభో నన్ను తిట్టారా?"
  "కాదు అది సినిమా టైటిలు."
  "తిత్తి తీస్తా, వెయ్, ఆసనం వెయ్"
  ఇలాంటివి ఎన్నో చెప్పుకోవచ్చు. మంచి పోస్టు అందించారు.
  శుభం.

 7. శ్రీనివాస్ చింతకింది said...

  చక్కటి టపా ద్వారా జంధ్యాల గారిని, సుత్తి వీరభద్రరావు గారిని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. నిజంగా ప్రాసతో కూడిన పెద్ద పెద్ద డైలాగులు అలవోకగా చెప్పడంలో వీరభద్రరావు గారికి సాటి లేరు. మీ టపాలోని డైలాగులు చదువుతుంటే ఒక్కసారిగా ఆ సినిమాలోని దృశ్యాలన్నీ కళ్ళముందు కదలాడాయి. అంత చక్కని హాస్యం ఇప్పుడు దొరకడం లేదు అని ఒకింత బాధ కుడా వేస్తుంది.

 8. భాస్కర్ రామరాజు said...

  ఇలాంటి పోశ్టు ఒకటి నేనే వేద్దాం అని నా అజెండలో పెట్టుకున్నా. విషసేకరణలో కూడా ఉన్నా, అంతలో తమరు ఏసేసారు. మీకోసం -
  చోటే ఏక్ బడా, ఏక్ చాయ్ - వచ్చినై స్వీకరించండి.

 9. భవాని said...

  జంధ్యాలగారు తెలుగువారవటం, సినిమాలు తీయటం మన అదృష్టం. సుత్తి వీరబధ్రరావుగారు, సుత్తివేలుగారిలాంటి వారి వల్ల ఆయన సినిమాలకు ఆ ప్రత్యేకత వచ్చింది. వాళ్ళు లేకుండా తీసిన 'విచిత్రం' చూస్తే ఆ విషయం అర్ధం అవుతుంది. రోజూ మాట్లాడుకునేదాంట్లో సుత్తిద్వయం మాటలు చొప్పించి మాట్లాడుకుంటూనే ఉంటాం మా ఇంట్లో.

 10. కత్తి మహేష్ కుమార్ said...

  చాలా మంచి ప్రయత్నం. అభినందనీయం.

 11. రమణి said...

  బాగుందండి హాస్య నటుడిని స్మరింపజేసారు. మంచి వాగ్ధాటి ఆయనది. మా అమ్మమ్మగారి అబ్బాయి ఈయన... అంటే మా మావయ్యన్నమాట.

 12. Shiva Bandaru said...

  బాగుంది.

 13. భావన said...

  ఎంత మంచి నటుడిని.... జంధ్యాల గారిని గుర్తు చేసేరు. ధన్యవాదాలు. శ్రీవారికి ప్రేమలేఖ లో ఇంకో మంచి డైలాగ్ వుంటుంది. నరేష్ సుత్తి వీరబద్ర రావు గారిని చూసి "నాన్న ఇప్పుడే వచ్చవా" అంటే ఆయన్ చాలా కౄరం గా మొహం పెట్టీ "లేదు రా పొద్దుటే వచ్చి మెట్ల కింద దక్కున్నా ఏమిటా చచ్చు ప్రశ్న" అని తిడతారు, ఇప్పటి కి కూడా ఆ జోక్ ను సినిమాలలో వుపయోగించుకుంటున్నరు కదా. మాకు NY లో ఒక స్నేహితురాలు వుంది సుత్తి గారి టైపే.. ఏమైనా అంటే చాలు బయటకు పద వాకింగ్ చేస్తు మాట్లాడు కుందాము అంటుంది ఆమె పుణ్యాన NY రోడ్దులన్ని తెలిసి పోయాయి. ఇంక బాగా వింటర్ లోనే వెళతాము ఆమె దగ్గరకు ఇప్పుడు.. ఈ రోజు నవ్వుల కోటా భర్తీ చేసేరు థ్యాంక్స్

 14. Malakpet Rowdy said...

  Sreevariki Premalekha role is one of his best roles, if not the best!

 15. AMMA ODI said...

  మీ టపాలో జంధ్యాల గారి సినిమా చూపించారు. నెనర్లు.

 16. పరిమళం said...

  తర్వాతి టపా కోసం ఎదురు చూస్తున్నాం ! జంధ్యాల గారిని ఇష్ట పడని తెలుగు వారుండరేమో ...అలాగే ఆయన హాస్యాన్ని తనదైన శైలిలో పండించే సుత్తి వీరబద్ర రావు గారి పరిచయం అభినందనీయం .ధన్యవాదాలు .

 17. guduru said...

  జంద్యాల గారు మనకు దెవుడు ఈచ్చిన వరం అయన మనకు పరిచయం చెసిన వ్యక్తి సుత్తివీర భద్ద రావు గారు.అందుకె అయనకు షత కొటి వందానాలు.

 18. చిన్ని said...

  హమ్మ్....ఎంత బాగా గుర్తుపెట్టుకు రాసారో! బాగుంది.

 19. పుల్లాయన said...

  మంచి హాస్యపు సన్నివేశాల్ని గుర్తు చేశారు. ధన్యవాదాలు.

Post a Comment